[శ్రీమతి రాయప్రోలు సుజాతా ప్రసాద్ గారి ‘మథనం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
అవన్నీ ఊరు ఊరున వెలసిన అందాల తోటలు. ఆ తోటల్లో వేరు వేరు మొక్కలకు వేరు వేరు స్వంతదారులు! ఆ మొక్కలను పెంచి కాపాడేందుకు ఉండే కాపరులు టైమ్ బట్టి వేరు. ఆ కాపరుల సంఖ్య కూడా తోటల వైశాల్యం బట్టి ఉంటుంది. వాళ్ళ స్వభావాలు కూడా వేరుగా ఉంటాయి. కొందరు నిర్లక్ష్యంగా, కొందరు వృత్తి ధర్మంగా ఉంటే, ఏ ఒక్కరో ప్రాణం పెట్టి ఆ మొక్కలను పెంచుతారు. చాలా మంది స్వంతదారులు తమ మొక్కలని ఎదగకుండానే కట్టకూడని మొక్కలతో అంటు కట్టేందుకు, వేరే తోటలకి తీసుకు పోతుంటే ఆ మొక్కల క్షేమాన్ని కోరి పెంచుతున్న మాలి అడ్డుకున్నా,. మొక్కలు ఇంకా బలం పుంజుకోవాలని చెప్పినా, వేరే మొక్కతో అంటుకట్టే క్రమంలో అది చాలా నష్టపోతుందని హెచ్చరించినా, ఆ మొక్కలే స్వయంగా వ్యతిరేకించినా, స్వంతదారులు వినరు. తమ అధికారంతో వాటిని పీకేసి పట్టుకు బోయేవారు కొందరు. మొక్కలు ఎదగకుండానే ఫలసాయం తీసికెళ్ళి అమ్మచూపే స్వంతదారులు కొందరు.. ఆ మొక్కలు వృక్షాలుగా ఎదగాలని, తాము పెరిగి పదిమందికి నీడనివ్వాలని ఆ మాలి వాటిని తీర్చి దిద్దిన విధానం, స్వంతదారుల దాష్టికానికి బలయిపోయిన మొక్కల పట్ల ఆవేదన,.. వాటి రక్షణ కోసం తన పరిధిలో చేసిన పోరాటమే ఈ చిరు నవలకు ఆధారం.
ఖనిజ మానవ, వృక్ష మానవ, జంతు మానవ స్థాయి నుంచి మానవ మానవ స్థాయికి ఎదిగి ఎంతో అంకిత భావంతో ఆ మొక్కలను పెంచిన మాలి పేరు.. రవళి.
ఆ మాలితో కలిసి తమ స్వావలంబనకై జీవన మథనం చేసిన అతి ముఖ్యమైన ఆ మొక్కలు రమణమ్మ, దీప, సరస్వతి, మహేశ్వరి రాఘవ, హరి ఒకతోట మొక్కలు. సంధ్య, దేవి, దుర్గారావు మరో తోట మొక్కలు.
ఆ మొక్కల పట్ల తనకి అంత ప్రేమ కలగడానికి కారణాలు ఆమె జీవితాన్ని చదివి అర్థం చేసుకుందాం.. ఆ పోరాటంలో ఆమెకు సహాయం చేసిన హస్తాలకు ఐదును పదులు చేసి నమస్కరిద్దాం.
***
“గగన రాజ్యము గ్రమ్ము వేడుక
మగటిమిని తన కళలు గూర్చుచు
పగలు వెన్నున దన్ని సోముడు,
పైనమై వెడలెన్!”
చతుర్దశి నాటి చంద్రుని చిరునవ్వులలోంచి కురుస్తున్న వెన్నెల వర్షాన్ని చూసి రవళి పెదవులపై ‘గురజాడ ముత్యాల సరం’ జాలువారింది.. శని, ఆదివారాలు సెలవులంటే వచ్చే హుషారుతో శుక్రవారం నాడు ఉద్యోగస్థులున్నట్టు రేపటి పున్నమి నాదే అన్న ఆనందంలో చంద్రుడు నవ్వులు రువ్వుతున్నాడు.
రవళికి ఆ అమృతం కురుస్తున్న రాత్రి, అందరూ నిద్రపోతుంటే, తన మురళితో కలిసి, తలుపు తెరిచి, ఇల్లు విడిచి, ఎక్కడికో దూరంగా, కొండదాటి, కోనదాటి వెన్నెల మైదానంలోకి వెళ్ళి నిల్చోవాలని ఉంది.
కానీ కోరిక వేరు. ఊహ వేరు. వాస్తవం వేరు. వీటికి మధ్య ఉన్న సన్నపాటి గీత మురళికి తెలుసు. చాలా వరకూ తన ఊహలకు రెక్కలనిస్తాడు. సాధ్యమయినంతవరకూ ఇలాంటి తన కోరికలు కొండెక్కకుండా కాపుకాస్తాడు. కానీ హైదరాబాద్ పని మీద వెళ్ళి చాలా లేట్‌గా ఊరినుంచి వచ్చి పడుకున్నాడు. అతన్ని లేపడానికి తనకే మనసు రావడం లేదు. వాస్తవం ఇలాగే కోరికకు కళ్ళెం వేస్తుంటుంది. పైగా అర్ధరాత్రి అయిపోయింది. ఒంటరిగా బయటికి వెళ్ళి ఆ వెన్నెల వానలో తడిసేందుకు వీలుకాని పరిస్థితి. అందుకు కిటికీ లోంచి కౕళ్ళతోనే ఆ దృశ్యాన్ని చూస్తూ, ‘విశ్వమంతా నిండి, పిండారబోస్తూ శుక్ల చతుర్దశి జ్యోత్స్న నన్ను మురిపిస్తోంది శ్రీరంగం వారూ’ అనుకుంది ఆహ్లాదంగా.
రవళి దృష్టి ఇంటి ముందున్న మొక్కల మీదకు మళ్ళింది. ఆ మొక్కల ఆకులు తమ మీద వెన్నెలని పట్టేద్దామని ప్రయత్నిస్తుంటే ఆ ఆకుల సందుల్లోంచే సన్నగా జారిపోతూ వాటినే ఛాలెంజ్ చేస్తోంది పండు వెన్నెల! ప్రకృతి, ప్రకృతి తోనే పంతాలు పోయి, పందేలు వేస్తూ ఉంటే గెలుపు, ఓటమి రెండూ తనవే కదా! సన్నగా నవ్వుకుంది రవళి.
మబ్బులు, నక్షత్రాలు, చంద్రుడు వీటిల్లో దేనితో ఉన్న ఆకాశమన్నా ఇష్టమే తనకి. చీకటి రాత్రిలో మిణుకు మిణుకు మనే నక్షత్రాలకాంతులతో ఆకసాన రంగవల్లులు అల్లుకోవడం ఎంత బావుంటుందని! కానీ ఏ మబ్బు ఆకారము కనపడని, పూర్తిగా తారు పోసినట్లు చీకటి నిండిన ఆకాశమంటే ఇష్టం అనిపించదు. కాస్త భయం కూడా! జీవితాన్ని కూడా ఎటువంటి పరిస్థితుల్లోను, ఎంత కష్టం లోనూ ప్రేమించడం తనకి ఇష్టం. కానీ చీకటి నిండిన ఆకాశం లాగే జీవితం కూడా తనని చాలా సార్లు భయపెట్టింది. ఆ భయంలోనూ మురళి లాంటి తోడు తనకి ఉండడంతో మెల్లగా ఆ భయాన్ని జయిస్తూ వచ్చింది. కానీ ఈ రోజు ఈ గెలుపు, అది ఇచ్చిన ఆనందం, దాని వలన కలిగిన ప్రశాంతత వెనుక ఒక ఆందోళన కూడా ఉంది. రేపటి ఉదయం తన జీవితంలో ఏమి తీసుకువస్తుంది? పున్నమి వెలుగుల్నా? లేక మళ్ళీ ఆందోళన కలిగించే పరిణామాలనా? రవళి ఆలోచనలు పరధ్యానంగా తన గత జీవితం లోకి అనుకోకుండానే వెళ్ళిపోయాయి.ఆలోచనలని పయనింప చేస్తూ అలానే కిటికీ పక్కనే ఉన్న పడక కుర్చీలో కూర్చుంది.
***
ప్రతీ వారికీ జీవితంలో చదువు, ఉద్యోగం, పెళ్ళి వీటన్నింటి గురించి ఎన్నో ఊహలు, ఆశలు ఉంటాయి. కొంతమందికి తాము ఊహించినట్లు, కోరుకున్నట్లే జరుగుతాయి. కానీ వాళ్ళ ఊహకి వాస్తవానికి చాలా తేడా అనుభవించి బాధకి గురవుతారు. కొంతమందికి అనుకున్నది జరగక వేదన అనుభవిస్తారు. కొంతమంది ఆశించినది దొరకక పోయినా లభించినదాన్నే ప్రేమించి జీవితాన్ని అందంగా మలుచుకుంటారు. ఆ కోవకి చెందినదే రవళి.
రవళి తండ్రి రామచంద్రం గారు టీచర్. తల్లి రాజేశ్వరి మంచి సమర్థురాలైన గృహిణి. వారికి ఏకైక సంతానం రవళి. పెళ్ళయిన పదేళ్ళ తరువాత పుట్టిన రవళిని అరచేతిలో అప్పంలాగ పెంచుకున్నారు. రామచంద్రం, రాజేశ్వరి గార్ల పెంపకంలో రవళి చక్కటి క్రమశిక్షణలో పెరిగింది. అప్పట్లో ట్రాన్సపోర్ట్ సౌకర్యాలు చాలా తక్కువ. దాని వల్ల ఏ ఊర్లో పని చేస్తే ఆ ఊర్లోనే ఉండాల్సి వచ్చేది. రామచంద్రం గారు ముందు యస్.జి.టి. గా చేయడంతో రవళి బాల్యమంతా చాలా వరకూ పల్లెల్లోనే గడిచింది.
రవళి హైస్కూలు చదువుకి వచ్చాక స్కూల్ ఉన్న ఊరికి కాపురం మార్చి తాను సైకిలు మీద తిరిగేవారు రామచంద్రం గారు. రవళి హైస్కూలులో చదువుతున్నపుడే ఎయిత్ క్లాస్ నుంచి ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయిపోతుండడం చూసేది. తన పెదనాన్న గారి అమ్మాయి శ్రావణి బాగా చదువుకున్నాక పెళ్ళి అయితే వీళ్ళందరికీ ఇంకా హైస్కూల్ లెవెల్ లో ఎందుకు పెళ్ళిళ్ళు అవుతున్నాయో తెలిసేది కాదు.. అది మంచా? లేక పెద్ద చదువు చదివి పెళ్ళి చేసుకోవడం మంచిదా? తేల్చుకునే వయసు కాదు రవళిది. కానీ ఎంతో స్నేహంగా ఉండే తన స్నేహితురాళ్ళు కొంతమందిని పెళ్ళయాక కలిసినా తనకీ వాళ్ళకీ మధ్యన ఏదో తేడా వచ్చేసినట్లనిపించేది. తను గౌన్లు, పరికిణీలలో ఉన్నపుడే వాళ్ళు చీరలు కట్టుకునేవారు. మరో ఏడాదికి పిల్లల తల్లులయేవారు. అంతకు ముందు ఆపకుండా మాట్లాడుకునే వారు కాస్తా మాటల కోసం తడుముకోవలసి వచ్చేది. తమ మధ్య మాట్లాడుకోడానికి ఏమీ లేనట్లే అనిపించి, గేప్ అర్థమై రవళి ఇంక వాళ్ళ ఇళ్ళకు వెళ్ళడం ఆపేసేది.
కానీ రవళి టెంత్ చదువుతుండగా రవళికి చాలా ఇష్టమైన స్నేహితురాలు సత్యవతికి పెళ్ళి నిశ్చయమైంది. సత్యవతి తండ్రి అప్పలస్వామి రవళి వాళ్ళకి పాలు పోసేవాడు. సత్యవతి చాలా తెలివైంది. వాళ్ళ అమ్మకి ఇంట్లో పనులు చేస్తూ కూడా క్లాస్‌లో రవళితో పోటీ పడేది. అలాంటి సత్యవతికి పెళ్ళా?.. రవళికి అది నచ్చలేదు. ఇక తన సత్యవతికి తనకీ దూరం పెరుగుతుందని కోపం వచ్చింది. ఉక్రోషంతో పరుగెట్టుకుంటూ తండ్రికి కంప్లైంట్ ఇవ్వడానికి ఇంటికి వచ్చింది. వచ్చేసరికి సత్యవతి తండ్రి అప్పలస్వామి, రామచంద్రం గారు మాట్లాడుకుంటున్నారు.
“అప్పలస్వామీ! అసలు సత్యవతికి ఇప్పుడెందుకు పెళ్ళి చేస్తున్నావు? పెళ్ళయిపోతే మేమిద్దరం విడిపోతాము. సత్యకి ఇప్పుడు పెళ్ళి చేయకు. అది నాతోనే చదువుతుంది.” అప్పలస్వామి మీద అరిచింది రవళి.
రామచంద్రం గారు రవళిని దగ్గరకు తీసుకుని “నేనూ అదే దెబ్బలాడుతున్నానమ్మా! అసలు ముందు ఏమీ చెప్పకుండా పెళ్ళి నిశ్చయమయ్యాక చెప్తున్నాడు.” అన్నారు.
“మీకు తెల్దమ్మా! మంచి సమ్మందం. మా ఆవిడ తమ్ముడు. సొంత మేనమామ. అమ్మమ్మ గారింటికే ఎల్తాది. ఆల్లకి ఇదంటే ఎంతో ముద్దు. బాగా సూస్తారు.” అప్పల స్వామి చెప్పాడు.
ఆ పెళ్ళికొడుక్కి ఉద్యోగం ఉందా? ఎంత సంపాదిస్తాడు? లేదా సత్య చదువుకుంటే ఏం చేస్తుంది? ఇలాంటివి తెలుసుకునే, ఆలోచించే జ్ఞానం లేదు రవళికి. ఎంతసేపూ పెళ్ళి కారణంగా తనకి దూరమయిపోయిన స్నేహితురాళ్ళలాగే సత్య కూడా దూరమయిపోతుందని దిగులు. పెళ్ళంటే స్నేహాన్ని విడదీసేస్తుందని మాత్రం అర్థమయింది.. తండ్రి గుండెలో తలదాచుకుని “నాన్నా! సత్యకి పెళ్ళి వద్దని చెప్పండి. మేమిద్దరం చదువుకుంటాం. మీరు చదివిస్తానని హామీ ఇవ్వండి.” అని ఏడ్చింది.
రాజేశ్వరి లోపలినుంచి వచ్చి రవళిని దగ్గరకు తీసుకుని ఓదార్చింది. ఈ లోగా తండ్రి కోసమని సత్య వచ్చింది. రవళి తల్లి దగ్గర నుంచి వచ్చేసి “సత్యా! నువ్వీ పెళ్ళి చేసుకోకు. చేసుకోనని మీ నాన్నకు చెప్పు” అంది కోపంగా. రవళిని చూస్తే అప్పలస్వామికి భయం వేసింది.
‘ఈ అమ్మాయిగోరు కూతుర్ని సెడిపేస్తది కాబోలు’ అని మనసులో అనుకుని పైకి “నేను ఒత్తానులే కానీ, నువ్వు లగెత్తుకుని కల్లం కాడి కెళ్ళి సిన్నాన్నని నేను ఇంటికి రమ్మన్నానని సెప్పు. పో.” అప్పలస్వామి సత్యను పంపేసాడు.
రామచంద్రానికి, రాజేశ్వరికి సత్యను అతను పంపేసిన కారణం అర్థమయింది. “రవళీ! నాన్న, నేను మాట్లాడతాము గానీ, నువ్వు లోపలికి వెళ్ళి పాలు కలిపి ఉంచాను తాగు.” రాజేశ్వరి రవళిని కూడా లోపలికి పంపేసింది.
“బాబూ! పిల్ల పెళ్ళికి మీరు ఏదో సాయం చేత్తారని గంపెడంత ఆశతో ఉన్నాను. వచ్చిన కాడనించీ ఒకటే కూకలేత్తున్నారు అందరూనూ. ఏటి సెయ్యాల? శుబమా అని పిల్లకి పెళ్ళెట్టుకుంటే మీరట్టా అంటే ఎలా బాబూ! ఇదిగో! ఇయ్యన్నీ నాకు తెలవ్వు. మీరు నా బిడ్డ పెళ్ళికి సాయం చేత్తున్నారు అంతే!” అప్పలస్వామి కూడా రవళి లాగే ఉక్రోషంగా మాట్లాడాడు.
“అప్పలస్వామీ సత్య చాలా తెలివైన పిల్ల. నువ్వు చదివించలేకపోతే ఎలాగో ఒకలాగ మా రవళి తో పాటు చదివిద్దామనుకున్నాను. అది లేకపోగా ఇంత చిన్న వయసులో నువ్వు చేసే ఈ అరాచకపు పెళ్ళికి నన్ను సాయం చేయమంటున్నావు. అందులో ఉన్న సంతోషం నాకు ఇందులో ఎలా ఉంటుంది అప్పలస్వామీ?” రామచంద్రం గారు బాధపడుతూ అడిగారు.
“బాద పడినా సరే బాబూ! మీరు నాకు సాయం సెయ్యాల అంతే.” అప్పలస్వామి చెప్పేసి వెళ్ళిపోయాడు. రామచంద్రం గారు దీర్ఘంగా నిట్టూర్చారు.
ఆ కోపంతోనే రవళి సత్య పెళ్ళికి వెళ్ళలేదు. పెళ్ళయిన తరువాత సత్య మరి టెంత్ పరీక్షలు వ్రాయలేదు. రవళి కాలేజ్ చదువు కోసమని రామచంద్రం గారు విజయనగరం కాపురం మార్చారు. దాంతో రవళి సత్యల స్నేహం పూర్తిగా తెగిపోయింది. కానీ రవళి సత్యను మరిచి పోలేదు. అప్పుడప్పుడు తండ్రిని “నాన్నా! అప్పలస్వామి కనిపించాడా? సత్య ఎలా ఉంది?” అని అడుగుతుండేది. సత్య తొలికానుపులోనే బిడ్డని కనలేక చనిపోయిందని రామచంద్రం గారు చాలా కాలం వరకూ రవళికి చెప్పలేదు. సత్య చనిపోయిందని తెలిసినపుడు, సత్యకి పెళ్ళి కుదిరినపుడు పడిన బాధ కంటే పదిరెట్ల బాధ రవళి అనుభవించింది. అది రవళి లేత హృదయాన్ని గాయపరచిన సంఘటన. రవళి మనసుని కాల్చి మచ్చగా ఉండిపోయిన సత్యం. తరువాత ఆయనకి ప్రమోషన్ రావడంతో ఆ ఊరితో పూర్తిగా బంధం తెగిపోయింది.
రవళికి జ్ఞానం వచ్చిన నాటి నుంచీ టీచింగ్ లైన్ కాకుండా ఆఫీసులో జాబ్ చెయ్యాలని కోరిక. బ్యాంకు ఉద్యోగం అంటే చాలా ఇష్టం. తల్లి దానికి బాగా సపోర్ట్ చేసేది. కానీ తండ్రి రామచంద్రం గారికి టైమ్ టు టైమ్ వెళ్ళి రావచ్చని, సంక్రాంతి, వేసవి, దసరా సెలవులతో ఆడపిల్లలకి టీచర్ జాబ్ బావుంటుందని ఉండేది. కానీ ఇంట్లో తల్లీ, కూతురు ఇద్దరిదీ ఒక పార్టీ. ముగ్గురిలో ఇద్దరు ఒక పార్టీ అయిపోతే మూడోవారి అభిప్రాయానికి విలువ ఏముంటుంది?
కానీ రవళికి మంచి టీచింగ్ కెపాసిటీ ఉండేది. ఇరుగు పొరుగు పిల్లలు “అక్కా! ఇవి అర్థం కాలేదు చెప్పవా?” అని వస్తే వాళ్ళకి ఎంతో బాగా బోధపరిచేది. అది చూసి రామచంద్రం గారికి కూతురు టీచర్ అయితే తన చేతి మీద ఎంతో మంది పిల్లలు బాగు పడతారనిపించేది. అయినా రవళిని ఫోర్స్ చేయడం ఆయనకి ఇష్టం లేక ఊరుకున్నారు. .
కానీ సడెన్‌గా విధి నిర్ణయమన్నట్లు రవళి ఇంటర్ పూర్తి చేసి డిగ్రీలో జాయిన్ అవుతూనే రామచంద్రం గారు పక్షవాతపు బారిన పడ్డారు. రెక్కలు తప్ప మరేమీ నిల్వలు లేని సంసారం. తండ్రి వైద్యం, ఇంటి ఖర్చులు అన్నీ కలిపి రవళిని డిగ్రీ డిస్ కంటిన్యూ చేసి డైట్ సెట్ వ్రాసి ట్రైనింగ్ అయేలా చేసాయి. రాజేశ్వరి భర్తకు సేవలు చేస్తూనే రవళి మానసికంగా కృంగిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోకుండా మోరల్ గా ఎంతో సపోర్ట్ చేసింది.
“రవళీ! నీ తోటివారు డిగ్రీ చదువుతుంటే నువ్వు ట్రైనింగ్‌కి వెళ్ళడం బాధపడాల్సిన విషయం కాదు. బాధ్యత పంచుకోవడం చాలా మంచి విషయం. నాన్న ఎప్పటికీ ఇలా ఉండిపోరు. తప్పకుండా తగ్గుతుందన్న డాక్టర్ల మాటే మీదే కాదు, నాన్న పట్టుదల మీద కూడా మనం నమ్మకం ఉంచాలి. ఆయనకి ఎవరి మీదా ఆధారపడడం ఇష్టం ఉండదు. కాబట్టి తప్పకుండా తన వంతు ప్రయత్నం నూటికి నూరు శాతం చేస్తారు. మన జీవితాలలో జరిగే సంఘటనలు ఆ సమయంలో చాలా బాధ పెట్టేవిగా, అర్థ రహితంగా, ప్రశ్నార్థకంగా ఉంటాయి. కానీ భవిష్యత్తు వీటికి అర్థం, జవాబు కూడా చెప్తుంది. కాబట్టి నువ్వు ఉత్సాహంగా ఉండు.” తల్లి మాటలతో రవళి మనసుకి ఊరట కలిగింది. అంతే కాకుండా తండ్రిని ఛీరప్ చేయడానికి తన వంతుగా బాగా ప్రయత్నించింది.
రామచంద్రం గారికి పుస్తకాలు చదవడం చాలా ఇష్టం. టీచింగ్ తరువాత ఆయన ప్రియారిటీ ఇచ్చేది పుస్తక పఠనానికే. రవళికి అలవాటు చేయాలని చాలా ప్రయత్నించారు గానీ పెద్దగా ఎక్కలేదు. ఒకరోజు రవళి కాలేజ్ నుంచి రావడం చూసి రాజేశ్వరి భర్తకు చదివి వినిపిస్తున్న పుస్తకం అక్కడే బోర్లించి టిఫిన్ చేయడానికి వెళ్ళింది. రవళి ఫ్రెషప్ అయి వచ్చి తండ్రిని పలకరించి పక్కనే కూచుంది. అక్కడే బోర్లించి పెట్టిన ‘మునిమాణిక్యం’ వారి ‘కాంతం కథల’ పుస్తకం తీసి చూసింది. అనుకోకుండా కళ్ళు వాక్యాల వెంట పరుగెట్టాయి. ఆగని నవ్వులు రవళి పెదవులపై విరిసాయి. “నాన్నా! తరువాత కథ చదువుతాను వినండి” అని చదివింది. “నాన్నా! రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న చెట్టుకొట్టేస్తే కాంతం గారు మరి ఆ ఊరిని పోల్చుకోలేరా?” రవళి తండ్రిని అడుగుతూనే గలగలా నవ్వసాగింది. రాజేశ్వరి టిఫిన్ తెచ్చేసరికి ఇద్దరూ ఆ కథను గూర్చిన చర్చలో లీనమయి నవ్వుకుంటున్నారు. రాజేశ్వరి చాలా ఆనందించింది. ఆ తరువాత రవళికి రోజూ అలా తండ్రికి ఒక గంటైనా చదవి వినిపించడం అలవాటయింది. పుస్తక పఠనం హాబీ గా మారి తరువాత ఇక పుస్తకం చదవకుండా ఉండలేని పరిస్థితికి వచ్చింది. దానికి ఎడిక్ట్ అయిపోయింది.
రవళి ట్రైనింగ్ అయేసరికి రామచంద్రం గారు కోలుకున్నారు. డాక్టర్ సలహాలు పాటించి ఎక్సర్ సైజెస్ అన్నీ బాగా చేయడంతో ఆయన తేరుకుని మళ్ళీ జాబ్ లో జాయిన్ అయారు.. రవళి మళ్ళీ డిగ్రీలో జాయిన్ అయింది. డిగ్రీలో ఉన్నపుడు తండ్రితో కలిసి సాహిత్య, సంగీత సభలకి వెళ్ళేది. గురజాడని, వీరేశలింగం గారిని చదివే ప్రయత్నంలో రవళిని వారిని ఆరాధించేలా చేసాయి. తిలక్, శ్రీశ్రీ, సి.నా.రె. అభిమాన కవులయారు.
డిగ్రీ కంప్లీట్ అవుతుందనగా రామచంద్రం గారు ఒకరోజు రవళిని పిలిచి మాట్లాడారు.
“రవళీ! డిగ్రీ అవుతూనే ఏం చేద్దామనుకుంటున్నావు? నీ అభిప్రాయం తెలుసుకుందామని అడుగుతున్నాను. అమ్మ సంబంధాలు చూడమంటోంది. దానికి సరేనంటే ఇప్పటినుంచే ప్రయత్నిస్తాను. మనకి అనువైన సంబంధం దొరకడానికి టైమ్ పడుతుంది కదా!”అన్నారు.
“లేదు నాన్నా! ఏదో ఒక ఉద్యోగం వచ్చేవరకూ నాకు పెళ్ళి వద్దు. నా కాళ్ళ మీద నేను నిలబడ్డాకే పెళ్ళి ఆలోచన. అమ్మ అలాగే అంటుంది కానీ మీరేమీ ప్రయత్నాలు చేయద్దు.” స్పష్టంగా చెప్పింది రవళి.
“నీ ప్లానింగ్ కూడా చెప్పు రవళీ! ఎన్నాళ్ళు జాబ్ ట్రయల్స్‌లో ఉంటావు? ఏ ఏ జాబ్ లకు ప్రయత్నిస్తావు?” అడిగారు రామచంద్రం గారు.
“ముందు నుంచి అనుకుంటున్నదే కదా! బ్యాంక్ జాబ్‌కి ట్రై చేస్తుంది.” రాజేశ్వరి వెంటనే అందుకుంది.
“నువ్వు కాదు అమ్మాయి చెప్పాలి ఆ సంగతి. ఏం తల్లీ! నీ అభిప్రాయం చెప్పమ్మా!” రామచంద్రం గారు గారంగా అడిగారు.
“నాన్నా! మీకు తెలియంది ఏమీ లేదు. అమ్మ చెప్పిన మాట నిజం. బ్యాంక్ టెస్ట్స్ వ్రాయాలనే ఉంది., ఆ ప్రిపరేషన్ కి నాకు ఎన్నాళ్ళు టైమిస్తారో అది మీ ఇష్టం.” అంది రవళి.
“బ్యాంక్ జాబ్ అంటే నాకేం వ్యతిరేకత లేదు. ఒక విధంగా చెప్తే దానికి సమాజంలో ఉన్న గౌరవం వేరు. నిన్న మొన్నటి వరకూ టీచర్ అంటే ‘బ్రతక లేక బడిపంతులే’! ఇప్పుడిపుడే ఆ పరిస్థితి మారుతోంది. నువ్వు పెళ్ళయాక జీవితాన్ని గురించి కూడా ఆలోచించాలి. బ్యాంక్ జాబ్‌కు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. కొత్త ప్రదేశాలు చూడడానికి, కొత్త సంస్కృతి, సంప్రదాయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎట్ ది సేమ్ టైమ్ నీ భర్తకు కూడా ఆ ఊరే, అక్కడే అవుతుందని లేదు. విడి విడిగా ఉండడానికి, సంసారంలో కొత్తరకం ఛాలెంజెస్ ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిధ్ధంగా ఉండాలి.
ఇక ఇద్దరూ టీచర్సే అయితే ఈ జిల్లా లోనే ఉంటారు. విజయనగరం నుంచి ఎక్కడికైనా వెళ్ళిరావడానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ముందు ముందు ఇంకా పెరుగుతుంది కాబట్టి ఫర్వాలేదు అనిపిస్తోంది. అలాగే నువ్వు చేసుకునేవాడికి కొత్త ప్రదేశాలు చూసే ఇంట్రస్ట్ లేకపోతే, చాలావరకూ నీ జీవితం కూపస్థమండూకం లాగ ఈ జిల్లా లోనే అయిపోతుంది. ఇవి అన్నీ మనం ఆలోచించుకోవాలి.”
తండ్రి ఎలాంటి పక్షపాతం లేకుండా చెప్తున్న మాటలు రవళిని ఆలోచింపచేసాయి. రెండింటిలోను లాభనష్టాలను ఆయన చాలా సవివరంగా చెప్పారు
“టీచర్ అవడం కాదు గానీ, మీరనుకున్నది ఎదుటివారి మైండ్ లోకి ఎక్కించడంలో గొప్ప ప్రావీణ్యం సంపాదించారు. పిల్లని అలా ఉక్కిరిబిక్కిరి చేసేస్తే అదేం చెప్పగలదు?” రాజేశ్వరి కూతుర్ని వెనకేసుకుని భర్తతో పోట్లాటకి దిగింది.
“చెప్పగలదు. ఎందుకంటే అనుకున్నది ఎదుటివారికి చక్కగా చెప్పగలిగే ఈ మాష్టారి కూతురు రవళి. అందుకు విచక్షణతోనే నిర్ణయం తీసుకుంటుంది. ఆ నమ్మకం నాకుంది.” అన్నారు.
ఆయన మళ్ళీ రవళిని ఉద్దేశించి “చూడు! నేనొక్క విషయం చెప్తాను. నువ్వు బ్యాంక్ టెస్ట్స్ వ్రాయి. వద్దనను.. ఈ లోపల టీచర్ పోస్ట్స్ కి నోటిఫికేషన్ పడితే అప్లై చెయ్యి. ఏది ఫస్ట్ వస్తే దానిలో జాయిన్ అవ్వు. నీకు అందులో ఉండాలనిపిస్తే ఉండు. లేదా అవకాశం వచ్చినపుడు బ్యాంక్ జాబ్‌కి మారిపోదువుగాని. . ఏదయినా దేనికయినా మూడేళ్ళే టైమ్. నువ్వు ఆ లోపల సెటిల్ అవ్వాలి. అది నా కోరిక.” అన్నారు. రాజేశ్వరి కూడా ఈ ప్రస్తావనకి సంతోషించింది.
కానీ ఏ నోటితో రామచంద్రం గారన్నారో గానీ రవళికి ముందుగా టీచర్ జాబే వచ్చింది. జాయిన్ అవడానికి వెళ్ళే ముందు రామచంద్రం గారు రవళితో ” ఉద్యోగం రావడం అందులో చేరడం గొప్ప విషయం కాదు. దానికి ఎంత వరకూ న్యాయం చేస్తామన్నది ప్రధానం. ఒకటో తరగతి అయినా అంకిత భావంతో చెప్పాలి. తక్కిన జాబ్స్‌లో కంటే వృత్తి పట్ల డెడికేషన్ లేని టీచర్ వల్ల సమాజం ఎక్కువ నష్టపోతుంది. నేను చూసానమ్మా! ఒక టీచర్ అసమర్థుడయితే అతను తన స్టూడెంట్స్‌కి తన సబ్జెక్ట్ పట్ల ప్రేమను పెంచలేడు సరికదా దాని పట్ల భయాన్ని, అయిష్టాన్ని పెంచుతాడు. నీ వల్ల అలాంటి పొరపాట్లు జరగకూడదు.” హెచ్చరికగా చెప్పారు.
“ఫష్ట్ డే ని ఎంత ఉత్సాహంతో రిజిష్టర్ లో సైన్ చేస్తావో రిటైర్ అయ్యే రోజు వరకూ అంతే ఉత్సాహంతో, అంతే స్పందనతో స్కూల్ కి వెళ్ళగలగాలి. నాన్న కూతురిగా ఆయన పేరును నువ్వు పెంచాలి గానీ, ఆయనకు అప్రతిష్ఠ తేకూడదు.” రాజేశ్వరి రవళి తల నిమురుతూ ఎంతో ఆర్ద్రంగా చెప్పింది.
“అలాగేనమ్మా! నేను మీ ఇద్దరి మాటలూ ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటాను. మీకు బాగా తెలుసు. ఏ పని చేసినా నేను దానిలో ఇన్వాల్వ్ అయే చేస్తాను. సెల్ఫ్ చెక్ తో ఎప్పుడూ అలెర్ట్ గానే ఉంటాను.” రవళి వాగ్దానం చేసింది.
వాగ్దానం చేసినట్లుగానే రవళి వృత్తిలో సిన్సియర్ గా ఆనందం వెదుక్కుంది. పిల్లలతో గడపుతూ, వాళ్ళ రకరకాల ప్రవృత్తులతో పరిచయం చేసుకుంటూ వృత్తిలో మమైకమయింది. రోజూ వచ్చి రవళి చెప్పే కబుర్ల తోనే తన ఇన్వాల్వ్ మెంట్ తల్లిదండ్రులకు అర్థమయింది. అప్పట్లో యస్.జి.టి. లు హైస్కూల్ లో కూడా బాగానే ఉండేవారు. కానీ రవళి ఎలిమెంటరీ లో పునాది వేయడం లోని ఛాలెంజెస్నే ఇష్టపడింది. అన్నెం పున్నెం ఎరుగని ఆ అమాయకపు పిల్లల హృదయాలను దొంగిలించడంలో పూర్తిగా సఫలీకృతురాలయింది.
ఇక కాజువల్‌గా తప్ప మళ్ళీ సీరియస్‌గా బ్యాంక్ జాబ్ కి ప్రయత్నించలేదు. మనిషికున్న ఆప్షన్స్‌లో దేన్నయితే వద్దనుకుంటాడో దాని చేతే తలుపు తట్టించడం విధి చేసే వింత! దాన్ని ఆహ్వానించడమా లేదా అనేది మనిషి చేతుల్లోనే ఉంటుంది. కానీ ఒకసారి దాన్ని స్వాగతించామా ఇక ఆ జీవితానికి ఎదురు ఉండదు. ఈ థియరీ ఎక్కువ శాతం జనానికే వర్తిస్తుంది.
(ఇంకా ఉంది)
రాయప్రోలు సుజాతా ప్రసాద్ విశ్రాంత ఉపాధ్యాయిని. వీరి స్వస్థలం విజయనగరం. ప్రస్తుత నివాసం హైదరాబాద్. శ్రీ చాడ.లక్ష్మణమూర్తి, కళావతి దేవి గార్లు వీరి తల్లితండ్రులు. వీరి భర్త పేరు శ్రీ రాయప్రోలు సత్య ప్రసాద్. అమ్మాయి – మృదుల, వంశీకృష్ణ (అల్లుడు), ప్రహిత, శ్రీదస్తువన్ (మనుమలు); అబ్బాయి సిద్దార్థ, అనూష (కోడలు), విభాకర శ్రీప్రద్, విభాశ్రీ అనఘ. (మనుమలు).
సుజాతగారు ఎమ్.బియడ్., డిప్లొమా ఇన్ మ్యూజిక్ (వీణ) చేశారు. పుస్తకాలు చదవడం, రచనలు చేయడం, పాడడం, వీణ వాయించడం, త్రెడ్ వర్క్ తో ఆభరణాలు తయారు చేయడం వీరి ప్రవృత్తి.
వీరి కలం పేరు ‘సుప్రజ’. కథలు, నవలలు, వ్యాసాలు వ్రాశారు. ‘విధి విన్యాసం’, ‘తల్లిదండ్రులు’ బహుమతి పొందిన నవలలు. ‘గోవు మా లచ్మికి’, ‘యాత్ర’, ‘నాణేనికి రెండో వైపు’, ‘మనమెవరమని?’, ‘సరైన తండ్రి’, ‘చందన గంధి,’ ‘ముడుచుకున్న రెక్కలు’, ‘దేవతలే శపిస్తే’, ‘మార్పు’ మొదలైనవి వివిధ పోటీల్లో బహుమతి పొందిన కథలు.
