[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన సంధ్య యల్లాప్రగడ గారి ‘నామ జపం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]


మంచు కురుస్తోంది. రామస్వామి ఆ దారిలో నడుస్తున్నాడు. అప్పటికి అతను అలా నడవటం మొదలెట్టి ఎన్ని గంటలైయిందో తెలీదు. మంచు కురవటం ఆగటం లేదు.
బదిరి దాటిన తరువాత ‘మనా’ అన్న చిన్న గ్రామం వస్తుంది. అది దాటిన తరువాత కొండలు గుట్టలు, దాటి వెడితే వసుధార, లక్ష్మీ వనము వస్తాయి. అవన్నీ పర్వతారోహకులు వేసవికాలంలో వెడతారు. అక్టోబరులో అటు ఎవ్వరూ వెళ్ళనే వెళ్ళరు. నవంబరు వచ్చే నాటికీ బదిరి దాదాపు కాళీ అవుతుంది. అక్కడ ఉండే సన్యాసులు, సాధువులు కూడా క్రిందికెళ్ళిపోతారు. పంచ ప్రయాగలో, లేక రుషీకేషుకో వెళ్ళిపోతారు. కొందరు సాధకులు బయట ప్రపంచం పట్టక ఉండిపోతారు.
అవి అక్టోబర్ నెల చివరి రోజులు. దీపావళి ఇంకో వారముందేమో, ఆ రోజున బదిరి మూస్తారు. రామస్వా మి ఎందుకో అలా నడుచుకుంటూ ఆ గుట్టలోకి వచ్చేసాడు. తిరిగి వెనక్కు వెళ్ళలేకపోతున్నాడు. ఆ రోజు ఎందుకో ఆ ఎత్తులు ఎక్కాలనిపించి ఉదయమే బయలుదేరి వచ్చాడు. మనా దాటి దాదాపు ఐదు కిలోమీటర్లు వచ్చిఉంటాడు.
తిరిగి తిరిగి అలిసాడు. మంచు పడటం పెరుగుతోంది. ఇక తప్పదని ఒక కొండ ప్రక్కకు చేరాడు. మంచులో తడవటం ఆగటం లేదు.
అతను అక్కడే కూర్చున్నాడు. తన కూడా ఉన్న కంబళి తల మీద సవరించుకొని కళ్ళు మూసుకొని ‘రామ-రామ’ అనటం మొదలెట్టాడు.
ఎన్నో ఏళ్ళుగా చేస్తున్న రామనామ సంకీర్తన వలన అతని మణిపూరకంలో ఉన్న అగ్ని వెలుగొందుతోంది. ఆరణి నిప్పులా జ్వలిస్తున్న రామనామఅగ్ని అతనికి చలి అన్నది లేకుండా చేసింది. పైగా శరీరం చెమటలు చిందించటం మొదలైయింది.
అతనిలోని నిద్రాణమైన కుండలినీ శక్తి మేల్కోని ఊర్థ్వ ప్రయాణానికి సన్నద్ధమవుతోంది. అతని ఉచ్వాసనిశ్వాసలోని రామనామం ఆ ప్రదేశాని వెలుగుతో నింపుతోంది.
రామస్వామి అలా ఎంతసేపు కూర్చున్నాడో తెలియదు.
అతని తొడ మీద ఎవరో కొట్టి లేపారు. కళ్ళు తెరచాడు రామస్వామి.
ఎదురుగా తొమ్మిదేళ్ళ చిన్న బాలిక. గరహ్వాడి హిమాలయాల సానునులలో వారి వస్త్రధరాణ, తెల్లని మేను, ఎర్రని పెదవులు, పెద్ద పెద్ద కళ్ళు, చూడగానే ఏదో ఆకర్షణ, ఎంతో దైవత్వంతో ఉన్నది ఆమెలో.
రామస్వామి అలవాటుగా రామనామం ఉచ్ఛరించాడు. ఆ బాలిక నవ్వి “నేను ఇక్కడ తప్పిపోయాను. ఉదయం మేకలు కాచుకోవటానికి వచ్చా. ఇప్పుడు దారి తెలియటం లేదు. నా గ్రామానికి దారి వెతుకుతావా?” అంది అతనికర్థమయ్యే తెలుగులో.
రామస్వామికి ఆశ్చర్యమేసింది. ఇంత మంచులో ఈ చిన్నపిల్లఎలా వచ్చిందా? అని.
“ఇక్కడ పల్లెలున్నాయి. వాటిలో ఉంటాను. మా గ్రామానికి దారి వెతుకు రా..” అంది అతని మనస్సు చదివినట్లుగా.
అప్పటికి మంచు కురియటం ఆగినా, చుట్టూ మోకాళ్ళ కన్నా ఎత్తుగా మంచు ఉంది.
లేచి ఆమె చెయ్యి పట్టుకొని నడవటం మొదలెట్టాడు రామస్వామి.
అతను దారి చూపటంలా కాక, అతనికి దారి చూపుతున్నట్లుగా ఆమె నడిచింది.
‘మనా కాక ఇక్కడేమున్నాయబ్బా’ అనుకున్నాడు రామస్వామి.
“చాలా గ్రామాలున్నాయి. అని కనపడవులే..” అతని మనస్సు చదివుతున్నట్లుగా చెప్పింది బాలిక.
వాళ్ళు అలా కొంత దూరం నడిచే సరికే కొన్ని గుడిసెలు కనిపించాయి. ఆ గుడిసెలన్నిటి చుట్టూ పెద్ద చెక్క గోడ కట్టి ఉంది.
ఆ గ్రామం చూడటానికి చాలా అందంగా అనిపించింది.
ఆ గ్రామమెక్కడ్నుంచి వచ్చిందో కూడా రామస్వామికి అర్థం కాలేదు. అతను ఆ బాలికతో కలిసి ఆ గుడిసెల మధ్యకు నడిచాడు.
అతని మనస్సు తెలిసినట్లుగా ఆ బాలిక చిరునవ్వుతో ఒక వ్యక్తిని చూపింది.
అతను సన్నగా కొద్దిగా పొడువుగా ఉన్నాడు. తెల్లని గడ్డం, కళ్ళలో కాంతి, దవళవస్త్రాలు, నుదుటిన చందనపు తిలకం, జుట్టు తల మీద సిగలా కట్టాడు. వచ్చి ఆ బాలికకు నమస్కరించాడు.
ఆమె నవ్వి, “తీసుకువచ్చాను!” అని అతనిని అక్కడ వదిలేసి గుడిసె ప్రక్కకు వెళ్ళిపోయింది.
ఆ దవళవస్త్రధారికి నమస్కారం చేశాడు రామస్వామి.
అతను రామస్వామిని తీసుకొని ఒక గుడిసెలోకి నడిచాడు.
విశాలంగా ఉంది లోపల. ఒక ప్రక్క జింక చర్మం పరచి ఉంది. మరో ప్రక్క ఒక కుండ. ఒక మూల అగ్నిహోత్రం మండుతోంది, కొన్ని పూజా సామాగ్రి ఉన్నాయి.
“పళ్ళు తింటావా స్వామి?” అంటూ ఆ ధవళవస్త్రధారి ఒక ప్లేటు పెట్టాడు. వాటిలో చక్కటి ఆపిల్స్ వచ్చాయి.
రామస్వామి ఆశ్చర్యంగా చూస్తూ ‘ఇది కలా!’ అనుకున్నాడు.
అతను నవ్వి,”కల కాదు. నిజమే. నీవు హిమాలయ అంతర్భాగంలో ఉన్న గ్రామమైన శంబలాకొచ్చావు. నా పేరు మైత్రేయముని. నేను ఈ శంబలాలో నివాసముంటాను. ఇక్కడికి రావటానికి ఏ కొద్ది మందికో అనుమతి లభిస్తుంది..” చెప్పాడు.
రామస్వామి ఆశ్చర్యపోయాడు.
“ఇక్కడ ఆకలి దప్పులుండవు. రోగాలుండవు. వృద్దాప్యం ఉండదు. కేవలతపస్సు, భూమిని రక్షిస్తూ ఉండటం ఉంటుంది..” చెప్పాడు మైత్రేయముని.
“నేనెందుకిక్కడికొచ్చాను? నన్ను తెచ్చిన బాలికెవరు? ఈయన ఆ బాలికనెందుకు నమస్కరించాడు?” అన్న ప్రశ్నలు కలిగాయి రామస్వామి మనస్సులో.
“నిన్ను తెచ్చిన బాలిక సాక్షాత్తూ బాలాత్రిపురసుందరి. నీ రామనామ తపస్సుకు మెచ్చి ఆమే స్వయంగా నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది..” చెప్పాడు మైత్రైయముని.
‘నా మనస్సులో మాట ఈయనకెలా తెలుస్తోందో..’ అనుకున్నాడు ఆశ్చర్యంగా.
మైత్రైయుడు నవ్వి “నీ మనస్సులో మాటలు మా చెవులలో వినపడుతాయి..” అన్నాడు.
‘నేనెందుకు ఇక్కడికి తీసుకురాబడ్డాను?’ అనుకున్నాడు రామస్వామి.
“నీవు ఈ రోజుకు విశ్రమించు. రేపు నీకు మిగిలిన సంగతులు తెలుస్తాయి..” అని మైత్రేయుడు వెళ్ళిపోయాడు.
***
రామస్వామి అసలు పేరు నర్సింగు. చదువు లేదు. భార్య గంగ పొలం పనులకెడుతుంది. నర్సింగు పనులకు రోజూ కూలికెళ్ళేవాడు. కొద్ది కాలంగా అతనికి కడుపులో నొప్పి మొదలయ్యింది. దాంతో ఎటూ వెళ్ళలేక పని లేక సతమతమయ్యాడు. ఏ మందులకూ తగ్గలేదు. పని చెయ్యలేకపోయేవాడు. తిని పడుకోవటం అలవాటుగా మారింది. భార్య గంగకు అతని వాలకం తేడాగా అనిపించింది. ఇదంతా పని ఎగ్గొట్టటానికేమో అని ఆమె అనుమానం. కారణం తినటానికి లేని నొప్పి పనికెళ్ళితే వచ్చేది. డాక్టరుకు చూపితే ఏమీ లేదన్నాడు. దాంతో ఆమె గొడవ పెట్టుకునేది. ఈ గొడవ పడలేకపోయాడు నర్సింగు. భార్య మీద కోపంతో, వాళ్ళ ఊరి వాళ్ళు వస్తుంటే హరిద్వార్ వరకూ వచ్చాడు. అక్కడ్నుంచి బదిరి నడుచుకుంటూ చేరాడు.
అతని ప్రకారం భార్య గయ్యాళిది. ఆమె గోల కంటే ఈ సన్యాసి బ్రతుకు నయమనుకున్నాడు. అతను కాషాయవస్త్రాలు ధరించాడు. బదిరిలో సదా సాదుసంతుకు భోజనం ఉచితమని బదిరి చేరాడు.
పెద్దగా చదువుకోలేదు. ఏ భాషా రాదు. తెలిసినది రామనామ భజన ఒక్కటే. అందుకే ఎవరు ఏమడిగినా “రామ్- రామ్” అని చెప్పేవాడు.
బదిరిలో ఉచితభోజనాలు తీసుకుంటున్నా మనస్సులో ఏదో అపరాధభావం కలిగేది. అందుకే తిండి తప్ప ఎవరితో మాటలు లేవు, మంతనాలు లేవు. రామనామం తలుస్తూ మూలకు కూర్చునే వాడు. అలా అలా అతను రామ్ అని తప్ప పలకడని రామస్వామిగా మారాడు.
మౌనం, రామనామ జపంతో అతని అంతఃకరణ శుద్ధి మొదలయ్యింది.
ఇవేమీ అతనికి తెలిసేవి కావు. కాని అతనిలోని అంతశ్శక్తి మేల్కొని అతనిని శంబలా చేర్చింది.
***
మైత్రేయముని వచ్చాడని గౌరవంగా లేచి నమస్కారం చేశాడు రామస్వామి.
“నీ వల్ల ప్రజలకి ఒక మేలు జరగాలి. ముందు నీవు శాస్త్రోక్తంగా సన్యసించాలి. అందుకే మీ గ్రామం వెళ్ళు. అక్కడ మీ భార్యకు, నీ కొడుకుకు నీ జపంలో కొంత ధారపోసి, ఆమె అనుమతితో సన్యాసం తీసుకో. నీకు తదుపరి కార్యం తెలుస్తుంది..” అని చెప్పాడు.
“నాకిక్కడే ఉండాలని ఉంది.. రాముని తలుచుకుంటూ..” గొంతు పెగుల్చుకొని చెప్పే ప్రయత్నం చేశాడు.
“నీవు నీ కార్యం నిర్వహించాలి. ఇది అమ్మ ఆజ్ఞ. అమ్మ లలితాంబిక కేవలం శ్రీరామ స్వరూపమే..” చెప్పాడు మైత్రేయముని.
రామస్వామి గాలిలో అల్లల్లాడాడు. మనా గ్రామపొలిమేరలో ఉన్నాడు. జరిగింది కలో నిజమో తెలీలేదు. చెవిలో “అంతా నిజమే. మీ గ్రామం పో..” అన్న మాటలు వినిపించాయి.
ఇక అతను మారు తలపులేక బయలుదేరి గ్రామానికొచ్చేసాడు.
గంగ ముందు రామస్వామిని గుర్తుపట్టలేదు. కాని తరువాత ఆమె ఆశ్చర్యానందాలకు లోనైయింది.
పన్నెండేళ్ళ కొడుకును చూసి ఆశీర్వదించాడు రామస్వామి.
గంగతో మాత్రం “గంగా నీకు తోడు నిలబడక సన్యాసినయ్యాను. రాముని దయ వలన నేటికో ప్రయోజనం కోసం ప్రజల మధ్యకొచ్చాను. నీ అనుమతితో సన్యాసం పుచ్చుకోవాలి. దానికి నీవు ఒప్పుకోవాలి..” అన్నాడు.
ఆమెకు మరింత ఆశ్చర్యం. కాని అతనిలోని దైవత్యం ఆమెను నోరు మెదపనియ్యలేదు. ఆమె మౌనంగా తల ఊపింది.
రామస్వామి చెంబుతో నీరు తెచ్చి ఆ ఇంటి చుట్టూ చల్లాడు. గంగ మీద కొడుకు మీద చల్లాడు. కొంత నీరు తులసికోట ముందు వదులుతూ తన రామనామ జపంలో కొంత గంగకు, కుమారుని ఇబ్బందిలేని భవిష్యత్తు కలగాలని కోరుతూ ధారపోశాడు.
మనస్సులో ఇంత కాలం ఉన్న బరువు మాయమయ్యింది. లేచి బయటకొచ్చాడు.
సిద్ధేశ్వరానందస్వామియన్న స్వామి వద్దకు వచ్చాడు. ఆయన వద్ద సన్యాసం పొందాడు.
ఆనాటి నుంచి సంచారం చేస్తూ నామసంకీర్తనను, రామా నామాన్ని దేశమంతా వ్యాప్తిచేశాడాయన.
నామజపంతో సాధించలేనిది లేదన్న ఆయన సందేశం పల్లె పల్లెల్లో వినిపిస్తుంది. నిస్వార్థంగా ప్రజలకి రామనామం బోధించేవాడు. ఎవరు ఏదైనా ఇబ్బంది వచ్చిందని అడిగితే, ‘రామ నామం చెయ్యండి నాన్న! రాముడు చూసుకుంటాడు’ అని చెప్పి పంపేవాడు. ప్రజలు అలాగే నామం చేస్తూ, ఫలితం అనుభవిస్తూ, రామనామజపయజ్ఞంలో పాల్గొనేవారు. ఎవరు వచ్చినా వారికి రాముని సన్నిధి అనుభవం అయ్యేది ఈయన వద్ద. ప్రతిరోజు ఒక ఊరు చొప్పున తిరుగుతూ, రామనామం వ్యాప్తి చేస్తూ ఉండేవాడు. చివరికి రాముడితో కలిసిపోయాడు. నామ మహిమను ప్రపంచానికి చాటాడు.
