(ప్రధాన కథలో నాయికా నాయకులు – రాగలత, జయదేవ్. దానిననుసరిస్తూ సాగే కథలో – హేమాంగి, మైనాకుడు. సారంగి (చిలుక) చెప్పే కథలో నాయికా నాయకులు అవంతి, మకరంద్. ఎప్పటికప్పుడు ప్రతినాయకులు, మాంత్రికులు – ఇంకా అనేక పాత్రలు. ఎక్కడ బిగి సడలకుండా కథ, పాత్రలు, సన్నివేశాలు సమానమైన ఉత్కంఠతో సాగిపోయేలా చిత్రించడంలో కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు అద్భుతమైన నైపుణ్యం చూపించారు)
దేవగిరిని ముఖ్యపట్టణంగా చేసుకొని పాండ్య దేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా, నిరంకుశంగా పరిపాలిస్తున్న ‘మహాబలుడు’ అనే మహారాజు తన భార్యను దారుణంగా హత్య చేయడంతో కథ ప్రారంభమవుతుంది.
అది తాను ఆమెకు విధించిన మరణ దండన అని ప్రకటించాడు మహాబలుడు. అంతేకాక రోజుకొక కన్య చొప్పున తనకు సమకూర్చాలని దళపతి రణధీర్‌ను ఆజ్ఞాపించాడు. ప్రజలందరూ ఆశ్చర్యచకితులౌతారు. ఆ విధంగా రాజ్యంలోని అందమైన కన్యలను రోజుకొకరిని వివాహమాడి, ఒక రాత్రి వారితో సర్వసౌఖ్యాలు అనుభవించి, ఉదయమే హత్య చేయటం జరుగుతోంది. కారణం ఎవరికీ తెలియదు.
మొదటిసారి వివాహమాడి మరుసటి ఉదయమే హత్య చేయబడిన స్త్రీ లవంగలత. ఆమె తండ్రి నిగమశర్మ. ఆమె సోదరుడు జయదేవుడు – ఈ నవలకు కథానాయకుడు. సంప్రదాయ సిద్ధంగా పన్నెండేళ్ళు గురువు ‘శివస్వామి’ వద్ద గురుకులవాసం చేసి, సమస్త విద్యలను నేర్చి, నిర్ణీత కాలం దేశాటన ముగించుకుని, తన ఇంటికి, 21వ ఏట చేరుకొన్న జయదేవునికి తల్లిదండ్రులు విలపిస్తూ లవంగలతకి జరిగిన ఘోర మరణ వృత్తాంతాన్ని వివరిస్తారు. ఏమి నేరం లేకుండా, విచారణ లేకుండా, అకారణంగా, రాజైనా సరే ఎలా దండన విధిస్తాడు! అలాంటి నరరూప రాక్షసుడిని సంహరించి, వాడి రక్తంతో చెల్లి ఆత్మకు శాంతి చేకూర్చుతానని శపథం చేసి బయలుదేరుతాడు జయదేవ్.
మహాబలుని మారణ హోమానికి నూరుగురు కన్యలు ఆహుతులు అయినారు. రాజ్యంలోని అందగత్తెలయిన కన్య లందరూ దాదాపు అయిపోయారు. ఈ హింసాకాండను ప్రజలందరూ గర్హిస్తున్నారు. అసహ్యించు కుంటున్నారు. కానీ రాజుని అడ్డుకునే వారు ఎవరున్నారు? ఇక రణధీర్‌కు ఎంత గాలించినా మహారాజుకు సమర్పించేందుకు రాజ్యంలో ఒక్క కన్య కూడా లభించలేదు.
ఒక రోజు వేటకు వెళ్లిన రాజుకి చెలులతో విహరిస్తున్న ఒక లోకోత్తర సౌందర్యరాశి కని పించింది. అనుచరులు వివరాలు తెలుసుకొని వచ్చి చెప్పారు – దండనాయకుడు రణధీర్ యొక్క కుమార్తె “రాగలత” ఆమె. అతిలోక సుందరి అఖండ విద్యా ప్రవీణురాలు అపర సరస్వతి అని , ఆమెకు కాబోయే భర్త కూడా అటువంటి విద్యావంతుడు అయి ఉండాలని ఆమె కోరిక అని, కనుకనే దండనాయకుడు ఆమెకు తగిన వరుని సంపాదించ లేకపోయాడు ఇంతవరకు – అని తెలిపారు.
వెంటనే రణధీర్‌ని పిలిపించాడు మహారాజు మహాబలుడు. ఆయన కన్ను తన కూతురు మీదే పడిందని విని స్ధాణుడై పోయాడు రణధీర్. రాజుకి ఎందరినో కన్యలను సమర్పించి ఆయన చేసే మానవ యజ్ఞానికి సాయం చేసిన తనకే ఇంత ఘోరమైన పరిణామం ఎదురవుతుందని ఊహించ లేకపోయాడు. వదిలేయమని ప్రాధేయపడ్డాడు. కనికరించలేదు మహారాజు. ఖైదు చేయించాడు. రాగలతని అలంకరించి, వివాహానికి సిద్ధం చేయమని సేవకులను ఆజ్ఞాపించాడు.
***
దుందుభి, దంతనాధులు రాక్షస దంపతులు. నిజానికి మొదట వారు రాజ దంపతులు. ఎంతకాలానికీ సంతానం కలగలేదని, చివరికి విరక్తితో, అడవులకేగి ‘శివస్వామి’ ఆశ్రమంలో శేష జీవితం గడపాలని నిర్ణయించుకుంటారు. అలా కొంతకాలం గడిచిన తరువాత ఒక నాటి ఉదయం దుందుబి మగని వద్దకు వచ్చి తనకు రాత్రి ఒక కల వచ్చిందని, ఆ కలలో తమకు పుత్రుడు జన్మించాడని, వానితో తాము సంతోషంగా ఆటపాటలతో మునిగినట్లు చెప్పింది. ఆశ్రమ జీవితం గడుపుతున్న తమకు సంతానం ఏమిటి అని దంతనాథుడు అన్నప్పటికీ ఆమె బలవంతం మీద వారిరువురు ఆ పగటి సమయంలో దాంపత్య సుఖం అనుభవించారు. తర్వాత శివ స్వామి ఆగ్రహానికి గురై రాక్షసులుగా మారి పోవడం జరిగింది. శాపవిమోచనం కోసం ప్రార్థించగా, ‘ఎవరికైనా 10 ఉపకారాలు చేసి, తద్వారా మంచి చేస్తే రాక్షస ఆకారాలు పోతా’యని అనుగ్రహించారు స్వామి.


ఆ రాక్షస దంపతులు నిశా సమయంలో ఆకాశమార్గాన వెళుతుండగా ప్రయాణపు బడలికచే విశ్రమించి ఉన్న జయదేవుని చూసి ఆగారు. ‘ఎంత సౌందర్యవంతుడు’ అని దంతనాథుడు అబ్బురపడ్డాడు. అతని మాటలను ఖండించిన దుందుభి ‘ఇదేమి సౌందర్యం , పాండ్య నగరంలో ఒక అతిలోక సౌందర్య రాశిని చూశాను. ఆమె ఇతనికంటే సౌందర్యరాశి’ అన్నది. ఇద్దరూ చాలాసేపు వాదించుకున్నారు. చివరకు ఈ వాదన తేలాలంటే ఇద్దరినీ పక్క పక్కన ఉంచి తేల్చాలని, జయదేవునికి నిద్రాభంగం కలుగకుండా, జాగ్రత్తగా రాగలత వద్దకు తరలించి, ఆమె పాన్పుపై ఉంచారు. ఇద్దరూ ఇద్దరే. ఎవరిది ఎక్కువ సౌందర్యమో తేల్చుకోలేకపోయారు. సమర్థుడైన మధ్యవర్తి అవసరం అయ్యాడు. నిద్రాభంగం కాకుండా ఇద్దరినీ తమ వీపులపై ఎక్కించుకొని ఆకాశమార్గాన ఇద్దరూ పయనమయ్యారు. ‘స్త్రీ స్త్రీ పక్షపాతంతో, పురుషుడు పురుష పక్షపాతంతో మాట్లాడతారు. కనుక అక్కడికి 60 యోజనాల దూరంలో, చంపానదీ తీరంలో, మైనాకము అనే పక్షి – ఆడ మగ కాక, వృక్షమునకు తలకిందులుగా వేలాడుతూ తపస్సమాధిలో ఉంటుంది. అక్కడ సరైన తీర్పు లభిస్తుంది’ అని ఒక రాక్షస జాతికి చెందినవాడు చెప్పగా వారు అక్కడికి బయలుదేరారు.
ఒక మహా వృక్షానికి తలకిందులుగా వేలాడుతూ తపస్సమాధిలో ఉన్న మైనాకుని వద్దకు నిద్రావస్థలో వున్న జయదేవ్, రాగాలతతో లను చేర్చి రాక్షస దంపతులు తమ ఈ ధర్మ సందేహాన్ని తీర్చమని ప్రార్థించగా అతడు కళ్ళుతెరచి చూశాడు. ఇద్దరిని పరికించి, పరిశీలించి చూసి “వీరిరువురి కంటే మించిన సౌందర్యరాశి ఉన్నది” అన్నాడు మైనాకుడు.
(మైనాకుడు ఎవరు? రాగలత కంటే సౌందర్యరాశి ఎవరు? రాగ లత అదృశ్యమైందన్న విషయం మహాబలుడుకి తెలిసిందా? చెరసాలలో ఉన్న రణధీర్ పరిస్థితి ఏమైంది? తరువాతి భాగంలో…)
(సశేషం)

4 Comments
BHOGARAJU SATYANARAYANA
25 భాగాల జగజ్జాణలో రెండవభాగమైన ” అవంతి” ని సంక్షిప్తంగా /సరళంగా
అవిష్కరించారు .మీ రచనా సామర్ధ్యాన్ని బాగా ప్రదర్శించారు
జగజ్జాణ నవల మొత్తం చదవటం కుదరని వారికి మీ ఈ “సరళ “కధ చాలా ఉపయోగం
మీరు వ్రాస్తున్న ఈ సరళమైన కధ చదివేవారికి ఒరిజినల్ నవల చదవాలనే కోరిక బలపడుతుంది కానీ ఇంకోవిధంగా చెప్పాలంటే కధ యొక్క సస్పెన్స్ పోతుందేమో కూడా
ఉదాహరణకు– సినిమా చూడబోయేవాళ్ళకు ఆ సినిమాకధ ముందుగా చెప్పితే సస్పెన్స్
పోతుందికదా .
అసలు నిజం చెప్పాలంటే ఇంత మహత్తర నవల ” జగజ్జాణ”కు సమీక్ష /పరిశీలన
వ్రాయటం , న్యాయం చేస్తూ రాయటం సాహసకార్యమే ! ఎవరు వ్రాయటానికి సాహసిస్తారు
మరో జగజ్జాణ కాక !
–భోగరాజు సత్యనారాయణ ( సూర్రప్రభాపతి)13-12-2020 ఆదివారం
సిహెచ్.సుశీల
ధన్యవాదాలు అండి
Jhansi koppisetty
జానపద కథలా భలే ఇంటరెస్టింగ్ గా వుందండీ
…
Prabhakar Rao Paladi
Very much interesting ….
Prabhakarrao PN — Retd.Principal