[శ్రీ రొద్దం హరి రచించిన ‘నాన్నా రియల్లీ ఐ మిస్ యు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]


“ఏవండీ తెల్లారింది లేవండి”, వంటింట్లో నుండి గిరిజ పిలుపు. ఊహూ, పిలుపు కాదది మేల్కొలుపు. ప్రక్కన అలారం మ్రోగుతున్నా కూడా లేవలేనంత మబ్బు నిద్ర నాది. ఒకొక్కసారి నాకే ఆశ్చర్యమేస్తుంది నేనేమైనా అర్ధరాత్రి పుట్టానేమోనని. కాసేపు అలాగే పడుకుండి పోయాను.
“ఎన్ని సార్లు సుప్రభాతం పాడాలండీ, ఈ రోజు మామయ్య గారి సంవత్సరీకం మీకు గుర్తుందా లేక మరచిపొయ్యారా? లేవండి, లేచి త్వరగా తెమలండి, ఇంకా చాలా పనులున్నాయి”. ఈసారి నా చెవి దగ్గర బిగ్గరగా అరిచినంత పనిచేసింది. ఉలిక్కిపడి లేచి గబగబా బాత్రూం లోకి వెళ్ళి తలుపేసుకున్నాను. నా పేరు గిరిధర్. గిరిజ నా శ్రీమతి. మాకు పెళ్ళయి దాదాపు ఇరవై ఆరు సంవత్సరాలవుతోంది.
నేను ఒక ప్రభుత్వరంగ సంస్థలో మధ్యతరగతి ఉద్యోగిగా పనిచేసి ఇటీవలే స్వచ్ఛంద పదవీవిరమణ చేశాను. మేము ముగ్గురం, నాకు ఒక చెల్లి, ఒక తమ్ముడు. అందరూ జీవితంలో బాగా స్థిరపడ్డారు. మాకు ఒక అబ్బాయి. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. నేను, గిరిజ, అమ్మ మాత్రమే అనంతపురంలో వున్నాము. చెల్లి, తమ్ముడు హైదరాబాదులో వున్నారు. ఈ రోజు నాన్నగారి సంవత్సరీకం. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నాన్నగారి సంవత్సరీకానికి ఏర్పాట్లు చేశాను. ఆబ్దికం మొదలు పెట్టాలంటే అయ్యవారు అపరాహ్న కాలం లోనే మొదలు పెట్టాలంటారు. అందుకే అందరూ చాలా నింపాదిగా నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకుని ఒక్కరొక్కరుగా స్నానాలు చేయడానికి తయారవుతున్నారు. శ్రీమతి ఇచ్చిన కాఫీ కప్పును చేతిలో పట్టుకుని ఈ రోజు దినపత్రికను తీసుకుని వసారాలో అరుగు మీద కూర్చొని చదవటానికి ఉపక్రమించాను. కాఫీ గ్లాసు ఖాళీ అయ్యేంతలో దినపత్రిక చదవడం పూర్తయ్యింది. తరువాత చొక్కా తగిలించుకుని నడక బాట పట్టాను. ఇంటినుండి బయలుదేరి అలా జాతీయ రహదారి పైకి చేరుకున్నాను. ఒక అరగంట నడక పూర్తి చేసి ఇంటికి వెళ్ళేదారిలో మహేష్ అంగడికెళ్ళి ఈరోజు కార్యక్రమానికి కావలసిన సరుకులను తీసికొని ఇంటికి చేరుకున్నాను. వసారాలో అరుగుమీద సరుకుల సంచీ వుంచి ప్రక్కనే విశ్రాంతిగా నేను కూర్చొన్నాను.
ప్రతీ సంవత్సరం నాన్నగారి సంవత్సరీకానికి అందరం కలుస్తాము. చెల్లి, తమ్ముడు వాళ్ళ కుటుంబాలతో సహా ఈ కార్యక్రమానికి వస్తారు. నాన్న గురించి గుర్తు చేసుకోవడానికి ఇదొక చక్కటి అవకాశం. అమ్మకు చెల్లిని, బావగారిని, తమ్ముణ్ణి, మరదల్నీ, మనుమళ్ళు, మనవరాండ్రనీ అందర్నీ చూస్తుంటే ఎక్కడ లేని సంతోషం. ప్రతి సంవత్సరం ఈ రోజు కోసం అమ్మ మూడువందల అరవై నాలుగు రోజులు ఎదురు చూస్తుంది. రెండు నెలల ముందు నుంచే కార్యక్రమం ఏర్పాట్లు మొదలుకొని, చెల్లెలు, తమ్ముడు వాళ్ళకు తెలియజేయడం వరకు అమ్మ నాకు గుర్తు చేస్తూనే వుంటుంది.
నాన్నగారి గురించి గుర్తురాగానే నా కళ్ళు చెమర్చాయి. నాకు తెలియకుండానే నేను నా గత స్మృతుల్లోకి వెళ్ళిపోయాను. నాన్న కేంద్ర ప్రభుత్వంలో ఓ చిరుద్యోగి. తన పద్దెనిమిదవ ఏటనే కుటుంబ పోషణ కోసం ముప్పై రూపాయల నెలజీతానికి ఉద్యోగంలో చేరారట, అమ్మ చెబుతుండేది. నలుగురు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళ పోషణభారం నాన్న మీద పడింది. నాకు ఊహ తెలిసిన దగ్గర్నుండీ నాన్నకు సంబంధించిన అన్ని విషయాలు నాకు గుర్తు రాసాగాయి. నాకు మూడేళ్ళపుడనుకుంటా, సినిమా బండి వస్తే దాని వెనుకే రెండు కాళ్ళ బొటనవేళ్ళ మీద నేను పరిగెత్తేవాడినని నన్ను పట్టుకోవడానికి అమ్మ నానా ఇబ్బందులు పడేదని నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు. నేను మూడవ తరగతి చదువుతుండగా నా రెండు కాళ్ళకు ఏదో ఇన్ఫెక్షన్ సోకి చాలా లావుగా వాచిపోయి అసలు నడవలేని పరిస్థితి వచ్చింది. కాలకృత్యాలు తీర్చుకోవడానిక్కూడా అమ్మా, నాన్న ఇద్దరూ కలిసి నన్ను మోసుకుంటూ తీసికెళ్ళేవారు. డాక్టరు గారిని నాన్న ఇంటివద్దకే తీసుకొచ్చేవారు. అలా ఒక నెలరోజుల పాటు అమ్మా, నాన్న చాలా ఇబ్బంది పడ్డారు. అయినా నాన్న ఏ రోజూ నన్ను విసుక్కోలేదు.
నేను ఏడవ తరగతి చదువుతుండగా మా ఇంటి దగ్గర అంతా మడికట్లు (పంటపొలాలు). అందులో కొంతస్థలాన్ని మేము ఆటస్థలంగా మార్చుకొని క్రికెట్ ఆడేవాళ్ళం. అందులో కొద్ది దూరంలో పెద్దపెద్ద బండరాళ్ళుండేవి. ఒకరోజు నేను బంతి పట్టుకోవడానికని పరుగెత్తి ఒక బండరాతిపై బొక్కబోర్లా పడ్డాను. ముఖమంతా గాయాలయ్యాయి. కుడికంటి వద్ద పెద్ద గాయం. దాదాపు కన్ను పోయినంత పనైంది. మిత్రులందరూ చాలా భయపడ్డారు. అప్పటికప్పుడు నన్ను డాక్టరు గారి దగ్గరికి తీసుకెళ్ళి చికిత్స చేయించి నన్ను ఇంటి వద్ద వదలి వెళ్ళారు. నేను ఇంటికెళ్ళి ఎవరికీ తెలియకుండా మంచం మీద గాయం కనపడకుండా కుడి వైపు తిరిగి పడుకున్నాను. నాన్న తిడతాడేమోననే భయం. రాత్రయినా నేను లేవకపోయేసరికి అమ్మకు అనుమానం వచ్చి నన్ను త్రిప్పి చూసింది. ఇంకేముందీ, అమ్మ అదుర్దా పడుతూ నన్ను చీవాట్లు పెట్టింది. అమ్మతో నేను ఈ విషయాన్ని నాన్నకు చెప్పొద్దని బ్రతిమలాడాను. కానీ అది దాస్తే దాగే గాయం కాదుగా, నాన్న కంట పడింది. నేను భయపడినంతా ఏమీ జరుగలేదు. నాన్న నన్ను సముదాయిస్తూ “ఇలాంటివి మామూలే, జీవితంలో పడి లేస్తేనే గాని జీవితమంటే ఏమో తెలియదు” అని మా మిత్రులను నాకు చికిత్స చేయించి ఇంటిదగ్గర వదలి వెళ్ళినందుకు అభినందించారు. నాకు నిజంగా అప్పుడు నాన్న దేవుడి లాగా అగుపించారు.
నేను ఏడవ తరగతి చదువుతున్నప్పుడే అనుకుంటా, నాన్న తనకు తెలిసిన వారు బస్సువేస్తే మమ్మల్ననందరినీ దక్షిణ భారతదేశ యాత్రకు తీసికెళ్ళారు. మైసూరులో రెండురోజులు బస ఉంటుందని తెలిసి మేము మైసూరు కెళ్ళగానే అక్కడ మాకు తెలిసిన వాళ్ళింటికి వెళ్ళాము. అప్పటికింకా తెలవారలేదు. వాళ్ళ ఇంటిలో కాఫీలు, స్నానాలు అయినతర్వాత అక్కడినుండి జంతుప్రదర్శన శాలకు వెళ్ళాలని తెల్లారే సిటీ బస్సులో బయలుదేరదీశారు నాన్న. అయితే నాకు వెళ్ళడం ఇష్టం లేక వెంటనే బస్సుదిగేశాను. నన్నే గమనిస్తున్న నాన్న బస్సు ఆపి అందర్నీ దింపేశారు. నేను మాకిచ్చిన గది లో కెళ్ళి తలుపేసుకుని పడుకుండి పోయా. రెండు రోజులుగా ప్రయాణ బడలికతో నిద్రలేమితో బాధపడుతున్న నేను కనీసం అల్పాహారం కూడా తినకుండా పడుకున్నా. తరువాత ఎవరో తలుపు కొడుతున్న శబ్దానికి నాకు మెలుకువొచ్చి వెళ్ళి తలుపు గడియ తీసాను. సమయం చూస్తే మధ్యాహ్నం ఒంటి గంట. నా మొండితనం వల్ల ఎవ్వరం మైసూరులో ఏమీ చూడలేక పోయాం. అమ్మ నన్ను తిడుతుంటే నా బాధను అర్థం చేసుకున్న నాన్న అమ్మను వారించారు.
అలా పదవతరగతి వరకు నా విద్యాభ్యాసం పడుతూ లేస్తూ కొనసాగింది. పదవ తరగతి మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాను. ఇక ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరంలో చేరాను. ఇంటర్మీడియేట్ రెండు సంవత్సరాలు కొంచం అల్లరి చిల్లరిగా తిరిగి చదువును అశ్రద్ధ చేశాను. మొత్తానికి ఇంటర్మీడియేట్‌లో రెండవ శ్రేణిలో ఉత్తీర్ణుడై డిగ్రీ కాలేజీలో అడుగు పెట్టాను. అక్కడ మా క్లాస్ లెక్చరర్ నాగిరెడ్డి గారు మా నాన్నగారికి బాగా పరిచయం. మొదటి సంవత్సరం క్లాసులకు సరిగ్గా వెళ్ళేవాడిని కాదు. మొదటి సంవత్సరం పరీక్షలకు నేను డుమ్మా కొట్టాను. ఆ విషయం మా క్లాస్ లెక్చరర్ నాగిరెడ్డి గారు మా నాన్నగారి దృష్ఠికి తీసికెళ్ళారు. అప్పుడు కూడా నాన్న నన్నేమీ అనలేదు. మనకేమీ ఆస్తులు లేవనీ, బాగా చదుకోమని నన్ను మెల్లిగా మందలించారు.
తరువాత నాగిరెడ్డి గారు నన్ను ఒకరోజు వారింటికి తీసుకెళ్ళి నాన్న కుటుంబం కోసం ఎంత కష్టపడ్డదీ నాకు వివరంగా చెప్పి, “నీకు తెలివితేటలు పుష్కలంగా వున్నాయి. నీవు ఇప్పటినుంచీ చదువు మీద శ్రద్ధ చూపిస్తే చాలు, ఇంకా సమయం మించిపోలేదు. ఇప్పుడు కూడా మీ నాన్న మాట నీవు వినకపోతే నీవు మనిషే కాదు” అని నాకు చీవాట్లు పెట్టి నన్ను ఇంటికి పంపించారు. అంతే తరువాత నేను వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి నాకు ఎదురు కాలేదు. డిగ్రీ డిస్టింక్షన్లో పాసయ్యాను.
అయితే నాన్నకు ఒకటే కోరిక ఉండేది. నన్ను బాగా చదివించాలని. ఆయన కోరిక మీద నేను ఎం.సీ.ఏ ప్రవేశ పరీక్ష రాసి దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదించాను. నేను ఇల్లు విడిచి వెళ్ళడం అదే మొదటిసారి. నేనెక్కడ ఇబ్బంది పడతానో అని నాన్న నా పేరు మీద పోస్టాఫీస్‌లో ఖాతా తెరచి తాను అప్పుతెచ్చి అయిదువేల రూపాయలు నా ఖాతాలో జమచేసి ఖాతాను మా కళాశాల ఆవరణలో వున్న పోస్టాఫీస్ కు బదిలీ చేయించారు. అప్పట్లో హాస్టల్ ఫీజు నెలకు దాదాపు నాలుగు వందల రూపాయలు ఉండేది. నాన్న లెక్క ప్రకారం ఒక సంవత్సరం వరకు నేను డబ్బు కోసం ఇబ్బంది పడే అవసరం లేదు.
కానీ నాన్న కలల్ని వమ్ముచేసి అక్కడ ఇమడలేక నేను ఒక పదిరోజుల తర్వాత వెనక్కి తిరిగి వచ్చేశాను. మిత్రులంతా అదృష్టం జీవితంలో ఒక్కసారే తలుపు తడుతుంది. అదృష్టాన్ని నీవు దూరం చేసుకున్నావు, ఇక అదృష్టం నీ దరి చేరదని గేలి చేశారు. అదేదో ఆ విజయంలో నా పాత్ర లేనట్టు కేవలం అదృష్టం తోనే నాకు సీటు వచ్చినట్టు వాళ్ళు నన్ను అంటుంటే నాకు చాలా బాధ వేసేది. అప్పుడూ నాన్న నన్నేమీ అనలేదు. ఆయనకు నామీద ఎందుకు అంత నమ్మకం ఉండేదో నాకు అర్థం కాలేదు. కేవలం నా మిత్రుల అభిప్రాయం తప్పని నిరూపించడానికి మళ్ళీ ఎం.సీ.ఏ ప్రవేశ పరీక్ష రాసి ఈసారి మరో ప్రతిష్ఠాత్మకమైన రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదించాను. ఆ విజయాన్ని కళ్ళారా వీక్షించిన నా స్నేహితులు ఇక నా జోలికి రాలేదు. కానీ నాన్నను జీవితంలో బాధ పెట్టకూడదని నిర్ణయించుకొని నేను కాలేజీలో చేరకుండా పట్టుబట్టి నేను వ్రాసిన పోటీ పరీక్షలన్నిట్లోనూ ఇంటర్వ్యూకు అర్హత సాధించాను. జాగ్రత్తగా నాకు నచ్చిన ఉద్యోగాన్ని ఎంపికచేసుకొని నేను ఉద్యోగంలో చేరిపోయాను. ఉద్యోగంలో నా మొదటి ప్రస్థానం శ్రీకాళహస్తి. తిరుపతిలో మా మిత్రులు హాస్టల్లో వుండి డిగ్రీ చదివేవారు. శనివారం ఎప్పుడౌతుందా, మా మిత్రుల దగ్గరికి ఎపుడు వెళ్దామా అని సోమవారం నుండి శుక్రవారం వరకు ఎదురు చూసేవాణ్ణి. శనివారం మాకు ఆఫీసు మధ్యాహ్నం వరకే. శనివారం ప్రొద్దుటే ఆఫీసుకి నా లగేజి తీసుకు వెళ్ళేవాడిని. ఎందుకంటే మధ్యాహ్నం నా ప్రయాణం ఆలస్యం కాకూడదని. మిత్రులతో కలిసి శనివారం సాయంత్రం తిరుపతి నుండి తిరుమలకు నడక దారిలో వెళ్ళి ఆ తిరుమలేశుని దర్శించుకుని ఏ రాత్రికో తిరుపతి చేరేవాళ్ళం. మరుసటి రోజు ఆదివారం నాడు స్థానికంగా వున్న అలమేలు మంగాపురం, శ్రీనివాస మంగాపురం, గోవిందరాజస్వామి ఆలయం, కోదండరామ స్వామి ఆలయం మరియు ఇస్కాన్ వారి రాధాకృష్ణ మందిరాన్ని దర్శించుకుని ప్రసాదాలతో కడుపు నింపుకొని సాయంత్రానికి మా మిత్రుల హాస్టల్‌కు చేరేవాళ్ళం. వారితో కొద్దిసేపు గడిపి వారికి వీడ్కోలు పలికి శ్రీకాళహస్తికి బయలుదేరి వెళ్ళేవాడిని. అలా ఆరునెలలు ఆనందంగా గడిచిపోయాయి.
నా శిక్షణ పూర్తయి కన్ఫర్మేషన్ లెటర్ వచ్చిన రోజే నాకు నాన్నగారి దగ్గరి నుండి ఉత్తరం వచ్చింది. మేమందరం క్షేమం, నేను ఈనెల ముప్పైయవ తేదీన పదవీ విరమణ చేస్తున్నాను. ఆ రోజుకు నీవు అనంతపురం రావాలి. ఆకలి కావట్లేదని నేను డాక్టరు గారి దగ్గరి కెళ్తే, నాకు కామెర్లని డాక్టరు గారు అనుమాన పడ్డారు. ఎందుకైనా మంచిదని హైదరాబాదు కెళ్ళి అక్కడ వివరంగా పరీక్ష చేయించాలని నాకు సూచించారు. మేము త్వరగా హైదరాబాదు కు వెళ్ళి పరీక్షలవీ చేయించుకుని అనంతపురం వచ్చేస్తాము. నీవు రావాల్సిన అవసరం లేదు. నీవు నా పదవీ విరమణరోజుకు అనంతపురం చేరుకుంటే చాలు. ఇదీ నాన్నగారి ఉత్తర సారాంశం. అదే నాన్నగారి ఆఖరి ఉత్తరం అవుతుందని నేను అస్సలు ఊహించలేదు. రెండురోజుల తరువాత టెలిగ్రాం వచ్చింది. నాన్నకు సీరియస్ గా వుంది, వెంటనే రమ్మని.
వెంటనే సెలవు పెట్టి హైదరాబాదుకు ప్రయాణమయ్యాను. అక్కడ ఆసుపత్రిలో నాన్నగారు జీవచ్ఛవంలా ఐసీయూలో పడుకుని వున్నారు. అప్పటికే ఆయన కోమాలో కెళ్ళి రెండు రోజులయ్యిందని, రోజురోజుకీ ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని బ్రతకడం ఇక చాలా కష్టమనీ డాక్టరు గారు నాతో అన్నారు. నాన్నగారితో ఎన్నో విషయాలు మాట్లాడాలని నేను బస్సులో ఆలోచించుకున్న ఆలోచనలన్నీ నా మెదడుని తొలిచేస్తున్నాయి. తొమ్మిది రోజులు నిద్రాహారాలు మరచిపోయి నాన్నగారి దగ్గరే ఉండిపోయాను. ప్రతి నిమిషం ఆయన స్పృహలోకొస్తాడేమో అన్న ఆశ. కానీ డాక్టరు గారు చెప్పినట్లు నాన్నగారి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణింపసాగింది. కోమాలో వుండడం వల్ల ఆయన కనీసం తన పదవీవిరమణ సభకు కూడా హాజరు కాలేని దుస్థితి. పదవరోజు ఆయన ఆఖరు శ్వాస వదిలారు. నిజంగా ఆ రోజు నా జీవితంలో చీకటిరోజు. నేను బాగుపడితే చూడాలనుకున్న నాన్న ఇక లేరన్న విషయాన్ని నేను జీర్ణించుకోలేక పోయాను.
నాలో నేనే కుమిలి కుమిలి ఏడ్చాను. అమ్మ అంతగా చదువుకోలేదు. బొత్తిగా లోకజ్ఞానం లేని మనిషి. ఆమెకు నాన్న తప్ప వేరే ప్రపంచం తెలియదు. నాన్నగారు చేసుకున్న పుణ్యమో లేక మమ్మల్ని హైదరాబాదు మహానగరంలో ఇబ్బంది పడనీయకుండా ఉండాలన్న నాన్నగారి సంకల్పమో తెలియదు కానీ సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన తుదిశ్వాస వదిలే సమయానికి ఆయనకు కావలసిన ఆప్తులందరూ ఆసుపత్రికి రావడం, ఆయన అంత్యక్రియలు సాయంత్రం అయిదు గంటలకల్లా పూర్తికావడం చకచకా జరిగిపోయాయి. నాన్నగారు తనువు చాలించే సమయానికి కేవలం నేనొక్కడినే డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగంలో చేరాను. చెల్లి, తమ్ముడు ఇంకా హైస్కూలులో చదువుతున్నారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నాన్నగారు మమ్మల్ని వీడిన తరువాత కుటుంబ భారాన్నంతా నా భుజస్కందాల మీద ఎలా మోశానో నిజంగా ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే. భౌతికంగా మా మధ్య లేకపోయినా నా బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేర్చుకునేందుకు నాన్నగారు పైనుండి నన్ను నడిపించారు కాదు కాదు ఇంకా నడిపిస్తూనే ఉన్నారు.
“ఒరేయ్ గిరీ, ఏంట్రా ఇంకా అలానే అరుగు మీద కూర్చున్నావు? అందరూ స్నానాలు చేశారు. అయ్యవారు వచ్చే వేళయింది. ఇక నీవు కూడా స్నానం చేసి పూజ పూర్తి చేస్తే అయ్యవారు వచ్చిన వెంటనే కార్యక్రమం మొదలుపెట్టవచ్చు” అన్న అమ్మ పిలుపులతో ఈ లోకం లోకి వచ్చిన నేను అమ్మకు కనపడనీయకుండా కళ్ళు పంచెతో తుడుచుకొని ‘నాన్నా రియల్లీ ఐ మిస్ యు’ అని మనసులోనే అనుకుంటూ ఇంట్లోకి అడుగుపెట్టాను.
44 Comments
hanumathsuri@gmail.com
కథ ఆద్యంతం చదివింపజేసింది. చివర్లో మాత్రం కంట నీరు తెప్పించింది అనడం కంటే హృదయం బరువెక్కింది అనడం సబబేమో! ఒక సారి నా బాల్యాన్ని గుర్తు చేసింది మంచికథ హరి గారూ!
Roddam Hari
మీ అభిమానానికి కృతజ్ఞతలు హనుమత్సూరి గారు.
Shobha
Katha chaala baagundhi really great

Roddam Hari
Thank You.
KS
Nice story heart touching and moving us to old memories – KS
Roddam Hari
Thank You very much.
Vasantha Murthy
The feelings of main character Giri are very well expressed. Travelled along with you and the end was really touching.
Waiting for more short stories from you.
Roddam Hari
Thank You very much for your great and inspiring words.
P.శ్రీధర్
డియర్ హరి…ఈ కథలో స్పృశించిన విషయం..చాలా హృద్యమైనది.. తలి తండ్రులు చూపే ప్రేమానురాగాలు..వెలకట్టలేని అమృత భాండాలు.. మన జీవిత పరిమళాలు

Roddam Hari
Anna,
Thank You Very much for your valuable feedback.
కె ఎస్ రఘునాథ్, కడప
హరి, కథ చాలా బాగుంది. తండ్రి ప్రేమను చక్కగా వివరించారు. ధన్యవాదములు. ఇటువంటి కథలు మరిన్ని రాసి, తల్లిదండ్రుల విలువలు అందరికీ తెలియజేయ వలసినదిగా కోరుచున్నాను.
Roddam Hari
మీ అమూల్య స్పందనకు ధన్యవాదములు రఘునాథ్ గారు.
VASUDEV
Looks your own biography written with true emotions and reality. God’s will that you replaced your father’s role to take care of the family in need whilst compromising the academic career. It’s all destiny….!! Wishing you and your family the very best
Roddam Hari
Thank You very much for your affectionate Words.
Raghuram
Hari…. నీవు వ్రాసిన ఈ రచన చదివిన నాకూ…. నిన్ను నేను చిన్నప్పటి నుండి చూసిన వాడి గా ఇది నీ జీవితం లో జరిగిన సంఘటనల కు దగ్గర గా ఉంది అని నాకూ తెలుసు….. ఈ కథలో కాస్త సుఖంగా ఉన్నట్లు హీరో ఉన్న.. నీ నిజ జీవితం లో ఎన్ని కష్టాలు పడినా వు అనేది నాకూ తెలుసు… నీవు నిజంగా కుటుంబ పెద్ద కొడుకు గా ఎలా ఉండాలో ఆదర్శం. కొన్నిచోట్ల చదువుతున్న ప్పుడు.. ఆటోమేటిక్ గా కన్నీళ్లు వచ్చాయి నాకూ…. You are real hero …. మిత్రుడు… రఘురామ్.
Roddam Hari
రాము,
నీ ఆత్మీయ అభినందనలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
Avadhanam Sreenivaas
రొద్దం హరి గారు మీరు రాసిన ఈ కథ చాలా అద్భుతంగా ఉంది. నిజంగా ఈ కథను చదువుతూ ఉంటే నా గత స్మృతుల్లోకి నన్ను తీసుకు వెళ్ళింది అనడానికి ఏమాత్రం సందేహం లేదు. నిజంగా చివర్లో ముగింపు చాలా అద్భుతంగా ఉంది. ఒక విధంగా నా గుండెను పిండేసిందేమో అని చెప్పడానికి సైతం నాకు నాకు మాటలు రావడం లేదు మొత్తం మీద మీ కథ చాలా చాలా అద్భుతంగా ఉంది. మంచి కథను మాకు మీ కలం ద్వారా వచ్చినందుకు మీకు మా అందరి తరఫున కృతజ్ఞతలు మరియు కంగ్రాట్స్



Roddam Hari
Sir,
అద్భుతమైన మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు.
కేశవ
మీరు వ్రాసిన కథ చాలా అద్బుద్దః, గిరి గారు తన జ్ఞాపకాల్లో, నెమరు వేసుకుంటూ, వర్తమానం లో కుటుంబ నీ ఒంటి చేత్తో, నిబ్బరంగా, ఆటుపోట్లు, తట్టుకొని, ఎవరిని నొప్పించక, తనలో తాను మదన పదుతూ లేస్తూ, జీవిస్తున్న అతనికి భగవంతుడు సహాయం మెండుగా ఉంది.
Roddam Hari
Sir,
మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలు.
Ajith Sreenivas Roddam
This story beautifully highlights the trust a father should place in his child and the protagonist’s transformation into a responsible family figure when his family needed him most.
It is truly fascinating how we begin to understand and appreciate someone only when we find ourselves shouldering similar responsibilities.
We eagerly look forward to more of your meaningful, inspiring, and heartfelt stories, Father!
Roddam Hari
Thanks Ajith.
Sreenivasulu setty T
కథ చాలా బాగావుంది సార్
Roddam Hari
Seena,
Thank You Very much.
C RAMU
శుభోదయం సార్





మీరు రాసిన కథ చాలా అద్భుతంగా ఉంది సార్ ఈ కథ వింటుంటే నా జీవితంలో జరిగినటువంటి కూడా నాకు గుర్తుకొస్తున్నాయి. నాన్న అంటే నా జీవితంలో గొప్ప వ్యక్తి ఇంత మంచి కథ రాసిన మీకు హృదయపూర్వకమైన ధన్యవాదములు
Roddam Hari
Thank You very much Ramu.
K S Rajasekhar
Hari garu,Very excellent and heart touching story. Congratulations

Roddam Hari
Sir,
Thank You very much for your kind response.
Neeraja
కథ చదువుతూ ఉంటే చాలా బాగా. వుంది నాన్న కు మీ పై వుండే ప్రేమ నమ్మకం. చాలా గ్రేట్.
Roddam Hari
Thank You very much.
B.MADHUSUDHANA REDDY
చక్కని కథాంశము ,ఏకబిగిన చదివించిన శైలి, భావోద్వేగానికి గురి చేసే నాన్నగారి జ్ఞాపకాలు …చక్కని కథ రాశారు…
మీరు మరెన్నో కథలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Roddam Hari
మీ ఆత్మీయ అభినందనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
Abhigna jonnalagadda
The transformation of the main lead (Giri) from a mischievous boy
to a very responsible person is soo … amazing… every father was once a mischievous little one during their childhood……the emotion in it makes us understand that it is your own life story … hoping more stories from you .. . .. పెద్దనాన్న..!
Roddam Hari
Thanks, Abhi.
Malathi
Heart touching story.congratulation


Roddam Hari
Thank You very much Malathi.
A Raghunatha Reddy
తండ్రికి ఇవ్వని మాటను నిలుపుకునేందుకు, కుటుంబాన్నే భావించి బాధ్యతలు నిర్వర్తించిన ఓ కొడుకు కథ !
ఓర్పులో, నేర్పులో తండ్రిని మించిన తనయుడి కథ !
చాలా బాగా రాశారు, అన్నా !
Roddam Hari
Thank You very much Sir for your motivation, enthusiastic and energetic words.
H.Rajasimhaimha
కథ సగభాగం చదివాక గాని ఇది నీ స్వీయకథే అని నాకు తెలిసి రాలేదు. నీ జీవితంలో ఇంతగా ఎత్తుపల్లాలు ఉన్నాయని నాకు ఈరోజే తెలిసింది.
ఎవరికైనా జీవితంలో అనేక కష్టసుఖాలు అనుభవించాకే ఒక ఉన్నతమైన స్థానం లభిస్తుందని నీ కథ ద్వారా నిరూపితమైంది. నీలో కేవలం కవి మాత్రమే కాక రచయిత కూడా ఉన్నాడని నిరూపించుకున్నావు. మనఃపూర్వక అభినందనలు మిత్రమా!
Roddam Hari
Thanks, Rajasimha for your whole hearted feedback filled with love and affection.
G S N Prasad
It’s a story loaded with sentiment. Touching to the core. అభినందనలు, హరి గారు.
Roddam Hari
Sir,
Thank You very much for your kind motivational feedback.
G.Jyotsna
Sir, good afternoon


Yesterday I read your story.
The story is very heart touching.
I felt you are in the character of the story.
How caring the elder brother is.
How caring a son is.
Responsibility,
Commitment,love and affection for Father and family, made me very emotional. The story telling is superb.
God bless you Sir
Roddam Hari
Madam,
Thank You very much for your affectionate and valuable feedback.