[శ్రీమతి రాయప్రోలు సుజాతా ప్రసాద్ గారి ‘మథనం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[తాము తమ సొంతూరిలో కాకుండా, పెద్దమ్మ వాళ్ళ ఊర్లో ఎందుకుంటున్నామో తల్లిని అడుగుతుంది రమణమ్మ. నర్సమ్మ కారణం చెబుతుంది. ఎలాగైనా చదువుకుని ఉద్యోగం చేయాలని రమణమ్మ అనుకుంటే, ఆమె తల్లిదండ్రులు మాత్రం ఆమెకి మారుమనువు చేసి, ఆమె జీవితాన్ని సరిజేయాలని భావిస్తారు. రమణమ్మకి చెప్పకుండా ఓ సంబంధం ఖాయం చేసేసి, తరువాత చెప్తారు. కోప్పడినా, ఏమీ చేయలేకపోతుంది రమణమ్మ. తన షరతులకు మగపెళ్ళివాళ్ళు అంగీకరిస్తేనే పెళ్ళి చేసుకుంటానని అంటుంది. పెళ్ళికొడుకు తల్లిదండ్రులు వచ్చి రమణమ్మతో బాగా మాట్లాడుతారు. చదివిస్తామని హామీ ఇస్తారు. పెళ్ళికొడుకు వ్యాపార నిమిత్తం బీహార్ వెళ్ళాడని, పెళ్ళికే డైరక్టుగా వస్తాడని చెప్తారు. తండ్రి అనారోగ్యం, తల్లి కన్నీళ్ళు రమణమ్మని రెండో పెళ్ళికి సిద్ధపడేలా చేస్తాయి. రవళి కొత్త ఊర్లోని స్కూల్లో చేరుతుంది. ఊరు మారినా అవే పరిస్థితులు. తనలాంటి ఆలోచనలున్న టీచర్లతో కలిసి పనిచేస్తుంది. ఓ ఏడో తరగతి అమ్మాయికి, ఆమె తల్లిదండ్రులు పెళ్ళి చేసి పంపించేస్తే, ఏమీ చేయలేక, రవళి ఎంతో బాధపడుతుంది. మూఢాలు పోయాకా, రమణమ్మ పెళ్ళయిపోతుంది. నల్లగా చాలా లావుగా ఉన్న పెళ్ళికొడుకు వెంకటరావుని చూసి విస్తుపోతుంది. రమణమ్మ తల్లిదండ్రులని రావద్దని చెప్పి, కోడల్ని తీసుకుని వెళ్ళిపోతారు రమణమ్మ అత్తగారింటివాళ్ళు. కారులో వెళ్తుంటే అత్తమామలు రమణమ్మతో పరాచికాలాడి అసలు విషయం చెప్పేస్తారు. చదువుగిదువు ఏం లేదనీ, మొగుడితో కాపురం చేసి బిడ్డని కని తమ వంశాన్ని నిలపాలని. ఇంటికి చేరిన కాసేపటికే వెంకటరావుకి ఫోన్ వస్తుంది. తాను అర్జెంటుగా ఊరెళ్ళాలని చెప్తాడు. రమణమ్మని బెదరగొట్టద్దని హెచ్చరించి, ఆమెకి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతాడు. టిఫిన్ తిని గదిలోకి వెళ్ళి పడుకుందామనుకుంటుంటుండగా, టేబుల్‌కీ బీరువాకి పక్కన ఓ పైల్ పడి ఉండడం చూస్తుంది. అదేమిటా అని లోపలి కాగితాలు చూసేసరికి రమణమ్మ నవనాడులు స్తంభించిపోతాయి. విపరీతమైన జ్వరం వస్తుంది. కాసేపటికి వెంకటరావు ఫోన్ చేసి అలమారలో మందులున్నాయి వేసుకోమని చెప్తాడు. గదిలోకి వచ్చి, ఫోన్‌లో నెట్ ఆన్ చేసుకుని, ఆ ఫైల్ లోని విషయాల గురించి సమాచారం వెతికి తెలుసుకుంటుంది. తనని ఎంతగా మోసం చేశారో అర్థమవుతుంది. రమణమ్మ క్రుంగిపోతుంది. ఏం చేయాలో తోచదు, చచ్చిపోదామా అని కూడా అనుకుంటుంది. ఆ రాత్రి నిద్రలో రవళి మేడమ్ కనబడి మాట్లాడినట్టు కల వస్తుంది. మెలకువ రాగానే, ఎలాగోలా రవళి మేడమ్ గారి దగ్గరికి వెళ్ళాలని; ఈ సమస్యకు పరిష్కారం అడగాలని, ఆవిడ ఏం చెప్తే అది చేయాలని నిశ్చయించుకుని నిశ్చింతగా పడుకుంటుంది రమణమ్మ. – ఇక చదవండి.]
“మేడమ్! దుర్గారావు హెచ్.ఎమ్. గారిని ఎదిరించి మాట్లాడుతున్నాడు. వాడి భవిష్యత్తు ఏమవుతుందో అని భయంగా ఉంది. ఒక్కసారి మీరేమన్నా హాండిల్ చేయగలరేమో చూడండి” రామారావు సర్ గబగబా స్టాఫ్ రూమ్ కి వచ్చి రవళితో చెప్పారు.
“అసలేమయింది సర్! దుర్గారావు హెచ్.ఎమ్. గారిని ఎదిరించి మాట్లడడం ఏమిటి?” తొందరగా లేచి అతనితో బాటు హెచ్.ఎమ్. గారి రూమ్‌కి నడిచింది రవళి.
“ఆయన సాయంత్రం ఆరు నుండి మళ్ళీ టెంత్ క్లాస్ పిల్లల్ని రమ్మని స్పెషల్ క్లాస్ పెట్టి చదివిస్తారు. లోకల్‌గా ఉన్న మేల్ టీచర్స్ అంతా వస్తారు. వాడు ఆ క్లాస్‌కి రానంటాడు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. హెచ్.ఎమ్. గారితో తగువంటే దాని పర్యవసానం ఎలా ఉంటుంది? చెప్పండి.” రామారావుగారు వివరించారు.
“నేనెంత చెప్పినా నా బాధ మీకు అర్థమవడం లేదండి. నేను అందరితోను ఆ శబ్దాల మధ్య చదవలేను. నేను ఇంటి దగ్గరే చదువుతాను. మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన పెర్సెంటేజ్ రాకపోతే..”
“దుర్గారావు! ఏం మాట్లాడుతున్నావు? హెడ్మాస్టర్ గారితో ఇలాగేనా మాట్లాడేది? ఒక్కసారి రూమ్ లోంచి బయటకు రా! నీ సమస్య ఏమిటో మీ క్లాస్ టీచర్‌తో మాట్లాడి పరిష్కరించుకోవచ్చు.” రవళి గొంతు, అందులో కమాండింగ్‌కీ ఆగాడు దుర్గారావు.
“తనని తనేమనుకుంటున్నాడోనండీ? ప్రగల్భాలు, పలుకుతూ, ప్రతిజ్ఞలు చేస్తున్నాడు.” హెచ్.ఎమ్. నరసింగరావు గారు అదొకలా నవ్వుతూ అన్నారు.
“ఒక్క ఐదునిమిషాలు టైమ్ ఇవ్వండి సర్” ఎంతో నెమ్మదిగా చెప్పి దుర్గారావును రూమ్ లోంచి ఓ విధంగా బలవంతంగా తీసుకు వచ్చింది రవళి.
“నేను ఎక్‌స్ట్రా క్లాసులకి రాలేనండీ. నేను ఇంట్లో చదువుకుంటానంటే అతను ఒప్పుకోవడం లేదు. ఆళ్ళకెందుకండీ! నేను మీరనుకున్న పెర్సంటేజ్ తెచ్చుకోకపోతే నా టెంత్ సర్టిఫికేట్ తీసుకోను. ఇక్కడే వదిలేస్తాను” దుర్గారావు మాటలకు రవళి తెల్లబోయింది. ఇది మితిమీరిన ఆత్మవిశ్వాసమా? లేక తలపొగరా? అర్థం కాలేదు.
“నీ బాధ నాకు అర్థమయింది. కానీ ఆ విషయం చెప్పే తీరు అది కాదు. ముందు ఆయన మాట విను. సిన్సియర్‌గా చదవడానికి ప్రయత్నం చెయ్. నీకు ఇబ్బంది అయితే అప్పుడే హెడ్మాస్టర్ గారితో మాట్లాడదాం. ముందు వెళ్ళి ఆయనకు సారీ చెప్పి క్లాస్‌కి వస్తానని ఒప్పుకుని రా!” ఆ గొంతులో పలుకుతున్న సీరియస్‌నెస్‌కి దుర్గారావు కొంచెం భయపడి రవళి చెప్పినట్లు చెయ్యడానికి ఒప్పుకున్నాడు.
దుర్గారావు ఎబౌఏవరేజ్ స్టూడెంట్. క్లాస్‌లో శ్రధ్ధగా పాఠం విని సందేహాలు అడుగుతాడు. వాటిల్లో టీచర్స్‌ని ఇబ్బంది పెట్టేవే ఎక్కువ ఉంటాయి. పాఠం ముందుకు జరగనీయడు. అతని మాట వినడానికి కూడా టీచర్స్ ఇష్టపడరు. అందుకే అతనంటే ఒకరకం విసుగు టీచర్స్‌కి. రవళిని కూడా తికమక పెట్టాలని ఎంతో ప్రయత్నించాడు. కానీ రవళిని సాధించడం దుర్గారావు వశం కాలేదు. ఒకసారి స్టాఫ్ రూమ్‌కి పిలిచి మాట్లాడింది.
“నువ్వు అడిగే సందేహాలు మేము కూడా రిఫర్ చేసి మర్నాడు క్లియర్ చేసేంత బాగా ఉండాలి. దానివలన నువ్వు, క్లాస్, మేము కూడా బాగుపడతాము. నువ్వు అడిగే వాటివలన ఎవరికీ ఏ లాభమూ ఉండదు సరి కదా! మా దృష్టిలో దిగజారిపోతావు.” అంటూ ఒక పాఠం ఎలా వినాలి? దానిలో ఎలాటి సందేహాలు అడగాలి అనేది ఉదాహరణలతో కూడా చెప్పింది. టీచర్స్ చేత ఎప్పుడూ కసుర్లు తినే దుర్గారావుకి రవళి ట్రీట్మెంట్ కొత్తగా అనిపించింది. తరువాత కాలంలో అదే గౌరవంగా మారింది.
దుర్గారావు చాలా మొండివాడు కూడా. ఒకసారి ఒక టీచర్‌ని చాలా రెచ్చగొట్టి వెర్రెక్కించేసాడు. అతను కోపంతో చేత్తోను, కర్రతోను కూడా కొట్టాడు. దుర్గారావు మొండిగా నిలబడ్డాడు కానీ ఏడవలేదు. దాంతో ఆ సార్ కర్ర విరిగే వరకూ కొట్టి వచ్చేసారు. అప్పటితో అది ఆగలేదు. మర్నాడు యస్.యఫ్.ఐ. లీడర్స్ స్కూల్‌కి వచ్చారు.ఆ గొడవ చల్లారేందుకు కొంచెం టైమ్ పట్టింది. ఇలాంటి చరిత్రలు దుర్గారావుకి చాలానే ఉన్నాయి. అతను ఎవరికన్నా వింటాడు అంటే అది రవళికి, మేథ్స్ సర్ గోవిందరావుకి మాత్రమే. రవళి ఎంతగానో నచ్చచెప్పిన మీదట దుర్గారావు స్టడీ అవర్‌కి రావడానికి ఒప్పుకున్నాడు. కొంచెం అయిష్టంగానే హెచ్.ఎమ్ గారికి సారీ చెప్పి స్టడీ అవర్‌కి రావడానికి తన అంగీకారాన్ని చెప్పాడు.
***
మంగమ్మ తమ కాళ్ళా వేళ్ళా పడకుండా ధైర్యౕంగా బతకడం వాళ్ళాయన చలపతికి నచ్చలేదు. సవితి కొడుకు రాజేష్‌కీ మింగుడు పడలేదు. వాళ్ళిద్దరి మధ్య అంత పొత్తేమీ లేదు. రాజేష్ ఎవరితో, ఎక్కడ తిరుగుతాడో, ఏం చేస్తాడో చలపతికి పట్టదు. అలాగే చలపతి వేసే వేషాలు రాజేష్‌కి పట్టవు. ఇద్దరూ ఎదురుపడి మాట్లాడుకున్నది లేదు. కానీ మంగమ్మని సాధించడానికి ఇద్దరూ కలిసిపోయారు.
దీప సైకిల్ మీద కాలేజ్‌కీ వెళ్తున్నపుడు వస్తున్నపుడు రాజేష్ ఫ్రెండ్స్ వేధించడం ప్రారంభించారు. ముందు ఎవరన్నదీ దీపకి తెలీలేదు. ఇంట్లో తల్లికి చెప్తే భయపడుతుందో, బెంగపడుతుందో ఊహకి అందడం లేదు. కానీ తరువాత ఆ బ్యాచ్‌లో జనం తన ఊరి వారే అని తెలిసాక కాస్త ధైర్యం వచ్చింది. తల్లితో ఇంక దాచాలనిపించక అసలు విషయం చెప్పింది. మంగమ్మకి భయం వేసింది. వీళ్ళు తన పిల్లని ఏ విధంగా ఇబ్బంది పెడతారో అని టెన్షన్ పడింది. కానీ వాళ్ళిద్దరికీ తెలియని విషయం ఏంటంటే ఆరోజు వాళ్ళలో ఒకడు సైకిల్ మీద సైలెంటుగా దీప వెనకాలే వచ్చి ఇంటి అడ్రెస్ కనుక్కున్నారని.
మంగమ్మ బాగా ఆలోచించి “సోమశేఖర్ గారితో వెళ్ళి చెప్పి వద్దాం పద. ఆయన ఏదన్నా సలహా చెప్తారేమో” అంది. సోమశేఖర్ గారు సి.ఐ.గా చేస్తున్నారు. మంగమ్మ ఆలోచనకి దీప థ్రిల్లయింది.
తల్లిని గాఢంగా ముద్దు పెట్టుకుంది. “నిజమమ్మా! ఆయనే తలుచుకుంటే వీళ్ళు, వీళ్ళ దాష్టికం ఎంత? నేను వెళ్ళి మాట్లాడి వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు.” దీప అంది. కానీ మంగమ్మ వినలేదు. తనుకూడా బయలుదేరింది.
కానీ తీరా వీళ్ళు వెళ్ళేసరికి వాళ్ళు లేరు. సోమశేఖర్ గారి అన్నయ్యకి బావులేదంటే ఊరు వెళ్ళారని, వాళ్ళు వచ్చే సరికి రెండు రోజులు పడుతుందని తెలిసింది.
“ఆయన ఊరినుంచి వస్తే ఏదో పరిష్కారం చూస్తారు. అంతదాకా మనం జాగ్రత్తగా ఉండాలమ్మా!” అంది భయంగా మంగమ్మ.
“మరింకేం? ఫర్వాలేదులే. రెండు, మూడురోజుల్లో వీళ్ళ అల్లర్లు ఆగుతాయిలే” అంది దీప నిశ్చింతగా.
***
రమణమ్మ ఆ ఇంటి నుంచి తప్పించుకోవడానికి బాగా ఆలోచించింది. టీచర్స్ తనని ఎదురుగానూ, వెనుకగా కూడా చాలా తెలివైందని అనేవారు. మరి ఆ తెలివితేటలు తన బ్రతుకును కాపాడుకోడానికి ఉపయోగపడకపోతే ఎలాగ? రవళి మేడమ్ అన్నట్లు నిజ జీవితంలో చదువు ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించాలి. ఎలాగన్నా ఈ ఆపద లోంచి బయట పడాలి.
ఆ ఆలోచన రాగానే రవళి తన అత్తగారు నాగమ్మని “అమ్మమ్మా, అని, మామగారు సూరయ్యని “తాతా!” అని పిలిచింది. అనుమానం రాకుండా వాళ్ళతో అభిమానంగా బాగా మసిలింది. ఒంట్లో బావులేక పోయినా మాత్ర వేసుకుని మరీ వంటింట్లో నాగమ్మకి వెనకాతలే ఉండి సహాయం చేసింది. వాళ్ళ ఇద్దరితో కలిసి టి.వి. చూస్తూ ఏవో కబుర్లు చెప్తూ నవ్వించింది. వాళ్ళలో తన పట్ల నమ్మకం కలిగించింది. వాళ్ళు తనతో చెప్పిన అబధ్ధాలకి, చేసిన మోసానికి ఇది తప్పు కాదనిపించింది.
రమణమ్మకి ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే ఇంటికి ఎవరన్నా వచ్చినా నాగమ్మ కొత్త కోడలు అని రమణమ్మని పరిచయం చేయడం కానీ, సరదాగా చూపించడం కానీ ఎప్పుడూ చేయలేదు.. సరి కదా! ఎవరన్నా తలుపు కొడితే హాల్‌లో ఉన్న రమణమ్మని లోపలికి బెడ్ రూమ్ లోకి వెళ్ళిపొమ్మనేది. ఈ రహస్య జీవనమేమిటో రమణమ్మకి అర్థం అయేది కాదు. ఊర్లో వాళ్ళకి తెలియకుండా ఇలా మేనేజ్ చేయడానికి కారణం తెలియక అయోమయంగా అనిపించేది.
కానీ రమణమ్మ పైకి ఎలా ఉన్నా, లోపల్లోపల తను సాలెగూడు లాంటి ఈ ఇంట్లోంచి ఎలా బయటపడాలా? అన్న ఆలోచన నిరంతరం వెంటాడుతూనే ఉంది. వాళ్ళు పడుకున్నపుడు ఇల్లంతా బాగా తిరిగి చూసింది.. వంటింట్లోంచే కాకుండా తను పడుకునే గదిలోంచి కూడా పెరట్లోకి దారి ఉంది. పెరడు చాలా పెద్దది. ఎప్పుడో కానీ నాగమ్మ పెరట్లోకి వెళ్ళదు. పెరట్లో పూలు కోసుకుంటానని చెప్పి రమణమ్మ వెళ్ళి అంతా పరిశీలించింది. పెరటి తలుపు తీస్తే మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోవచ్చని గ్రహించింది.
నర్సమ్మతో ఆ రోజు పోట్లాడిన తరువాత మరి మాట్లాడింది లేదు. నర్సమ్మ రమణమ్మకి చేస్తోంది. కానీ రమణమ్మ కట్ చేస్తోంది. నర్సమ్మ కూతురి మీద బెంగతో వియ్యపురాలు నాగమ్మకి ఫోన్ చేసి “రమణమ్మ ఎలా ఉంది” అని అడిగింది.
నాగమ్మ సంతోషంగా.. “నువ్వు నీ కూతుర్ని నాకు కోడలిగా పంపావు. కానీ ఆ పిల్ల మాకు మనుమరాలయింది. ‘అమ్మమ్మా! తాతా!’ అంటూ పిలుస్తోంది. ఇంటి కళే మారిపోయింది. ఈ నాలుగు రోజులూ పండగలా ఉందనుకో!” అంది సంబరంగా.
నర్సమ్మ ఆనందానికి హద్దులు లేవు. తను చెప్పిన మాట అర్దం చేసుకుని అత్తారింట్లో బాగా మసులుతున్న కూతురి పట్ల ప్రేమ మరింతగా పెల్లుబికింది. రాజయ్యతో విషయం చెప్పి పొంగిపోయింది. “పోనీలేయే ఇన్నాళ్ళకి దాని బతుకు చక్కబడింది. అది కాపురంలో కుదురుకుంది. అంతకంటే ఇంకేటి కావాల మనకి?” అన్నాడు సంతోషంగా.
***
రెండు రోజులు రవళి మాట మీద దుర్గారావు సాయంత్రాలు స్టడీ అవర్స్‌కి వచ్చాడు. ఆ తరువాత దుర్గారావు స్కూల్‌కే రాలేదు. మరో రెండు రోజులు చూసి కబురు పెట్టింది. దుర్గారావు పది లంఖణాలు చేసిన వాడిలా మొహం పీక్కుపోయి ఉన్నాడు.
రవళి ఆదుర్దాగా కారణం అడిగింది. “మేడమ్! మీరు నేను చెప్తే వినలేదు. నాకు అంతమంది గోలగా చదువుతుంటే నాకు చదువు ఎక్కదు. ఆ సౌండ్ నేను భరించలేను. నేను భరింతలేనంత చెవిపోటుతో బాధపడుతున్నాను. ఎవరికీ నా బాధ అర్థం కావడం లేదు.” కాస్త ఉక్రోషంగా అన్నాడు.
“అదేమిటి? డాక్టరు దగ్గరికి వెళ్ళలేదా? చెవిపోటు భరించడం చాలా కష్టం.” రవళి అడిగింది. కానీ మనసులో ఆశ్చర్యపోయింది. పిల్లలు ఇంత సెన్సిటివ్‌గా ఉంటారా? నిజంగానే అతనికి సౌండ్ పడక చెవిపోటు వచ్చేసిందా?
“మా అమ్మ తెలిసిన కాడ అప్పుచేసి ఇచ్చింది. దాంతో జంక్షన్‌లో ఉన్న డాక్టరు దగ్గరికి వెళ్ళి మందు తెచ్చుకున్నాను. అతను ఒక ఇన్‌స్ట్రుమెంట్ చెవిలో పెట్టి తిప్పేసి ఇంకా నొప్పిని పెంచేసాడు. ఇంకా పైపెచ్చు ‘అసలు ఏడవవేటిరా? నువ్వు?’ అన్నాడు. అతను ఇచ్చిన మందు ఏమీ పని చేయలేదు. ఈ సలుపు, పోటు భరించలేక నేనమవుతానో తెలియడం లేదండీ” తీవ్రమైన బాధకి చెవి మీద చెయ్యి పెట్టుకుని అన్నాడు.
రవళి తన పర్స్ తీసి చూసింది. తన ఛార్జెస్‌కి మినిమమ్ ఉంచుకుని మిగతా డబ్బు ఇచ్చింది.
“ఇది పూర్తిగా చాలదు. దీని మీద మీ అమ్మగారిని ఎంతో కొంత ఇమ్మని విజయనగరం వెళ్ళి మంచి డాక్టరుకి చూపించుకో.” చెప్పింది రవళి. ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోయిన దుర్గారావు మర్నాడు అలాగే ఆ డబ్బు జేబులో పెట్టుకుని వచ్చేసాడు.
“మా అమ్మ ఇంక అప్పు తేలేనని, పైసా కూడ ఇవ్వలేనని చెప్పిందండీ. ఇంక మీ దయ.” రవళి కూర్చున్న కుర్చీ దగ్గర క్రింద కూచున్నాడు. అతని కళ్ళలోని నిస్సహాయత, దీనత్వం రవళి గుండెను మెలిపెట్టాయి. చెవి వైపు చెంప అంతా వాచిపోయి కమిలిపోయి ఉన్నాడు. ముందురోజు అతని మాటల్లోనే అతని ఆర్థిక స్తోమత తెలిసింది. అందుకనే ఎందుకన్నా మంచిదని కాస్త ఎక్కువ డబ్బులే బ్యాగ్‌లో వేసుకొచ్చింది.
“స్కూల్ వదిలే టైమ్‌కి రా దుర్గారావ్! నాతో బాటు విజయనగరం తీసికెళ్ళి డాక్టర్‌కి చూపిస్తాను. అటునుంచి మన ఊరి ఆటో ఎక్కిస్తే వచ్చేయగలవు కదా!” అడిగింది రవళి.
“నాకు అలవాటుంది. మా వీధి షావుకారు సాయానికి అప్పుడప్పుడు తీసికెళ్తాడు మేడమ్! అందుకే నేను వచ్చేయగలను.” దుర్గారావు చెప్పాడు.
చెప్పినట్లుగానే సాయంత్రం ఇ.యన్.టి. స్పెషలిస్ట్ దగ్గరికి తీసికెళ్ళింది. ఆ డాక్టర్ దుర్గారావుని చూడగానే రవళి మీద విరుచుకు పడ్డాడు. “బాధ ఇంత విపరీతమైపోయి, ముదిరిపోయే వరకూ ఏం చేస్తున్నారు? తల్లికి బిడ్డపట్ల ఇంత నిర్లక్ష్యం నేను ఇంతవరకూ చూడలేదు. పిల్లడిలో అసలు రక్తం లేదు. మనిషి ఇంత పాలిపోయి ఉన్నాడు. మీకు తెలియలేదా? ఎడ్యుకేటెడ్ లాగానే కన్పిస్తున్నారు?” అంటూ కేకలేసాడు.
రవళి తెల్లబోయింది. ఈ లోగా దుర్గారావు కలిపించుకుని “ఆవిడ మా అమ్మ గారు కాదండీ. మా మేడమ్. చెవి పోటుకి నేను బాధపడుతుంటే చూడలేక తీసికొచ్చారు.” అన్నారు. ఒక్కసారిగా ఆ డాక్టర్ చల్లబడిపోయాడు. “సారీ అండీ” అంటూ వెంటనే దుర్గారావుకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాడు.
“ఇది కొంచెం బాధ పెడుతుంది. ఓర్చుకోవాలి సరేనా?” స్నేహపూర్వకంగా దుర్గరావు కేసి చూసి అన్నాడు. దుర్గారావు తల ఊపాడు. ఆ ట్రీట్మెంట్ సలుపు ఉన్న చెవికి మరింత బాధే. కానీ దుర్గారావు ఓర్చాడు. డాక్టర్ దుర్గారావు చెవి క్లీన్ చేసి, “శభాష్! మంచి ధైర్యం, ఓర్పు ఉన్నవాడివే.” అన్నాడు. దుర్గారావు అతనికి నమస్కరించాడు.
ఆ డాక్టర్ అసిస్టెంట్‌ని పిలిచి కొన్ని మందుల పేర్లు చెప్పి ఆ మందులేమన్నా సాంపిల్స్‌లో ఉన్నాయా అని కనుక్కున్నాడు. అవి లేవు.
అతను రవళి వైపు చూసి “సారీ! అవి సాంపిల్స్ లో లేవు. చిన్న ఖరీదు మందులే వ్రాస్తాను. అవి చీప్‌వి ఇచ్చాననుకోవద్దు. చాలా బాగా పని చేస్తాయి. బై దవే ఈ అబ్బాయిని హాస్పిటల్‌లో జాయిన్ చెయ్యాలి. అసలు బ్లడ్ లేదు. బ్లడ్ తప్పకుండా ఎక్కించాలి. లేకపోతే చాలా ప్రమాదం.” అన్నాడు.
“సర్! అతనికి టెంత్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. ఎగ్జామ్స్ కంప్లీట్ అవగానే జాయిన్ చేస్తాను. ఈలోగా అతనికి ఇబ్బంది లేకుండా ఏదన్నా మంచి టానిక్ రక్తం పట్టడానికి వ్రాయండి. కొంటాను.” అంది.
ఆయన అలాగే మాత్రలతో పాటు, టానిక్ కూడా వ్రాసి ఇచ్చి పరీక్షలు అయాక జాయిన్ చేయడం మర్చిపోవద్దని చెప్పాడు. అతను రవళి దగ్గర కన్సల్టేషన్ ఫీజ్ తీసుకోలేదు. ఒక మంచి పనికి డాక్టర్ కూడా తన వంతు సహకారాన్ని అందించారు అనుకుని ఆయనకి మనసారా థాంక్స్ చెప్పి నమస్కరించి వచ్చేసింది. దుర్గారావుకి మందులన్నీ కొని ఇచ్చి ఆ ఊరి ఆటో ఎక్కించేసి వచ్చింది.
మర్నాడు స్కూల్‌కి కాస్త త్వరగా వచ్చింది. నైన్త్ క్లాస్ పిల్లలు ఏవో డౌట్స్ క్లియర్ చేయాలన్నారు. ఇంకా వాళ్ళు రాలేదు. ఏదో పుస్తకం చదువుకుంటుంటే పాదాల దగ్గర చేతుల స్పర్శకి ఉలిక్కిపడి చూసింది. స్కూల్ డ్రెస్‌లో నీట్‌గా తయారయి ఫ్రెష్‌గా కనిపిస్తున్ళ దుర్గారావు రవళి పాదాలు తాకి నమస్కరిస్తున్నాడు.
“ఏయ్! ఏమిటిది? లే! చెవినొప్పి తగ్గినట్లు తెలుస్తోంది. అది చాలు. నీకు బాధ నుంచి విముక్తి దొరికి చదువుకోగలిగితే చాలు. ఈ నమస్కారాలు అవీ ఎందుకు?” రవళి ఆప్యాయంగా దుర్గారావుని లేవనెత్తింది.
“మేడమ్! ఈ నొప్పి వచ్చిన దగ్గర నుంచి కంటి మీద కునుకు లేదు. అసలు ఇంతకు ముందు నేనెప్పుడైనా రాత్రుళ్ళు పడుకున్నానా? ఇక ముందు పడుకుంటానా? అని అనుకుంటూ జాగారాలు చేసాను. కానీ నిన్న రాత్రి చాలా హాయిగా నోప్పి లేకుండా పడుకున్నాను. మీకు ధన్యవాదాలు ఎలా చెప్పాలో కూడా తెలియడంలేదు.” అన్నాడు.
సర్ ఒళ్ళు వాచేటట్లు కొట్టినా ఏడవని, ఇద్దరు డాక్టర్ల ట్రీట్మెంట్‌ని ఎంతో మొండిగా సహించిన దుర్గారావు కళ్ళు రవళి పట్ల కృతజ్ఞతతో నిండి స్రవించాయి. రవళి తెల్లబోయింది.
“సరే! వెళ్ళు. క్లాస్‌లో కూచో! నువ్వు స్టడీ అవర్‌కి రాకుండా నేను హెచ్.ఎమ్. గారికి చెప్పి మేనేజ్ చేస్తాను. నువ్వు ఇంటి దగ్గరే బాగా చదువుకో. పరీక్షలయ్యాక మాత్రం నాకు ఫోన్ చేసి వస్తే ఆ డాక్టర్ గారి దగ్గరకు వెళ్దాం. ఆయన చెప్పినట్లు నిన్ను జాయిన్ చేస్తాను. నువ్వు పూర్తిగా ఆరోగ్యవంతుడివి కావాలి. నిన్ను డాక్టర్ దగ్గరికి తీసికెళ్ళినట్లు అందరికీ టామ్ టామ్ వేయకు. సరేనా?” రవళి నవ్వింది. దుర్గారావు కూడా అలాగే అంటూ నవ్వుతూ ప్రసన్నంగా క్లాస్‌కి వెళ్ళిపోయాడు.
(ఇంకా ఉంది)
రాయప్రోలు సుజాతా ప్రసాద్ విశ్రాంత ఉపాధ్యాయిని. వీరి స్వస్థలం విజయనగరం. ప్రస్తుత నివాసం హైదరాబాద్. శ్రీ చాడ.లక్ష్మణమూర్తి, కళావతి దేవి గార్లు వీరి తల్లితండ్రులు. వీరి భర్త పేరు శ్రీ రాయప్రోలు సత్య ప్రసాద్. అమ్మాయి – మృదుల, వంశీకృష్ణ (అల్లుడు), ప్రహిత, శ్రీదస్తువన్ (మనుమలు); అబ్బాయి సిద్దార్థ, అనూష (కోడలు), విభాకర శ్రీప్రద్, విభాశ్రీ అనఘ. (మనుమలు).
సుజాతగారు ఎమ్.బియడ్., డిప్లొమా ఇన్ మ్యూజిక్ (వీణ) చేశారు. పుస్తకాలు చదవడం, రచనలు చేయడం, పాడడం, వీణ వాయించడం, త్రెడ్ వర్క్ తో ఆభరణాలు తయారు చేయడం వీరి ప్రవృత్తి.
వీరి కలం పేరు ‘సుప్రజ’. కథలు, నవలలు, వ్యాసాలు వ్రాశారు. ‘విధి విన్యాసం’, ‘తల్లిదండ్రులు’ బహుమతి పొందిన నవలలు. ‘గోవు మా లచ్మికి’, ‘యాత్ర’, ‘నాణేనికి రెండో వైపు’, ‘మనమెవరమని?’, ‘సరైన తండ్రి’, ‘చందన గంధి,’ ‘ముడుచుకున్న రెక్కలు’, ‘దేవతలే శపిస్తే’, ‘మార్పు’ మొదలైనవి వివిధ పోటీల్లో బహుమతి పొందిన కథలు.
