[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]


భీముడు ముందుకి వెళ్లడానికి వీలు లేకుండా దారికి అటు ఇటు పెద్ద పెద్ద చెట్లని పీకి అడ్డంగా పడేశాడు. ఒక్కళ్లే నడవడానికి వీలుగా ఇరుకుగా ఉండే కాలిబాటకి అడ్డంగా పడుక్కుని తోకని కదిలిస్తున్నాడు.
హనుమ తోకని కదిలిస్తుంటే వస్తున్న ధ్వని భయంకరంగా ఆ ప్రదేశమంతా ప్రతిధనిస్తోంది. అడవిలో ఉండే జంతువులన్నీ భయపడ్డాయి. కొండ గుహల మధ్యభాగం కంపించింది. ఇటువంటి భయంకరమైన ధ్వనిని ఇదివరకెప్పుడు వినలేదు అని ఆశ్చర్యపోయాడు భీముడు. అరటితోపు మధ్య ఒక పొడవైన పెద్ద రాతి మీద పడుకుని ఉన్న హనుమ దగ్గరికి వచ్చాడు.
పొట్టిగా బలిష్ఠంగా ఉన్న కంఠభాగము; కదలకుండా ఉండే పొడుగైన దవడ, నిలకడలేని స్వభావంతో ముచ్చటగొలుపుతూ; సన్నటి నడుము, గుండ్రటి మొల; నిప్పుకణంలా ఎర్రని పెదవులు; చాలా సన్నగా దంతాలు, గోళ్లు; మెరుపుతీగల సముదయంలా గోరోజనవర్ణంతో ఉండే కళ్లు; ఎత్తైన, బలిష్ఠమైన వక్షస్థలం; మోకాళ్ల వరకు ఉన్న పొడవైన చేతులు; చాలా ఎత్తైన జెండాలా ఎత్తుగా నిక్కపొడుచుకున్న తోక కలిగి ధర్మప్రవర్తనతో స్వచ్ఛమైన వ్యక్తిత్వంతో ధ్యానమనే గాఢనిద్రలో ఉన్న హనుమంతుణ్ని భీముడు చూశాడు.
అతడి నిద్ర చెడగొట్టాలని భయంకరమైన సింహనాదం చేశాడు. అది విని హనుమంతుడు నెమ్మదిగా కళ్లు విప్పి భీముడివైపు చూసి “అమితమైన వృద్ధాప్యము, రొగాల వల్ల నీరసపడి ఒక మూల నిద్ర పోతున్నాను కదా? తెలిసి కూడా నా నిద్రని ఎందుకు పాడుచేసావు?
జంతువులకయితే ధర్మం తెలియదు. అన్ని జీవులయందు దయ కలిగి ఉండాలి అనే ధర్మం తెలుసుకోగలిగినవాడు మనిషి. అటువంటి మనిషి జన్మని పొందినవాడివి పెద్దలనుంచి మంచీ చెడు నేర్చుకోలేదా? ధర్మ ప్రవర్తన లేకుండా నా వంటి అల్ప జీవులు భయపడేలా అంత పెద్దగా గర్జించావెందుకు? ఎవరు నువ్వు? ఈ అడవిలో దివ్యశక్తులు కలిగినవాళ్లు తప్ప తిరగలేరు. అమృతంతో సమానమైన పళ్లు, వేళ్లు తిని వెళ్లిపో. నీ మీద నాకు ప్రేమ కలిగింది కనుక చెప్తున్నాను. నేను చెప్పినట్టు చెయ్యి” అన్నాడు.
“కోతుల్లో గొప్పవాడా! నేను క్షత్రియుల్లో గొప్పవాడిని. మహావీరుడుగా పేరు తెచ్చుకున్నాను. పాండురాజు కొడుకుని. వాయుదేవుడి దయవల్ల కుంతికి పుట్టినవాణ్ని. ప్రజలు నన్ను భీముడు అని పిలుస్తారు. ఇప్పుడు నేను ఒక పనిమీద వెడుతున్నాను, దారి విడిచిపెట్టు!
నువ్వు దారి ఇవ్వకపోతే పూర్వం నూరామడల వైశాల్యంతో ఉన్న సముద్రాన్ని దాటిన ఆంజనేయుడిలా నిన్ను, ఈ కొండని కూడా అవలీలగా దాటి వెళ్లిపోగలను” అన్నాడు.
భీముడు దర్పంతో మాట్లాడిన మాటలు విని “ఏ కారణం వల్ల హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకి వెళ్లాడో నాకు చెప్పు” అన్నాడు ఆంజనేయుడు.
అతడికి భీముడు “గొప్ప ఇక్ష్వాకువంశంలో పుట్టిన మహాపురుషుడు, రఘువంశానికి చెందినవాడు శ్రీరాముడు పితృవాక్య పరిపాలన కోసం అరణ్యంలో నివసిస్తూ ఉండగా అతడి భార్య సీతాదేవిని లంకాధిపతి రావణుడు ఎత్తుకుపోయాడు.
సీతని వెతుకుతూ వెడుతున్న వానరనాయకులకి ‘సంపాతి’ అనే పక్షి సీత యోగక్షేమాల్ని గురించి చెప్పింది. ఆ సముద్రాన్ని దాటలేక కోతుల నాయకులు నిరాశపడుతుంటే హానుమంతుడు వాయుదేవుడికి ఉన్నంత శక్తితో సముద్రాన్ని దాటాడని విన్నాను. నేను కూడా హనుమంతుడికి ఉన్నంత శక్తిసామర్థ్యాలు ఉన్నవాడిని. నా పరాక్రమాన్ని చూపించమంటావా?” అని అడిగాడు భీముడు.
హనుమంతుడు చిరునవ్వు పైకి కనిపించకుండా “నేను ముసలివాడిని కనుక లేవలేను, నా తోకని కొంచెం పక్కకి నెట్టి వెళ్లు” అని చెప్పాడు.
భీముడు నిర్లక్ష్యంగా ఎడమచేత్తో హనుమంతుడి తోకని పక్కకి తొయ్యబోయాడు. తోక కదలలేదు. భీముడు రెండు చేతులతో పట్టుకుని కదిలించబోయాడు. కదలలేదు కాని, అతడి శరీరం మొత్తం చెమట నీటితో తడిసిపోయింది. గర్వం తగ్గి తలవంచుకుని సిగ్గుతో నిలబడ్డాడు.
కోతి తోకని కదల్చలేక భీముడు అతడికి నమస్కరించి “నిన్ను తెలుసుకోలేక నేను మాట్లాడిన మాటలకి నన్నుక్షమించు. నువ్వు కోతి ఆకారంలో ఉన్న సిద్ధుడివో, గంధర్వుడివో, దేవతలలో ప్రముఖుడివో చెప్పు” అని ప్రార్థించాడు.
హనుమంతుడు భీముణ్ని చూసి నవ్వుతూ “నేను కేసరి భార్య అంజనాదేవికి కొడుకుని. పూజ్యుడైన వాయుదేవుడి వరం వలన పుట్టినవాడిని. ఇంతకు ముందు నువ్వు చెప్పిన హనుమంతుణ్ని నేనే! నువ్వు నా తమ్ముడివే!
పూర్వం రఘువంశంలో జన్మించిన ప్రభువు శ్రీరాముడు.. రావణుడు అనే రాక్షసరాజు తన భార్య సీతాదేవిని అపహరించినప్పుడు సుగ్రీవుడు మొదలైన అనేక మంది వానర వీరుల సహాయంతో వారధి కట్టి, సముద్రాన్ని దాటి యుద్ధంలో రావణుడిని సంహరించాడు.
ఆ సమయంలో నా సేవకి మెచ్చి “నరులచేత, దేవతల చేత నీ కీర్తి ఎంతకాలం పొగడబడుతుందో అంతకాలం చిరంజీవిగా భూమి మీద వర్ధిల్లమని శ్రీరామచంద్రుడు నన్ను అనుగ్రహించాడు. తను పదకొండువేల యేళ్లు భూమిని పరిపాలించి స్వర్గాన్ని చేరుకున్నాడు” అని చెప్పాడు.
భీముడు ఆ వానరమే హనుమంతుడు అని తెలుసుకుని అతడికి మళ్లీ మళ్లీ నమస్కరించి “నిన్ను చూడడం వల్ల ధన్యుణ్నయ్యాను. నన్ను దయతలచి ఆనాడు నువ్వు సముద్రాన్ని దాటినప్పటి ఆకారాన్ని నాకు చూపించు” అని అడిగాడు.
హనుమంతుడు “భీమా! సముద్రాన్ని దాటే సమయంలో ఉన్నప్పటి ఆకారం ప్రదర్శించడం ఇప్పుడు ఎలా వీలవుతుంది. వేరువేరు స్థితిగతుల్లో అనేక మార్పులు వస్తాయి. అందువల్ల కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగాల పరిమాణ సంఖ్యలు వేరుగా ఉంటాయి. యుగాల్లో చేతనాచేతన పదార్థాలన్నీ వేరు వేరు పద్ధతులు కలిగి ఉంటాయి” అని చెప్పాడు.
హనుమంతుడి మాటలు విని భీముడు “యుగాలని బట్టి మారే నడవడికలు, సంప్రదాయాలు, అనుష్ఠానాల గురించి వివరించి చెప్పు” అని ప్రార్థించాడు.
నాలుగు యుగాల ఆచారాలు చెప్పిన హనుమంతుడు
ఓ భీమసేనా! కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంది. శాశ్వత స్వరూపమైన ధర్మంతో ఉండడం వల్ల బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వేదం చెయ్యమన్నట్టుగా ఒకే విధంగా నడుచుకుంటారు. వాళ్లకి కోరికలు ఉండవు కనుక, కోరికలు లేకుండానే సంక్రమించే ఫలితాలవల్ల ఉత్తమగతులు సంప్రాప్తిస్తాయి.
ఆ యుగంలో దుర్గుణాలు విజృంభించవు, మంచి గుణాలకి చెడు ఉద్దేశాలు ఆరోపించడం ఉండదు. శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి మంత్ర, తంత్రాలతో జరిపించే పనులు జరగవు. డాబు, పిసినిగొట్టుతనం, కలహస్వభావం, కోపం, ఓర్వలేనితనం, భయం, దుఃఖం, రోగం ప్రజానాశనం, ఇంద్రియపటుత్వం తగ్గడం ఉండవు. విష్ణుదేవుడు తెల్లటి రంగుతో ప్రజల్ని కాపాడుతూ ప్రకాశిస్తాడు.
ఇంక త్రేతాయుగంలో ధర్మం మూడుపాదాలతో నడుస్తుంది. ఆ యుగంలో ప్రజలు ఎప్పుడూ నిజం చెప్పడం అనే నిష్ఠతో ఉంటారు. యజ్ఞాలు, తపస్సు, దానం మొదలైన పుణ్యకార్యాల్ని చెయ్యడంలో ప్రజలు ఆసక్తి కలిగి ఉంటారు. త్రేతాయుగంలో విష్ణుదేవుడు ఎర్రటిరంగు కలిగి ప్రజల్ని కాపాడతాడు.
ద్వాపరయుగంలో ధర్మం రెండు పాదాలతో నడుస్తుంది. వేదాలు నాలుగు భాగాలుగా విభజించబడతాయి. వేదాల్లోను, శాస్త్రాల్లోను ప్రతిపాదించబడినట్టు నడుపబడుతూ ధర్మము, కామము భూమిమీద విలసిల్లుతాయి. ద్వాపరయుగంలో ప్రజలు నిజం మాట్లాడరు. అంతరేంద్రియ నిగ్రహం ఉండదు. చేసే యజ్ఞాలన్నీ కోరికలతో కూడుకుని ఉంటాయి. ముల్లోకాలతో పూజించబడే విష్ణుమూర్తి నీలవర్ణంతో లోకాల్ని రక్షిస్తాడు.
కలియుగంలో ధర్మం శక్తి తగ్గి ఒక పాదం మీదే నడుస్తుంది. కలియుగంలో ప్రజలు కోరికలు, కోపం మొదలైన అరిషడ్వర్గాలు పెంచుకుని తామెవరో తెలుసుకోలేని అమితమైన ఆవేశంతో అధర్మమార్గంలో నడుస్తారు.
కాని, కలియుగంలో చేసిన తపము, దానము వంటి మంచి పనులు కొంచెమే అయినా ఎక్కువ ఫలితాల్ని ఇస్తాయి. విష్ణుమూర్తి పసుపువర్ణంతో లోకాల్ని కాపాడుతాడు” అని హనుమంతుడు ఆ యా యుగాల్లో ఉండే తీరుతెన్నుల గురించి తెలియచెప్పి “నీ కోరిక నెరవేరుతుంది వెళ్లు!” అన్నాడు.
హనుమంతుడు చెప్పినది విని భీముడు “వానరశ్రేష్ఠా! పూర్వకాలంలో నువ్వు సముద్రాన్ని లంఘించినప్పటి రూపాన్ని నేను చూసి తీరాల్సిందే. అప్పుటివరకు నేను ఇక్కడినుంచి కదలను. దయచేసి నీ నిజస్వరూపాన్ని చూపించు” అని ప్రార్థించాడు.
హనుమంతుడు భీముడికి తన నిజస్వరూపాన్ని చూపించాడు. సాటిలేని రూపంతో ఇది రెండవ మేరు పర్వతమా అనిపించేటట్లు తన శరీరాన్ని పెంచి తోకతో దిక్కుల అంచులు తాకుతున్న హనుమంతుడి ఎత్తైన నిజస్వరూపాన్ని చూసి భీముడు కళ్లు మూసుకుని, మనస్సులో ఎంతో ఆశ్చర్యపోతూ భయపడుతూ హానుమంతుడితో “మహానుభావా! నీ ఆకారం ఎంత భయంకరమైంది? చాలా ఆశ్చర్యంగా ఉంది. నీ శరీరం భూమి ఆకాశాల మధ్యన గల మొత్తం ప్రదేశాన్ని ఆక్రమించేసింది. దయచేసి నీ నిజస్వరూపాన్ని ఉపసంహరించు” అన్నాడు.
హనుమంతుడు తన మమూలు స్వరూపాన్ని పొందాడు. శత్రువు సైన్యాన్ని చూసినప్పుడు తన శరీరం ఇప్పుడు చూసినదానికంటే రెడింతలు పెరుగుతుందని చెప్పాడు. ఆ ఆకారానికి పోలికే లేదని చెప్పాడు.
భీముడు “నువ్వు చాలా గొప్పవాడివి. అంత బలవంతుడైన రాక్షసుణ్ని నువ్వే చంపగలవు. అంత గొప్ప పరాక్రమం కలిగిన నిన్ను సహాయంగా తీసుకుని రఘువంశంలో జన్మించిన శ్రీరాముడు నరమాంస భక్షకులైన రాక్షసుల్ని చంపడం ఎమంత వింత కాదు” అన్నాడు.
హనుమంతుడు ఎంతో ప్రేమతో భీముడితో “నాయనా! నువ్వు నూరు రేకులు కలిగిన సౌగంధికాలు అనబడే తామరపువ్వులు గల కొలనుకి వెళ్లినప్పుడు తొందరపడి నీ శౌర్యాన్ని ప్రదర్శించకు. ఆ సరోవరాన్ని యక్షులు, రాక్షసులు కాపాడుతుంటారు. అది దేవతలకి సంబంధించింది.
దేవతలు ఆరాధనకి లొంగుతారు. బలులు, హోమాలు, నమస్కారాలవల్ల తృప్తి పొందుతారు. వాళ్లని ప్రసన్నుల్ని చేసుకోవాలంటే భక్తిభావం ఉండాలే కాని శౌర్యపరాక్రమాలు కాదు. నువ్వు నీ ధర్మాన్ని దీక్షతో ఆచరించు.
పరమధర్మాన్ని తెలుసుకో. ధర్మాధర్మ విచక్షణ పండితులనడిగి తెలుసుకో. మహాత్ములు ఎందరో అనుసరించ తగిన ప్రవర్తన కలిగి ఉంటారు. అదే ఉత్తమమైన ఆచారం అవుతుంది. అటువంటి ఆచారం నుంచే ధర్మం పుడుతుంది. ధర్మం వల్ల వేదం పాదుకుంటుంది. వేదాలవల్ల యజ్ఞాలు జరుగుతాయి. యజ్ఞాలు జరగడం వల్ల దేవతలు తృప్తి పొందుతారు.
కర్తవ్యాన్ని నిర్వర్తించడం కోసం సమయము, స్థలము తగినవో కాదో తెలుసుకుని సామ, దాన, భేద, దండోపాయాలు ఎలా ప్రయోగించాలో అలాగే ప్రయోగించి విజయాన్ని సాధిస్తారు. పనులన్నీ నెరవేరాలంటే ఆలోచన ఉండాలి. అది కూడా వివేకవంతులతో ఆలోచన చేయడం అవసరం.
చిన్నవాళ్లతోను, సంపదతో విర్రవీగేవాళ్లతోను, పిసినిగొట్టులతోను, నీచులతోను ఆలోచన చెయ్యకూడదు. దండించడము, దయచూపడము తెలిసిన రాజు శాసించడం వల్ల ప్రజలు తమ విధుల్ని మానకుండా సంతోషంగా గడుపుతారు.
నువ్వు దయ చూపించగలవు. దండించగలవు. నిన్ను చూడ్డం వల్ల నా కళ్లకి సార్థకత కలిగింది. నీకు ఇష్టమైనది ఏమిటో చెప్తే నేను దాన్నే చేస్తాను.
కురువంశానికే సింహంవంటి భీమసేనా! మీకు కీడు చేసిన శత్రువులు; బుద్ధిహీనులు; గుడ్డిప్రభువు కొడుకుల్ని సంహరించి హస్తినాపురాన్ని రాళ్లు రప్పలతో కప్పి ప్రవేశించడానికి వీలు లేని అడవిగా మార్చేసి నీకు సంతోషం కలిగించమంటావా?” అని అడిగాడు.
హనుమంతుడి మాటలు విని భీముడు “వీరుడా! ఎవరి సహాయము లేకుండా నువ్వు ఒక్కడివే శత్రువులు అందరిని యుద్ధంలో సంహరించగలవు. ఈ భులోకంలో మీ దయవల్ల మేము జయించలేని శత్రువులు ఎవరూ లేరు” అన్నాడు వినయంగా.
భీముడు చెప్పినది విని హనుమంతుడు “యుద్ధంలో నన్ను తలుచుకో. నేను మహావీరుడైన అర్జునుడి జండామీద ఉండి యుద్ధంలో మీ బలపరాక్రమాల్ని చూస్తాను” అని భీముణ్నికౌగలించుకుని సౌగంధికాలు అనే వేయిరేకుల బంగారు తామర పూవులు పూసే కొలనుకి దారి చూపించి మాయమయ్యాడు.
హనుమంతుడు కౌగలించుకోవడం వల్ల భీముడు అప్పటి వరకు కలిగిన శ్రమ పోయి నూతనోత్సహంతో ముందుకి కదిలాడు. భీముడు కుబేరుడి తోటలో సౌగంధిక కమలాలు ఉన్న సరోవరాన్ని చూసాడు.
దారిలో వెండికొండకి దగ్గరలో ఎత్తైన కొండ శిఖరాలు; వాటి మీద సంచరించే మేఘాలు, ఏనుగుల గుంపులు చూశాడు.
ఏవి ఏనుగులో, ఏవి మేఘాలో తెలియకుండ ఉన్నా.. మేఘాల్లో ఉండే విద్యుల్లతలు ప్రకాశిస్తుంటే ఏనుగుల్లో దంతాలు ప్రకాశిస్తున్నాయి; మేఘాలకి నీటిధారలు, ఏనుగులకి దానజలధారలు (మదించిన ఏనుగుల గండస్థలాల నుంచి కారే జలం) ఉన్నాయి. మేఘాలకి పిడుగుల ధ్వనులు, ఏనుగులకి ఘీంకార రావాలు ఉన్నాయి అందువల్ల ఇవి ఏనుగులు, ఇవి మేఘాలు అని వేరుగా చెప్పడానికి వీలు లేకపోయింది.
ఆ సరోవరంలో ఉన్న బంగారు తామరపూలలో ఉన్న తేనెల ద్రవాలతో తడిసిన వాయువు భీమసేనుడికి ఆహ్లాదం కలిగించింది. సౌగంధిక పుష్పాల్ని తీసుకుని వెళ్లడానికి గొప్ప శౌర్యంతోను, చేతిలో పెద్ద గదతోను వచ్చిన భీముణ్ని చూసి ఆ సరోవరాన్ని సంరక్షిస్తున్న పదివేలమంది రాక్షసులు వింత వింత ఆయుధాలు ధరించి వేగంగా వచ్చారు.
భీముణ్ని చూసి “ఇతడు గొప్ప తేజస్సుతో ఉన్నాడు, దివ్యపురుషుడై ఉండాలి. ఆయుధాలు ధరించి గొప్ప వీరుడిగా కనిపిస్తున్నా లేడి చర్మాలు ధరించి గొప్ప ఋషిలా కూడా కనిపిస్తున్నాడు” అని ఆశ్చర్యంగా చూశారు.
భీముడితో “ఇది దిక్పాలకుడైన కుబేరుడి తోట. దీని దగ్గరికి రావడానికి కూడ ఎవరు సాహసించరు.. ఈ తోటలో ఉన్న కొలనులో కుబేరుడు తన భార్యలతో కలిసి జలక్రీడలాడుతాడు.. ఈ కొలను గట్టు మీద దేవతలు, ఋషులు దైవపూజలు చేస్తారు.. ఈ సరోవరంలో నీళ్లు అమృతంలా ఉంటాయి.. సౌగంధిక పుష్పాలు బంగారు రేకులతో వైడూర్యమణి కాడలతో ఇంతకు ముందు ఎప్పుడూ, ఎక్కడా లేని సువాసనలతో ఉంటాయి.. యక్షరాక్షస భటులకి కలిగిన అక్షౌహిణీ సైన్యం కాపు కాస్తుంది.. ఇవన్నీ ఈ కొలను గొప్పతనం, తెలియక వచ్చి ఉంటావు. నువ్వెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు?” అని ప్రశ్నించారు.
భీముడు “నేను పాండురాజు కొడుకుని. నా పేరు భీముడు. ధర్మరాజుకి తమ్ముడిని. ద్రౌపది సంతోషం కోసం సౌగంధిక కమలాలు తీసుకుని వెళ్లాలని వచ్చాను. గొప్ప పరాక్రమం కలవాడిని కనుక ఎవరు అడ్డగించినా లెక్కచెయ్యకుండా తీసుకుని వెడతాను” అన్నాడు.
కుబేరుడి భటులు “నువ్వు సామాన్య మానవుడివి కావు. లోకాతీత శక్తులు కలవాడివి. నీకు సౌగంధిక పుష్పాల్ని తీసుకుని వెళ్లాలని ఉంటే మా దొర కుబేరుడికి చెప్పి తీసుకుని వెళ్లు. నువ్వు ధర్మరాజు తమ్ముడివి కనుక ధర్మమార్గం తప్పకూడదుకదా!” అన్నారు.
భీముడు వాళ్లవైపు చూస్తూ “ఈ కొలను కొండల్లో ప్రవహించే సెలయేళ్లవల్ల ఏర్పడింది. ఇది ఎవరి సొమ్ము కాదు. దీన్ని మొదట కుబేరుడు సంపాదించాడా? వీరుడైన క్షత్రియుడు ఇతరులని దానం చెయ్యమని అడగడు.
తన శౌర్య సాహసాలతో ఇతరులని జయించి తన వశం చేసుకుంటాడు. తనని అడిగినవాళ్లకి దానం చేసి తన కీర్తిని అన్ని వైపులా ప్రసరించేలా చేసుకుంటాడు.
నాకు మిమ్మల్ని అడగవలసిన పనిలేదు. మీ దొరగారు కుబేరుణ్ని అసలే అర్థించను. నా అంతట నేనే ఈ పుష్పాల్ని తీసుకుంటాను” అని కొలనులో దిగి సౌగంధిక పుష్పాల్ని తీసుకుని దాంట్లో ఉన్న నీళ్లు తాగి గొప్ప శక్తిని పుంజుకున్నాడు.
రాక్షసులు అతడితో యుద్ధానికి దిగి అతణ్ని గెలవలేక కుబేరుడికి చెప్పారు. కుబేరుడు ద్రౌపదిని సంతోషపెట్టడానికి భీముడు ప్రదర్శించిన శౌర్యాన్ని అభినందించి వదిలేశాడు. భీముడు సరోవరం గట్టు మీద లతలతో, చెట్లతో, పూలతో కళకళలాడుతున్న తోటలో విహరిస్తున్నాడు.
వేగంగా ఆగకుండా పిడుగులు పడ్డాయి. భూమి కంపించింది. దుమ్మువాన కురిసింది. దిక్కులన్నీ ఎరుపురంగు ధూళితో కప్పబడ్డాయి. చూట్టూ చీకటి వ్యాపించి పోయింది. అపశకునాలు చూసిన ధర్మరాజు ఆశ్చర్యపడి భయంకరమైన యుద్ధానికి సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగ ఉండాలి అనుకున్నాడు.
అన్నివైపుల చూశాడు. అతడికి భీముడు కనిపించలేదు. దగ్గరలో ఉన్న ద్రౌపదిని చూసి “భీముడు ఎక్కడ? అతడికి సాహసంతో చేసే పనులంటే చాలా ఇష్టం. కొంచెం కూడ భయం లేనివాడు. ఇక్కడ రాక్షసులు, గంధర్వులు తిరుగుతుంటారు. భీముడు అన్ని చోట్లకి ఒంటరిగా వెళ్లిపోతాడు. భీముడు తనంతట తనే ఎక్కడికైనా వెళ్లాడా? నువ్వు అతణ్ని ఎక్కడికైనా పంపించావా?” అని అడిగాడు.
“రాజా! నేను ఇచ్చిన బంగారు ఈ తామరపువ్వు పెద్ద గాలికి వచ్చి పడింది. అటువంటి పువ్వులు ఇంకా కావాలని అడిగాను. వాటిని తీసుకుని రావడానికి ఈశాన్య దిక్కుగా వెళ్లాడు” అని చెప్పింది.
ధర్మరాజు “మనందరం కూడ భీముడు వెళ్లిన వైపే వెడదాము” అన్నాడు.
అందరూ రాక్షసుల వీపుల మీద ఎక్కి ఆకాశమార్గంలో ప్రయాణం చేసి సౌగంధికపుష్పాలు ఉండే కొలను దగ్గరకి చేరుకున్నారు. అక్కడ గదాయుధాన్ని ధరించిన భీమసేనుణ్ని అతడితో చంపబడిన యక్షులు, రాక్షసుల శరీరాల్ని చూస్తూ బ్రాహ్మణులతో కలిసి ఉన్న ధర్మరాజు ఆశ్చర్యంతోను, చిరునవ్వుతోను చూశాడు.
భీముడు ధౌమ్యుడికి, రోమశుడికి, ధర్మరాజుకి నమస్కరించాడు. నకులసహదేవులు భీముడికి నమస్కరించారు. భీముడు వాళ్లని కౌగలించుకున్నాడు
వైడూర్యాల్లాంటి కాడలతో ఉన్న బంగారు తామరపూలని భీముడు ద్రౌపదికి ఇచ్చాడు. ధర్మరాజు భీముడితో “భీమసేనా! నువ్వు అందరికంటే గొప్ప పరాక్రమము, జ్ఞానము కలవాడివి. ఇటువంటి సాహసకృత్యాలు చెయ్యడం మంచిది కాదు. నా మీద ప్రేమ ఉంటే ఇకమీదట నువ్వు ఇటువంటి పనులు చేయవద్దు” అని మృదువుగా ఉపదేశం చేశాడు.
అందరూ కుబేరుడి తోటలో తిరుగుతున్నారు. ఆ తోటల్ని కాపాడుతున్న యక్షులు వచ్చి దేవర్షి రోమశుడికి, దేవేంద్రుడితో సమానుడైన ధర్మరాజుకి, బ్రాహ్మణులకి భక్తితో నమస్కారం చేసి “మహానుభావులారా! మీరిక్కడ విహరించద్దు. ఈ తోటలో యక్షులు, రాక్షసులు సంచరిస్తారు. ఈ ప్రాంతం చాలా భయంకరమైంది” అని చెప్పారు.
పాండవులు ఆ తోటకి దగ్గరగా వసతి ఏర్పాటు చేసుకుని రాక్షసులతోపాటు ఘటోత్కచుణ్ని కూడ వెళ్లిపొమ్మని చెప్పి అక్కడే ఉండిపోయారు. జటాసురుడు అనే రాక్షసుడు బ్రాహ్మణుడి వేషంలో వచ్చి“నేను వేదాలు చదివాను.. పరశురాముడికి శిష్యుణ్ని” అని చెప్పి వాళ్లని సేవిస్తూ అక్కడే ఉండిపోయాడు.
సింహంవంటి బలం కలిగిన భీమసేనుడు వినోదం కోసం వేటకి వెళ్లిన సమయంలో జటాసురుడు తన రాక్షసరూపం ధరించి ద్రౌపదిని, ధర్మరాజుని, నకులుడిని బలవంతంగా ఎత్తుకుని వాళ్ల ఆయుధాలతోపాటు తన వీపు మీద ఎక్కించుకుని వేగంగా పరుగెత్తాడు.
వాడిని చూసి బ్రాహ్మణులు భయపడ్డారు. సహదేవుడు భీముణ్ని పిలుస్తూ అడవిలోకి వెళ్లాడు. ధర్మరాజు రాక్షసుడితో “ప్రజల్ని గౌరవంగా కాపాడుతూ ఉండేవాళ్లం మేము. పరోపకారం చేసే మాకు కీడు చెయ్యడం ధర్మం కాదు. నీకు ధర్మం తెలియదు. నమ్మినవాళ్లకి, తిండి పెట్టినవాళ్లకి కీడు చెయ్యడం పాపం. మా ఆయుధాలు మాకిచ్చి మాతో యుద్ధం చెయ్యి” అని చెపుతూ ధర్మరాజు తన పొడవైన చేతులతో రాక్షసుణ్ని అదిమి పట్టుకుని అతడి నడక వేగాన్ని తగ్గించాడు.
రాక్షసుడు వేగంగా నడవలేక నెమ్మదిగా నడుస్తున్నాడు. అతడికి సహదేవుడు ఎదురుగా వెళ్లి “రాక్షసుడా! నేను పాండురాజు కొడుకుని సహదేవుడిని. నువ్వు నిలబడి నాతో యుద్ధం చెయ్యి. ఇప్పుడే నిన్ను ఓడిస్తాను” అన్నాడు.
జటాసురుణ్ని సంహరించిన భీముడు
సహదేవుడు జటాసురుడితో మాట్లాడుతున్న సమయంలో వాయువేగంతో భీముడు అక్కడికి వచ్చాడు. అతడికి ధర్మరాజు, నకులుడు, సహదేవుడు ఆకాశంలోను, సహదేవుడు నేలమీద కనిపించారు.
భీముడు జటాసురుడితో “మా దగ్గరికి అతిథివిగా వచ్చి మాతోపాటు తిండి తిని రాక్షసుడివై ఉపకారం చేసినవాళ్లకి అపకారం చెయ్యడం మంచి పనికాదు.
ఎంత చెడ్డవాళ్లైనా తిండి పెట్టినవాళ్లకు కీడు చెయ్యరు. నువ్వు మంచి ప్రవర్తన కలవాడవైతే వాళ్లని వదిలి పెట్టి నీ ప్రాణాలు నువ్వు దక్కించుకో. లేకపోతే బకుడిని, హిడింబుడిని, కిమ్మీరుడినీ, సంహరించినట్టే నిన్ను కూడా అవలీలగా చంపుతాను” అన్నాడు.
జటాసురుడు అందర్నీ వదిలిపెట్టి భీముడితో “ఆనాడు నీచేత యుద్ధంలో సంహరించబడిన బకుడికీ, హిడింబుడికీ, కిమ్మీరుడికీ ఈనాడు నీ రక్తంతో తర్పణ క్రియలు నిర్వహిస్తాను” అంటూ కోపంతో వాయుపుత్రుడు భీముణ్ని ఎదుర్కున్నాడు.
భీముడికి సహాయంగా నకుల సహదేవులు నిలబడ్డారు. నకులసహదేవుల్ని వద్దని చెప్పి భీముడు ఒక్కడే జటాసురుడితో తలపడ్డాడు. వాళ్లిద్దరి భీకరయుద్ధానికి భూమి కంపించింది.
వాళ్ల తొడలు తగిలి చెట్లు నాశనమయ్యాయి. బండరాళ్లతో యుద్ధం చెయ్యడం మొదలుపెట్టారు. బలపరాక్రమాల్లో ఒకరికొకరు తీసిపోకుండా ఇద్దరు వాలిసుగ్రీవుల్లా తలపడ్డారు. వాళ్లిద్దరి పిడికిలిపోట్లవల్ల వచ్చే భయంకరమైన చప్పుళ్లకి అడవిలో ఉండే జంతువులు, పక్షులు భయపడ్డాయి.
భీమసేనుడు యముడిలా విజృంభించి అప్పటికే బలహీనపడిన రాక్షసుడిని మెడ మీద తన పిడికిలితో గట్టిగా కొట్టాడు. రాక్షసుడు శరీరం ముడుచుకుపోయి కింద పడ్డాడు. జటాసురుడి దేహం నీలగిరికొండల కింద పడగానే భీమసేనుడు అతణ్ని పట్టుకుని పైకెత్తి ముక్కలయ్యేట్లు బండరాయి మీదకి విసిరాడు. జటాసురుడు మరణించాడు.
ధౌమ్యుడు, రోమశుడు బ్రాహ్మణ ప్రముఖులు భీముడి శౌర్యాన్ని ప్రశంసించారు” అని వైశంపాయనుడు జనమేజయమహారాజుకి ఎంతో ఆహ్లాదంగా వినిపించాడు.
అరణ్యపర్వంలోని (మొదటిభాగం) మూడవ ఆశ్వాసం సమాప్తం