196
లోతైన చీకటి జీవితంలో
ముడుచుకుపోయిన పదాలు
ఏకాంత జ్ఞాపకాల వలలు
197
పగటి సేవలో దాని శక్తిని
రాత్రి ఏకీభావంలో శాంతిని
నా ప్రేమ తెలుసుకోనీ
198
జీవితం, అనామక కాంతికి
దాని నిశ్శబ్ద స్తుతి కీర్తన
గడ్డిపోచల్లో పంపుతుంది
199
రాత్రి నక్షత్రాలు నాకు
పగలు వాడిపోయిన నా పూల స్మారకాలు
200
ఆపుతే అయుక్త నష్టం అవుతుంది గనక
పోవాల్సిన వాటికి నీ తలుపు తెరు
201
నిజమైన అంతం పరిమితిని చేరుకోటం కాదు
మితిలేని దానిని పూర్తిచేయటం
202
తీరం సముద్రంతో గుసగుసలాడుతుంది
అలలు చెప్పటానికి ప్రయాస పడేది తనకు రాయమని
సముద్రం నురగతో మళ్లీ మళ్లీ రాస్తూ
తీవ్రమైన నిరాశతో వాటిని చెరిపేస్తుంది
203
నా జీవతంత్రుల్ని నీ వేలు స్పర్శ పులకరింపజేసి
సంగీతాన్ని నీదీ నాదీ చేయనీ
204
నా జీవితంలోని లోపలి ప్రపంచం
ఆనంద విషాదాల్లో బటువై పరిపక్వమయి పండులా
ఇంకాస్త సృష్టి క్రమం కోసం
అసలు చీకటి నేలలోనే రాలుతుంది
205
పదార్థంలో రూపం, శక్తిలో లయ
వ్యక్తిలో అర్థం ఉంది
206
జ్ఞానం కోరేవారు కొందరు, సంపదని కోరేవారు కొందరు
పాడగలగటానికే నీ సహవాసం నేను కోరుకుంటున్నాను
207
చెట్టు ఆకుల్లా, నేను నా పదాల్ని నేలమీద రాలుస్తాను
నీ నిశ్శబ్దంలో నా అనిర్వచనీయ ఆలోచనలు వికసించనీ
208
సత్యంలో నా నమ్మకం, సంపూర్ణత మీద నా దృష్టి
ప్రభువా, నీ నిర్మాణంలో నాకు సాయపడనీ
209
నా జీవిత పూల ఫలాల్లో
నేనొదిలిన అన్ని ఆనందాల్నీ
సంపూర్ణ ప్రేమ సంగమంలో
విందు చివర్లో నీకు సమర్పించుకోనీ
210
కొందరు చాలా లోతుగా ఆలోచించి సత్యం అర్థం కోసం గాలించారు, వారు గొప్పవారు
వాయిస్తున్న నీ సంగీతాన్ని తెలుసుకుందామని విని, నేను ఆనందంగా ఉన్నాను
(మళ్ళీ వచ్చే వారం)

శ్రీ యల్లపు ముకుంద రామారావు 9 నవంబరు 1944 నాడు పశ్చిమ బెంగాల్ ఖరగ్పూర్లో జన్మించారు. విద్యార్హతలు M.Sc, D.I.I.T, P.G.D.C.S.
కవిగా, అనువాద కవిగా, రచయితగా ప్రసిద్ధులైన ముకుంద రామారావు – వలసపోయిన మందహాసం (1995), మరో మజిలీకి ముందు (2000), ఎవరున్నా లేకున్నా (2004), నాకు తెలియని నేనెవరో (2008), నిశ్శబ్దం నీడల్లో (2009), విడనిముడి (అన్ని సంకలనాల్లోని ఆత్మీయ అనుబంధాల కవిత్వం) – (2013), ఆకాశయానం (2014), రాత్రి నదిలో ఒంటరిగా (2017) అనే స్వీయ కవితా సంపుటాలను వెలువరించారు.
అదే ఆకాశం – అనేక దేశాల అనువాద కవిత్వం (2010), శతాబ్దాల సూఫీ కవిత్వం (2011), 1901 నుండి నోబెల్ కవిత్వం (కవుల కవిత్వ – జీవిత విశేషాలు) – పాలపిట్ట వ్యాసాలు – (2013), 1901 నుండి సాహిత్యంలో నోబెల్ మహిళలు – సోపతి వ్యాసాలు – (2015), అదే గాలి (ప్రపంచ దేశాల కవిత్వం – నేపధ్యం) – మిసిమి వ్యాసాలు – (2016), భరతవర్షం – సీతాకాంత మహాపాత్ర ఒరియా కావ్యానికి తెలుగు అనువాదం. – (2017), చర్యాపదాలు (అనేక భాషల ప్రధమ కావ్యం – పదవ శతాబ్దపు మహాయాన బౌద్ధుల నిర్వాణ గీతాలు) – (2019), అదే నేల (భారతీయ కవిత్వం – నేపధ్యం) – (2019), అదే కాంతి (మధ్యయుగంలో భక్తి కవిత్వం, సామాజిక నేపథ్యం) – (2022) – వీరి స్వీయ అనువాద రచనలు.
వీరి రచనలు అనేకం – పలు భారతీయ భాషలలోకి, ఆంగ్లంలోకి అనువాదమయ్యాయి.
దేశదేశాల కప్పల కథలు – (2010), నిన్ను నువ్వు చూసుకునే అద్దం (సూఫీ, జెన్ ఇతర నీతి కథలు) – (2015), వ్యక్తిత్వ వికాసం – ఆనంద మార్గాలు (వ్యాసాలు) – (2018), అనువాదం – అనుభవాలు (మహాంద్ర భారతి ప్రచురణ) – (2019) – వీరి కథలు, ఇతర రచనలు.
తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, తాపీ ధర్మారావు పురస్కారం వంటి ఉత్కృష్ట పురస్కారాలెన్నింటినో పొందారు.