[సూరం ప్రసూన గారి ప్రేరణాత్మక ఆత్మకథ ‘నా జీవిత యానం’ పాఠకులకు అందిస్తున్నాము.]
చూడండి- చేయండి- థ్రెడ్ బ్యాంగిల్స్:
ఇంకా ‘చూడండి – చేయండి’ లో త్రెడ్ బ్యాంగిల్స్ చేయడం కూడా చెప్పేవారు. ఎందుకో తెలియదు కానీ ఇది నేర్పిస్తున్నారు వీటిని ఎవరు కొంటారు స్త్రీలకు ఉపాధి కలిగించేవి ఉండాలి కానీ ఇవి చూపిస్తే ఎవరు నేర్చుకుంటారు వీటిని ఎవరు వాడుతారు అనే చులకన భావం నాలో కలిగింది. మరి ఎందుకో తెలియదు అప్పుడు. ఈ భావన తప్పు అని కూడా ఆలోచించలేదు. ఎందుకో థ్రెడ్ బ్యాంగిల్స్ మీద అంత చులకన భావం నాలో. ఇంకా వెల్వెట్ క్లాత్, శాటిన్ క్లాత్ టిష్యూ పేపర్స్ రకరకాల పేపర్స్‌తో రకరకాల గృహ అలంకార పూలు తయారుచేయడం రకరకాల ఫ్లవర్ వేజులు తయారుచేయడం నేర్పించేవారు.


సైకాలజిస్ట్ పద్మజ గారితో నా అనుభవం:
ఇంకా పద్మజ అనే సైకాలజిస్ట్ ఒక ఆమె వచ్చేవారు. ఆమెకు కూడా నేను ఫోన్ చేసి నాలోని బాధలు భయాలు సందేహాలు జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలి, ఎలా నాలో వున్న నిరాశ ఏమి చేయలేకపోతున్నాను అన్న ఆలోచనా విధానాన్నిఎలా మార్చుకోవాలి, ఇంకా ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో సాధించాలి అనే తపన గురించి అడిగేదాన్ని. ఆమె నాకు మంచి మంచి సలహాలు సూచనలు ఇచ్చేవారు.
అంటే ఒక సందర్భంలో ఒక విషయం గురించి నెగటివ్‌గా ఆలోచిస్తే మరొకసారి అదే విషయాన్ని పాజిటివ్‌గా ఆలోచించే దాన్ని. ఇలా రెండు కోణాలలో కాకుండా ఎప్పుడూ మంచిగా నా ఆలోచన విధానాన్ని మార్చుకోవాలన్నా సంకల్పంతోనే పద్మజా మేడం గారితో మాట్లాడాను. అక్కడ నాకు వచ్చిన అవకాశాన్నిఅలా సద్వినియోగం చేసుకున్నాను. ఏదైనా అవకాశం వస్తే ఎక్కడ వచ్చినా మంచి విషయం ఎక్కడ ఉన్నా అటు వెళ్లిపోతూ ఉంటాను.
నా ప్రాణ స్నేహితురాలు సలహాలు సూచనలు:
ఈ విషయంలో నా ప్రాణ స్నేహితురాలు నన్ను ఎప్పటికప్పుడు ఈ విషయం ఇలా ఆలోచించకూడదు ఇలా ఆలోచించాలి చూడు అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటూ ఒక విషయంపై ఎన్ని రకాలుగా ఆలోచించవచ్చో అన్ని రకాలుగా ఆలోచించమని నాకు సలహాలు సూచనలు ఇస్తూనా ఆలోచన విధానాన్నిసక్రమంగా మార్చుకొనే మార్గాలను సూచిస్తుంది. ఏ జన్మ పుణ్యమో గాని ఇంత గొప్ప స్నేహితురాలు దొరకడం నా అదృష్టం.
ఇలా సఖి కార్యక్రమంలో వచ్చే అన్ని కార్యక్రమాలు చాలా శ్రద్ధగా చూసి అందులో వచ్చే విషయాలు అన్నీ తెలుసుకునేదాన్ని.


డిగ్రీ కాలేజీ స్నేహితులు
నాన్న ప్రోత్సాహం:
ఈ విషయంలో నాన్న నన్నుచాలా ప్రోత్సహించారు. త్వరగా వంట పని ఇంటి పనులు పూర్తిచేసే క్రమంలో నాన్న నాకు చాలా సహాయం చేసేవారు, ఇంటి పనులలో వంట పనులలో. నాన్న ఓపికకు చేతులెత్తి మొక్కినా, ఏమి చేసినా నాన్న రుణం తీరదు. ఇలా 11 సంవత్సరాలు చీరల మీద బ్లౌజుల మీద ఎంబ్రాయిడరీ చేస్తూ పెద్దగా కాకపోయినా ఎంతో కొంత వేడినీళ్ళకు చన్నీళ్లు తోడన్నట్లు సంపాదించేదాన్ని.
వడ్డీలకు ఇచ్చిన అసలు వెనక్కు రావడం:
ఇలా ఉండగా తాత ఇచ్చిన డబ్బులు చిన్న అత్త మామయ్య వాళ్లకు తెలిసిన వాళ్లకు వడ్డీలకు ఇచ్చిఉన్న క్రమంలో ఒక్కొక్కరు వెనక్కు అసలు ఇవ్వసాగారు. అప్పుడు నెలకు వచ్చే వడ్డీ తగ్గిపోయింది. దీనితో ఇంటి బాడుగ ఇంటి ఖర్చులకు డబ్బు తక్కువ పడేది. దానితో నాన్న అవసరాన్ని బట్టి అసలు తీసి వాడసాగాడు. దానితో కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అన్న సామెత రుజువు అయింది. దగ్గరగా ఉన్నది చిన్న అత్త మామయ్య కాబట్టి నాన్న పడుతున్న కష్టం చూసి అందరూ మాట్లాడుకొని పెద్ద చిన్నాన్నకు తెలుపగా మా కోసం సొంత ఇల్లు చూడమని మామయ్యకు చెప్పారు.
పెద్ద చిన్నాన్న మా కోసం ఇల్లు కొనడం:
చిన్నాన్న చెప్పిందే తడవుగా చిన్న అత్త భర్త మామయ్య ఇల్లు వెతకడం నుంచి మేము చిన్నాన్న కొన్న సొంత ఇంటిలోకి మారేవరకు దీనికి సంబంధించిన పనులు అన్నిమామయ్యే చూశారు. కొత్త ఇంట్లో నాకు సౌకర్యంగా ఉండడం కోసం సదుపాయాలన్నీ ఏర్పాటు చేశారు మామయ్య. పెద్ద చిన్నాన్న పిన్నమ్మ వాళ్లు మా కోసం కొన్న కొత్త ఇంట్లో గృహప్రవేశం చేశారు. ఈ గృహప్రవేశానికి కుటుంబ సభ్యులందరూ వెళ్లారు. నేను తప్ప. ఎందుకంటే అప్పటికే నాన్న నన్ను ఎత్తుకోవడం కష్టమైపోయింది. అందువల్ల నేను ఆ రోజు బాడుగ ఇంట్లోనే ఉండిపోయాను.
నాన్న నన్ను ఎత్తుకోగలిగినన్ని రోజులు తిప్పి చూపించిన క్షణాలు:
నాన్న నన్ను ఎత్తుకోగలిగినన్ని రోజులు ప్రతి ఒక్క శుభకార్యానికి – చిన్నాన్నల పెళ్లిళ్లు, పెద్దత్త పెద్ద కుమారుడి పెళ్లి, రెండవ కుమారుడి ఉపనయనానికి ఇంకా శబరిమల వెళ్ళినప్పుడు పుణ్యక్షేత్రాలు, తిరుపతిలో దేవాలయాలు, సినిమాలకు అన్నిచోట్లకు తీసుకెళ్లి చూపించాడు నాన్న. నాన్న గురించి చెప్పాలంటే నా జీవితం సరిపోదు. ఏ జన్మ పుణ్యఫలమో కాని ఇంత గొప్ప తండ్రికి బిడ్డగా పుట్టినందుకు నేను చాలా అదృష్టవంతురాలిని. తొమ్మిదవ తరగతి నుంచి డిగ్రీ అయ్యేవరకు పాఠశాలకు, కళాశాలకు ఎత్తుకొని తీసుకుని వెళ్లేక్రమంలో ఎంత అలసిపోయేవారో చెప్పడానికి సాధ్యం కాదు. కళాశాలలో నన్ను నా పుస్తకాల సంచిని ఎత్తుకొని రెండు అంతస్తులు ఎక్కేవారు.
ఈ విధంగా నాన్న తన జీవితం మొత్తం నా కోసం త్యాగం చేశారు. ఎపుడైనా నాకు ఆరోగ్యం బాగా లేకపోతే నన్ను ఎత్తుకోగలిగినన్ని రోజులు హాస్పిటల్‌కు నాన్నేస్వయంగా ఎత్తుకొని వెళ్లేవారు. ఇలా నాన్న ఎంత చేసేవారో. ఇక పెద్ద చిన్నాన్న పిన్నమ్మ కొత్త ఇంట్లో గృహప్రవేశం చేసి అయిన తర్వాత ఒక రెండు మూడు నెలల వరకు ఏవో కారణాలవల్ల మేము ఇల్లు మారలేదు. బాడుగ ఇంటిలోనే ఉండినాము.
బాడుగ ఇల్లు నాకు ఎంబ్రాయిడరీ ఆర్డర్లు:
అక్కడ నాకు ఎంబ్రాయిడరీ చేయడానికి చీరలు బ్లౌజులు ఆర్డర్లు బాగా వచ్చేవి. ఇంటి పనులన్నీ పూర్తిచేసుకుని రాత్రి పొద్దుపోయే వరకు పనిచేసి మరల వేకువ జామునే లేచి వంట పని పూర్తిచేసి మళ్లీ పని ప్రారంభించేదాన్ని.
ఆర్థికంగా వెనుకబడిన వాళ్లకు పని కల్పించాలన్న ఆలోచన- ప్రయత్న విఫలం:-
అప్పట్లో నాకు ఒక ఆశ ఉండేది. అదేమంటే నేను పని చేస్తూ బాగా ఆర్థికంగా వెనుకబడిన వారికి కొంత పని కల్పించాలన్న ఆలోచన ఉండేది. నేను పని చేయించుకొని ఇచ్చే డబ్బు వాళ్ళ జీవనానికి కొంతవరకైనా ఉపయోగపడాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. అటు దిశగా కొంత ప్రయత్నం కూడా చేశాను. కొంత అని చెప్పేదాని కన్నా శక్తివంచన లేకుండా ఆ విధంగా కనిపించిన పని వాళ్ళకు కూరలు అమ్మేవాళ్ళకు నేను ఉచితంగా ఎంబ్రాయిడరీ నేర్పిస్తాను, నాకు వచ్చే ఆర్డర్లలో మీకు కూడా ఇచ్చికొంత పనిని కల్పిస్తాను అని చెప్పి చూశాను చాలామందికి. కానీ ఎవరు ఆసక్తిని వ్యక్తపరచలేదు. మూలపేటలో ఉన్నన్ని రోజులు ఈ విధంగా పని నేర్చుకొని చేయడానికి వచ్చేవాళ్లు ఎవరు దొరకలేదు నాకు. నేను చెప్పినప్పుడు వస్తాము అని చెప్పేవాళ్ళు కానీ ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఎంత ప్రయత్నించానో ఫలితం లేకపోయింది. కానీ విషయం వదిలేయలేదు. ప్రయత్నిస్తూనే ఉండినాను. ఆర్డర్లు బాగా వచ్చేవి కానీ ఆదాయం పెద్దగా ఉండేది కాదు. శారీరక బలం నాకు తక్కువ కదా అందువల్ల నేను గబగబా కుట్టలేను. అంతేకాక హడావిడిగా పూర్తిచేసే పని కూడా కాదు. నిదానంగా చేయాలి. చేసిన పని సవ్యంగా వుండాలి. కాబట్టి నేను నిదానంగా చేసేదాన్ని. అందుకే నాకు ఆదాయం తక్కువ వచ్చేది. గబగబా చేసే వాళ్ళకు ఆదాయం ఉంటుంది. నాకు అంత శక్తిలేదు కాబట్టి నిదానంగా చేసేదాన్ని.
నాకు శక్తి లేకపోయినా ఏదో చేయాలి, ఎంతో కొంత సంపాదించాలి అన్న ఆలోచన, తపన వల్ల అది చేసేదాన్ని. నాకు ఆర్డర్లు ఇచ్చే ఖాతాదారులు నేను చీరల మీద బ్లౌజుల మీద చేస్తున్న ఎంబ్రాయిడరీ పని చాలా బాగుందని మెచ్చుకునేవారు.
కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు:
ఆ బాడుగ ఇంట్లో ఉన్నప్పుడే నాన్న కొంచెం బలవంతంగా అయినా ఎత్తుకోగలిగే సమయంలో చిన్న అత్త వాళ్ళ ఇల్లుమా ఇంటికి రెండు వీధుల అవతలనే. ప్రతిరోజు నాన్న సాయంత్రం అయితే చిన్న అత్త వాళ్ళ ఇంటికి వెళ్లి ఒక అరగంటసేపు కూర్చొని వాళ్లతో మాట్లాడి ఇంటికి వచ్చేవారు. ప్రతిరోజు వెళ్లక పోతే నాన్నకు తోచేది కాదు. చిన్న అత్త పిల్లలు నాన్నకు బాగా దగ్గరైపోయారు. నాకేమో పెద్ద అత్త తో కానీ చిన్న అత్తతో కానీ ప్రతిరోజు ఫోన్లోమాట్లాడకపోతే తోచేది కాదు. ఎక్కువ శాతం వాళ్లేఫోన్ చేసే వాళ్ళు. పెద్ద చిన్నాన్న కూడా 10, 15 రోజులకు ఒకసారి ఫోన్లో మాట్లాడేవారు. అలాగే చిన్న అత్త భర్త మామయ్య వాళ్ళ అక్క అప్పుడప్పుడు మన ఇంటికి వచ్చినాకు నాన్నకు ఇంటి పనిలో వంట పనిలో చాలా సహాయం చేసేది. ఇదంతా ఎందుకు రాశానంటే నానమ్మ తాతయ్యవాళ్ళు చనిపోయిన తర్వాత చిన్నాన్నలు మేనత్తలు నాన్నను నన్నుపట్టించుకోకపోతే మేము ఏమైపోయే వాళ్ళము అని తలుచుకుంటే చాలా భయమేస్తుంది. కష్టపడి కని పెంచి విద్యాబుద్ధులు చెప్పించి ఒకదారి చూపిన కన్న తల్లిదండ్రులనే సొంత పిల్లలు పట్టించుకోని రోజులు కదా ఇవి. ఇలాంటి రోజుల్లోకూడా ఇలాంటి గొప్ప వాళ్ళు ఉన్నారని చెప్పడం కోసం ఇలా రాశాను. ఏ జన్మ పుణ్యఫలమో కానీ ఈ విషయంలో నాన్న, నేను చాలా అదృష్టవంతులం.


లెక్చరర్లు డా. కాళిదాసు పురుషోత్తం గారు, శ్రీ మాచవోలు శివరామ ప్రసాద్ గార్లతో, మా ఇంట్లో
కుడి కాలుకు సమస్య:
ఈ క్రమంలో ఒకరోజు సాయంత్రం నేను ఎంబ్రాయిడరీ పని చేసుకుంటూ ఉండగా నాన్న చిన్న అత్త వాళ్ళ ఇంటికి వెళ్లారు. నేను మంచం మీద కూర్చొని ఎంబ్రాయిడరీ పని చేసుకుంటున్నాను. ఉన్నట్టుండి కుడికాలు నొప్పి ప్రారంభమైనది. ఏదోలే కొంచెం పని ఎక్కువైనందువల్ల నొప్పి వస్తోంది ఏం కాదు అని ధైర్యం తెచ్చుకొని నా పని నేను చేసుకోసాగాను. కానీ నొప్పి భరించలేనంతగా ఎక్కువైపోయింది. చలి జ్వరం కూడా వచ్చేసింది. బాగా ఎక్కువ అయిపోయింది. నాన్న వచ్చేసరికి పడుకొని వణికిపోతున్నాను. అప్పుడు నాన్న వచ్చిఏవో మాత్రలు వేశారు. అప్పటి ఇంటి యజమానురాలు గవర్నమెంట్ హాస్పిటల్ హెడ్ నర్స్. ఆమెను పిల్చుకుని వచ్చి చూపించాడు నాన్న. ఆమె కూడా ఏవో మందులు ఇచ్చింది. వాడాము. చలి జ్వరం తగ్గింది. కానీ కాలి నొప్పి తగ్గలేదు. నొప్పి భరించలేనంతగా ఉంది. పక్క రోజు మామయ్య వాళ్ళ అక్క వచ్చారు. నా కాలు చూపించాను. అప్పుడు ఆమె చూడగా కాలు ఎర్రగా కమిలిపోయినట్టుగా ఉండినది. ఏవో పాత కాలపు వైద్యాలు చేసింది మామయ్య వాళ్ళ అక్క. మామయ్య వాళ్ళ అక్కను నేను అత్త అని పిలుస్తాను. వైద్యం వల్ల ఎర్రగా ఉండడం వాపు తగ్గింది కానీ నొప్పిపూర్తిగా తగ్గలేదు.
డాక్టర్ రామిరెడ్డిగారి చికిత్స:
అప్పుడు మామయ్య గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామిరెడ్డిగారి దగ్గరకు తీసుకెళ్ళమని నాన్నకు సలహా ఇచ్చారు. రామిరెడ్డి డాక్టర్ గారు వాళ్ళ ఇంటి దగ్గరే ప్రైవేట్ ప్రాక్టీస్. నాన్న డాక్టర్ గారి దగ్గరకు నన్ను తీసుకెళ్లాడు అతి కష్టం మీద. ఆ డాక్టర్ గారు ఏవో టెస్టులు చేసి ఈ అమ్మాయికి భవిష్యత్తులో రక్త పోటు, చక్కెర వ్యాధి వచ్చేఅవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి ఇది సూచన అని చెప్పారు. అప్పుడే నాకు నిద్ర మాత్రలు కూడా రాసి ఇచ్చారు. నిద్ర మాత్రలు వేసుకుంటే కానీ నాకు నిద్ర వచ్చేది కాదు. అప్పటివరకు నిద్ర మాత్రల అలవాటు లేదు. కానీ కొన్నినెలల నుంచి నిద్ర సరిగా పట్టేది కాదు. ఏవో ఆలోచనలు, భవిష్యత్తు గురించి తెలియని విపరీతమైన దిగులు, భయం. నాన్న కష్టపడి చదివిస్తే ఉద్యోగం చేయలేకపోయాను అన్న బాధ నన్ను నిరంతరం తొలచివేస్తోంది. భవిష్యత్తు గురించి ఎంత దిగులో ఎలా గడుస్తుందో తెలియదు ఆ బాధ నాకు ఎంత పెద్దగా ఉంటుందో చెప్పలేను. అలాగని నా దగ్గర డబ్బులేదని ఎవరిని చేయి చాచి అడిగే మనస్తత్వం నాకు లేదు. ఏ రోజు పూర్తి సంతోషం లేదు. ఎప్పుడు ఏదో ఒక దిగులు. ప్రశాంతత లేని జీవితం. ఇక నాన్న ఎలా ఉండేవాడో పైకి కనపడడు.
నా కోసం నాన్న:
నా కోసం నాన్న నా చిన్నప్పుడే, ఇందిరా గాంధీ గవర్నమెంటు ఉన్నప్పుడే వికలాంగుల పెన్షన్ కోసం అప్లైచేశాడు. అప్పటినుంచి నాకు వికలాంగుల పెన్షన్ వస్తూ ఉన్నది. ఎందుకో తెలియదు కానీ నాకు అలా పెన్షన్ తీసుకోవడం ఇష్టం లేదు. కానీ తప్పలేదు. ఈ మాట నేను ఎవరితో అయినా అంటే అందరూ నన్ను తిట్టేవాళ్ళు. కష్టపడి సంపాదించింది ఒక్క రూపాయి అయినా చాలా సంతోషంగా ఉంటుంది అని అనిపిస్తుంది నాకు. కానీ ఏం చేస్తాను భగవంతుడు నాకింతే ఇచ్చాడు. మూలపేట వచ్చిన తర్వాత నాన్నకు కూడా వృద్ధాప్య పెన్షన్ వచ్చేది. నాన్న ఈ పెన్షన్లు వస్తున్నందుకు చాలా సంతోషపడేవాడు. ఏదో వేడి నీళ్లకు చన్నీళ్లు తోడు అని. వీటి కోసం కష్టపడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగాడో లెక్కలేదు. ఇదైనా వస్తున్నందుకు నాన్న సంతోషించేవాడు. ఇప్పుడే కాదు నా చిన్నప్పటి నుంచి రైల్వేపాస్, బస్సుపాస్ కోసం ఇంకా వికలాంగుల ధ్రువీకరణ పత్రం కోసం కానీ నన్ను పాఠశాలలో, కళాశాలలో చేర్చడానికి కానీ ఆ ధ్రువీకరణ పత్రం ఈ ధ్రువీకరణ పత్రం అంటూ ప్రతిదాని కోసం ఎండ వాన అని చూసుకోకుండా వేళకు ఆహార పానీయాలు తీసుకోకుండా అవసరాన్ని బట్టి నన్ను ఎత్తుకొని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగి ఉంటాడో చెప్పడానికి సాధ్యం కాదు.
ఎంబ్రాయిడరీ బిజినెస్ – రోహిణి సహకారం:
నా స్నేహితురాలు రోహిణి చేతి ఎంబ్రాయిడరీ చేస్తానని తనకు తెలిసిన వాళ్ళకందరికీ చెప్పి ఆర్డర్లు ఇప్పిచ్చేది. నా ఎదుగుదలకు నాన్నతో పాటు రోహిణి కూడా ముఖ్యురాలు. ఈ క్రమంలో ఒకసారి నెల్లూరు వి.ఆర్. కాలేజ్ రిటైర్డ్ అధ్యాపకులు అయిన మధుసూదన రెడ్డి సార్, వారి సతీమణి పుష్ప ఆంటీ రోహిణికి బాగా సుపరిచితులు. నేను చేతి ఎంబ్రాయిడరీ చేస్తానని రోహిణి చెప్పగా ఆ ఆంటీ నా పనితనం చూడకుండానే ఒకేసారి మూడు చీరలు తీసుకొని వచ్చి ఎంత సమయం అయినా తీసుకో వీటికి ఎంబ్రాయిడరీ చేసి పెట్టు అని మూడు చీరలు ఆర్డర్ ఇచ్చింది. ఎవరైనా ముందు నా దగ్గరికి వచ్చినా పనితనం చూచి కానీ ఆర్డర్లు ఇచ్చేవాళ్ళుకాదు. అలాంటిది పుష్పా ఆంటీకి నా పనితనం మీద రోహిణి నమ్మకం కలిగించినందుకు నాకు చాలా సంతోషమైనది. ఎందుకో తెలియదు కానీ ఆమెకు నేనంటే చాలా అభిమానం. ఇప్పటికీ కూడా ఫోన్ చేసి ఎలా ఉన్నావు అమ్మాఅని మాట్లాడుతుంది. నేను చేస్తున్న పని కారణంగా ఇంకా కొంతమంది పెద్దవాళ్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆర్డర్లు ఇచ్చేవాళ్ళు వాళ్లే స్వయంగా వచ్చితీసుకుని వెళ్లేవాళ్ళు.


లెక్చరర్లు డా. కాళిదాసు పురుషోత్తం గారు, వారి స్నేహితులు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అవధానం రఘు కుమార్ గార్లతో, మా ఇంట్లో, నేనూ, రోహిణి
రోహిణి తమ్ముడు కృష్ణ పెళ్లి – కృష్ణ, డాక్టర్ గారు (రోహిణి భర్త) నాకు చక్రాల చెక్కపీట చేయించడం:
మూలపేటలో ఉన్నప్పుడే నాన్న నన్నుఎత్తుకోవడం కష్టమైపోతున్న సమయంలోనే రోహిణి వాళ్ళ తమ్ముడి వివాహం నిశ్చయమైంది. ఆ వివాహానికి నాన్నను నన్నుతప్పక రమ్మని రోహిణి, రోహిణి భర్త గారైన డాక్టర్ కృష్ణ గారు ఇద్దరు వచ్చి పిలిచారు. మా కోసం ఆటో పంపించింది. కళ్యాణ మండపానికి వెళ్ళినాక రోహిణి వాళ్ల అక్క భర్త అయినా బావగారు ఇంకా వాళ్ళ బంధువులు ఆటో వద్దకు వచ్చిఆటోలో నుంచి తీసి నన్నుకుర్చీలో కూర్చో బెట్టి కళ్యాణ మండప వేదిక మీద నన్ను కూర్చోబెట్టినారు. వివాహానికి కొన్నిరోజుల ముందు రోహిణి వాళ్ళ బావగారికి ప్రమాదము జరిగి కాలుకు సమస్య వచ్చిఉండింది. అప్పట్లోఆయన బరువులు ఎత్తకూడదు. అయినా సరే నన్ను ఎత్తిపెట్టడంలో బావగారు సహాయం చేశారు. నాకు చాలా భయమేసింది ఆయనకేమన్నాఅవుతుందేమో నా వల్ల అని. వివాహానికి వెళ్లి తప్పు చేశానేమో అనిపించింది. ఎంత బాధపడినా ప్రయోజనం లేదు కదా వాళ్లను ఇబ్బంది పెట్టాను. ఇదంతా కృష్ణ డాక్టర్ గారు కళ్ళారా చూశారు. అప్పటికే నాన్న ఎత్తలేకపోతున్నాడని డాక్టర్ గారికి తెలుసు. అందుకని నా కోసం చెక్కతో కుర్చీలాగా కిందకు ఉండేది, చక్రాలు ఉండేది చేయించారు వడ్రంగి చేత. ఇది నాకు చాలా ఉపయోగపడింది. ఇంటిలో ఉన్నప్పుడు కూడా ఒక గది లో నుంచి ఇంకొక గదిలోకి వెళ్లడానికి బాగా ఉపయోగపడింది. నేను దాని మీద కూర్చుంటే నాన్న నెట్టుకుంటూ వెళ్లేవారు. అప్పుడు నన్నుఒక గదిలో నుంచి ఇంకొక గదిలోకి ఎత్తుకొని తీసుకొని వెళ్లే శ్రమ తగ్గింది. రోహిణి, డాక్టర్ గారు నాకు చేస్తున్న సహాయం ఇంత అంతా కాదు. వంట కూడా దాని మీదే కూర్చొని చేసుకునే దాన్ని. మంచం మీద మాత్రం నాన్న ఎత్తి కూర్చోపెట్టేవారు.
కొత్త కొత్త డిజైన్ల కోసం వెతుకులాట:
నేను అప్పుడు చేతి ఎంబ్రాయిడరీ చేస్తూ ఉండినాను కదా ఆ క్రమంలో ఈటీవీ 2 సఖీ కార్యక్రమంలో చూపించే డిజైన్స్ మాత్రమే కాదు ఇంకా డిజైన్స్ కోసం ఏ కార్యక్రమంలో చూపిస్తారా అని వెతికాను. అప్పుడు ఈటీవీ 2 ఛానల్లోనే రాత్రి పదిన్నరకు సిటీ లైఫ్ అనే కార్యక్రమం వచ్చేది. రకరకాల షాపింగ్ మాల్స్‌లో చీరల మీద డిజైన్స్, ఇంకా ఎక్కడెక్కడో జరిగే ఎగ్జిబిషన్లలో పెట్టిన డిజైన్స్ ఒక సెకండ్ అలా చూపించి తీసేసేవారు. నేను ఆ సెకండ్ లోనే ఆ డిజైన్ ఎలా కుట్టారో కనిపెట్టేదాన్ని. పక్క రోజు ఆ డిజైన్ ఒక గుడ్డ మీద కుట్టేసేదాన్ని.
సిటీ లైఫ్ ప్రోగ్రాం చేసిన పెద్ద మేలు:
ముఖ్యంగా ఈ డిజైన్ల కోసమే నేను ఈ కార్యక్రమం చూసేదాన్ని. కానీ ఈ కార్యక్రమం నాకు ఒక పెద్ద మేలు చేసింది. అదేమంటే ఒకరోజు ఆవిరి స్నానంకు సంబంధించిన ఒక చక్రాల కుర్చీలాంటిది దాంట్లోకూర్చుని ఒంటికి పట్ట చుట్టుకొని కూర్చొని స్విచ్ నొక్కితే ఆవిరి వచ్చిఆవిరితో శరీరం శుభ్రపరచుకొనే యంత్రం చూపించారు. ఈ చక్రాల కుర్చీమీద కూర్చొని బటన్ నొక్కితే కూర్చున్న సీటు పైకి కిందికి అడ్జస్ట్మెంట్ చేసుకునే సౌకర్యం ఉంది ఈ చక్రాల కుర్చీకి. దానిని చూడగానే నాకు ఆలోచన వచ్చింది. నాకు ఇలా స్విచ్ నొక్కితే పైకి కిందికి ఎటు తిప్పితే అటు తిరిగే సౌకర్యం ఉండే కుర్చీకావాలి అప్పుడే నేను నాన్న మీద ఆధారపడకుండా నా పనులు నేనే సొంతంగా చేసుకోగలను అన్న దృఢనమ్మకం కలిగింది. ఎలాగైనా అలాంటి కుర్చీకావాలని దృఢంగా నిశ్చయించుకున్నాను. అంతే చిన్న అత్త మామయ్య వాళ్లకు మా చిన్నాన్న వాళ్ళకు పెద్దత్త వాళ్లకు అందరికీ నాకు ఇలాంటి సౌకర్యం ఉండే కుర్చీఉంటే నా పనులు నేను చేసుకోగలను నాన్నను శ్రమ పెట్టకుండా అని చెప్పాను. అందరూ చూస్తాము అని చెప్పారు. అందరూ చాలా రోజులు వెతికారు. ఎక్కడ అలాంటి సౌకర్యం ఉండే కుర్చీ దొరకలేదు.
నాలో నిరాశతో కూడిన ఆలోచనలు:
చాలా నిరాశ పడ్డాను. కష్టమో నష్టమో జీవితం అలానే సాగించాల్సి వస్తోంది. ఇక నా పనిలో నేను నిమగ్నమైనాను. వీల్ చైర్ గురించి ఆలోచన మానేశాను. టీవీలో సఖి ప్రోగ్రాంలో చెప్పేకొత్త కొత్త ఎంబ్రాయిడరీ డిజైన్లు ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ నాకు వచ్చిన ఆర్డర్లను చేస్తూ ఇంటి పనులు చూసుకుంటూ ఉండిపోయాను. నాన్న ఇంటి పనులలో నాకు చాలా సహాయం చేసేవారు. అప్పుడు నేను చేతి ఎంబ్రాయిడరీ చేస్తున్నాఏదో ఒక పని దొరికింది. అందులో నిమగ్నమై అది సక్రమంగా చేసుకుందాం అని తృప్తిచెందకుండా ఈ చేతి ఎంబ్రాయిడరీలో ఎంత సంపాదించగలను భవిష్యత్తు ఎలా జరుగుతుంది, నా పనులు నేను చేసుకోలేకపోతే ఎవరినైనా మనిషిని పెట్టుకుని చేయించుకునే స్తోమత అవకాశం కోల్పోయాను, అదే చదువుకొని కూడా ఉద్యోగం చేయలేకపోయాను, ఉద్యోగం చేసి ఉంటే నేను కోరుకున్నట్టునా జీవితం ఉండేది అనే నిరాశతో దిగులు పెట్టుకొని జ్వరం తెచ్చుకున్నాను.
డాక్టర్ శేషారెడ్డిగారు – ప్రోత్సాహకరమైన మాట:
అప్పుడు నెల్లూరు శ్రీరామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాలలో బాగా పేరు హస్తవాసి గల శేషారెడ్డి డాక్టర్ గారి దగ్గరకు నాన్న నన్ను తీసుకొని వెళ్లారు. అప్పుడు ఆ డాక్టర్ గారు ఏవో పరీక్షలు చేసి మందులు ఇస్తాను తగ్గిపోతుంది అన్నారు. అప్పుడు నాన్న ఊరుకోకుండా నేను పడుతున్న ఆవేదన గురించి డాక్టర్ గారికి చెప్పారు. అప్పుడు శేషారెడ్డి డాక్టర్ గారు, “అమ్మా, (failures are the stepping stones for success) ‘అపజయమన్నది విజయానికి సోపానం’ ఒకసారి అనుకున్నది జరగలేదు అని నిరుత్సాహ పడకూడదు. ఈరోజు ఇది చేయలేకపోతే ముందు ముందు దీనికంటే మంచి అవకాశాలు వస్తాయి .ఇంతటితోనే జీవితం అయిపోలేదు. ముందు ముందు ఎంతో భవిష్యత్తు ఉంది. ఎంతో సాధించాల్సింది ఉంది. కష్టే ఫలీ, కృషితో నాస్తి దుర్భిక్షం. పట్టుదలతో మనకొచ్చిన అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలి. వచ్చిన అవకాశాలను ఎలా సద్వినియోగపరచుకోవాలో ఆలోచించాలి. ఆ దిశగా మన ప్రయాణాన్నిసాగించాలి. ఇది తెలుసుకొని సాధన చేస్తే అవకాశాలు విజయం వాటంతట అవే వస్తాయి. ఇది గుర్తుపెట్టుకొని వీటిని ఆచరణలో పెట్టి విజయాన్నిసాధించు” అని చెప్పారు. డాక్టర్ గారు చెప్పిన మాటలు నాకు చాలా సంతోషాన్నికలిగించాయి. ఏ పని చేస్తున్నా ఈ మాటలు మనసులో పెట్టుకొని ఆచరించాలి అని పలుమార్లు అనుకుంటూ పనిచేసుకుంటూ ఉండేదాన్ని. ఇంకా ఏమైనా అవకాశం వస్తే వదలకూడదు అని దృఢ సంకల్పంతో ముందుకు సాగిపోవాలని నిశ్చయించుకున్నాను.
(ఇంకా ఉంది)
92916 35779
prasunasuram@gmail.com