[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
ఒకరోజు అర్జునుడు తపస్సంపన్నులైన బ్రాహ్మణులతో కలిసి మణిపూర పురానికి దగ్గరలో సముద్ర తీరంలో ఉన్న తీర్థాల్ని చూస్తూ సౌభద్ర తీర్థానికి చేరుకున్నాడు. అందులో స్నానం చెయ్యాలని అనుకుంటున్న అర్జునుణ్ని అక్కడ ఉన్న మహర్షులు అడ్డుకున్నారు. “చంద్రవంశానికే గొప్పవాడవైన అర్జునుడా! ఈ తీర్థంలో దిగి స్నానం చెయ్యడం ఎవరికి సాధ్యం కాదు. ఈ సముద్ర తీరంలో పాపాల్ని పోగొట్టే పవిత్రమైన తీర్థాలు అయిదు ఉన్నాయి. ఈ తీర్థాల్లోనూ పెద్ద పెద్ద మొసళ్లు ఉన్నాయి. అవి పట్టుకుంటాయని మహర్షులు కూడా ఈ అయిదు తీర్థాల్లోను స్నానం చెయ్యడానికి భయపడతారు.
సౌభద్ర, పొలోమ, కారంధమ, ప్రసన్న, భరద్వాజ అనేవి ఈ అయిదు తీర్థాల పేర్లు. వంద సంవత్సరాల నుంచి ఈ తీర్థాల్ని మొసళ్లు ఆక్రమించాయి. దుర్మార్గులయిన రాజుల వంశంలో ఉండే సంపదల్ని మహర్షులు ఉపయోగించరు. అదే విధంగా ఈ అయిదు తీర్థాల్ని కూడా మహర్షులు ఉపయోగించట్లేదు” అన్నారు.
వాళ్ల మాటలు విన్న అర్జునుడు “మహర్షులారా! నేను అన్ని తీర్థాల్లోను స్నానం చెయ్యాలని బయలుదేరాను. మొసళ్లకి భయపడి ఈ తీర్థాల్లో స్నానం చెయ్యక పోవడం నా విషయంలో పౌరుషం అనిపించుకోదు. నేను ఈ తీర్థాల్లో స్నానం చేసే తీరుతాను” అన్నాడు. స్నానం చెయ్యడానికి సాహసంతో ఒక తీర్థంలోకి దిగాడు. వెంటనే ఒక పెద్ద మొసలి అందులో ఉన్న నీళ్లని చిందరబందర చేస్తూ ఎగురుకుంటూ వేగంగా వచ్చి అర్జునుణ్ని పట్టుకుంది. అర్జునుడు ఆ మొసలిని తన బలమైన చేతులతో ఎత్తి ఒడ్డు మీదకి విసిరాడు.
ఆ మొసలి వెంటనే దివ్యమైన కాంతితో ప్రకాశిస్తూ ఒక అప్సరసగా మారి నిలబడింది. సౌందర్యంతో వెలిగిపోతున్న ఆమెని చూసి అర్జునుడు ఆశ్చర్యపడ్డాడు. “నువ్వు నీళ్లల్లో ఉన్నప్పుడు మొసలిగా ఉండి.. మళ్లీ ఒడ్డు మీద పడగానే అందమైన అమ్మాయిగా ఎలా మారావు? అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు?” అని ప్రశ్న మీద ప్రశ్న వేశాడు.
అర్జునుడు అడిగిన ప్రశ్నలకి “నా పేరు వంద. కుబేరుడికి స్నేహితురాలిని. నాకు నలుగురు స్నేహితురాళ్లు ఉన్నారు. వాళ్ల పేర్లు సౌరభేయి, సమీచి, బుద్బుద, లత. వాళ్లు కూడా తీర్థాల్లో ఉన్నారు. మేమందరం శాపం వల్ల మొసళ్ల రూపంలో ఉన్నాము. దయతో వాళ్లని కూడా శాపవిముక్తుల్ని చెయ్యి” అని వేడుకుంది.
ఆమె మాటలు విని అర్జునుడు “అసలు మీకు ఈ మొసలి రూపం ఎందుకు కలిగింది?” అని అడిగాడు.
అప్సరస అర్జునుడితో “మేము అయిదుగురం దిక్పాలకుల పట్టణాలు చూస్తూ భూలోకానికి వచ్చాము. అడవిలో ఒంటరిగా కూర్చుని ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్న బ్రాహ్మణుడి తప్పస్సు చెడగొట్టాలని అనుకుని ఆయన ముందర ఆటలు ఆడి పాటలు పాడి అల్లరి చేసాము. అయినా ఆ బ్రాహ్మణుడు ఏమాత్రం చలించలేదు. మనో నిగ్రహం కలవాళ్లకి తపస్సు తప్ప మిగిలిన విషయాలన్నీ గడ్డి పోచల్లాంటివే! చివరికి మేము ఆగకుండా అల్లరి చెయ్యడం ఆయనకి కోపం తెప్పించింది. మమ్మల్ని అయిదుగురిని మొసళ్లుగా మారమని శపించాడు.
మేము భయంతో రెండు చేతులూ జోడించి మా అజ్ఞానానికి మన్నించమని ఆయన్ని ప్రార్థించాము. “అయ్యా! బ్రాహ్మణులు ఎప్పుడూ తప్పులు చెయ్యరు. ధర్మంగా ప్రవర్తిస్తారు. సత్యాన్నే మాట్లాడుతారు. అటువంటి బ్రాహ్మణులకి హాని తలపెట్టిన వాళ్లకి పాపాలు కలుగుతాయి. అదే పని మేము చేశాము. మీరు మా మీద కోపగించక మేము చేసిన పనికి క్షమించి మమ్మల్ని కరుణించండి. మాకు శాప విమోచన మార్గాన్ని చెప్పండి” అని వేడుకున్నాము.
మా మీద దయతో ఆ బ్రాహ్మణుడు “మొసళ్లుగా మారిన మీరు పట్టుకున్నప్పుడు ఎవరైతే మిమ్మల్ని నీళ్లల్లోంచి గట్టు మీదకి పడేస్తాడో అప్పుడే మీకు శాపవిమోచనం కలుగుతుంది అని చెప్పాడు. మమ్మల్ని ఈ తీర్థ జలాల్లోంచి బయట పడెయ్యగల బలమైన చేతులు కలిగినవాడు ఎవరై ఉంటారా.. అని మాట్లాడుకుంటూ నడుస్తున్నాము. ముల్లోకాలకి వెళ్లగలిగిన నారద మహర్షి మాకు ఎదురు వచ్చాడు. భక్తితో అయనకి నమస్కారం చేశాము. మమ్మల్ని చూసి ఎందుకలా ఉన్నారని అడిగాడు. మేము జరిగినదంతా ఆయనకి వివరించాము.
ఆయన “తల్లులారా! బ్రాహ్మణుల కోపాన్ని, బ్రహ్మదేవుడి చేతల్ని తప్పించడం ఎవరికీ సాధ్యం కాదు. దక్షిణ సముద్ర తీరంలో ప్రసిద్ధి చెందిన అయిదు మడుగులు ఉన్నాయి. వాటిలో ప్రవేశించి నూరు సంవత్సరాలు అక్కడే ఉండండి. తరువాత గొప్ప కీర్తి కలిగిన పాండురాజు కొడుకు అర్జునుడు తీర్థాలన్నీ దర్శిస్తూ అక్కడకి కూడా వస్తాడు. మిమ్మల్ని శాపం నుంచి అతడే విముక్తుల్ని చేస్తాడు” అని చెప్పాడు. ఆయన మాటలు విని ఈ మడుగుల్లో భయంకరమైన మొసళ్లుగా మారి మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. ఇన్నాళ్లకి మా కోరిక తీరుతోంది” అని చెప్పింది.
ఆమె చెప్పింది విని అర్జునుడు మిగిలిన నాలుగు మడుగుల్లో ఉన్న మొసళ్లని కూడా గట్టు మీదకి విసిరి అయిదుగురికి శాప విమోచనం కలిగించాడు. దేవకన్యలు సంతోషంగా అర్జునుణ్ని దీవించి తమ లోకానికి వెళ్లిపోయారు. ఆ రోజునుంచి ఆ తీర్థాలకి ‘నారీ తీర్థాలు’ అని పేరు వచ్చింది.
అర్జునుడు మణిపూర పురంలో చిత్రాంగదతో రాజభోగాలు అనుభవిస్తూ గడుపుతున్నాడు. అతడికి బభ్రువాహనుడు అనే పేరుతో ఒక కొడుకు కలిగాడు. ముందు అనుకున్నట్టుగా చిత్రవాహనుడి వంశం నిలబెట్టేందుకు బభ్రువాహనుణ్ని అప్పగించాడు. అక్కడి నుంచి బయలుదేరి గోకర్ణ తీర్థాన్ని చూసుకుని పడమటి సముద్రం పక్కన ఉన్న ప్రభాస తీర్థానికి వెళ్లాడు. అక్కడికి దగ్గరలోనే ద్వారవతి ఉందని విన్నాడు. ఆ ద్వారవతిలో నల్లటి శరీరము, పద్మాలవంటి కళ్లు కలిగిన శ్రీకృష్ణుడు ఉన్నాడని అతడు మోక్షాన్ని ప్రసాదించగలడని అర్జునుడికి ఎప్పుడో ఒకసారి గదుడు చెప్పాడు.
ఆ శ్రీకృష్ణుడికి తిలోత్తమకంటే ఎక్కువ సౌందర్యము, సుగుణాలు, అందమైన నడక కలిగిన సుభద్ర అనే పేరు గల చెల్లెలు ఉందని కూడా విన్నాడు. ఆమెను చూడాలన్న కోరికతో ద్వారవతికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అక్కడ నివసించే యాదవులకి సన్యాసులంటే ఎక్కువ భక్తి అని తెలుసుకుని కపట సన్యాసి వేషాన్ని ధరించాడు. బ్రాహ్మణుల మంచిని కోరేవాడు, లోకానికంతటికీ గురువు, గరుత్మంతుడు ధ్వజంగా ఉన్నవాడు, సుగుణవంతుడు అయిన శ్రీకృష్ణుణ్ని భక్తి శ్రద్ధలతో మనస్సులోనే ధ్యానించాడు.
భక్తితో ప్రార్థిస్తే భగవంతుడు తప్పకుండా ప్రత్యక్షమవుతాడు కదా! అలాగే అర్జునుడు ప్రభాస తీర్థంలో ఉన్నాడని తెలుసుకుని శ్రీకృష్ణుడే అక్కడికి వచ్చాడు. తన దగ్గరికి వచ్చిన సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు, దేవకీవసుదేవుల కొడుకు అయిన శ్రీకృష్ణుణ్ని చూసి అర్జునుడి కళ్లు ఆనందబాష్పాలతో నిండిపోయాయి. దగ్గరికి వెళ్లి రెండు చేతులూ జోడించి “శ్రీకృష్ణా! యథావిధిగా ద్వాదశమాసిక వ్రతాన్ని ఆచరించడం కోసం బయలుదేరి ఇక్కడకు వచ్చాను. గంగానది వంటి గొప్ప నదుల్ని, హిమాలయం వంటి గొప్ప పర్వతాల్ని, నీ పాదపద్మాల్ని దర్శించడం వల్ల నా పాపాలన్నీ హరించి పోయాయి” అన్నాడు.
అర్జునుడి మాటలు విని శ్రీకృష్ణుడు అతణ్ని ప్రేమగా కౌగలించుకున్నాడు. ఇంద్రప్రస్థంలో అందరి క్షేమాన్ని అడిగాడు. అతడు తీర్థయాత్రలు చెయ్యడానికి గల కారణాన్ని, సుభద్ర మీద అతడికి ఉన్న అనురాగాన్ని తెలుసుకున్నాడు. అర్జునుణ్ని తనతోపాటు ద్వారకా నగరానికి తీసుకుని వెళ్లాడు. ఆ నగరంలో బంగారు రంగుతో మెరుస్తున్న మేడలతోను; విరగ పూసిన పూలతీగలు అల్లుకున్న చెట్లతో అందంగా ఉన్న ఉద్యానవనలతోను; కాంతివంతమైన పగడాలు, వజ్రాలతో చిత్రవిచిత్రంగా ఉన్న అరుగులతోను ఉన్న అందమైన ‘రైవతకము’ అనే పర్వత గుహలో అర్జునుణ్ని ఉండమన్నాడు.
మణిదీపాల కాంతిలో శ్రీకృష్ణుడు అర్జునుడితో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఆ రాత్రంతా అక్కడే గడిపాడు. తెల్లవారగానే శ్రీకృష్ణుడు అర్జునుణ్ని అక్కడే ఉండమని చెప్పి బంగారు రథం ఎక్కి ద్వారకా నగరానికి వెళ్లిపోయాడు. నగరంలో ఉన్న ప్రజల్ని, మంత్రుల్ని పిలిచి రైవతక పర్వత మహోత్సవం జరుగుతుందని చాటింపు వేయించమని చెప్పాడు. చాటింపు విని ద్వారకానగర ప్రజలందరూ ఆనందంగా తమకున్న సంపద అందరికీ తెలిసేలా ఆభరణాలు అలంకరించుకుని ముస్తాబయ్యారు. వాద్యాలన్నీ మోగుతుండగా ఊరేగింపుగ బయలుదేరి రైవతాద్రికి చేరుకుని పూజలు చేశారు.
సారణుడు, సత్యకుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు, గదుడు, ఉద్ధవుడు, మొదలైన యాదవులందరూ తమ భార్యలతో కలిసి ఏనుగులు, అడవి ఏనుగులు, గుర్రాలు, పల్లకీలు ఎక్కి ఉత్సవానికి సంతోషంగా తరలి వెళ్లారు. శ్రీకృష్ణుడు ప్రజలందరి నమస్కారాలు అందుకుంటూ రుక్మిణీదేవి మొదలైన భార్యలందరితో కలిసి దేవేంద్రుడి వైభవంతో సమానమైన వైభవంతో రైవతక పర్వతానికి బయలుదేరాడు.
శ్రీకృష్ణుడు అర్జునుడి కోరిక గురించి ఆలోచిస్తూనే అతణ్ని వెంటబెట్టుకుని రైవతక పర్వతం మీద ఉన్న అందమైన ప్రదేశాలన్నీ చూపిస్తున్నాడు. తిరుగుతూ గొప్ప కాంతి కలిగిన మణులతో నిర్మించబడ్డ ఒక అరుగు మీద కూర్చుని మాట్లాడుకుంటున్నారు. సుభద్ర తన మనస్సులో అర్జునుడే భర్తగా రావాలని కోరుకుంటూ అందమైన కన్యలు వెంట వస్తుండగా రైవతక పర్వతానికి పూజలు చేసి నమస్కారం చేసింది.
సుభద్ర రావడాన్ని చూసిన అర్జునుడు పడుతున్న బాధని చూసి శ్రీకృష్ణుడు చిలిపిగా నవ్వుతూ “మహర్షీ! స్త్రీల మీదకి మనసు పోవడం మీకు తగదు కదా?” అన్నాడు. కొంచెంసేపు ఆగి “అర్జునా! నీకు సుభద్ర మీద అనురాగం ఉందని నాకు ఇదివరకే తెలుసు. భయపడకు దేవకీ వసుదేవులకి చెప్పి నీ కోరిక నెరవేరేటట్లు చేస్తాను” అన్నాడు.
తరువాత వేగులవాళ్లని పిలిచి అర్జునుడు ద్వారవతిలో క్షేమంగా ఉన్నాడన్న వార్త ధర్మరాజుకి తెలియపరచమని ఇంద్రప్రస్థ పురానికి పంపించాడు. అదే సమయంలో అర్జునుడితో ఉన్న శ్రీకృష్ణుడి దగ్గరికి బలరాముడితో కలిసి యాదవులందరూ వచ్చారు. అర్జునుణ్ని చూసి యతి అనుకుని భక్తితో నమస్కారం చేసారు. పుణ్యతీర్థాల విశేషాల్ని గురించి ఆయన్ని అడిగి తెలుసుకున్నారు.
వర్షాకాలం నడుస్తోంది కనుక అక్కడే ఉండి చాతుర్మాస్య వ్రతాన్ని జరిపి తమని కృతార్థుల్ని చెయ్యమని ప్రార్థించారు. యతిని తీసుకుని వెళ్లి సుభద్ర ఉండే అంతఃపురంలోనే అర్జునుణ్ని ఉంచి ఆయనకి సేవ చెయ్యడానికి సుభద్రని నియోగించారు. మందరపర్వతానికి ఉన్నంత ధైర్యం కలిగిన అర్జునుడు రూపవతి, గుణవతి అయిన సుభద్ర సేవలో అమె అంతఃపురంలోనే ఉండిపోయాడు. శ్రీకృష్ణుడు యతి వేషంలో ఉన్నవాడు అర్జునుడే అని రుక్మిణికి, సత్యభామకి సంతోషంగా చెప్పాడు.
అందమైన సుభద్ర విసుగులేకుండా ఏ రోజుకి ఆ రోజు కొత్త కొత్త వంటలతో భోజనం పెడుతోంది. ఇద్దరి మధ్య స్నేహభావం పెరిగింది. సుభద్ర నల్లని జుట్టు, ఇంద్రనీలపు రంగు శరీరము, మోకాలి వరకు వెలాడే బలమైన పొడవైన చేతులు, ఎర్రగా ఉండే కొలకులతో తామర రేకులవంటి కళ్లు, ఎత్తైన, కఠినమైన, విశాలమైన వక్షస్థలము, రెండు చేతులతో ఒకే వేగంతో బాణాలు వెయ్యగల అర్జునుణ్ని గురించి వింది. ఇప్పుడు తను సేవ చేస్తున్న యతి కూడా అదే అకారం కలిగి ఉన్నాడు. అమెకి అర్జునుడే ఈ రూపంతో వచ్చాడేమో అని అనుమానం కలిగింది.
ఒకరోజు భోజనం చేస్తున్న యతితో “మునీంద్రా! మీకు స్నానం చెయ్యని పుణ్య తీర్థాలు, చూడని ప్రదేశాలు, తెలియని రాజుల వంశాలు లేవని అనుకుంటున్నాను. ఈ భూమి మీద ఉన్న ఇంద్రప్రస్థపురం స్వర్గ లోకంలో ఉన్న దేవేంద్రుడి రాజధాని అమరావతి కంటే కూడా బాగుంటుందని విన్నాను. ఆ రాజధానిని మీరు చూశారా? అక్కడ పాండవులు సుఖంగా ఉన్నారా? మా అత్త కుంతీదేవి క్షేమంగా ఉందా? మహావీరుడయిన అర్జునుడు తీర్థయాత్రలకి వెళ్లాడని విన్నాను.. అతడు తిరిగి వచ్చాడా?” అని అడిగింది.
సుభద్ర మాటలు విని అర్జునుడు “సుభద్రా! నేనే అర్జునుణ్ని. ప్రస్తుతం నీ ఎదురుగానే ఉన్నాను. బ్రహ్మదేవుడే మనిద్దర్నీ ఒకచోటకి చేర్చాడు. క్షత్రియులకి గాంధర్వము, రాక్షసము మొదలైన ఎనిమిది రకాల వివాహ పద్ధతులు ఉన్నాయి. మన వివాహం గాంధర్వ పద్ధతికి అనుకూలంగా ఉంది” అన్నాడు. అర్జునుడి మాటలు విని సుభద్ర సిగ్గుపడి “నన్ను నీకు ఇచ్చి వివాహం చెయ్యడానికి అర్హత ఉన్న పెద్దలందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్లే మన విషయం తెలుసుకుని వివాహం చేస్తారు” అని చెప్పి తన అంతఃపురంలోకి వెళ్లిపోయింది. అర్జునుడు తన పొదరింటికి వెళ్లిపోయాడు.
సుభద్ర అర్జునుల మధ్య ఉన్న అనురాగాన్ని తెలుసుకున్న శ్రీకృష్ణుడు అతడికి భోజనం పెట్టడానికి రుక్మిణీదేవిని పంపించాడు. దేవకి, వసుదేవుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు సంకర్షణుడు, సారణుడు, సాత్యకుల్ని ఏకంతంగా కలుసుకుని సుభద్ర అర్జునుల అనురాగం గురించి చెప్పాడు. అర్జునుడు యతి రూపంలో ఉన్న విషయాన్ని కూడా చెప్పాడు. మొదటి నుంచి సుభద్రని అర్జునుడికి ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నదే కనుక బలరాముడు మొదలైన పెద్దవాళ్లకి ఈ విషయం తెలియకుండా వాళ్లిద్దరికీ వివాహం చెయ్యాలని నిర్ణయించారు. తమ నిశ్చయాన్ని సుభద్ర, అర్జునులకి కూడా చెప్పాడు.
శివపూజామహోత్సవం జరుగుతోందని చెప్పి యాదవుల్ని, భోజ, అంధక, వృష్ణి వంశానికి చెందిన పెద్దలందరినీ తీసుకుని లోపలి ద్వీపానికి వెళ్లాడు. అక్కడ అందరికీ పూజ్యుడు చంద్రశేఖరుడు ఉమాపతి అయిన పరమేశ్వరుడికి ప్రీతి కలిగించేలా ఉత్సవం జరిపించమని ఆజ్ఞాపించాడు. సుభద్రార్జునులు తమ వివాహం ఎలా జరుగుతుందో అని ఆందోళనపడుతూ ద్వారకలో ఉండిపోయారు. సుభద్ర మనస్సులో శ్రీకృష్ణుణ్ని తలుచుకుంది. అర్జునుడు మనస్సులో దేవేంద్రుణ్ని తలుచుకున్నాడు. వాళ్లిద్దరి వివాహం జరిపించడానికి ముఖ్యులందరూ ద్వారవతీ నగరానికి వచ్చారు.
వసుదేవుడు, అక్రూరుడు, సారణుడు, సాంబుడు, సాత్యకి మొదలైన వాళ్లతో శ్రీకృష్ణుడు లోపలి ద్వీపం నుంచి వచ్చాడు. అదే సమయంలో దేవేంద్రుడు అమర సిద్ధ సాధ్య ముని సమూహంతో కలిసి అమరావతి నుంచి వచ్చాడు. బృహస్పతి పెట్టిన లగ్నానికి అష్టదిక్పాలకులు మొదలైన దేవతలు; అత్రి, భృగు, నారదుడు మొదలైన మహర్షులు సదస్యులుగాను; కశ్యప ప్రజాపతి హోమకర్తగాను; అరుంధతి, శచి, సత్యభామ, రుక్మిణులు అప్సరసల సహాయంతో ముత్తైదువులుగాను వ్యవహరించారు. సుభద్ర అర్జునుల వివాహం చూడముచ్చటగా జరిగింది.
దేవేంద్రుడు తన కుమారుడైన అర్జునుణ్ని మంగళస్నానం చేయించి బంగారంతోను, మణులతోను తయారు చేయబడిన కిరీటాన్ని శిరస్సు మీద అలంకరించాడు. విలువయిన బాహుపురులు, హారాలు మొదలైన ఆభరణాలు అలంకరించాడు. కళ్లనిండా నిండిన ఆనందబాష్పాలతో రెండు కళ్లు వెయ్యి కళ్లుగా అర్జునుణ్ని ప్రేమగా చూసుకున్నాడు. తరువాత దేవతలందరితో కలిసి తమ లోకానికి వెళ్లిపోయాడు.
శ్రీకృష్ణుడు తను చెయ్యాలనుకున్నట్టే సుభద్రార్జునుల వివాహం పూర్తి చేయించ గలిగినందుకు చాలా సంతోషపడ్డాడు. కోరిక నెరవేరిన అనందంలో ఉన్న అర్జునుణ్ని ప్రేమతో కౌగలించుకున్నాడు. ఎన్ని ఉపయోగించినా తరిగిపోని బాణాలతో ఉండే అంబులపొదిని, ధనుస్సుని, వేగంగా పరుగెత్తగల గుర్రాలు పూన్చిన బంగారు రథాన్ని ఇచ్చాడు. సుభద్రతోపాటు ఇంద్రప్రస్థపురానికి పంపించేశాడు. తరువాత తను కూడా లోపలి ద్వీపానికి వెళ్లిపోయాడు.
అర్జునుడు సుభద్రని తీసుకుని శ్రీకృష్ణుడు చెప్పిన మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. ఆ పట్టణాన్ని పృథుశ్రవసుడు మొదలయిన గొప్ప వీరులు కాపలా కాస్తున్నారు. రథం మీద వాయువేగంతో సుభద్రని తీసుకుని వెళ్లిపోతున్న అర్జునుణ్ని చూశారు. ఇతడు మన శ్రీకృష్ణ బలరాములకి చెప్పకుండా సుభద్రని తీసుకుని వెళ్లిపోతున్నాడు. తరువాత తెలిస్తే చూసి కూడా చెప్పలేదని మనల్ని కోపగిస్తారు అనుకుని అర్జునుణ్ని అడ్డగించారు.
పరాక్రమవంతులైన ఆ వీరులందరు నాలుగువైపుల నుంచి వచ్చి అర్జునుణ్ని ముట్టడించారు. అర్జునుడు ఆ సేనల్ని తన దగ్గర ఉన్న భయంకరమైన బాణాలతో చెల్లాచెదరు చేశాడు. దేవేంద్రుడి కొడుకు అర్జునుడికి ఇంకా కోపం తగ్గలేదు. ఆ పట్టణంలో ఉన్న వీథుల్ని, అరుగుల్ని, అందమైన మేడలకి ఉన్న గోపురాల్ని, మహాపర్వతానికి సంబంధించిన రత్నాల నేలల్ని, పెద్ద చెరువుల్ని, సరస్సుల్ని, ఉద్యనవనాల్నీ కూడా బాణలతో నింపాడు.
రథాన్ని సుభద్ర నడుపుతుంటే అర్జునుడు తమకి అడ్డుగా వచ్చిన యాదవ సైన్యాల్ని ఓడించి విజయం సాధించాడు. అర్జునుడు వెళ్లిపోయాక సభపాలుడు భయంకరమైన శబ్దంతో నగారా మోగించాడు. అర్జునుడు చేసిన యుద్ధం, అతడి పరాక్రమం గురించి అందరికీ తెలిసేలా చెప్పాడు. లోపలి ద్వీపంలో ఉన్న బలరాముడు, మిగిలిన యాదవులు విషయం తెలుసుకున్నారు. వెంటనే బయలుదేరి ద్వారవతీ నగరానికి చేరుకుని సభని ఏర్పాటు చేశారు.
అర్జునుడు యాదవుల్ని లక్ష్యపెట్టకుండా యాదవ కాంతని ఎత్తుకుని వెళ్లిపోయాడు. యాదవులతో పెట్టుకోవడమంటే లోతైన సముద్రాన్ని చేతులతో ఈదడమంత కష్టమైన పని అని తెలుసుకోలేక పోతున్నాడు. అర్జునుణ్ని ఆపి ఎదిరించలేమా..? యాదవ సైన్యంలో ఉన్న ధైర్యవంతులు అందరూ అర్జునుడి మీద యుద్ధానికి పదండి! అని అర్జునుడి మీద తిరగబడడానికి మహాసముద్రంలా బయలుదేరుతున్నారు యాదవ వీరులు.
బలరాముడు వాళ్లందరినీ శాంతంగా ఉండమని చెప్పాడు. తరువాత శ్రీకృష్ణుడితో “నీకు తెలియకుండానే అర్జునుడు సుభద్రని తీసుకుని వెళ్లిపోయేంత సమర్థత కలవాడా?” అని అడిగాడు.
బలరాముడి మాటలకి శ్రీకృష్ణుడు “భరతవంశంలో గొప్పవాడు, పాండవుల్లో గొప్పవాడు, అన్ని ధర్మాలు తెలిసినవాడు అర్జునుడు. సుభద్ర అతడికి మేనమరదలు. ఆమెని తీసుకుని వెళ్లడం తప్పు కాదు కదా? మీరు అతడి మీద దండెత్తి వెడితే అతడు మీకు అంత సులభంగా లొంగుతాడా? అర్జునుడు అన్ని అస్త్రాలు తెలిసినవాడు, ద్రోణాచార్యుడి శిష్యుడు, యుద్ధంలో ఓడిపోవడం అంటే ఏమిటో తెలియనివాడు అని మీకు తెలియదా?” అన్నాడు. వృష్ణి, భోజ, యాదవ వంశాల సైన్యం శ్రీకృష్ణుడి మాటని జవదాటలేక యుద్ధానికి వెళ్లడం అనే విషయాన్ని అక్కడితో ఆపేశాయి.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
ఓం నమః శివాయ-2
అక్షరాంజలి – పుస్తక పరిచయం
కథ విందువా
అందాల దీవులలో ఆహ్లాద యాత్రలు – లంకావి (మలేసియా)
పదసంచిక-81
స్వానుభవం
ఉక్కిరిబిక్కిరి చేసే ఉత్కంఠ – అన్వేషిప్పిన్ కన్డెత్తుం
అలనాటి అపురూపాలు-152
రక్తి కట్టిన నటసామ్రాట్
మార్పు మన(సు)తోనే మొదలు-19
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®