మరో లఘు చిత్రం పరిచయం. నిజంగానే పూర్తి నిడివి చిత్రాలకన్నా ఇవే ఎక్కువ ఆకర్షిస్తున్నాయి. అనవసరమైన సరుకు అస్సలుండదు. పూర్తి ఫోకస్ కథనం మీదే.
కొల్కాతా లోని వొక కేఫ్. తన సీట్ దగ్గర వచ్చిన యజమాని నసీరుద్దీన్ షా దృష్టి వొక బల్ల దగ్గర కూచుని కాఫీ తాగుతున్న వొక నడివయసు మహిళ మీద పడుతుంది. అప్పటికి ఆమె ముఖం కనబడటం లేదు. కాని అతను గుర్తు పట్టి ఆమె ఎదుటి కుర్చీలో కూచుంటాడు. ఆమె (షెర్నాజ్ పటేల్) అతన్ని విస్తుపోయి చూస్తుంది. కొన్ని క్షణాల తర్వాత అతన్ని గుర్తు పడుతుంది. అయితే నువ్వు ఈ కేఫ్ యజమానివా అంటుంది. ముప్పై యేళ్ళ క్రితం వాళ్ళిద్దరు అక్కడే చివరి సారి కలిశారు. మొదటి సారి ట్రాక్ షాట్ కుడి నుంచి యెడమకు, యెడమ నుంచి కుడివైపుకు తిప్పుతూ అవతలి బల్లలో యువ జంట నవీన్ కస్తూరియా, శ్వేతా బాసు ప్రసాద్ లు వుంటారు. వాళ్ళిద్దరు నస్సీర్, షెర్నాజ్ ల యువ పాత్రలు. ఆ తర్వాత రెండు జంటలనూ వొకే సారి చూపిస్తాడు.
ఇద్దరూ పరస్పర ప్రేమలో వున్నా ఆమె తల్లి దండ్రులకి ట్రాన్స్ఫెర్ అయ్యి లండన్ వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళతో పాటు ఆమె. యేమీ చేయలేని నిస్సహాయత ఇద్దరిలోనూ. మరో నాలుగ్గంటలలో ఫ్లైట్ వుంది. చివరి సారి కౌగిలింతలు, ముద్దుల అనంతరం ఆమె వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇప్పుడు కలిశారు ఇద్దరూ. వొకరి గురించి వొకరు వివరాలు అడిగి తెలుసుకుంటారు. ముందు నసీర్ అడుగుతాడు. ఆమె లండన్ వెళ్ళిన కొద్ది కాలంలోనే పెళ్ళి అయిపోయింది. పుట్టిన పిల్లలు ఇప్పుడు పెద్దై పోయి ఎవరి దారిన వారు వున్నారు. కొన్నాళ్ళ క్రితమే భర్త చనిపోయాడు. వొకసారి స్వదేశం చూడాలనిపించి ఇక్కడకు వచ్చింది. వచ్చి నెల అయ్యింది, మర్నాడు తను నైనితాల్ కు వెళ్ళాల్సి వుంది. అక్కడ టీచర్ ఉద్యోగం ఆమెకోసం ఎదురు చూస్తోంది. తర్వాత ఆమె అతని వివరాలు అడుగుతుంది. కొన్నాళ్ళు అక్కడేఅ వుండి తర్వాత అతనికి సిలిగురి కి ట్రాన్స్ఫర్ అవుతుంది. పెళ్ళి చేసుకోడు. చాలా సార్లు వొక్కటే ప్రశ్న సతాయిస్తుంది : ఆ రోజు ఆమెను తను ఏ విధంగానైనా ఆపగలిగి వుండే వాడా? మరి ఇప్పుడో. అతని అంతరాత్మ అంటుంది, పాత తప్పే ఇప్పుడూ చేయవద్దని. అతను వున్నట్టుండి అంటాడు : నైనితాల్ ఎందుకు ఇక్కడే వుండిపోరాదు అని. మరి టిక్కెట్లు కేన్సిల్ చేయిస్తే మన డబ్బులు వాపసు వస్తాయా అడుగుతుంది ఆమె. ఆ విధంగా ఇద్దరూ మనసులో వున్నది బయట పెట్టుకుంటారు.
నలుగురు నటులు. నసీర్ గురించి చెప్పేదేముంది! మరచిపోలేని నటన ఇచ్చాడు. మిగతా ముగ్గురు కూడా బాగా చేశారు. షెర్నాజ్ పటేల్ నటన్ వొకేలా వుంటోంది. కాని శ్వేతా, నవీన్ కస్తూరియాలు బాగా చేశారు. పేరుకు కొల్కాతా గాని కేవలం ఆ కేఫ్ లో క్లోజప్ షాట్స్‌లో సినెమా అంతా చిత్రీకరించారు. నేపథ్యంలో హేమంత్ కుమార్ పాట. క్లోజప్పుల్లో నటులకు వొక ఇబ్బంది యేమిటంటే ఎక్స్ప్రెషన్ పొసిగినట్టుండాలి. కాస్త తేడా వచ్చినా అది పెద్ద పరిమాణంలో కనిపిస్తుంది. మరి ఈ చిత్రం మొత్తం క్లోజప్పుల్లోనే. సాయినీ రాజ్ తో కలిసి స్క్రిప్ట్ వ్రాసిన అధిరాజ్ బోస్ దీనికి దర్శకుడు కూడా.అధిరాజ్ కుర్రాడు. తల్వార్ చిత్రంలో మేఘనా గుల్జార్ కి సహాయకుడుగా చేశాడు. ఈ చిత్రం రూపకల్పన, దర్శకత్వం అన్నీ బాగున్నాయి. ఇతని నుంచి మరిన్ని మంచి చిత్రాలు ఆశించవచ్చు.
సాహిత్యం, సినిమా రెండు ప్రాణాలు అయినా ప్రతి art form ని ఇష్టపడే పరేష్ ఎన్. దోషి బహుమతులు పొందిన కథలు వ్రాశారు. కవిత్వం రాశారు. ప్రస్తుతం సారంగలో “చిన్న మాట! ఒక చిన్న మాట!!” వ్రాస్తున్నారు.
చాలా స్వీట్ గా ఉంది ఎలాటి ముగింపు మనం ఆల్రెడీ ఊహిస్తామో, అది మనకు తెల్సిందే అయినా, అది జరగగానే గొప్ప సంతోషం
తప్పకుండా చూస్తా
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™