[సూరం ప్రసూన గారి ప్రేరణాత్మక ఆత్మకథ ‘నా జీవిత యానం’ పాఠకులకు అందిస్తున్నాము.]


నాన్న నా బిజినెస్ కోసం పడ్డ శ్రమ:
ఈ ఆర్డర్ల కోసం మెటీరియల్ నాన్న ఆటోలో మూలపేటకు వెళ్లి తెచ్చిఇచ్చేవారు. ఎండ వాన అని లెక్కచేయకుండా వెళ్లేవారు. ప్రారంభం కదా మెటీరియల్ హోల్‌సేల్ రేట్‌కు దొరికేది కాదు. ఎక్కువ డబ్బులు పెట్టవలసి వచ్చేది. అప్పుడు నా దగ్గర కీప్యాడ్ ఫోన్ మాత్రమే నాకు ఉండింది. అందులో కెమెరా కూడా లేదు.
నాకు వచ్చిన ఆలోచన – టచ్ ఫోన్:
అంతే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు గాజులు చేస్తున్నాను కదా ఇదే బిజినెస్‌ను అభివృద్ధి చేసుకోవడానికి తగిన సాధనాలు ఉండాలి. టచ్ ఫోన్ ఉంటే నేను చేసిన గాజులను ఫోటో తీసి నాకు తెలిసిన వాళ్ళందరికీ పంపితే వాళ్లలో కొంతమందికైనా నచ్చిఆర్డర్ ఇస్తే అలా అలా మెల్లమెల్లగా నా బిజినెస్ అభివృద్ధి చెందుతుందన్న ఆలోచన వచ్చింది. ఆలోచన అయితే నా వరకు నాకు మంచిదని అనిపించింది, ఎందుకంటే నాకు టచ్ ఫోన్ కనుక ఉంటే నేను దాంతో దాన్నినా బిజినెస్‌కు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకొని వాడగలనన్న నమ్మకం నాలో ఉంది. అంతేకానీ టైం పాస్ కోసం ఫోను వాడాలి అనుకోలేదు. నాకు టైం పాస్ పనులు అస్సలు వద్దు. నాకు ఇష్టం లేదు. నేను బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసమే నాకు టచ్ ఫోన్ కావాలి. అది కొనుక్కుందామంటే నాన్న దగ్గర డబ్బులు ఎక్కడ వున్నాయి. ఇంటి వ్యవహారాలకు చిన్నాన్నలు మేనత్తలు ఏ లోటు లేకుండా చూస్తున్నారు. ఇంకా ఇది అడిగి వాళ్ళను ఇబ్బంది పెట్టడం ఎందుకు అనిపించింది.
నా ప్రాణ స్నేహితురాలు రోహిణి నా పురోభివృద్ధికి తోడ్పాటు:
ఏ విషయమైనా సరే రోహిణితో నేను చర్చిస్తాను. రోహిణి కూడా చిన్నాన్నలను, మేనత్తలను ఇబ్బంది పెట్టొద్దు, నేను కొనిస్తాను అని చెప్పింది. రోహిణి ఆ మాట చెప్పేవరకు నేను ఫోన్ కోసం పడ్డ వేదన ఇంతా అంతా కాదు. మొత్తానికి రోహిణి సపోర్ట్‌తో నాకు టచ్ ఫోన్ వచ్చింది. ఇంత సపోర్ట్ చేసిన రోహిణికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను. సరే టచ్ ఫోన్ వచ్చింది కదా, ఇక నేను చేస్తున్న ఆర్డర్లను ఫోటో తీయడం ప్రారంభించాను. కానీ టచ్ ఫోన్ రావడం ఒక వంతు అయితే దానిని ఎలా వాడాలో నేర్చుకోవడానికి ఎంతమందిని అడిగానో, ఎంత వేదన పడ్డానో, చెప్పడానికి నాకు సాధ్యం కాదు, అలవి కాదు కూడా. ఆ బాధ ఆ నరకం వర్ణనాతీతం. చూసే వాళ్ళకి ఇంత చిన్న విషయానికి ఇలా మథనపడటం ఏమిటీ, అందర్నీఅడగడం ఏమిటీ అని అనిపించవచ్చు కానీ ఆ టచ్ ఫోను, దాని అవసరం దానిని ఎలా వాడాలో తెలుసుకోవడం అది ఎంత అవసరమో అది నాకు మాత్రమే తెలుసు. నన్ను అర్థం చేసుకున్న వాళ్లకు మాత్రం తెలుసు.
నా ఫోన్ చిన్ని గురువులు:
అన్ని ప్రయత్నాలు చేశాను. చివరికి మా అపార్ట్మెంట్లో నా చుట్టుప్రక్కల ఉన్న ఇంటర్, బి.టెక్ చదివే పిల్లలు రుషిత, సాయి, గార్గేయ, హర్షిత, లీలేష్, సుహానా, బన్నీ, వెంకటేష్, వంశీ, కౌశిక్ వీళ్ళందరూ నాకు టచ్ ఫోన్ ఎలా వాడాలో నేర్పించిన చిన్ని గురువులు. వీళ్ళందరూ కలిసి నాకు టచ్ ఫోన్ లోని ఆప్షన్స్, వాటిని ఎలా వాడాలో చాలా నేర్పించారు.
మొట్టమొదటిసారి బయట ఊరు అయిన అమలాపురం నుంచి సుధక్క గాజుల ఆర్డర్, హోల్ సేల్ గా మెటీరియల్ వెతుకులాట:
ఇది కోవిలో చేరకముందు మాట. అంతలో సుధ అక్క 40 జతల గాజుల ఆర్డర్ ఇచ్చింది అమలాపురం నుంచి ఫోన్ చేసి. అప్పట్లో ఇది పెద్ద ఆర్డర్. దీనికి మెటీరియల్ ఎలా కొనుక్కోవాలన్న సమస్య మొదలయింది. ఇక మా అపార్ట్మెంట్లో చుట్టుపక్కల ఉన్న అందర్నీ గాజుల హోల్‌సేల్ షాప్ ఎక్కడ ఉంది అని అడగసాగాను. అప్పుడు ఎదురుగుండా ఉన్న సబిహా ఆంటీ వాళ్ళ అల్లుడు “నెల్లూరు చిన్న బజార్లో బాలాజీ బ్యాంగిల్స్ స్టోర్ ఒకటి ఉంది. అక్కడ హోల్‌సేల్‌గా ఇస్తారు” అని చెప్పారు. నాన్న ఒకరోజు అక్కడకు వెళ్లి విచారించగా, “బాక్సులు బాక్సులు కొనాలి విడిగా ఇవ్వము” అన్నారట. ఇంకా ఏమంటే అక్కడ వట్టి బ్యాంగిల్స్ మాత్రమే ఉంటాయి. ఈ వర్క్‌కు సంబంధించి డిజైనింగ్ వస్తువులు ఈ షాప్‌లో దొరకవు అని చెప్పారట.
శ్రీదుర్గాలేస్ హౌస్:
అప్పుడు వాళ్లేవాళ్ళ షాపుకు ఎదురుగా ఉండే శ్రీదుర్గాలేస్ హౌస్ అనే షాప్ చూపించి అక్కడ అన్నిదొరుకుతాయి అని చెప్పారట నాన్నకు. వెంటనే నాన్న ఆ షాప్ కు వెళ్లివాళ్లతో మాట్లాడి అక్కడ కొని తెచ్చారు. రెండు షాపుల ఫోన్ నంబర్లు తెచ్చారు నాన్న. నాన్న తెచ్చిన వెంటనే సుధా అక్క ఇచ్చిన ఆర్డర్ మొదలుపెట్టేసి ఒక 20 రోజులలో పూర్తిచేసినాను.
కొరియర్ సమస్య:


నాన్నకు ఆరోగ్య సమస్య:
అది 2014 జూన్ 25. ప్రతిరోజు లాగే ఆ రోజు మామూలుగా ఉదయం నిద్ర లేచాం నాన్న నేను. ప్రతిరోజు లాగే నాన్న నన్నుమంచం మీద నుంచి కిందకు దించారు. అదే చివరిసారి నన్ను ఎత్తి దించడం. నాన్నకు ఆ రోజు సడన్‌గా యూరిన్ రాలేదు. పొట్ట నొప్పితో బాధపడుతున్నారు. వెంటనే చిన్నఅత్త వాళ్లకు ఫోన్ చేసి పరిస్థితి వివరించాను. అప్పుడు చిన్న అత్త మామయ్య నెల్లూరు రమేష్ రెడ్డినగర్‌లో ఎప్పుడు వెళ్లే డాక్టర్ గారైన డాక్టర్ వెంకటేశ్వర్లుగారి దగ్గరికి వెళ్ళమని చెప్పారు. అప్పటికే నా దగ్గర ఉన్న ఆటో ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేసి నాన్నని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్ళమని చెప్పాను. ఆటో అతను వచ్చి నాన్నను హాస్పిటల్‌కు తీసుకొని వెళ్ళారు. డాక్టర్ గారు అన్ని టెస్టులు చేసి యూరిన్ బ్యాగ్ వేసి యూరిన్ తీసేసి ప్రోస్టరేట్ గ్లాండ్స్ ఎన్లార్జ్ అయినాయి, ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. అప్పుడు మామయ్య కూడా హాస్పిటల్‌కు వెళ్లిడాక్టర్ గారితో మాట్లాడారు. యూరిన్ బ్యాగ్ పెట్టించుకుని నాన్న ఇంటికి వచ్చేసారు. నిజానికి సరిగ్గా ఆ టైమ్‌కు నాకు వీల్ చైర్ ఇంటికి రావలసి ఉంది. దాని తయారీ ఆలస్యం కావడంతో ఆ రోజుకు రాలేదు. అప్పటినుంచి జూలై 14 వరకు నాకు అవస్థ ఇంక అంతా ఇంతా కాదు. చెక్క బండి మీద కూర్చోవడం, నాన్నకు టైం కు వంట చేసి కలిపి పెట్టడం, అస్సలు కింద పడుకోలేని నేను జూలై 14 వరకు కింద పడుకోవడం, ఇవన్నీ సమర్ధించుకుంటూ ఆ 20 రోజులు నరకం అనుభవించాను. నాకు కింద పడుకుంటే శరీరమంతా విపరీతమైన నొప్పులు. ఆ నొప్పులతోనే నాన్నకు టైం కు వంట చేసి అన్నం కలిపి స్పూన్ వేసి ఇస్తేనాన్న తినేవారు. పైగా నాన్న యూరిన్ బ్యాగ్ పెట్టుకోవడం కొత్త కదా అది సరిగ్గాపెట్టుకోలేక అవస్థ పడడం, దానివల్ల వచ్చే సమస్యలను ఎదుర్కోవడం తోనే ఆ 20 రోజులు గడిచిపోయింది.
నాకు వీల్ చైర్ ఇంటికి రావడం కొంతవరకు శరీర కష్టం తగ్గడం:
మా పెద్ద చిన్నాన్న ఉమామహేశ్వరం గారు ఫోన్ చేసి జూలై 14న వీల్ చైర్ వస్తుంది, మేము 13న వస్తాము. అప్పుడు నాన్నను హాస్పిటల్‌కు తీసుకెళ్లి చూపిస్తాము అని చెప్పారు. జులై 13 రానే వచ్చింది. చిన్నాన్న పిన్నమ్మ వాళ్లు హైదరాబాద్ నుంచి వచ్చి చిన్న అత్త వాళ్ళ ఇంట్లో దిగారు. 14 జూలై 2014 సాయంత్రం ఐదు గంటలకు వీల్ చైర్ ఇంటికి వచ్చింది. ఇక్కడ ఉన్న చిన్న అత్త మామయ్య ఇక్కడ ఉన్న చిన్న చిన్నాన్న పిన్నమ్మ పెద్ద అత్త కుమారుడు వీళ్ళను అందరిని ఇక్కడికి రమ్మని ఉమామహేశ్వరం చిన్నాన్న పిలిచారు. అందరూ వచ్చారు నా వీల్ చైర్ వచ్చేటైం కు. వీల్ చైర్ కంపెనీ వాళ్ళు అది ఎలా నడపాలో ఆ రోజు రాత్రివరకు డెమో ఇచ్చారు. ఉమామహేశ్వరం చిన్నాన్న నాకు “నీకు ఈ వీల్ చైర్ సునీల్ రాగిణి ఇచ్చిన గిఫ్ట్’’ అని చెప్పారు. నాకు చాలా సంతోషం వేసింది. నా కష్టం ఇబ్బంది అర్థం చేసుకున్నది మా పెద్ద చిన్నాన్న ముఖ్యంగా మా పెద్ద పిన్నమ్మ అయిన జయభాగ్య పిన్నమ్మ మా తమ్ముడి భార్య ముక్త, తన తండ్రిగారైన త్యాగి మామయ్య గారు. వీరి సహాయ సహకారాల వల్లనే వీల్ చైర్ ధరలో తగినంత తగ్గింపు లభించింది. ఇంకా పేరుపేరునా అందరికీ ధన్యవాదాలు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు తెలియట్లేదు, జీవితాంతం వీరి సహాయం మరువరానిది. రాత్రికి అందరూ వెళ్ళిపోయారు.
నాన్నకు ట్రీట్మెంట్ ఇప్పించడం:
పక్క రోజు ఉదయం పెద్ద చిన్నాన్న చిన్న చిన్నాన్న మామయ్య వాళ్లు నాన్నను నెల్లూరు చింతారెడ్డిపాలెం నారాయణ హాస్పిటల్‌కు తీసుకొని వెళ్లి అక్కడ అన్నిపరీక్షలు చేయించి తీసుకొని వచ్చారు. ప్రోస్ట్రేట్ గ్లాండ్స్ ఎన్లార్జ్ అయినందువల్ల యూరిన్ రావట్లేదు, అందువల్ల బ్యాగ్ పెట్టుకోవాలి లేదా ఆపరేషన్ చేయించుకోవాలి అని చెప్పారు. పైగా ఆపరేషన్ సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని కూడా చెప్పారు. ఆపరేషన్ చేయిస్తే నాన్న ఈ పెద్ద వయసులో తట్టుకోలేరని ఒకవేళ చేయించినా సక్సెస్ అవ్వవచ్చు అవ్వకపోవచ్చుఅని చెప్పడం వల్ల చేయించలేదు. ఇక పెద్ద చిన్నాన్న నాన్నకు చూపించి టెస్టులు చేయించి హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇంకా కొన్ని టెస్టులు చేయాల్సివస్తే మా పెద్ద అత్త తను తోడు వెళ్లలేకపోయినా ఆటో అతనిని ఒక పని ఆయనను నాన్నకు తోడు ఇచ్చి డబ్బులు ఇచ్చి టెస్టులకు నారాయణ హాస్పిటల్‌కు పంపించి చేయించింది. ఇంకా కొన్నిసార్లు మా చిన్న చినాన్న పెద్దత్త చిన్న కుమారుడు అందరూ వాళ్లు చేయగలిగినది అంతా చేశారు. ఇక చేసేది లేక బతికినన్నిరోజులు యూరిన్ బ్యాగ్ పెట్టుకుని అది నెలకొకసారి తర్వాత 20 రోజులకు ఒకసారి మార్చుకుంటూ ఇన్ఫెక్షన్ కాకుండా యాంటీబయాటిక్స్ వాడుతూ బతకడమే అయిపోయింది. నాన్న యూరిన్ బ్యాగ్ పెట్టుకొని తన పనులు తను చేసుకుంటూ నాకు కూడా పనిలో సహాయం చేస్తూ అలానే యూరిన్ బ్యాగ్‌తో బయటకు వెళ్లిపనులు చూసుకుని వచ్చేవారు. ఇలా ఉండగా నేను వీల్ చైర్ నడపడం నేర్చుకొని నా పనులు నేను చేసుకోవడం అలవాటు చేసుకున్నాను. అలాగే వీల్ చైర్లో ఇల్లంతా తిరుగుతూ ఇంటి పనులు వంట పనులు నిర్వహించుకుంటూ నాన్నకు టైంకు భోజనం తయారు చేసి పెట్టడం అలవాటు చేసుకున్నాను.
రేషన్ కార్డుకోసం నా సొంత ప్రయత్నాలు:
ఇది ఇలా ఉండగా కొద్దిరోజులు గడిచిన తర్వాత పెన్షన్ కోసం రేషన్ కార్డ్ ఉండాలని రూల్ పెట్టారు. అంతకుముందే మా అపార్ట్మెంట్లో ఒకరు బుక్ లాంటి క్యాలెండర్, అందులో క్యాలెండరే కాకుండా కొన్ని ముఖ్యమైన వాళ్ళ నంబర్లు ఉన్నవి ఇచ్చారు. ఆ బుక్ పట్టుకొని అందులో జాయింట్ కలెక్టర్ నంబర్ వెతికి జాయింట్ కలెక్టర్ గారికి ఒక మెసేజ్ చేశాను. మా నాన్నగారికి ఇలాంటి హెల్త్ ఇష్యూ వచ్చింది ఆపరేషన్ చేయించాలి అనుకుంటున్నాము, మాకు రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు కావాలి ఆలాట్ చేయండి దయచేసి; రేషన్ కార్డు మా పెన్షన్‌కు కూడా అవసరం పడుతోంది అని రిక్వెస్ట్ మెసేజ్ ఫోన్ ద్వారా పంపాను. అది పెట్టిన అరగంట కల్లా ఒక కొత్త నెంబర్ నుంచి కాల్ వచ్చింది. మీరు జాయింట్ కలెక్టర్ గారికి మెసేజ్ పెట్టారట కదా, దాని గురించి మాట్లాడడానికి కాల్ చేసాము అని చెప్పారు. మేము డిప్యూటీ తాసిల్దార్ గారి నంబర్ ఇస్తున్నాము ఆ సార్ కు కాల్ చేయండి అని చెప్పారు. ఆ తర్వాత నేను ఆ సార్ కు కాల్ చేసి విషయం అంతా చెప్పిన తరువాత నేను చూస్తాను అమ్మ మీరు ఎవరినన్నానా ఆఫీసుకు పంపించండి అని చెప్పారు. అప్పుడు మా చిన్న చిన్నాన్న అయిన భీమశంకరం గారికి విషయం చెప్పి డిప్యూటీ తాసిల్దార్ గారి వద్దకు వెళ్లి రమ్మని చెప్పాను. మా చిన్నాన్న వెళ్లి పని చూసుకొని వచ్చారు. కొద్దిరోజుల తర్వాత డిప్యూటీ తాసిల్దారు గారు ఫోన్ చేసి మీకు రేషన్ కార్డ్అలాట్ చేసాము జన్మభూమి కార్యక్రమంలో మీకు రేషన్ కార్డు ఇస్తారు ఆ జన్మభూమి కార్యక్రమం ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు అది వచ్చినప్పుడు మీకు వస్తుంది ఇంత వరకే మాకు రైట్స్ఉన్నాయి ఇంతకుమించి మేము చేయలేము అని చెప్పారు నేను అందుకు ఓకే అన్నాను ఇంత పెద్ద సహాయం చేసినందుకు డిప్యూటీ తాసిల్దారు గారికి థాంక్స్ చెప్పాను. ఎలాగో ఇంట్లోకూర్చొని ఫోన్లుచేసి రేషన్ కార్డ్ అలాట్ అయ్యేలా చేసుకోగలిగాను. అంతా భగవంతుడి దయ.
గాజుల ఆర్డర్ల కోసం ప్రయత్నాలు కోవిలో చేరడం:
ఆ తరువాత నాకు గాజుల ఆర్డర్లు ఏమీ రాకపోవడంతో ఏమి చేయాలా అని ఆలోచించి ఎక్కడో ఒక పుస్తకంలో సఖి ప్రోగ్రాం చూసేటప్పుడు COWE నంబర్ రాసి పెట్టుకున్నాను అని గుర్తుకు వచ్చింది. అది వెతికి నంబర్ తీసుకొని కోవి వాళ్లకు ఫోన్ చేశాను. సౌదామిని మేడం గారితో మాట్లాడాలి అని రిక్వెస్ట్ చేశాను. అది ఆఫీస్ నంబర్ అని నాకు తెలియదు. సౌదామిని మేడం నెంబర్ అనుకున్నా. వాళ్ళు చెప్పారు ఆఫీస్ నెంబర్ అని. అది తెలంగాణ కోవి ఆఫీస్ నంబర్. సౌదామిని మేడం నంబర్ అడిగితే ఆమె నంబరు ఇవ్వడం కుదరదు ఆమె ఎవరితోనో మాట్లాడరు మీకేం కావాలో చెప్పండి, హెల్ప్ చేయడానికి మేమున్నాము అని చెప్పారు తెలంగాణ కోవి ఆఫీస్ వాళ్లు. నేను థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తాను నాకు ఆర్డర్స్ కావాలి, నాకు ఆర్డర్స్ ఇప్పించగలరా అందుకే కాల్ చేశాను అని రిక్వెస్ట్‌గా అడిగాను. నాకు మార్కెటింగ్ కల్పించండి అని కూడా అడిగాను. వాళ్లు నన్ను వాళ్ళ గ్రూపులో యాన్యువల్ మెంబర్‌గా చేరమన్నారు. ఇంకా ఈడీపీ అనే గ్రూప్‌లో నన్ను యాడ్ చేసి నా డిజైన్స్ అందులో పోస్ట్ చేయమన్నారు. నిజానికి వాళ్ల గ్రూప్‌లో చేరడానికి సంవత్సరానికి ఇంత అని కొంత అమౌంట్ వాళ్ళకు కట్టాలి. ఎందుకో తెలియదు కానీ వాళ్లు నన్ను మనీ కట్టమని అడగలేదు. గ్రూప్‌లో డిజైన్స్ పోస్ట్ చేసుకోమన్నారు. వెంటనే రెండు గ్రూపులలో నా డిజైన్స్ పోస్ట్ చేశాను.


తెలంగాణ కోవి నుంచి పెద్ద ఆర్డర్:
వెంటనే అప్పటి తెలంగాణ కోవి ప్రెసిడెంట్ అయినా రమాదేవి మేడం నా డిజైన్స్ చూసిన వెంటనే ఆమెకు ఏమి కావాలో సెలెక్ట్ చేసుకుని నాకు ₹ 6500/- కు గాజులు ఆర్డర్ ఇచ్చింది. అవి నేను నా చేత్తో స్వయంగా చేసి వాళ్ళ అడ్రస్‌కు పంపాను. వెంటనే వాళ్లు నాకు ₹ 6,500 ప్లస్ కొరియర్ చార్జెస్ ఇచ్చారు. ఇంత పెద్ద సహాయం చేసిన వారికి నేనేమిచ్చి రుణం తీర్చుకోవాలి. ఇక ఆ తర్వాత నుంచి ఆ గ్రూప్ లో చాలామంది మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని ప్రయత్నించాలని అనుకున్నాను.
ఆర్డర్ల కోసం ప్రయత్నాలు:
రోజు నా ఇంటి పనులు అయిన తర్వాత ఫోన్ పట్టుకొని ఒక్కొక్కరికి ఫోన్ చేసి నేను ఇంట్లోనే థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే చెప్పండి మీకు తెలిసిన వాళ్లకు కూడా చెప్పండి నేను చేసి పంపిస్తాను అని నన్ను నేను పరిచయం చేసుకుంటూ వీలైనంత ఎక్కువ మందికి నా గురించి అంటే నేను థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తాను అని చెప్పి నా వర్క్‌ని అలా పబ్లిసిటీ చేసుకున్నాను. బిజినెస్‌లో ఇలా చేయాలని నాకు తెలియదు. తర్వాతే తెలిసింది ఇదే సరైన పద్ధతి అని. అలా చెప్పగా చెప్పగా కొద్దిరోజుల తర్వాత ఒక్కొక్కరుగా వాళ్ళ అవసరాలను బట్టి నాకు బ్యాంగిల్స్ ఆర్డర్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. వాళ్లు చెప్పిన ప్రకారం నేను వెంట వెంటనే యింటి పనులు చేసుకుంటూనే బ్యాంగిల్స్ వర్క్స్ చేస్తూ, వాళ్ళు ఇచ్చిన టైం కు ఆర్డర్స్ చేసి కొరియర్ చేసేదాన్ని. అలా నా బిజినెస్ కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతూ వస్తూ ఉన్నది. నాకు కూడా ఏదో ఒక పని దొరికింది చేయగలుగుతున్నాను అన్న ఆత్మసంతృప్తి కొంచెం దక్కింది.
మెటీరియల్ ఇంటికి తెప్పించుకోవడం కోసం శ్రీదుర్గాలేస్ హౌస్:
ఇంకొక విషయం ఏమంటే నేను బ్యాంగిల్స్ ఆర్డర్స్ వస్తున్న క్రమంలో వాటికి కావాల్సిన మెటీరియల్ తీసుకోవడం కోసం నాన్న తెచ్చిన శ్రీదుర్గాలేస్ హౌస్ వాళ్లకు ఫోన్ చేసి ఇంటికి తెచ్చి ఇవ్వమని రిక్వెస్ట్ చేశాను. మొదట ఆ అన్న ఒప్పుకోలేదు. ఫోన్లు చేసి చేసి చాలా రిక్వెస్ట్ చేస్తే అప్పుడు మేము రాత్రి షాప్ మూసుకొని ఇంటికి వెళ్లేటప్పుడు అయితేనే తెచ్చిఇవ్వగలం. అలా మీకు సమ్మతమైతే తెచ్చిఇస్తాము అని చెప్పారు. నేను అందుకు సరే అని చెప్పాను. ఇక అప్పటినుంచి ఇంటికి తెచ్చిస్తున్నారు. నాకు ఆ సమస్య కూడా తీరినందుకు చాలా సంతోషం అయింది. మెటీరియల్ ఇంటికి తెచ్చిఇచ్చేవాళ్ళు, కొరియర్ బాయ్ ఇంటికి వచ్చితీసుకు వెళ్లడం కుదరడంతో నాకు ఆర్డర్స్ చేయడం సులువైనది. నాన్నను శ్రమ పెట్టకుండా ఇలా నా పని సొంతంగా నేను చేసుకుంటూ పోవడం నాకు చాలా ఆత్మ సంతృప్తినిచ్చింది.
దైవానుగ్రహం కోసం నా ప్రయత్నం:
ఇవన్నీ సమకూరడం ఆ దైవానుగ్రహమే. దైవానుగ్రహం కోసం నేను కొన్ని పూజలు చేసేదాన్ని. కొన్ని శ్లోకాలు మా నాన్న, మా తాతగారు చెప్పగా నేర్చుకుంటే మరి కొన్ని టీవీ ద్వారా నేర్చుకున్నాను. ఈ భక్తిభావం మా కుటుంబం నుంచి సంక్రమించింది.
టీవీ:
ఈ విధంగా టీవీ అనే ప్రసార సాధనం ఒక విజ్ఞానానికి, వినోదానికి భక్తిభావం పెంపొందించుకోవడానికి మాత్రమే వినియోగించుకోవడానికే కాకుండా ఇలా స్వయం ఉపాధి కల్పించుకోవడానికి ఇంకా కూడా ఇది ఉపయోగపడుతుందని నా విషయంలో రుజువైనదనే చెప్పగలను. టీవీ అనే సాధనాన్నికేవలం వినోదానికి కాకుండా ఇలా సద్వినియోగం చేసుకోగలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
రేషన్ కార్డ్ చేతికి రావడం:
ఇంతలో జన్మభూమి కార్యక్రమం అమలులోకి వచ్చి రేషన్ కార్డ్ నాన్న పెన్షన్ ఇచ్చే చోటే ఇచ్చారు. నాన్న అలానే యూరిన్ బ్యాగ్‌తో వెళ్లి పెన్షన్‌కు గాని ఇంకా ఏ ఇతర పనుల నైనా చేసుకొని వచ్చేవారు. ఇలా ప్రతి నెల పెన్షన్ కు వెళ్లివచ్చేవారు. ఆ క్రమంలో ఒకటో తేదీ వెళ్తే మూడో తేదీ, మూడో తేదీ వెళ్తే ఐదవ తేదీ రమ్మని చెప్పి ఐదో తేదీ దాకా ఇచ్చేవారు కాదు చాలా సార్లు. ఉదయం 10:30 కల్లా వెళ్తే సాయంత్రం మూడు నాలుగు అయ్యేది ఇంటికి వచ్చేసరికి. ఎంత ఎండలో అయినా అక్కడే ఉండి పెన్షన్ తీసుకొని ఇంటికి వచ్చేవారు నాన్న. ఒక్కొక్కసారి నాన్నను ఆ పెన్షన్ ఇచ్చేసార్ చాలా విసుక్కునే వారట.
నాన్న పెన్షన్ ఇంటికి ఇచ్చేఏర్పాటు నా ప్రయత్నం:
ఈ క్రమంలో ఒకసారి ఒకటవ తేదీ నుంచి ఐదో తేదీ వరకు ఎండలో తిరిగినా ఐదో తేదీ ఆ నెలకు ఆఖరి రోజు అవ్వడంతో, వచ్చే నెల తీసుకో అని చెప్పి పంపేశారు నాన్నను ఇంటికి. ఎండలో ఇంటికి వచ్చి నాన్న చాలా డస్సిపోయారు. నాకు చాలా బాధ వేసింది. అంతే ఇంక ఇలా కాదని చెప్పి నేను రేషన్ కార్డ్ కోసం సహాయం చేసిన డిప్యూటీ తాసిల్దార్ చంద్రశేఖర్ గారికి ఫోన్ చేసి విషయం చెప్పాను. తాసిల్దార్ గారు అతని పేరు ఫోన్ నెంబర్ అడిగారు. కానీ నాన్నకు అతని పేరు గాని ఫోన్ నెంబర్ కానీ ఏమీ తెలియదు. నాన్నకు పెన్షన్ ఇచ్చే ఏరియా మాత్రమే తెలుసు. ఆ ఏరియా చెప్పాను సార్‌కు. ఇది ఇంచుమించు నాలుగు గంటలు అప్పుడు చెప్పాను. సాయంత్రం 6 కల్లా అతని పేరు ఫోన్ నెంబర్ కనుక్కొని అతనికి తగిన విధంగా చెప్పి, వెంటనే నాకు ఫోన్ చేసి రేపు ఉదయం కల్లా మీ ఇంటికి తెచ్చి ఇస్తారు అని చెప్పారు తాసిల్దార్ గారు. పక్క రోజు ఉదయం అతను 10:00 కల్లా ఇంటికి వచ్చి “అమ్మా సత్యనారాయణ గారు ఉన్నారా?” అని అడిగి, “ఏమమ్మా మీకు ఇంత నెట్వర్క్ ఉందని నాకు తెలియదు. మీరేమైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారా?” అని నన్ను అడిగాడు కోపంగా. “ఏమి చేయమంటారు మా నాన్నది పెద్ద వయసు. ఇంత పెద్ద వయసులో ఇన్ని సార్లు తిప్పించుకోవడం సమంజసమా మీకు?” అని అడిగాను. నా మాటలు పట్టించుకోకుండా “యూరిన్ బ్యాగ్ పెట్టుకోని వచ్చారండి ఈయన” అని నాన్నకేసి వేలు చూపించి నాకు చెప్పాడు. నాకు బాధ వేసి “నాన్నకు ప్రాబ్లం ఉంది అందుకే పెట్టుకుని వచ్చారు, సరదాగా ఏం పెట్టుకోరు” అని అతనికి చెప్పాను. అతను కూడా పశ్చాత్తాపపడ్డాడు. అప్పటికే నాకు చాలా నెలల నుంచి నా పెన్షన్ ఇంటికి తెచ్చిస్తున్నారు వేరే వాళ్ళు. వాళ్ల పేర్లు అడిగి తెలుసుకుని నాన్న పెన్షన్ కూడా వాళ్లకే అప్పచెప్పి రెండు పెన్షన్లు ఒకేసారి ఇంట్లోనే ఇచ్చేటట్టు ఏర్పాటు చేశారు. అప్పటినుంచి మా ఇద్దరికీ పెన్షన్ ఇంటికే వచ్చేది.
ఎం.ఎస్.ఎం ఈ గ్రూప్:
ఇది ఇలా ఉండగా కోవి వాళ్లో ఎవరో తెలియదు కానీ ఎం.ఎస్.ఎం.ఇ గ్రూప్‌లో కూడా నన్ను చేర్చుకున్నారు. అక్కడ కూడా నేను నా డిజైన్స్‌ను పోస్ట్ చేసేదాన్ని. అక్కడి నుంచి కూడా నాకు ఆర్డర్స్ వచ్చాయి. నాకు ఆర్డర్స్ ఇచ్చిన వాళ్లందరూ మీ వర్క్ చాలా బాగుంది అంటూ మెచ్చుకునే వాళ్ళు. యథా ప్రకారంగా ఇక్కడ కూడా ఫోన్ నెంబర్లు సెలెక్ట్ చేసుకుని ఒక్కొక్కరికి ఫోన్ చేసి నేను బ్యాంగిల్స్ చేస్తాను ఎవరికైనా కావాలంటే చెప్పండి. మీకు తెలిసిన వాళ్లకు కూడా చెప్పండి అని చెప్పేదాన్ని.
ఎలిప్ ఆర్గనైజేషన్ మేడంతో పరిచయం:
ఆ క్రమంలో ఎం.ఎస్.ఎం.ఇ. గ్రూప్‌లో అదేదో హెచ్ఎండి కంపెనీ డైరెక్టర్ రాజ్యలక్ష్మిగారు ఎలిప్ (అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యుయర్స్ ఆఫ్ ఇండియా) వాళ్ల నంబర్ ఇచ్చారు. మొట్టమొదటిసారిగా ఎలిప్ ట్రెజరర్ కవిత గారికి ఫోన్ చేశాను. ఆ తర్వాత కవిత గారు నాతో చాలా బాగా ఎంకరేజింగ్‌గా మాట్లాడి ఎలిప్ సంస్థ ప్రెసిడెంట్ రమాదేవి మేడం నంబర్ ఇచ్చారు. చాలా సంతోషం వేసింది. కోవి డైరెక్టర్ సౌదామిని మేడంను టీవీలో చూసినట్లుగా రమాదేవి మేడం కూడా టీవీలో చూసి ఆమె ఇంటర్వ్యూ విన్నాను ఆమెతో స్వయంగా మాట్లాడడం నాకు చాలా సంతోషాన్నిఇచ్చింది. రమాదేవి మేడం కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూచాలా బాగా మాట్లాడారు నాకు హెల్ప్ చేస్తామని చెప్పారు. ఎంత సంతోషం వేసిందో చెప్పలేను. రమా మేడం కూడా 5000 రూపాయల దాకా బ్యాంగిల్స్ ఆర్డర్ ఇచ్చారు. ఇంకా కొంతమంది చేత ఆర్డర్స్ ఇప్పించారు. రెండు మూడు సార్లు రమా మేడం, కవిత మేడం కొంత ఆర్థిక సహాయం చేశారు. ఇలా కోవి, ఎలిప్ నాకు అన్నివిధాలా మార్కెటింగ్ సపోర్ట్ ఇచ్చినా థ్రెడ్ బ్యాంగిల్స్ వ్యాపార అభివృద్ధికి కారకులయ్యారు.
(ఇంకా ఉంది)
92916 35779
prasunasuram@gmail.com
2 Comments
కొల్లూరి సోమ శంకర్
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *
Your story flow is very nice. 
keep going.. Best wishes …
*
కొల్లూరి సోమ శంకర్
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma
*