౧.
సీ. నిశిరేయి గగనాన నెలవంక నావంక కడఁగంట నోమారు కనులు కలుప నతగాని కనుజూపు నయ్యదే మరుతూపు కుముదమ్ము లింకేమి కోరగలవు? శశికాంత నయి నాదు చలువల్ల నొకయింత పెరుగంగ నతగాని ప్రీతియందు మనసార విరిసేటి మదిలోన మురిసేటి పులకింత కలిగించె పొలతియందు
ఆ. ఋతువులందు మేటి రేయి వెన్నెలలకు శారదంపు మెఱుగు చల్ల వెలుగు కిరణజాల మహిమ కినుకలు నిక దీరు మదిని యేలు రేడు మరుని తీరు
౨.
సీ. అలిగేటి సఖినేల నలుకల్ల ముంచేవొ యలికల్ల కనవచ్చునంటెఁ గనవొ కడతేరు దినమందు కలిగేటి సంజెలో కనిపింతువనిఁ జూచు కాంక్షఁ గనవొ యెలదేటి కెరటాల జలకమ్ము లాడుచు నినుఁజూచు కలువమ్మ నిష్ఠఁ గనవొ పరిణద్ధ ప్రణయమ్ము పడతి చెంగలువంపు తలపులో నిలిచేటి దారి గనవొ
ఆ. యుత్పలమ్మునుండు నోరిమిఁ గనుగొని యూరడించుచుండ నొప్పు సుమ్ము. యుగళమందు నెపుడు యొద్దిక గలిగించి యొరులకెల్లఁ దెలుపు యోచనమ్ము.
౩.
సీ. నెలరేని జిగిమేని నిగ్గంత తెలియంగ తెలికారులేతెంచు తీరుగాను జలతారు పరదాలు జగమంత పరచేటి చల్లనౌ వెన్నెల చక్కగాను కల్హార కాంతను కరగించు కాంతుడు క్షాంతిలో నింపిన కాంతిలోను భువియెల్ల ప్రమదమ్ము పొంగుచునిండేను సరిజోడు చేరంగ జంటగాను
ఆ. సాటిలేక జగతి మేటి దైమనునోయి ప్రాపు గలిగినట్టి పడచుయుగళి నాటికైన గాని నేటికైననుగాని రేపు మాపు చింతలెల్లవిడచి.
౪.
సీ. తుల యన్నదే లేని తోషసాగరమందు తేలియాడుదమింక తిరముగాను వెలలేని దౌతీరు విందుఁ గొల్పగ సౌరు వీడకుండగనుండ వేడ్క తోపు తెలికాంతి సామితో వెలది తా చేరంగ రంగేళియే గాని రాయిడేమి? మదినిండు వేళలో మర్మమ్ములే లేక మౌనభాషల తీరు మధురమౌను
ఆ. చలువరాయడొకడు కలువరాణియొకతె నింగి కళయు మరియు నీటి కళయు కౌముదీ కుముదముఁ గాంచి పరవశము నందు వారికెల్ల నమరు సుఖము.
౫.
సీ. కవనమ్ము లందెల్ల కవిఁగూర్చు నుపమల్ల కనవచ్చు మనజంట కనుల పంట చెలువమ్ము లోనుండు జిలుగుల్లఁ జూపంగ కనవచ్చు మన జంట కనుల పంట ఎడమయ్యు తొలగని యీప్సితముఁ గనగ కనవచ్చు మన జంట కనుల పంట పలుమారు విరహాల బాధల్ల గాధల్ల కనవచ్చు మన జంట కనుల పంట
ఆ. ఎల్లవేళలందు నిట్టి తీరుగలిగి చల్లగుండు నాశ సతతముండు కల్లకపటమెఱుగు కళలు తెలియనట్టి యుల్లమొకటె చాలు యొప్పుమనకు.
బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి విమర్శకులు, అనువాదకురాలు. అత్యంత లోతైన రీతిలో విమర్శలు చేయగల అరుదైన విమర్శకులు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™