నిత్యవ్యవహారంలో వస్తువు అనగా మనకు ఉపయోగపడునది. ముఖ్యంగా నిర్జీవులకు ఈ పదాన్ని వాడుతుంటాము. కథలో జీవ నిర్జీవాలతో పాటు, వాటికి అతీతంగా చెప్పదలచుకున్న విషయాన్ని వస్తువు అంటాము. మనిషి తనకు అత్యంత అవసరమైన వస్తువునే కొనుగోలు చేస్తాడు. అది కొనక తప్పదు, వాడక తప్పదు అనుకున్నప్పుడే దాన్ని కొంటాడు. అందుకు భిన్నంగా కూడా జరుగుతుంది. అలాంటి వ్యవహారం పట్టించుకోదగింది కాదు. కథకుడు తను చూసి స్పందించిన, అనుభవించిన అనేక సందర్భాలను కథగా రాయకూడదు. అందులో చెప్పదగిన విషయమేదైనా ఉంటే, చెప్పకుండ ఉండలేని పరిస్థితి ఉంటే ఆ విషయాన్ని కథగా మలచాలి. ఆ విషయమే సాహిత్య పరిభాషలో కథావస్తువు. వస్తువు దానికదే కథ కాలేదు. కథకుడి చేతిలో రసాయనిక చర్యకు గురి అయి, ఏదో ఒక విశేషాన్ని అందించినపుడు కథ అవుతుంది. ఇలాంటి విశేషాంశ కలిగిన విషయాన్నే కథకుడు వస్తువుగా స్వీకరించాలి. విషయం మరియు విశేషం రెండూ కూడా శరీరము, ప్రాణంలా కలసి ఉండాలి. శరీరంలో ప్రాణం ఉన్నట్లు, విషయంలో విశేషం ఉండాలి. అలాంటి విషయమే వస్తువు.
జీవితం కథకు ముడిసరుకు వంటిది. అందులో నుండే వస్తువును ఎన్నుకోవాలి. జీవితం అనేక సంఘటనల సమాహారం. ఆ సంఘటనల్లో ఎవరిని ఏది కదిలిస్తుందో తెలియదు. అట్లా కదిలించిన దానిలో చెప్పగలిగే విశేషమేదైనా ఉంటే అది చెప్పడానికి అనువుగా ఉంటే దాన్ని వస్తువుగా గ్రహించాలి. వ్యక్తులకు అంతరంగ జీవితం, బాహ్య జీవితం రెండూ ఉంటాయి. ఈ రెండూ పరస్పర ప్రభావం కలిగి ఉంటాయి. ఇవి సంఘజీవితంపై ఏదో ఒక మేరకు ప్రభావాన్ని చూపుతాయి. ఇలాంటి ప్రభావశీలమైన మానవ జీవితం కథకు వస్తువును అందిస్తుంది. ఆ వస్తువు ద్వారా కథకుడు లోకరీతిని, మారిన జీవితాల్ని వాటి పరిణామాల్ని అరటిపండు ఒలిచి పెట్టినట్లు కథ ద్వారా చెబుతాడు. అలాంటి కథలను పాఠకులు ఆదరిస్తారు. కథకుడి ప్రతిభ వస్తువును ఎన్నుకోవడంలోనే ఉంటుంది. చెప్పవలసిన విషయం మనసులో పూర్తి స్థాయి చిత్రంగా స్థిరపడ్డాక కథ రాయడం మొదలు పెట్టాలి.
వస్తువును ఎన్నుకోవడంలో కథకుడి ఇష్టాయిష్టాలు పనిచేస్తాయి. తన ఆలోచనకు, దృష్టికి, భావానికి, రుచికి, మనసుకు, బుద్ధికి దగ్గరగా ఉన్నదాన్నే కథకుడు వస్తువుగా ఎన్నుకుంటాడు.
“సృజనాత్మక క్రియ సూప్ చెయ్యడం లాంటిది. సూపు మరగబెట్టి తగ్గించినట్టు వాస్తవంలో నుండి తనకు కావలసిన వస్తువును రచయిత సంగ్రహిస్తాడు.”
-రాబర్డ్ ఎడ్డెన్
“బాహ్య జగత్తులో వస్తువు ఎంత అద్భుతమైనదైనా సరే అది కథకుడి అంతరంగ జగత్తులో ఆవిర్భవించే ఒక కళాదృష్టితో సమన్వయం కుదుర్చుకుని తనదైనపుడు తప్ప రచయిత ఆ వస్తువును స్వీకరించడం మూర్ఖత్వం.”
– బుచ్చిబాబు
కథలో వస్తువు అనేది కేంద్ర బిందువు. దీన్ని కథాబీజం, కథాంశం అని కూడా అంటారు. వస్తువు దానికదే ప్రయోజనం ఇవ్వదు. దాన్ని ఉపయోగించాలి. అట్లాగే మనమొక వస్తువు గురించి చెప్పదలచుకొన్నప్పుడు, దానిని బలంగా చెప్పగలిగే కథనం లేదా సంవిధానం మన దగ్గర ఉండాలి. తెలుగులో వస్తువు ఇతివృత్తం అనే రెండు పదాలను సమానార్థకాలుగా వాడుతున్నారు. కానీ రెండింటి మధ్య స్వల్ప తేడా ఉంది. వస్తువు ముడిసరుకు లాంటిది. ఒక వడ్రంగి కర్ర తెచ్చాడు. కర్రతో కృష్ణుడి బొమ్మ తయారు చేశాడు. బొమ్మ చేయగా మిగిలిన కర్రతో పిల్లనగ్రోవి తయారుచేశాడు.
రెంటికి ఉపయోగించిన కర్ర వస్తువు అయితే రెండింటి ఉపయోగాలు వేరువేరు. అవి ఇతివృత్తాలు అనబడతాయి. వస్తు విన్యాసాన్ని (ఫ్లాట్) ఇతివృత్తం అంటారు. దీన్నే కథా ప్రణాళిక అని కూడా అంటారు. మొత్తానికి ఈ రెండు పరస్పరాధారాలు.
(మరోసారి మరో అంశంతో)
డాక్టర్ బి.వి.ఎన్. స్వామి గారి పూర్తి పేరు భైరవి వెంకట నర్సింహస్వామి. కోహెడ మండలం వరికోలులో లక్ష్మిదేవి-అనంతస్వామి దంపతులకు 1964 డిసెంబర్ 16న జన్మించారు. సుప్రసిద్ధ తెలుగు కథకులు, పరిశోధకులు.
2000 సంవత్సరం నుంచి విస్తృతంగా రాయడం ప్రారంభించారు. 2004లో తన మొదటికథా సంపుటిని ‘నెలపొడుపు’, మరో కథా సంపుటి ‘రాత్రి-పగలు-ఒక మెలకువ’ను 2013లో ప్రచురించారు. ‘అందుబాటు’ అనే పేర వెలువరించిన పరిశోధక గ్రంథం 2005లో వచ్చింది. కథలపై విమర్శనా వ్యాసాలు ‘వివరం’ పేర 2011లో, ‘కథా తెలంగాణ’ పేరుతో వచ్చిన వ్యాసాలు 2014లో వెలువరించారు. వృత్తిపరంగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందడమే కాకుండా సాహిత్యపరంగా కళాహంస పురస్కారం, పివి నర్సింహరెడ్డి సాహిత్య పురస్కారం, బొందులపాటి సాహిత్య పురస్కారం వంటి అవార్దులు పొందారు. శ్రీకాకుళం కథానిలయంలో శ్రీ కాళీపట్నం రామారావు గారి సత్కారం కూడా పొందారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™