నీలమత పురాణంలో కాశ్మీరు ఆవిర్భావానికి సంబంధించిన కథలాంటి కథనే రాజతరంగిణి లోను ఉంది. కొద్ది మార్పులతో ఇలాంటి ఉదంతం ‘మహావంశ’లోనూ, మూల సర్వస్తివాదానికి చెందిన చైనీయుల ‘వినయం’ లోను, హుయాన్‌త్సాంగ్ ప్రయాణ కథనాలలోనూ ఉంది. వీటన్నిటిలో కాశ్మీరును ఆధునిక భూగర్బ శాస్త్రం ప్రకారం బేసిన్ వంటి ఆకారంలో వర్ణించటం కనిపిస్తుంది.
కాశ్మీరు భౌగోళిక స్వరూపాన్ని గమనిస్తే, కాశ్మీరు నలువైపులా ఎత్తయిన కొండలతో ఒక బేసిన్ లానే అనిపిస్తుంది. ఈ లోయలోని కనిష్ట ఎత్తు సముద్రమట్టం కన్నా 5700 అడుగుల ఎక్కువ. పర్వతాలలోని అతి తక్కువ ఎత్తు పీర్‌పంజాల్ రేంజ్లో 3000 అడుగులు. ఒకవేళ కాశ్మీరుని ఓ బేసిన్గా ఊహిస్తే, ఈ బేసిన్లో చేరిన నీళ్ళు బయటకు పోయేందుకు ‘బారాముల్లా’ దగ్గర ఉన్న కొండరాళ్ళలోని పగుళ్ళు దారి కల్పిస్తాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలోని లోయలో సగభాగం ‘కరెవా’లనబడే చిన్న మట్టి గుట్టలతో నిండి ఉంది. ఈ మట్టి గుట్టల పై భాగం బల్లపరుపుగా ఉంటుంది. ఈ కరెవాలు భూగర్భ శాస్త్రం ప్రకారం ‘ప్లీస్టోసీన్ కాలం’లో ఏర్పడ్దాయి. ఇందులోని మట్టి అంతా ఒక సరస్సులోకి చేరే పదార్థాలతో నిండి ఉంది. అంటే నీటి జీవజాలాల శిలాజాలతో ఈ మట్టిగుట్టలు నిండి ఉన్నాయి. ‘ప్లీస్టోసీన్ కాలం’ అంటే ఒక మిలియన్ సంవత్సరాల నాటి కాలం. భూగర్బ శాస్త్రం పరిశోధన ఫలితాల ప్రకారం ఆ కాలంలో కశ్మీరు ప్రాంతమంతా నీటితో నిండి ఉండేదనీ, పీర్‌పంజాల్ పర్వతపంక్తుల ఆవిర్భావం వల్ల 5000 చ.కిమీ. ప్రాంతంలొ ఒక సరస్సు ఏర్పడిందని తేలింది. ఈ సరస్సులోని నీరు బారాముల్లా వద్ద ఉన్న రాళ్ళల్లోంచి బయటకు పారిందనీ, నీరు వెళ్ళిపొగా సరస్సు అడుగున మిగిలిన మట్టి గుట్టలే ‘కరెవా’లనీ శాస్త్రవేత్తలు నామకరణం చేశారు.
కరెవాలు రెండు రకాలు.
సాధారణంగా భూగర్భ శాస్త్రం ప్రకారం సెడిమెంట్లు, అంటే ఒకచోట నిక్షిప్తపరచిన మట్టి, రాళ్ళు, ఇతర పదార్థాల ద్వారా ఏర్పడిన సెడిమెంటరీ శిలలను నాలుగు రకాలుగా వర్గీకరించారు. వాతిలో కరెవాలు – arenaceous, argillaceous rocks వర్గీకరణలోకి వస్తాయి. అరెనేషియస్ అంటే క్వార్ట్జ్ అధికంగా ఉంటుంది. అర్జిలేషియస్ అంటే బురదమట్టి అధికంగా ఉంటుంది. రెండూ నీటిలోనే ఏర్పడే రాళ్ళు. కెరవాలలో పైన భాగంలో బురదమట్టి, క్రింది భాగంలో అరెనేసియస్ రాళ్ళు ఉన్నాయి. కేశవ్, రెంబిరా, రోముషు, దూధ్ గంగా, శాలిగంగ, బోన్నాగ్ నాథ్, నిన్గ్లీ వంటి నదులు ఇక్కడకు తమతో పాటు బోలెడంత సెడిమెంట్లను తెచ్చి వేశాయి. కరెవాలను కోస్తూ వాటి ముక్కలను మోసుకుపోతున్నాయి.
ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నీలమత పురాణం అమలులోకి వచ్చినప్పుడు భూగర్భ శాస్త్రం, పాశ్చాత్య దేశాలలోనూ ఒక శాస్త్రంగా ఎదగలేదు. వైజ్ఞానిక శాస్త్ర పరిశోధన పద్ధతులు, సూత్రాలు ఏర్పడలేదు. పైగా, ఆధునిక ‘విజ్ఞాన’ శాస్త్ర పరిశోధకులలా ఆనాటి ఋషులు ‘ఫీల్డ్ ట్రిప్’లకు వెళ్ళినవారు కాదు. వారికి ఆధునిక పరికరాలు, యంత్రాలు అందుబాటులో లేవు. కానీ శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా కనుగొన్న విషయాలను వారు తమ పురాణాలలో పొందుపరిచి భావి తరాల వారికి అందించారు. అయితెే వారి కాలంలో భాష వేరు, విషయాన్ని చెప్పే విధానం వేరు. అంశాలను సూచించేందుకు వారు వాడిన పదాలు వేరు. కానీ శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా చెప్పినదీ, ఋషులు పురాణాల్లో కశ్మీరు ఆవిర్భావం గురించి చెప్పినదీ దాదాపుగా ఒకటే.
కశ్మీరు మొత్తం నీటిలో మునిగి ఉండేది. పీర్‌పంజాల్ పర్వతాల ఆవిర్భావంతో కశ్మీరులో సరస్సు ఏర్పడింది. సరస్సులోని నీరు విడుదలవటం వల్ల కశ్మీర భూమి ఏర్పడింది. ఇక్కడ సరస్సు ఉండిందనేందుకు నిదర్శనాలు కరెవా మట్టి గుట్టలు.
పురాణం ప్రకారం కశ్మీరు అంతా సతీసరోవరమనే సరస్సు ఉండేది. ఆ సరస్సులో జలోద్భవుడనే రాక్షసుడు ఉండేవాడు. అతడి వల్ల అందరు బాధలు పడుతుండేవారు. కానీ నీటిలో ఉన్నంత కాలం ఆ రాక్షసుడి బలం అధికంగా ఉంటుంది. కాబట్టి కశ్యపుడు నీరు బయటకు వెళ్ళేందుకు మార్గం ఏర్పరిచాడు. దేవతలు రాక్షసుడిని సంహరించారు. కశ్యపుడు ఏర్పరిచిన భూమి కాబట్టి కశ్మీరు అయిందీ ప్రాంతం.
టూకీగా పురాణాలు చెప్పే కశ్మీరు ఆవిర్భావం కథ ఇది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, కశ్మీరు మొత్తం సరస్సు ఉండేదనీ, నీరు విడుదలవడం వల్ల కశ్మీరు ఏర్పడిందన్నది. టెథిస్ సరస్సు, పీర్ పంజాల్ రేంజ్, కరెవాలు, అరెనేషియస్, అర్జిలేషియస్ రాళ్ళు ఆధునిక వైజ్ఞానిక శాస్త్ర టెర్మినాలజీ. జలోద్భవుడు, రాక్షసుడు, కశ్యపుడు, కశ్యపమేరు – కాశ్మీరు పురాణాల పదాలు.
అయితే నీలమత పురాణం ఎంతో వివరంగా కశ్మీరు ఆవిర్భావం గురించి చెప్తుంది. ఆధునిక ఆర్కియాలజీ పరిశోధనలతో పోలిస్తే, ఈ విషయాలు అత్యంత ఆశ్చర్యకరమైనవిగా అనిపిస్తాయి.
(సశేషం)
గమనిక: పాఠకుల కోరిక మేరకు ఇకపై నీలమత పురాణం రెండు వారాలకొకసారి ప్రచురితమవుతుంది.

2 Comments
Dr Trinadha Rudraraju
Writer is vigilant while dealing with physiography of the Kashmir and its enlightening even for geologists. Enthused about description and genesis of the valley and lakes. Great work Sri Muralikrishna garu.
ఘండికోట విశ్వనాధం
అద్భుతమైన కథనంతో ముందుకు సాగిపోతోంది ‘ నీలమత పురాణం’. నెలలో రెండు సార్లు రానున్న ఈ సీరియల్ గురించి ఎదురు చూస్తాం.