[డా. సి. భవానీదేవి రచించిన ‘నది అంచున నడుస్తూ’ అనే కవితా సంపుటిని విశ్లేషిస్తున్నారు డా. నల్లపనేని విజయలక్ష్మి.]
‘నది అంచున నడుస్తూ’ కవితా సంపుటి రచయిత్రి డా. చిల్లర భవానీ దేవి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆంగ్ల, హిందీ సాహిత్యాలలో పాండిత్యం కలిగినవారు. తెలుగు సాహిత్యంలో అపారమైన కృషి చేసినవారు. కవిత్వం, కథలు, నవలలు, బాల సాహిత్యం, వ్యాస సంపుటాలు, నాటికలు, టివి సీరియల్స్, నియో లిటరేచర్, అనువాదాలు – ఇలా ఆధునిక సాహిత్య ప్రక్రియలన్నింటిలోనూ రచనలు చేసి తనదైన ముద్ర వేసినవారు. యువ భారతి, ఆరాధన, చేతన వంటి సాహితీ, సాంస్కృతిక సంస్థల నిర్వహణ బాధ్యతను మోసినవారు. ఉత్తమ కవయిత్రిగా, ఉత్తమ కథా రచయిత్రిగా తాను చేసిన సాహిత్య కృషికి గాను ముప్పైకి పైగా పురస్కారాలు అందుకొన్నవారు.
“అందం ఆనందం సాహిత్య పరమావధి” అంటారు తిలక్. అందం సాధించి ఆనందాన్నివ్వని రచన కవితే కాదని ఆయన అభిప్రాయం. చక్కని లయవల్ల, వర్ణనా సౌందర్యం వల్ల అందం సమకూరుతుంది. అయిదే ఆనందం దేని వల్ల కలుగుతుంది అన్న ప్రశ్న ఎదురవుతుంది. వాదాలకు, ఉద్యమాలకు, రాజకీయ, ఆర్థిక సిద్ధాంతాలకు పరిమితమైన కవిత్వం కంటే సార్వకాలిక విలువలై మానవీయ విలువలను ప్రతిపాదించే కవిత్వం అందరికీ ఆనందాన్ని పంచుతుందని చెప్పాలి. మానవీయ విలువలకి కవిత్వంలో చోటున్నప్పుడు కవితలకుండే స్పందన వేరుగా ఉంటుంది. అవి పాఠకుల హృదయాలను కదలిస్తాయి. అటువంటి మానవీయ విలువలను, కుటుంబ బంధాలను, స్త్రీల అస్తిత్వ వేదనను అపూర్వంగా అక్షరబద్ధం చేసి మనకందించిన కవితా సంపుటి ‘నది అంచున నడుస్తూ’. ఈ నది అంచున నడుస్తూ ఉంటే భావసౌకుమార్యం, అర్థగాఢత, సందేశాత్మకత, సృజనాత్మకత, సామాజిక వేదనల సంలీనత – ఇలా ఎన్నో గలగలలు నదీ ప్రవాహం లోంచి వినబడుతూ అన్నీ కలసి మానవీయ విలువలతో కూడిన ప్రపంచానికి ఆహ్వానం పలుకుతూ హృదయాన్ని ఆర్ద్రం చేస్తాయి. ఇందులో బాపు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, సినారెల స్మృతిలో వ్రాసిన కవితలున్నాయి. ప్రకృతితో మమేకమై పరవశించిన అనుభూతుల్ని వర్ణించిన కవితలున్నాయి. విడిపోవడం లోని వేదనను, వలసదారుల కష్టాలను, ఉప్పెనల జ్ఞాపకాలను పంచిన కవితలున్నాయి. మనవడి బుడిబుడి నడకల ఆనందాన్ని, ఆత్మీయ మిత్రురాలి మరణ దుఃఖాన్ని మనతో పంచుకొన్న కవితలూ ఉన్నాయి. విషయం ఏదైనా చక్కని భావ చిత్రాలతో, వర్ణనా నైపుణ్యంతో, సరళమైన శైలితో వ్యక్తీకరించడం భవానీదేవి గారి ప్రతిభకి నిదర్శనం.
భావాలెప్పుడూ అమూర్తంగానే ఉంటాయి. వాటికి మూర్తిమత్వాన్ని కల్పించడంలోనే కవుల ప్రతిభ వెల్లడవుతుంది. చక్కని భావ చిత్రాలతో అభివ్యక్తి నైపుణ్యంతో భావాలను దృశ్యీకరించడంలో భవానీ గారు నిపుణులు. అప్పటిదాకా ఇంటిలో సందడి చేసిన పిల్లలు దూర దేశాలకు ఎగిరి వెళినపుడు ఆ తల్లిదండ్రులు అనుభవించే శూన్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన కవిత ‘మిగిలిన గూడు’.
ఇల్లంతా.. మళ్ళీ మౌన శూన్యాన్ని మోస్తోంది నిన్నటి దాకా అల్లరి మాటల కెరటాలు ఒక్కరాత్రి లోనే నిశ్శబ్ద తుఫాను నీడల ఊడలు
పిల్లలు ఉన్నంతసేపూ, వారితో మాట్లాడుతున్నంతసేపూ తల్లిదండ్రుల్లో కెరటాల్లా ఎగసిపడే ఉత్సాహాన్ని ‘అల్లరి మాటల కెరటాలు’ అనే భావ చిత్రం కళ్ళకి కడితే వారు వెళ్ళిపోగానే తల్లిదండ్రుల్లో కలిగే నైరాశ్యాన్ని ‘నిశ్శబ్ద తుఫాను నీడల ఊడలు’ అనే భావ చిత్రం కళ్ళకి కడుతుంది. హఠాత్తుగా విరుచుకుపడిన తుఫాను చెట్లనన్నింటినీ నేల మట్టం చేశాక మిగిలిపోయిన ఊడల్లా తల్లిదండ్రులు దర్శనమిస్తారు.
రెక్కలు వచ్చిన పక్షులు ఎగిరిపోతాయి గూడు మాత్రం ఒంటరిగా మిగిలిపోయి ఒకొక్క పుల్లని రాల్చుకుంటూ మళ్ళీ కొత్త రెక్కలు తొడుక్కుంటూ ఎగిరిపోయిన పక్షులకి మరో గూడవుతుంది కాలం కాటుకు మాయమైన పాతగూటిని కొత్త చివుళ్ళలో మళ్ళీ మొలకెత్తించుకుంటుంది
గూడును నిర్మించుకోవడం, పిల్లలు వెళ్ళిపోగానే మిగిలే ఒంటరితనం, మళ్ళీ తరువాతి తరం గూటిని నిర్మించుకోవడం, మళ్ళీ వారి పిల్లలు – ఇలా నిరంతరం జరుగుతూనే ఉంటుందని, ప్రతి తరం ఈ శూన్యాన్ని భరించవలసిందేనన్న తాత్వికతను చక్కని భావ చిత్రాల ద్వారా ఈ కవితలో వెల్లడించడం జరిగింది.
ప్రకృతిని చూసి పరవశించడం, ప్రకృతిలో మమేకం కావడం, మనల్ని మమేకం చేయడం ‘నిశ్శబ్ద క్రాంతి’, ‘నయగరా ఓ నవ్యానుభూతి’ కవితల్లో కనిపిస్తుంది.
గడ్డి పరకల నుదుళ్ళపై లేత పెదవుల నునుస్పర్శతో ప్రతి మంచు బిందువు పలకరించిందొక ప్రేమ పరాగం సమున్నత వృక్ష విరచిత వినూతన యవనికపై వైభవ దృశ్యకేతనం ఎగరేయడానికే వసంతం ఎదురుచూపులు
అంటూ కవయిత్రి చక్కని భావ చిత్రాలతో ప్రకృతి అందాలను దృశ్యీకరిస్తారు. పత్రాలలో పూల రంగుల్ని అలంకరించుకొన్న చెట్ల శోభను చూసి “ఇంతటి వర్ణార్ణవంలో నేనూ ఒక అవర్ణ పత్రాన్నై లయం కావల్సిందే” అని పలవరిస్తారు.
కవయిత్రి నయాగరాను చూసినపుడు తనకు కలిగిన తన్మయత్వాన్ని అద్భుతంగా వర్ణించారు.
నీ హోరు లయల నృత్య విన్యాసాన్ని ఏ లేఖిని అయినా ఒడిసి పట్టగలదా! అంటూనే నయగరా సౌందర్యాన్ని చక్కగా ఆవిష్కరిస్తారు. అలుపు లేని అనంత ప్రవాహం నీది అదుపు లేని జలోద్విగ్న చాలనం నీది ఉరకలేస్తూ విస్తరించిన జల మైదానంలో కాంతి పుంజాల ఆవిర్భావ హేలలు అన్నపు రాశులతో తీర్చిన ఆకళ్ళు సేదతీరిన వృక్షాల ఉన్నత శేముషులు నయాగరా… ఓ నయాగరా! నువ్వొక విశ్వ జల సౌందర్యాద్భుత పాతానివి!
అని నయాగరాను అనంతాద్భుత ప్రకృతి శక్తికి ప్రతీకగా సంభావిస్తారు. దేశ, కాల, ప్రాంతాలతో నిమిత్తం లేకుండా వర్ణ, వర్గ వ్యత్యాసాలు ఎంచకుండా కోటానుకోట్ల మనసు ప్రమిదల్లో ఆనంద దీపాలు వెలిగించే ఆధునిక గంగగా ప్రస్తుతిస్తారు.
“డార్ట్మూర్” అనే కవితలో నదీ సౌందర్యాన్ని, దాని స్వచ్ఛతను చూసి పరవశిస్తూ ఆ స్వచ్ఛత మనుషుల్లో ఎందుకు లోపిస్తున్నదనే బాధను, అంతుపట్టని కుటిలత్వంతో కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారేమిటనే ఆవేదనను వ్యక్తం చేస్తారు.
‘చివరి చెట్టు’ కవితలో తాము బ్రతకడానికి జీవ వాయువును, ఆహారాన్ని, నీడను అందించే చెట్లను సైతం స్వార్థంతో మాయం చేస్తున్న మానవుల ఉన్మాదానికి బాధను వ్యక్తం చేస్తారు.
మానవ ఉన్మాదం చివరి చెట్టును కూల్చిన రోజు ఓ కన్నీటి బొట్టు రాల్చడానికి నువ్వే ఉండవు. ఓ మనిషీ నువ్వుండవు
అని శపిస్తారు. ఎదిగేకొద్దీ మనిషి అహంకరిస్తాడు గానీ నిజానికి ప్రకృతే గురువని గుర్తించడనని వాపోతారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్ధిని సాధించి ఎంతగానో ఎదిగిన మనిషి మనసు ఆవిరైన మరో యంత్రంగా మారి మనిషితనాన్ని మర్చిపోతాడేమోననే భయం, అలా కాకూడదనే ఆకాంక్ష ‘ఉడ్డీనం’ కవితలో కనిపిస్తాయి.
ఎదగడమంటే ఎగరటమా తోటి వారికి చేతులందీయటం కదా కళ్ళున్నందుకు కలలు కనాల్సిందే గానీ కలలోనైనా ఆ కొత్త ప్రపంచంలో కూడా మనిషి మనిషిగా మనవలసిందే గదా
ఈ కవితను చదివినపుడు మన మాజీ ప్రధాని, ప్రముఖ కవి అటల్ బిహారీ వాజపేయి వ్రాసిన ‘ఊంఛాయీ’ కవిత జ్ఞాపకం వస్తుంది. 1992లో ఆయనకు పద్మవిభూషణ్ బిరుదు వచ్చినపుడు ఆయన వ్రాసిన కవిత అది. “హిమాలయ పర్వతం ఎంతో ఎత్తైనది. కానీ ఏమి ప్రయోజనం? అది కేవలం భౌతికమైన ఉన్నతే. ఆ ఉన్నతి ఎవరికీ ఉపయోగపడేది కాదు. అక్కడ ఒక్క చెట్టు పెరగదు. కనీసం ఒక్క గడ్డి పరక గానీ, లత గానీ పెరిగే అవకాశం లేదు. పర్వతారోహకులకు ఉన్నత లక్ష్యమే. కానీ అక్కడకు వెళ్ళిన తరువాత ఎవడూ అక్కడ నివసించలేడు. అలసిన బాటసారి ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోలేదు. నిజానికి ఉన్నతి అనేది ఎప్పుడూ గొప్పతనానికి కారణం కాదు. ఆ రెండింటికి మధ్య ఉన్న తేడా ఆకాశానికి, పాతాళానికి ఉన్న దూరం వంటిది. మానవుడు ఒంటరితనాన్ని విడిచిపెట్టి నలుగురితో కలసినపుడు స్నేహ పరిమళం విస్తరిస్తుంది. ఒంటరితనంతో కూడిన ఔన్నత్యం అంధకారం వంటిది. అందుకే ఆత్మీయులను ప్రేమతో దగ్గరకు తీసుకొనలేని ఉన్నతి వద్దు. స్నేహంతో అందరినీ దగ్గరకు తీసుకొనే సద్గతి కావాలి” అంటాడాయన. అదే విధంగా మనిషి మనిషిగానే బ్రతకాలి. మానవీయ విలువలను కోల్పోకూడదు అనే భావాన్ని వ్యక్తీకరించిన కవిత ‘ఉడ్డీనం’.
ఆడవాళ్ళకు ఏ విషయంలోనూ లోతైన పరిజ్ఞానం ఉండదు అని, వాళ్ళు ఎప్పటికీ సాహిత్య సృజన విషయంలో పురుషులతో పోటీ పడలేరని చాలా మందిలో ఉండే అభిప్రాయం. నిజమే. లోతైన పరిజ్ఞానం ఎలా వస్తుంది? మంచి పుస్తకాలు చదవాలి. ఆలోచనల్ని మథించాలి. సృజనాత్మకతకు సాధనతో మెరుగులు అద్దాలి. కానీ వంటింటికే పరిమితమయ్యాక, ఆలోచనలన్నీ బిడ్డల పెంపకానికో, ఉద్యోగ బాధ్యతల నిర్వహణకో అంకితమయ్యాక, అలసిపోయిన శరీరానికి ఏ కార్ల్ మార్క్స్ ఏ జిడ్డు కృష్ణమూర్తిని చదివి వారి ఇజాలను, తత్వాలను జీర్ణం చేసుకోవడం కంటే విశ్రాంతి తీసుకోవడమే ముఖ్యం అనిపిస్తుంది. సమయాన్నంతా రకరకాల సిద్ధాంతాల గుట్టుమట్లు తెలుసుకోవడంలోనూ, తత్వశాస్త్రాన్ని ఆపోసన పట్టడంలోనూ గడిపే పడక్కుర్చీ యజమానులతో పోటీ పడడం అసాధ్యమే అవుతుంది. నిజానికి ఆడవారికి వారి మేధకు పదునుపెట్టుకొనే అవకాశం అరుదుగానే దొరుకుతుంది. అందుకే కవయిత్రి ఆడవారి అవస్థను ‘వంటింటి కవిత’లో అద్భుతంగా ఆవిష్కరించారు.
ఒక్క కవిత రాద్దామంటే వంటింటి అల్మారాలో చిక్కుకొని అల్లాడి పొయ్యిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది
కావ్యసృష్టి/కవిత్వ సృష్టికి అవసరమైన సాధనా సామాగ్రి గురించి చెబుతూ రాజశేఖరుడు ‘కావ్య మీమాంస’లో ప్రతిభ భావయిత్రి కారయిత్రి అని రెండు విధాలని చెప్పాడు. కవి చేత భావింపబడేది భావయిత్రి. అతడి చేత కావ్యాన్ని రచింపజేసేది కారయిత్రి. ఈ రెండు శక్తులు సాధారణంగా ఏక కాలంలో వ్యవహరించవు. ఒక్కొక్కప్పుడు కవి భావావేశం కలగగానే ఏ మాత్రం వ్యవధానం లేకుండానే తన ఆవేశాన్ని కవిత రూపంలో వ్యక్తీకరించవచ్చు. కానీ అలాంటి సందర్భాలు చాలా తక్కువ. వాల్మీకి వంటి మహానుభావులకు తప్ప అందరికీ అది సాధ్యం కాదు. మొదట కవికి కలిగిన భావావేశం యొక్క తీవ్రత తగ్గి దానిని పునఃస్మరించుకొనే సమయంలో నిజమైన కావ్య నిర్మాణం జరుగుతుంది. దీనిని వర్డ్స్వర్త్ “Poetry is the emotion recollected in tranquility” అని చెప్పాడు. అయితే భావావేశానికి, పునఃస్మరణకి మధ్య వ్యవధి చాలా ఎక్కువ ఉ న్నప్పుడు కావ్యరూపం దాల్చవలసిన భావ రమణీయత కవి మనస్సు నుండి యెగిరిపోయే దురవస్థ ప్రాప్తిస్తుంది. అటువంటి దుస్థితి కలగకుండా కవి దానిని మనసులోనే బంధించి పోషించుకోవాలి. ఆ విధంగా కవి వస్తు మననం చేయడాన్ని అలంకారికులు సమాధి అంటారు. ఈ వస్తు మననం చేసుకోగలిగే సమయం అంటే సమాధి స్థితి ఆడవారికి చాలా తక్కువగా లభిస్తుంది. కారణాలు మనందరికీ తెలిసినవే. ఏదైనా కావ్యం/కవిత బాగా లేకపోతే (రసానుభూతి కలిగించలేకపోతే) అందుకు సాధారణంగా రెండు కారణాలుంటాయి. 1. కవికి చక్కని భావావేశం లేకపోవడం 2. ఒకవేళ భావావేశం ఉన్నా దానిని రసవంతంగా వ్యక్తీకరించే నైపుణ్యం లేకపోవడం. అయితే కవికి ఆ రెండూ ఉండి కూడా కావ్యం బాగా లేకపోతే అందుకు కారణం సమాధి లోపమే అవుతుంది. పాశ్యాత్య విమర్శకుడు క్లైవ్ బెల్ ఇదే విషయాన్ని చెప్పాడు. “రసవంతమైన కావ్యం కవి భావుతకత్వానికి నిదర్శనమే. కానీ రస విహీనమైన కావ్యం విధిగా అతని భావుకతా లోపానికి నిదర్శనం కాదు. ఈ రెండవది అతని సమాధి లోపం వలన కలగవచ్చును” అంటాడాయన. ఆడవారిలో ఈ సమాధి లోపం ఎలా కలుగుతుందో ‘వంటింటి కవిత’లో కవయిత్రి చక్కగా చెప్తారు.
పూరీలు చేసేటప్పుడు రెండు చేతుల మధ్య నలిగిపోయి కలం పట్టుకోలేని నా అశక్తతకు మొహం చాటుచేసినవీ కూరలు తరిగేటప్పుడూ పూలమాల గుచ్చేటప్పుడూ ఉప్పు కారాల ఘాటు వాసనల్లో ఊహల్లో కూడా మిగలక మాయమైనవీ
అంటూ భావాలు కవితగా మారకుండానే ఎలా మాయమౌతాయో వివరిస్తారు.
ఎప్పుడూ రాత్రింబవళ్ళు ఇంతే ఒక పూర్తి కవితని మనస్ఫూర్తిగా రాద్దామంటే అదెప్పుడూ అసంపూర్ణంగానే!
అని వాపోతారు. కవయిత్రులందరి మనోవేదనకు అక్షరరూపం ఈ కవిత.
21 వ శతాబ్దంలో కూడా ఆడవారు ఇంకా అస్తిత్వం కోసం పోరాడి సాధించుకోవలసిన దుస్థితిలోనే ఉన్నారని గుర్తు చేసే కవిత ‘గుర్తింపు’.
అందరి అమ్మలకి కూడా అందరి నాన్నలే గుర్తింపు కానీ నేను అమ్మకాకముందు అతని గుర్తింపును నా మీద ముద్రించక ముందే నన్ను నేను గుర్తించాను నా గుర్తింపును మాత్రం అతని కస్సలు ఇవ్వను
అని అస్తిత్వం కోసం ఆరాటపడే స్త్రీ భావాలను వ్యక్తీకరిస్తారు.
తమవైన ఆశల్ని, యిష్టాయిష్టాల్ని, వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకలేక మనిషిగా బతకడం కోసం యుద్ధం చేసే స్త్రీల అస్తిత్వ వేదనను కళ్ళకు కట్టే మరో కవిత ‘జైలు గృహం’.
నన్ను నేను మళ్ళీ మళ్ళీ నిలబెట్టుకోవడానికి ఇల్లు వేషం వేసుకొన్న జైలు గోడల్ని బద్దలు కొట్టడానికి మళ్ళీ ఒక యుద్ధం చేయాలి ప్రతి రోజూ పునర్జన్మించేందుకు మనసు ముక్కలన్నీ పోగు చేసుకుంటుండాలి
తల్లులుగా, కూతుళ్ళుగా స్త్రీలు నెరవేరుస్తున్న గొప్ప బాధ్యతలను ఆవిష్కరించిన కవితలు ఈ సంపుటిలో ఉన్నాయి.
అమ్మ తాను మాత్రం కష్టాల కడలిని మోస్తూ ఆర్ద్ర ప్రేమని అందరికీ పంచుతుందని, బిడ్డల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుందని వర్ణించిన కవితలు ‘మా అమ్మ ఉండేది’, ‘ప్రేమకు దూరంగా’, ‘మళ్లీ అమ్మ’.
అమ్మంటే.. ఆకలి తీర్చే అక్షయపాత్ర మాత్రమే కాదనీ అనుక్షణం ఆధారమై నిలబెట్టే వెన్నెముక అని అమ్మని పోగొట్టుకున్నాకే అందరికీ అర్థమయ్యేది
అంటారు కవయిత్రి. కుటుంబ సభ్యులందరూ ఎక్కడెక్కడ ఉన్నా, ఏయే పనుల్లో మునిగినా వారందరినీ కలపగలిగేదీ, అప్యాయతను పంచగలిగేదీ తల్లి మాత్రమే అంటారావిడ.
తల్లి వేరు శిధిలమై మట్టిలో కలసిపోతే పిల్ల వేళ్ళకి చేతులు కలవనంత దూరం.. ………………… ………………… ఒక ఒంటరి తల్లివేరు ఎన్ని పిల్ల వేళ్ళనయినా పట్టి ఉంచగల్గుతుంది. (ఒంటరి తల్లివేరు)
తనను కోరి కనకపోయినా, కొడుకు పుడతాడనే భ్రమలోంచి పుట్టుకువచ్చినా, ఏ రోజూ ఎటువంటి ఫిర్యాదు చేయకుండా, కుటుంబ సభ్యుల మధ్య దూరాన్ని తగ్గించే వంతెనగా నిలబడుతుంది కూతురు అంటారు కవయిత్రి. ఆడపిల్లల అంతరంగాన్ని గురించి ఆలోచించేవారు కాని, వారు తలకెత్తుకుంటున్న మోయలేని
భారాలను గుర్తించేవారు కాని, వారు అనుభవిస్తున్న మానసిక సంఘర్షణను గమనించేవారు కాని ఎవరూ ఉండరు, కానీ ఏదో ఒక రోజు పరిస్థితి మారుతుంది. ఆడపిల్లలు కేవలం వంతెనగా కాక స్వయం వ్యక్తిత్వంతో నదిగా ప్రవహించే రోజు వస్తుంది అంటారు.
అమ్మ.. నాన్న.. అన్నదమ్ముల మధ్య దూరాలను ముడేస్తూ తమని తాము లోతైన బంధాల్లో పాతేసుకుంటూ స్వేచ్ఛా స్వప్నాల్నిబాధ్యతల గుంజలకి కట్టేసుకుంటూ వంతెనలు ఎన్నాళ్ళని నిలబడతాయి అకస్మాత్తుగా ముంచేసే చైతన్య ఉధృతికి ఏదో ఒకరోజు కూలిపోక తప్పదు
అంటారు. 56 కవితలున్న ఈ సంపుటిలోని కొన్ని కవితలను మాత్రమే స్పృశించడం జరిగింది. ఏ దేశమేగినా మాతృభూమి మీద మమకారాన్ని మరవని కవయిత్రి అంతరంగాన్ని ప్రకటించిన కవితలు, భిన్న అంశాలతో కూడిన గొప్ప పరభాషా కవితలకు అను సృజనలు, స్వీయానుభూతులు ఇలా ఇంకా స్పృశించవలసినవెన్నో. ఈ నది అంచున నడుస్తూ ఆ నీటి గలగలలు వినిపించే మానవీయ విలువల సందేశాన్ని అందుకొంటూ ఆ కవితా మాధుర్యాన్ని ఎవరికి వారు ఆస్వాదిస్తేనే బాగుంటుంది.
***
నది అంచున నడుస్తూ (కవితా సంపుటి) రచన: డా. సి. భవానీదేవి ప్రచురణ: హిమబిందు పబ్లికేషన్స్ పేజీలు:126 వెల: ₹ 150 అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు రచయిత్రి: 986684700 ఆన్లైన్లో: https://logilitelugubooks.com/book/nadi-anchuna-nadusthuu-dr-c-bhavanidevi
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
రచయిత, అనువాదకులు శ్రీ కల్లూరు జానకిరామరావు ప్రత్యేక ఇంటర్వ్యూ
వొక నిజాయితీపరుడైన అధికారి నిర్వహించిన RAID
మేలు కోరే మేలిమి కథల సంపుటి ‘ఆకాశంలో ఒక నక్షత్రం’
ఆరెంజ్ వింటర్
కొత్త పదసంచిక-15
మానేటి ఒడ్డు
సినిమా క్విజ్-14
‘కాకతీయ యుగంలో స్త్రీల సామాజిక స్థితిగతులు – ఒక పరిశీలన’ -15
ఆకాశంలో సగమా..?
నూతన పదసంచిక-76
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®