వాసుదేవ్‌ని ఇంటా, బయటా ‘అర్థంకాని పజిల్ లాంటి వాడ’ని అందరూ అంటుంటారు. ముందు వెనుకా ఆలోచించకుండా చేయాలనుకున్నది చేయడం, అనాలనుకున్నది అనడం.. ఏం జిరిగినా అది సీరియస్‌గా తీసుకోకుండా ‘జానేదేవ్’ అనడం చూసి, చిన్నప్పుడే కాదు పెద్దయ్యాక కూడా ఝలక్‌ల మీద ఝలక్‌లు తినిపిస్తూనే ఉన్న కొడుకుని చూసి బాధపడుతుంటాడు నిరంజనరావు.
రకరకాల మనస్తత్వాలు ఉన్న మనుషులు ఉంటారని తెలుసు కాని వాసుదేవ్‌లా ఆలోచించేవాళ్లని ఇప్పటివరకు తను చూడలేదు. “ఎమ్.సెట్లో సీట్ రాకపోతే స్వీటులు కొనకూడదా? తినకూడదా? ఫ్రెండ్స్ చేసుకుంటున పార్టీకి వెళ్ళకూడదా? మరి మనిషి చనిపోయినప్పుడు భోజనాలు, స్వీట్లు, నాన్ వెజ్‌తో సహా పెడతారు, అన్నట్లు గిఫ్ట్‌లు కూడా ఇస్తారు. మనిషి చనిపోయి బాధలో ఉన్నప్పుడే ఇన్ని చేస్తున్నప్పుడు కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ మంచి ర్యాంక్ వచ్చిందన్న సంతోషంలో పార్టీ ఇస్తున్నప్పుడు నాకు మంచి ర్యాంక్ రాలేదని పార్టీకి వెళ్ళి వాళ్ళని అభినందించకూండా, ఇంట్లో కూర్చోమంటారా నాన్నగారూ” అని వాసుదేవ్ అడిగిన ప్రశ్నకి ఒక్క నిమిషం ఆశ్చర్యపోయి, ‘హు’ అని ఒక్క నిమిషం నిట్టూర్చి “సరే నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి” అన్నాడు నిరంజనరావు.
“నా కొడుకు బంగారం, ఎంత గొప్ప మనసో చూడండి” అని మురిసిపోతున్న సుమిత్రని చూసి, “చాల్లే మనసు బంగారం అయితే బ్రతకడానికి సరిపోదు. వాసుదేవ్ డాక్టరో, ఇంజనీర్ పెద్ద చదువులు చదివి ఉన్నత స్థాయిలో చూడాలని నేను ఆశపెట్టుకోలేదు. జీవితం మీద అవగాహన లేని దేవ్ ఎలా బ్రతుకుతాడన్నదే నా బాధ” అన్నాడు నిరంజనరావు.
సమాజాన్ని పట్టి పీడిస్తున్న ముక్కు పచ్చలారని పసిపాపల నుండి వయసుడిగిన ఆడవాళ్లను కూడా వదలకుండా క్రూరంగా పైశాచికంగా రేప్‌లు చేసి మనుషుల మధ్య సంచరిస్తున్న క్రూరమృగాల లాంటి దుర్మార్గులను పట్టుకోవడం సవాలుగా పోలీసు డిపార్టమెంట్ అనుకుంటున్న సమయంలో అంతర్జాతీయ క్రిమినల్ రామ్‌లాల్‌ని చాకచక్యంగా పట్టుకొని చట్టానికి అప్పగించిన వాసుదేవ్‌ని పోలీస్ డిపార్టమెంట్, ప్రజలు ముఖ్యమంత్రిగారు సైతం అభినందించడం చూసి నిరంజనరావు కళ్లల్లో తడి చోటు చేసుకుంది.
నూతిలో కప్ప అదే ప్రపంచం అనుకున్నట్లు ప్రతీ మనిషి తన ఇల్లు తన సంసారం గురించే కాకుండా తమ పిల్లలను బాధ్యతయుతంగా పెంచుతున్నమా లేదా అని ఆత్మవిమర్శ చేసుకొని పిల్లలను పెంచి పెద్ద చేస్తే ఆడపిల్ల నిర్భయంగా బ్రతకగలదు. అటువంటి సమాజం కోసం తల్లిదండ్రులు నడుం కడితే చిన్నారి అసిఫా లాంటి అభం శుభం తెలియని చిన్నారులు అప్పుడే చెట్టుకి విచ్చుకునే గులాబి పువ్వుల లాంటి చిరునవ్వులతో మనకి కనబడతారు.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థను ఎంత పటిష్టం చేసినా ఎన్ని షీ టీమ్‌లు పెట్టినా, దాడులు, రేప్‌లు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి సమాజంలో ప్రతీ మనిషి తమ ఇంటి సమస్యగా భావించి మానవతా విలువలతో బ్రతకాలి… కాని కొందరు ఎవరికి వారే యమునా తీరులా ఉండే మనుషులున్నా.. కొందరైనా వాసుదేవ్‌లా సమాజం పట్ల గౌరవం చూపెట్టి కళ్లెదుట కనబడతున్న అరాచకాలను అరికడితే గాంధీగారు అన్నట్లు అర్ధరాత్రి కాకపోయినా పగలు నిర్భయంగా ఆడది బయటకు వెళ్ళి క్షేమంగా ఇంటికి రాగలదు.
(సశేషం)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™