తెలుగు కథా సాహిత్యంలో ‘ఇలాంటిది మరొకటి లేదు, రా(లే)దు కూడా’ అనిపించే కొన్ని ఉత్తమోత్తమ కథలు వచ్చాయి. కొన్ని ఉదాహరణలు ఇవ్వాలంటే- శ్రీపాదవారి ‘వడ్లగింజలు‘, ‘గులాబీ అత్తరు‘; వేలూరి వారి ‘పిత్తల్కా దర్వాజా‘, శ్రీశ్రీ ‘ఒక చావూ-ఒక పుట్టుకా‘, మల్లాది వారి ‘చూర్ణిక‘; సురవరం వారి ‘గ్యారాకద్దూ బారా కొత్వాల్‘; చింతా దీక్షితులు ‘సుగాలీ కుటుంబం‘; చలం ‘ఓ పువ్వు పూసింది‘; చా.సో ‘ఎంపు‘; మునిపల్లెరాజు ‘బిచ్చగాళ్ల జెండా‘, రావిశాస్త్రి ‘పిపీలికం‘… ఇలా… ఇలా… ఇంకా… అల్లం రాజయ్య ‘మహాదేవుని కల‘; ఛాయాదేవి ‘సుఖాంతం‘; శేషగిరిరావు ‘వరడు‘; ఇనాక్ ‘కట్టడి‘, జూపాక సుభద్ర ‘ఆగమైన తొవ్వ‘; తుమ్మేటి ‘సెజ్‘; బిఎస్ రాములు ‘పాలు‘, పెద్దింటి అశోక్ కుమార్ ‘జిద్దు‘; శిరంశెట్టి కాంతారావు ‘గరికపోచలు‘; యాజ్ఞవల్క్యశర్మ ‘సెలవయ్యింది‘; సమ్మెట ఉమాదేవి ‘రేలపూలు‘… ఇంకా చాలా ఉన్నాయి. ఈ పట్టిక పెద్దది.
ఏమిటీ వీటి ఘనత? అంటే, వస్తువుని గ్రహించడంలో, దాని ఎన్నికలోనే ఒక విలక్షణత ఉన్నది. అప్పటివరకూ అలాంటి కథ రాకపోవటం మాత్రమే కాదు; దానిలో నిక్షిప్తమైన కథా బీజంతో మరో కథ-దాని దరిదాపుల్లోకి కూడా వచ్చే అవకాశం లేకపోవటం. ఒకవేళ వచ్చినా ఒకటి- ఆ కథ ‘పిల్లవసుచరిత్ర’గా నిలవాల్సిన పరిస్థితి ఉండటం, రెండవది శిల్ప విశేషంతో కథని అనుభూతిప్రదం చేయటం. నేను పైన చెప్పిన కథల్లోని ఆయా గుణ విశేషాల్ని కథాప్రియులు చాలామంది ఆనందించే ఉన్నారు. వాటిని నేను పునరుక్తి చేయను. ఇప్పుడు ఈ వ్యాసం ఉద్దేశం-గత పదిపదిహేను సంవత్సరాల కాలంలో వచ్చిన ఇలాంటి విలక్షణ కథల్ని ‘సంచిక’ పాఠకులకు పరిచయం చేయటం.
ఈ సిరీస్‌లో మొదటి కథ – ‘అర్థంకాని అక్షరాలు‘. రచయిత గోపరాజు నారాయణరావు (సాక్షి ఫన్ డే : సెప్టెంబరు 6) (నవలాకారులుగా వారు రాసిన ‘ఆకుపచ్చ సూర్యోదయం’ నవల విశేష ప్రాచుర్యాన్ని పొందింది).
నారాయణరావు గారు చాలా అరుదుగా చాలా మంచి కథలు రాసే రచయిత. ‘క్షమార్పణం’ అనే సంపుటిని తెచ్చారు గతంలో. ఆ సంపుటిలో ‘ఉషస్సులు దాగిన ఉత్తరం’, ‘ఆ చీకటికోణం’ అనే రెండు కథలు చదివి-నేను నిద్రలేని రాత్రులు గడిపాను. మొదటి కథ ‘మద్దూరి అన్నపూర్ణయ్య’గారి జైలు జీవితం, ఆయన భార్య వెంకట రమణమ్మగారి మరణం విషాదగాథ. ఒక చారిత్రక వాస్తవంలో, సామాజిక సత్యాన్నీ, మానవీయ ఉద్వేగాన్నీ మిశ్రీకరించి రాసిన కథాశిల్పం అది. రెండో కథ – అల్లూరి సీతారామరాజు జీవితంలో చివరిరోజు సంభవాన్ని చిత్రించింది. ‘రామరాజు చితి జ్వలిస్తోంది – రెండో సూర్యోదయంలా’ అని చివరి వాక్యం.
నారాయణరావు గారు అపురూపమైన చరిత్ర ఘటనల్ని కథావస్తువుల్ని చేసుకుని-(అ)పూర్వమైన కథల్ని రాయటంలో తమ ప్రతిభావ్యుత్పత్తుల్ని దృష్టాంతీకరిస్తున్నారు. ఈ ‘అర్థంకాని అక్షరాలు’ కథ కూడా ఆ కోవకి చెందినదే.
‘పరబ్రహ్మశాస్త్రి అంటే ఈ తరమే కాదు, ఈ దేశం చూసిన గొప్ప ఎపిగ్రాఫిస్ట్’, వందల ఏళ్ల నాటి శిలాశాసనాలూ, ఫలకాలూ చదవటం, వెలికి తీయటంలోనే ఆయన సగం జీవితం గడిచిపోయింది. ఇప్పుడు వయస్సు తొంభై ఏళ్ల పైమాటే.
ఇంటర్వ్యూ చేయటానికి వెళ్తే ఆ శాస్త్రి చెప్పిన సంఘటనల జాలు – ఈ కథ ఇతివృత్తం. ఆయన చిన్నతనంలో వారాలు చేసుకుని చదువుకున్నాడు. వారాల కుఱ్ఱాడి జీవితం అదో గాథ. ఒక ఇంట్లో వారానికి వెళ్లవలసిన రోజున – (పిఠాపురం)- కుండపోతగా వాన. వెళ్లలేక ఆకలితో అవస్థపడలేక, ఆ యింటివారు వేచి ఉంటారేమోననే బాధతో – మోకాళ్లలోతు నీళ్లలో నడుస్తూ బయల్దేరాడు. పురుహెతికాంబ ఆలయం దగ్గరికి వెళ్లేసరికీ- ‘పరం’ అంటూ పిలుపు. ఆ పిలుపు – ఆ వారం ఇచ్చిన గృహస్తుది. ఇతని కోసం ఆయన గుబ్బ గొడుగు వేసుకుని, అంగవస్త్రం ఎగ్గట్టి వాననీళ్లల్లో కాళ్లీడ్చుకుంటూ వస్తున్నాడు!
బక్క శరీరాలు. గాలికీవానకీ కొట్టుకుపోకుండా ఇల్లు చేరారు! ఈ ఘటన చెప్పి పరబ్రహ్మశాస్త్రి ఒక ఆగంతకుని పరిచయం చేశారు. అరవై ఏళ్ల తర్వాత ఈయన్ని చూడటానికి నేదునూరి సాంబశివరావు అనే ఆయన విజయనగరం నుండి వెతుక్కుంటూ వచ్చాడు. కాలాతీతమైన అనుభూతిని పంచుకున్నారు. అప్పుడు – శాస్త్రి ఈనాటి విద్యార్థుల బలవన్మరణాలు గురించి మాట్లాడారు. విద్యార్థి ఉపాధ్యాయుల మధ్య ఛిద్రమైన అనుబంధాల గురించి చెప్పారు. తమకిష్టమైన చదువు చదువుకోనీయకుండా తల్లిదండ్రులు చేస్తున్న కట్టడి గురించి మాట్లాడారు. చివరికి ఆయనంటారు, “ఆరోజు వర్షంలో వెంకట శివయ్యగారు గొప్పమనసుతో కాస్సేపు పట్టిన గొడుగు ఇప్పటికీ నా శిరస్సుమీదే ఉన్నట్టనిపిస్తుంది. చిన్న విషయంలా అనిపించినా, ఈ వయసు దాకా అదే అనుభూతికింద బతికాననిపిస్తోంది. ఆ అనుభూతికిందనే ఉంది నాదైన భరోసా కూడా” అని!
ఆనాటి గురుశిష్య సంబంధంలోని అనుభూతి పారమ్యానికీ, ఈ తరంవారు ఆలోచించవలసిన ఆవశ్యకతని ఉన్నతీకరిస్తోందీ కథ. ఒక చారిత్రక సంభవాన్ని ఆధారభూమికని చేసి, సమకాలీన వాస్తవాన్ని ఆ సంభవంతో అనుసంధానం చేసి ఒక మంచికథని అందించారు రచయిత. కథావస్తు స్వీకరణలో, దానికి ఇతివృత్తాన్ని సమకూర్చుకోవటంలో – కథకుడు తన సామాజిక బాధ్యతని అంతస్సత్వంగా నిలుపుకున్నారు. వర్తమాన సమాజావగాహనని ఆలోచనాత్మకం చేస్తూ – పాఠకులకి ఒక వాంఛనీయమైన, ఆచరణీయమైన సందేశాన్ని ధ్వనించారు. ఆ ధ్వని కథాత్మకమూ, కళాత్మకమూ కూడా అయింది! అందుకూ ఇది మంచి కథగా పాఠకుల ఆదరణని పొందింది.
చదివి దానిలోని విలక్షణతనీ, విశిష్టతనీ కూడా ఆనందించండి. నారాయణరావు గారికి అభినందనలు.
విహారిగా ప్రసిద్ధులైన జె.ఎస్.మూర్తి రచయిత, సాహితీ విమర్శకులు. జీవిత బీమా సంస్థలో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ జనరల్ మేనేజర్‌గా పనిచేశారు. 15 కథా సంపుటాలు, 15 విమర్శనాత్మక వ్యాస సంపుటాలూ, ఆరు కవితా సంపుటాలూ, ఐదు నవలలు వెలువరించారు. ఈనాటి రచయితల 400 తెలుగు కథలపై వీరి విశ్లేషణాత్మక వ్యాసాలు సాహిత్యంలో ఒక రికార్డు.
తెలుగు కథ ఆణిముత్యాల్ని ఏరి అందించారు. ముందునుంచీ మనం మద్రాసీలుగా ముద్ర వేయించుకుని ఉండి పోవడం వలననే మన కథ చేరుకోవలసిన స్ధాయికి చేరుకోలేక పోయింది. తెలుగు కథకి నిజం సాటి లేదు. మంచి విషయాల్ని ముచ్చటించిన విహారిగారికి అభివందనలు.
Great analysis of good stories of yesterday years. Your narration made readers feel like going through those PEARLS fully. Thank you.
మంచి కథను పరిచయం చేశారు. విహారి గారికి ధన్యవాదాలు
విహారి గారికి కృతజ్ఞతలు. గోపారాజు నారాయణ రావు గారి ‘ఆకుపచ్చని సూర్యోదయం’ చదివాను. కానీ ఆయన వ్రాసిన ఈ కధ గురించి తెలియదు. ఇతివృత్తం, ఒక సంఘటన అద్భుతంగా ఉన్నాయి. పూర్తి కధా, దాంతోబాటు ఆయన మిగతా కథలూ చదవాలి. అలాంటి ఉత్సుకత రేపారు మీ సమీక్షతో. అంతేనా! అంటే ఎన్నో అనిముత్యాల లాంటి కధలను పేర్కొన్నారు. సగం చదవనివే. అవీ చదవాలి. ధన్యవాదాలు విహారి గారూ. రాజా.
Crisp analysis of stories of legends
తెలుగుకథలలోని ఆణిముత్యాలను ఏరి అందించిన విహారి గారికి ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™