అంపాపురాధీశ్వరుడు అశ్వ రాజు కుమారుడైన విశ్వపతి చెడు సావాసాలకు లోనై, ధనాన్ని విపరీతముగా వెచ్చిస్తూ, తండ్రి దగ్గర నుంచి మరింత ధనానికి ప్రయత్నించినా లభించకపోవడంతో కక్ష పెంచుకుని, మురారి రాజ్యం చేరి రాణి నూర్జహాన్ను కలుసుకున్నాడు. తండ్రికి వ్యతిరేకంగా మీతో కలిసి, ఆయనతో యుద్ధం చేస్తాను అని ఆమెతో చెప్పాడు.
అతడే కాక మహాబలచక్రవర్తికి సామంతులైన చాలామంది రాజుల బిడ్డలను కూడా మహారాజు వివాహమాడి హతమార్చడంతో వారందరూ అతనికి వ్యతిరేకంగా మారారు. మంత్రి, దండనాయకుల సలహా ప్రకారం నూర్జహాన్ వారందరినీ స్వయంగా ఒక సమావేశానికి ఆహ్వానించింది.
సారంగి చెప్తున్న కథను వింటున్న మహాబల చక్రవర్తి మనసులో ఏదో తెలియని సంచలనం కలుగుతోంది. పశ్చాత్తాపం కలుగుతుంది. తన సామంతరాజులు ఎవరూ కప్పం కట్టనవసరం లేదని ప్రకటించాడు. కానీ పుత్రికల మరణాల వల్ల క్షోభ పడుతున్న వారందరూ ఏక కంఠాలతో ఉద్రేకంతో నూర్జహాన్ బేగంతో కలిసి చక్రవర్తికి వ్యతిరేకంగా నిలబడడానికి అంగీకరించారు. యుద్ధ సన్నాహాల్లో నిమగ్నమయ్యారు.
ఫెళఫెళార్భటుల జ్వాలావేలములతో మహోజ్వల దారుణాగ్ని పై సలసల మరుగుతున్న ఒక చమురు బానలో గిలగిలా తన్నుకుంటూ హాహాకారాలు చేస్తున్న కాపాలి అక్కడ ఉన్న ఒక దూతను ఉద్దేశించి ‘అయ్యా, నాకు బుద్ధి వచ్చింది. నన్ను ఒక్కసారి మీ ధర్మదేవత వద్దకు తీసుకు వెళ్ళండి’ అన్నాడు. “నీవు గుండా ఫకీర్ తో కలిసి దారుణాలు చేయకుంటే ఇప్పుడీ కఠిన శిక్ష ఉండేది కాదు కదా” అన్నాడు అతను.
“నేను ఎన్నో పాపాలు చేశాను. ఇప్పుడు బుద్ధి వచ్చింది. పశ్చాత్తాపంతో దహింపబడుతున్న నా మొర ధర్మ దేవత తప్పక వింటుంది. పైగా ఈ శిక్ష నాకు మహోపకారం చేసింది. లేకపోతే నాలో ఈ విజ్ఞానం ఎలా కలుగుతుంది! నా సర్వ పాపాలు నశించాయి. నాకు సంస్కారం కలిగింది. కనుక నా జీవుడు ఇప్పుడు సునాయాస మరణం కోరుతున్నాడు” అని మొర పెట్టుకున్నది కాపాలి.
దయతలచి ఆ దూత కాపాలిని ధర్మదేవత వద్దకు తీసుకువెళ్ళాడు.
శరత్ చంద్ర చంద్రికా ధవళ ధవళాతీతమై, మల్లికాశ్వేతశ్వేతా తీతమైన ఒక తెల్లని తెలుపులో, చల్లని చంద్రమండలం వంటి చోట నిలిచి, కాపాలి తన ఎదురుగా ఒక శ్వేతాంబరధారి, ప్రసన్నవదన, కరుణామూర్తి కనిపించగా చేతులు జోడించింది. మనసారా ప్రార్థించింది.
సుమారుగా 80 సంవత్సరాల క్రితం శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు తన పదునైన కలం ద్వారా ఆధునిక నవలా సాహిత్యంలో ఒక విప్లవాన్ని సృష్టించాడు. జనబాహుళ్యంలో చొచ్చుకొనిపోయి ముఖ్యంగా స్త్రీ పాఠకులకు చైతన్యాన్ని తీసుకొచ్చారు. వెయ్యి పైగా నవలలు వ్రాసి చరిత్ర సృష్టించిన కారణజన్ముడు. అది ఆనాడు.
మరి 80 సంవత్సరాల తర్వాత మళ్లీ కొవ్వలిని గుర్తు చేసుకొని, ఆయన చేపట్టిన విప్లవాన్ని మళ్లీ మన మధ్య తీసుకొచ్చేందుకు నేడు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు శ్రీమతి సుశీలమ్మ గారు. తెలుగు సాహిత్య రంగంలో ఆమె ఎన్నో పరిశోధనలు చేసి తన జీవితాన్నంతా తెలుగు సాహిత్య సేవకి అంకితమిచ్చిన సాహితీవేత్త, ధీరవనిత.
శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి కిన్నెరసాని పాటలపై, ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలపై పరిశోధనలు చేసి డాక్టరేట్ పొందారు. ఎన్నో సత్కారాలు పొందారు. అటువంటి ఆమె కొవ్వలిని తిరిగి ఈనాటి తరం పాఠకులకు పరిచయం చేయాలన్న ఏకైక లక్ష్యంతో ఎన్నో అడ్డంకులకు ఎదురొడ్డుతూ, దూషణ భూషణలను సమభావంతో స్వీకరిస్తూ, మరిచిపోయిన సమాజానికి శ్రీ కొవ్వలిని, ఆయన చేసిన సాహిత్య సేవను ఈనాడు మనకందరికీ తెలియజేయాలని ఆమె చేస్తున్న కృషికి, తపనకు మా జోహార్లు.
ప్రస్తుతం 1960లో కొవ్వలి వ్రాసిన ఆనాటి 25 భాగాల జగజ్జాణను “మరోసారి జగజ్జాణ” పేరుతో సంచిక అనే వెబ్ మేగజైన్ ద్వారా అందిస్తున్న సంక్షిప్త కథనంతో తిరిగి పాఠకులను ఉత్తేజ పరుస్తున్నారు. జగజ్జాణ ఆనాడు పాఠకులను ఉర్రూతలూగించిన అద్భుతమైన జానపద మిస్టరీ నవల. ఆబాలగోపాలం చదివి ఆనందించిన రోజులవి. తదుపరి పుస్తకం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవారు. అది హారీ పోటర్ కి ఏమాత్రం తీసిపోదని, ఆంగ్లంలో అనువదించమని ఎంతోమంది సూచించారు. కానీ అంత పెద్ద పుస్తకాన్ని సంక్షిప్తంగా, ఎక్కడ బిగి సడలకుండా, పాత్రల పరిచయం చెడిపోకుండా రాయడం చాలా కష్టం. ఏ మాత్రం తేడా వచ్చినా పాఠకులకు సమాధానం చెప్పాలి. ఇది ఒక వినూత్నమైన ప్రక్రియ. ఒకవేళ కొవ్వలి ఆమెలో పరకాయప్రవేశం చేశారేమో అన్నంతగా సుశీలమ్మ గారు కొవ్వలి గురించి కృషి చేస్తున్నారు.
వెయ్యిన్నొక్క పుస్తకాలు రాసిన కొవ్వలికి ఆధునిక సాహిత్యంలో తగిన స్థానం లేదు అని ఆమె తపిస్తున్నారు. అయినా సరే మొక్కవోని ధైర్యంతో ఆమె ఆశయం నెరవేర్చడం కోసం అనేక విధాల తిరిగి కొవ్వలి కి పూర్వ వైభవం రావాలని, ఆధునిక నవలా సాహిత్య లోకంలో ఆయనకు సముచిత స్థానం రావాలని ఆమె చేస్తున్న ఉద్యమానికి మా అభినందనలు. మా యావత్ కుటుంబ సభ్యులందరూ ఆమెకు రుణపడి ఉంటాము. ఆమె తలపెట్టిన ఈ బృహత్కార్యానికి ఆ పరమేశ్వరుడు ఆమెకు తగిన శక్తినిచ్చి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని, ఆమె సంకల్పసిద్ధి నెరవేరాలని ఆ సర్వేశ్వరుని పూర్వకంగా ప్రార్థిస్తున్నాను.
కొవ్వలి నాగేశ్వరరావు &
కుటుంబ సభ్యులు
10.4.2021
చెన్నై.
“ఇకనైనా సాధురక్షణకు ధర్మ పునరుద్ధరణకు ప్రయత్నిస్తూ, హింసాకాండను వదిలి ఉత్తమగతులు పొందు. ఇది నా ఆదేశం” అన్నదా దేవత.
కాపాలిని కళ్ళు మూసుకోమని చెప్పి ఆ దూత అతన్ని ఎక్కడికో తీసుకు వెళ్ళి వదిలాడు. కళ్ళు తెరిచిన కాపాలి కనిపించిన మార్గము ననుసరించి పరిగెత్తింది. ఆమె కోసమే వస్తున్న గుండా ఫకీరు ఆనందంతో ఎదురై “నిన్నా శిక్ష నుంచి తప్పించాలని నేను తొమ్మండుగురు బాలికలను సమీకరించాను. కానీ బలి ఇవ్వ లేకపోయాను” అన్నాడు.
“ఇక నాకు అలాంటి మాటలు చెప్పకు. నాకు బుద్ధి వచ్చింది. నీలాంటి వాడి సాంగత్యము నాకు వద్దు” అని కాపాలి వడివడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
ఆశ్చర్యపోయాడు గుండా ఫకీరు. ఎప్పటిలా తన శిష్యుడు ఫాలాక్షుని చేరుకొని, గాలి గుర్రంపై పాండ్యరాజ్యం చేరాడు.
ఈరోజుతో మహాబల రాజుకు, సారంగికి ఇచ్చిన గడువు ఆఖరు. రాజు చిలుకను తనకు వశం చేస్తాడు. ఆ చిలుకను, దానిలో ఉన్న జయదేవుని చంపి వేయాలి అని కసిగా ఉంది ఫకీరుకి.
పదునాలుగవనాటి రాత్రి. “ఏమే చిలుకా, నీ కథకు ఇది ఆఖరు రాత్రి. ఎట్టి పరిస్థితిలో పూర్తి చేయాలి. నేను గావించిన వాగ్దానము ననుసరించి నిన్ను ఫకీర్కి వశం చేయాలి” అన్నాడు మహారాజు. సరేనంది చిలుక.
బంధితులైన మదనమంజరిని, లాల్మియాని చూసి అమితావేశ పరురాలైంది మాధురి బేగం. మాధురీ, మకరంద్, అవంతి, మనోరమలను చూసి ఉడికి పోయాడు లాల్మియా. నోటికొచ్చినట్లు వదరసాగాడు. వాడితో మాటలు అనవసరం అని అక్కడి నుంచి లేచి వెళ్ళింది మాధురి. తప్పక తనకు ఏదో ఉపద్రవం తెచ్చిపెడుతుందని ఊహించిన ఒక్కసారి తన సర్వ శక్తులూ వినియోగించి ఊపిరి బిగబట్టి ఒక్క ఊపులో బంధించబడి ఉన్న గొలుసులను ఫెళఫెళా తెంచి పారేశాడు. మొదట ఆశ్చర్యపోయినా, వారందరూ కలిసి ఆ దుష్టుని తిరిగి బంధించడానికి ప్రయత్నిస్తున్నారు. అంతలో మాధురి బేగం వచ్చింది. కొన్ని అక్షతలు అతనిపై చల్లింది. వాటి ప్రభావం వల్ల లాల్ అడుగు కదపలేక అట్టే నిలుచుండి పోయాడు. “లాల్! ఈ రోజుతో నీ జీవితం ఆఖరు. అందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ జరిపి వచ్చాను” అంది.
“నన్ను మంత్రాక్షతలతో నిస్సహాయుని చేసి బెదిరించటం సాహసమా” అన్న లాల్ మాటలకి మాధురీబేగంకు రోషం కలిగి, మరల అతనిపై మంత్రాక్షతలు చల్లింది. వెంటనే అతను రెట్టించిన ఉత్సాహంతో మాధురి మీదకు ఉరికాడు. ఎవరినీ ముందుకు రా వద్దని చెప్పి, అతనికి కరవాలాన్ని విసిరింది. ఆ కరవాలాన్ని లాల్ పట్టుకున్నాడు. ఇద్దరు ఘోరంగా పోరాడ సాగారు. తీవ్రమైన ఖడ్గ యుద్ధం జరుగుతున్నది.
ఒక్కక్షణంలో మాధురి…. లాల్ మీదకు ఉరికి… గురి పెట్టి… లాల్ కంఠానికి కత్తి గుచ్చింది. ఆ గాయం నుండి జారి పడిన రక్తం… చుట్టూ నిలిచిన వారిపై చిమ్మి, వారికి ఆనందం కలిగించింది. లాల్మియా నేలకొరిగాడు.
“ఎందరు ప్రయత్నించినా, ఎవరి చేతుల్లోనూ చావక వీడు చివరికి నా చేతుల్లోనే చచ్చాడు” అంది మాధురి. “ఇదివరకు అనేక పర్యాయాలు చచ్చి మళ్లీ బతికాడు” అన్నాడు వక్రనాథుడు.
“ఈసారి అలా జరగకుండా వీడికి వెంటనే అగ్ని సంస్కారం చేయండి. బూడిద అయ్యేవరకు కనిపెట్టి ఉండండి” అని మాధురి బేగం అనుచరులకి ఆజ్ఞ ఇచ్చింది. తక్షణం లాల్మియాకి అగ్ని సంస్కారం క్రియలు జరిగాయి.
“ఇప్పుడీ మంటల్లో పడి కాలి భస్మం అవుతున్నా మరొక జన్మ ఎత్తుతాను. నా కోరికను తీర్చుకుంటాను” అన్న మాటలు చితి నుంచి వినిపించాయి.
పశ్చాత్తాపపడి, భయపడుతున్న మదనమంజరిని వక్రనాథుడు బంధవిముక్తురాలను చేసి పంపేశాడు. చిత్రరేఖ కళేబరం అక్కడకు తీసుకురాబడింది. అవంతి చిత్రరేఖ మృత శరీరం దగ్గర మోకాళ్లపై కూర్చుని, కత్తితో తన వేలికి చిన్న గాయం చేసుకొని, రక్తబిందువులను కొన్ని చిత్రరేఖ నుదుటిపై కళ్ళపై రాల్చింది.
చిత్ర లేఖ నిద్రలోనుంచి లేచినట్టు లేచి కూర్చున్నది. చుట్టూ అందరిని చూస్తూ కంగారు పడుతున్న చిత్రరేఖకి జరిగిన విషయాన్నంతా వక్రనాథుడు చెప్పాడు. తనకు ‘ప్రాణదానం చేసిన దేవత’ అంటూ అవంతి కాళ్ళకు నమస్కరించింది చిత్రరేఖ. అప్పుడు అక్కడున్న వారందరికీ అవంతి పై మరింత గౌరవం ఏర్పడింది.
“ఇక మాకు సెలవు ఇప్పించండి. మేము వెళతాము” అన్న మకరందాదులతో “ఇక్కడ రాజ్యభారము మరొకరికి అప్పజెప్పి నేను కూడా మీతోనే వస్తాను. రేపే మన ప్రయాణం. అవసరమైన సాధన సామాగ్రి సిద్ధం చేయమని చెప్తాను” అంది మాధురీబేగం.
అవంతి కోసం అమూల్య రత్న వజ్ర వైఢూర్యాలు, వెలలేని ఆభరణాలను, వెండి బంగారు సామాగ్రిని గోతాలతో నెక్కించి ఓడలో చేర్చించింది మాధురి. విశ్వాసపాత్రులైన కొందరు పరిచారకజనంతో, సరిపడా ఆహార పదార్థాలతో ఓడ బయలుదేరింది. అందరూ ఆనందంగా హాయిగా సంభాషణ జరుపుతున్నారు. చల్లటి సముద్రపు గాలిలో సాగుతున్న ఓడ ప్రయాణం మరింత ఆనందాన్ని చేకూరుస్తోంది.
ప్రశాంతంగా ఉన్న ఆకాశాన ఉన్నటువంటి ఒక చిన్న మబ్బు తునక కనిపించింది…. క్రమంగా పెద్దదవుతుంది…. మరికొన్ని ఉద్భవించి ఆకాశమంత అలుముకున్నాయి…. గాలి కూడా ఆరంభమై, సముద్రం అల్లకల్లోలం అవుతున్నది. నావికులు ఎంత ప్రయత్నిస్తున్నా…. ఉరుములు మెరుపులతో …చెలరేగుతున్న అలల మధ్య నావ ముందుకు కదల లేకపోతోంది. లంగరు వేసినా నావ కదలికలు ఆగడంలేదు. వర్షం… ప్రళయం…!
ఒకరి చేతులు ఒకరు పట్టుకొని విలపించసాగారు. “మనం సుఖంగా బ్రతకటం ప్రకృతి కూడా ఇష్టం లేదని తేలిపోయింది” అన్నది మాధురి. “మరు జన్మలో నైనా మనం అందరం తిరిగి కలుసుకుందాం” అన్నాడు మకరంద్ దుఃఖం నిండిన గొంతుతో.
దగ్గరలో ఒక పెద్ద పిడుగు పడింది…. దూరం నుంచి వచ్చిన ఒక సముద్ర తరంగం కొట్టిన దెబ్బకు ఓడ రెండుగా చీలిపోయింది….. మరుక్షణం ఎవరికి వారే సముద్ర గర్భంలో కలిసి..పో..యా..రు.


(దుష్టుడు లాల్మియా మరణించాడా? సముద్రంలో పడిపోయిన మకరందాదులు కూడా మరణించారా? చిలుక సారంగి చెప్తున్న కథకు ఇప్పుడు వింటున్న మహారాజుకు సంబంధం ఉందా? … తరువాయి భాగంలో…)
(సశేషం)

10 Comments
BHOGARAJU SATYANARAYANA
EXCELLENT EXCELLENT EXCELLENT
APPRECIATION OF SRI KOVVALI NAGESWARA
RAO CHENNAI TO THIS WRITER IS OUTSTANDING
THIS IS NOT APPRECIATION BUT ACTUAL FACT GREATNESS OF Dr SUSHEELAMMA GARU
BHOGARSJU SATYANARAYANA
(SURYAPRABHAPATHY)
8143236195
సిహెచ్.సుశీల
శ్రీ కొవ్వలి గారి పెద్ద కుమారుడు కొవ్వలి నాగేశ్వరరావు గారు నా రచనను ప్రతివారం చూస్తూ, వారి నాన్న గారి గురించిన విశేషాలు చెప్తూ, నన్ను ప్రోత్సహిస్తూ, ఈరోజు నాపై వాత్సల్యంతో వారు వ్రాసిన లేఖను చూస్తే ఆనందంతో కృతజ్ఞతతో నా కళ్ళు చెమరుస్తాయి.
ధన్యవాదాలు పెద్దన్నయ్య.
BHOGARAJU SATYANARAYANA
YOUR SPANDANA ON K N R S SPANDANA
IS VERY NICE
BHOGARAJU SATYANARAYANA
EXCELLENT EXCELLENT EXCELLENT
SPANDANA OF SRI KOVVALI NAGESWARA
RAO CHENNAI. THE ELDEST SON OF
KOVVALI –IS VERY NICE APPRECIATION
OF Dr SUSEELAMMA GARU
సిహెచ్.సుశీల
Thank you very much Bhogaraju Satyanarayana garu.
Jhansi koppisetty
శ్రీ కొవ్వలి నరసింహారావు గారిని సాహితీపరంగా పునర్జీవులను చేస్తున్నారు మీరు మీ కృషి ఎంతైనా అభినందనీయం… వారి పుత్రులు కొవ్వలి నాగేశ్వరరావు గారి తడి లేఖ వారికి వారి తండ్రిపై గల ప్రేమను నిరూపిస్తూ మనసును తడిమింది… వారి లేఖను యథాతథంగా ప్రచురించటం బావుంది సుశీలగారూ…
సిహెచ్.సుశీల
ధన్యవాదాలు ఝాన్సీ గారు.
శీలా సుభద్రా దేవి
కొవ్వలి రచనను మళ్ళీ వెలుగు లోకి తెస్తున్నందుకు వారి కుటుంబ సభ్యులకే కాక కొవ్వలి అభిమానులకు కూడా ఆనందం కలుగజేస్తుంది డా.సుశీలగారికి అభినందనలు.
సిహెచ్.సుశీల
ధన్యవాదాలు సుభద్ర గారు.
రాజేశ్వరి దివాకర్ల
కొవ్వలి గారి రచనలను పఠకులకు అందిస్తున్న సుశీలగారి పరిశోధన కు అభినందనలు .ముఖ్యంగా వారి కుటుంబానికి ఆనందం కలిగించడం వారి శ్రమకు ఫలిత మిచ్చింది.ఇది సాహిత్య చరిత్రలో నూతన అధ్యాయాన్ని విప్పిన గొప్ప రచన .చరిత్రను వెలుగులోకి తెచ్చిన సుశీల గారి ప్రతిభ ప్రశంస నీయం