ఏకాదశ్యాం తు కర్తవ్యం రాత్రౌ జాగరణం తథా। గీతైర్నృత్యైస్థథా వాద్యైః బ్రహ్మఘోషస్తదైవ చ॥
వీణా పటశబ్దైశ్చ పురాణానాం చ వాచనైః। తత్కాథాశ్రవనైశ్చానైస్థథా స్తోత్రో పకీర్తనైః॥
ఏకాదశి నాడు జాగరణ చేయాలి. ఈ జాగరణ ఎలా చేయాలంటే పాటలతో, భజనలతో, పురాణ శ్రవణంతో, సంగీతంతో, వీణా పటాహ ధ్వనులతో దానాలు చేయాలి. అలంకరణలు చేయాలి. ధూపదీప నైవేద్యాలు అర్పించాలి.
కశ్మీరు ప్రజలు పండుగలు ఎలా జరుపుకోవాలో నీలుడు నిర్దేశించిన పద్ధతులు చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఇక నుంచి నీలమత పురాణం అంతా పూజా విధానాలు, పండుగలు ఎప్పుడెప్పుడు ఎలా జరుపుకోవాలి; ఏ శుభదినాన ఏమేం చేయాలి వంటి వివరణలతో ఉంటుంది.
వరుసగా ఇలాంటి వివరాలు చదవాల్సి రావటం కాస్త విసుగుగా అనిపించినా నీలమత పురాణంలోని ఈ వివరణల వల్ల మనకు ఆనాటి సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక, ధార్మిక జీవన విధానాలు తెలుస్తాయి. ఆనాటి పద్ధతులు తెలుస్తాయి. ఆ కాలంలో అమలులో ఉన్న సంగీత వాయిద్యాల గురించీ తెలుస్తుంది. భక్తి గీతాలు, కీర్తనలు గానం చేయటం, పురాణ పఠనం, ఉపవాసం, జాగరణం వంటివి ఆనాటికే అమలులో ఉండేవని తెలుస్తుంది. మందిరాల ప్రసక్తి వస్తుంది. ఆ కాలంలో పూజాద్రవ్యాలను ప్రకృతి నుంచి గ్రహించటం తెలుస్తుంది.
పండుగ రోజు జాగరణ అవగానే రాత్రంతా సినిమాలు చూస్తూ గడపడమో, ఏదో ఆట ఆడుతూనో, టీవీ చూస్తూనో మేల్కొని ఉండడం అనుకునే కాలంతో ఆనాటి పద్ధతులను పోలిస్తే శబ్దం మిగిలి భావం నశించిన పదాలు గుర్తుకు వస్తాయి. పదం అదే శబ్దం మిగిలింది, భావం అదృశ్యమైంది. జాగరణ అంటే రాత్రంతా మేలుకుని ఉండడం అంతే. అది భగవద్ ధ్యానంలోనా, భగవద్ చింతనలోనా అన్నది అప్రస్తుతం అయింది. ఎలాగొలా నిద్రపోకుండా ఉండడమే జాగారం చేయటం అయింది. ఇది గమనిస్తేనే ఎంతగా మార్పు వచ్చిందో భారతీయ సమాజంలో అన్నది స్పష్టమవుతుంది.
రాత్రంతా విగ్రహన్ని పూజించాలి. నైవేద్యం పెట్టాలి. తీపి పదార్థాలు పంచాలి. పరమాన్నం వండాలి, చెరుకు రసం, తేనె, ద్రాక్ష, దానిమ్మపండు, ఉప్పు వంటి వాటిని అర్పించాలి. గంధం, ఇతర సుగంధ ద్రవ్యాలు, కస్తూరి వంటి పరిమళ ద్రవ్యాలను వాడాలి. పవిత్రమైన నదీ జలాలలో స్నానమాడి విగ్రహాన్ని శుభ్రం చేయాలి. పంచరాత్ర సూత్రాలను అనుసరించి వ్యక్తుల ఆర్థిక స్తోమత ప్రకారం విగ్రహానికి కాని చిత్రపటానికి గాని స్నానం చేయించాలి. నెయ్యి, తేనె, పాలు, పెరుగు వంటి వాటితో అభిషేకం చేయాలి.
కుంకుమ, రక్త చందనం వంటి వాటితో సుగంధాలు విగ్రహానికి పూయాలి. ఇంకా మాష చూర్ణం, మసూర చూర్ణం, రూధ్రం, కాలేయకం, తగరం, కర్ణాకం, సిద్ధార్థకం, ప్రియాంగు, బీజపూరకంతో సహా అనేక ఔషధులు, సుగంధ ద్రవ్యాలు, బంగారం, పవిత్ర వస్తువులు, వజ్రాలు, కుశ దర్భలు, నీరు, ఏనుగు దంతంతో నది ఒడ్దు నుండి తవ్వి తీసిన మట్టి, ఎద్దు కొమ్ముల ఆధారంగా నది ఒడ్డున తవ్వి సేకరించిన మట్టి, ఇంకా నదీ సంగమం, చీమల పుట్టలు, సరస్తీరం, పర్వత శిఖరం వంటి ప్రాంతాల నుండి ఏనుగు దంతం, ఎద్దు కొమ్ములతో త్రవ్వితీసిన మట్టి వంటి వాటితో విగ్రహానికి స్నానం చేయించాలి. ఆ పై గోరోచనం పూయాలి. ఆ తరువాత యథాశక్తిని అనుసరించి బంగారు కుండలు, పూలమాలలు, పళ్ళు దానం చేయాలి.
వేద పఠనం, శుభ వచనాలు, వీణా వేణునాదాలు, వందిమాగధుల వచనాల నడుమ గోవిందుడిని అర్పించాలి. దీపారాధన చేయాలి. సుగంధ ద్రవ్యాలు వెలిగించాలి. అగ్ని ఆరాధన చేయాలి. తరువాత యథాశక్తి బ్రాహ్మణులకు వస్తువులు అర్పిమ్చి పూజించాలి. బట్టలు, నగలు, వజ్రాలు, గోవులు, గుర్ర్రాలు, ఏనుగులు, ధనం వంటిని యథాశక్తి సమర్పించాలి. తరువాత ఆహారం సేవించాలి. పదమూడో రోజు యథాశక్తి కళాకారులను, ఆటగాళ్లను, కుస్తీ వీరులను సత్కరించాలి.
పధ్నాలుగవ రోజు నిరాహారంగానైనా ఉండవచ్చు లేకపోతే పాలు మాత్రమే తీసుకోవచ్చు. పదిహేనవ రోజున జనార్దనుడిని అర్చించాలి. పౌర్ణమి రోజంతా ఏమీ తినవద్దు. చంద్రోదయం అయిన తరువాత కృత్తికలు, కార్తికేయుడు, వరుణ, హుతాశనులను పూలమాలలతో, సుగంధ ద్రవ్యాలతో, ప్రసాదాలతో పూజించాలి. పరమాన్నం, కూరగాయలు, చెరుకుతో తయారు చేసిన పిండి పదార్థాలు అర్పించాలి. దీపాలతో, పూలతో అందంగా అలంకరించాలి.
(ఇంకా ఉంది)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™