‘ఉద్యోగం మనిషి లక్షణం’ అనుకుంటూ ఉదయానే బ్యాగ్ భుజానేసుకు బయలుదేరా. నగరమంతా దసరా నవరాత్రుల సందళ్లు. ఓ వైపు పూలపండుగ బతుకమ్మ, మరోవైపు దేవాలయాల్లో నవరాత్రి ఉత్సవాలు. కొంత జనాభా ఊళ్లకెళ్లటంతో ట్రాఫిక్ కాస్తంత తక్కువగా ఉంది. పండగ రోజులు కావటంతో షాపులన్నీ కూడా పూల అలంకరణలు, తదితరాలతో ముస్తాబయ్యాయి. తగ్గింపు ధరలు, ఆఫర్లు, బహుమతులు అంటూ వినియోగదారులకు వలలేస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు కూడా ఆకులతో, పూలతో, రంగుకాగితాలతో షోకు చేసుకున్నాయి. డ్రైవర్ ముందు మహిషాసుర మర్ధిని ఫొటో, చక్కటి పూలదండ. బస్ కాస్త ఖాళీగానే ఉంది. సీటు దొరికింది. ఇంకేం కావాలి. అనుకుంటుండగా డ్రైవర్ పాటలు పెట్టాడు..
ఆ..రి..ననన తానా..
‘ఒహ్.. మది శారదాదేవి పాట కదూ. డ్రైవరుకు మంచి అభిరుచి ఉన్నట్లుంది’ అనుకుంటూ చెవులప్పగించాను.
‘మది శారదాదేవి మందిరమే
కుదురైన నీమమున కొలిచేవారి..
మది శారదా దేవి మందిరమే..
రాగభావమమరే గమకముల..
నాదసాధనలే దేవికి పూజ.
తరళతానములే హారములౌ
వరదాయిని గని గురుతెరిగిన
మన మది శారదా దేవి మందిరమే..‘
నా మది సంతోషించింది. నాకిష్టమైన పాటల్లో ఇదొకటి.
మది.. కుదురు.. అది లేకనే కదా గొడవంతా.. మనసులో మనసు గురించిన శోధన మొదలైంది.. మది పదంకన్నా మనసనే పదాన్ని ఎక్కువ వాడతాం. మనసు కోతిలాంటిదని మనవాళ్లెప్పుడో చెప్పారు. చంచలమైందని కొందరంటారు. అందుకే కొందరికి చపలచిత్తుడంటూ పేరు పెడుతుంటారు.
మనసు ఓ క్షణం కూడా విశ్రాంతిగా ఉండదు.. తలపులు.. తలపులు. వాటి తాలూకు భావం కొద్దో గొప్పో ప్రతివాళ్ల ముఖంలోనూ ప్రదర్శిత మవుతూనే ఉంటుంది.
మనసెంతో చిత్రమైంది. అదొక రహస్యమాళిగ. సదరు వ్యక్తి చెప్పాలనుకుంటే తప్ప మరెవరికీ తెలియకుండా ఎన్నో రహస్యాలు మనసులోనే ఎంతకాలమైనా ఉండిపోతాయి. నిజానికి మనిషి మనసులో అనుకునేవి బయటకు తెలిసేటట్లయితే ఈ లోకమే తల్లకిందులైపోదూ. ప్రతి వారూ పరస్పరం బద్ధవైరులయిపోరూ! ‘మాయాబజారు’ సినిమాలో చూపించిన సత్యపీఠాలు, ప్రియదర్శినులు లేకపోబట్టిగానీ లేకపోతే ఇంకేమైనా ఉందీ? అప్పటికీ ఆధునిక సాంకేతికత నేరపరిశోధనకు ‘లై డిటెక్టర్’ను ప్రసాదించింది. దాని పనితీరు ఏ మేరకో సందేహమే. ప్రతివాళ్లకు మనసు ఉంటుంది అనుకుంటాం. అయితే సందర్భాన్ని బట్టి అదీ ప్రశ్నార్థకమే అవుతుంటుంది. సినీకవి రాజశ్రీ ‘పెళ్లిరోజు’ సినిమాలో ..
‘ఆనాటి చెలిమి ఒక కల
కలకాదు నిజము ఈ కథ
మనసులోని మమతలన్నీ మరచిపోవుట ఎలా..‘ అంటూ
‘మనసనేదే లేని నాడు మనిషికేది వెల
మమతనేదే లేనినాడు మనసు కాదది శిల‘ అని ఓ మంచి పాటను అందించారు. పి.బి.శ్రీనివాస్ గొంతులో ఆపాట మరింత మాధుర్యాన్ని సంతరించుకుంది.
అయితే మనసుకవిగా పేరొందిన ఆత్రేయగారు మాత్రం మనసు ఉంటే చిక్కే అని చెపుతూ ఓ హిట్ పాట రాశారు.. అది ప్రేమ్ నగర్ చిత్రంలో…
‘మనసు గతి అంతే..
మనిషి బతుకింతే.
మనసున్న మనిషికీ
సుఖములేదంతే..‘ అని తేల్చేశారు. ఆయనే మళ్లీ ‘ప్రేమలు.. పెళ్లిళ్లు’ చిత్రానికి రాసిన పాటలో
‘మనసులేని దేవుడు
మనిషికెందుకో మనసిచ్చాడు..
మనసు మనసును వంచన చేస్తే
కనులకెందుకో నీరిచ్చాడు..
ప్రేమనేది ఉన్నదా?
అది మానవులకే ఉన్నదా?
హృదయముంటే తప్పదా
అది బ్రతుకు కన్నా గొప్పదా?
ఏది సత్యం.. ఏది నిత్యం
చివరికంతా శూన్యం..శూన్యం..‘ అన్నారు.
జీవితంలోని కష్టసుఖాలు.. వాటి మోతాదులను బట్టి మనసును నిర్వచించుకోవడం పరిపాటి. ‘మనసావాచా నిన్నే వలచా
నిన్నే ప్రేమించా
నిన్నే తలచా.. నన్నే మరిచా
నీకై జీవించా..‘ అంటుందో ప్రేమిక.
మరో రాగమయి..
‘మనసే అందాల బృందావనం
వేణుమాధవుని పేరే మధురామృతం..‘ అని ఆలపిస్తుంది.
‘మనసే జతగా పాడిందిలే
తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో..హ..హహ..‘
ఓ జంట ప్రేమ పరవశం.
‘నీ మనసు, నా మనసు ఏకమై
నీ నీడ అనురాగ లోకమై
ప్రతిజన్మలోన జతగానెలాగే ఉందాములే..‘
ఆశిస్తుంది మరో జంట.
‘మనసులో ఏం ఉంటుందో. ఆబ్రహ్మకే తెలియాలి. ఒక్క మాటా చెప్పడు’ అని కొంతమంది మరో వ్యక్తిని అర్థంచేసుకోలేని సందర్భంలో అంటుంటారు. అంతెందుకు.. చాలా పురాణ కథల్లో భక్తాగ్రేసరులెందరో ఘోర తపస్సు చేయటం, దేవుడు అనుగ్రహించి ప్రత్యక్షమై ‘భక్తా! ఏం వరం కావలెనో కోరుకొమ్ము’ అని అడగటం తెలిసిందే. నిజానికి దేవుడికి భక్తుడి మనసు తెలియకనా? భక్తుడు చెపితే, ఆ ప్రకారం వరం ఇస్తే అదో అందం. కానీ కొన్ని మినహాయింపులుంటూ ఉంటాయి. కుచేలుడు, శ్రీకృష్ణుడి వద్దకు వచ్చినా ఏమీ అడగడు. భార్య ఎంతో నూరిపోసి పంపినా లాభం లేకపోయింది. కృష్ణుడు తన బాల్య స్నేహితుడే అయినా కూడా కుచేలుడు పెదవి విప్పి ఏమీ అడగడు. కానీ కృష్ణుడు అంతా గ్రహించాడు. కుచేలుడి ఉత్తరీయానికి కట్టి ఉన్న అటుకుల మూటను విప్పి, వాటిని ఆప్యాయంగా తిని, కుచేలుడికి సర్వ సంపదలు అనుగ్రహించాడు.
రామ భక్తుడు హనుమ, రాముడు ఏం వరం కావాలో కోరుకొమ్మంటే, ‘మీతో ద్వందయుద్ధం చేయాలని ఉంది’ అన్నాడట, ‘కాలాంతరమున నీ కోరిక తీరుతుందన్నాడ’ట రాముడు.
హనుమ అంతటివాడు ఆ కోరిక కోరుకోవడం అంటే మనసు తిరకాసు కాక ఏమిటి? మనసు తెలియడం అనగానే మరో మంచిపాట గురుతుకొస్తోంది..
‘మన సెరిగినవాడు మా దేవుడు.. శ్రీరాముడు
మధుర మధురతర శుభనాముడూ గుణధాముడు‘ అంటారు వేటూరి.
మనసెప్పుడూ ఏదో ఒక నస పెడుతూనే ఉంటుంది. అందుకేనేమో ‘మానస’ అనే పేరున్న అమ్మాయిని “మహా నస’ అని ఏడిపిస్తుంటారు. అన్నట్లు ‘మానసదేవి’ ఆలయం హరిద్వార్‌లో బిల్వపర్వతం మీద ఉంది. శక్తిరూపంగా కొలుస్తారు. మెట్లు ఎక్కలేనివారు క్రేన్‌లో వెళ్లి దర్శించుకుంటారు.
‘మనసా..కవ్వించకే నన్నిలా
ఎదురీదలేక కుమిలేను నేను
సుడిగాలిలో చిక్కినా నావను..‘ మరో విఫల ప్రేమికురాలు వాపోతుంది ఈ పాట విన్నప్పుడల్లా అక్కావాళ్ల బాబు గుర్తిస్తాడు. వాడు చిన్నప్పుడు ఈపాట తరచు పాడేవాడు. చిన్నవాడు. ఇంకా అన్ని పదాలు, భావాలు తెలియని బాల్యం. అందుకే ‘మనసా కవ్వించకే నల్లిలా’ అని వాడు పాడుతుంటే తను పకపక నవ్వేది.
త్యాగరాజులవారు సైతం
‘మనసులోని మర్మమును తెలుసుకో,
మానరక్షకా.. మరకతాంగనా..
ఇనకులాప్త నీవే గాని వేరెవరు లేరు
ఆనందహృదయ’ అంటూ ఓ కృతి అందించారు.
ఆయనే మరో కృతిలో
‘మనసా ఎటులోర్తునే
మనవిని చేకొనవే
దినకర కుల భూషణుని
దీనుడవై భజనచేసి దినము గడుపుమనిన నీవు
వినవదేల గుణవిహీన‘ అంటూ వేదన చెందుతారు.
మనసు, మది, గుండె, హృదయం.. ఇవన్నీ ఒకటే అర్థంలో వాడుతుంటారు. గుండె అనేది మనిషికి అతిముఖ్యమైన అవయవమైనా మనసనే అర్థంలో కూడా వాడటం వాడుకలో ఉంది. అందుకే..
‘సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా..సీతాలమ్మా..‘ పాటలో ‘అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే.. గుండేలేని మనిషల్లే నిను కొండాకోనల కొదిలేశాడా..’ అంటాడు.
నండూరివారు సైతం ‘గుండె గొంతుకలోన కొట్టాడుతుంది’ అంటారు. మనసులో ఉన్నది చెప్పటం కొన్నిసార్లు అంత సులభం కాదు. ఎలా చెప్పాలో అర్థంకాదు. ముఖ్యంగా ప్రేమ విషయంలో
అందుకే ప్రియమైన నీకు’ చిత్రంలో నాయిక..
‘మనసున ఉన్నది, చెప్పాలనున్నది
మాటలు రావే ఎలా?..’ అంటూ
‘అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే
బిడియం ఆపేదెలా
ఒకసారి దరిచేరి
ఎద గొడవేమిటో తెలపకపోతే ఎలా?’ అనుకుంటుంది.
అలాగే మనసుకు ఆత్మ, అంతరాత్మ పదాలను కూడా పర్యాయపదాలుగా వాడుతుంటారు. మనసు మూడ్‌ను బట్టి అది సన్నాయి కావచ్చు లేదంటే వీణ కావచ్చు మరేదైనా కావచ్చు.
‘మనసు పాడింది సన్నాయి పాట..’ అని సినారె రచిస్తే
‘మానసవీణా మధుగీతం.. మన సంసారం సంగీతం’ అని వేటూరి రాశారు.
ఆశీర్వదించేటప్పుడు ‘మనోభీష్టాభి సిద్దిరస్తు’, ‘మనోవాంఛా ఫలసిద్ది రస్తు’ అంటుంటారు. ఇక మనోభావాలు దెబ్బతినటం గురించి రోజూ పత్రికల్లో చదువుతూనే ఉంటాం. మన ప్రధాని నమో గారయితే తమ ‘మన్ కీ బాత్’ తరచు ప్రజలకు తెలియజేస్తూనే ఉంటారు. భౌతికంగా అంటే దేహానికి వచ్చే వ్యాధులయితే మందులతో నయం చేయవచ్చు కానీ మనోవ్యాధికి మందులేదు అని పెద్దల ఉవాచ. అది అక్షరసత్యం కూడా. మనసు టైటిల్‌తో గతంలో కోకొల్లలుగా సినిమాలు వచ్చాయి. మంచిమనసులు, తేనెమనసులు, లేత మనసులు, పాల మనసులు, మూగమనసులు, మనసంతా నువ్వే వంటివెన్నో. ‘మనసే మందిరం’ చిత్రం కూడా ఉంది. హిందీలో ‘దిల్ ఏక్ మందిర్’. ఇందులో ‘దిల్ ఏక్ మందిర్ హై’ అనే టైటిల్ సాంగ్ ఎంతో హిట్టయింది కూడా. దిల్ దార్, దిల్, హమ్ దిల్ దేచుకే సనమ్, దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే వగైరాలు.
ఆమధ్య కాలంలో వచ్చిన ‘దిల్ చాహ్తా హై’ మూవీలో టైటిల్ సాంగ్
‘దిల్ చాహ్తా హై కభి న బీతె ఛమకిలే దిన్
దిల్ చాహ్తా హై హమ్ న రహే కభి యారో కి బిన్..‘ హమ్ చేయని వాళ్లున్నారా.
గుండె గుప్పెడంతే ఉంటుందంటారు. అలాగే మనసూ గుప్పెడు. అన్నట్లు మనసు గురించి ప్రస్తావించుకుంటే బాలచందర్ చిత్రం ‘గుప్పెడు మనసు’ తలచుకోకుండా ఉండగలమా? ఓ పొరపాటు మనసుల మధ్య ఎంతటి అగాధానికి కారణమవుతుందో.. ఎంతకాలమైనా తీరనిదా వ్యధ.
ఆ చిత్రంలో బాలమురళీకృష్ణ పాడిన
‘మౌనమే నీ భాష ఓ మూగ మనసా…
తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరవుతావు
చీకటి గుహ నీవు,
చింతల చెలి నీవూ..
నాటక రంగానివే, మనసా తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో..
కోర్కెల శల నీవు కూరిమి వల నీవు
ఊహల ఉయ్యాలవే మనసా
మాయల దయ్యానివే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు..‘
మనసు పోకడను ఆత్రేయ ఎంత అర్థవంతంగా అక్షరాల్లో పొదిగారో.
మనసును గాయపరచటం ఎంత తప్పో చెప్పే పాట ‘మూగమనసులు’ చిత్రంలో ఆత్రేయగారే రాశారు. ‘మానూ మాకును కాను
రాయి రప్పను కానే కాను
మామూలు మనిషిని నేను
నీ మనిషిని నేను
నాకూ ఒక మనసున్నాది
నలుగురిలా ఆశున్నాది
కలలుకనే కళ్లున్నాయి, అవి కలతపడితే నీళ్లున్నాయి..
మనిషితోటి ఏళాకోళం ఆడుకుంటే బాగుంటాది
మనసుతోటి ఆడకు మామా
విరిగిపోతే అతకదు మల్లా..!‘
మనసుతోటి ఆటల వల్లే నిత్యం ఎన్ని హత్యలు, ఆత్మహత్యల అనర్థాలు జరుగుతున్నాయో తెలిసిందే.
మనిషి మనసు ఇరుకుగా, సంకుచితంగా ఉండకూడదు. ఉన్నతంగా, విశాలంగా ఉండాలి. మనసునెప్పుడూ నిరాశల చీకట్లు చుట్టుముట్ట కుండా చూసుకోవాలి. మంచి ఆలోచనలతో, ఆశలతో, ఆశయాలతో వెలిగించుకోవాలి. మనసు స్వచ్ఛంగా, సుందరంగా ఉండాలి. మనసులో కాసింత ప్రేమ, దయ, జాలి, మానవత వంటివి ఉండాలి. విషయాలను కేవలం చెవితోనే కాదు, మనసుతో వినాలి. మనిషి ఆకారానికిగాక మనసుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ‘మనిషి మరుగుజ్జు కావచ్చు, కానీ మనసు మరుగుజ్జు కాకూడదు’.
ఏ సంపదలున్నా, లేకున్నా మనసెరిగిన తోడుండాలి అనుకుంటుంటే శ్రీశ్రీ రాసిన మరో పాట గుర్తొచ్చింది.
‘మనసున మనసై బతుకున బతుకై
తోడొకరుండిన అదే భాగ్యమూ, అదే స్వర్గమూ..’
మనసు, మనసు గురించి విశ్లేషించుకుంటుండగానే కండక్టర్ ‘నెక్స్ట్ స్టాప్’.. అరవడంతో ఉలిక్కిపడి ఒక్క ఉదుటన లేచా. ‘అబ్బ! నా ఆలోచన ఎక్కడ మొదలై ఎక్కడిదాకా పయనించింది? మనోవేగం ముందు సూపర్ జెట్లు, రాకెట్లు కూడా బలాదూరే. క్షణంలో ఎక్కడికైనా వెళ్లగలిగేది మనసే. ఓ దృశ్యాన్ని నయనాలే చూసినా అనుభూతి చెందేది మనసే’ అనుకుంటూ బస్సు దిగగానే ఆఫీసు గుర్తొచ్చి, మనసు గురించిన ఆలోచనను అటకెక్కించి అటుగా వడివడిగా నా అడుగులు..
జొన్నలగడ్డ శ్యామల సీనియర్ జర్నలిస్టు. ఉదయం దినపత్రికలో పని చేసేవారు. వార్త దినపత్రికలో ఆదివారం అనుబంధం ఇన్ఛార్జ్ గా పని చేశారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. వృత్తి ధర్మంగా అసంఖ్యాకమైన కవర్ స్టోరీలు, ఫీచర్లు, పుస్తక సమీక్షలు రాసినవారు. శ్యామల 70కి పైగా కథలు రాశారు. ఆంధ్రప్రభ, యువ, ఉదయం, వార్త, ఇండియా టుడే లలో వీరి కథలు ప్రచురితమయ్యాయి. ముఖ్యంగా వీరి ‘పడక్కుర్చీ’ కథ అనేక ప్రశంసలు పొందింది. పలు హస్య కథలు కూడా రచించారు. కొన్ని కథలు ఇతర కథాసంపుటాలలో వచ్చాయి. కొన్ని కథల పోటీలలో బహుమతి గెలుచుకున్నారు. పూతరేకులు, సాలోచనం, సాధన, మానస సంచరరే, అన్నింట అంతరాత్మ వంటి కాలమ్‌లు రాశారు.
8 Comments
Guruprasad
Excellent narration by smtshyamala garu
From J guruprasad
Kandiyapedu
Ms Syamla garu in her latest episod on intimate feelings of heart has proved with distinct style of narration, no matter what the subject she chooses. Her mastery in weaving the write up using attractive prose is evident in every episode, including the present one
KANDIYAPEDU
prabhakaramsivvam
శ్యామలగారు వ్రాసిన వ్యాసం “మనసంతా మనసై”
ప్రారంభ వాక్యంలోనే శ్యామలగారు పూర్వకాలం నుండీ వచ్చే “ఉద్యోగం పురుష లక్షణం” అన్న ఒక సాంప్రదాయ వాక్యాన్ని-నానుడిని ఈ ఆధునిక యుగానికి అన్వయించే విధంగా తన మనసులో
వచ్చిన ఆలోచనతో “ఉద్యోగం మనిషి లక్షణం “అని
వ్రాసారు.అదీ కాలానుగుణంగా వచ్చిన మార్పులను గమనించిన మనసు చేసిన పని.మనసు కలిగించిన
సంతోషాలు,ఆనందాలు,బాధలు,విషాదాలు
వినోదాలు,ప్రేమమయమైన ఆరాధనలు,ఆరాటాలు ఆమె వ్యాసంలో వర్ణించబడ్డాయి.జీవితంలో ఉన్న
సుఖాలు,ఆనందాలు,ఆహ్లాదకరమైన ఆలోచనలు
మనసుతోనే ముడిపడి ఉన్నాయనే నగ్నసత్యాన్ని
శ్యామలగారు తెలియపరచారు. మనసు స్వచ్ఛంగా,
సుందరంగా ఉండాలి. మనసులో ప్రేమ,దయ,జాలి, మానవత వంటివి ఉండాలి.మనిషి మరగుజ్జు అయినా
ఫర్వాలేదుకానీ మనసు మరగుజ్జు కాకూడదు అన్న వాక్యాలు మానవ జాతిని ఎంతో ప్రభావితం చేస్తాయి.
శ్యామలగారి మనసు చెప్పిన వాక్యాలు కోట్లాదిమంది మనసును మార్చి దేశప్రగతికి మార్గాన్ని ఏర్పాటు చేస్తాయి.శ్యామలగారి మనసుకు అభినందనలు.
శివ్వాం.ప్రభాకరం,బొబ్బిలి.
Ramana Velamakakanni
Excellent narration. Syamala garu is the best story teller. Abhinandanalu.
విరించి
మనసు గురించి రాయడం మాటలు కాదు…ఎంతరాసినా ఇంకాఎంతో మిగిలేఉంటుంది…ఎంతమంది ఎంత తడిమినా మనసు లోతు కనుగోనడం అసాధ్యం..అది సుసాధ్యం చేసే ప్రయత్నమే శ్యామలగారి’ మసంతా ననసై’…మనసైన చక్కని గీతాల్ని నెమరవేసుకుంటూ సాగిన ప్రయాణం …అధ్భుతం…అభినందనలు శ్యామలగారూ !
m.ramalakshmi
మనసు గురించి చక్కని కథను అందించిన శ్యామల గారికి అభినందనలు. మనసా కవ్వించకే నల్లిలా …ఇలా హాస్యభరిత సందర్భాలతో పాఠకుల మనసును ఆకర్షించేలా కధలను అందిస్తున్న శ్యామల గారికి శుభాభినందనలు.
vidadala sambasivarao
శ్రీమతి శ్యామల గారి”మనసంతా మనసై”మనసును ఊయలలూపింది.సమాజంలోని ప్రతి మనిషి మానసిక ప్రశాంతతను కోరుకుంటాడు.సంపద ఎంత వున్నా మానసిక ప్రశాంతత లేని జీవితం వృధా.కమనీయమైన …రసభరితమైన ఉదాహరణలతో శీర్షికను పాఠకుల హృదయాలకు చేరువ చేశారు శ్యామల గారు….అభినందనలు.
కళాభినందనాలతో
విడదల సాంబశివరావు.
Bhramara
మనసు పలికిన సుస్వరాల రాగమాలికతో ఆర్టికల్ ఆద్యంతం ఎంతో ఆహ్లాదభరితంగా ఉంది. ఇంత చక్కటి ఆణిముత్యాన్ని అందించిన రచయిత్రి శ్యామల గారికి ప్రత్యేక అభినందనలు

