యసునారీ కవబాతా ప్రఖ్యాత జపనీస్ రచయిత. 1968లో వీరి మూడు జపనీస్ నవలల ఆధారంగా వీరికి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఆ మూడింటిలో మొదటి నవల “యుకిగుని”. ఈ జపనీస్ నవలనే ఇంగ్లీషులో “స్నో కంట్రీ” అని అనువదించారు. జపనీస్ సాహిత్యంలో ఈ నవలది ప్రత్యేక స్థానం. మొదట ఒక చిన్న కథగా దీన్ని రచయిత రాసారు. కాని ఆ పాత్రలపై ప్రేమతో వాటి చూట్టూ కథ అల్లుకుంటూ వెళ్ళడంతో దీనికి ఒక నవలా రూపం వచ్చింది. 1935లో మొదట చిన్న కథగా మొదలైన ప్రయాణం 1948లో ప్రస్తుతం మనం చదువుతున్న నవలగా రూపాంతరం చెందింది. ఈ నవల రాయడం కోసం వారు వెళ్ళి ఉండిన హోటల్ని మ్యూజియంగా మార్చింది జపనీస్ ప్రభుత్వం. అంటే ఈ నవల వారి సాహిత్యంలో ఎంత గొప్ప గౌరవాన్ని పొందిందో అర్థం చేసుకోవచ్చు. వీరికి నోబెల్ రావడానికి ఈ నవల ముఖ్య కారణం అయితే “ది ఒల్డ్ కాపిటల్” “థౌసండ్ క్రేన్స్” నవలలు కూడా కలిపి నోబిల్ కమిటి మూడు నవలలను ప్రస్తావించి వీరికి నోబల్ ఖారారు చేసింది.
ఇది ఒక ప్రేమ కథ. టోక్యోలో గొప్ప బిజినెస్‌మెన్‌గా ఖ్యాతి గడించిన షిమామూరా, ఒక మంచు ప్రదేశంలో గీషా గా వృత్తి చేపట్టిన కొమాకో ల మధ్య నడిచిన కథ ఇది. అతిథులను ఆదరించడానికి జపాన్‌లో 15 సంవత్సరాల అమ్మాయిలను గీషాలుగా ట్రైనింగ్ ఇస్తారట. వీరిచ్చే ఆతిథ్యం అపురూపంగా ఉంటుందని అంటారు. అది ఒక సాంప్రదాయం. టొక్యో లాంటి ప్రాంతాలలో గీషాలకు ఎంతో గౌరవం దొరుకుతుంది. కాని షిమామూరా ఒక మారుమూల పర్యాటక స్థలానికి వస్తాడు. ఇది జపాన్ లోని అన్ని పర్యాటక స్థలాల కన్నా అతి చల్లటి ప్రదేశం. ఎక్కువ మంది ఇష్టపడే చోటూ కాదు. ఈ చిన్న ఊరిలో కొమాకో ఒక గీషా. ఈ ఊర్లో గీషాలను వేశ్యలుగా చూడడం జరుగుతుంది. టోక్యోలోని గీషాలుగా సమాన గౌరవం వీరికి ఇక్కడ లభించదు. షిమామూరా మొదటిసారి కొమాకో ని కలిసినప్పుడు ఆమె మిగతా గీషాలకు సహాయకురాలిగా ఉంటుంది.అప్పుడే ఆమెతో అతను ప్రేమలో పడతాడు. కొమాకొ కూడా అతన్ని చాలా ఇష్టపడుతుంది. ఈ ప్రాంతంలో గీషాలు చాలా దారుణమైన పరిస్థితులలో జీవిస్తూ ఉంటారు. చాలా మంది విషాదకర పరిస్థితులలో మరణిస్తారు కూడా. కొమాకో గీషా గా మారాలని అనుకోదు. షిమామూరా తో మనస్పూర్తిగా కలుస్తుంది. సెలవులు అయిపోయిన తరువాత షిమామురా నగరానికి వెళ్ళిపోతాడు. కాని మళ్ళీ సెలవులకు అక్కడికే వస్తాడు. ప్రయాణంలో యోకో అనే మరో అమ్మాయిని చూస్తాడు. ఆమె ఎంతో మంచి మనసుతో ఒక రోగికి సేవ చేస్తూ ట్రైన్లో కనిపిస్తుంది.
ఊరిలోకి వచ్చిన తరువాత షిమామురా కొమాకో గురించి వాకబు చేస్తాడు. ఆమె గీషా గా మారిందని. ఇష్టం లేకపోయినా తన టీచర్ కోడుకు కోసం ఆమె అలా డబ్బు సంపాదించవల్సి వచ్చిందని తెలుసుకుంటాడు. కొమాకో కు టీచర్ కొడుకుతో పెళ్ళి కుదిరిందని తెలుస్తుంది. కాని అతని ఆరోగ్యం సరిగ్గా లేనందున అతని మందుల కోసం ఆమె గీషాగా సంపాదిస్తుందని తెలుసుకుంటాడు. యోకో ఇప్పుడు కొమాకోకి సహాయం చేస్తూ ఉంటుంది. కాని వీరిద్ధరి మధ్య ఒక వైరం ఉంది. కొమాకో ఆ టీచర్ కుమారుడీకి నిశ్చతార్ధం అయ్యిందని తెలుసుకుని కూడా యోకో ఆ టీచర్ కొడుకును ప్రేమిస్తుంది. అతనికి సేవ చేస్తూ ఉంటుంది. అతని కోసం ఆ ఇద్దరు ఒకరినొకరు భరిస్తూ ఉంటారు. కాని ఆ టీచర్ కొడుకు అనారోగ్యంతో మరణిస్తాడు. కొమాకో, యోకో ల పరిచర్యలు కూడా అతనికి మేలు చేయవు. యోకో అతని సమాధిని రోజు దర్శిస్తు ఉంటుంది. అతని కోసమే గీషాగా మారిన కొమాకొ మాత్రం అతని సమాధి వద్దని వెళ్ళాలని అనుకోదు. ఆతని మరణం తరువాత అతని గురించి ఆలోచించడం కూడా ఇష్టపడదు. ఆమె ప్రేమించినది షిమామూరాని. టీచర్ కొడుకు ఆమెకు బాధ్యత మాత్రమే. బాధ్యత కారణంగా అతని కోసం గీషాగా మనసు చంపుకుని మారి డబ్బు సంపాదించింది కాని అతన్ని ప్రేమించలేదు. ఇప్పుడు షిమామూరా వచ్చిన తరువాత అతనితోనే ఆమె తన సమయం అంతా గడుపుతుంది. మిగతా కస్టమర్లను నిర్లక్ష్యం చేస్తుంది.
తన కోసం వచ్చేవారిని షిమామురా కోసం వదులుకుంటున్న కొమాకో ప్రవర్తన అందరికీ వింతగా కనిపిస్తుంది. షిమామూరా స్పష్టంగా తనకు కొమాకో కు మధ్య ఉన్న సంబంధం శాశ్వతమైనది కాదని చెప్తాడు. ఆమెతో ప్రేమ ఉన్న మాట నిజమే కాని ఆమెతో జీవితాంతం ఉండలేనని చెప్తాడు. అయినా కొమాకో తన గురించి ఇతరులే మంటున్నారన్నది పట్టించుకోదు. షిమామురా తో తన అనుబంధం శాశ్వతం కాదని తెలిసినా అతని సాంగత్యాన్నే కోరుకుంటుంది. తన వృత్తిని నిర్లక్ష్యం చేయడం వల్ల డబ్బు సంపాదించే మార్గం మూసుకుపోతుందని తెలిసినా షిమామూరా సాంగత్యం కన్నా తనకేం అవసరం లేదని అతనితో వీలైనంత ఎక్కువ సమయం గడపడానికే ఇష్టపడుతుంది.
డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉండే ఒక గీషా లో ఈ నిస్వార్ధ ప్రేమ చూసి షిమామురా చలించిపోతాడు. అలాగే మరొకరితో నిశ్చిత్తార్ధం జరిగిన ఆ టీచర్ కొడుకు కోసం అతను జీవించి ఉన్నప్పుడు, మరణించాక కూడా అతని కోసమే తపించే యోకోని చూసినా అతనికి ఆశ్చర్యమే. ఇద్దరూ కూడా గీషాలుగా బ్రతకాలని అనుకోరు. జీవితం వారిని ఇటువైపు నెట్టినా అంతటి కఠినమైన పరిస్థితులలో కఠినమైన మనుష్యుల మధ్య కూడా మనస్పూర్తిగా మరొకరిని నిస్వార్థంగా ప్రేమించగల ఈ ఇద్దరు యువతులపై అతనికి అంతులేని గౌరవం కలుగుతుంది. వారి ప్రేమ కారణంగా వారికి దుఖం తప్ప మరేం దొరకదని తెలిసినా దాన్ని కూడా బాధ్యతగా స్వీకరించగల వారి మనోధైర్యం అతన్ని ఆశ్చర్యపరుస్తుంది.
చివర్లో వారి ఇల్లు తగలబడిపోతున్నప్పుడు కొమొకో యోకోని మేడ మీదనుండి క్రిందకి పడేస్తుంది. అలాగన్నా ఆమెను తగలబడిపోకుండా కాపాడాలని చూస్తుంది. ఆమెకేం జరిగిందో రచయిత ఇక్కడ స్పష్టంగా చెప్పడు. శరీరాన్ని కాల్చే మంట కన్నా మరణించిన టీచర్ కొడుకు కోసం నిరంతరం వేదన అనుభవిస్తూ కాలిపోతున్న ఆమెను రక్షించినంత మాత్రాన ఆమె జీవితం ఒక గాడిన పడుతుందన్న ఆశ లేనందువలన ఆమె మరణించిందా లేదా అన్నది రచయిత స్పష్టపరచరు. టీచర్ కొడుకు మరణం తరువాత ఆమె కూడా మరణించినట్లుగానే రోజులు నెడుతుంది. ప్రేమ మార్గంలో ప్రయాణీంచి కొమాకో, యోకో మరణాన్ని ముందే కోరుకున్నారన్నది నిజం. వారి జీవితంలో సంతోషాన్ని ఇచ్చే మార్గం కాకుండా ప్రేమ మార్గాన్ని నిర్ణయించుకున్నాక ఇష్టపూర్వకంగా వారే తమ జీవితంలోని ఆనందాన్ని వదిలేసారన్నది నిజం. వీరి జీవితంలో ఈ విషాదాన్ని షిమామూరా ఒక ప్రేక్షకుడిగా చూస్తూ ఉండిపోతాడు. వారిని గౌరవిస్తాడు కాని తన జీవితంలో వారికి స్థానం ఇచ్చేటంతటి ఉన్నతమైన ఆలోచనలు అతనిలో లేవు. కొమాకో ప్రేమ ను ఆస్వాదిస్తాడు కాని ప్రతిగా ప్రేమించాలని అతనికి అనిపించదు.
ఈ కథ నడిచే స్థలం అతి చల్లని మంచు ప్రదేశం. ప్రపంచంలోనే అతి చల్లని ప్రదేశంగా రచయిత చెప్తాడు తప్ప ఆ ఊరి పేరు ఎక్కడా ప్రస్తావించడు. ఈ ఊరితో ముడిపడి ఉన్న అందరి జీవితాలు అంతే డిప్రెసివ్ గా ఉంటాయి తప్ప ఎవరిలో ఉత్సాహం ఉండదు. సూర్యకిరణాలు దూరని చోటు ఇది. ఎటువంటి ఆశలు, కోరికలకు జన్మ ఇవ్వలేని ప్రదేశం అది. అక్కడి స్త్రీలు ఎవ్వరికీ అక్కరలేదు. ఇటువంటి చోటుకు పురుషులు తమ రోటిన్ నుండి దూరం అవడానికి సరదా పడి వస్తారు. వారికి కావల్సింది కాస్తంత సరదా. తీసుకోవడమే తప్ప ఇవ్వడం అన్నది అక్కడ జరగదు. వారికి దక్కిన అనందాన్ని పుచ్చుకుని అపారమైన విషాదాన్ని అక్కడివారికి మిగిల్చి వారు వెళ్ళిపోతారు. మళ్ళీ సెలవులలో ఆనందం కోసం అక్కడికి మళ్ళీ వస్తారు. అక్కడి వారికి విషాదాన్ని పంచి మళ్ళి వారి గురించి ఆలోచించకుండా వెళ్ళిపోతారు.
షిమామూరాకి తెలుసు తన రాకతో అక్కడ ఒక స్త్రీ జీవితం కోంచెం కొంచెంగా పతనం వైపు ప్రయాణిస్తుందని. అయినా ఆమె కోసం ఆలోచించడు. ఆమెను గొప్పగా చూస్తాడు కాని ఆమె కోసం ఏమీ చేయడు. అమె నుండి పొందవలసినది పొంది ఆమెను మోడుగా మార్చి మళ్ళి ఆమె కోసం ఆమె పొందు కోసం సెలవులకి వస్తూ ఉంటాడు. అతనికోసం కొమాకో ఎదురు చూస్తూనే ఉంటుంది. అంత కన్నా చేయగలిగింది మరేం లేదు కాబట్టి.
ఈ నవల చాలా విషాదంతో మొదలయి విషాదంతో ముగుస్తుంది. ప్రేమ అనే భావం మనిషికి మిగిల్చే విషాదంలోని భయంకరమైన ఒంటరితనం నవల అంతా కనిపిస్తూ ఉంటుంది. కాని ఈ నవలలో పురుషుని ప్రేమకు స్త్రీ ప్రేమకు మధ్య తేడాను రచయిత చూపించిన విధానం బావుంది. షిమామూరా మరోలా ఉండలేడు, కొమాకో అలా కాకుండా మరోలా ఉండలేదు. ఏ దేశమైనా ప్రేమ వద్దకు వచ్చేసరికి పురుషుడు స్త్రీలలో తేడా మాత్రం ఒకే రకంగా ఉంటుందేమో. అత్యంత విషాదంగా ముగిసే ఈ నవల లో ఆ పాత్రల కారెక్టరైజేషన్ చాలా బావుంటుంది. రచయిత కూడా కొన్ని సంబంధాలకి, కొన్ని విషాదాలకు సమాధానాలుండవు అని బలంగా నమ్మినట్లు కనిపిస్తుంది. అత్యంత విషాద ప్రేమ కథలలో ఒకటిగా ఇది గుర్తుండిపోతుంది.
మీ సమీక్ష బాగుంది. ఈ సమీక్ష ద్వారా గీషా..లా గురించి తెలుసుకునే అవకాశం కలిగింది. సమీక్ష చదవడం పూర్తి అయ్యాక ఈ విషాద నవల చదవాలనే కోరిక ఎక్కువైంది. రచయిత్రికి అభినందనలు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™