[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘నదీ గీతం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


ఉప్పొంగే నదీ తీరం మీటిన గుండె
ఆలోచింపజేసే కవితలల్లుతుందా
అయితే మనసు జీవించే ఉంది
ఆశలతో విప్పారిన విశాల ఆకాశం
వానపూల వాసన మోసుచ్చిందా
మరైతే జీవక్రియలు బతికినట్టే
వెర్రితలల మౌఢ్యం వెయ్యి పడగల బుసలు
దేహం గాయాలే శేష ప్రశ్నలు
సామాజిక ఆలోచన కరువైన చోట
కనపడని వినిపించని చూపుల దాటవేతే
అవసరమే వాదమైన సూక్ష్మజీవుల చీకటి తత్వం ఆటలో
అసహనం మరణ మృదంగం ఇంకా ఊపిరి తొంగిచూస్తుందా
అయితే, రాయి పూచిన సన్నాయి బతుకుతుంది
చలనాచలనాలైన గణనలో
బతికి చచ్చుడు, మరణిస్తూ జీవించుడు
ఆ బీడునేల గోడులు దాటాలి కొత్త దారులు
కొత్త బతుకున పూచే కవిత తడి నదీ గీతం
కొత్త కొత్తగా చిగురుకొమ్మ వీచే చెట్టు
ఇకనైనా ఆటల తెరలు దింపేసి
కంటి పొరలు సవరించుకొని
మరీ బతుకుదాం మనిషిలా

డా.టి.రాధాకృష్ణమాచార్యులు సీనియర్ వైద్యులు, ప్రముఖ కవి,రచయిత, అనువాదకులు, సమీక్షకులు.
5 సంకలనాలు తెలుగు కవిత్వంలో 1999 నుండి కరీంనగర్ నుండి పబ్లిష్ చేశారు. నలిమెల భాస్కర్ ‘సాహితీ సుమాలు’ వివిధ భారతీయ భాషల్లోని సాహితీవేత్తల పరిచయ సంకలనాన్ని “The Speaking Roots” Title తో ఆంగ్లంలోకి అనువాదం చేసినారు.