36మంది కథకులు తమకు నచ్చిన తమ కథలను ఎన్.కె.బాబు సంపాదకత్వంలో ఒక పుస్తకంలా వెలువరించారు, ‘నాకు నచ్చిన నా కథ-3’ రూపంలో.
సంపాదకులుగా ఎన్.కె.బాబు , కథకులు మెచ్చిన స్వీయ కథలను సంకలనం చేసిన మూడవ పుస్తకం ఇది. వివిధ డిజిటల్ మాధ్యమాలలో ఎన్ని రచనలు ప్రచురించినా అచ్చు పుస్తకంలో చూసుకోవటాన్ని మించిన ఆనందం లేదన్నది నిర్వివాదాంశం. అయితే తెలుగు సాహిత్యాన్ని కబంధ హస్తాలతో పట్టి బంధించిన సాహిత్య మాఫియా ముఠాల వల్ల అందరు తమ కథలను సంకలనాలలో చూసుకునే వీలు లేకుండా పోతోంది, ఉత్తమమైన, నాణ్యమైన రచనలు చేసి కూడా. దాంతో తమ ఉత్తమ రచనలు సజీవంగా నిలుపుకుని పాఠకులకు అందించే బాధ్యత కూడా ఈనాడు రచయిత పైనే ఉంది. ఎన్.కె బాబు లాంటి కొందరు సాహిత్యాభిమానులు రచయితలను కూడగట్టుకుని వారి కథలను పాఠకులకు సంకలనం రూపంలో చేరువ చేసే ప్రయత్నం చేయటం అభినందనీయం, అవశ్యకం. అలా ఇది మూడవ సంకలనం కావటం ఈ సంకలనాల ప్రాధాన్యాన్ని, ప్రాచుర్యాన్ని స్పష్టం చేస్తుంది.
లబ్ధప్రతిష్ఠులయిన రచయితలు, వర్ధమాన రచయుతలు ఒకే వేదిక మీద కథలను పంచుకోనే వీలునిస్తుందీ సంకలనం. పాఠకులకు రచయితల విభిన్న శైలీ, శిల్పాలలో వైవిధ్యాన్ని పోల్చుకునే వీలునిస్తూ, పాతతరం రచయితలకు కొత్తతరం రచయితల ఆలోచన ధోరణులను, కొత్త తరం రచయితలకు పాతతరం రచయితల వైశిష్ట్యాన్ని తెలుసుకునే వీలునిస్తాయి ఇలాంటి సంకలనాలు. ఇందులోని కథలన్నీ చక్కటి కథలు. ఉత్తమ స్థాయిలో ఉన్న కథలు. విభిన్న జీవన స్థితిగతులను, సామాజిక సమస్యలను మనస్తత్వాలను ప్రదరిస్తాయీ కథలు.
‘నాయకుడనే వాడికి ఆదర్శం ఎంత ముఖ్యమో సహనం, ఓర్పు అంత ముఖ్యం’ అని చెప్పిన కథ అడపా రామకృష్ణ కథ ‘తలచినదే జరిగినదా’. సంపాదన మీద ధ్యాస పెట్టి పిల్లవాడి చదువును విస్మరించిన తల్లిదండ్రుల కథ అంగర వెంకట శివప్రసాదరావు కథ ‘సగటు మనిషి’. నీళ్లు లేక మరణించిన మనిషి కథ బళ్ళా షణ్ముఖరావు రాసిన ‘బలి!’. ‘లాండ్ పూలింగ్’ను వ్యంగ్యంగా, వ్యథాభరింతంగా చూపిన కథ ‘పూలింగ్’. రచించినది బొడ్డ కూర్మారావు. దారి తప్పిన కళ పర్యవసానాన్ని చూపుతుంది దాట్లదేవదానం రాజు కథ ‘దీపం కింద నీడ’.
పెళ్లి చేసుకున్న వారు అనుభవించేదేమిటన్న శేష ప్రశ్నను అడుగుతుంది దేవరాజు రవి కథ ‘శేష ప్రశ్న’. పగిలిన తరువాత కూడా నిజం చెప్పే అద్దం కథ డా. డి.వి.జి. శంకరరావు రచించిన ‘అద్దం’. మానవత్వం ఉన్న మనిషి అంతరించి పోతున్న జాతి అని అలాంటి వారిని కాపాడాలి అన్న చేదు నిజాన్ని హృద్యంగా చెప్తుంది ఎమ్. సుగుణరావు కథ ‘జీవజాతి’.
అవమానకరమైన సన్మాన పత్రంతో హాస్యాన్ని సృష్టిస్తూ చేదు నిజాన్ని నవ్విస్తూ చెప్పిన కథ ఎమ్.వి.జె. భువనేశ్వర్ రాసిన ‘సుబ్బారావుకి సన్మానం’ కథ. కాకులు ఇంట్లో ప్రవేశించటం ఆధారంగా మూఢనమ్మకాలని, వాటిని విమర్శించే హేతువాదులను ఆట పట్టిస్తారు మూల రవికుమార్ ‘వాయసగండం’ కథలో. కాంపౌండ్ వాల్ రక్షణ ప్రతీక అన్న అర్ధాన్నిస్తూ జి.వి.శ్రీనివాస్ రాసిన కథ ‘కాంపౌండ్ వాల్’. పర నింద చేసిన వాడికే తగులుతుందని చెప్తుంది గంగాధర్ వడ్లమాన్నాటి కథ ‘పర నింద’.
కరోనా కన్నా ఘోరమైన మహమ్మారి మద్యం అని నిరూపిస్తుంది కె.వి.యస్ ప్రసాద్ కథ ‘ఈ పాపం ఎవరిది?’. సెంటిమెంటు ప్రాక్టికాలిటీల నడుమ ఘర్షణను చూపుతుంది కూర చిదంబరం కథ ‘వైచిత్రి’. వర్షాకాలంలో వాన రావటం ఎంత ప్రాకృతికమో, ప్రతి సంవత్సరం వానతో వచ్చే తీరని సమస్యలూ అంతే స్వాభావికం అని చూపుతుంది ఎన్.కె.బాబు కథ ‘వాన’. పి.సాంబశివరావు కథ ‘దిక్కుల్లేనివాడు’ వాస్తుపై విసురు. మాండలికంను మంచిగా పండించిన కథ పత్తి సుమతి కథ ‘బెమ్మరాత’. ‘తలాక్’ వ్యతిరేక చట్టం వల్ల లాభాన్ని ప్రదర్శిస్తుంది పాణ్యం దత్తశర్మ కథ ‘యత్ర నార్యస్తు పూజ్యంతే!’. బాత్రూమ్ లేని పోలీసు స్టేషన్లో ఆడ కానిస్టేబుల్ బాధను, దాన్ని ఆమె పరిష్కరించిన విధానాన్ని తెలుపుతుంది రిషి శ్రీనివాస్ కథ ‘నక్షత్రాలు లేని నేల’. రజని సుబ్రహ్మణ్యం కథ ‘తిరగని మలుపు’ ఒక మహిళ అంతరంగ వేదనను ప్రదర్శిస్తుంది.
అధునిక వైద్య పద్దతిలోని డొల్లతనాన్ని చూపుతుంది మేడ మస్తాన్ రెడ్డి కథ ‘వాహిక’. ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయ స్వరూపం చూపుతుంది. మల్లిపురం జగదీష్ కథ ‘గత వర్తమానం’. మల్లాది వెంకటకృష్ణమూర్తి కథ ‘పంజరం’ చక్కగా ఉంది. మంజరి కథ ‘పుబులి’ అనూహ్యమైన రీతిలో సాగుతుంది. ప్రతి మనిషిలో కథ ఉంటుందని చెప్తుంది ఎస్.హనుమంతరావు కథ ‘నేపథ్యం’.
ప్రేమ ప్రాధాన్యాన్ని తెలుపుతుంది సలీం కథ ‘నరకకూపం’. సింహప్రసాద్ కథ ‘గోమాత’ చదవటం పూర్తయ్యేసరికి కళ్లు చెమరుస్తాయి. తమిరిశ జానకి కథ ‘చల్లని నీడ’ శాంతంగా ఉండటం ప్రాధాన్యం తెలుపుతుంది. కొత్తతరందే భవిష్యత్తు అని స్పష్టం చేస్తుంది వి.వెంకట్రావు కథ ‘కొత్తతరం’. యండమూరి వీరేంద్రనాథ్ కథ ‘సీతా… రాముడొస్తున్నాడోయ్’ అద్భుతమైన కథ.
ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నస్తుంది చింతా అప్పల్నాయుడి కథ ‘మేకలు’. ఇంకా బెహరా ఉమామహేశ్వరరావు కథ ‘సర్పదష్ట’, జక్కని గంగాధర్ కథ ‘ఆనంద బాష్పాలు’, వేగి పార్వతి సూర్యనారాయణ కథ ‘భువన విజయం’, తెలికిచర్ల రామకృష్ణ కథ ‘గుణపాఠం’ వంటివన్నీ కలసి భిన్న భిన్న వర్ణాల పుష్పగుచ్ఛంలా అనిపిస్తుందీ కథల సంకలనం.
పుస్తకం చివరిలో రచయితల పరిచయాలుండటం ముదావహం. అయితే ఇటీవల పుస్తక ప్రచురణలోని ఓ వికృత ధోరణి, రచయితల కన్నా ప్రచురణ కర్త బొమ్మ అట్ట మీద వేయటం, ప్రచురణ కర్తను గొప్పగా పరిచయం చేయటం వంటి వికృత ధోరణుల వ్యక్తిగత ప్రచార ప్రలోభంలో పడకుండా రచయితలకు, రచనలకూ పెద్ద పీట వేసి తాను నేపథ్యంలో ఒదిగిన ఎన్.కె బాబును ప్రత్యేకంగా అభినందించాల్సి ఉటుంది. చక్కని కథల సంకలనం ఇది.
***
నాకు నచ్చిన నా కథ-3 – పుస్తక పరిచయం
సంపాదకులు: ఎన్.కె.బాబు
పేజీలు: 264
వెల: ₹ 200
ప్రతులకు:
గురజాడ బుక్ హౌస్
షాప్ నెం.1, ఎన్.జి.ఓ. హోమ్
తాలుక్ ఆఫీసు రోడ్డు
విజయనగరం-1
ఆంధ్రప్రదేశ్.
Ph: 9440343479.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
కెరటాలు
అపురూపమైన అనుభూతులకు పెన్నిధి ‘చిలక్కొయ్య’
అసహనం
సంగీత సురధార-6
‘కాకతీయ యుగంలో స్త్రీల సామాజిక స్థితిగతులు – ఒక పరిశీలన’-7
నిరాశ్రయి
భక్తి పర్యటన గుంటూరు జిల్లా – 13: వజ్రాలయ్య కేతవరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి
జ్ఞాపకాల పందిరి-47
తప్పిపోయిన బిట్టు
జోనరాజ విరచిత ద్వితీయ రాజతరంగిణి – కొత్త ధారావాహిక ప్రకటన
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®