[శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారి ‘మలిసంజ కెంజాయ!’ అనే నవలని సమీక్షిస్తున్నారు శ్రీమతి గోటేటి లలితాశేఖర్.]


కవిత, కాలమ్, కథ, నవల అనే ప్రక్రియలలో పదకొండు పుస్తకాలు ఆవిష్కరించిన సీనియర్ రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారు ప్రేమైక, ఆదర్శమూర్తి.
ఈ ‘మలిసంజ కెంజాయ’ నవల పన్నెండవది. వృద్ధులైన జంటలు, పిల్లలకు దూరంగా బతుకుతున్న వారు, జీవితభాగస్వామిని కోల్పోయి ఒంటరిగా బతుకుతున్న వారు, ముఖ్యంగా ఆడవారి సమస్యలను చర్చించింది ఈ నవల. చాలా పెద్ద కేన్వాస్ కలిగిన ఈ నవలాంశం. ఆర్థిక, సామాజిక, మానసికమైన అంశాలు భూమికగా కలిగిన సబ్జెక్టు.
ఈ నవల లోని పాత్రలన్నీ రచయిత్రికి జీవితంలో తారసపడ్డవారే. వారి పరిస్థితిని అత్యంత సహజంగా చూపించిందీ, చర్చించిందీ నవల.
ఒక ఆదర్శపాత్ర వసంత ఈ నవలా నాయిక. మరొక ప్రముఖ పాత్ర పార్వతమ్మ.
జీవితం ఇంతకంటే లేదు సుమా అని తేల్చి చెప్పేసిన మరొక పాత్ర విశాల. మిగిలిన స్త్రీ, పురుష పాత్రలన్నీ ఈ ప్రధాన పాత్రల చుట్టూ తిరుగుతాయి. అరవై వసంతాలు నిండిన వసంత, తమ ఇంటి పోర్షన్లో ఒంటరిగా జీవిస్తున్న ఎనభై సంవత్సరాల వయసున్న పార్వతమ్మను ఆదరంగా చూస్తూ వుంటుంది. కేవలం ఆదరణే కాక వారిమధ్య ఏర్పడిన స్నేహానుబంధాన్ని చాలా హృద్యంగా చూపించారు రచయిత్రి. తనను విస్మరించిన, ఇద్దరు కొడుకులూ, కోడళ్ళ పట్ల ఉదాసీన వైఖరితో, ఎలాంటి ద్వేషం భావం లేకుండా జీవించడంలో నేర్పుని ఎరిగిన వ్యక్తి పార్వతమ్మ.
వసంత ఇంటా బయటా, కుటుంబపరమైన, ముఖ్యంగా పెద్దలైన స్త్రీల మనోవ్యథలను అర్థం చేసుకుని, చేదోడు వాదోడుగా ఉంటూ, వారివారి సమస్యలన్నీ పరిష్కరించ గలిగినవే అని నిరూపిస్తూ, వారికి సహాయపడుతూ వుంటుంది.
కొద్దిపాటి చొరవ, సహనం, వివేకం, ప్రేమను, తన కజిన్స్, స్నేహితులు పట్ల చూపిస్తూ సమస్యలను పరిష్కరిస్తూ వారి మనసులను గెలుచుకుంటుంది.
ఇక పార్వతమ్మ, ఒంటరిగా ధైర్యంగా జీవిస్తూ, ఎవరి నించి ఏమీ ఆశించకుండా రోజులు గడుపుతూ ఉంటుంది. వసంత స్నేహం, అనుబంధం ఆమెకు లభించిన అదృష్టంగా భావిస్తుంది.
వసంతకు ఇద్దరు పిల్లలు, కొడుకు, కూతురు, వాళ్ళు పెరిగి పెద్దవారై పెళ్ళి చేసుకుని జీవితంలో స్థిరపడతారు. వసంత భర్త శాంతస్వభావుడు.
వసంత చుట్టూ వున్న పాత్రలు చాలావరకూ మధ్యతరగతి లేదా ఎగువ మధ్యతరగతికి చెందిన వారు, ఒక సాంప్రదాయిక మైన వాతావరణంలో జీవితాలు గడుపుతున్న వారే.
ఈ పాత్రలన్నీ రచయిత్రి జీవితంలోంచి పుట్టుకొచ్చిన వారే. అహంకారం, చిన్న చిన్న అపార్థాలూ, సరిఅయిన భావం ప్రసారం వ్యక్తుల మధ్య లోపించడం వల్ల ఏర్పడే సమస్యలను, ముఖ్యంగా అత్తా కోడళ్ళ మధ్య తలెత్తే సమస్యలను చర్చించేందుకు, పరిష్కరించే దిశగా ఈ నవల నడుస్తుంది.
చిన్న విషయాన్ని కూడా పెద్ద బండ లాగా తలపై పెట్టుకొని బాధపడుతున్న వసంత కజిన్ భానక్క సమస్యను సునాయాసంగా ఆమె పరిష్కరిస్తుంది.
రచనలో, సన్నివేశాలను సంభాషణలను, అత్యంత సహజంగా చూపిస్తారు గౌరీలక్ష్మి.
పార్వతమ్మ చిన్నకోడలు రాణి పాత్ర, వసంత కూతురు నిర్మల పాత్ర నెగెటివ్ కేరక్టర్స్. నవల చివరి కొచ్చేసరికి ఈ కేరక్టర్స్ పాజిటివ్‌గా మారతాయి.
ఒక ప్రయాణంలో తారసపడ్డ తన మిత్రురాలు కామాక్షి కాషాయ వస్త్రాలు కట్టుకుని కనబడుతుంది వసంతకు. ముక్తీ, మోక్ష సాధనకు ఆశ్రమ జీవితం గడపాలని ఆమె చెపుతుంది. మరి భర్తా, పిల్లలు కుటుంబ జీవితం గురించి వసంత ప్రశ్నించినపుడు కామాక్షి నెలలో కొద్ది రోజులు భర్త దగ్గరకు వెళ్ళి వస్తాననీ, అతని అవసరాలు చక్కబెట్టి వస్తాననీ చెపుతుంది. ఆశ్రమంలో హోమాలు, పూజలూ వుంటాయనీ చెపుతుంది.
ఇలా తాము నడుస్తున్న దారి ఎటువంటిదో తెలియక, స్పష్టత లేకుండా, ఆశ్రమవాసిగా సెమీ సన్యాసినిగా మారిన కామాక్షిని ప్రశ్నిస్తుంది వసంత.
ఆమె కన్ఫ్యూజన్ తొలగించి, లేదా హిపోక్రసీని ఎత్తి చూపిస్తుంది. ఇక్కడ మాటల ప్రభావంతో జీవిత విధానాన్ని మార్చేసుకున్న వ్యక్తికి మళ్లీ నాలుగు మాటలు చెప్పినంత మాత్రాన ఆ ప్రభావం ఏపాటిది? అన్న అంశాన్ని రచయిత్రి మరింత లోతుగా పరిశీలిస్తే బావుంటుంది.
మరొకపాత్ర దుర్గమ్మ, భర్త చిన్నవయస్సులోనే ఏక్సిడెంట్లో మరణిస్తే, ఏ ఆసరా లేకుండా పసిబిడ్డను వంటలు చేసుకుంటూ పెంచి చదివించి పెద్దవాడిని చేసి పెళ్లి చేస్తుంది. పెళ్లి అయ్యాకా తన భర్త తల్లితో ప్రేమగా వుండటాన్ని సహించచలేదు అతని భార్య.
భార్యను అదుపులో పెట్టుకోలేని అసమర్థుడైన తన కొడుకుపై కోపించిన దుర్గమ్మ వృద్ధాశ్రమంలో చేరిపోతుంది. అతడు వచ్చి ఎంత ప్రాధేయపడినా కూడా అతనితో వుండడానికి ఇష్టపడదు.
మరొక వ్యక్తి జానకమ్మ ఆమెదీ ఇదే పరిస్థితి. అయితే జానకమ్మ కొడుకుతో వెళ్ళిపోతుంది.
“అది తిండి కోసం వెళ్ళి పోయింది” అని చెపుతుంది దుర్గమ్మ.
వృద్ధాశ్రమంలో వుండే విభిన్న వ్యక్తుల జీవితాలను పరిస్ధితులనూ స్పష్టంగా చూపించారు రచయిత్రి.
రచయిత్రి గౌరీలక్ష్మిగారు ఆశావహ దృక్పథంతో, ఆదర్శభావాలతో ఈ నవలను రాశారు. చివరకు శుభం కార్డు పడుతుంది. నవల మధ్యలో ప్రవచనకారుడు రామమారుతి చేత జీవితానికి అవసరమైన, స్పష్టతనిచ్చే మంచి మాటలు చెప్పిస్తారు.
భక్తి, పూజల పేరుతో పట్టుచీరలు కట్టుకుని పూలసజ్జలతో గుడికి వెళుతూ ఇంట్లో ముసలి వాళ్ళ పట్ల అనాదరంతో ప్రవర్తించే ఆడవారి గురించి సెటైర్లు వేస్తాడు ప్రవచనకారుడు.
ఈ నవలలో మగవారు అందరూ మంచివారు, సంస్కారవంతులు. గృహ సమస్యలను పట్టించుకోకుండా వుండే ఆనంద స్వరూపులు.
ఈ నవలలో అట్టడుగు వర్గాల జీవిత చరమాంకంలో వుండే పరిస్ధితుల ప్రస్తావన లేదు. వృద్ధులైన పురుషుల జీవితాల గురించి కూడా లేదు.
అయితే ఆశ్రమ నిర్వాహకుడైన వేంకటేశ్వర్రావు గారు, ఒంటరి, వృద్ధులైన పురుషుల కోసం కూడా ఒక ఆశ్రమం పెట్టాలనే తన కోరికను చెపుతారు.
ఈ కోణం నించి కూడా గౌరీలక్ష్మి గారి నుంచి మరొక నవలను పాఠకులు ఆశించవచ్చు.
ఈ నవలలో ఒక ప్రేమ జంటను ప్రవేశపెడతారు రచయిత్రి. విశాల, మాధవ చదువుకునే రోజుల్లో ఒకరినొకరు ఇష్టపడతారు. కానీ పెళ్లి జరగదు.
పెద్దవారైన తర్వాత మాధవ భార్యను, విశాల భర్తను కోల్పోతారు. వారి పిల్లలు జీవితంలో స్థిరపడతారు.
విశాల సుమిత్ర అనే స్నేహితురాలితో కలిసి జీవిస్తూ వుంటుంది. మాధవ ఒక మాల్లో పని చేస్తూ ఒంటరిగా బతుకుతుంటాడు. ఒకరికొకరు తారసపడతారు. మాధవలో ప్రేమ చిగురిస్తుంది
ఇపుడు ఇద్దరూ కలిసి సహజీవనంతో జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలనే కోరికను చెపుతాడు విశాలకు మాధవ.
‘ఆరు పదులు దాటిన తర్వాత జీవితం అంటే బంధాలను వదిలించుకునే వయసనీ, బతుకు పట్ల మోహాన్ని, మమకారాన్ని నెమ్మదిగా విడిచి పెట్టేయవలసిన తరుణం’ అనీ చెప్పి విశాల మాధవ కోరికను సున్నితంగా తిరస్కరిస్తుంది.
అయితే అతని పట్ల ఆమెకు వున్న కన్సర్న్ తెలియజేస్తుంది. అతను ఎపుడైనా వచ్చి వెళ్ళవచ్చుననీ, అతనికి ఎలాంటి సహాయం కావాలన్నా తాము వున్నామని చెపుతుంది. మోహాలకు, ప్రేమకు మధ్య వున్న సన్నని గీతను చక్కగా చూపించారు గౌరీలక్ష్మి.
మర్యాద, సంస్కారం, విలువలు, పధ్ధతులు, నియమాలు ఇలాంటి మంచి భావజాలంతో, సంస్కారవంతమైన వాతావరణంలో పుట్టి పెరిగిన గౌరీలక్ష్మి ప్రతీ అంశాన్ని, సమస్యనూ ఆశావహ దృక్పథంతోనే తోనే చూస్తారు. ఈ భావాలనే నవలంతా పరిచారు.
‘మలిసంజ కెంజాయ’, నవల ఆకాశమంత విస్తృతి కలిగిన అంశం. పెద్ద కేన్వాస్ కలిగిన చిత్రం. ఈ కేన్వాస్‌లో కొంత భాగాన్ని మాత్రమే చక్కని వర్ణమిశ్రమంతో చిత్రించారు రచయిత్రి అని చెప్పాలి.
మనిషి మనసు కల్లోల సముద్రం. వారు వృద్ధులైనపుడు ఆటుపోట్లు మరింత పెరుగుతాయి. ఇలాంటి మానసిక స్ధితిని చూపించే ప్రయత్నం కూడా ఈ నవలలో భాగమై వుండాలి.
కుటుంబ సభ్యుల మధ్య చక్కని రిలేషన్షిప్, ఒక కుటుంబ, సామాజిక, ఆర్డర్‌ను తప్పకుండా ఇస్తుంది. కానీ వ్యక్తుల అంతరంగాల్లో వుండే ఘర్షణకూ, అలజడికీ ఇది పరిష్కారం కాదు. ఆలోచనారీతిలో, పరిపక్వతను సాధించినపుడు మాత్రమే ఇది సాధ్యం. వసంత కొంత వరకూ ఇటువంటి పరిపక్వతను సాధించిన వ్యక్తి.
తాను శాంతిగా జీవిస్తూ, తోటివారు కూడా ప్రశాంతంగా జీవించాలనే ఆదర్శంతో నడిచిన వసంత పాత్రలో నాకు మిత్రురాలు రచయిత్రి గౌరీలక్ష్మి కనిపించారు.
గౌరీలక్ష్మి గారి రచలన్నిటిలోనూ ఏ ప్రక్రియ అయినా నాకు నచ్చిన విషయం స్పష్టత, .చదివించే నేర్పు. ముఖ్యంగా అరవై నిండిన వయసున్న స్త్రీలకు, పాఠకులకు ఈ నవల అందుబాటులో వుంటే చాలా ప్రయోజనాలు వుంటాయని నమ్ముతున్నాను.
ఈ పుస్తకానికి ప్రొ. సి హెచ్ సుశీలమ్మ చక్కని ముందుమాట రాసేరు. రాలేటి పూల రాగాలను అందరూ వినలేరు. వినగలిగి, వినిపించగలిగే బృహత్ ప్రయత్నం చేసిన గౌరీలక్ష్మి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
***


రచన: అల్లూరి (పెన్మెత్స) గౌరీలక్ష్మి.
పేజీలు: 230
వెల: ₹ 200/-
ప్రతులకు:
9948392357
~
శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mrs-alluri-gaurilakshmi/

శ్రీమతి గోటేటి లలితా శేఖర్ గారి జన్మస్థలం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామం. ఇప్పటి వరకు వివిధ వారపత్రికల్లో వచ్చిన కథలు ముప్పై. ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం చేయబడిన కథానికలు నాలుగు.’రాగ రంజిత’ పేరుతో ఒక అనుబంధ నవల, ‘మూడో అందం’ పేరుతో వచ్చిన కథల సంపుటి. ‘ఐదు కలాలు ఐదేసి కథలు’ సంకలనం, ‘సంగమం’ కధల సంపుటి, పలు సభల్లో సాహితీ ప్రసంగాలు. 2018 లో యువ కళావాహిని వారి ‘తెలుగు వెలుగులు’ అవార్డ్ అందుకున్నారు. 2018 గుంటూరులో ఆదర్శ్ రోటరీ వారు ‘ది బెస్ట్ ఉమన్ రైటర్ ఆఫ్ గుంటూరు’ తో సత్కరించారు.
చదువు ఎం.ఎ. ఉద్యోగం – గుంటూరు అపెక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ నందు ఫ్యాకల్టీగా 14 ఏళ్ల అనుభవం. తండ్రి డా. భోగరాజు వెంకట జోగిరాజు, తల్లి శ్రీమతి భోగరాజు సీతా కృష్ణకుమారి, భర్త రాజశేఖర్, కొడుకులు కోడళ్ళు, డాక్టర్ చైతన్య, ప్రవల్లిక ఆదిత్య, ప్రియాంక.
చిరునామా: కంచర్ల పేరడైజ్- 2బి, శ్యామల నగర్, 5వ లైన్, గుంటూరు- 522006
5 Comments
కొల్లూరి సోమ శంకర్
ఇది గోళ్ళ నారాయణ రావు గారి వ్యాఖ్య: * నాకు మాత్రం, మంచి నవల అర్ధాంతరంగా, అసంపూర్తిగా,ఆగిపోయినట్లు అనిపించింది. ఇదే నవల మరో భాషలో అయితే, మరింత ముందుకు సాగేదేమో అనిపించింది.
ఆధ్యాత్మిక తాత్వికతను, సామాజిక తార్కికతను, రచయిత్రి తన కోణంలో రామమారుతి పాత్ర ద్వారా వివరించిన ప్రశంసనీయ ప్రయత్నం, పాఠకులు మానవీయ బంధాలను నిర్మించుకోవడానికి, తరచిచూచుకోవడానికి ఉపయుక్తం అనిపించింది. అల్లూరి వసంత గౌరీ లక్ష్మి గారికి అభినందనలు. … గోళ్ళ నారాయణ రావు, కామ్రేడ్ జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి, విజయవాడ.*
కొల్లూరి సోమ శంకర్
ఇది గుత్తికొండ సుబ్బారావు గారి వ్యాఖ్య: *నవల కాన్వాస్ చాలా పెద్దది.. సిరీస్ అఫ్ నవల్స్ వచ్చేంతది.. సమీక్షను బట్టి నవల ఆసక్తికరంగానే సాగినట్లు అనిపిస్తోంది.. కొన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారాలు వుండవు.. సర్దుకుపోవడమే.. అభినందనలు
– గుత్తికొండ సుబ్బారావు, బందరు.*
పుట్టి నాగలక్ష్మి
ఈ నవల కథాంశం విస్తృతపరిథి గలది..మరిన్ని సమస్యలను విశ్లేషిస్తే బావుండేదనిపిస్తుందనడం నిజమే!ముఖ్యంగా దిగువ, మధ్య, ఎగువ, మధ్య తరగతి వర్గాల మహిళల సమస్యలకు ప్రాముఖ్యమిచ్చినప్పటికీ, కొంతమంది అట్టడుగు వర్గాల మహిళలు ఆశ్రమంలో కన్పిస్తారు.రామ్మారుతి, పవన్, వసంత పాత్రలలో రచయిత్రి పరకాయ ప్రవేశం చేశారనడం అతిశయోక్తి కాబోదు.. సమకాలీన సమాజంలోని కుటుంబాల సమస్యలను గురించి వ్రాసిన రచయిత్రి అభినందనీయురాలు..మరొక మంచి నవల 2025 నాటికి అందించమని కోరుతూ.. మరోమారు అభినందనలు..
కొల్లూరి సోమ శంకర్
ఇది వారణాసి నాగలక్ష్మి గారి వ్యాఖ్య: *వెంటనే కొని చదవాలనిపించేలా ఉంది ఇతివృత్తం. ఫోన్ పే ద్వారా లభిస్తుందా?- వారణాసి నాగలక్ష్మి.*
షామీర్ జానకీదేవి
చాలా మంచి సబ్జెక్ట్ తీసుకుని రచయిత్రి గౌరీ లక్ష్మి గారు అద్భుతంగా రాసారు… కథను సమగ్రంగా విశ్లేషించిన లలిత గారికి అభినందనలు… సమకాలీన సమస్యను అన్ని కోణాల్లో ఆడవారి సమస్యలు కొంత వరకు తీసుకుని ఆసక్తికరంగా రాసిన గౌరీ లక్ష్మి గారికి అభినందనలు…