[శ్రీమతి రాయప్రోలు సుజాతా ప్రసాద్ గారి ‘మథనం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[ఆగస్టు పదిహేను సందర్భంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడానికి హెచ్.ఎమ్. గారి అనుమతి తీసుకున్న రవళి తన ఆలోచనలని తోటి టీచర్లతో పంచుకుంటుంది. తెలుగు మేడమ్ ఒక్కరే కాస్త సపోర్ట్ చేస్తారు. పిల్లల నుంచి కూడా పెద్దగా స్పందన ఉండదు. రవళి నిరాశపడకుండా, కొంతమంది పిల్లలని గుర్తించి, లంచ్ బ్రేక్‌లో వాళ్ళని పిలిపించి మాట్లాడి పోటీలలో పాల్గొనేందుకు ఒప్పిస్తుంది. పోటీలు సజావుగా సాగుతాయి. రమణమ్మ వక్తృత్వంలోను, దీప వ్యాస రచనలోనూ గెలుస్తారు. వాళ్ళిద్దరూ ఆటల్లోనూ రాణిస్తారు. ఈ సందర్భంగా, వాళ్ళిద్దరి మధ్యా ఉన్న అపోహలని తొలగిస్తుంది రవళి. రమణమ్మ, దీప ఒకరినొకరు ప్రోత్సహించుకునేలా చేస్తుంది. రమణమ్మ తల్లిదండ్రుల గురించి, వాళ్ళ పెంపకం గురించి తెల్సుకుంటుంది. అలాగే దీప అమ్మానాన్నల గురించి కూడా. రమణమ్మకీ, దీపకి స్నేహం పెరిగాకా, దీప తరచూ రమణమ్మ ఇంటికి వెళ్ళేది. ఇంట్లో ఆమెకి లభిస్తున్న ప్రేమ, ఆమెకున్న విలువ – తనకి లేవని బాధపడుతుంది దీప. కానీ దీప తల్లి మంగమ్మ ఆమెను ఓదారుస్తుంది, లేని దాని గురించి బాధపడడం కాదు, ఉన్నవాటిని గురించి సంతోషించాలని చెబుతుంది. రాధ అనే విద్యార్థిని వారం రోజుల నుంచి స్కూలుకు రావడం లేదని గుర్తిస్తుంది రవళి. మర్నాడు బడికొచ్చిన రాధని చూసి విస్తుపోతుంది. ఆమె మెడలో పసుపుతాడు కనబడేసరికి ఆశ్చర్యపోయి, నీకు పెళ్ళయిందా అని అడుగుతుంది. జరిగినదంతా తెలుసుకుని బాధపడుతుంది. ఇంటికి వెళ్ళినా కూడా అన్యమనస్కంగానే ఉంటుంది. భోజనాలు చేస్తున్నప్పుడు, ఏం జరిగిందని మురళి అడిగితే చెప్తుంది. పల్లెల్లో ఇవన్నీ చాలా సాధారణమే! దీనికింత బాధపడిపోవడం ఎందుకంటూ రవళి అత్తగారు చాలా తేలికగా అనేస్తుంది. కొంత చర్చ అయిన తర్వాత, మురళి హెచ్చరికతో అందరూ భోజనాలు ముగించి, ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళతారు. – ఇక చదవండి.]
పెద్దవాళ్ళు లోపలకి వెళ్ళిపోయాక “రవళీ! నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో! నేనూ పిల్లలు కలిసి మిగతా పని చూస్తాం.” అని మురళి బలవంతంగా రవళిని బెడ్రూమ్ లోకి పంపాడు.
పది నిమిషాల తరువాత మంచినీళ్ళ కోసం వంటింటి దగ్గరకు వచ్చిన కాంతం కొడుకు అక్కడ పని చేస్తుంటే “అయ్యో! అదేమిట్రా! రవళి ఏది? పడుకుందా? ఏమిటో! దారిని పోయే దరిద్రం గురించి ఇంట్లో ఈ ఏడుపులు!” అని గొణుక్కుంటూ వచ్చి స్టవ్ తుడిచి, పాలు తోడుపెట్టి వెళ్ళిపోయింది. మురళికి చిరాకు అనిపించినా ఆ టైమ్‌లో తల్లితో వాదించలేదు.
“అదేమిటి నాన్నా? నువ్వు చేస్తున్నావంటే చూడలేక సహాయం చేసింది. మరి అమ్మ కయితే అలా చెయ్యదే?” వీణ అడిగింది.
“కోడలు అంటే, ఆడది అంటే, అలాగే చెయ్యాలన్న భావజాలం మామ్మది. నా మీద ఉన్న సాఫ్ట్ కార్నర్ అమ్మ మీద ఉండదు. సరే! ఇదిప్పుడు తెమిలే టాపిక్ కాదు గానీ వెళ్ళి కాసేపు చదువుకుని పడుకోండి. గుడ్ నైట్!” పిల్లల్ని పంపి బెడ్ రూమ్ లోకి వచ్చి గురజాడ వారి కథానికలు చదువుతున్న రవళిని చూసాడు. రవళి మనసు ఎప్పుడు కలత చెందినా పుస్తకం చదివి శక్తిని పుంజుకోవడం తెలిసిన విషయమే. రవళిని డిస్టర్బ్ చేయకుండా తను కూడా శివ ఖెరా వ్రాసిన ‘యూ కెన్ విన్’ చదవడం ఆరంభించాడు.
ఇద్దరూ చదవడం ముగించి పడుకునే ముందు మురళి రవళిని దగ్గరకు తీసుకుని “నీ మనసులో ఎంత ఘర్షణ పడుతున్నావో తెలుస్తోంది. నీ మనసు ఏమంటోందో పూర్తిగా చెప్పు. వింటాను.” అన్నాడు ఆదరంగా.
“శతాబ్దాలుగా ఆడదాని మీద సంప్రదాయం పేరుతో, శాస్త్రం పేరుతో ఇన్ని ‘అత్యాచారాలు’ ఇంత సహజంగా ఎందుకు జరుగుతూ వస్తున్నాయి? బాల్య వివాహమో, కన్యాశుల్కమో, వరకట్నమో, వైధవ్యమో, పేరేదైనా ఆడ బ్రతుకే ఎందుకు బలి అవుతోంది మురళీ? కనీసం వీటిని అత్యాచారాలుగా కూడా ఏ కొద్దిమంది మహానుభావులో తప్ప సమాజం గుర్తించడమే లేదు. పదిహేనేళ్ళు పైగా ఎలిమెంటరీ లోనే అదీ టౌన్ అవుట్‌స్కర్ట్స్ లోనే నా సర్వీసు అయిపోయింది. అప్పట్లో ఈ సమస్య నాకు ఇంతలాగ తెలియదు. శాంతి మాటల్లో తెలిసింది. సిక్స్త్ క్లాస్‌కి జాయిన్ అయిన అమ్మాయిల్లో సగం మంది కూడా టెంత్ వరకూ రారుట. ఎక్కువ మందికి మధ్య లోనే పెళ్ళిళ్ళు జరుగుతాయట. ‘కాలేజీలో చదివి ఉద్యోగం చేసే అమ్మాయిలు ఐదు శాతం ఉంటారేమో!’ అన్నారావిడ. చదువు, ఉద్యోగం, అభివృద్ది కేవలం అర్బన్ ఏరియాస్‌లో ఉన్న అమ్మాయిలకి తప్ప రూరల్ ఏరియాస్‌లో అమ్మాయిలకి లేవంటే చాలా కష్టంగా ఉంది.” ఊపిరి తీసుకోడానికన్నట్లు ఆగింది. మురళీ తను చెప్పేది పూర్తవనీలే అన్నట్లు వెయిట్ చేసాడు.
“రాధ ఆటల్లో ఛాంపియన్! ‘కో’ ఆడిందంటే గ్రౌండ్ అంతా దొరక్కుండా పరుగెడుతుంది. కబడ్డీలో గుక్క పడితే తిరుగే ఉండదు. లే లేత వయసు, పసితనం చిందులేసే మనసు, అరవిరిసిన సొగసు. ఇప్పుడు కబడ్డీ ఆట కోసం పట్టే ఊపిరి ఇంకో సంవత్సరంలో పురిటి నొప్పులకి పట్టాల్సి రావడం ఎంత విషాదం! ప్రతీ వారు జీవితంలో ఎంతగానో ఎదురుచూసే పెళ్ళి, సంతానం అనే రెండు సస్పెన్స్‌లు రెండేళ్ళలో విడిపోయి ఇంక లైఫ్‌లో థ్రిల్ అనేది లేకుండా మిగతా జీవితం గడపాలి కదూ!” ముందు కోపంగా, రోషంగా ఆరంభమయిన మాటలు ఆఖరాఖరికి వెక్కిళ్ళతో ముగిసిపోయాయి. రవళి కన్నీటితో మురళి భుజం తడిసిపోయింది.
రవళి తలమీద చెయ్యి వేసి నిమురుతూ “రవళీ! సమాజ దృక్పథంలో చాలా మార్పు రావాలి! భోజనాల దగ్గర అమ్మ ఎంత తేలిగ్గా తీసుకుందో చూసావు కదూ! ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే నువ్వు ఒక్కర్తివే కాదు, ప్రతీ వ్యక్తి ముఖ్యంగా సమస్త స్త్రీ జాతి పాజిటివ్‌గా స్పందిస్తే, చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. నువ్వు నీ భావాలతో ఏకీభవించే వారిని కలుపుకో! నీ భావాలు పంచుకో! అంతా ఒక గ్రూప్‌గా ఏర్పడండి. ఈ సమస్యలు వాటి పరిష్కారాల గురించి ఆలోచించండి. ఇంకా చాలా చేయచ్చు. ఇప్పటికే బాగా లేట్ అయింది. పడుకో! రేపు తెల్లవారుజామున లేవాలి కదూ! ఏ సంబంధం లేని ఓ ఆడపిల్ల కోసం కన్నీరు కార్చే ఈ రవళి నా భార్య కావడం నా అదృష్టం కదూ!” అంటూ కన్నీటితో తడిసిన రెప్పల్ని సున్నితంగా పెదవులతో స్పృశించి పడుకోబెట్టాడు.
మరో గదిలో వెంకటరావు భార్యతో కోపంగా, “రవళి అంత బాధ పడుతుంటే సరిగ్గా మాట్లాడకుండా ఆ వితండ వాదన ఏమిటి? అయినా నాకు నీ బాధ తెలుసులే! ఏమీ కాని పిల్లల కోసం కోడలు డబ్బెక్కడ ఖర్చు పెట్టేస్తుందనే కదా నీ అనుమానం. అందుకే అలా మాట్లాడావు.” అన్నాడు.
“అవును! అందుకే! మొదట్లోనే ఖండించకపోతే ‘తొండ ముదిరి ఊసరవెల్లిగా’ అవుతుందని నా భయం. అప్పుడేమీ చేయలేము.” కాంతం దృఢంగా అంది.
“నీ మొహం! తను ఓపెన్‌గా నీతో ఏదీ చెప్పకుండా నువ్వే చేసుకున్నావు కాంతం!” మనసులోనే బాధ పడ్డాడు వెంకటరావు.
ఇక ఆ తరువాత రవళి, ఆమె భావాలతో ఏకీభవించిన వారు అంతా గ్రూప్‌గా ఏర్పడ్డారు.. ప్రతీ నెల జీతంలోంచి కొంత అమౌంట్ తీసి ఒక దగ్గర ఉంచాలని, అవసరాన్ని బట్టి హయ్యర్ ఎడ్యుకేషన్‌కి సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ గ్రూప్‌కి ‘వాత్సల్య’ అన్న పేరు మురళి పెట్టినదే.
***
“మేడమ్! మీకు కల్చరల్ అంటే ఇంట్రస్ట్ ఉంది కదా! మండల స్థాయిలో వ్యాస రచన పోటీ ఉంది. ‘పర్యావరణ పరిరక్షణ’ మీద. మీకు నచ్చిన స్టూడెంట్‌ని ఎవరినైనా పంపుతారా? ఇది ఓన్లీ సీనియర్స్ కే సాధ్యమయినంతవరకూ టెన్త్ని వదిలేయండి.” ఇన్ ఛార్జ్ గా ఉన్న రావు గారు అడిగారు.
“ముందే టెంత్ని వదిలేయండి అంటే ఎలాగండీ? వాళ్ళకి ఈ సంవత్సరం అయిపోతే ఇలాంటి ఛాన్స్‌లు రావు. ఎట్ లీస్ట్ మనకి ఆ సేటిస్‌ఫేక్షన్ ఉండదు. ఇంకా సెప్టెంబరే కదా! ప్లీజ్! వద్దనకండి” రవళి రిక్వెష్టింగ్గా అడిగింది.
“మీ లాజిక్ బావుంది కానీ హెడ్మాష్టర్ గారేమంటారో! మరి.” రావు గారు సంశయంగా అన్నారు.
“మరో పది రోజుల వరకూ ఆయన స్కూల్‌కి రారు కదా! నార్త్ టూర్లో ఉన్నారు. అయినా ఆయన ఏమన్నా అంటే నేను ఆ బాధ్యత తీసుకుంటాను. సరేనా?” రవళి అంది.
“మీరు ఏ విషయాన్నైనా కన్విన్సింగ్‌గా చెప్పే విధానం వలన ఎవరూ దాన్ని కాదనలేరు. సరే! మీకు ఎవరు కావాలో చూసి తీసుకోండి. ఉమ అయితే క్లాస్ టాపర్.” రావు గారు నవ్వారు.
“అవుననుకోండి. వ్యాసరచనకు మంచి దస్తూరీ ఉండాలి. బాగా ప్రెజెంట్ చేయగలగాలి. ముఖ్యంగా అక్షర దోషాలు ఉండకూడదు. నేను చూసి సెలక్ట్ చేస్తాను లెండి.” తనూ నవ్వుతూ చెప్పింది.
తెలుగు మేడమ్ సలహా తీసుకుని అక్షర దోషాలు లేకుండా బాగా వ్రాయగలరన్నవాళ్ళని నలుగురిని పిలిచి డిక్టేషన్ ఇచ్చింది. అక్షరదోషాలలో ఒకరు తేలిపోయారు. మహేశ్వరి, ఉమ, రవి మిగిలారు. ఉమ చాలా చిన్న అక్షరాలు వ్రాస్తుంది. తెలిసిన మేటర్ అయితే కళ్ళు పరుగెడతాయి కానీ, కొత్తది చదవాలంటే టైమ్ పడుతుంది. మహేశ్వరి దస్తూరి పోటీకి పంపేటట్లు లేదు. ఇక రవి మిగిలాడు. రవి నేర్చుకుంటానన్నాడు.
రవిని బాగా ప్రిపేర్ చేసి పంపింది. “మీరు వెళ్తారా రవితో” అని రావు గారడిగారు. తనకి చాలా ఇంపార్టెంట్ క్లాస్‌లు ఉండడంతో వెళ్ళలేనంది. ప్రసాద్ మండల హెడ్ క్వార్టర్ లోనే ఉంటాడు. అది అతని నేటివ్ ప్లేస్. కాబట్టి అతన్ని పంపారు.
తీరా కాంపిటీషన్ కంప్లీట్ అయి రిజల్ట్ వచ్చాక ప్రసాద్ సర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. “మేడమ్! నాలుగు పొజిషన్స్ ఇచ్చారు. మన వాడికి రాలేదు.” అన్నాడు. రవళికి కొంచెం షాకింగ్‌గా అనిపించింది.
“ఎన్ని స్కూల్స్ పార్టిస్పేట్ చేసాయి సర్?” అడిగింది.
“పన్నెండు స్కూల్స్ మేడమ్! ఇక్కడ ఫష్ట్ వచ్చిన వాళ్ళని డిస్ట్రిక్ట్‌కి పంపుతారట. మనకి ఛాన్స్ పోయింది.” అతను ఫోన్ పెట్టేసాడు..
రవళి నమ్మలేకపోయింది. పన్నెండు మందిలో ఏ పొజిషన్ రానంత వీక్‌గా తను ప్రిపేర్ చేసిన మేటర్ ఉందా? ఏదయినా అక్కడ పాలిటిక్స్ జరిగిందా? అనుకుని మళ్ళీ వెంటనే ప్రసాద్‌కి ఫోన్ చేసింది. “సర్! మీకు ఆ స్కూల్లో ఇన్ఫ్లూయన్స్ ఉందా? మీకు బాగా తెలిసిన టీచర్స్ ఉన్నారా?” అడిగింది రవళి.
“తెలుసు మేడమ్! దేనికి?”
“సర్ ఒక్కసారి రవి వ్రాసిన పేపర్, మిగతా పొజిషన్ వచ్చిన ఫోర్ పేపర్స్ చెక్ చేయగలుగుతారా? నిజంగా మన వాడు అంత పాడు చేసాడా? లేకపోతే వాళ్ళవే నిజంగా అంత బావున్నాయా? ఐ నీడ్ దట్ రియాలిటీ. ఒక్కసారి చూసి చెప్పగలరా?” రవళి అడిగింది.
“నిజంగా అలా చూడనా? మీరు ఇచ్చిన మేటర్ మీద మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా?” అడిగాడతను.
“ఉంది సర్! ఇది తెలుసుకోవడం వలన నిజంగా మనది బావులేదంటే మనం ఎంత స్టాండర్డ్స్‌కి ఎదగాలో తెలుస్తుంది. లేకపోతే ఇది వాళ్ళ రాజకీయమే అయితే దాన్ని పైకి ఈడ్చిన వాళ్ళమవుతాం. అందుకే ఒకసారి చూడండి.” రవళి మాటలకి ప్రసాద్ వెంటనే రంగం లోకి దిగాడు. మళ్ళీ అతని ఫోన్ వచ్చేవరకూ రెస్ట్‌లెస్‌గా అనిపించింది. అలా ఉండడం ఇష్టం లేదు. కానీ మనసు అలానే ఉంది. ఒక అరగంట పోయాక ప్రసాద్ దగ్గరనుంచి ఫోన్ వచ్చింది.
“మేడమ్! మీరన్నమాట నిజం. ఇది పూర్తిగా రాజకీయమే. మన వాడి మేటర్ చాలా బావుంది. ఫస్ట్ వచ్చిన వాడి ప్రెజెంటేషన్ మన వాడి ప్రెజెంటేషన్ కంటే ఆకర్షణీయంగా బావుంది. కానీ మేటర్ మనదే బావుంది. మీరు ఏవో శాంతి మంత్రాలు అవీ కూడా వ్రాసారు. ఏం చేద్దాం?” ప్రసాద్ అడిగాడు.
“ఛాలెంజ్ చెయ్యండి సర్! ఫస్ట్ వచ్చిన పేపర్, రవి పేపర్ రెండూ పట్టుకుని విజయనగరంలో అందరికీ తెలిసిన, బాగా పేరున్న మంచి టీచర్ చేత కరెక్షన్ చేయిస్తామని చెప్పండి. కావాలంటే ఆ పేరు ఏదో వాళ్ళనే చెప్పమనండి. అందులో ఎవరి పేపర్‌కి ఆయన ఫష్ట్ ఇస్తే అతనే డిస్ట్రిక్ట్ పోటీకి వెళతాడని చెప్పండి. ఏమంటారో చూడండి.” రవళి కాన్ఫిడెంట్‌గా చెప్పింది.
ప్రసాద్ వెంటనే ఆ స్కూల్ హెడ్మాస్టర్తో మాట్లాడాడు.. ఆ స్కూల్ టీచర్ విజయనగరం లోని ఒక టీచర్ పేరు చెప్పాడు. అతని చేతే కరెక్ట్ చేయించాలని, దాని మీద అతని ఫోన్ నంబరు, సంతకం రెండూ ఉండాలని చెప్పి రెండు పేపర్లు ఇచ్చారు. రెండు పేపర్ల మీద ఉన్న స్టూడెంట్స్ పేర్ల మీద, న్యాయ నిర్ణేతలు ఇచ్చిన మార్కుల మీద వైట్ పేపర్స్ అంటించి పేపర్స్ హేండోవర్ చేసారు.
రవళి ఇదంతా ముందుగానే మురళికి ఫోన్ చేసి చెప్పింది. ఆ మాష్టారి పేరు, ఫోన్ నంబర్ కూడా ఇచ్చింది. మురళి అతను ఉండే ఏరియా గురించి కనుక్కున్నాడు. ఇంటికి వచ్చి కాస్త రిలాక్స్ అయాక మురళి రెండు పేపర్లు తీసి చూసాడు. “మీ స్టూడెంట్ కంటే అతను సైడ్ హెడ్డింగ్స్ అవీ బాగా పెట్టాడు. దస్తూరి కూడా చక్కగా అర్థమవుతోంది. మీ వాడిది అంత క్లియర్‌గా లేదు” అన్నాడు. “దీనికే నేను ఉన్నవాళ్ళలో ఫిల్టర్ చేయాల్సి వచ్చింది. మనం ఎంత చెప్పినా అక్కడ వ్రాసేటప్పుడు మాత్రం వాళ్ళకి తోచినట్లు చేసేస్తారు. అయినా చూద్దాం లే. ఏం జరుగుతుందో!” అంది రవళి.
“అసలు అయినా చిన్న కాంపిటీషన్ గురించి నువ్వు కొంచెం పెద్దగా యాగీ చేసావేమో అనిపిస్తోంది. వదిలేయాల్సింది రవళీ! దీని పరిణామాలు ఎలా ఉంటాయో” అన్నాడు.
“వాళ్ళు ఏదో ఒక పొజిషన్ ఇచ్చి ఉంటే నేనిలా ఆలోచించేదాన్ని కాదేమో! ఫోర్ ప్లేసెస్ లోనూ లేదనేసరికి ఏదో ఆవేశం వచ్చి..” మాట పూర్తి చేయకుండా ఆగిపోయింది.
మురళి తరువాత ఆ మాష్టారికి ఫోన్ చేసి “నమస్కారం మాష్టారూ!” అంటూ జరిగింది క్లుప్తంగా చెప్పి ఆ రెండింటినీ చూసి మీరు ఏది బెస్ట్ అని సర్టిఫై చేస్తే దాన్ని జిల్లా స్థాయికి పంపుతారు. మీకు కొంచెం శ్రమ ఇస్తున్నాం. మాకు ఈ ఫేవర్ చేయగలరా?” అని అడిగాడు.
ఆయన కూడా వెంటనే పాజిటివ్‌గా రెస్పాండ్ అయి ఓ అరగంటలో ఆ పేపర్స్ పట్టుకుని రమ్మన్నారు. మురళి ఆయనను కలవడానికి వెళ్ళి వచ్చేవరకూ రవళి అన్యమనస్కంగానే ఉంది.
మురళి తిరిగి వచ్చాక ఏమీ మాట్లాడలేదు. అతని మౌనం రవళిలో సందేహాలను రేకెత్తించింది. “ఏమయింది మురళీ?” జంకుతూ అడిగింది.
మురళి ఒక్కసారిగా నవ్వేసి రవళికి షేక్ హాండ్ ఇచ్చి, “కంగ్రాట్యులేషన్స్ రవళీ! నువ్వు గెలిచావు. నీ మేటర్ని ఆయన చాలా మెచ్చుకున్నారు. కానీ ఆ అబ్బాయి ఇక మీదట ప్రెజెంట్ చేసిన విధానంలో బాగా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పారు. అయినా ఇలాంటి విషయాలలో మా ఆవిడతో పెట్టుకుని బ్రతకడమే?” అని నవ్వి “రియల్లీ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ” అన్నాడు.
రవళికి ఒక్కసారిగా టెన్షన్ అంతా రిలీజ్ అయి దాని స్థానే ఆనందం తన్నుకొచ్చింది. “థాంక్యూ మురళీ! థాంక్యూ!” అంది సంతోషంగా.
మర్నాడు స్కూల్లో కొంత మంది టీచర్స్ థ్రిల్ అయ్యారు. కొంత మంది మామూలుగానే వ్యతిరేకంగా కామెంట్ చేసారు. రవి జిల్లా స్థాయిలో పాల్గొని కన్సోలేషన్ సాధించాడు. అదొక మర్చిపోలేని అనుభూతిగా రవళి మనసులో ఉండిపోయింది.
***
రవళి అదే తనకు టెంత్ ఫస్ట్ బ్యాచ్ కాబట్టి పాత పది సంవత్సరాల పేపర్లు కలెక్ట్ చేసి తను ముందు ఒక ఐడియా తెచ్చుకుని వాళ్ళని తయారుచేయడం ప్రారంభించింది.
టెంత్‌లో పిల్లలందరి స్థాయి పెంచడానికి రవళి చాలా శ్రమించింది. అక్షర దోషాలు లేకుండా వ్రాసేందుకు వాళ్ళని ప్రిపేర్ చేసింది. ఉమ మీద దృష్టి పెట్టి కాస్త పెద్ద అక్షరాలు వ్రాసేటట్లుగా, మహేశ్వరి దస్తూరి బాగు పడేటట్లుగా చేసింది. మహేశ్వరి మంచి భావుకురాలు. ఏదైనా సున్నితంగా, సృజనాత్మకంగా ఆలోచించి చెప్పడం ఆ అమ్మాయికి సహజంగా ఉంది. ప్రకృతిలో దేని గురించైనా చాలా బాగా వ్రాసేది. తల్లిదండ్రులకి గారాల పట్టి. చక్కగా, ముగ్ధంగా చిరునవ్వుతో ఉండే మహేశ్వరి అంటే రవళికి ఎంతో ఇష్టమయింది. కానీ తనింకా కష్టపడి చదవాలని అనిపించేది. ఆ అమ్మాయి పరిశ్రమ కంటే తెలివితోనే గెలుచుకొచ్చేది.
ఉమకి చదువు మీద ఉన్న శ్రధ్ధ మరి దేనిమీదా లేదు. చాలా సాధారణంగా తయారయి వచ్చేది. శనివారాలంట అమ్మాయిలు తలంట్లతో, సివిల్ డ్రసెస్‌తో సీతాకోకచిలుకల్లా తయారయి వస్తే ఉమ అతి సాధారణంగా వచ్చేది. క్లాస్‌లో చెప్పినదాని కంటే ఎక్కువ మేటర్ టీచర్స్ దగ్గరనుంచి కలెక్ట్ చేసుకోడానికి తాపత్రయపడేది. రవి మంచి ప్లేయర్. ఇంటర్వెల్ పది నిమిషాలు బాగా ఆడేసి ఛార్జ్ అయిపోయే పిల్లల్లో ఒకడు. క్రికెట్ అంటే ప్రాణం అని అంతా చెప్పేవారు. కానీ మార్కులలో ఉమతో పోటీపడేవాడు.
ఉమ స్టాఫ్ రూమ్‌కి వచ్చి టీచర్స్ దగ్గర డౌట్స్ క్లారిఫై చేసుకునేటపుడు, అక్కడే కూచుని చదవాల్సి వచ్చినా ఫేన్ లేని వైపు, ఉక్కపోతగా ఉన్నవైపు కూచుని చదివేది. ఫేన్ గాలి తగిలితే ఆ సుఖానికి నిద్ర వచ్చేస్తుంది అనేది. ఆ అమ్మాయిని చూస్తే “చదువే నా ఆహారం, చదువే నా పానీయం” అన్న ఘంటసాల గారి పాట జ్ఞాపకం వచ్చేది. ఉమ శ్రధ్ధకు ముచ్చటేసేది. వీణకి, శృతికి కూడా ఇంట్లో తన గురించి చెప్పేది.
టెంత్ పరీక్షలు దగ్గరపడ్డాయి. హాల్ టికెట్స్ ఇచ్చేరోజు పిల్లలందరికీ రకరకాలుగా జాగ్రత్తలు, సూచనలు టీచర్స్ చెప్పారు. తమ తమ సబ్జెక్టు పేపర్ ఆన్సర్ చేస్తున్నపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పారు.
రవళి తన పేపరు గురించి చెప్పాక “మన పెద్దలు ప్రకృతిని చూసి కొన్ని న్యాయాలు చెప్పారు. వాటిల్లో మార్జాల మర్కట న్యాయం ఒకటి. పిల్లి తన పిల్లల్ని నోటితో మెడ దగ్గర పట్టుకుని జాగ్రత్తగా ఇల్లిల్లూ తిప్పుతుంది. అక్కడ పిల్లలకి ఎటువంటి రిస్కూ ఉండదు. దీన్ని మార్జాల న్యాయమంటారు. ఇక కోతి చెట్టు చెట్టుకి పిల్లని పట్టుకుని తిరగడం ఎవరన్నా చూసారా?” అడిగింది పిల్లలని. ఐదారుగురు హుషారుగా చేతులెత్తి అరిచారు. అందులో ఒకడిని నిలబెట్టి చెప్పమంది.
“నేను మా తోటలో చూసానండీ. కోతి పిల్ల తల్లి కడుపు గట్టిగా పట్టుకుంటే తల్లి ఒక చెట్టు మీంచి ఇంకో చెట్టు మీదకు దూకుతుంది. ఆ పిల్ల ఎక్కడ పడిపోతుందో అని ఒకటే టెన్షన్ వస్తుంది.” అన్నాడు.
“హైస్కూలులో మీరున్నంత వరకూ ఇక్కడ మార్జాల న్యాయమే మీకు వర్తిస్తుంది. మేమే మీ గురించి శ్రద్ధ వహిస్తాం. కాబట్టి ఈ ఎగ్జామ్స్ అయేవరకూ మా మాట వింటే జాగ్రత్తగా స్కూల్ అనే ఈ ఇల్లు దాటించేస్తాం. కాలేజ్ మెట్లెక్కిన దగ్గర్నుంచి అక్కడ మర్కట న్యాయమే పనిచేస్తుంది. మీరే మీ జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అందుకే పరీక్షలు అయేంత వరకూ మా మాట వినండి.” రవళి మాటలు కొంతమందికి అర్థమయ్యాయి. కొంతమంది పిల్లలకు అర్థం కాలేదు.
“ఇంతే కాదు. స్కూల్ ఫస్ట్‌కి, నా సబ్జెక్టులో ఫస్ట్‌కి కూడా మా నాన్నగారి పేరున వెయ్యేసి రూపాయల స్కాలర్షిప్, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి, మీకు భవిష్యత్తులో ఉపయోగపడే పుస్తకాలు బహుమతిగా ఇస్తాను.” రవళి అనౌన్స్మెంట్కి అంతా చప్పట్లు కొట్టారు.
“మేడమ్! ఇద్దరికి ఫస్ట్ వస్తే ఏం చేస్తారు? ఇద్దరికీ ఆ అమౌంట్ పంచుతారా?” ఒక కొంటె కోణంగి అడిగాడు.
“మీరు పట్టుదలగా తెచ్చుకోండి. అందరికీ వెయ్యేసి రూపాయలు ఇస్తాను. ఆ అమౌంటే పంచను.” రవళి నవ్వుతూ చెప్పింది. మళ్ళీ చప్పట్లు మోగాయి. టెంత్ క్లాస్ పిల్లల లోంచి ఉమ, రవి టీచర్స్‌కి ధన్యవాదాలు చెప్పి మాట్లాడారు. వాళ్ళతో ఆ ఒక్క సంవత్సరమే అనుబంధం రవళికి. అయినా వీళ్ళింక స్కూల్‌కి రారు అనుకుంటే మనసెంతో భారంగా అయిపోయింది రవళికి. ఆ రోజు సాయంత్రం ఆటో కోసం వెయిట్ చేస్తుండగా మహేశ్వరి వచ్చింది. “మేడమ్! ఇది చదవండి.” అంటూ ఒక కవరు ఇచ్చింది. రవళి కుతూహలంగా తీసి చదివింది. “మేడమ్! స్కూలుతో ఐదేళ్ళ బంధం తెగిపోతుందనుకుంటే.. చాలా కష్టంగా ఉంది.. ముఖ్యంగా మీరు వచ్చి సంవత్సరమే అయినా మీరంటే చాలా ఇష్టమయిపోయింది. మీరు ఆశించినంత బాగా నేను చదవలేదు. కానీ ముందు ముందు అలా చదివేందుకు ప్రయత్నిస్తాను. మీరు కోరినట్లుగా ఉద్యోగం చేసి నా కాళ్ళ మీద నేను నిలబడేట్లు ఆశీర్వదించండి.. మహి” ఉత్తరం చదివి తలెత్తి చూసేసరికి మహేశ్వరి లేదు. చిన్న చిర్నవ్వుతో ఆ ఉత్తరాన్ని బ్యాగ్‌లో పెట్టుకుంది రవళి.
(ఇంకా ఉంది)
రాయప్రోలు సుజాతా ప్రసాద్ విశ్రాంత ఉపాధ్యాయిని. వీరి స్వస్థలం విజయనగరం. ప్రస్తుత నివాసం హైదరాబాద్. శ్రీ చాడ.లక్ష్మణమూర్తి, కళావతి దేవి గార్లు వీరి తల్లితండ్రులు. వీరి భర్త పేరు శ్రీ రాయప్రోలు సత్య ప్రసాద్. అమ్మాయి – మృదుల, వంశీకృష్ణ (అల్లుడు), ప్రహిత, శ్రీదస్తువన్ (మనుమలు); అబ్బాయి సిద్దార్థ, అనూష (కోడలు), విభాకర శ్రీప్రద్, విభాశ్రీ అనఘ. (మనుమలు).
సుజాతగారు ఎమ్.బియడ్., డిప్లొమా ఇన్ మ్యూజిక్ (వీణ) చేశారు. పుస్తకాలు చదవడం, రచనలు చేయడం, పాడడం, వీణ వాయించడం, త్రెడ్ వర్క్ తో ఆభరణాలు తయారు చేయడం వీరి ప్రవృత్తి.
వీరి కలం పేరు ‘సుప్రజ’. కథలు, నవలలు, వ్యాసాలు వ్రాశారు. ‘విధి విన్యాసం’, ‘తల్లిదండ్రులు’ బహుమతి పొందిన నవలలు. ‘గోవు మా లచ్మికి’, ‘యాత్ర’, ‘నాణేనికి రెండో వైపు’, ‘మనమెవరమని?’, ‘సరైన తండ్రి’, ‘చందన గంధి,’ ‘ముడుచుకున్న రెక్కలు’, ‘దేవతలే శపిస్తే’, ‘మార్పు’ మొదలైనవి వివిధ పోటీల్లో బహుమతి పొందిన కథలు.
