Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మథనం-8

[శ్రీమతి రాయప్రోలు సుజాతా ప్రసాద్ గారి ‘మథనం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[పిల్లల్ని పోటీలకి విజయనగరం తీసుకెళ్తుంది రవళి. వాళ్ళ స్కూలుకు నాలుగూ ఫస్ట్ ప్రైజులు గెలుస్తారు. సీనియర్స్, జూనియర్స్ రెండు విభాగాల్లోనూ, వ్యాసరచన, వక్తృత్వం రెండింటిలోను నిలుస్తారు పిల్లలు. సీనియర్స్‌లో ఫస్ట్ వచ్చిన రమణమ్మ ఆనందగజపతి ఆడిటోరియంలో ప్రసంగించాలి. రవళి, మురళి ఎంతో ప్రోత్సహిస్తారు. రమణమ్మ ధైర్యం తెచ్చుకుని, చక్కగా మాట్లాడి, అందరి అభినందనలు పొందుతుంది. దీప, రమణమ్మలకు ఫోన్ ద్వారా ఇంటర్‍నెట్ వాడడం నేర్పిస్తుంది రవళి. మందులు పేర్లు వెతికి వ్యాధి లక్షణాలు తెలుసుకోవడం, రచయిత పేరుతో ఆయన రచనల వివరాలు తెలుసుకోవడం వంటివి నేర్పుతుంది. ఓ వారం ఊరెళ్ళి వచ్చేసరికి దీప, రమణమ్మ ఇద్దరూ క్లాసులో కనబడరు. వివరం కనుక్కుంటే, దీప తల్లిదండ్రులకు మధ్య గొడవలు తీవ్రతరమై, ఆమె కూతురితో ఎక్కడికో వెళ్ళిపొయిందనీ; రమణమ్మకి పెళ్ళి కుదిరింది, రెండు రోజుల్లో నిశ్చితార్థమని శాంతి టీచర్ చెప్తుంది. లంచ్ అవర్‍లో ఓ ఉత్తరం రాసి రమణమ్మకి పంపుతుంది రవళి. తల్లిదండ్రులను తీసుకుని స్కూలికి వస్తుంది రమణమ్మ. వాళ్ళకెంతో నచ్చజెప్పాలని ప్రయత్నిస్తుంది రవళి. వాళ్ళు రవళి మాటలని పట్టించుకోరు. ఓ వారం ఉండి వచ్చేస్తానని చెప్తుంది రమణమ్మ అమాయకంగా. రవళి జాలిపడుతుంది. ఎట్టి పరిస్థితిలోనూ పదో తరగతి పరీక్షలు మాత్రం రాయడం మాననని రమణమ్మ వద్ద మాట తీసుకుంటుంది రవళి. ఆమె మనసెంతో బాధకి గురవుతుంది. చివరికి మురళి నచ్చజెప్పి మామూలయ్యేట్టు చేస్తాడు. రమణమ్మ పెళ్ళి ఫోటోలు చూశాకా, ఆ అమ్మాయి గురించి ఆలోచించడం తగ్గిస్తుంది రవళి. – ఇక చదవండి.]

న్నట్లుగానే రమణమ్మ వారం రోజుల్లో మళ్ళీ పుట్టింటికి వచ్చి మేడమ్‌కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాననుకుంది. వాసుతో చాలా బాగుంది అయినా వచ్చేసింది. తరువాత వాసు చెన్నై పని ఉందని వెళ్ళాడు. టెంత్ పరీక్షలు వ్రాయడానికి ఇరు పక్షాల వారు ఒప్పుకోలేదు. రమణమ్మ ఓ రకంగా తల్లిదండ్రులతో యుద్ధం చేసింది. వాళ్ళే వియ్యాలవారిని బతిమాలుకున్నారు. ఆ ఉన్న కాసిన్ని రోజులూ తపస్సు చేసినట్టు చదివింది. వాసుతో ఫోన్ కూడా తక్కువే మాట్లాడేది. వాసు టెంత్ తప్పినవాడు. అతను విసుక్కున్నా పట్టించుకునేది కాదు. రవళి మేడమ్ నమ్మకాన్ని గెలవాలి! ఆవిడ చెప్పినట్లు చదవాలి. మంచి రిజల్ట్ వచ్చాక కలియాలి! ఇదే లక్ష్యంతో చదివింది.

దీపకీ, రమణమ్మకీ ఎగ్జామ్స్ సెంటర్స్ వేరు వేరు. రమణమ్మ విషయం తెల్సిందే కనుక దీప వ్రాస్తున్న సెంటర్‌కి లాస్ట్ డే న వెళ్ళి కలిసింది రవళి. రవళిని చూడగానే పరుగు, పరుగున వచ్చింది దీప.

“ఎలా వ్రాసావు దీపా? నాకు కనపడకుండా, నన్ను కలియకుండానే స్కూలు మానేశావు.” అడిగింది రవళి. దీప కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి.

“మేడమ్! నాన్న ముందు నుంచి సరియైన వాడు కాదు. అమ్మ నాన్నతో సుఖపడింది లేదు. అతనికి మేమంటే ఏ మాత్రం ప్రేమ గానీ ఇష్టం గానీ లేదు. ప్రతీ రోజు తాగేవాడు. గోల చేసేవాడు. అయినా అమ్మ భరించేది. కానీ ఇంకో ఆవిడని తీసుకు వచ్చాడు. దాంతో అమ్మ ఇంట్లోంచి నన్ను తీసుకుని వచ్చేసింది. ఎక్కడుండాలో? ఏం చేయాలో? ఏమీ తెలీదు. అమ్మ వైపు వాళ్ళెవరూ మాకు తోడు లేరు. ఎలాంటి పరిస్థితి లోనూ నా చదువు ఆగకూడదన్నది అమ్మ పట్టుదల. ప్రస్తుతం అమ్మ చిన్నప్పటి స్నేహితురాలింట్లో విజయనగరంలోనే ఉన్నాము. తొందరలో ఏదో నిర్ణయం అవుతుంది.” దీప తలవంచుకుని చెప్పింది.

“అయ్యో! సారీ! తల్లీ! ఎగ్జామ్స్ టైమ్ లో ఎంత టెన్షన్ పడ్డావు? నాతో ఎప్పుడూ టచ్‌లో ఉండమ్మా. ఏ సహాయం కావాలన్నా వీలయినంతవరకూ చేస్తాను. ఇప్పుడు అమౌంట్ ఏమన్నా ఇవ్వనా?” అడిగింది రవళి.

“ఇప్పుడేమీ వద్దు మేడమ్! మీరు ఇచ్చిన ఈ భరోసాని నేనెప్పుడూ మర్చిపోను మేడమ్! మా అమ్మ, కూడా ఎప్పుడూ మిమ్మల్ని తలుస్తూనే ఉంటుంది. మా ప్రయత్నాలన్నీ చేస్తాము. ఏదీ కలిసి రాని నాడు, ఏ దిక్కూ తోచనపుడు మీ దగ్గరికే వస్తాం. నమస్తే మేడమ్!” దీప చెప్పి వెళ్ళిపోయింది. రవళి మనసు మంగమ్మని తలుచుకుని ఉద్విగ్నతకు లోనయింది. ఎంత పట్టుదల! ఎలాంటి పరిస్థితి లోనూ మంగమ్మ దీపను చదివిస్తుంది అని ధైర్యం వచ్చింది.

అనుకున్నట్లుగానే దీప స్కూల్ ఫస్ట్, రమణమ్మ సెకెండ్ వచ్చారు. కానీ ఇద్దరూ ఫోన్ చెయ్యలేదు. ఫోన్‌కి అందలేదు. స్కూల్స్ తెరిచిన రోజు స్టాఫ్ అంతా కలిసి సెలవుల కబుర్లు షేర్ చేసుకున్నారు. ఇంకోవైపు రవి, మహేశ్వరి, ఉమ వచ్చి ఇంటర్ పూర్తయి డిగ్రీలో జాయిన్ అవుతూ టీచర్స్‌కి స్వీట్స్ ఇచ్చారు. ఉమ కాలేజీలో కూడా ఫస్ట్ వచ్చింది. తన ఫొటో పేపర్లోను, కాలేజ్ బ్రోచర్ లో కూడా వచ్చింది. అవన్నీ చూసి చాలా సంతోషించారు.

లంచ్ బ్రేక్‌లో జగదాంబ ఎగతాళిగా “రవళి గారూ! మీ ఫేవరేట్ స్టూడెంట్‌కి పెళ్ళి కాలేదు. వాడెటో వెళ్ళిపోయాడుట. ఈ రమణమ్మకి కడుపొచ్చింది. అది తీయించే ప్రయత్నంలో వాళ్ళ పేరెంట్స్ ఉన్నారనుకుంటాను.” అంది. బలమైన తుఫాను తాకిడికి కకావికలు అయిపోయిన సముద్రపు తీరంలా కళ తప్పిపోయింది రవళి మొహం.

ఇంతేనా? ఈ ఆడపిల్లల బ్రతుకులు! వెతల వ్రణమ్ములా? అశ్రువులే నిండిన కుండలా?’ అనుకుంది.

“పాపం! ఆ పిల్ల మీరు చెప్పినట్లు వినచ్చుకదా! లేదే? ఇక నుంచైనా ఈ సమాజాన్ని మార్చే ప్రయత్నం మానండి” అంది కాస్త ఊరడింపుగా!

రవళి ఇక ఆ పైన వినడానికి ఏమీ మిగలలేదన్నట్లు అక్కడినుంచి లేచి వెళ్ళిపోయింది. కానీ తను చేసేది తప్పు కాదన్న నమ్మకం, ప్రయత్నించకుండా ఉండలేని తన స్వభావం స్పష్టం చేయాలనిపించింది. నాలుగడుగులు వేసిన రవళి వెనక్కు తిరిగి,

ఏ పండు వెన్నెల మత్తు కమ్మిందో,

మామూలు దారుల్నీ మంచి చెడ్డల్నీ విడిచి,

ఆశతో ఆత్మవిశ్వాసంతో ఆత్మ బలంతో,

ఎన్ని అఖాతాలు, ఎన్ని అడ్డంకులూ ఎదురైనా,

ఈ గుండెకి ఎన్ని గాయాలయినా,

ఇంద్ర ధనుస్సుల్ని, అదృశ్య స్వర్గాల్ని అన్వేషిస్తూ ఉంటాను.”

తిలక్ గారి కవితను ఆ పరిస్థితికి అనుకూలంగా చిన్న చిన్న మార్పులతో దృఢ స్వరంతో ఒక్కొక్క లైను రెండేసి సార్లు చెప్పింది. జగదాంబ మొహం వివర్ణమైంది. ఆ రూమ్‌లో అందరూ ఆ భావం లోని గాఢతకు నిశ్శబ్దమయిపోయారు.

రవళి తాపీగా మళ్ళీ టేబుల్ దగ్గరకు వచ్చింది. జగదాంబ ఎదురుగా కూచుని “చూడండి మేడమ్! ఈ విశ్వం లోని సమస్త స్త్రీ జాతి నాకు ఒకే దేహంగా, ఒకే ఆత్మగా అనిపిస్తారు. నిత్యం మానసికంగా, శారీరకంగా ఆ దేహం ఎన్నో చోట్ల హింసించబడుతూ ఉంటుంది. అయినా నేను ఆ హింసను ఆపలేను. లేదా అడ్డుకోలేను. కానీ నేను అందులో ఓ అతి చిన్న భాగాన్ని. నా చుట్టూ ఉన్న ప్రాంతాన్ని నాకు చేతనయినంతగా ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తాను. అందుకే నాకు తెలిసిన ఏ ఆడపిల్ల విజయానికైనా హర్షిస్తాను. ఏ ఆడపిల్ల కష్టానికైనా దుఃఖిస్తాను. మిమ్మల్నీ ఆ దేహంలోని భాగంగా భావిస్తున్నాను కాబట్టే మీ వ్యంగ్యాలను సహిస్తున్నాను. ఒక్కసారి కనులు మూసుకుని మీరు కూడా మనమంతా ఒక్కటే అని భావించండి. అప్పుడే మీ ఆలోచనలు మారుతాయి. ఈ చికాకులు, కోపాలు తగ్గుతాయి. ప్రయత్నం చేయండి. ‘ఆడదానికి ఆడదే శత్రువు’ అనే నానుడిని మన తరమైనా మార్చడానికి ప్రయత్నించాలని నా కోరిక మేడమ్!” రవళి ఎంతో ఆర్తిగా చెప్పింది.

జగదాంబకు రవళి మాటలు డిఫెరెంట్‌గా ఉన్నాయని అనిపించాయి. ఆమెకే కాదు. మిగతా టీచర్స్‌కి కూడా ఆడపిల్లల పట్ల ఆమె స్పందనకి, ఆ తపనకి కారణాలు తెలిసాయి.

తరువాత శాంతిని రమణమ్మ గురించి అడిగింది రవళి. బాధగా నిట్టూర్చింది శాంతి.

“అది చాలా విషాద గాథ మేడమ్! ఇప్పటి వరకూ ఎవరికీ జరగనట్టు రమణమ్మకి జరిగిందంటున్నారు. ఆ అబ్బాయి వాసు దాంతో ఉన్నన్నాళ్ళు చాలా సరదాగా బాగానే ఉన్నాడంట. చెన్నై వెళ్ళాక కూడా ఫోన్‌లు బాగానే చేసాడుట. ఆ తరువాత క్రమేపీ ఆగిపోయాయి. మరి ఆ అబ్బాయి ఆచూకీ లేదు. నా ఉద్దేశ్యం ఆ పిల్లాడి తల్లిదండ్రులకి కూడా ఏదన్నా క్లూ తెలిసే ఉంటుందని. ప్రపంచం కోసం, వియ్యాలవారి కోసం ఈ నాటకం ఆడుతున్నారనిపిస్తోంది. చిన్న వయసు. వెంటనే నెల తప్పింది. ఇక మార్గం లేదన్నట్లు వాళ్ళేవో నాటు మందులు మింగించారు. అబార్షన్ అయితే జరిగింది కానీ, దాని ఆరోగ్యం పోయింది. ఓ రకంగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. కానీ అంత బాధ లోనూ, టెంత్ సర్టిఫికెట్ ఎవరూ లేనపుడు సెలవుల్లో వచ్చి తీసేసుకుంది. మనకెవరికీ మొహం చూపించడం ఇష్టం లేదు అనుకుంటాను” అంది.

రవళి కళ్ళంట జలజలా నీళ్ళు కారాయి., “విజయాల కొత్త చివుళ్ళు వేస్తూ, నిండుగా పూలతో హసిస్తున్న ఒక నాజూకు కొమ్మను, దాని నవ్వుల పూవులు, విజయాల చివుళ్ళు త్రుంచేసి, పెంచిన తోటమాలే మోడుగా మిగిల్చినట్లుంది శాంతీ నాకు.. వెళ్ళి ఓ సారి చూసి రావాలి అనిపిస్తోంది.” రవళి గద్గగికంగా అంది.

“ఆ ఛాన్స్ లేదు మేడమ్ వాళ్ళిక్కడ లేరు. వాళ్ళ అమ్మమ్మ గారింటికి పారాదీప్ తీసుకుని వెళ్ళారుట. అన్నట్లు ఇంకో విషయం. ఎయిత్ క్లాస్ జ్యోతికి మూడు రోజుల్లో పెళ్ళిట. మీరు మళ్ళీ టెన్షన్ పడకండి.” అంది శాంతి.

“శాంతీ! ఈ సారి మనం ఊరుకోవద్దు. కలెక్టరు గారికి రిపోర్టు ఇద్దాం.” ఉత్తేజంగా అంది రవళి.

“హెచ్.ఎమ్.గారు ఒప్పుకోరు మేడమ్! దాని వలన ప్రయోజనం కూడా ఉంటుందనుకోను. కానీ రేపటినుంచి ఆయన ఓ వారం రోజులు డి.ఇ.ఒ. ఒఫీసులో ఆన్ డ్యూటీ మీద ఉంటారు. ఇన్ ఛార్జ్ రావు గారయితే మాట వినచ్చు. కానీ దాని వలన కూడా పెద్దగా ప్రయోజనం ఉంటుందనుకోను. అయినా ప్రయత్నిద్దాం” పని సానుకూలమయ్యే మార్గం చెప్పింది శాంతి.

తరువాత రావు గారిని, ప్రసాద్ గారిని అందరినీ కలిసి మాట్లాడారు. రావు గారు రవళికి భరోసా ఇచ్చారు. “మీరు నిశ్చింతగా ఉండండి మేడమ్! నాకు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో బాగా తెలిసిన వారున్నారు. ఇది మనకి ‘ఛాలెంజ్!’ ఏం చేయాలో వాళ్ళనడిగి చేస్తాను” అన్నాడు.

మర్నాడు రవళి ఒళ్ళు తెలియని జ్వరంతో స్కూలుకి వెళ్ళలేకపోయింది. ఒంటిమీద తెలివి లేదు. ఆ మర్నాడు సాయంత్రం ఫోన్ తీసుకుని చూసింది. “ప్రయత్నం ఫలించి పెళ్ళి ఆగిందన్న” శాంతి మెసేజ్ చూసి పట్టరాని ఆనందంతో పొంగిపోయింది. అందరికి థాంక్స్ చెప్తూ మెసేజ్ పెట్టింది.

మూడు రోజుల తరువాత స్వీట్స్ తీసుకుని స్కూల్‌కి వెళ్ళగానే శాంతికి ఇచ్చి “ఒక్క ఆడపిల్ల అయినా ఇన్నాళ్ళకి రక్షింపబడింది. సంతోషంగా మనం స్వీట్ తినాలి” అంది.

శాంతి ఎంతో ఉదాసీనంగా ఆ స్వీట్‌ను మళ్ళీ బాక్స్‌లో పెట్టేసి “సారీ మేడమ్! మనం గెలవలేదు. ఓడిపోయాం. వాళ్ళు సైలెంట్‌గా బాజాలు, ఫ్లెక్సీలు, మైకులు, పందిళ్ళు, పప్పుకూళ్ళు, ఏమీ లేకుండా నిన్ననే కోవెలలో పెళ్ళి చేసేసారు.” అంది.

చేష్టలుడిగినట్లుండి పోయింది రవళి. మారాల్సినవి తల్లిదండ్రుల మనసులు! అది చట్టాల చేత అవుతుందా?

ఇంత బాధలోనూ రాఘవ ఇంటర్ కంప్లీట్ చెయ్యడం రవళికి చాలా ఆనందాన్ని ఇచ్చింది. రాఘవను తన స్నేహితురాలయిన డ్రాయింగ్ టీచర్ మాధవికి పరిచయం చేసింది. మాధవి గైడెన్స్‌లో తన కళను ఇంకా ఇంప్రూవ్ చేసుకున్నాడు రాఘవ.

***

అనంతమైన దుఃఖంతో, అవమానాగ్నితో కాలిపోతున్న రమణమ్మ పారాదీప్‌లో ప్రతీరోజూ సముద్ర తీరానికి వచ్చేది. రమణమ్మ వద్దన్నా, మాట్లాడకపోయినా తాత కూడా వచ్చేవాడు. రమణమ్మ కోరుకునేది ఏకాంతం! కానీ పడుతూ, లేస్తూ, ఘోషిస్తున్న అలలతో చైతన్యానికి ప్రతీకగా ఉన్న సముద్ర తీరాన్నే మనసు కాస్త శాంతించేది. ఆ ఒడ్డున స్తబ్ధంగా, ఘనీభవించిన అనుభూతికి, కదలిక లేని చూపుకి, మాట రాని మౌనానికి నిర్వచనంలా రమణమ్మ కూచునేది.

రమణమ్మ పరిస్థితి మాటలకందనిది.. కలిసి ఉన్నన్ని రోజులు బాగా ఉండి, తరువాత ఫోన్‌లో గంటలు గంటలు మాట్లాడుతూ ఉండే వాసు సడెన్‌గా ఎందుకు కాంటాక్ట్ వదిలేసాడో రమణమ్మకి ఇప్పటికీ అర్థం కాదు. వాసు వాళ్ళ అమ్మ, నాన్న అయితే పిల్లడి కబురు తెలీడం లేదన్న దుఃఖమే ఎక్కువ ప్రకటించారు. మావగారు చెన్నై వెళ్ళి వెతికి వచ్చాడు. అత్తగారు తిండి మానేసి ఏడ్చి మంచాన పడిందన్నారు. నర్సమ్మ, రాజయ్య రోజూ ఆ గుమ్మానికి మొక్కి వచ్చారు. ఐదారు రోజులు చేసిన కాపురం సందడికి వచ్చి పడిన కడుపు పోవడానికి ఏవో నాటు మందులు మింగించారు. దాంతో రమణమ్మ కడుపు నొప్పితో చాలా బాధపడింది. శరీరమూ, మనసూ రెండూ పచ్చిపుళ్ళయిపోయాయి.

స్నేహితులతోనే కాక, తల్లిదండ్రులతో కూడా పూర్వంలా మాట్లాడడం మానేసింది రమణమ్మ. వాళ్ళ మీద కోపం అలాగే ఉంది. తిండి తిప్పలు మానేసి మంచానికి అంటుకుపోయి ఏడిచే కూతుర్ని, ఆ అరుపుల్నీ, కోపాన్ని భరించడం వాళ్ళకి అలవాటయింది. రమణమ్మకి తన నిశ్చితార్థం, పెళ్ళి, ప్రెగ్నెన్సీ అన్నీ ఇంత నవ్వులపాలవడం భరించలేనట్లు ఉంది. తన క్లాస్‌మేట్స్‌లో అతి కొద్దిమంది కాలేజీలో జాయిన్ అయారు. కొందరికి పెళ్ళిళ్ళయాయి. కొందరు ఇళ్ళల్లో ఖాళీగా ఉన్నారు. కానీ తనలా ఇంత నవ్వులపాలయిన వాళ్ళు, ఇలాగ ఏడుస్తూ గడుపుతున్న వాళ్ళు తనకి తెలిసీ మరెవరూ లేరు.

ఓసారి ఏం చేయలేని చికాకుకి లేచి వెళ్ళి సముద్రంవైపు పరుగెట్టింది. కానీ కూతురినే కనిపెట్టుకుని చూస్తూన్న తల్లిదండ్రులు పరుగున వచ్చి ఆపారు. నర్సమ్మ రమణమ్మను గుండెకు హత్తుకుంది.

“ఊరుకోయే! నువ్వట్టా సేస్తే మేమెలా బతకాలే?” దాదాపు ఏడుస్తూ అన్నాడు రాజయ్య!

“ఏం నాన్నా? కాలికి రాయికట్టి సముద్రంలోకి తోసేస్తానన్నావు! ఏం చేయగలిగావు నాన్నా? వాసు నా మనసుతో, నా శరీరంతో, నా బతుకుతో ఇంత క్రూరంగా ఆడుకున్నాడు. వాడినేమీ చేయలేవు కానీ నన్నైనా తోసెయ్” గొంతుక రాసుకు పోతుందేమో అన్నంత గట్టిగా అరిచింది రమణమ్మ.

“నాను పుట్టి బుద్దెరిగి ఇట్టా ఎప్పుడూ జరగనేదు కూతురా! నా కర్మానికే జరిగింది.” తానూ పొగిలి పొగిలి ఏడ్చాడు రాజయ్య.

“మేమసలు నీ ఇష్టాన్ని కాదన్నదెప్పుడే? నువ్వు పరీక్షలు రాస్తానంటే దానికీ ఆళ్ళని ఒప్పించినాము. ఆళ్ళు ‘సదువంటే అంత పిచ్చేటి? మీ పిల్లకి’ అంటన్నారు. అందుకే ఆడి మనసు ఇరిగిపోయింది అని సాకు కూడా సెప్తున్నారు. ఆ టీచరమ్మే నిన్ను సెడగొట్టేసింది. ఈ సదువు గోల లేకపోతే ఆడసలు నిన్ను వదిలి ఎల్లేవాడు కాడేమో అనిపిస్తది. పెళ్ళాగిపోతేనో, పిల్ల నెల తప్పితేనో అంది. అట్టాగే జరిగింది.” అంది నర్సమ్మ.

ఆ మాటలకి ఒక్క ఉదుటున నర్సమ్మ చేతులు విడిపించుకుంది రమణమ్మ. “ఆవిడ చెప్పిన మాట వినలేదన్న బాధ లేదా నీకు? ఏమీ కానీ నా కోసం, నా భవిష్యత్తు కోసం కన్నీరు కార్చిన మంచి మనిషమ్మా ఆవిడ. నువ్వింకోపాలి మేడమ్ గారిని ఏమన్నా అన్నావంటే నా శవాన్ని చూస్తావు ఖచ్చితంగా” సివంగిలా కలియపడింది రమణమ్మ.

ఆ ఉద్రేకానికి కోపానికి నర్సమ్మ భయపడింది. వెంటనే నర్సమ్మ ‘దీని ఎదురుగా ఆవిడనేమీ అనకూడదు’ అనుకుని సర్దుకుంది.

“అయినా ఇయ్యన్నీ వదిలెయ్! కొన్నాళ్ళు అమ్మమ్మ గారింటికి పారాదీప్ పోయి వద్దాం. దీనికి ఒప్పుకోయే! కాస్త వాతావరణం మారుద్ది” అంది.

రమణమ్మకి కూడా ఈ అవమానం నుంచి దూరంగా పోవాలనిపించి సరేనంది. కానీ పారాదీప్ వచ్చాకే తెలిసింది తనతోనే ఉండే తన మనసు తనని ఏడిపిస్తూనే ఉంటుందని.

“నేను వారం లోపే అత్తవారింటి నుంచి వచ్చేస్తాను” అని తను చెప్పినపుడు జాలితో నిండిన రవళి మేడమ్ నవ్వుకి, తన తల మీద పడ్డ ఆవిడ కన్నీటి బొట్లుకి అర్థం అప్పుడు తెలియలేదు. బతుకు చితికిపోయాక తెలిసింది. వెళ్ళి రవళి మేడమ్‌ని పట్టుకుని ఏడవాలనిపిస్తుంది. ఎంత నచ్చచెప్పారు మేడమ్! ఇప్పుడు పెళ్ళొద్దని. ఇలాంటి రాత ముందుంటే ఆ మాటలు చెవికి ఎక్కవు కదా!

(ఇంకా ఉంది)

Exit mobile version