ఆ విక్రమార్కుడు పట్టువదిలే రకం కాదు! ఎప్పటి లాగానే మౌనంగా ముందుకు నడిచాడు. కొంత దూరం నడిచి నడిచి ఎదురుగా శవమై పడివున్న మనిషి ఆకారాన్ని చూశాడు. ఆ పార్థివ శరీరాన్ని భుజాన కెత్తుకున్నాడు. నాలుగు అడుగులు వేసాడో లేదో చనిపోయిన మనిషిలో అంతర్లీనమై ఉన్న బేతాళుడు చటుక్కున పైకి లేచి నోరు విప్పాడు.
విక్రమార్క రాజుకు ఇదేమి వింతగా లేదు. ఇది అతి సాధారణంగా, మామూలు విషయంగా అనిపిస్తోంది. చుట్టూ పరికించి చూశాడు. ఆ అడవి అంతా నిశ్శబ్దాన్ని సంతరించుకొని ఉంది. గాలి ఈలలు లేవు… పక్షుల కుహు కుహులు లేవు… జంతువుల విన్యాసాలు లేవు. కిమ్మనకుండా మరో ధ్యాస అనేది ఏమీ లేకుండా తన పయనాన్ని సాగిస్తూనే ఉన్నాడు. బేతాళుడికి ఇది చందమామ పత్రికలో కథ కాకపోవడంతో ఏమి అర్థం కావడం లేదు. తర్కించుకుంటున్నాడు. తటపటాయిస్తున్నాడు. చివరికి తానే కొంత చొరవ తీసుకొని నోరు విప్పాడు.
“రాజా నా గురించి నువ్వింత శ్రమ తీసుకుని మనిషిగా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తున్నావ్. నీ రాచరికాన్ని కూడా త్రోసిరాజని నువ్వు ఉన్న ఈ మహత్తరమైన పని యావత్ మానవ లోకానికే ప్రామాణికం కాగలుగుతుంది ఇంతకుమించి నిన్ను ఏ విధంగానూ కొనియాడలేను”.
బేతాళుని మాటలు విన్న విక్రమార్కుడు మనసులోనే నవ్వుకున్నాడు. కాని ఆ ఛాయల్ని పైకి కనబడనీయలేదు. అయితే మనిషిలోని అంతః సంఘర్షణని ఇట్టే గ్రహించగలిగిన బేతాళుడు “రాజా! నువ్వు నా మాటలకు పెదవి విప్పుతావని ఆశించడము లేదు. కేవలం నాకు కొంత సాంత్వనను కల్గిస్తామన్న ఆశతో, నువ్వు గొప్ప రాజువన్న ధ్యాసతో నీకు ఈ కథ చెప్తున్నాను. నువ్వు విని తీరాల్సిందే!” అన్నాడు.
***
టీమ్ ఎంపిక ప్రక్రియలో క్రికెట్ బోర్డ్ చైర్మన్ ఎంపికయిన ఆటగాళ్ళను ఉద్దేశించి ప్రసంగిస్తూ – “నిజానిజాల మాట ఎలా వున్నా మన టీమ్ తమ సామర్థ్యం మేరకు ఆడలేకపోతోంది. వివిధ దేశాలు ఇప్పటికే మ్యాచ్‌ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణాలలో ఇరుక్కుపోయి ఉన్నాయి. ఆ నిందారోపణలు ఈ దేశ ఆటగాళ్ళ మీద కూడా రావడం చాలా దారుణం. మీరు ఎవరూ ఇలాంటి ఊబిలో దిగి ఉంటారని నేను అనుకోవడం లేదు. కానీ కీలక ఆటగాళ్ళు పూర్తి స్థాయిలో, ఏకాగ్రతతో ఆడలేకపోతున్నారు. మనం దేశానికి ఆడుతున్నాం, దేశ ప్రజల మనోభీష్టం మేరకు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించి ఆడి గెలవాలి! అందుకే అవసరమైనంత మేర టీమ్‌లో కొత్త రక్తాన్ని ఎక్కించి పాత కొత్తల మేలు కలయికతో టీమ్‌ను నిర్మించడం జరిగింది” చెప్పాడు. ఆ పెద్దాయన మాటలలోని అంతరార్థాన్ని కళ్యాణ్ గ్రహించకపోలేదు.
వెంటనే వచ్చిన వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌కి తన ఎంపిక జరిగిపోయింది. అంతమంది సీనియర్ ఆటగాళ్ళున్న జట్టులో తాను పసికూన అయినా, పన్నెండు దేశాలు పాల్గొనే టోర్నమెంట్లో ఆడటం నిజంగా తన పూర్వజన్మ సుకృతం.
టోర్నమెంట్ ఘనంగానే ప్రారంభమయింది. లీగ్ స్థాయిలో ఓ మాదిరిగా ఆడి గెల్చిన జట్టు సూపర్ సిక్స్ స్థాయికి వచ్చేసరికి అంచనాలు తారుమారవుతున్నాయి. విజయ్ కళ్యాణ్‌కు ఏమీ అర్థం కాకుండా ఉంది. ఖచ్చితంగా గెలుస్తామన్న మ్యాచ్‌లలో కొన్ని పరాజయాలను ఎదుర్కోక తప్పడంలేదు. ‘ఆట అనేది క్రీడాభిమానుల కోసమే గదు, ఒక రకంగా చెప్పాలంటే దేశ ప్రజల ఉచ్ఛ్వాస’ శివానంద్ గారి ఉద్బోధ తనను అదే పనిగా వెంటాడుతూనే ఉంది.
ఇక ఊహించని విధంగా మీడియా దాడి కూడా తీవ్రతరమయిపోతోంది. కెప్టెన్‌పై విమర్శ, మరో కీలక బ్యాట్స్‌మన్ లంచగొండి అని, ఫిక్సింగ్‌కి పాల్పడి వికెట్లు పారేసుకుంటున్న ప్రముఖ బ్యాట్స్‌మెన్ అని, తీయలేని వికెట్లతో, చేయలేని పరుగులతో చేతులెత్తేయబోతున్న మన క్రికెట్ టీమ్ అని, నామమాత్రపు బౌలింగ్‌తో మ్యాచ్ నామరూపాల్ని మారుస్తున్న ఆటగాళ్ళు అని ఒహటేమిటి – వస్తున్న ఆరోపణలు క్రీడాభిమానులకు మనస్తాపాన్ని కల్గిస్తున్నాయి. తన సీనియర్ ఆటగాళ్ళు అలా చేస్తున్నారంటే విజయ్ కళ్యాణ్‌కు నమ్మకం కుదరడం లేదు.
కానీ జరుగుతున్నదేమిటీ! కావాలని వికెట్లు పారేసుకోవడం, ప్రత్యర్థి జట్టుకు పరుగులు సమర్పించుకోవడం, క్యాచ్‌లు సునాయాసమైనవి అయినా జారవిడుచుకోవడం… అంతా గల్లీ స్థాయి బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్… టీమ్ మ్యానేజ్మెంట్ ఏమీ పట్టించుకోని ఉదాసీనత. ఏమీ అర్థం కావడం లేదు. కానీ టీమ్ కోచ్ కూడా అయిన శివానంద్ గారి మాటలకు తాను మటుకు ప్రభావితమవుతూనే ఉన్నాడు.
ఒక మ్యాచ్‌లో తనకు బ్యాటింగ్‌లో ప్రమోషన్ ఇచ్చి వన్ డౌన్లో పంపితే తాను పించ్ హిట్టర్ పాత్ర పోషించి ఇన్నింగ్స్‌కు జీవం పోశాడు. కానీ నాన్ స్ట్రయికర్‌గా ఉన్న కెప్టెన్ తన చెవిలో… “అన్ని పరుగులు సాధించనవసరం లేదు. ఈ మ్యాచ్ ఓడిపోయినా ఫర్వాలేదు. కానీ తరువాత సిరీస్‌లో స్థానం కోల్పోకుండా ఆడితే చాలు” అని చేసిన హితబోధ తనను కలవరపెడుతూనే ఉంది.
సూపర్ సిక్స్ స్థాయిలో ప్రవేశించాలంటే తప్పకుండా గెలిచి తీరాల్సిన ఆ మ్యాచ్‌లో బౌలర్ల ఆటతీరు మహా దారుణంగా ఉంది. ఎవరికి తోచినట్లు వారు ఉదారంగా ప్రత్యర్థికి పరుగులు సమర్పించుకుంటున్నారు. కాని తాను నిలబడ్డాడు. మ్యాచ్‌ని నిలబెట్టాడు. విజయ్ కళ్యాణ్ విప్పారి, ఉధృతమై ఐదు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. అప్పుడు ఫోన్ చేసి మేఘన ఇచ్చిన ప్రోత్సాహం తాను మరిచిపోలేడు. మేఘన తనలో తను. చెప్పాలంటే తన ప్రాణం.
సెమీ ఫైనల్స్‌లో నిలదొక్కుకుని పరుగులు సాధిస్తున్న తనను నిరోధించడానికి ప్రయత్నాలు బాగానే జరిగాయి. తన పార్ట్నర్ బ్యాట్స్‌మన్ కావాలని తనను రనౌట్ చేయబోతుంటే కళ్యాణ్‌లోని నిజాయితీ పురి విప్పింది. కర్తవ్యం బోధపడింది. తను గెలవాలి! తను మాత్రమే కాదు, తన దేశం గెలిచి తీరాలి!! కుతంత్రాలు, మ్యాచ్ ఫిక్సింగ్‌లు ముంగిట రాజ్యమేలుతుంటే తనకొచ్చిన మెరుపులాంటి ఆలోచన. అంతే తర్వాత ఓవర్లో అతగాడు రనౌట్. అదీ తనవల్ల. కొరకొరా చూస్తూ పెవిలియన్‌కు చేరిపోతున్న అతగాడి వైఖరి కళ్యాణ్ లోని గెలుపు కాంక్షను మరింత గట్టిపరిచింది.
విజయ్ కళ్యాణ్ పరిశ్రమ ఒమ్ము కాలేదు. దేశం ఆటలో గెలిచింది. ఫైనల్స్‌లో తన దేశం ఇప్పుడు ప్రవేశించింది.
“కష్టాల కడలిని దాటించిన కళ్యాణ్” హెడ్‌లైన్స్‌లో మరునాడు పేపర్లోని తన ఫోటోని గర్వంగా చూసుకున్నాడు. నిరంతరం ఉత్తేజాన్ని కలుగజేస్తున్న మేఘనకు మనసులోనే తన ఇన్నింగ్స్ అంకితమిచ్చుకున్నాడు.
ప్రశంసలతో మునిగి తేలుతున్న విజయ్ కళ్యాణ్ ఇప్పుడు కోట్లాది దేశ ప్రజల మనోభీష్టానికి ప్రతీక.
“కళ్యాణ్… ఈ దేశ పతాకం గగన వీధులలో రెపరెపలాడాలి. అది ముఖ్యంగా నీ చేతుల్లో ఉంది. నువ్వు గెలుస్తావు, జట్టును గెలిపిస్తావు… గాడ్ బ్లెస్ యూ” కోట్లాది గొంతుల దీవెనలు అతని కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నాయి.
చివరి పోరాటం. అదే ఫైనల్స్!
వాస్తవంలోకి వచ్చిన విజయ్ కళ్యాణ్ అమ్మ ఇచ్చిన ఆశీర్వాద బలంతో, ప్రియసఖి ప్రియ భాషణతో, ప్రేమస్ఫూర్తితో తనను తాను ఉత్సాహపరుచుకుంటూ సహచరులతో స్టేడియంలోకి ప్రవేశించాడు.
మేఘన ఫోన్…
“విజ్జీ! నీవు నీవుగా ఆడాలి. ఇంతకు ముందు ఏవేవో అంటూ మభ్యపెట్టి నిన్ను నొప్పించి ఉండవచ్చు. కష్టపడకుండా డబ్బు సంపాదించమని, దేశ ప్రతిష్ఠను తాకట్టు పెట్టయినా ఎదగమని నిన్ను ప్రోత్సహించి ఉండొచ్చు. అవన్నీ కేవలం నీ మనసును తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నాలు మాత్రమే. అప్రస్తుతాలను పట్టించుకోవన్న నమ్మకముంది నాకు. నువ్వు గెలుపుకు ఐకాన్‌గా నిలవాలి. ఆల్ ది బెస్ట్!!”
భారత్‌ను టాస్ వరించింది. ఇండియా మొదట బ్యాటింగ్. వన్ డౌన్లో బాగా రాణిస్తూ, మంచి ఫాంతో ఊపు మీదున్న విజయ్ కళ్యాణ్ ఈసారి ఏడవ డౌన్లోకి నెట్టబడ్డాడు. ఉగ్రుడై ఆడవలసిన ఓపెనర్ అచేతనంగా ఆడుతుంటే, సిక్సర్లతో శివమెత్తాల్సిన మరో ఓపెనర్ స్థాయి మరిచిపోతున్నాడు. ఫలితంగా మొదటి పదిహేను ఓవర్స్‌లో టీమ్ స్కోరు ఇరవై ఐదు పరుగులు.
చేసుకున్న చీకటి ఒప్పందాల ప్రకారం భారత్ ఇరవై అయిదు ఓవర్లలో డెబ్బై పరుగులకే ఆరు ప్రధాన వికెట్లు కోల్పోయింది.
పరాజయపుటంచులలో నిలిచిన జట్టు ప్రత్యర్థుల మోములొ దరహాసాన్ని నింపుతోంది. అవుటయిన వారందరూ తమ కర్తవ్యాన్ని సంపూర్ణం చేస్తున్నారు.
ఏడవ వికెట్ పార్ట్నర్షిప్ విజయ్ కళ్యాణ్… అతని కెప్టెన్ కమలాకర్ల మధ్య. డిఫెన్స్ ఆడుతూ పరుగులు చేయకుండా, కళ్యాణ్‌కు బ్యాటింగ్ అవకాశం లేకుండా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంటే, తన కెప్టెన్‌కూ సెమీఫైనల్లో తన సహచరునకు పట్టించిన గతే ఇప్పుడు పట్టించాడు. ఫలితంగా కమలాకర్ రనౌట్ అయిపోయాడు.
అతని నిష్క్రమణ విజయ్ కళ్యాణ్‌లోని బాధ్యతను మరింతగా పెంపొందించింది. ముప్ఫై ఐదు ఓవర్లలో ఇండియా స్థితి ఏడు వికెట్ల నష్టానికి నూట పది పరుగులు. ఎనిమిదవ వికెట్ పార్ట్నర్షిప్ విజయ్ కళ్యాణ్, వినయ్ కార్తీక్ మధ్య. ఇద్దరూ అనుభవశూన్యులే కానీ ఇద్దరిలోనూ టాలెంట్, నిజాయితీ, గెలిచి తీరాలన్న పట్టుదల మెండుగా కానవస్తున్నాయి.
తమ శిబిరంలో తీవ్ర నిరాశ అలుముకొని ఉంది. సహచరుడు కార్తీక్‌కు ధైర్యాన్ని నూరిపోస్తూ, ప్రత్యర్థి ఫాస్ట్ బౌలర్ ఇన్స్వింగర్ని బౌండరీకి తరలించి తన ఉద్దేశాన్ని చాటిచెప్పాడు. మరో ఫాస్ట్ బౌలర్ షార్ట్ పిచ్ బాల్ సిక్సర్‌కి పోతే, మీడియం పేసర్ బాల్స్ బౌండరీ వైపుకు తరలిపోతున్నాయి.
ఇక విజయ్ కళ్యాణ్ వెనక్కి తిరిగి చూడలేదు. అతని బ్యాట్ ముందు ప్రతర్థి బౌలర్లు సంధించే బాల్స్ వెలవెలబోతున్నాయి. ఆఖరి పదిహేను ఓవర్లలో మొండి ధైర్యంతో, చావు బ్రతుకుల మధ్య తెగింపులా పోరాడుతూ, బ్యాటింగ్ ఎక్కువగా తానే తీసుకుని, వికెట్లు కాపాడుకుంటూ, బౌండరీ, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తిస్తున్న విజయ్ కళ్యాణ్ విశ్వరూపం ముందు ఒహరేమిటి ప్రత్యర్థి ఆటగాళ్లందరూ చేతులెత్తేస్తున్నారు. విజయ్ కళ్యాణ్ అన్ బీటెన్… నూటయాభై ఆరు పరుగులు. ఇండియా స్కోరు ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల అరవై తొమ్మిది పరుగులు.
రెండో ఇన్నింగ్స్ ప్రారంభమయింది. ఏ మాత్రం పసలేని బౌలింగ్‌తో పరాజయం పరిసమాప్తమవుతున్నట్లుంది. ఫలితంగా ప్రత్యర్థి స్కోరు పదిహేను ఓవర్లలో నూట పదిహేను పరుగులు.
ఆల్‌రౌండర్ విజయ్ కళ్యాణ్ వంతు బౌలింగ్ వచ్చింది. పొందికగా బౌలింగ్ చేస్తూ తన వంతు కృషి చేస్తూన్నా, ఫీల్డర్ కదలికలు కలవరానికి గురి చేస్తోంది. మొదటి ఓవర్లోని ఇన్‌స్వింగర్‌తో మొదటి బ్యాట్స్‌మన్ అవుట్. తర్వాత ఓవర్లో మరో ఆటగాడు క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. టోర్నమెంట్లో విపరీతంగా రాణిస్తున్న ప్రత్యర్థి ఆల్‌రౌండర్ దాడి చేస్తున్నాడు. కానీ కళ్యాణ్ వేసిన షార్ట్‌పిచ్ బాల్ని సిక్సర్‌కి తరలించే ప్రయత్నంలో హుక్ చేశాడు.
విజయ్ కళ్యాణ్ మరొకరికి అవకాశం ఈయలేదు. డీప్ మిడాఫ్ వరకు మెరుపు వేగంతో పరుగెత్తాడు. గాలి లోని బాల్ గమనాన్ని గమనించుకుంటూ వెళ్ళి దానిని ఒడిసిపట్టేశాడు.
చెప్పాలంటే అది బాల్లా అనిపించలేదు! పన్నెండు దేశాలు హోరాహోరీగా దేనికోసమైతే పోరాడుతున్నాయో ఆ వరల్డ్ కప్ వచ్చి తన చేతిలో పడ్డట్టనిపిస్తోంది. ఆల్‌రౌండర్ అవుటయిన తర్వాత, విజయ్ కళ్యాణ్‌కు లభించింది అరుదైన ‘హ్యాట్రిక్’. అంతే ప్రత్యర్థి జట్టు నూట తొంబై మూడు పరుగులకే ఆల్ అవుట్ అయిపోయింది. దానిలో విజయ్ కళ్యాణ్ సాధించినవి మొత్తం ఏడు వికెట్లు.
వరల్డ్ కప్ విజేత… భారత్.
సూత్రధారి… విజయ్ కళ్యాణ్.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్… విజయ్ కళ్యాణ్.
మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్… విజయ్ కళ్యాణ్.
కోట్లాది భారతీయుల ప్రశంసల వర్షం తనకు అలవిగాని సంతృప్తినిస్తోంది! అలానే తన ప్రియతమ నేస్తం ‘మేఘన’ అభినందన జల్లులు తనను ఆనందంలో ముంచెత్తుతున్నాయి.
విజయగర్వంతో స్వదేశానికి వచ్చిన భారత ఆటగాళ్ళని దేశ ప్రధాని మొదలు అందరూ అభినందించారు. తర్వాత ఛైర్మన్ కమ్ కోచ్… ప్రస్తావిస్తూ… “విజేతలకు అభినందనలు! మీరందరు పట్టుదలతో సమిష్టిగా పోరాడి ఆడి సాధించిన ఈ విజయం మరువలేనిది. మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్‌లతో అతలాకుతలమవుతున్న ప్రస్తుత తరుణంలో ఎవరు ఏమిటో తెల్సుకోవడం కష్టసాధ్యమే అయినా అందర్నీ బేరీజు వేసుకుని ‘ఇన్నర్ టాలెంట్స్’ని ప్రోత్సహించి గెలుపు దిశగా అడుగులు వేయడం జరిగింది.
ఈ వ్యవహారంలో తలదూర్చి, చాకచక్యంగా ఆటగాళ్లందరితో సన్నిహితంగా ఉంటూ, ఎవరు ఏమిటో తెలుసుకొని, వారిని అంచనా వేసి ఆటగాళ్ళ సమాచారాన్ని ఎప్పుటికప్పుడు అందించి, మరో వైపు ప్రతిభను, నిజాయితీని, గెలుపుపై ఉన్న మజాని తేటతెల్లం జేస్తూ, జట్టుకు తగిన మనోబలం తానయిన సిబిఐ డిపార్ట్మెంట్ జూనియర్ కుమారి మేఘనకు ప్రత్యేక అభినందనలు. ఆమెకు క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఎంతగానో ఋణపడి ఉన్నదని నా అభిప్రాయము.
ఇక విజయ్ కళ్యాణ్ వంటి ఆటగాళ్ళు దేశానికి చాలా అవసరం. భవిష్యత్తులో అతనిలాంటి నిజాయితీ నిండిన ప్రతిభావంతులతో జట్టుని నిర్మింపవలసి ఉంటుంది..” అన్నాడు.
భారతమాత మెడలో విజయమాల వేసిన విజయ్ కళ్యాణ్, మేఘన మెడలో వరమాల వేసినట్లు ఇద్దరిలోనూ అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతోంది.
కథ వింటున్న విక్రమార్కుడి నడక ఒక్కసారిగా మందగించింది. గొప్ప అనుభూతికి లోనవసాగాడు.
“రాజా! నాకు ఒక ధర్మ సందేహం ఉన్నది. నీవు విజ్ఞతతో ఆలోచించి తీర్చగలవన్న నమ్మకంతోనే నిన్ను అడుగుతున్నాను.
మనిషికైనా, జీవితానికయినా ప్రతి చోటా ‘స్ఫూర్తి’ అనేది ఉండాలంటాను. అది క్రీడాస్ఫూర్తిలాగ విరాజిల్లితే మరీ మంచిది అని నా భావన. ఈ కథలో విజయ్ కళ్యాణ్ అనే ఆటగాడిని పరిశీలిస్తే, మంచి చొరవ గలవాడు. దీక్ష, దక్షతను ప్రోది చేసుకోగల్గినవాడు. చెప్పాలంటే, ఈ తరానికి ప్రతినిధిగా ప్రతికూలతలకు ఎదురొడ్డి తాను నడిచి, జట్టును నడపాలన్న మంచి ఆలోచన కల్గినవాడు.
కానీ మనుషుల మధ్య వైరుధ్యాలను ఇక్కడ ప్రస్తావింపదల్చుకున్నాను. కేవలం తను, తన ఎదుగుదలలే ధ్యేయంగా కుటిల దుర్నీతితో ఆటను సయితం అభాసుపాలు చేస్తున్న లోకాన్ని ఇప్పుడు గమనిస్తున్నాము. అటువంటి వల్లమాలిన వ్యవస్థను మీదైన ధోరణి ప్రస్తావించి నా సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. అలా చేయకపోయావో నీ తల వేయి చెక్కలయిపోగలదు” అన్నాడు బేతాళుడు.
బేతాళుని బెదిరింపులకు విక్రమార్కుడు నోరు విప్పక తప్పలేదు.
“ఈ వల్లమాలిన ప్రపంచంలో ఏ వ్యవస్థను చూసినా ఏమున్నది గర్వకారణం! కుట్రలు, కుతంత్రాల రచనలు సర్వాంతరం… ఆనక సార్వజనీనమూనూ!!
ఇటువంటి చీకటి ఒప్పందాలు, దిక్కుమాలిన ధోరణులు ఆటలలో సయితం బలంగా వేళ్ళూనుకుపోవడం చాలా దారుణం.
అందుకే క్రీడాస్ఫూర్తి కొరవడిపోయి వ్యాపారంగా మారిపోతోంది.
ఇక్కడ శివానంద్‌ను ముందుగా ప్రస్తావించవలసి ఉంటుంది. వరల్డ్ కప్ టీమ్ ఎంపిక జరిగిపోయి, టోర్నమెంట్ ప్రారంభమవుతున్న వేళ ఈ మ్యాచ్ ఫిక్సింగ్‌లు ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసి శివానంద్ లాంటి బాధ్యత కల్గిన వారి చేతులు జారిపోయి ఉండొచ్చు. చేతులు జారిపోతున్నాయని వెరసి చేతులెత్తేయడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. సరిగ్గా అక్కడే శివానంద్ టీమ్‌కి కోచ్‌గా గొప్ప నిర్ణయాలు తీసుకున్నాడు. అదే అవినీతిపరుల బారి నుండి విజయ్కళ్యాణ్ వంటివారిని మానసికంగా ప్రక్కకు జరిగేలా చేయగల్గడం.
అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని కొందరి మీద చర్య తీసుకుంటే ఆ సమయంలో టీమ్‌గా ఆడాల్సిన వారు నిరుత్సాహపడి, మానసికంగా కుదేలయి ఏకాగ్రతను కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్రీడాస్ఫూర్తి దెబ్బతినకుండా చాలా గొప్పగా ప్రవర్తించాడాయన! అప్పుడు శివానంద్ యావత్ దృష్టీ విజయ్ కళ్యాణ్ మీద పడడంతో అతగాడి మీద విపరీతమైన ఆశలు పెట్టుకున్నాడు.
ఇక్కడ మరో సున్నితమైన అంశం మేఘన. విజయ్ కళ్యాణ్ ఆమెతో ప్రేమలో పడ్డాడు. చెప్పాలంటే మేఘనను వలచాడు. ఆమె మాట కొసం ఎంతటి ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నించే నైజం అతనిది. అందుకే మేఘన ఒక బాధ్యత కలిగిన ఉద్యోగంలో ఉన్నా, కళ్యాణ్ అంటూ ప్రియురాలి మాటలతో అతనిలో స్ఫూర్తిని నింపగలిగింది.
ఈ మొత్తం అంశాలన్నింటిని సమన్వయం చేసి చెప్పాలంటే మనిషిలోని లోలోపలి దురాలోచనలు, కుట్రలు, కుతంత్రలను భగ్నం చేయాలంటే ఆ మనిషి నైజానికి ఒక ప్రేమైక మానవీయ స్పర్శ అత్యంత అనివార్యం కాగల్గుతుంది. అదే ప్రతిభ తానవుతూ వ్యవస్థను నిలబెట్టేలా చేస్తుంది. అంటే విజయ్ కళ్యాణ్ వెనుక మేఘన, శివానంద్ మంచి ఫలితాల కోసం పునరంకితమయ్యే మెరుపు మేఘాలు!” అన్నాడు.
ఇలా రాజుకి మౌనభంగం కాగానే ఎప్పటిలాగానే కథను కంచికి పంపేసి తాను మటుకు అదృశ్య దృశ్యమై చెట్టు చెంతకు చేరిపోయాడు బేతాళుడు!
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
ప్రేమ శక్తిని చూపిన ‘సప్త సాగరదాచె ఎల్లో – సైడ్ A’
‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఆఫ్టర్
పూచే పూల లోన-24
కొరియానం – A Journey Through Korean Cinema-50
రుద్రభూమి
నీలో.. నేనై..!!
కొడిగట్టిన దీపాలు-17
కశ్మీర రాజతరంగిణి-46
యువభారతి వారి ‘అమృత భారతి’ – పరిచయం
మహాభారత కథలు-58: దిక్పాలకుల సభల్ని వర్ణించిన నారద మహర్షి
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®