నా తల రాతలో కాలిపోవాలని రాసే ఉంటే., కాలి పోయే తీరతాను!
ప్రియురాలా.,
నువ్వు నాకు చేసిన వాగ్ధానాన్ని కాను కదా నేను ., నీలా ఇట్టే మారిపోవడానికి.
ఏం చేయగలను ఇంక.,వేరే దారేముంది?
నా తల రాతలో కాలిపోవాలని రాసి ఉంటే., కాలిపోయే తీరుతాను!
నువ్వు., నా కలల్లోకి మన ప్రణయపు విషాద బీభత్స కాంతుల్ని ఒంపినా సరే.,
నాకేమీ కాదులే!
నేనేమీ కొవ్వొత్తిని కాను సుమా., కరిగి కరిగి పోవడానికి!
ప్రేయసీ విను! ఈ వియోగపు రాత్రి వేళ.,
నా హృదయం నొప్పితో వొణుకుతూ.,
నిట్టూర్పుగా మారి నీ లోగిలి విడిచి వెళ్లిపోతానంటున్నది.
సాహిర్., నువ్విక నాకేమీ నచ్చ చెప్పకు
ఏదో ఒక రోజు
ప్రేమలో ఎదురు దెబ్బలు తిన్నాక నాకు నేనే కుదురుకుంటాను
నా కోసం చింతించకు.,
ప్రేయసి దూరం అయితేనేం
ప్రణయంలో గాయాలు నాకు తప్పక పాఠాలు నేర్పిస్తాయి.
మూలం: సాహిర్ లుథియాన్వి
స్వేచ్ఛానువాదం: గీతాంజలి

శ్రీమతి గీతాంజలి (డా. భారతి దేశ్పాండే) వృత్తిరీత్యా సైకోథెరపిస్ట్, మారిటల్ కౌన్సిలర్. కథా, నవలా రచయిత్రి. కవయిత్రి. అనువాదకురాలు. వ్యాస రచయిత్రి. ‘ఆమె అడవిని జయించింది’, ‘పాదముద్రలు’. లక్ష్మి (నవలిక). ‘బచ్చేదాని’ (కథా సంకలనం), ‘పహెచాన్’ (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), ‘పాలమూరు వలస బతుకు చిత్రాలు’ (కథలు), ‘హస్బెండ్ స్టిచ్’ (స్త్రీల విషాద లైంగిక గాథలు) ‘అరణ్య స్వప్నం’ అనే పుస్తకాలు వెలువరించారు. ‘ఈ మోహన్రావున్నాడు చూడండీ..! (కథా సంపుటి)’ త్వరలో రానున్నది. ఫోన్: 8897791964