[శ్రీమతి రాయప్రోలు సుజాతా ప్రసాద్ గారి ‘మథనం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[ఎందరో విద్యార్థినీ విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయురాలు రవళి కథ ఇది. ముఖ్యంగా ఆడపిల్లల జీవితాలు మలుపు తిరడంలో రవళి పాత్ర అద్వితీయం. ఓ వెన్నెల రాత్రి పూట, ముత్యాల సరాలలోని కవితని గుర్తు చేసుకుంటూ, తన భర్త మురళితో కలిసి – ఇల్లు విడిచి, ఎక్కడికో దూరంగా, కొండదాటి, కోనదాటి వెన్నెల మైదానంలోకి వెళ్ళి నిల్చోవాలని అనిపిస్తుంది. కానీ ఊహ వేరు, వాస్తవం వేరన్న సంగతి ఆమెకి తెలుసు. వెన్నెలని, వెన్నెలలో స్నానిస్తున్న చెట్ల ఆకులను చూస్తూ గతంలోకి జారుకుంటుంది రవళి. కోరినది లభించకపోయినా, దొరికిన దానిని ప్రేమించి, జీవితాన్ని అందంగా మలచుకునే స్వభావం రవళిది. తల్లిదండ్రులకు ఆమె ఒక్కర్తే సంతానం. తండ్రి రామచంద్రం గారు టీచర్, తల్లి రాజేశ్వరి గృహిణి. హైస్కూలు వచ్చాకా, తనతో పాటు చదువుతున్న నేస్తురాళ్ళకి ఒక్కొక్కరికి వివాహం అయిపోవడం రవళికి ఆశ్చర్యం కల్గిస్తుంది. టెంత్ క్లాసు చదువుతుంటే, ఆప్తురాలైన నేస్తం సత్యవతికి పెళ్ళి నిశ్చయం చేస్తారు పెద్దలు. వద్దని వారించమంటుంది సత్యవతిని. కానీ ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోతుంది. రవళికి మంచి టీచింగ్ కెపాసిటీ ఉండేది. తనకన్నా చిన్నపిల్లలకి వాళ్ళ పాఠాలు అర్థమయ్యేలా వివరించేది. ఇంటర్ పూర్తి చేసి, డిగ్రీలో చేరుతున్న సమయంలో రామచంద్రంగారు పక్షవాతం బారిన పడడంతో డిగ్రీ ఆపేసి, డైట్ సెట్ వ్రాసి, టీచర్ ట్రైనింగ్‍లో సెలెక్ట్ అవుతుంది రవళి. ఒకరోజున తండ్రి మంచం పక్కన ఉన్న మునిమాణిక్యం గారి ‘కాంతం కథల’ పుస్తకం తీసి చదువుతుంది. ఆమెకి బాగా నవ్వు రావడంతో, తండ్రికి చదివి వినిపిస్తుంది. ఆయనకి నచ్చడంతో, రోజూ ఒక గంటైనా చదివి వినిపించడం అలవాటు చేసుకుంటుంది. క్రమంగా ఆయన కోలుకుని, మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళడం ప్రారంభిస్తాడు. రవళి మళ్ళీ డిగ్రీలో చేరుతుంది. డిగ్రీ అయ్యాకా, ఏం చేద్దామనుకుంటున్నావని తండ్రి అడుగుతాడు. అమ్మ సంబంధాలు చూడమంటోందని అంటాడు. ఉద్యోగం వచ్చేవరకు పెళ్ళి చేసుకోనని చెప్తుంది రవళి. బ్యాంకు ఉద్యోగం కన్నా టీచర్ ఉద్యోగం మంచిదని చెప్తాడు తండ్రి. ఆయన అన్నట్టు రవళికి ఎలిమెంటరీ స్కూల్‌లో టీచర్ జాబ్ వస్తుంది. ఉద్యోగంలో చేరేటప్పుడు విలువైన సూచనలు చేస్తాడాయన. – ఇక చదవండి.]
అనుకున్నట్లుగానే ఏడాది దాటాక రవళికి పెళ్ళి ప్రయత్నాలు చేసారు. చూసిన సంబధాలలో మురళి సంబంధం బాగా నచ్చింది. అప్పుడు మురళి యమ్.ఆర్.పి.గా ఉండేవాడు. మురళి తండ్రి వెంకటరావు పోష్టు మాష్టరుగా వాళ్ళ స్వంత ఊళ్ళోనే చేస్తాడు. రెండెకరాల పొలాన్ని కౌలుకిచ్చినా దగ్గరుండి అన్నీ చూసుకుంటూ ఆ చుట్టుపక్కల ఊళ్ళలోనే సర్వీసు చేసాడు. పల్లెలో స్వంత ఇంట్లో ఉంటాడు. ఆయన భార్య హవుస్ వైఫ్. మురళి కంటే పెద్ద వాడు వేణు బి.యస్.యన్.యల్.లో వైజాగ్‌లో చేస్తున్నాడు. అతనికి పెళ్ళయి బాబు.
పెద్దలు మాట్లాడుకున్నాక పెళ్ళిచూపులు జరిగాయి. రవళి రూపానికి, కళ్ళలో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసానికి, మురళి ముగ్ధుడయాడు. మురళి చామనఛాయ అయినా మంచి కన్ను ముక్కు తీరువతో అందరినీ ఆకర్షించాడు. మురళి, రవళి వేరేగా మాట్లడుకున్నపుడు, రవళి తన జీతంలో ప్రతీ నెలా ఎంతో కొంత ఛారిటీకి ఇస్తానని, తల్లిదండ్రులకి ఏ అవసరమైనా అటెండ్ అవుతాననీ, వాళ్ళ బాధ్యత తనదేనని చెప్పింది. మురళీ మేథ్స్ తన ఫేవరేట్ సబ్జెక్ట్ అని, నెక్స్ట్ డి.యస్.సి.కి డైరెక్ట్ బి.యడ్ వ్రాసి క్లియర్ చెయ్యాలనేది ప్రస్తుత లక్ష్యమని చెప్పాడు. అతను ముఖ్యంగా తల్లి గురించి చెప్తూ ఆవిడ చాలా పాతకాలం మనిషనీ, ఆవిడ నమ్మకాలు బాధ కలిగించినా సర్దుకోవాలని రిక్వెస్ట్ చేసాడు. ఇక ఒకరి అభిరుచులు మరొకరికి నచ్చి, ఒ.కే. చెప్పారు.
తరువాత ఇరు పక్షాల పెద్దలు సంబంధం కలుపుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. మూఢాల వల్ల నాలుగు నెలలు దాటితే గానీ ముహూర్తాలు లేవన్నారు. ఈ లోగా వాళ్ళ పెద్దకోడలికి పురిటి రోజులు దగ్గర పడడంతో ఆగారు. ఇక ఆపైన డి.యస్.సి. నోటిఫికేషన్ పడడంతో మురళి జాబ్‌కి సెలవు పెట్టి సిన్సియర్‌గా దానికి ప్రిపేర్ అయాడు. అలాగే అతను కోరుకున్నట్లు డైరక్ట్ మేథ్స్ బి.యడ్ పోస్ట్ కొట్టాడు. ఇలాటి కారణాల వల్ల మురళి, రవళిల పెళ్ళి నిశ్చయమయిన సంవత్సరంన్నర తరువాత వాళ్ళ పెళ్ళి జరిగింది. రవళి కూడా ఈలోగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో బి.యడ్. చేసింది.
ఇద్దరివీ ఒద్దికయిన, సరైన వ్యక్తిత్వాలు కాబట్టి పెళ్ళి ముందు వాళ్ళు మాట్లాడుకున్న మాటలను నీటి పాలు చేయలేదు. ఇద్దరూ ఒకరి స్వభావాలను మరొకరు గౌరవిస్తూ, నెగిటివ్స్‌తో సహా స్వీకరించడంతో వాళ్ళ వైవాహిక జీవితం ఆనందభరితంగానే సాగింది. మామగారు వెంకటరావుతో ఫర్వాలేదు కానీ అత్తగారు కాంతంతో మాత్రం రిలేషన్ మెయిన్‌టెయిన్ చేయడం రవళికి చాలా కష్టమయింది. కానీ మురళి వల్ల అది సాధ్యమయింది. మురళికి తల్లిని ట్యూన్ చెయ్యడం తెలుసు. కొడుకుని కాదనలేని బలహీనత కాంతానికి ఉంది. అన్ని విషయాలలోను సర్దుకోడానికి ఒప్పుకునే రవళి సిధ్ధాంతాల దగ్గర చాలా దృఢంగా నిలబడిపోయేది. వాళ్ళిద్దరినీ అటువంటి విషయాలలో ఎదురు పడకుండా చూడడానికి మురళి చాలా ప్రయత్నించేవాడు.
అయితే మురళికి పెళ్ళయినప్పటికి తండ్రి సర్వీసులో ఉండేవాడు. పెళ్ళయిన రెండేళ్ళకి రిటైర్ అయిపోయాడు. అయినా అతను మరో ఐదేళ్ళ వరకూ స్వంత ఊర్లోనే వ్యవసాయం చూసుకుంటూ ఉండిపోయేడు. అందువలన కాంతం కోడలికి తన విశ్వరూపం చూపించలేకపోయింది. వాళ్ళు రావడం, వీళ్ళు వెళ్ళడం అన్నీ అప్పుడప్పడే కనుక పెద్ద రప్చర్‌లు లేవు.. మేగ్జిమమ్ రవళియే సర్దుకునేది. అది మురళికి అర్థమయేది. కొడుకు తనవాడు, కోడలు పరాయిది అనే ఈ భావం ఎప్పటికి పోతుందో ఏమో అమ్మకి అనుకునేవాడు.
కానీ ఆవిడవి పాతకాలం ఆలోచనలు. ముఖ్యంగా రవళి తల్లిదండ్రులకు అవసరాలకు ఎటెండ్ అవడం కాంతానికి నచ్చేది కాదు. ఆడపిల్ల పెళ్ళయాక మనసా, వాచా, కర్మణా అత్తవారికే అంకితమవాలి గానీ పుట్టింటి వారికి ఎటువంటి సమయంలోనూ అండగా ఉండరాదన్నది ఆవిడ నమ్మకం. తన జీతం మీద, జీవితం మీద ముందు హక్కు తల్లిదండ్రులదే అని రవళి విశ్వాసం. రాజేశ్వరి, రామచంద్రంలు అవసరమయితే పెడతారు గానీ రవళి దగ్గర నుంచి ఏమీ ఆశించరు అని కాంతానికి అర్థమయేసరికి చాలా సంవత్సరాలే గడిచాయి. ఆవిడ డబ్బు దగ్గర చాలా గట్టి. రవళి చేసే ఛారిటీ ఆవిడకి తెలియకుండా మురళి జాగ్రత్త పడేవాడు. అది రవళికి నచ్చేది కాదు. మనం చేసేది మంచి పని అయినపుడు ఇలా దొంగతనంగా చేయడం అనవసరం అని రవళి అభిప్రాయం. ఒకసారి ఈ విషయంలో రవళికి, మురళికి వాదోపవాదాలు జరిగాయి. ఆఖరికి మురళి చెప్పాడు.
“చూడు! ఇది దొంగతనంగా చెయ్యడం కాదు. ముఫ్ఫై ఏళ్ళు నిండని నీకే ఎన్నో దృఢమైన అభిప్రాయాలు ఉన్నాయి. వాటిని మార్చుకోవడానికి నువ్వు ఎలా అయితే ఇష్టపడవో, అరవై ఏళ్ళు ఒకలా జీవించాక ఇప్పుడు మారమంటే ఆవిడ మారలేదు. ముఖ్యంగా మొదట్లోనే అన్నీ చెప్పి ప్రయోజనం లేదు. ఇది ‘చాటుగా చేయడం’ అని నువ్వనుకుంటున్నావు. నేను దీన్నే ‘నొప్పింపక, తా నొవ్వక’ థియరీ అనుకుంటున్నాను. నీకు పని జరగడం కావాలి. ఆవిడ దృష్టిలో నువ్వు వేస్ట్ ఖర్చులు పెట్టకుండా ఉండడం కావాలి. నాకు ఇద్దరూ బాధపడకుండా ఉండడం కావాలి. అందుకే కొన్నాళ్ళు ఇలా సాగనీ. కొన్నాళ్ళకో, కొన్నేళ్ళ తరువాతో తన ఎదురుగా నువ్వనుకునేది చేసే రోజు వస్తుంది. అప్పటివరకూ నేను చెప్పినట్లు వినడానికి ప్రయత్నించు.”
రవళి మూర్ఖురాలు కాదు. మురళి మాటల్లోని లాజిక్ అర్థం చేసుకుంది. తరువాత ఈ విషయంలో ఇద్దరి మధ్యనా గొడవలు రాలేదు. పెళ్ళయిన కొత్తలో తల్లిదండ్రులు ఉన్న వీధిలోనే రవళి వాళ్ళు ఉండేవారు. కష్టానికి, సుఖానికి రాజేశ్వరి, రామచంద్రం గార్లే అయ్యేవారు. పెళ్ళయి మూడేళ్ళయినాక రవళికి ముందు పాప పుట్టింది. ఆ పాపకు వీణ అని పేరు పెట్టుకున్నారు. రవళి స్కూల్‌కి వెళ్ళిపోతే రాజేశ్వరే పాపను చూసేది. తరువాత మళ్ళీ రెండోసారి కూడా పాపే పుట్టింది. ఇద్దరూ ఆడపిల్లలే అని కాంతానికి ఒకటే అసంతృప్తి. అది కోడలి ఎదురుగా ప్రటించడానికి ఏ మాత్రం సంకోచించలేదు. రెండోసారి పాపని హాస్పిటల్‌లో చూడడానికి వచ్చినపుడే “నాకు ఇద్దరూ చక్కగా కొడుకులే. కానీ నీకు ఇటువైపు ఆనవాయితీ రాలేదు. మీ అమ్మ పోలికలాగ ఉంది. రెండు సార్లూ ఆడపిల్లలనే కన్నావు. ఏమిటో” అంది చాలా నిరాశగా.
“ప్లీజ్! చంటిబిడ్డ దగ్గర అలా మాట్లాడకండి. మేమంతా దాన్ని ఎంతో సంతోషంగా ఈ ప్రపంచం లోకి ఆహ్వానించాం. దాని చుట్టూ ఆ వైబ్రేషన్స్‌నే ఉండనివ్వండి” అంది రవళి. రవళికి ఆవిడతో ఆ సమయంలో అంతకంటే వివరంగా జవాబు చెప్పి మూడ్ పాడు చేసుకోవడం ఇష్టం లేక ఊరుకుంది. కానీ ఆ బాధను మురళి దగ్గర ఎక్స్‌ప్రెస్ చేయకుండా ఉండలేకపోయింది.
“భార్యాభర్తల సంగమానికి చరిత్ర సృష్టించడంలో భార్యది పెద్ద పాత్ర. తొమ్మిది నెలలు మోసి బిడ్డను కనడం అనే చారిత్రాత్మక ఘట్టానికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ తోడ్పడాలి. బిడ్డ పుట్టాక సంతోషంతో సంబరాలు చేయాలి. అంతేగానీ కనడం ఆడది చేస్తుంది కాబట్టి బిడ్డ జెండర్ కూడా తన ఇష్టప్రకారమే జరుగుతుందనడం ఎంతవరకూ న్యాయం? దీనికి మగవాడే కారణమని ఈ నిందలు వేసేవారికి ఎవరు చెప్తారు? చెప్పినా ఎవరు వింటారు? ఈ విషయంలో సమాజాన్ని ఎడ్యుకేట్ చేయగలిగితే ఎంత బావుంటుంది మురళీ!” అంది బాధగా.
“నిజం రవళీ! ఈ మాట నీ దగ్గర, మన చిన్నారి దగ్గర అనకూడదని, ముందే నేను అమ్మకి పాప పుట్టడానికి కారణం నేనేనన్న విషయం బోధపరిచాను. అయినా వినకుండా నిన్ను ఇంతలా హర్ట్ చేసింది. అసలు పాప పుట్టాక ఇప్పుడు కాకుండా నువ్వు నెల తప్పిన దగ్గర నుంచీ ఈ మాట చెప్తూ, మళ్ళీ మాట్లాడితే అప్పుడు కూడా కాదు పెళ్ళి అనుకున్న నాటినుంచే తల్లులను ఈ విషయంలో మగపిల్లలు నువ్వన్నట్లు ఎడ్యుకేట్ చెయ్యాలి. కానీ నేను ఈ విషయంలో ఫెయిల్ అయ్యాను. సారీ! రవళీ! ఒక సంఘటన ఏదన్నా మన జీవితంలో జరిగితే, బాధ పెడితే అది ఎలాంటి మలుపుకు నాందీయో భవిష్యత్ చెప్తుంది. మన భావాలు చాలా ముఖ్యం. అమ్మ మాటలు పట్టించుకోకు.” అన్నాడు. రవళి ఉలిక్కి పడింది. తండ్రి మంచం మీద ఉన్నపుడు తల్లి మాట్లాడినట్లుగా ఈరోజు మురళి మాట్లాడాడు. రవళి మనసుకి చందనం పూసినట్లయింది.
ఈ సారి పాపకు శృతి అని పేరు పెట్టుకున్నారు. మొత్తం కుటుంబంలో అందరివీ సంగీతానికి సంబంధించిన పేర్లే అని అందరూ ఉడికించినా పట్టించుకోలేదు. తనకి మురళితో పెళ్ళి భగవన్నిర్ణయం అయితే ఈ పేర్లు తమ ఇష్టాలు అనుకుంది. ఇద్దరూ అమ్మమ్మ, తాతయ్యల పెంపకం లోనే పెరిగారు.
పిల్లలు కాస్త పెద్దయేసరికి అత్తగారిని, మామగారిని మురళీ పల్లెనుంచి తీసుకొచ్చేసాడు. అంతా కలిసే ఉండడం ఆరంభమయింది. అంతకు ముందు ఉన్న ఇల్లు వదిలి వేరే పెద్ద ఇల్లు ఇద్దరి స్కూళ్ళకీ తిరగడానికి దగ్గరయేట్టు తీసుకున్నారు. కానీ రవళి ఎప్పుడు వీలయినా స్కూల్ నుంచి డైరెక్టుగా తల్లిదండ్రులను చూడడానికి వెళ్ళి వచ్చేది. అత్తగారి మాటలు పట్టించుకోకుండా ఉండడం అలవాటు చేసుకుంది. ఆ సమయంలోనే రామచంద్రం గారు హార్ట్ ఎటాక్‌తో పోయారు. ఆ షాక్ లోంచి తేరడానికి రవళికి చాలా టైమ్ పట్టింది. ఒంటరి అయిపోయిన తల్లిని చూసి తన దుఃఖాన్ని దిగమింగుకుంది. తల్లిని తన దగ్గరే ఉంచుకోవాలని చాలా తహతహలాడింది. రవళి బాధ చూడలేక వచ్చిన రాజేశ్వరి నెలరోజులు ఎలాగో ఉంది. తరువాత ఒకరోజు రవళిని పిలిచి.. “అమ్మలూ నేను ఇక మన ఇంటికి వెళ్తాను” అంది.
రవళికి బాధ, కోపం రెండూ వచ్చాయి. “ఒక్కర్తివీ ఎలా ఉంటావమ్మా? ఆ ఇంట్లో? వెళ్ళిపోతానంటున్నావు. అమ్మా! ఇక్కడ నీకేమన్నా ఇబ్బంది అవుతోందా? చెప్తే సరి చేస్తానమ్మా!” అంది.
“ఇబ్బందా! అలాంటిది ఏమీ లేదు. కానీ ఒక కష్టం మీద పడ్డపుడు మనిషి తనంత తను ఎంత త్వరగా దాన్ని ఎదుర్కుంటాడో అంత త్వరగా ఆ కష్టాన్ని దాటుతాడు. లేదా నాకు వచ్చిన కష్టం లాంటిదయితే దాన్ని అనుభవించడానికి అలవాటు పడతాడు. ఎన్ళాళ్ళు, మీ ఇంట్లో నీ చాటున ఉన్నా నా ఒంటరితనం దూరమవదు. ఆ ఇల్లు, నాన్న కట్టినది, దాన్నిండా ఆయన జ్ఞాపకాలే! అవే నాకు శక్తి నిస్తాయి.
అవే బతకడానికి ధైర్యాన్ని ఇస్తాయి. నేను నీ దగ్గర ఉన్నకంటే వారానికో పదిరోజులకో ఒక్కసారి నువ్వు వచ్చి ఒక్కరోజు ఉంటే నాకు బావుంటుంది. నాకేం కావాలన్నా, నాకే కష్టమొచ్చినా నిన్నే పిలుస్తాను. నీ కంటే నాకెవరున్నారు చెప్పు..” కంఠం గద్దదమవగా ఆగిపోయింది.
రవళికి ఆవిడ బాధ అర్థమయింది. తను ఉదయం నుంచి కాలంతో పందెం వేస్తూ పరుగు పెడుతుంది. వచ్చాక కాసేపు నీరసం.. తరువాత మళ్ళీ వంటిల్లే. తల్లితో తను గడపడానికి టైమ్ దొరకడమే లేదు. పడుకునేటపుడు వీలయితే వెళ్ళి ఓ ఐదు నిమిషాలు మాట్లాడుతుంది. ఒకోసారి అదీ అవదు. అంతకంటే తను, పిల్లలు ఒకరోజు వెళ్ళి ఉంటే తల్లికి బావుంటుంది. మెల్లగా తనకు తానే ఆలోచించుకుని రాజేశ్వరిని పంపడానికి ఒప్పుకుంది. కానీ తండ్రి లేని ఆ ఇంట్లో తనని వదిలి వెళ్తుంటే పట్టలేనంత దుఃఖానికి లోనయింది. రాజేశ్వరే మళ్ళీ ఓదార్చింది.
“చూడు! కష్టం పెట్టినపుడే ఆ దేవుడు భరించే శక్తిని ఇస్తాడు లేదా తన దగ్గరకి తీసికెళ్తాడు. అలాగ నాన్న వెళ్ళిపోగానే నన్ను తీసికెళ్తే బావుండేది. కానీ దేవుడికి కూడా నాన్న అంటేనే ఇష్టం.. ఆయన్ని తీసికెళ్ళిపోయి ఆ బాధతో నన్ను బతకమని శాసించాడు. ఈ దైవశాసనాన్ని ధిక్కరించే శక్తి మనకు లేదు. అనుభవించడమే. నువ్వు ధైర్యంగా ఉండు. నేను మెల్లగా తప్పటడుగులు వేస్తూ అయినా నడవడం నేర్చుకుంటాను.” రవళి తల్లిని వదల్లేక వదల్లేక వదిలి వెళ్ళింది. కానీ నెలలో రెండుసార్లన్నా పిల్లతో కలిసి తల్లి దగ్గరకు వెళ్ళేది.
***
రవళికి ప్రమోషన్ వచ్చి హైస్కూలుకి యన్.యస్. టీచర్‌గా వచ్చాక పిల్లల స్వభావాల మార్పుకి అలవాటవడం ఛాలెంజ్ అయింది. ఆ ఊరు చిన్నదే అయినా ఫీడింగ్ విలేజెస్ ఎక్కువ ఉండడంతో స్కూలు ఐదారు వందల మంది పిల్లలతో కళకళలాడిపోతూ ఉండేది. సముద్రపు ఒడ్డు ఊరు. సముద్రం మీద చేపల వేటకి వెళ్ళడం ఎక్కువ మందికి వృత్తి. ఆడపిల్లలు మగపిల్లల కంటే చురుకుగా అన్నింట్లో ముందుకు వచ్చేవారు. అప్పుడే ప్రమోషన్ మీద రావడం! ఎలిమెంటరీ సర్వీసుకి, హైస్కూల్ సర్వీసుకి తేడా తొందరగానే అర్థం చేసుకుంది.
రవళి పని చేసే స్కూల్ మెట్ట మీద స్కూల్! ఆ పేరు చెప్తేనే ఆ ఏరియాలో చాలా మందికి అర్థం అవుతుంది. విజయనగరానికి సుమారు 30 కి.మి. దూరంలో ఉన్న ఆ స్కూల్‌కి వెళ్ళినపుడు మొదట్లో చాలా విసుగనిపించేది. ఊళ్ళకి ఊళ్ళు దాటిపోయేవి. ఊళ్ళ మధ్యన జీడిమామిడి తోటలు, సరుగుడు తోటలు, అరటి తోటలు ఉండేవి. చాలా చిన్న చిన్న పల్లెలు! ఎప్పటికి స్కూల్ కనిపిస్తుందా అనిపించేది. కానీ చాలా ఊళ్ళనుంచి ఒక కి.మీ. దూరమన్నా నడిస్తే కానీ ఆటో దొరకదని తెలిసాక, ఆ స్కూల్ లేకపోతే ఆ ఫీడింగ్ విలేజెస్‌లో పిల్లల, ముఖ్యంగా ఆడపిల్లల చదువు సాగదని తెలిసాక ఆ స్కూల్ పట్ల ప్రేమ కలిగి, పెరిగింది. కానీ తొమ్మిదిన్నర దాటిపోతుండగా కూడా నిద్ర మొహాలతో వీధి గుమ్మాలలో నిలబడి బ్రష్ చేసుకుంటున్నవారిని చూసి ఆశ్చర్యపడేది. పల్లెల్లో సూర్యోదయానికి ముందే లేస్తారు, పనుల్లోకి వెళ్ళిపోతారు లాంటి మాటలు వ్యాసాలు, కథలు, సినిమాల లోనే కాబోలును అనిపించేది. బధ్ధకస్తులకి, పల్లెకి, పట్టణానికి తేడా ఏమిటి అనుకునేది. .
ఆ తరువాత స్కూల్‌లో ఉన్న పాజిటివ్స్ చూడడం ఆరంభించింది. ఆ స్కూల్ జీడి మామిడి తోట మధ్యన ఉండేది. ఎండ అసలు తెలియనంత చల్లగా స్కూల్ ఉండేది. స్కూల్‌కి వెనుక వైపున పెద్ద పెద్ద బండరాళ్ళు ఉండేవి. కాంపౌండ్ వాల్ లేకపోవడం వలన వాటి దగ్గరకి సముద్రం బాగా కనిపించేది. మద్యాహ్నం లాస్ట్ పిరీయడ్ లీజర్ దొరికితే ఆ రాళ్ళ మీద కూచుని అస్తమించబోయే సూర్యుడిని, ఆ సూర్యుడికి ఆ పూటకి వీడ్కోలు పలుకడానికి హొయలు పోతూ పలు రంగులను మార్చుకుంటున్న ఆకాశాన్ని, దాన్ని అలలతో ఎగిసిపడుతూ తాకాలని ప్రయత్నిస్తున్న సముద్రాన్ని చూడడం రవళికి ఇష్టంగా మారింది. అపురూపమైన దృశ్యాలని అంతే అపురూపంగా హృదయంలో దాచుకునేది. నోట్స్ కరెక్షన్ కూడా అక్కడే కూచుని చేసేది. ఆఫీస్ రూమ్‌లో కిటికీ దగ్గర కూచుని సముద్రాన్ని కనుచూపుమేరలో చూస్తూ లంచ్ తినడం అలవాటు చేసుకుంది.
తన సర్వీసులో ఫస్ట్ టెంత్ బ్యాచ్ కావడంతో రవళి చాలా ఉత్సాహంగా అన్నీ గమనిస్తూ తెలుసుకుంది. టెంత్ క్లాస్‌లో ఉమ, రవి సమానమైన తెలివైనవాళ్ళు. క్లాస్‌లో మంచి సందేహాలు అడగడం, ఇచ్చిన వర్క్ చేసుకురావడం, సిన్సియర్‌గా ఉండడమే కాదు అన్ని సబ్జెక్టు లలోనూ, బావుండేవారు. స్టాఫ్ అందరికీ వాళ్ళమీద చాలా హోప్స్ ఉన్నాయి. వాళ్ళే కాక ఇంకా కొంతమంది ప్రోత్సాహాన్నిస్తే బాగా వస్తారనిపించి శాంతి, లత, తను కలిసి వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటే పోటీ పడి చదవడం ప్రారంభించారు.
తమ ఏరియాలో ఉన్న సిన్సియర్, సీనియర్ అయిన టీచర్‌ని కలిసి, పబ్లిక్ కి బ్యాచ్ పంపుతున్నపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తెలుసుకుంది. స్కూల్‌లో ఫిజిక్స్ టీచర్‌తో కలిసి సైన్స్ క్లబ్ ఏర్పాటు చేసింది. నెలలో ఒక్క శనివారం ఆఖరి పీరియడ్‌లో అందరినీ గేదర్ చేసి ‘నిత్య జీవితంలో సైన్స్’ పుస్తకంలో ఉన్న ప్రయోగాలు చేయించేది. రవళి అంటే పిల్లలలో ఒక ఆరాధన ఏర్పడింది. పిల్లలు తప్పుడు మాటలు మాట్లాడకుండా, మంచిగా మాట్లాడేటట్లు ఎంతో ప్రయత్నం చేసింది. చాలామంది పిల్లలలో ఆ మార్పు వచ్చింది కూడా.
ఎయిత్ క్లాస్‌కి రవళి క్లాస్ టీచర్! స్కూల్ పిల్లలందరితో ప్రేమగా, ఆప్యాయంగా ఉన్నా ఎయిత్ క్లాస్ పిల్లలతో ఇంకా ఎక్కువ స్నేహం ఏర్పడింది. అందులో ఆడపిల్లలు మరీ చేరువైపోయారు. ఆ క్లాస్ లోని రమణమ్మ, దీపల గురించి తోటి టీచర్స్ చాలానే చెప్పారు. వాళ్ళ మధ్య ఉన్న శతృత్వం, వాళ్ళ గొడవలు, తెలివితేటలు, క్లాస్‌లో వాళ్ళు వేసే ప్రశ్నలు, అన్నింటి గురించి చాలా చెప్పారు. రవళికి కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.
కానీ కొలీగ్స్ చెప్పిన మాటలతో వాళ్ళ మీద ఒక అభిప్రాయం ముందే ఏర్పరచుకోవడం తనకి నచ్చలేదు. ఫ్రెష్ మైండ్ తోనే క్లాస్‌కి వెళ్ళి వాళ్ళని అబ్జర్వ్ చేసింది. వాళ్ళే క్లాస్‌కి లీడర్స్! రణపెంకి అయిన మగపిల్లలను సైతం దబాయించి సైలెన్స్‌గా ఉంచేవారు. ఫష్ట్ లైన్ లోనే లైన్‌కి ఓ చివర ఒకరు, ఇంకో చివర ఇంకొకరు కూచునేవారు. పాఠం వినడంలో పూర్తి ఏకాగ్రత చూపించేవారు. మధ్య మధ్యలో వేసే ప్రశ్నలకు చాలా చురుగ్గా సమాధానాలు ఇచ్చేవారు.
పాఠం అయినాక అలవాటుగా రవళి ‘ఎనీ డౌట్స్’ అనగానే చాలా చేతులే లేచేవి. వాళ్ళలో వాళ్ళిద్దరి చేతులు కంపల్సరీగా ఉండేవి. సబ్జెక్టు బాగా ఉన్నది కాబట్టి ఎటువంటి తడబాటు లేకుండా వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసేది. పాఠంలో తను బాగా ఎక్స్‌ప్లయిన్ చేసినవే మళ్ళీ డౌట్స్‌గా అడిగితే పాఠం బాగా విన్న తోటి విద్యార్థుల తోనే చెప్పించేది. ఎక్కువగా దీపను, రమణమ్మను వదిలి మిగతా వాళ్ళతోనే చెప్పించేది. కొన్ని రోజులయినాక వాళ్ళు ఇద్దరూ వేరు వేరుగా రవళిని కలిసారు. ఇద్దరిదీ ఒకటే కోరిక, ఒకే రిక్వెష్టు. క్లాస్‌లో వాళ్ళ చేత కూడా మిగతా వాళ్ళ డౌట్స్ కి ఆన్సర్స్ చెప్పించమని.. రవళి నవ్వుకుని సరేనంది.
నెక్స్ట్ క్లాస్‌లో అంతకు ముందు రోజు చెప్పిన పాఠాన్ని సగ భాగం రమణమ్మని, మిగతా సగభాగం దీపని చెప్పమని అడిగింది. ఎవరినీ టెక్స్ట్ బుక్ ముట్టుకోనీయలేదు. ముందు తెల్లబోయినా తరువాత ఇద్దరూ వచ్చి చెప్పారు. రమణమ్మలోని వివరణాత్మక శక్తికి రవళి ఆశ్చర్యపోయింది. దీప కూడా బాగానే చెప్పింది. ఒకటి రెండు తప్పులు, తడబాట్లు వస్తే సరిచేసింది. వాళ్ళంటే ఇష్టం ఇంకా పెరిగిపోయింది.
మొదటిసారి పరీక్షల్లో దీపకి ఫస్ట్, రాము అనే అబ్బాయికి సెకెండు వచ్చింది. రమణమ్మ ఇంతా అంతా తగువాడలేదు. తనకి తగ్గాయని క్లాస్‌లో యాగీ చేసింది. దీప ఆన్సర్స్ ప్రెజెంట్ చేసిన విధానం చాలా బాగుంది. కొట్టివేతలు లేకుండా, ముత్యాల వంటి అక్షరాలతో, నోట్స్‌లో ఉన్నదే తన స్వంత వాక్యాలలో ప్రెజెంట్ చేసింది. ముందు రమణమ్మ మీద చిరాకు కలిగినా తరువాత దగ్గరకు పిలిచి తను చేసిన తప్పులు చెప్పి శాంత పరచింది.. తరువాత ఆ నెక్స్ట్ పీరియడ్ లో అందరినీ ఉద్దేశిస్తూ “ఇక మీదట మీరు ఎదుటి వాళ్ళకి ఎందుకు వచ్చాయి అని తగువాడితే చెప్పను. మీకు ఎందుకు తగ్గాయో అడిగి తెలుసుకోండి. అలాగే ఎదగాలి. ఫస్ట్ వచ్చిన వాళ్ళ పేపర్లో మెరిట్స్ అన్నీ నేనే చెప్తాను. వినాలి. ఇక మీదట ఇదే పధ్ధతి క్లాస్ లో” అని రవళి దృఢంగా చెప్పింది. అంతా నిశ్శబ్దం అయిపోయారు.
రవళికి వాళ్ళలో ప్రత్యేకత అర్థం అయింది. “రమణమ్మ కూత కరణం, దీప రాత కరణం! రమణమ్మ ఏ విషయమైనా ఎటువంటి తడబాటు, భయము లేకుండా విశ్లేషణాత్మకంగా చెప్పగలదు. అంతే ఎఫెక్టివ్‌గా దీప ఏ విషయమైనా వ్రాయగలదు. ఇంకా అలాంటి వాళ్ళు ఈ స్కూల్‌లో ఎవరెవరు ఉన్నారో అందరినీ తెలుసుకోవాలనిపించింది. ఆణిముత్యాలని, వాటి మెరుపునీ తాను చూడాలి, అందరికీ చూపాలి అనిపించింది.
ఆగష్టు పదిహేను వస్తుంటే ఆటలకి సర్క్యులర్ వచ్చింది. హెచ్.ఎమ్. గారి దగ్గరకు వెళ్ళి కల్చరల్ గురించి అడిగింది. ఒక్క పాటలు తప్ప మరేమీ కండక్ట్ చెయ్యడం అలవాటు లేదని చెప్పారు. ఆయనతో రవళి “సర్! కల్చరల్ అంటే వ్యాసరచన, వక్తృత్వం, పద్యపఠనం, చిత్రలేఖనం ఇలాంటివన్నీ మీరు పర్మిషన్ ఇస్తే నేను కండక్ట్ చేస్తాను. చదువు కాకుండా పిల్లలకి వేటిల్లో అభిరుచి ఉందో, ఎవరేమి చేయగలరో మనకీ తెలుస్తుంది. అందులో వాళ్ళని బాగా ఎంకరేజ్ చెయ్యచ్చు.” ఎంతో ఉత్సాహంగా అంది.
“ప్యూర్ వేస్ట్ అండీ! వాళ్ళెవరికీ మేటర్ కలెక్ట్ చేసేంత టైమ్, ఇంట్రెస్ట్ కూడా ఉండదండీ” రవళి ఉత్సాహానికి గాలి తీసేస్తూ అన్నాడాయన.
“టాపిక్ మిగతా టీచర్స్‌తో మాట్లాడి ఫిక్స్ చేసుకుందాం. చాలా సులభమైన విషయాలే ఇద్దాం. వాళ్ళకి చేతకాకపోతే నేనే లైబ్రరీ లోంచి మేటర్ కలెక్ట్ చేసి ఇస్తాను. మీరు నాకు ఇవ్వవలసింది పర్మిషన్ మాత్రమే” అంది.
అతను సాలోచనగా చూసి “అసలు ప్రయత్నం చెయ్యండి. మీరనుకున్నట్లు వాళ్ళు నిజంగా వచ్చారనుకోండి. కండెక్ట్ చెయ్యండి. మరో మాట కూడా. కల్చరల్ కాంపిటీషన్స్‌కి ఫీజు లేదని చెప్పండి. ఆ ప్రైజులకి అమౌంట్ ఏదోలా నేను మీటవుతాను. డబ్బులు కట్టమంటే అసలెవరూ రారు.” అన్నాడు.
“ధాంక్యూ సర్ థాంక్యూ” పట్టలేనంత సంతోషంతో అక్కడినుంచి వెనక్కి వచ్చింది రవళి.
“కొత్త కదండీ! ఏదో చేసెయ్యాలని ఆరాట పడిపోతున్నారావిడ.” ఇంకో టీచర్ ఎవరో అన్నమాటలు వినిపించాయి. కానీ రవళి తిరిగి చూడలేదు.
“పోన్లెండీ. ఏదో చేస్తానంటున్నారు. అదీ చూద్దాం.” హెచ్.ఎమ్. గారి సమాధానం వినిపించింది.
(ఇంకా ఉంది)
రాయప్రోలు సుజాతా ప్రసాద్ విశ్రాంత ఉపాధ్యాయిని. వీరి స్వస్థలం విజయనగరం. ప్రస్తుత నివాసం హైదరాబాద్. శ్రీ చాడ.లక్ష్మణమూర్తి, కళావతి దేవి గార్లు వీరి తల్లితండ్రులు. వీరి భర్త పేరు శ్రీ రాయప్రోలు సత్య ప్రసాద్. అమ్మాయి – మృదుల, వంశీకృష్ణ (అల్లుడు), ప్రహిత, శ్రీదస్తువన్ (మనుమలు); అబ్బాయి సిద్దార్థ, అనూష (కోడలు), విభాకర శ్రీప్రద్, విభాశ్రీ అనఘ. (మనుమలు).
సుజాతగారు ఎమ్.బియడ్., డిప్లొమా ఇన్ మ్యూజిక్ (వీణ) చేశారు. పుస్తకాలు చదవడం, రచనలు చేయడం, పాడడం, వీణ వాయించడం, త్రెడ్ వర్క్ తో ఆభరణాలు తయారు చేయడం వీరి ప్రవృత్తి.
వీరి కలం పేరు ‘సుప్రజ’. కథలు, నవలలు, వ్యాసాలు వ్రాశారు. ‘విధి విన్యాసం’, ‘తల్లిదండ్రులు’ బహుమతి పొందిన నవలలు. ‘గోవు మా లచ్మికి’, ‘యాత్ర’, ‘నాణేనికి రెండో వైపు’, ‘మనమెవరమని?’, ‘సరైన తండ్రి’, ‘చందన గంధి,’ ‘ముడుచుకున్న రెక్కలు’, ‘దేవతలే శపిస్తే’, ‘మార్పు’ మొదలైనవి వివిధ పోటీల్లో బహుమతి పొందిన కథలు.
