కౌటిల్య ధీ రజ్జు నిబద్ధ మూర్తిం
మన్యే స్థిరాం మౌర్యనృపస్య లక్ష్మీమ్
ఉపాయహస్తై రపి రాక్షసేన
నికృష్యమాణా మివ లక్షయామి. 2
మౌర్యనృపస్య+లక్ష్మీమ్=మౌర్య చంద్రగుప్తుడి వైభవాన్ని, కౌటిల్యధీ+రజ్జునిబద్ధ+మూర్తిం=చాణక్యుని బుద్ధిబలం అనే త్రాటితో దృఢంగా బంధింపబడిన దానిని, స్థిరాం+మన్యే=సుస్థిరమని భావిస్తున్నాను. రాక్షసేన+అపి= రాక్షసుని వల్ల (చేత) కూడ, ఉపాయ+హస్తైః=రాజకీయ ఉపాయాలు (వ్యూహాలు) అనే చేతులతో, నికృష్యమాణాం+ఇవ=లాగబడుతున్నట్టుగా, లక్షయామి=గమనిస్తున్నాను.
ఒకేసారి రెండు అభిప్రాయాలిక్కడ కలుగుతున్నాయి. కౌటిల్యుడి బుద్ధి కుశలత అనే త్రాడుతో గట్టిగా కట్టి, మౌర్య వైభవం నిలబడినట్టుగా ఒక ప్రక్క, రాక్షసమంత్రి రాజనీతి (తన) వ్యూహబలంతో ఇటు (తన వైపు) లాగుతున్నట్టు మరోప్రక్క వ్యవహారం కనబడుతోంది.
ఉపజాతి – ఇంద్రవజ్ర – త – త – జ – గ గ – గణాలు.
అయితే ఇందులో తొలి అచ్చు హ్రస్వం అయితే ఉపేంద్ర వజ్రావృత్తం అవుతుంది. అలాగ కాక, మొత్తం పాదం యీ రెండింటి సాంకర్యంగా ఉంటే అది ఉపజాతి.
‘కౌటిల్య ధీ రజ్జుః’, ‘మౌర్య నృపలక్ష్మీమ్’, ‘రాక్షసోపాయ హస్తై’ అనే పదాల ద్వారా రూపకాలంకారము.
‘నికృష్య మాణాం ఇవ’ (మౌర్య లక్ష్మీం) అనడం వల్ల ఉపమాలంకారము.
రూపకానుప్రాణిత ఉత్ప్రేక్ష – అని రామదాసయ్యగారి ఊహ.
(విషయ్యభేదతాద్రూప్యరఙ్జనం విషయస్యయత్ – అని రూపక సాధారణ నిర్వచనం; – ఉపమాయత్ర సాదృశ్యలక్ష్మీరుల్లసతి ద్వయోః – అని ఉపమా సాధారణ నిర్వచనం – కువలయానందం).
త దేవ మనయోః బుద్ధిశాలినోః సుసచివయో ర్విరోధే సంశయితేవ నన్దకుల లక్ష్మీః।
తత్+ఏవం=అందువల్ల ప్రస్తుత పరిస్థితి, అనయోః+బుద్ధిశాలినోః=ఈ ఇద్దరి మేధావులైన, సు+సచివయోః=ఉత్తమ మంత్రుల (యొక్క), విరోధే=విరోధం పురస్కరించుకుని, నన్దకుల+లక్ష్మీః=నందవంశ వైభవం, సంశయితా+ఇవ=సందిగ్ధ స్థితిలో పడినట్టుంది.
విరుద్ధయో ర్భృశమివ మన్త్రిముఖ్యయో
ర్మహావనే వనగజయో రి వాన్తరే
అనిశ్చయా ద్గజవశ యేవ భీతయా
గతాగతై ర్ధ్రువ మిహ ఖిద్యతే శ్రియా ॥ 3
ఇహ=ఇప్పుడు, భృశం+విరుద్ధయోః+ఇవ=మిక్కిలిగా విభేదించే వారి వలె ఉన్న, మన్త్రిముఖ్యయోః+అంతరే=ఇద్దరు ప్రధాన మంత్రుల నడుమ, మహావనే=మహారణ్యంలో, వనగజయోః+అంతరే=రెండు అడవి యేనుగుల నడుమ, గజవశయం+ఇవ= ఆడ యేనుగు మాదిరిగా, అనిశ్చయాత్=సందిగ్ధతలో (వల్ల), భీతయా+(గజయా)+ఇవ=భయపడిన ఆ ఆడయేనుగు మాదిరిగానే, గతాగతైః=రాకపోకలతో, శ్రియా=సంపదతో (రాజ్యలక్ష్మి), ఖిద్యతే=కష్టం పాలవుతోంది (దుఃఖపడుతోంది).
పెద్ద అడవిలో రెండు బలమైన మగయేనుగుల నడుమ చిక్కిన ఆడ యేనుగు సందిగ్ధంలో పడి, భయంతో ఎటు చేరుకోవాలో తెలియక అవస్థ పడినట్టు, ఇద్దరు మేధావులైన మహామంత్రుల వ్యూహాల నడుమ చిక్కుకొని మౌర్య రాజ్యలక్ష్మి (నంద రాజ్యలక్ష్మి) కష్టంలో పడిందని పోలిక.
ఉపమాలంకారం. “భీతయాద్గజవశయా ఇవ”, “నన్దకుల లక్ష్మీః ఖిద్యతే” అని అన్వయం.
రుచిర. – జ – భ – స – జ – గ – గణాలు.
త ద్యావ దమాత్య రాక్షసం పశ్యామి.
(ఇతి పరిక్రమ్య స్థితః)
(తతః ప్రవిశతి ఆసనస్థః పురుషేణ
అనుగమ్యమానః సచిన్‌తో రాక్షసః).
తత్+యావత్=అటువంటి పరిస్థితిలో, అమాత్య+రాక్షసం=రాక్షసమంత్రిని, పశ్యామి=చూస్తున్నాను. (ఇతి=అని, పరిక్రమ్య=ముందు నడిచి, స్థితః=నిలబడ్డాడు). (తతః=తాను పాటలీపుత్రం విడిచిన అనంతరం (ఒకనాడు), పురుషేణ+అనుగమ్యమానః=తనతో కూడా ఒక వ్యక్తి అనుసరించగా, ఆసనస్థః=ఆసనంపై కూర్చుని, స+చిన్తః=విచారగ్రస్తుడైన, రాక్షసః=రాక్షసమంత్రి (లేదా ఆలోచనామగ్నుడైన రాక్షసమంత్రి), ప్రవిశతి=ప్రవేశిస్తున్నాడు).
ఆహితుండికుడి ప్రవేశ, భాషణ సందర్భాన్ని నాటక పరిభాషలో ‘అఙ్కావతారం’ అంటారు. నిర్వచనం: “యత్రస్యాదుత్తరాంకార్ధ పూర్వాంకార్ధాను సంగతః। అసూచితాంగ పాత్రం తదంకావతరణం మతమ్”.
(రాబోయే అంకంలో ప్రతిపాదించబోయే విషయం, కడచిపోయిన అంకభావాన్ని అనుసరించేదిగా ఉంటుంది. అంటే ఆహితుండిక పాత్ర ప్రవేశం, విష్కంభం వంటి అంకానుసంధాన దృశ్యం కాదు. గత అంకంలో క్షపణక, శకటదాసాదుల బంధనం తరువాత జరిగే విషయాన్ని ఆహితుండిక పాత్ర ప్రవేశం సూచిస్తుంది – ఈ సందర్భాన్ని ‘అంకాశ్యం’గా కూడా పేర్కొనవచ్చునని వ్యాఖ్యాత డుంఢిరాజు ఉద్దేశం – “అఙ్కాన్తపాత్రై రఙ్కాస్య ముత్తరాఙ్కార్ధ సూచనా” – అంకాంత పాత్రలతో ఉత్తరాంక భావాన్ని సూచించడం” అని అర్థం.
(సశేషం)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™