[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]


ధర్మవ్యాధుడు తల్లితండ్రుల ఆరాధన
ధర్మవ్యాధుడు కౌశికుడితో “నువ్వు నన్ను సర్వము తెలిసినవాడివి అని అన్నావు. నాకు ఇంత విజ్ఞానం కలగడానికి కారణమైన ధర్మం ఒకటి ఉంది. ఆ ధర్మాన్ని నీకు కంటికి కనిపించేలా చేస్తాను” అని ధర్మవ్యాధుడు కౌశికుణ్ని సగౌరవంగా తన ఇంటికి ఆహ్వానించి తన ఇంటిలో ఉన్న ఒక గదిలోకి తీసుకుని వెళ్లాడు.
అది ఒక అందమైన గది. ఆ గదికి నాలుగు వైపుల మంచి గాలి, వెలుతురు వస్తున్న సావిడులున్నాయి. అది అనేక సువాసనలు గుబాళిస్తున్న పెద్ద మేడ. అక్కడ ధర్మవ్యాధుడి తల్లితండ్రులు పువ్వులతోను, నగలతోను అలంకరించబడి కావలసిన ఆహారం తిని పెద్ద ఆసనాల మీద విశ్రాంతి తీసుకుంటున్నారు.
ధర్మవ్యాధుడు తల్లితండ్రుల్ని కౌశికుడికి పరిచయం చేశాడు. తల్లితండ్రుల పాదాలకి నమస్కరించి యోగక్షేమాలు అడిగాడు. ధర్మవ్యాధుడి తల్లితండ్రులు తమ కొడుకుతో “కుమారా! నీ వంటి మంచి కొడుకు ఉండగా మాకు లోటేముంటుంది? నువ్వు ధర్మమూర్తివి. నువ్వు రక్షిస్తున్న ధర్మమే నిన్ను రక్షిస్తుంది. నువ్వు కారణజన్ముడివి.
నీ నడవడిక వల్ల మన వంశం పావనమైంది. నువ్వు దేవతలలో దేవతవిగాని, మనిషివి కాదు. ఈ భూలోకంలో మానవదేహాన్ని ధరించి ఎందుకు జన్మించావో తెలియదు. త్రికరణశుద్ధితో తల్లితండ్రుల్ని ఆరాధిస్తున్నావు.
నీ దీక్ష సాటిలేనిది. తల్లితండ్రుల్ని ఆరాధించడంలో ముందు నిన్ను చెప్పి, తరువాత పరశురాముడిని చెప్పాలి. నువ్వు ధనధాన్య సంపదలతో చిరంజీవిగా వర్ధిల్లు!” అని దీవించారు.
ధర్మవ్యాధుడు కౌశికుడిని చూపించి “ఈ మహానుభావుడు మనల్ని చూడాలని ఇక్కడికి వచ్చాడు” అని చెప్పాడు. ఆ వృద్ధులు కౌశికుడికి అతిథి మర్యాదలు చేశారు. కౌశికుడు వాళ్ల యోగక్షేమాల గురించి అడిగాడు.
ధర్మవ్యాధుడు కౌశికుడితో “వీళ్లు నా తల్లితండ్రులు. వీళ్లకి సేవ చెయ్యడం వల్లే నాకు ఈ జ్ఞానం కలిగింది. అందరూ తమ కోరికలు తీరాలని దేవతల్ని పూజిస్తారు. నాకు ఈ తల్లితండ్రులే ప్రత్యక్ష దేవతలు. ఇతర దేవతలు నాకు తెలియదు.
వీళ్లని చందనము, పూలు, పండ్లు వాళ్లకి కావలసిన తినుబండారాలు ఇచ్చి పూజిస్తాను. నా భార్యా పిల్లలతో కలిసి వీళ్లని సేవిస్తాను. వాళ్లకి చేసిన సేవే వేదాలు, నోములు, వ్రతాలు అనే భావం నాలో పాతుకుపోయింది. తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే అయిదుగురిని అర్చించి సంతోషపరిచిన గృహస్థుడు ధర్మాత్ముడు” అని చెప్పాడు.
ఇంకా మాట్లాడుతూ ధర్మవ్యాధుడు “ఆ పతివ్రత అనుగ్రహంతో నిన్ను పంపింది కనుక, ఆమెపై నాకు కలిగిన గౌరవం వల్ల, నువ్వు తెలుసుకోవాలన్న కోరికతో నా దగ్గరికి వచ్చి అడిగావు కనుక నాకు తెలిసినంత వరకు నీకు తెలిసేలా చెప్పాను. కాని, నీ మీద నాకు ఇష్టం కలగలేదు. అందుకు ఒక కారణం ఉంది. అది నువ్వు చేసిన చెడ్డ పని.
ఆ పనేమిటని అడిగితే – నీ తల్లితండ్రులు చాలా ముసలివాళ్లు. వాళ్లకి నువ్వు ఒక్కడివే ఆధారం. నీ మీదే తమ ప్రేమ మొత్తం పెట్టుకుని జీవిస్తున్నారు. నువ్వు వాళ్లని వదిలిపెట్టి వచ్చేసావు. వచ్చేటప్పుడు వాళ్ల అనుమతి నువ్వు తీసుకోలేదు.
నువ్వు వేదాధ్యయనం చేసి జ్ఞానాన్ని పొంది తరించాలని అనుకున్నావు. నీ తల్లితండ్రుల గతి ఏమవుతుందో ఆలోచించలేదు. నీ ప్రవర్తన నాకు నచ్చలేదు.
నీ కోసం గుండెలవిసేలా ఏడ్చి నీ తల్లితండ్రులు గుడ్డివాళ్లయ్యారు. ఈ విషయం నువ్వు తెలుసుకోలేదా? ఇప్పటికైనా నువ్వు నీ తల్లితండ్రుల దగ్గరికి వెళ్లి వాళ్ల బాధ తీర్చు. నీ చదువు, నువ్వు పుణ్యం పొందడం కోసం పడే శ్రమ తల్లితండ్రులకి పరిచర్య చేయకపోతే వ్యర్థమవుతాయి. నేను చెప్పినట్టు నడుచుకో నీకు మంచి జరుగుతుంది” అని చెప్పాడు.
పూర్వజన్మ వృత్తాంతము
ధర్మవ్యాధుడు చెప్పింది విని కౌశికుడు “పుణ్యాత్ముడవైన ధర్మవ్యాధుడా! నువ్వు నాకు చెప్పిన మాటలు ధర్మబద్ధమైనవి, స్వచ్ఛమైనవి, నాకు మంచి జరిగేలా చేసేవి. అన్నీ సావధానంగా విన్నాను. నువ్వు చెప్పినట్టు నడుచుకుని నా తల్లితండ్రులకి సేవ చేసి జన్మని సార్థకం చేసుకుంటాను. నీతో స్నేహం కలగడం నా అదృష్టం. నా మనస్సు అమితమైన సంతోషంతో నిండిపోయింది. నాకు శుభాలు కలుగుతాయని అనుకోడానికి ఇదే నిదర్శనం.
పాపం చేసి దుర్గతిని పొంది ఆ పాపాన్ని మోస్తూ బతకవలసిన నన్ను నువ్వు ఉద్ధరించావు. నాకు ఉత్తముడిగా ఎదగడానికి అవసరమైన జ్ఞానాన్ని కలిగించావు. నువ్వే నా పాలిటి దేవుడివి. ధర్మవ్యాధా! ధర్మం చాలా సూక్ష్మమైంది, గొప్పది. అది అందరికీ అందుబాటులో ఉండదు. నువ్వు తెలుసుకున్నట్టు సనాతనధర్మాన్ని తెలుసుకున్న వేదాంతి ఇంకొకడు లేడు.
నువ్వు శూద్రుడవు అని అనుకోలేను. నిన్ను చూస్తుంటే నాకు వింతగా ఉంది. మూడు కాలాలు తెలిసినవాడివి. మూడు కాలాల్లోను నీకు తెలియని విషయాలు లేవు. ఏ కారణం వల్ల శూద్రుడుగా జన్మించావో దయచేసి చెప్పు” అని అడిగాడు.
కౌశికుడి మాటలు విని ధర్మవ్యాధుడు “నువ్వు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పడం నా బాధ్యతగా అనుకుంటున్నాను. పూర్వజన్మలో నేను ఒక బ్రాహ్మణుడిని. వేదాలు, వేదాంగాలు చదివినవాడిని. నాకు ఒక రాజకుమారుడితో స్నేహం ఏర్పడింది. విలువిద్య నేర్చుకున్నాను.
ఒకరోజు మహారాజుతో కలిసి నేను కూడా వేటకి అడవికి వెళ్లి చాలా జంతువుల్ని సంహరించాను. నా బాణం ఒకటి తీగలతోను, గడ్డితోను కప్పబడిన ఒక మహర్షికి తగిలింది. అతడు బాధతో విలవిలలాడుతూ నేలమీదకి ఒరిగిపోయాడు.
నేను పరుగెత్తుకుని అతడి దగ్గరికి వెళ్లి ఓదార్పు మాటలు చెప్పాను. అతడు బాధతోను కోపంతోను “బ్రాహ్మణ కులంలో పుట్టి చెడ్డవాడివై హింసతో కూడిన పనులు చేస్తున్నావు. హింస శూద్రులకి తగినపని కాని, బ్రాహ్మణులకి కాదు. వచ్చే జన్మలో శూద్రకులంలో పుట్టి జంతువుల్ని హింసించే బ్రతుకుతెరువు కలవాడివి అవుతావు. ఇది తప్పదు!” అని శపించాడు.
అది విని నేను “మహానుభావా! నేను అజ్ఞానంతో ఇటువంటి అపచారం చేశాను. క్షమించండి! చెడు జన్మ పొందేట్టుగా చేయకండి” అని ప్రార్థించాను.
మహర్షి నా మీద దయతో “నా శాపానికి తిరుగులేదు. నువ్వు ఎరుకలవాడివిగా పుట్టినా కూడా ధర్మాధర్మపరిజ్ఞానం కలవాడిగా ఉంటావు. తల్లితండ్రుల్ని భక్తితో సేవించి తరిస్తావు” అని చెప్పాడు. పెద్దలకి సేవ చేస్తే చాలా మంచి జరుగుతుంది. అప్పుడు నీకు పూర్వ జన్మ పరిజ్ఞానం ఉంటుంది. తరువాత జన్మలో మళ్లీ బ్రాహ్మణుడుగా పుడతావు” అన్నాడు.
అతడికి గుచ్చుకున్న బాణాన్ని నెమ్మదిగా బయటికి తీసి ఆశ్రమానికి చేర్చాను. అతణ్ని మృత్యువు నుంచి కాపాడగలిగాను కాని, నాకు ఈ శూద్రజన్మ తప్పలేదు” అని చెప్పాడు.
ధర్మవ్యాధుడు చెప్పిన విషయాలన్నీ విని కౌశికుడు “ప్రస్తుతం నీ జన్మ చూస్తే శూద్రజన్మే కాని, ప్రవర్తన పరిశీలిస్తే ఇది ఒక వింత. ఇటువంటి వింత ఇంతకు ముందు నేను ఎప్పుడూ చూడలేదు. నువ్వు మరో జన్మ వరకు ఆగక్కర్లేదు.. ఈ జన్మలోనే పుణ్య చరిత్ర కలిగిన నువ్వు నిజంగా బ్రాహ్మణుడవే.
చెడు ప్రవర్తన కలిగినవాడు బ్రాహ్మణ కులంలో పుట్టినా శూద్రుడి కంటే అధముడు. పరిశుభ్రత పాటించి నిజాన్నే పలికే ధర్మాత్ముడు శూద్రకులంలో పుట్టినా అతడు మంచి బ్రాహ్మణుడే అని మహర్షులు చెప్పారు. ఇది నిజం.
ధర్మవ్యాధుడా! పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితంగా ఈ జన్మలో నీచమైన జన్మని పొందావని నీ మనస్సులో బాధపడుతూ ఉండకు. మంచి పనులు చేసినప్పుడు మేలు జరుగుతుంది. చెడు పనులు చేసినప్పుడు కీడు జరుగుతుంది. అలా ఏర్పడే సుఖదుఃఖాల్ని పండితులు సమభావంతో చూస్తారు. తమకు కలిగే మానసిక, శారీరిక బాధల్ని తగిన ధర్మకార్యాలు చేస్తూ పోగొట్టుకుంటారు.
కష్టాలు కలిగాయని దుఃఖించడం, మంచి జరిగిందని సంతోషించడం మంచిది కాదు. జరిగిన కాలాన్ని జరగబోయే కాలాన్ని గురించి ఆలోచించకుండా అన్ని కాలాల్లోను తృప్తిగానే ఉంటారు. దుఃఖం వల్ల శరీరకాంతి పోతుంది, మంచి కలిగించే పనులు చేయగల సామర్థ్యం తగ్గిపోతుంది. కనుక మనస్సులో చేస్తున్న పని సరయినదా కాదా అని తర్కించుకుంటూ ధైర్యంతో జీవించు” అని చెప్పాడు.
ధర్మవ్యాధుడు “మహానుభావా! నువ్వు చెప్పినట్టే నా జీవితాన్ని చక్కదిద్దుకుంటున్నాను. రాబోయే కాలంలో మంచి జరుగుతుందని నమ్ముతున్నాను” అని బదులిచ్చాడు.
కౌశికుడు “ధర్మవ్యాధా! నువ్వు పుణ్యాల పోగువి. నీ జీవితం ధన్యమైంది. ఎప్పుడూ ధర్మాన్నే ఆచరిస్తూ నీ జీవితాన్ని ఇలాగే సరిదిద్దుకో. నీ చరిత్ర వల్ల ధర్మం విస్తరిస్తుంది. నీకెప్పుడూ మంచే జరుగుతుంది. నిన్ను కలుసుకోవడం వల్ల నా జన్మ ధన్యమైందని అనుకుంటున్నాను.
నీ వల్ల నేను ఎన్నో ధర్మసూత్రాలు తెలుసుకోగలిగాను. నాకు జ్ఞానోదయమైంది. నాకు సెలవిప్పిస్తే నేను వెళ్లివస్తాను” అని కౌశికుడు ధర్మవ్యాధుడికి ప్రదక్షిణ నమస్కారం చేసి బయలుదేరి తన ప్రదేశానికి వెళ్లిపోయాడు.
మార్కండేయమహర్షి ధర్మరాజుతో “రాజా! నువ్వు అడిగిన ప్రశ్నలకి 1.పతివ్రతల మహిమ, 2. తల్లితండ్రులకి పరిచర్య చేయడంలో గొప్పతనం, 3. తక్కువ కులంలో పుట్టినా కూడా ధర్మాత్ముడుగా ప్రకాశించే విధానం అన్నీ నీకు అర్థమయ్యేలా ఉదాహరణతోపాటు వివరంగా చెప్పాను” అన్నాడు.
మార్కండేయ మహర్షి చెప్పిన విషయాలు విని ధర్మరాజు చాలా సంతోషపడ్డాడు.