[సంచిక పాఠకుల కోసం ‘మనోరమా-సిక్స్ ఫీట్ అండర్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]
హాలీవుడ్ చిత్రాల నుంచి ప్రేరణ పొంది సినిమాలు తీయటం మన దేశంలో ఎప్పటి నుంచో ఉంది. ‘మనోరమా-సిక్స్ ఫీట్ అండర్’ (2007) కూడా అలాంటిదే. ఈ చిత్రానికి ప్రేరణ ‘చైనాటౌన్’ (1974). అయితే ఈ చిత్రం కాపీ కాదు. నిజంగా ప్రేరణ పొందినదే. విశేషమేమిటంటే ‘చైనాటౌన్’ చిత్రంలోని ఒక దృశ్యం ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో టీవీలో కనిపిస్తుంది. చిత్ర దర్శకుడు నవ్‌దీప్ సింగ్ ఆ విధంగా ‘చైనాటౌన్’ రూపకర్తలకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఇదొక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. కానీ మామూలు థ్రిల్లర్లలా ఉండదు. ‘చైనాటౌన్’ నచ్చినవారికి ఈ చిత్రం కూడా నచ్చుతుంది. ‘సిక్స్ ఫీట్ అండర్’ అంటే ‘ఆరడుగుల లోతు’ అని. అంటే ఈ చిత్రంలో హత్యలు ఉంటాయని తెలిసిపోతూనే ఉంటుంది. ఈ చిత్రం యూట్యూబ్‌లో లభ్యం.


సత్యవీర్ రాజస్థాన్‌లోని లఖోట్లో పీడబ్ల్యూడీలో జూనియర్ ఇంజనీర్. నీటికి అక్కడ చాలా విలువ. ఎందుకంటే అదంతా ఎడారి ప్రాంతం. సత్యవీర్ రచయిత కూడా. ‘మనోరమా’ అనే ఒక డిటెక్టివ్ నవల రాశాడు. అది ఘోరంగా ఫెయిల్ అయింది. అది చాలదన్నట్టు ఉద్యోగంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. సస్పెండ్ అయ్యాడు. అతనికో భార్య, కొడుకు. భార్య పేరు నిమ్మీ. అతను భార్య దగ్గర ఏమీ దాచడు. ఆమె కాసేపు మెత్తగా ఉంటుంది. కాసేపు చిర్రుబుర్రులాడుతూ ఉంటుంది. మధ్యతరగతి పెళ్ళాం. అతను లంచం తీసుకోవటానికి ఒక కారణం ఆమె ఒత్తిడి. అతను అన్నిరకాలుగా విఫలమై నిరాశలో ఉంటాడు. ఒక రాత్రి ఒకామె సత్యవీర్ ఇంటికి వస్తుంది. “నేను మంత్రి రాఠోడ్ భార్యని. ఆయనకి అక్రమసంబంధం ఉంది. మీరు సాక్ష్యం తెచ్చివ్వాలి. ఆయన్ని వెంబడించి ఆయన ఫొటోలు తీసివ్వండి. శాసనసభ సమావేశాలు లేనప్పుడు ఆయన ఇక్కడే ఉంటారు. రాసలీలలు సాగిస్తారు” అంటుంది. అతను “నా దగ్గరకి ఎందుకు వచ్చారు?” అంటే “ఈ చిన్న ఊళ్ళో ప్రైవేట్ డిటెక్టివ్ లేడు. మీరు డిటెక్టివ్ నవల రాశారు కదా” అంటుంది. ఇరవై వేల రూపాయలు ఇస్తానని పదివేలు అడ్వాన్సు ఇస్తుంది. అతను ఒప్పుకుంటాడు. నిమ్మీకి ఈ వ్యవహారం నచ్చదు.
సత్యవీర్ మోటారు సైకిల్ మీద రాఠోడ్ని వెంబడిస్తాడు. ఆయనకి యాభై ఏళ్ళ పైనే వయసు ఉంటుంది. ఆయన భార్యని చూస్తే ఆయన కన్నా చాలా చిన్నదని తెలిసిపోతుంటుంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా ముందూ వెనకా బోలెడు కార్లు. సత్యవీర్ రాత్రివేళ రాఠోడ్ ఇంటి వెనక గోడ దూకి వెళతాడు. అప్పుడే కారులో ఒక యువతి వస్తుంది. రాఠోడ్ ఆమెని లోపలికి తీసుకువెళతాడు. ఒక వరండాలో వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఫొటోలు (అప్పట్లో ఫిల్మ్ ఉన్న కెమెరాలే ఉండేవి) తీస్తాడు. వారి మాటలు వినపడవు కానీ రాఠోడ్ ఆ యువతి మీద అరిచి ఆమెని పొమ్మంటాడు. ఆమె వెళ్ళిపోతుంది. సత్యవీర్ మళ్ళీ గోడ దూకబోతూ వెనక్కి తిరిగి చూస్తాడు. వీల్ చెయిర్లో ఉన్న ఒక ముసలావిడ అతన్ని చూస్తుంది. అయితే ఏమీ మాట్లాడదు. ఎవరామె? సత్యవీర్ గోడ దూకి వచ్చేస్తాడు. ఫిల్మ్ రోల్ మిసెస్ రాఠోడ్‌కి ఇస్తాడు. “మీ ఆయన, ఆ స్త్రీ మాట్లాడుకుంటున్న ఫొటోలు తీశాను” అంటాడు. ఆమె ముఖంలో నిరాశ కనిపిస్తుంది. ఆమె కోరుకున్నది ఇదే కదా? నిరాశ ఎందుకు?


తర్వాత సత్యవీర్ దంపతులు కొడుకుని ఆమె అన్న దగ్గర వదిలి జైపూర్ విహారయాత్రకి వెళతారు. ఆమె అన్న పోలీసు ఇన్స్పెక్టర్. ఇతను చెల్లెలి కన్నా బావగారికే మంచి ఫ్రెండు. జైపూర్‌లో ఒక వీధిలో సత్యవీర్కి మిసెస్ రాఠోడ్ కనిపిస్తుంది. సత్యవీర్ దూరం నుంచే “మీనాక్షి గారూ” అని పిలుస్తాడు. ఆమె చూసి కూడా కంగారుగా వెళ్ళిపోతుంది. దంపతులిద్దరూ విహారయాత్ర ముగించుకుని తిరిగి వస్తుంటే దారిలో ఒక ఢాబాలో టీవీలో మీనాక్షి రాఠోడ్ అనాథ శరణాలయాన్ని ప్రారంభించటం చూపిస్తుంటారు. అక్కడ ఉన్నది సత్యవీర్కి తెలిసిన మీనాక్షి రాఠోడ్ కాదు, రాఠోడ్ ఇంట్లో చూసిన వీల్ చెయిర్లో ఉన్న స్త్రీ! అంటే రాఠోడ్ భార్యనని చెప్పినామె ఆయన భార్య కాదు. ‘చైనాటౌన్’ చూసినవరికి ఈ మలుపు ముందే తెలిసిపోతుంది. ఇదంతా సత్యవీర్ ఇన్స్పెక్టరయిన తన బావమరిదికి చెబుతాడు. అతను “పెద్దమనుషుల వ్యవహారాల్లో చెయ్యి పెడితే కాలటం ఖాయం. దూరంగా ఉండు” అంటాడు. ఒకరాత్రి ఇంటికి వస్తున్న సత్యవీర్ దగ్గరకి నకీలీ మీనాక్షి పరుగుపెడుతూ వస్తుంది. అతను తాగి ఉన్నాడు. ఆమెని వేళాకోళం చేసి మాట్లాడతాడు. ఆమె “నాకు ప్రాణాపాయం ఉంది. నాకేమైనా అయితే ఇది గుర్తు పెట్టుకోండి. నా పేరు మనోరమా. మీ నవల పేరే. నా వయసు 32” అని వెళ్ళిపోతుంది. మర్నాడు ఆమె మరణవార్త పేపర్లో వస్తుంది. ఆమె ఒక సమాజ సేవకురాలు. కాలువలు నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పని చేసేది. లారీ కిందపడి మరణించిందని, ఆత్మహత్య అయ్యి ఉండవచ్చని ఆ వార్త సారాంశం.
మొదటిసారి మనోరమా సత్యవీర్ని కలిసినపుడు “మీరెప్పుడైనా మిసెస్ రాఠోడ్ని చూశారా?” అని అడుగుతుంది. అతను లేదని సమాధానం చెబుతాడు. అతను చూసి ఉంటే ఆమె నాటకం సాగేది కాదు. ఆమె పేరు నిజంగా మనోరమాయే. సత్యవీర్ రాసిన నవల పేరు కూడా అదే. నవల తన పేరుతో ఉండటంతో ఆమె చదివింది. ఇప్పుడు డిటెక్టివ్ అవసరం రావటంతో ఆమెకి సత్యవీర్ గుర్తొచ్చాడు. ఇదంతా చిత్రంలో విడమరిచి చెప్పడు దర్శకుడు. కానీ ఆలోచిస్తే మనకే తడుతుంది. అదే ఇక్కడ గొప్పతనం. ‘చైనాటౌన్’ సినిమాలో నాయకుడు ప్రైవేట్ డిటెక్టివ్. ఇక్కడ నాయకుడు డిటెక్టివ్ నవల రాసిన రచయిత. పైగా నిరాశలో ఉన్నాడు. ఇతని మీద ప్రేక్షకులకి జాలి ఉంటుంది. పరిశోధన చేసి విజయం సాధిస్తే ప్రేక్షకులు ఆనందిస్తారు. అయితే ఇక్కడ కూడా అతనికి మోసమే ఎదురయింది. కానీ మనోరమా చావుకి రాఠోడే కారణమని అతనికి అనుమానం. అతను ఊహించినది ఏమిటంటే రాఠోడ్ని బ్లాక్మెయిల్ చేసి మనోరమా కాలువల పనులని ఆపాలని చూసిందని. కాలువలు నిర్మిస్తే తప్పేమిటి? అదో రాజకీయ రహస్యం. ఆమె చావు ఆత్మహత్య కాదని నిరూపించాలని అతను నిర్ణయించుకుంటాడు.


సత్యవీర్ పత్రికల్లో కథలు రాస్తుంటాడు. ఆ విధంగా అతనికి ప్రెస్ కార్డ్ వచ్చింది. ఆ కార్డ్ మీద అతని కలం పేరు ఉంటుంది. ఆ కార్డ్ చూపించి అతను మనోరమా పని చేసిన సామాజిక సంస్థ నిర్వాహకుడితో మాట్లాడతాడు. అతను “ఈ ఎడారిలో కాలువలు రాకుండా అడ్డుకోవటం మా ఉద్దేశం కాదు. రాఠోడ్ కాలువల పేరు చెప్పి ఓట్లు గుంజాలని చూస్తున్నాడు. రాష్ట్రాల జల ఒప్పందం ఇప్పుడు వివాదంలో ఉంది. రాఠోడ్వి దొంగ వాగ్దానాలు” అంటాడు. సత్యవీర్ అతని మాటలకు ప్రచారం కల్పిస్తానని మభ్యపెట్టి మనోరమా వివరాలు రాబడతాడు. మనోరమా మరణం గురించి రాసి రాఠోడ్ తప్పుడు వాగ్దానాలు బయటపెడితే పాఠకులు ఆసక్తిగా చదువుతారని అంటాడు. ఆ నిర్వాహకుడు మనోరమా శీతల్ అనే ఆమెతో కలిసి నివసించేదని చెప్పి అడ్రసు కూడా ఇస్తాడు. సత్యవీర్ ఆ ఇంటికి వెళతాడు. అతను తలుపు కొట్టేలోగా శీతల్ బయటికొస్తుంది. ఆమె బస్సు తప్పిపోతుందని కంగారులో ఉంటుంది. ఆమె అనాథాశ్రమంలో పని చేస్తుంది. అతను “మనోరమా నా క్లయింటు. ఆమె మరణం ఆత్మహత్య వల్ల జరిగిందని నాకనిపించటం లేదు. ఆమె చెప్పిన విషయాలు ఏమన్నా గుర్తొస్తే నాకు చెప్పండి” అని తన ఫోన్ నంబరు ఇస్తాడు.
తర్వాత కాలువ పనులు జరుగుతున్న చోటికి వెళతాడు. ప్రతిపక్షాల ఒత్తిడి వల్ల కాలువ పనులు ఆగిపోయాయి. అక్కడ ఇద్దరు దుండగులు సత్యవీర్ మీద దాడి చేస్తారు. “మనోరమా ఆ రాత్రి నీకేం చెప్పింది?” అని గద్దిస్తారు. అతను చెప్పకపోతే అతని చేతి వేళ్ళు రెండు విరిచేస్తారు. అతను బాధలో ఆమె అన్న మాటలు చెబుతాడు. అవి అర్థం కాక వారు అతన్ని “అనవసరమైన విషయాల్లో తల దూర్చకు” అని బెదిరించి అతని మోటారు సైకిలు తీసుకుని వెళ్ళిపోతారు. ‘చైనాటౌన్’లో దుండగులు నాయకుడి ముక్కు రంధ్రంలో కత్తి పెట్టి ముక్కుపుట కోస్తారు (ఇదే దృశ్యం తర్వాత ఈ చిత్రంలో టీవీలో వస్తుంది.) ఇక్కడ కేవలం వేళ్ళు విరవటంతో సరిపెట్టారు. హీరో ముక్కుకి పట్టీ వేసుకుంటే బాగోదనుకున్నారేమో!


సత్యవీర్ ఒక ట్రక్కు ఎక్కి లఖోట్ చేరుకుంటాడు. ముందు బావమరిది దగ్గరకి వెళతాడు. జరిగింది చెబుతాడు. ఆ దుండగులు మనోరమా గురించి వాకబు చేశారంటే ఆమెది ఆత్మహత్య కాదని అంటాడు. అతని బావమరిది “లారీ డ్రైవర్ చెప్పినదాన్ని బట్టి అది యాక్సిడెంటే అని రుజువయింది” అంటాడు. నిమ్మీ సత్యవీర్ని ఈ గొడవల్లో తలదూర్చొద్దని కోరుతుంది. దీపావళి సెలవులకి తన పుట్టింటికి పోదామంటుంది. అతను వినడు. చేతి వేళ్ళకి పట్టీ వేసుకుని మరీ తన పాత స్కూటర్ ఎక్కి పరిశోధనకి బయల్దేరతాడు. ఎదురుదెబ్బలు తిన్న మనిషిలో ఏదో ఒక విషయంలో పట్టుదల వస్తుంది. తెగింపు వస్తుంది. నవలని సక్సెస్ చేయటం అతని చేతుల్లో లేదు. తీసుకున్న లంచం గురించి విచారణ అతని చేతుల్లో లేదు. ఈ పరిశోధన ఒక్కటే అతను చేయగలిగినది. ఇంట్లో కూర్చుంటే ఆలోచనలతో మతి పోతుంది. అత్తవారింటికి పోతే అదింకా అవమానం. అందుకే ప్రాణాపాయం ఉన్నా తెగించి వెళతాడు. ముందు లారీ డ్రైవర్‌తో మాట్లాడతాడు. అతను నిజమే చెబుతున్నాడనిపిస్తుంది. ఇంతలో దుండగులు నిమ్మీ, బాబు ఇంట్లో లేని సమయం చూసి ఇంట్లో పడి ఇల్లంతా చిందరవందర చేస్తారు. నిమ్మీ భయంతో సత్యవీర్కి చెప్పకుండా బాబుని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి అతనికి శీతల్ నుంచి ఫోన్ వస్తుంది. “నన్నెవరో చంపటానికి ప్రయత్నించారు” అంటుందామె. ఇక్కడి నుంచి కథ మరో మలుపు తిరుగుతుంది.
ఈ చిత్రానికి దేవికా భగత్, నవ్‌దీప్ సింగ్ స్క్రీన్‌ప్లే రాశారు. స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉంటుంది. నవ్‌దీప్ సింగ్ దర్శకత్వం వహించాడు. తొలి చిత్రం అయినా ఎంతో ప్రతిభ చూపించాడు. 2015లో వచ్చిన ‘ఎన్ఎహ్10’ అతనికి పేరు తెచ్చింది. ఆ చిత్రంలో పరువుహత్యల కథ చూపించాడు. సమాజంలో కుళ్ళుని చూపించే అతి కొద్ది మంది దర్శకుల్లో అతనొకడు. ఈ చిత్రంలో సత్యవీర్గా అభయ్ డియోల్ నటించాడు. అతని పెదనాన్న ప్రముఖ హీరో ధర్మేంద్ర. అభయ్ కథాబలమున్న చిత్రాలనే ఎంచుకుని మంచి నటుడనే పేరు తెచ్చుకున్నాడు. నిమ్మీగా గుల్ పనాగ్, మనోరమాగా సారికా (కమల్ హాసన్ మాజీ భార్య), శీతల్గా రైమా సేన్ నటించారు. రాఠోడ్‌గా కుల్ భూషణ్ ఖర్బందా నటన చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. రాజస్థాన్‌లో ఎడారి ప్రాంతంలో కథ జరుగుతుంది. ఎడారిలో ఎండమావులు ఉంటాయి. కనిపించేదేదీ నిజం కాదు. మొదట్లోనే ఈ విషయం ప్రస్తావిస్తాడు సత్యవీర్. ఇదే ఈ చిత్రంలో మళ్ళీ మళ్ళీ రుజువవుతుంది. చిత్రీకరణలో అద్దాలని వాడుకున్న పద్ధతి బావుంటుంది. అద్దంలో కుడి ఎడమలు తారుమారవుతాయి. సత్యవీర్ ఇంట్లో, రాఠోడ్ ఇంట్లో ఎక్వేరియాలు ఉంటాయి. శీతల్ కూడా ఒక గాజు కుండలో చేపని పెంచుతూ ఉంటుంది. ఈ చేపలు కథలో పాత్రలకి సంకేతాల్లా ఉంటాయి. చిన్న చేపని పెద్ద చేప మింగుతుందని సత్యవీర్ బావమరిది అంటాడు. చేపల్ని చూసినప్పుడల్లా మనకి అది గుర్తు వస్తుంది. తర్వాత ఇది కొత్త అర్థాన్ని సంతరించుకుంటుంది.


ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింది భాగంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.
సత్యవీర్ శీతల్ ఇంటికి వెళతాడు. ఆమె తను ఇంటికి వచ్చేసరికి ఎవరో ఇంట్లో ఉన్నారని, తనని తలపై కొట్టటంతో స్పృహ కోల్పోయానని చెబుతుంది. ఆమెకి ఎవరూ లేరని తెలిసి అతను ఆమెని ఇంటికి తీసుకువస్తాడు. మాటల్లో అతను మనోరమా రాఠోడ్ ఫోటోలు తీయమని చెప్పిందని చెబుతాడు. ఆమె “దుండగులు ఆ ఫోటోల కోసమే మా ఇంట్లో ప్రవేశించారేమో? ఆ ఫోటోల్లో ఏముంది?” అని అడుగుతుంది. అతను “చెప్పలేను. వృత్తిపరమైన నియమాలు ఉంటాయి కదా” అంటాడు. మర్నాడు పుట్టింటి నుంచి నిమ్మీ ఫోన్ చేస్తుంది. అతన్ని రమ్మంటుంది. అతను “నేను ఇన్నాళ్ళకి ఒక సొంత నిర్ణయం తీసుకున్నాను. ఈ వ్యవహారం అంతు చూడాలి. నేను రాను” అంటాడు. పక్కింటాయన అడిగితే శీతల్ తన మేనత్త కూతురని చెబుతాడు. శీతల్‌ని అనాథాశ్రమానికి తీసుకువెళతాడు. ఆ అనాథాశ్రమానికి ట్రస్టీ రాఠోడ్. దీపావళి సంబరాలు జరుగుతూ ఉంటాయి. రాఠోడ్ ప్రసంగిస్తాడు. “నా భార్యకి యాక్సిడెంట్ అవటం వల్ల మాకు పిల్లలు కలగలేదు. ఈ అనాథలే నా పిల్లలు” అంటాడు. అక్కడ సత్యవీర్కి తాను తీసిన ఫోటోల్లో రాఠోడ్‌తో ఉన్న యువతి కనిపిస్తుంది. ఆ అనాథాశ్రమంలో ఉన్న డాక్టరు దగ్గరకి వెళుతుంది. సత్యవీర్ ఆమెని వెంబడిస్తాడు. ఆమె డాక్టరుతో “నువ్వు సాయం చేస్తానన్నావు. ఆ జర్నలిస్టు ఎప్పుడొస్తాడు?” అంటుంది. “రాత్రి బాగా తాగాడట. మధ్యాహ్నం వస్తాడు” అంటాడతను. ఇంతలో రాఠోడ్ ఆయాసం రావటంతో డాక్టరు దగ్గరకి వస్తాడు. ఆ యువతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సత్యవీర్ ఓ పక్క కూర్చుంటాడు. రాఠోడ్ డాక్టరుతో “అది ఇక్కడికెందుకు వచ్చింది? నువ్వెందుకు ఆమెతో మాట్లాడతావు?” అంటాడు. డాక్టరు ఏం మాట్లాడకుండా ఆయనకి ఇంజక్షన్ ఇస్తాడు. ఇంజక్షన్‌కి సంబంధించిన డబ్బా బయట ఉన్న చెత్తబుట్టలో పడేస్తాడు. సత్యవీర్ ఆ డబ్బా తీసుకుని వచ్చేస్తాడు.
ఆ యువతి కారెక్కి వెళుతుంటే సత్యవీర్ వెంబడిస్తాడు. ఆమె డాక్టర్ ఇంటికి వెళుతుంది. సత్యవీర్ తానే జర్నలిస్టునని చెప్పి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అక్కడ పుస్తకాలలో ‘మనోరమా’ నవల ఉంటుంది. డాక్టరుకి నవలలంటే ఇష్టమని ఆ యువతి అంటుంది. తర్వాత తన కథ చెబుతుంది. “నా పేరు సమీరా. నేను రాఠోడ్ కూతుర్ని. అనాథాశ్రమంలో పెరిగాను. డాక్టరు గారిని నేను ప్రేమించాను. ఆయనకి అనాథాశ్రమం రికార్డుల వల్ల నా జన్మరహస్యం తెలిసింది. మా అమ్మ ముస్లిం. రాఠోడ్ హిందూ పార్టీ నేత. అందుకే ఆయన ఒప్పుకోవట్లేదు. అనాథని కాబట్టి డాక్టరు గారి కుటుంబం నన్ను స్వీకరించదు. రాఠోడ్ కూతుర్నని ఆయన అంగీకరిస్తే వాళ్ళు ఒప్పుకుంటారు. నాకు నా హక్కు కావాలి. అందుకే పత్రికల సాయం తీసుకోవాలని అనుకున్నాను” అంటుంది. మరో పక్క ప్రతిపక్షాలు అంగీకరించాయని (అంటే వారికి ముడుపులు ముట్టాయన్నమాట), కాలువల పనులు మళ్ళీ మొదలవుతున్నాయని, భూముల ధరలకి రెక్కలొస్తాయని పుకార్లు మొదలవుతాయి. ఆ భూములు రాఠోడ్వి. సత్యవీర్ కౌలు రైతులతో మాట్లాడతాడు. రాఠోడ్ భూములు అమ్ముకుంటున్నాడని కౌలు రైతులు వలస వెళుతుంటారు. నిజానికి కాలువల పనులు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. భూముల ధరలు పెంచటమే అసలు ఉద్దేశం. ఈ అన్యాయాన్ని ఆపాలని మనోరమా రాఠోడ్‌కి అక్రమ సంతానం ఉందనే విషయం బయటపెడతానని బ్లాక్మెయిల్ చేసి కాలువ పనులు ఆపటానికి ప్రయత్నించిందని సత్యవీర్ నిర్ధారణకి వస్తాడు.
ఇక్కడ ఆలోచించాల్సిన విషయం సమీరా సంగతి మనోరమాకి ఎలా తెలిసింది? తెలిస్తే సమీరాకి న్యాయం జరక్కుండా అడ్డుపడుతుందా? ప్రజల కోసం ఆమె అడ్డుపడిందనుకుందాం. ఆమె అడ్డుపడినంత మాత్రాన నిజం దాగుతుందా? మరి రాఠోడ్ ఆమెని నిజంగానే చంపించాడా? ఇంత దూరం సత్యవీర్ ఆలోచించడు. అతనికి కూడా విసుగు వచ్చింది. కానీ ఒకసారి చెయ్యి పెడితే కాలకుండా ఉంటుందా? దీపావళి సెలవులు కావటంతో శీతల్ కూడా సత్యవీర్ పరిశోధనలో అతని వెంటే ఉంటుంది. అతను ముందు ఆమెని తీసుకువెళ్ళటానికి తటపటాయిస్తాడు. “అర్థమయింది. ఒక ఆడదాని జీవితానికీ, చావుకీ విలువ లేదు. కానీ ఓ ఆడది ఎవరి పక్కలో పడుకుంటుందో మాత్రం అందరికీ కావాలి” అంటుంది. ఈ మాటలు బాణాల్లా గుచ్చుకుంటాయి. ఇంతలో శీతల్ విషయం అన్న ద్వారా నిమ్మీకి తెలిసిపోతుంది. సత్యవీర్ కూడా శీతల్‌కి ఆకర్షితుడవుతాడు. కానీ నిమ్మీకి అన్యాయం చేయటం ఇష్టం లేక ముందడుగు వేయడు. నిమ్మీకి ఫోన్లో సర్దిచెబుతాడు.


మర్నాడు డాక్టరు నుంచి ఫోన్ వస్తుంది. సత్యవీర్ని రమ్మంటాడు. సత్యవీర్ వెళ్ళేసరికి సమీరా, డాక్టరు హత్య చేయబడి ఉంటారు. అంటే వారిని హత్య చేసి, డాక్టరు పేరుతో దుండగులు సత్యవీర్కి ఫోన్ చేశారన్నమాట. అతన్ని ఇరికించటానికి. పనిమనిషి అప్పుడే వచ్చి శవాలని, సత్యవీర్ని చూసి అరుస్తూ పారిపోతుంది. సత్యవీర్ అక్కడి నుంచి పారిపోతాడు. బావమరిది దగ్గరకి పోలీస్ స్టేషన్‌కి వెళతాడు. జంట హత్యల గురించి పోలీసులు మాట్లాడుకుంటూ ఉంటారు. పనిమనిషి హంతకుడిని చూసిందని అనుకుంటూ ఉంటారు. భయపడి వచ్చేస్తాడు. శీతల్ ప్రమాదంలో పడిందని ఇంటికి ఫోన్ చేస్తాడు. ఇంట్లో ఎవరూ ఉండరు. ఆమె అనాథాశ్రమంలో ఉందనుకుని అతను అక్కడికి వెళతాడు. దీపావళికి ఆఫీసు మూసేశారని తెలుస్తుంది. అక్కడున్న వ్యక్తితో “శీతల్‌ని కలవాలి” అంటాడు. అతను ఆశ్చర్యపోతూ “శీతల్ మరణించి పది రోజులయింది” అంటాడు! ఈ మలుపు ‘చైనాటౌన్’ చూసినవారు కూడా ఊహించరు.
ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.
అసలైన శీతల్ మనోరమాతో కలిసి ఉండేది. ఆమె చనిపోయింది. ఆత్మహత్య చేసుకుందని అందరూ అనుకుంటారు. ఆమె ఫోటో అనాథాశ్రమంలో నోటీస్ బోర్డులో ఉంటుంది. తన ఇంట్లో ఉన్నది నకిలీ శీతల్ అని సత్యవీర్కి అర్థమవుతుంది. ఇక్కడ రచయితలు తెలివిగా రెండు నకిలీ పాత్రలని సృష్టించారు. ‘చైనాటౌన్’ లో ఉన్నది ఒక్క నకిలీ పాత్ర మాత్రమే. రెండు నకీలీ పాత్రలు ఉంటాయని ప్రేక్షకులు ఊహించరు. రచయితల తెలివికి మెచ్చుకోవాలి. సత్యవీర్ ఇంటికి వచ్చేసరికి నకిలీ శీతల్ ఇంట్లోనే ఉంటుంది. ఆమె అసలు పేరు నీతూ. “నేను ఫోటోల కోసం మనోరమా ఇంటికి వెళ్ళాను. అప్పుడే నువ్వొచ్చి నన్ను చూసి శీతల్ అనుకున్నావు. నీదే తప్పు. నేను ఆట మొదలెట్టాను. రాఠోడ్ గారి కోసం. ఆయనకి ఆ ఫోటోలు ఇచ్చెయ్. లేకపోతే ఇరుక్కుపోతావు. నువ్వు డబ్బుల కోసం రాఠోడ్ని బ్లాక్మెయిల్ చేశావని, సమీరాకి కూడా డబ్బు ఆశ పెట్టావని, ఆమె ఒప్పుకోకపోతే ఆమెని, డాక్టరుని చంపేశావని రాఠోడ్ సాక్ష్యాలతో సహా నిరూపిస్తారు. నీ మోటారు సైకిల్ డాక్టరు ఇంటి దగ్గర దొరికింది” అంటుంది. ఆమె ముఖం గంభీరంగా ఉంటుంది కానీ ఆమె కంటి వెంట నీరు కారుతూ ఉంటుంది. అతని లాంటి మంచిమనిషిని మోసం చేసినందుకు ఆమె బాధపడుతుంది. అతని మీద దాడి చేసిన దుండగులు ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు బయటకి వచ్చి ఫోటోలు ఇచ్చెయ్యమని బెదిరిస్తారు. తర్వాత సత్యవీర్ నిమ్మీకి ఫోన్ చేస్తాడు. “నేను ఇరుక్కుపోయాను” అంటాడు.
జైపూర్‌లో మనోరమా కనపడిన చోట ఫోటో స్టూడియోలో అడిగితే ఫోటోలు దొరుకుతాయి. అయితే ఆమె రెండు ఫిల్మ్ రోల్స్ తెచ్చిందని, తానే డెవలప్ చేసుకుందని, రెండో రోల్ ఫొటోలు మాత్రం ప్రింట్ చేసి తాను తీసుకెళ్ళిందని తెలుస్తుంది. సత్యవీర్ ఫోటోలు పట్టుకుని రాఠోడ్ని కలవటానికి వెళతాడు. ఫోటోలు బల్ల మీద పెట్టి కూర్చుంటాడు. రాఠోడ్ విజయగర్వంతో సూక్తులు వల్లిస్తాడు. “ఈ లోకంలో రెండు రకాలు. పాలకులు, పాలితులు. బలవంతులు, బలహీనులు. వేటగాళ్ళు, వేటాడబడేవాళ్ళు. ప్రకృతి ధర్మమనండి లేదా ఆటవిక న్యాయమనండి. ఇదింతే. మీకు ఇది మార్చే హక్కు ఎవరిచ్చారు?” అంటాడు. తర్వాత ఫోటోలు చూస్తాడు. అతని ముఖంలో రంగులు మారతాయి. “ఇదేం వేళాకోళం? ఇవి పనికిరాని ఫోటోలు. నాకు ఆ ఫోటోలు కావాలి” అని సత్యవీర్ పీక పట్టుకుని బెదిరిస్తాడు. సత్యవీర్ ఇంటికి వస్తాడు. మనోరమా తీసుకెళ్ళిన రెండో రోల్ ఫోటోలలో ఏదో చీకటి నిజం ఉందని అతనికి అర్థమవుతుంది. ఆమె తనతో అన్న మాటలు గుర్తొస్తాయి. “నా పేరు మనోరమా. మీ నవల పేరే. నా వయసు 32.” అప్పుడతనికి ఆమె చెప్పదలచుకున్నది స్ఫురిస్తుంది. తన నవల ‘మనోరమా’లో 32వ పేజీ గురించి ఆమె మాట్లాడిందని అర్థమవుతుంది. తన నవల కాపీ ఒక్కటి కూడా అతని దగ్గర లేదు. డాక్టరు ఇంట్లో ఉందని గుర్తొస్తుంది. అక్కడికి వెళతాడు. నవలతో పాటు రాఠోడ్ మెడికల్ రిపోర్టులు దొరుకుతాయి. నవల్లో మనోరమా, డాక్టరు కలిసి ఉన్న ఫోటో కూడా ఉంటుంది. నవల్లో 32వ పేజీలో “ఆమె నటరాజ్ హోటల్ రూమ్ 101 వైపు వెళ్ళింది. అదే ఆమెకి బందిఖానా అవుతుందని ఆమెకి తెలియదు” అని ఉంటుంది. సత్యవీర్ ఊళ్ళో ఉన్న నటరాజ్ హోటల్‌కి వెళతాడు. 101 గదికి వెళతాడు. వెతికి చూడగా అతనికి ఫోటోలు దొరుకుతాయి. అవి చూసి అతనికి కడుపులో దేవినట్టు ఉంటుంది.
సత్యవీర్కి ఏం జరిగిందో కొంచెం కొంచెం అర్థమవుతుంది. అనాథాశ్రమంలో మైనర్ ఆడపిల్లలను రాఠోడ్ ఇంటికి రప్పించుకునేవాడు. లైంగికంగా వేధించేవాడు. ఈ విషయం శీతల్‌కి తెలిసింది. ఆమె మనోరమాకి చెప్పింది. మనోరమా కాలువల పని ఆపటానికి దీన్ని వాడుకోవాలని చూసింది. సత్యవీర్కి పని అప్పగించింది. అతను ఆ లైంగిక కార్యకలాపాల ఫోటోలు తీస్తాడని అనుకుంది కానీ అది జరగలేదు. అతను ఆమె అనుకున్నంత గొప్ప డిటెక్టివ్ కాదు. తర్వాత మనోరమా తానే ఆ ఫోటోలు తీసింది. రాఠోడ్ లైంగిక దాడిలో ఒక అమ్మాయి చనిపోయింది. ఆమెని కాలువ పనులు జరిగే చోట పాతిపెట్టారు. శీతల్‌ని రాఠోడ్ పంపిన దుండగులు చంపేసి ఆత్మహత్యగా చిత్రించారు. ఫోటోల కోసం మనోరమాని కొట్టారు. ఆమె పారిపోతూ ప్రమాదవశాత్తూ లారీ కింద పడి చనిపోయింది. మరో పక్క సమీరా, డాక్టరు పత్రికల వారికి సమీరా జన్మరహస్యం చెబుతామని రాఠోడ్ని బెదిరించారు. సత్యవీర్ కూడా తలనొప్పిగా మారాడు. ఒకే దెబ్బకి రెండు పిట్టలన్నట్టు సమీరాని, డాక్టరుని చంపేసి, ఆ నేరం సత్యవీర్ మీదకి వచ్చేలా పథకం వేశాడు. సత్యవీర్ తన బావమరిది దగ్గరకి వెళ్ళి ఇదంతా చెబుతాడు. అయితే ఆ బావమరిది కూడా రాఠోడ్ మనిషే. సత్యవీర్కి మద్యంలో మత్తుమందు ఇచ్చి ఆ ఫోటోలు రాఠోడ్‌కి అప్పగిస్తాడు.
రాఠోడ్‌కి తెలిసిందేమింటంటే మనోరమా, డాక్టరు తోబుట్టువులు. మనోరమా రాఠోడ్ మనిషే. సామాజిక సంస్థలో ఆయనకి గూఢచారి. అందుకే ఆయన ఇంట్లోకి తేలిగ్గా ప్రవేశించింది. సమీరా, డాక్టరు ప్రేమించుకుంటున్నారని ఆమెకి తెలుసు. కానీ సమీరా అనాథ. రాఠోడ్ ఆమె తన కూతురని ఒప్పుకుంటే వారు పరువుగా పెళ్ళి చేసుకోవచ్చు. లైంగిక కార్యకలాపాల ఫోటోలున్నాయని మనోరమా రాఠోడ్ని బ్లాక్మెయిల్ చేసి సమీరాని కూతురిగా ఒప్పుకోమని బెదిరించింది. కానీ సత్యవీర్కి దొరికిన ఇతర సాక్ష్యాల పట్టుకుని మరికొంత పరిశోధన చేస్తే అతనికి అసలు విషయం అర్థమవుతుంది. రాఠోడ్‌కి క్యాన్సర్ సోకింది. ఆ మెడికల్ రిపోర్ట్ సత్యవీర్కి దొరికింది. డాక్టరు ఈ విషయం దాచాడు. రాఠోడ్‌కి కేవలం ఆయాసం అని చెప్పాడు. క్యాన్సర్ లక్షణాలు తగ్గించటానికి మాత్రమే ఇంజక్షన్లు ఇచ్చాడు. ఆ ఇంజక్షన్ డబ్బా సత్యవీర్కి చెత్తబుట్టలో దొరికింది. ఇక్కడ అతని డిటెక్టివ్ బుర్ర బాగా పని చేసింది. రాఠోడ్ సమీరా తన కూతురని ఒప్పుకున్నాక త్వరగా మరణిస్తే ఆస్తి చేజిక్కుతుందని అక్కాతమ్ముళ్ళు ఆశపడ్డారు. నవలల పిచ్చి ఉన్న డాక్టర్ సత్యవీర్ రాసిన నవల చదవమని అక్కకి ఇచ్చాడు. ఆ విధంగా సత్యవీర్ ఈ కుట్రలో అనుకోకుండా భాగస్వామి అయిపోయాడు. రాఠోడ్‌కి ఇప్పుడు క్యాన్సర్ ముదిరింది. వైద్యం చేసి లాభం లేదు. ఈ విషయం సత్యవీర్ రాఠోడ్‌కి చెబుతాడు. ఆయన చేష్టలుడిగి ఉండిపోతాడు. ఇదంతా విన్న రాఠోడ్ భార్య పగలబడి నవ్వుతుంది.
మనోరమా పైకి పవిత్రంగా కనిపించినా ఆమె రాఠోడ్ కోసం పని చేసింది. తర్వాత బ్లాక్మెయిల్ చేసింది. ప్రజల కోసమూ కాదు, సమీరా కోసమూ కాదు, పరువు కోసమూ కాదు. ఆస్తి కోసం. డాక్టరు తన ఉద్యోగధర్మం వదిలేశాడు. క్యాన్సరు పేషెంటుకి వ్యాధి గురించి చెప్పలేదు. చెప్పి ఉంటే అతని మనసు మారేదేమో. మనోరమాకి, డాక్టరుకి చావే గతి అయింది. వీరి కారణంగా సమీరా కూడా చనిపోయింది. నీతూ రాఠోడ్ చెప్పటంతో శీతల్లా నటించింది. ఆమెకి శరీరాన్ని అమ్ముకోవటమే తెలుసు. పెద్ద చేపల్నే కాదు, పెద్ద చేపల వెంట ఉండే చిన్న చేపల్ని కూడా నమ్మకూడదు. సత్యవీర్ బావమరిది కూడా అమ్ముడుపోయాడు. కలియుగంలో ఎవర్నీ నమ్మలేని పరిస్థితి. కానీ కర్మఫలం అనుభవించక తప్పదు. అధికారం, ఐశ్వర్యం చూసుకుని విర్రవీగటం మూర్ఖత్వం. రాఠోడ్ అకృత్యాలు తెలిసిన అతని భార్య అతనికి క్యాన్సర్ అని తెలిసి పగలబడి నవ్వింది. అతను పోతే ఆస్తి ఆమెదే. ధర్మకార్యాలు చేస్తుంది. దైవనిర్ణయం ఇలాగే ఉంటుంది. పాపం పండేదాకా దైవం ఆగుతుంది. అప్పుడు ప్రతాపం చూపిస్తుంది. సత్యవీర్ కూడా పూర్తి ధర్మాత్ముడు కాదు. లంచం తీసుకున్నాడు. అమాయకురాలు ఎవరైనా ఉంటే ఆమె రాఠోడ్ లైంగిక దాడి చేసిన అమ్మాయి. చిత్రం పేరులో ఉన్న ‘సిక్స్ ఫీట్ అండర్’ ఆ అమ్మాయి సమాధిని ఉద్దేశించినదే. చివరికి సత్యవీర్ ఊరి నుంచి వచ్చిన భార్య, కొడుకుని కలుసుకోవటంతో చిత్రం ముగుస్తుంది.
‘చైనాటౌన్’ కథకీ, ఈ కథకీ చాలా తేడా ఉంది. పైగా అక్కడ కలియుగం ఇంతే అనే భావంతో కథ ముగుస్తుంది. ఈ చిత్రంలో భారతీయత కనిపిస్తుంది. కథలో కర్మ సిధ్ధాంతం ఉంటుంది, కానీ తెచ్చిపెట్టినట్టు ఉండదు. కథలో ఇమిడిపోతుంది. ప్రేరణ పొందితే ఇలా ఉండాలి. ‘చైనాటౌన్’ కథలో పాయింటు తీసుకుని దానిని కొత్త పంథాలో నడిపించిన రచయితలు, దర్శకుడు ఎంతైనా అభినందనీయులు.