Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మథనం-21

[శ్రీమతి రాయప్రోలు సుజాతా ప్రసాద్ గారి ‘మథనం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[రమణమ్మ ‘కేప్ జెమినీ’లో, దీప ‘టి.సి.యస్.’, ‘ఇన్ఫోసిస్’లలో ఉద్యోగాలకు ఎంపికవుతారు. రవళి ఎంతో సంతోషిస్తుంది. అయితే రమణమ్మ ప్రేమలో పడిందంటూ వచ్చిన అజ్ఞాత సందేశం రవళిని కలవరపెట్టినప్పటికీ, రమణమ్మ దృఢమైన వ్యక్తిత్వం వల్ల, శరత్ సమయస్ఫూర్తి వల్ల అది కేవలం ఒక అపార్థమని తేలిపోతుంది. డిగ్రీ పూర్తయి హైదరాబాద్‌లో ఉద్యోగం సాధించిన రమణమ్మ, తనను చిన్నతనంలో బలవంతపు పెళ్లి నుంచి రక్షించి, చదివించి, జీవితాన్ని ఇచ్చిన రవళి మేడమ్‌ను అందరి సమక్షంలో సన్మానించాలని నిశ్చయించుకుంటుంది. అందుకోసం ఉపాధ్యాయ దినోత్సవం నాడు పాత విద్యార్థులు, తన తల్లిదండ్రులను స్కూలుకు పిలిపించి సర్ప్రైజ్ చేస్తుంది. ఆ సభలో రమణమ్మ వేదికపైకి వచ్చి, గతంలో తాను ఎదుర్కొన్న కష్టాలను ప్రస్తావించి, నారాయణ, దీపల సహాయంతో రవళి మేడమ్ వద్దకు చేరిన విధానాన్ని వివరిస్తూ, తనను సొంత బిడ్డలా ఆదరించి ఈ స్థాయికి చేర్చిన రవళి మేడమ్, మురళి సర్, శరత్ అంకుల్‌ల నిస్వార్థమైన కృషిని కొనియాడుతూ భావోద్వేగానికి గురవుతుంది. – ఇక చదవండి.]

దీప మాట్లాడింది. “మేడమ్ గారిని నేను టెంత్ పరీక్షలలోనే ఆఖరిసారి కలిసాను. అమ్మ సంకల్పం వలన నేను చదువుకోగలిగాను. అమ్మ కూరగాయల వ్యాపారం చేసి నన్ను చదివించింది. నా అన్నవాళ్ళు ఇంట్లోంచి పొమ్మనడమే కాదు, ఉన్నచోట ఉండనీయకుండా పొగ పెట్టేందుకు ప్రయత్నించారు. మా వాళ్ళే మమ్మల్ని రౌడీలుగా తరిమిన వేళ అమ్మ మంచితనం వలన ఒక సి.ఐ. గారు మాకు అండ అయారు. ఆ హడావిడి లోనే కోట జంక్షన్‌లో నిలబడ్డ నన్ను రమణమ్మ చూసింది. తన పరిస్థితికి రవళి మేడమ్ అయితేనే పరిష్కారం చూపగలరని వాళ్ళ ఇంటికే వెళ్ళాము. మేడమ్ నా మీద పెట్టుకున్న విశ్వాసం గెలవాలి. నేను అనుకున్నది సాధించాలి. అంతదాకా మేడమ్ గారిని కలవకూడదన్న నిర్ణయంతో నేను ఆవిడకు ఎదురుపడలేదు.”

‘ఈ పిల్ల పట్టుదల ఏమిటి?’ రవళి, మురళి మొహమొహాలు చూసుకున్నారు.

“నా ఇంటర్ అయాక ఇంజనీరింగ్‌లో సీటు వచ్చినా మాకు అక్కడ వైట్ కార్డ్ లేకపోవడం వలన ఫీజ్ కట్టవలసి వచ్చింది. అమ్మ దగ్గర పూర్తి మనీ అడ్జెస్ట్ కాలేదు. అప్పుడు ఎంతో మథన పడి మేడమ్ గారి కొలీగ్, మా నైబర్ అయిన మూర్తి సర్ చేత మేడమ్ గారిని సహాయమడిగించాను. నా ఉనికిని నేను బయటపెట్టలేదు. నేను దీపనని తెలియకపోయినా, ఆడపిల్ల చదువుకుంటుంది, బాగుపడుతుంది అంటే మేడమ్ వెనుతీయరని మరోసారి తెలిసింది. మేడమ్! మీరు నాలుగేళ్ళపాటు మూర్తి సర్ ద్వారా అమౌంట్ డొనేట్ చేసింది ఎవరికో కాదు. మీ దీపకే.. దాంతోనే నేను చదువుకున్నాను. మంచి ఉద్యోగం తెచ్చుకున్నాను. మీకు కృతజ్ఞతలు చెప్పేందుకు నా దగ్గర భాష లేదు మేడమ్! మీరు మా కోసం, మా బాగు కోసం పడిన తపన ఫలించింది! మీ సంకల్పంలో బలమే మాకీ రోజును ఇచ్చింది. ఈ జన్మలో మేము మీ ఋణం తీర్చుకోలేము.” దీప కూడా గొంతు గద్గదమవగా ఆగిపోయింది. రవళి కూచున్న చోట నుంచి లేవలేనట్లు ఉండిపోయింది. ‘గుండె గొంతుకలో కొట్టాడడం’ అంటే అనుభవానికి వచ్చింది. కళ్ళు జలపాతాలుగా మారిపోతున్నాయి.

ఈలోపల నారాయణ వాళ్ళమ్మ గారిని తీసుకొచ్చాడు. “నానేటి మాట్లాడగలను?” అంటూనే ఆవిడ మైకు ముందుకి వచ్చింది. “మా ఇంటాయన, నా పెద్ద కూతురు అల్లుడు, అంతా రెండేళ్ళ తేడాలో సనిపోనారు. అన్నిటికీ అరుస్తూ, తిడుతూ, గోల, గొడవ సేస్తూ ఈడుండేవాడు. సానా ఇసిగి పోయాను. ఊర్లో వాళ్ళ దెప్పులకి ఓ పాలి సద్దామని పయత్నం సేసినా. అంతకు ముందే ఈ యమ్మ ఈ బడికి వచ్చినాది. ఈ యమ్మ మాటలేటి ఆడిందో తెలీదు. ఈడు మారినాడు. సావకూడదని మనకోసం ఏదో మంచి ఉంటాది అని నాకు పెద్ద పెద్ద మాటలు సెప్పినాడు. ఆ తరువాత కొడుకుతో సుకమేటో తెలిసినాది. పన్నెండు సదివినాక ఇక ఇల్లు గడవక ఆటో లోనెట్టి తీసుకున్నాడు. ఎంటనే పెళ్ళి సేత్తానన్నాను. వద్దన్నాడు. ‘నువ్వు సెప్పిన మావ కూతుర్నే సేసుకుంటాను గానీ, అంత సిన్నపుడు కాదు, దానికి పద్దెనిమిదేళ్ళు వస్తే గానీ సేసుకోనన్నాడు’. అది కూడా ఈ యమ్మే సెప్పిందంట. ఈ లోపల దాన్ని ఏదో ఒకటి నేర్సుకోమన్నాడు. నా కన్న కొడుకే నాకు మంచిమాటలు సెప్తుంటే నా అంత అదృష్టమంతురాలు ఎవరు ఉంటారమ్మా! దండాలు తల్లీ! దండాలు!” చెప్పింది ఆవిడ.

తరువాత సరస్వతి వచ్చింది. “చదువుకి మేడమ్ గారు వివేకం, జ్ఞానం, ఆర్థిక స్వాతంత్ర్యం అని మూడు అర్థాలు చెప్పారు. ఇవి ఎలా ఆర్జించాలో కూడా సూచనలు ఇచ్చారు. మేడమ్! మీరు చెప్పినట్లే నేను టైలరింగ్ నేర్చుకున్నాను. ఇందులో బాగానే స్కిల్ సంపాదించాను. ఇప్పుడు నాదగ్గర ఐదు మిషన్లు ఉన్నాయి. నాకు ఆర్థిక స్వాతంత్య్రం, సంసారంలో నిర్ణయాధికారం, అత్తవారింట్లో గౌరవం అన్నీ వచ్చాయి. మీరు అన్నట్లు నా పిల్లల్ని చదివించకుండా నన్నెవరూ ఆపలేరు మేడమ్. ఎలా కృతజ్ఞతలు చెప్పగలను మేడమ్?” ఎటువంటి తడబాటు లేకుండా సరస్వతి చెప్పింది.

రాఘవ వచ్చి”నాలో ఉన్న డ్రాయింగ్ వెయ్యడమనే టేలంట్‌ను గుర్తించి డ్రాయింగ్‌లో పరీక్షలు వ్రాయమని నన్ను మేడమ్ ఎంకరేజ్ చేసారు. తరువాత ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసి ఔట్ సోర్సింగ్ స్టాఫ్ కింద ఇదే మండలంలో వేరే హైస్కూల్‌లో చేస్తున్నాను. నా జీవితాన్ని మేడమ్ మలుపు తిప్పారు” అని చెప్పాడు.

ఊహించని విధంగా మహేశ్వరి వచ్చింది. సభకు నమస్కరించి “మేడమ్ గారు చంటిబిడ్డతో నేను కలిసినపుడు నా అస్తిత్వాన్ని వెతుక్కుని సమాజానికి పనికొచ్చేలాగ ఏదైనా చేయమన్నారు. ఆ మాటలే నా పాలిట మంత్రాలయాయి. నేను డిగ్రీ చదివి, బి.యడ్ చేసాను. ఈసారి డి.యస్.సి.లో జిల్లా ఫస్ట్ వచ్చాను. ఇక పోస్టింగే తరువాయి.” అంది. మహేశ్వరి మాటలు రవళిని మరో లోకంలో విహరింప చేసాయి.

ఆఖర్న శరత్ మాట్లాడాడు. “ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక టీచర్ ఏమి చేయగలదో రవళి చేసి చూపించింది. రమణమ్మ ఒక అద్భుతం! ఐదేళ్ళ క్రితం తన పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటి వరకూ తన లక్ష్యాన్ని సాధించడంలో ఒక్క పొరపాటూ చేయలేదు. తను రకరకాలుగా బ్లౌజ్ డిజైన్స్ కుట్టి ఎంతో కొంత సంపాదించి రవళికి ఇచ్చేది. తన స్వాభిమానం చూసి ముచ్చట వేసేది. నేను మా ఇంట్లో కూడా తన గురించి చెప్తూ ఉంటే మా మేనల్లుడు తనని ప్రేమ లోకి దించుతానని ఛాలెంజ్ చేసాడు. కానీ అక్కడ కూడా మమ్మల్ని మా నమ్మకాన్ని రమణమ్మ గెలిపించింది. తన తల్లిదండ్రుల మంచీ చెడ్డ తనవేనని, ఇది తనని చేసుకోబోయేవాడు అర్థం చేసుకోవాలని చెప్పింది. ఒక ఆశయం కోసం రమణమ్మకి, తన తల్లిదండ్రులకి మధ్య అడ్డుగోడగా ఉన్నందుకు సభాముఖంగా క్షమాపణలు చెప్తున్నాను. ఇప్పుడు దీపని చూసాను. మంగమ్మ గారిని ఎంతైనా అభినందించాలి. ఇటువంటి బిడ్డల్ని కన్నవారు అదృష్టవంతులు.” అని చెప్పాడు. చప్పట్లతో హాల్ అంతా మోగిపోయింది.

తరువాత రవళిని మురళిని వేదిక మీదికి పిలిచారు. మురళి రానంటే రమణమ్మ, దీప ఒప్పుకోలేదు. విద్యార్థులు అందరూ వచ్చి శాలువాలు కప్పి, పూలదండలు వేసి సన్మానించారు. అందరూ కాళ్ళకి దండాలు పెట్టారు. ఇద్దరికీ బట్టలు పెట్టారు. దీప, రమణమ్మ ‘ఆర్’ అక్షరంతో ఉన్న ఉంగరాన్ని రవళి చేతికి తొడిగారు. రవళి ఇద్దర్నీ దగ్గరకు తీసుకుంది. .

రాఘవ రవళి ఫొటోను డ్రా చేసి మంచిగా ఫ్రేమ్ చేయించి ఇచ్చాడు. “మీ బొమ్మ వేయమంటారేమో! నాకు అలాంటివి ఇంట్రెస్టు లేదు” అన్న రాఘవ మాటలు జ్ఞాపకం వచ్చి ఇద్దరి పెదవుల మీద చిరునవ్వు చిందులేసింది.

ఉమ, రవి కలిసి కొన్ని పుస్తకాలు ఇచ్చారు. మహేశ్వరి వచ్చి తను తయారు చేసిన గాజుల స్టేండ్ తీసుకువచ్చి ఇచ్చింది. రవళి మహేశ్వరిని దగ్గరకు తీసుకుని “నా మాట మంత్రం కాదమ్మా! నువ్వే దాన్ని వేదంలా మార్చావు. అదీ నీ గొప్పతనం.” అంది. రవళి ఆ పిల్లల అభిమానానికి మేరు నగ శిఖరమైంది. తనేం చేసిందని? ఇంత పొందుతోంది! తనెంత అదృష్టవంతురాలో!

వీణ, శృతి, రాజేశ్వరి కూడా స్టేజ్ మీదకు వచ్చారు. “ఉయ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ అమ్మా” అంటూ పిల్లలు తల్లికి ముద్దులు పెట్టారు. రవళి వంగి తల్లి కాళ్ళకు దండం పెట్టబోతుంటే ఆవిడ కూతుర్ని దగ్గరకు తీసుకుంది. ఆవిడ కళ్ళలో ఆనందాశృవులు తొణికిసలాడాయి.

“నాన్న ఉండి ఉంటే.. అనిపిస్తోంది. ఆయన నీ సర్వీసుకు చాలా గర్వించేవారమ్మా!” అంది రాజేశ్వరి. అంతా కలిసి ఫొటోలు తీసుకున్నారు.

అక్కడ ఓ బ్రేక్ ఇచ్చి అందరికీ స్నాక్స్ సర్వ్ చేసారు. రమణమ్మ తల్లిదండ్రులను హత్తుకుపోయి కన్నీరుమున్నీరయింది. రాజయ్య, నర్సమ్మలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయారు. రవళి నారాయణని పిలిచి తనకి కావల్సిన వస్తువుల లిస్ట్ చెప్పి తెప్పించమని రిక్వెస్ట్ చేసింది. మార్పును అంగీకరించిన ఈ పెద్దవాళ్ళను సన్మానించాలన్నది రవళి కోరిక. దీప వచ్చి చాలా కబుర్లు చెప్పింది. “మేడమ్! రమణమ్మ ఎక్కడ ప్రేమలో పడుతుందో అని భయపడి పోయాను. తను ఆ రోజు రమేష్‌ని కలుస్తున్నట్లు చెప్పింది గానీ తన నిర్ణయం చెప్పలేదు. ఆ భయంతో నేనే మీకు మెసేజ్ చేసాను. కానీ రమణమ్మ బాగా నిలదొక్కుకుంది” అంది.

“మీరంతా కలిసి నా వెనుక బాగా ప్లాన్ చేసారే. ఎంత అల్లరి పిల్లలు!” అంది రవళి వాళ్ళతో.

“మీకు ఒక్కసారిగా సర్ప్రైజ్ ఇవ్వాలన్న కోరిక మేడమ్! అంతకంటే ఏం లేదు.” అంది రమణమ్మ.

ఆ కార్యక్రమం అయాక రవళి, స్టేజ్ మీదకి రమణమ్మ తల్లిదండ్రులను పిలిచింది. “అమ్మా! తను మా దగ్గరకు వచ్చినపుడు పదిహేనువేల క్యాష్, రెండు తులాల గొలుసు, మంగళ సూత్రాలు ఇచ్చింది. ఆ పెళ్ళి గోల వదిలేసాక ఆ సూత్రాలు చెరిపించి తనకి మెడలోకి సన్న గొలుసు చేయించాను. ఇదిగో ఆ రెండు తులాల గొలుసు. ఆ టైమ్‌లో తను ఇచ్చిన డబ్బు ఫిక్సెడ్ డిపాజిట్ వేసాను. ఇది దాని బాండ్. తను డిజైనింగ్ బ్లౌజులతో సంపాదించిన అమౌంట్ ఎప్పటికప్పుడు బ్యాంకులో వేసాను. ఇదిగో ఆ పాస్ బుక్ ఎ.టి.యమ్. కార్డ్! ఇక ఇదిగో మన బంగారుతల్లి రమణమ్మ! అన్నీ జాగ్రత్తగా కాపాడుకోండి” అంది.

హాల్ అంతా సూది పడితే చప్పుడు వినిపించేంత నిశ్శబ్దమైపోయింది. రమణమ్మ “మేడమ్! ఇది చాలా అన్యాయం” అని ఏదో అనబోయింది. రవళి రమణమ్మను దగ్గరకు తీసుకుని నుదుటి మీద ప్రేమగా ముద్దాడింది. నర్సమ్మ, రాజయ్య, రవళి ఎదురుగా మోకాళ్ళ మీద కూలబడిపోయారు. “మమ్మల్ని సెమించమ్మా! నిన్ను తెలుసుకోలేకపోయాం,” అని కన్నీరు కార్చారు. రవళి కంగారుగా వాళ్ళని లేపింది. అప్పడిక హాల్ చప్పట్లనే అభినందనల వర్షంతో తడిసిపోయింది. రవళి, మురళి, శరత్ కలిసి రమణమ్మ తల్లిదండ్రులని, మంగమ్మని, నారాయణ, హరి వాళ్ళ తల్లులని పిలిచి శాలువాలు కప్పి, పూలదండలు వేసి సన్మానించారు.

ఆ తరువాత రవళి మాట్లాడింది. “సభకు నమస్కారం! ఈ రోజు నాకు కలిగిన సంతోషానికి ఈ గుండె పట్టనంటోంది. నేను చెప్పేది ఒకటే! అందరూ చదువుకోండి. టెంత్ వరకూ ప్రతీ ఒక్కరూ చదవాలి. ఆ తరువాత పరిస్థితులు, తమ తమ అభిరుచి బట్టించి ముందుకుసాగాలి. పుస్తకాల చదువు ఒక్కటే చదువు కాదు. ప్రతీ వారిలోనూ ఏదో ప్రతిభ అంతర్లీనంగా ఉంటుంది. దాన్ని తెలుసుకుని ప్రయత్నిస్తే ఆర్ధికంగా నిలబడడానికి న్యాయమైన మార్గాలు చాలా ఉన్నాయి. వెతకండి. సంపాదన రాగానే పెళ్ళే లక్ష్యం కాదు. ఆర్ధికంగా నిలదొక్కుకోండి. స్థిరపడండి. ఆడపిల్లలు అదృష్టదీపాలు. వాళ్ళకు అవకాశాలు అనే రెక్కలు ఇస్తే ఎంత ఎత్తుకైనా ఎగురుతారు. ఎంతైనా వెలుగుతారు. వెలుగునిస్తారు. ఇది నా నమ్మకం. పట్టణాల ఆడపిల్లలు ఇది ఋజువు చేస్తున్నారు. పల్లెల్లో మాత్రం ఆడపిల్ల పుట్టడమే పెళ్ళి కోసం అనే భావన ఉంది. దాన్ని వదిలిపెట్టండి. మగపిల్లలతో సమానంగా వాళ్ళకీ అవకాశాలు ఇవ్వండి. వాళ్ళ ఇష్టాలను తెలుసుకోండి. ఇప్పుడు ఆన్‌లైన్‌లో నచ్చినది నేర్చుకునే అవకాశం ఉంది. ఆ కళల్లో వాళ్ళని నిష్ణాతులను చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేట్టు చెయ్యండి. ఆర్థిక స్వాతంత్ర్యం కలిగించండి. ఈ రోజు ఈ గ్రామంలో, ఈ పెద్దలలో వచ్చిన మార్పు కొనసాగాలి. కొత్త మలుపుకి నాందీ పలకాలి. ఆడపిల్లకి చిరునామా గెలుపు కావాలి. ఆ గెలుపుల వెలుగులో విశ్వం వెలగాలి, ఆ వెలుగుతో జగమంతా జయించాలి.. ఇదే నా కోరిక.” రవళి నమస్కరించింది. చప్పట్ల హోరులో రమణమ్మ, దీప వచ్చారు. రమణమ్మ “మేడమ్ విత్ యువర్ పర్మిషన్” అని చాక్ పీస్ తీసుకుని బోర్డు మీద

‘గురజాడ వారికి క్షమాపణలతో’ అని వ్రాసి రవళి వైపు తిరిగి నవ్వింది. రవళి ఆశ్చర్యంగా చూసింది.

“అభ్యుదయమే బాట కాగా
ఆడపిల్లలు సాగవలెనోయ్!
జ్ఞాన కాంతుల కీర్తితో
వారి పేర్మార్మ్రోగవలెనోయ్!”

అని వ్రాసింది. దీప, రమణమ్మ రవళి నేర్పిన ‘గురజాడ దేశభక్తి’ గీతం ట్యూన్లో ఆ చరణాన్ని గొంతెత్తి పాడారు. హాల్‌లో ఉన్నవారందరూ లేచి నిలబడ్డారు. అప్పటి, ఇప్పటి విద్యార్థులంతా గొంతు కలిపారు. విద్యార్థులు ఇచ్చిన ఈ అమృత ఘడియల్లో, ఎగిసిన మధురానుభూతికి సాకార రూపమైన రవళి మనసు పరవశంలో తేలిపోతోంది. తనువే మనసుగా మారి పైకెగిసి ఆకాశపు అంచులు తాకుతున్న వేళ రవళి పారవశ్యాన్ని చూస్తున్న మురళి ‘తన విద్యార్థులతో కలిసి రవళి చేసిన ఈ జీవన పోరాటంలో ముందు విషం చిందినా, చివరికి అమృతాన్నిచ్చిన ఈ మథనం ఎంత అద్భుతం!’ అనుకున్నాడు.

(సమాప్తం)

***

ఇతి శుభమ్!

ఇది కరోనాకి ముందు కాలంగా పరిగణింప ప్రార్థన.

“ఆడపిల్లలని చదివించే ప్రతీ గ్రామీణ తల్లిదండ్రులకి.. ఆదరాభిమానాలతో ఈ నవల అంకితం.”

శ్రీమతి రాయప్రోలు సుజాతా ప్రసాద్.

Exit mobile version