ఓ హేమంత సాయంత్రం! ఇంట్లో ఎవరూ లేనందున ఏకచ్ఛత్రాధిపత్యం. కొన్నిసార్లు ఏకాంతం ఎంతో ఆనందం. అంతా నా ఇష్టం అనుకోగల సమయం కదా మరి. చిందరవందరగా ఉన్న ఇంటిని కాసింత సర్దుతూ, పనితో పాటు పాట ఉంటే బాగుంటుందని పాత పాటలు వినటం మొదలు పెట్టాను.
అందమె ఆనందం… ఆనందమె జీవిత మకరందం…
ఆ పైన..
నిన్నలేని అందమేదో నిదురలేచే నెందుకో… నిదురలేచెనెందుకో..
అలా అలా పాటల పయనం సాగుతూ…
‘కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి… కలలే..
నా కలలో నీవే కనబడితే ఆ చొరవకు బలమేమి.. మరులే..
మరులు మనసులో స్థిరపడితే ఆ పై జరిగేదేమి… మనువూ.. ఊఊఊ
మనువై ఇద్దరు ఒకటై తే ఆ మనుగడ పేరేమి.. సంసారం..!
వింటుంటే నాకు ఆ పాట ప్రత్యేకంగా అనిపించింది. ఎందుకంటే మధురగీతాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇలా ప్రశ్న, జవాబులతో భిన్నంగా ఉండేవి కొన్ని మాత్రమే. ఆ శైలే ఆ పాటకు ప్రత్యేకతను చేకూర్చుతుంది. సుమంగళి చిత్రానికి ఆత్రేయ రాసిన ఈ పాటలో ప్రశ్నలు పెద్దవిగా, జవాబులు మాత్రం ముచ్చటగా మూడక్షరాల్లో ఉండటం మరో ప్రత్యేకత.
ప్రశ్న-జవాబు స్టైల్లో ఉండే మరో మధురగీతం ‘లక్షాధికారి’ చిత్రంలో ఎన్టీఆర్, కృష్ణకుమారి మీద చిత్రీకరించిన పాట గుర్తిస్తోంది. అది..
మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది…
మబ్బులో కన్నీరు నీ మనసులో పన్నీరు..
తోటలో ఏముంది నా మాటలో ఏముంది..
తోటలో మల్లియలు నీ మాటలో తేనియలు..
చేనులో ఏముంది నా మేనిలో ఏముంది..
చేనులో బంగారం నీ మేనిలో సింగారం.. ..
ఇలా సాగి చివరకు
నేనులో ఏముంది నీవులో ఏముంది..
నేనులో నీవుంది, నీవులో నేనుంది..
అని ముగుస్తుంది. సినారె ఈ పాట ఎంత బాగా రాశారో!
అసలు మనిషి జీవితమే ప్రశ్నలమయం. జీవితం ఓ పెద్ద ప్రశ్న కూడా. తెల్లవారి లేస్తే టైమెంతయింది? దగ్గర్నుంచి ప్రశ్నలమీద ప్రశ్నలు మనలో మనం వేసుకుంటాం, ఇతరులనూ ప్రశ్నిస్తాం. ఏదైనా అర్థం కానప్పుడల్లా మన ముఖంలోనూ వ్యక్తమయ్యేది ప్రశ్నార్థకమే. మనిషికి కలిగే అనేకానేక సందేహాలే ప్రశ్నలు. అసలు కొన్ని ప్రశ్నలకు ఎప్పటికీ కరెక్టు జవాబు ఉండదు. విత్తు ముందా, చెట్టు ముందా, కోడి ముందా, గుడ్డు ముందా.. వంటి ప్రశ్నలు ఇటువంటివే. దైవాన్ని గురించిన ప్రశ్నలయితే ఎన్నెన్నో..
అలనాడు భక్త ప్రహ్లాదుడు
“ఇందుగలండందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి! వింటే”
అని ప్రహ్లాదుడు చెప్పగానే హిరణ్యకశిపుడు ‘అయితే నీ హరిని ఈ స్తంభంలో చూపించు’ అని గదతో స్తంభాన్ని కొడతాడు. వెంటనే స్తంభంలోంచి నరసింహస్వామి ఉగ్రరూపంతో ప్రత్యక్షమై హిరణ్యకశిపుడిని ఒళ్లోకి లాక్కుని, ఉదరం చీల్చాడు. భారతంలో యక్ష ప్రశ్నల ఉదంతం ఉంటుంది. పన్నెండేళ్ల అరణ్యవాసం పూర్తయి అజ్ఞాతవాసం గురించి చర్చించుకుంటున్న సమయంలో ఓ బ్రాహ్మణుడు ఎదురై తాను అగ్ని సూత్రానికి ఉంచుకున్న సమిధలను ఓ జింక తన కొమ్ములపై ఉంచుకుని పట్టుకెళ్లిందని, ఇప్పుడు వైదిక విధులకు విఘాతం కలిగిందని చెపుతాడు. దాంతో పాండవులు ఆ సమిధలను బ్రాహ్మణుడికి తిరిగి తెచ్చివ్వాలని జింక కాలిగుర్తుల వెంటే నడుస్తుంటారు. ఆ జింక అన్వేషణలో అలసిన ధర్మరాజుకు దాహం వేస్తుంది. నకులుడు, అన్నగారికి నీళ్లు తెచ్చివ్వాలని నీళ్లను వెదుకుతూ వెళతాడు. ఓ అందమైన సరస్సు కనిపిస్తుంది. అందులో ఓ కొంగ మాత్రమే ఉంది. నకులుడు నీళ్లు తీసుకునే ప్రయత్నం చేయగానే ఆ కొంగ ‘నకులా! ఆగు. నా ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలిచ్చిన తర్వాతే నీవు ఈ నీళ్లు తాకాలి. అలాకాక గర్వంతో నీళ్లను తీసుకుంటే ఈ సరస్సు నీళ్లు విషంగా మారి నీ ప్రాణాలు తీస్తాయి’ అంటూ హెచ్చరిస్తుంది. నకులుడు లక్ష్యపెట్టకుండా నీటిని తీసుకుని, తాను కొన్ని తాగడంతో వెంటనే మరణిస్తాడు. తన సోదరుణ్ణి వెదుకుతూ అక్కడికి వచ్చిన సహదేవుడికీ అదే గతి పడుతుంది. ఆ తర్వాత అర్జునుడు, భీముడు కూడా అలాగే విగత జీవులవుతారు. తన సోదరులెవరూ తిరిగిరాకపోవటంతో ధర్మరాజే బయల్దేరి సరస్సు దగ్గరకు వస్తాడు. ధర్మరాజు విగతజీవులైన తన సోదరుల్ని చూస్తాడు. అందుకు కారకులెవరో తెలుసుకునే ముందు దప్పిక తీర్చుకోవాలనుకుంటాడు. వెంటనే కొంగ అతణ్ని తన ప్రశ్నలకు బదులిచ్చిన తర్వాత నీటిని తాకాలంటుంది. ధర్మరాజు సూక్ష్మాన్ని గ్రహించి సరేనంటాడు. అప్పుడు ఆ కొంగ, యక్షుడి రూపం దాలుస్తుంది. యక్షుడు, యుధిష్ఠరుడిని పద్దెనిమిది ప్రశ్నలడుగుతాడు. అన్నిటికీ యుధిష్ఠరుడు ఉచిత సమాధానాలిచ్చి, మెప్పించి సోదరులను బతికించుకొంటాడు. ఆ ప్రశ్నలే యక్షప్రశ్నలు. ఎవరైనా ప్రశ్నలమీద ప్రశ్నలు సంధిస్తే ‘యక్షప్రశ్నలు’ అనడం పరిపాటి అయిపోయింది. ‘బాలరాజు కథ’ చిత్రంలో బాలరాజు, స్వామిగారిని ఇలా – ప్రశ్నిస్తాడు.
“అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటేయొద్దు ఏమిటీ రహస్యం? స్వామీ ఏమిటీ విచిత్రం..” అంటూ “ఒక్కరాయిని కాలికిందేసి తొక్కుతు ఉంటారెందుకు, ఇంకొక్క రాతికి చేతులెత్తుకుని మొక్కుతు ఉంటారెందుకు?” అనగానే స్వామి.. “అది వీధిలోన పడి ఉన్నందుకు.. ఇది గుడిలో బొమ్మై కూర్చున్నందుకు” అని బదులిస్తాడు.
బాలరాజు ఇలా కొన్ని ప్రశ్నలు వేసి “మహమ్మదీయులు పిలిచే దేవుడు క్రైస్తవులంతా కొలిచే దేవుడు ఏడుకొండల వేంకటేశ్వరుడు.. శ్రీశైలంలో మల్లికార్జునుడు వారూ వీరూ ఒకటేనా.. వేరువేరుగా ఉన్నారా” అని ప్రశ్నిస్తాడు. అందుకు స్వామి “సర్వవ్యాపి నారాయణుడు.. ఎక్కడ జూచిన ఉంటాడు, ఆ స్వామికొరకె నే శోధిస్తున్నా… తీర్ధాలన్నీ తిరుగుతు ఉన్నా…” అంటాడు.
నిజ భక్తుడు తుకారాంగారైతే ఆవేదనతో, ఆవేశంతో దేవుణ్ని నిలదీస్తూ.. ‘ఉన్నావా? అసలున్నావా? ఉంటే కళ్లు మూసుకున్నావా? ఈ లోకం కుళ్లు చూడకున్నావా? ఉన్నావని, చూస్తున్నావని నమ్మి ఎందరో ఉన్నారు’… అంటారు.
‘బాటసారి’ చిత్రంలో సీనియర్ సముద్రాల రచించగా, భానుమతి, జిక్కిపాడిన మరో మంచి పాట ఉంది. అది..
“కనులకు దోచి చేతికందని ఎండమావులున్నయ్. .
సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని..
భూమి జనించి ఆకలికొదగని ఫలములున్నవి కొన్ని..
మనసున నిండి పలుకగరాని తలపులున్నవి కొన్ని..
సృష్టి చేసినది దేవుడైన మరి నాశమునేల సృజించె
పలుకు నొసగినది దేవుడైన మరి మూగలనేల సృజించె
కనులనొసగినది దేవుడైన మరి అంధుల నేల సృజించె
వెలుగునిచ్చినది దేవుడైన మరి చీకటి నేల సృజించే
పెను చీకటినేల సృజించె” అని నెచ్చెలి ప్రశ్నిస్తే
“వేదశాస్త్రములు చదివినవారే ఎరుగరు సృష్టి విలాసం..
అల్పబుద్ధితో జ్ఞానదాతనే సలుపకు పరిహాసం…
బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై బ్రతుకును
జనసముదాయం బదులుకోసమై వెదకుటమాని బ్రతుకుటయే న్యాయం’ అంటుంది.
జీవితంలో ప్రశ్నలు ఒక ఎత్తయితే విద్యార్థి జీవితానికి ప్రశ్నలే ప్రశ్నలు.. పాఠాలు… ప్రశ్నలు.. జవాబులు.. అదొక రొటీన్. స్కూల్లో టీచర్ అడిగే ప్రశ్నలకు జవాబులివ్వాల్సి ఉంటుంది. వచ్చినవారు నేను చెపుతా, నేను చెపుతా అంటూ చేతులెత్తుతారు. రానివారికి చీవాట్లు తప్పవు.
ఇక తమకొచ్చిన సందేహాలను తీర్చుకోవడానికి విద్యార్థులు టీచర్లను ప్రశ్నించడమూ మామూలే. కొంతమంది టీచర్లు అర్ధమయ్యేట్లు చెప్పి పిల్లల సందేహం తీరుస్తారు. కొంతమంది టీచర్లు చెప్పటం చేతకాక ‘నీకెప్పుడూ డౌట్లే, మట్టి బుర్రకి ఏమర్ధమవుతుంది. కూర్చో’ అంటూ గద్దించి తప్పుకుంటారు. అయితే కొంటె పిల్లలు కొందరు టీచర్లను కావాలని ఇరకాటంలో పెట్టే ప్రశ్నలను ఎంచుకుని అడగటమూ కద్దు. ఇక పరీక్షల్లో ప్రశ్నాపత్రాల్లో ఎస్సే టైపు సమాధానం రాయాల్సిన ప్రశ్నలు, చిన్న జవాబులు రాయాల్సిన ప్రశ్నలు, ఏక వాక్యంలో జవాబు రాయల్సిన ప్రశ్నలు ఇలా ఉంటాయి.
ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం తరచు జరుగుతూనే ఉంటుంది. కొద్ది కాలం రగిలి ఆ తర్వాత చల్లారుతుంది. మళ్లీ యథాతథమే. దీనికి ‘లీక్ ప్రూఫ్’ ఇంతవరకూ లేదు. అనైతికత అంతం కానంత కాలం ఇలాంటివి ఉంటూనే ఉంటాయి.
ఇంట్లో కూడా కొన్నిసార్లు చిన్నపిల్లల ప్రశ్నలకు జవాబులు చెప్పలేక తల్లిదండ్రులు సైతం ఇబ్బందిపడిపోతుంటారు. ఎడమ అన్నప్పుడు కుడమ అనాలికదా, కుడి అనెందుకంటారు? నైటీన్ తర్వాత ట్వంటీన్ అనకుండా ట్వంటీ అనడమెందుకు? చెల్లిని ఆసుపత్రి నుంచి తెచ్చామన్నావు, వాళ్లకు ఎవరిచ్చారు? ఇలా సాగుతుంటాయి. పత్రికల్లో సైతం ప్రశ్నలు.. సమాధానాలు శీర్షికలు పాఠకులను అలరిస్తూనే ఉంటాయి. గతంలో ఆంధ్రప్రభలో మాలతీ చందూర్… ప్రశ్నోత్తరాల శీర్షిక ఎంతో విజ్ఞానదాయకంగా ఉండేది. అలాగే ఆంధ్రపత్రికలో కె.రామలక్ష్మి గారి ప్రశ్నలు.. సమాధానాల శీర్షికకు, ఆంధ్రభూమిలో సికరాజుగారి అ.చె. శీర్షికకు మంచి ఫాలోయింగ్ ఉండేది. ఆకాశవాణిలో ఉషశ్రీ గారి ‘ధర్మ సందేహాలు’ కార్యక్రమం ఎంతో ఆసక్తికరంగా ఉండేది. ‘ఆడిగేవాడికి చెప్పేవాడు లోకువ’ అని ఓ సామెత. అర్ధ రహిత ప్రశ్నలు వేసినప్పుడు ఈ సామెత వాడుతుంటారు. బదుల్లేని ప్రశ్నల గురించి ప్రస్తావన వస్తే ‘తూర్పుపడమర’లో సినారెగారి పాట గుర్తుకు వస్తుంది. అది…
తూర్పు పడమర ఎదురెదురూ నింగీ నేలా ఎదురెదురూ
కలియని దిక్కులు కలవవనీ తెలిసి ఆరాటం దేనికనీ
ఈ ప్రశ్నకు బదులేదీ ఈ సృష్టికి మొదలేది…..
తూర్పున ఉదయించే సూర్యుడు పడమర నిదురించును
పడమట నిదురించే సూర్యుడే తూర్పున ఉదయించును
ఆ తూర్పు పడమరకేమౌను, ఈ పడమర తూర్పునకేమౌను
ఈ ప్రశ్నకు బదులేది ఈ సృష్టికి మొదలేది…
నింగిని సాగే నీలిమేఘం నేల ఒడిలో వర్షించును
నేలను కురిసే ఆ నీరే నింగిలో మేఘమై పయనించును
ఈ నింగికి నేల ఏమౌను ఈ నేలకు నింగి ఏమౌను
ఈ ప్రశ్నకు బదులేది ఈ సృష్టికి మొదలేది…
అన్నట్లు ఇప్పుడంతా ‘క్విజ్ ఏజ్’ (క్విజ్ యుగం). పిల్లలకు మాటలు వచ్చీ రాకముందే ప్రశ్నలు, సమాధానాలు నేర్పి ‘వండర్ కిడ్’, ‘చైల్డ్ ప్రాడిజీ’ (బాలమేధావి) అనిపించుకునేలా తీర్చిదిద్దుతున్నారు. మరో రకంగా ఆలోచిస్తే ఆటపాటల బాల్యానికి ఇలాంటి వాటితో భంగం కలిగిస్తున్నారేమో అనిపిస్తుంది.
టి.వి.లో సైతం క్విజ్ షోలు ఎంతో పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’కి వచ్చిన ఆదరణ ఇంతా, అంతా కాదు. లక్ ఉంటే డబ్బు, లేదంటే కనీసం అమితాబ్ గారితో ఆ వేదిక పై.. అందునా అన్ని కోట్ల ప్రేక్షకప్రజానీకం వీక్షించే కార్యక్రమం.. అందుకని ఆ ప్రోగ్రామ్స్‌లో పాల్గొనడానికి తన క్విజ్ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి తీవ్రమైన కృషిచేసిన వాళ్లెంతోమంది ఉన్నారు. తెలిసిన ప్రశ్న అయినా ఆ క్షణాన జవాబు స్ఫురించకపోతే అంతే సంగతులు.
విద్యార్థి దశ ముగిశాక ఉద్యోగపర్వం మొదలైనప్పుడూ ఈ ప్రశ్నలు ఇంటర్వ్యూ రూపంలో వెంటాడుతూనే ఉంటాయి. సిఫార్సులకో, లంచాలకో రిజర్వయిపోయిన ఉద్యోగాలు నామమాత్రపు ఇంటర్వ్యూలు… అభ్యర్థులను అర్ధం పర్ధం లేని ప్రశ్నలడగడంతో ముగుస్తుంటాయి. భేతాళ కథల్లో … విక్రమార్కుడు చెట్టు మీద నుంచి శవాన్ని దించి (భుజాన వేసుకుని) మోస్తుండగా, శవంలోని భేతాళుడు, విక్రమార్కుడికి ‘శ్రమ తెలియకుండా విను’ అని ఓ కథ చెప్పి, చివరికి ఓ చిక్కు ప్రశ్న వేసి ‘రాజా! ఈ ప్రశ్నకు తెలిసీ సమాధానం చెప్పలేకపోయావో నీ తల వేయి వక్కలవుతుంది’ అని. మౌనం వీడితే వ్రతభంగం అయి, వచ్చినపని చెడుతుంది, సమాధానం తెలిసి చెప్పలేకపోతే ప్రాణానికి ప్రమాదం. దాంతో తప్పనిసరై విక్రమార్కుడు మౌనం వీడి, చిక్కు ప్రశ్నకు వివరంగా జవాబిస్తాడు. ఈ కథలు ఇరవై ఉన్నాయి. గుణాఢ్యుడు క్రీ.పూ. ఒకటవ శతాబ్దంలో ప్రాకృత భాషలో రచించిన బృహత్కథ లోని కొన్ని కథలే తర్వాత కాలంలో భేతాళ పంచవింశతి కథలుగా ప్రసిద్ధి పొందాయి.
అన్యాయం జరిగినప్పుడు ఎవరైనా ప్రశ్నించటం సహజం. అలనాడు ద్రౌపదిని సభకు రమ్మని అడిగినప్పుడు జరిగినదాని గురించి వివరణ అడుగుతూ, ధర్మరాజు తన్నోడి నన్నోడెనా, నన్నోడి తన్నోడెనా? అని ప్రశ్నిస్తుంది. ఇది ద్రౌపది మేధకు తార్కాణంగా నిలుస్తుంది. నిండుసభలో పరాభవాన్ని ఎదుర్కొన్న సందర్భంలో సభలోని పెద్దలందరినీ, ‘మీలో ఎవరూ ఈ అకృత్యాన్ని ఆపలేరా?’ అని తీవ్రంగా ప్రశ్నిస్తుంది.
అన్నట్లు అధర్వణ వేదంలో ప్రశ్నోపనిషత్ ఓ భాగం. ఇందులో ఆరు ప్రశ్నలుంటాయని ఒక్కో ప్రశ్న ఒక్కో అధ్యాయంగా జవాబు గురించి చర్చిస్తుందని చెపుతారు. ‘ప్రశ్నోపనిషత్’ శీర్షికతో గతంలో ‘ఉదయం’ దినపత్రికలో దాసరి నారాయణరావుగారు ఓ కాలమ్ నిర్వహించేవారు. ఒక పొడుపు కథలంటే మెదడుకు మేత పెట్టే గమ్మత్తయిన ప్రశ్నలే. ‘కిటకిట తలుపులు, కిటారి తలుపులు, ఎప్పుడు మూసిన చప్పుడు కావు…? అంటే కనురెప్పలు అని చెప్పగలగాలి. పొడుపుకథలు ఎంతచక్కని ప్రక్రియో. జయభేరి చిత్రంలో ఇలాంటి పొడుపు కథలతోనే ఓ పాట ఉంటుంది. ఎఎన్ఆర్, అంజలి పై చిత్రీకరించిన పాట.. ‘ఉన్నారా? జోడున్నారా? నన్నోడించేవారున్నారా? అందంలో, చందంలో ఆటపాటల అన్నిటిలో..’ అంటూ సవాల్ చేస్తుంది అంజలి. అందుకు ఎఎస్ఆర్ “సవాల్ సవాల్ అనే చినదానా సవాల్ పై సవాల్’ అంటూ.. ‘వెన్నెలలో వికసించే తామర కమలంమీద క కలువపూలు జంటగ మొలిచాయంటా అంటే ఏమిటో, ఆ వింతే ఏమిటో?’ అని ప్రశ్న విసురుతాడు. అందుకు ఆమె ‘తామర కమలం తరుణి నగుముఖం కలువల జోడి కాటుక కన్నులు…’ అని దీటుగా బదులిచ్చి తాను మళ్లీ ఇలా ప్రశ్నిస్తుంది…
‘మునులున్న వనములో ఎలమావి నీడలో చిలకల్లు పెంచిన చిన్నదెవరోయి?
ఆ చిన్నారి తనవాడు సింగంతో చెలగాడే మొనగాడోయి ఓ మొనగాడా..ఆ బాలుని పేరేమోయి? ఆమాట, మన ఆట ఆవుని గోయి..’అంటూ చిన్న క్లూ ఇస్తుంది.
‘ఆ బాలే శకుంతల, బాలుడే వీరకుమార భరతుడు ఆ ఆటే నవరస భరతము..’ అని బదులిస్తాడతడు. చివరకు హీరోగారు, ఆమెను ఓడిస్తాడు.
ఇంగ్లీషు పొయెట్రీలో ప్రశ్నలతో కూర్చిన కవితల్లో ఓ చిన్ని కవిత ఎంతో నచ్చింది.
‘ఫ్రాగ్మెంట్స్’ టైటిల్ తో ఎల్.ఎల్.బర్కాట్ ఇలా రాశాడు..
“హౌ డు ది షెల్స్ స్టిల్ హియర్ ది సీ దో దే ఆర్ ఇన్ పీసెస్ హౌ డీప్ ది హియరింగ్ ఆఫ్ ది సీ ఎంటర్ ఇంటూ బోన్..”
బీచ్ కెళితే ఈ పంక్తులు గుర్తుకు రాక మానవు.
అన్నట్లు రాష్ట్రస్థాయిలో శాసనసభల్లో, కేంద్రస్థాయిలో పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయం (క్వశ్చన్ అవర్) ఉంటుంది. అదేదో ఎంత బీభత్సంగా ఉంటుందో తెలిసిందే. చివరకు అరుచుకోవటాలు, దూషణలు, కుర్చీలు, మైకులు విరగొట్టటాలు, చివరకు వాకౌట్ లేదంటే మార్షల్స్‌తో బలవంతంగా బయటకు పంపించటం, బహిష్కరించడం జరుగుతుంటాయి.
బుల్లితెరలో వచ్చే సీరియల్స్ ప్రకటనలు ప్రశ్నలతోనే ఉంటాయి. గంగానమ్మ కోడలిని చంపడంలో సక్సెస్ అవుతుందా? ప్రవీణ్ పెళ్లయిన విషయాన్ని దాచి పెట్టి ప్రఖ్యాతిని పెళ్లికి ఒప్పించగలిగాడా? అల్లుడినే అంతం చేయాలనుకున్న అనసూయ ప్లాన్ ఫ్లాప్ కావడానికి కారణం ఎవరు?.. ఇలా ఉంటాయి ఆ ప్రశ్నలు.
ప్రజాస్వామ్యం ఫలవంతం కావాలంటే ప్రజలకు ప్రశ్నించే అధికారం పుష్కలంగా ఉండాలి. ఇటీవల ఆం.ప్ర. ప్రభుత్వం పత్రికలు, ఛానెల్స్ కు సంబంధించి చేసిన జీవో పై ఓ ఛానెల్ లో ‘అక్షర ప్రశ్నలు’ పేరిట ఓ కార్యక్రమం ప్రసారమయింది. అందులో ఎందరో, ఎన్నో ప్రశ్నల్ని సంధించారు.
పెళ్లి చూపుల్లో ప్రశ్నలు మామూలే. గతంలో.. పేరేంటి, చదువేంటి, సంగీతం వచ్చా, వంటొచ్చా? ఇలాంటి ప్రశ్నలుండేవి. పాతకాలంలో ఓ మావగారయితే పిల్ల పొదుపరి అవునోకాదో తె లుసకోవడానికి ‘రాత్రి అన్నం మిగిలిందనుకో. ఏంచేస్తా?’ అని అడిగాడుట. అమ్మాయి నిర్లక్ష్యంగా ‘పెంటకుప్పలో పడేస్తా’ అందట. ‘పడేస్తావేం…ఇంత దుబారా అయితే కష్టమే’ అన్నాడట. కొన్ని ప్రశ్నల తీరు వేరుగా ఉంటుంది. ఒకే ప్రశ్నకు అనేక సమాధానాలుంటాయి.
ఉదాహరణకు ఓ వ్యక్తి ఉదయం ఆరింటికి ఎందుకు లేవలేదు? అంటే… అలారం మోగలేదు, నిద్రమాత్ర ప్రభావం, ఆదివారమేమో, మొద్దునిద్ర అలవాటేమో.. మెలకువగానే పడుకున్నాడేమో, జ్వరం వచ్చిందేమో… ఇలా ఎన్నయినా జవాబులివ్వవచ్చు. కొంతమంది సోదెమ్మలను పిలిచి ప్రశ్నలడగటం, ఉపాసకుల వద్దకు వెళ్లి ప్రశ్నలు అడగటం చూస్తూనే ఉంటాం. ఆధ్మాత్మిక ప్రశ్నలు ప్రత్యేకమైనవి. జీవాత్మ, పరమాత్మ, కైవల్యం, పునర్జన్మలు, పాపపుణ్యాలు ఇలా.. అలనాడు సిద్ధార్థుడు ‘మానవుల కష్టాలకు కారణమేమిటి?’ అనే ప్రశ్న మనసులో తలెత్తడంతోనే ఇంటిని విడిచి సత్యాన్వేషణకు బయల్దేరి వెళ్లాడు. బోధివృక్షం కింద కూర్చుని ధ్యానమగ్నుడయి జ్ఞానోదయం పొందాడు.
రమణమహర్షి పథం వేరు. ఆయన ‘నేనెవరు?’ అని ప్రశ్నించుకోమంటారు. దాన్నే శోధించుకోగలిగితే అదే జ్ఞానసిద్ధి అని చెపుతారు. ఏమైనా ప్రశ్నించటం అనేది ఎంతో ముఖ్యమైంది. ప్రశ్నల వల్లనే శోధన జరిగేది. శాస్త్ర పరిశోధనలకు కారణం వివిధ అంశాలకు సంబంధించి తలెత్తే ప్రశ్నలే. విజ్ఞాన మూలం ప్రశ్నే. ప్రశ్నలోనే ఉంది. ప్రపంచం. ఏమిటి, ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఏది.. నిరంతరం మనముందు నిలిచే ప్రశ్నలే.
అంతలో డోర్ బెల్ మోగింది. చూస్తే అపరిచితులు. ‘ఏంకావాలి’ అన్నట్లు చూశాను. ‘ఈ పక్కింట్లో సుబ్బరామయ్యగారు ఉండాలే. తాళం వేసి ఉందేమిటి? ఎక్కడికెళ్లారో మీకు తెలుసా?’ ప్రశ్నించారు. వాళ్లు ఇల్లు ఖాళీ చేసి పది రోజులైంది. వైజాగ్ ట్రాన్స్ఫర్ అయిందన్నారు’ చెప్పాను.
‘అలాగా’ అంటూ కాస్తంత నిరాశగా వెనుదిరిగా తలుపు మూసిన నేను, ప్రశ్నావలోకనం పక్కకు తప్పుకోవటంతో టీవీ ఆన్ చేశాను. వెంటనే ‘ఉద్యోగం రాలేదా? వివాహం కాలేదా? సంతానం కలగలేదా? పరీక్షలో ఫెయిలయ్యారా? ఎందులోనూ కలిసి రావటంలేదా? ప్రేమ వ్యవహారంలో చిక్కులా? ఆస్తుల తగాదాలు ఎడతెగడం లేదా? గృహంలో కలహాలా? దీర్ఘకాలంగా వ్యాధులతో బాధపడుతున్నారా?’ జాతకరత్న గారి ప్రశ్నాయణం తట్టుకోలేక ఛానెల్ మార్చాను. అక్కడ ‘మీ టూత్ పేస్ట్‌లో ఉప్పుందా?’ అంటున్నాడు. బాప్రే అనుకొని మరో ఛానెల్ ప్రయత్నించాను. ‘మీరు టాయ్‌లెట్‌ను దేంతో శుభ్రం చేస్తారు?’ మళ్లీ ప్రశ్న. నా చెయ్యి అసంకల్పితంగా రిమోట్‌ను మళ్లీ నొక్కింది. ‘మీ ముఖం ఇంత తాజాగా ఎలా ఉంది? మీరు ఏం సబ్బు వాడుతారు?’
ప్రశ్నలు బాబోయ్ ప్రశ్నలు!
జొన్నలగడ్డ శ్యామల సీనియర్ జర్నలిస్టు. ఉదయం దినపత్రికలో పని చేసేవారు. వార్త దినపత్రికలో ఆదివారం అనుబంధం ఇన్ఛార్జ్ గా పని చేశారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. వృత్తి ధర్మంగా అసంఖ్యాకమైన కవర్ స్టోరీలు, ఫీచర్లు, పుస్తక సమీక్షలు రాసినవారు. శ్యామల 70కి పైగా కథలు రాశారు. ఆంధ్రప్రభ, యువ, ఉదయం, వార్త, ఇండియా టుడే లలో వీరి కథలు ప్రచురితమయ్యాయి. ముఖ్యంగా వీరి ‘పడక్కుర్చీ’ కథ అనేక ప్రశంసలు పొందింది. పలు హస్య కథలు కూడా రచించారు. కొన్ని కథలు ఇతర కథాసంపుటాలలో వచ్చాయి. కొన్ని కథల పోటీలలో బహుమతి గెలుచుకున్నారు. పూతరేకులు, సాలోచనం, సాధన, మానస సంచరరే, అన్నింట అంతరాత్మ వంటి కాలమ్‌లు రాశారు.
7 Comments
prabhakaramsivvam
శ్యామలగారి” ప్రశ్నల ప్రపంచం ” బాగుంది. జీవితమే ప్రశ్నల మయం అన్న విషయాన్ని సవివరంగా తెలియజేసారు. సి.నా.రె, ఆరుద్ర, ఆత్రేయ, సీనియర్ సముద్రాల పాటలతో అలరించారు. మనిషి జీవితం ప్రశ్నలమయం. జీవితం ఓ పెద్ద
ప్రశ్న. అన్న రచయిత్రి ప్రారంభ వాక్యాలే వ్యాసానికి హైలైట్. ఈ సందర్భంలో భక్త ప్రహ్లాదుడు, హిరణ్యకసిపుని గాధ, భారతంలో యక్షప్రశ్నలు ,బుద్ధుని గాథలు , బాలరాజు గాధలు పాఠకులకు పరిచయం చేయడం పాఠకులకు విషయపరిజ్ఞానాన్ని, మేథో సంపత్తిని రచయిత్రి పెంపొందింప జేసారు. పెళ్లి చూపుల్లో ప్రశ్నలు నవ్వును తెప్పిస్తాయి. .రచయిత్రి శ్యామలగారికి అభినందనలు.
శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి.
S S Kandiyapedu
Civilisation grows on the premise of challenge and response, as Arnold Toyenbee theorised. Similarly human mind flourishes with Question and Answers. The quest to know is the secret of innovation & progress.
Ms Jonnalagadda garu has in an elaborate way has highlighted on this crucial theme of Questions that seek answers.
I congratulate her on the selection of such a wonderful theme and providing such a readable write up.
KANDIYAPEDU
Guru prasad
Excellent narration by smt shyamala garu on different subjects especially good Telugu songs
From JGuru prasad
Syamala Dasika
“ప్రశ్నల ప్రపంచం” చాలా కుతూహలంగా విజ్ఞానదాయకంగా ఉంది. రచయిత్రి శ్యామల, ఏ విషయాన్నైనా అర్ధవంతంగా, అందంగా రాయగలిగిన ప్రతిభావంతురాలు!
శ్యామలాదేవి దశిక
న్యూజెర్సీ-యు ఎస్ ఎ
m.ramalakshmi
అసలు మనిషి జీవితమే ప్రశ్నలమయం జీవితం ఓ పెద్ద ప్రశ్న అని ప్రశ్నల పరంపర ఎన్నిరకాలో దానికి తగిన పాటల ప్రస్తావన తో శ్యామల గారు అందించిన ప్రశ్నల కధ అద్భుతం. మరిన్ని విభిన్న కథలు మీ కలంనుండి జాలువారాలని ఆశిస్తూ

Bhramara
ప్రశ్నల ప్రపంచం చాలా వైవిధ్యభరితంగా , ఆసక్తికరంగా ఉంది. ప్రశ్నలరూపంలో ఇన్ని సినీగీతాలున్నాయా అని ఆశ్చర్యమేసింది. I enjoyed them a lot …’మనిషి జీవితమే ప్రశ్నలమయం.., జీవితమే ఓ పెద్ద ప్రశ్న’ అనే వాక్యాలు ఆలోచింపజేసేవిధంగా ఉన్నాయి. యక్షప్రశ్నల నేపథ్యం వివరించడం చాలా బాగుంది . పత్రికల్లో వచ్చే ప్రశ్నలు-జవాబులు శీర్షిక , పార్లమెంటులో ప్రశ్నోత్తరాల గురించిన ప్రస్తావన సందర్భోచితంగా ఉంది. ఇక టీవీ షోల గురించి చెప్పినపుడు నవ్వాగలేదు. బుద్ధుని జ్ఞానోదయం, రమణమహర్షి నేనెనరు ? అనే ప్రశ్న ఆర్టికల్ కే నిండుతనాన్ని తెచ్చాయి ..చక్కటి అర్టికల్ తో పాఠకులను అంతఃశోధన దిశగా మళ్ళించిన రచయిత్రి శ్యామల గారికి అభినందనలు


Vidadala sambasivarao
శ్రీమతి శ్యామలగారు ప్రశ్నల ప్రపంచంలో జీవితమే ఓ సమాధానం లేని ప్రశ్న అనే వాస్తవాన్ని తెలియజేశారు. గతకాలపు స్మృతులు….సినిమా సాహిత్యం,ఇతిహాసం భారతంలో యక్షప్రశ్నలు,ద్రౌపది నిండుసభలో సంధించిన ప్రశ్నలు,సాహిత్య పత్రికలలో ప్రముఖుల ప్రశ్నలు సమాధానాలు శీర్షికలు వగైరాల ద్వారా…..మానజీవితంలో ప్రశ్నలకున్న ప్రాధాన్యతను చక్కగా వివరించారు.
కళాభివందనములతో
విడదల సాంబశివరావు.