[శ్రీ మణిబాబు వజ్జ రచించిన ‘నేనెందుకు తెలుగులో మాట్లాడాలి?’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక – సాహితీ ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 ఉగాది వచన కవితల పోటీలో బహుమతి పొందిన కవిత.]


అమ్మ కడుపు నుండి నేను నేల మీదకు రాగానే –
“కంగ్రాట్యులేషన్స్ ఇట్స్ ఎ బేబీ బాయ్”
నేను విన్న తొలి పలుకులు
“థాంక్యూ డాక్”
అంది ఒక నీరస స్వరం
మా అమ్మ గొంతుని గుర్తుపట్టగలను
ఫోన్లో ఎవరితోనో “బోత్ ఆర్ సేఫ్”
పరిచయం ఉన్నట్లుంది – మా నాన్న గొంతు
“విష్ యు హ్యాపీ రికవరీ”
“యూ ఆర్ సో లక్కీ”
“వెన్ ఈస్ ద పార్టీ”
వాట్సప్ చదువుతున్న అమ్మ మనసు నేను విన్నాను
“లెట్స్ నేమ్ హిమ్ అయాన్”
“విక్కీ విల్ బి లక్కీ డియర్”
“మన వంశాంకురుం రా.. తాత పేరు ఈజ్ బెటర్”
“నో డాడ్.. ఇట్స్ ఓల్డ్ ఫ్యాషన్డ్”
యూరోపియన్స యూనివర్సిటీలో
కొత్తగా చేరిన భారతీయుడి లాగా
నేను “ఉంగా.. ఉంగా”
“క్యూట్ బాయ్? బ్రెస్ట్ ఫీడింగా”
“కుదరట్లదే.. బాటిల్ ఫీడింగే”
“ఫస్ట్ బర్త్‌డే లెట్స్ మేకిట్ గ్రాండ్”
“కట్ ది కేక్ బాబు”
“గాడ్ బ్లెస్ యు”
“ఏ స్కూల్లో వేద్దాం?”
“స్టెల్లాస్ ఆర్ సెంట్ మేరీస్?”
“ఓక్రిజ్ విల్ బి బెటర్.
ఇట్స్ ఇంటర్నేషనల్ కరిక్యులం”
ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో వచ్చిన
తెలుగు డబ్బింగ్ మూవీ లాగా
ఎక్కడో గాని తెలుగు వినబడలేదు
తెలుగు మీడియుం ఉండేదట ఒకప్పుడు
“హౌ సిల్లీ దోజ్ డేస్ వర్”
“ఫీజ్, ట్యూషన్స్, నోట్స్, ఎగ్జామ్స్, కెరియర్”
చుట్టూ ఇంగ్లీషు!!!
“తెలుగు మాట్లాడగలను అంకుల్.
బట్ ఐ కాంట్ రీడ్ ఆర్ రెైట్”
ఐఐటీలో సీటు
ప్రెస్టీజియస్‌గా ట్రీట్
ఫాస్ట్ ఫార్వర్డ్‌లో లెైఫ్
హ్యాండ్సమ్ ప్యాకేజ్
యూఎస్‌లో ప్లేస్మెంట్
సడన్‌గా ఒకరోజు దెబ్బ తగిలి “అమ్మా” అన్నాను
“ఆర్ యూ ఆల్సో టెల్గూ..?”
అమెరికన్ యాక్సెంట్లో..
పదహరు డాలర్ల తెలుగమ్మాయి
మూడు నెలల తర్వాత
తన ఫ్రెండ్స్‌కి నన్ను చూపిస్తూ చెప్పింది
“మీట్ మై వుడ్ బి”
ఏడాదిలోగా నేను ఆమెకు స్వీట్ హబ్బీ
రెండేళ్ళ తర్వాత ఇండియాలోనే
“ఇట్స్ ఏ బేబీ బాయ్.. కంగ్రాట్యులేషన్స్”
“ఏవండీ వీడికి తెలుగు నేర్పిద్దాం?”
జడుసుకున్న నా కొడుకు
“నేనెందుకు తెలుగులో మాట్లాడాలి?”
“Why should I speak Telugu?”