[శ్రీ ఆసూరి హనుమత్ సూరి రచించిన ‘నేతి మనసు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]


‘నేతి మనసు’ ..అచ్చు తప్పు అనిపిస్తోందా మీకు.?! కాదండీ మీరు కరెక్ట్ గానే చదివారు.! అది తేనె మనసు కాదు.. నేతి మనసే! ఇదేదో కొత్తగా ఉందనిపిస్తోందా? నాకూ ఇలాంటి మనసు గురించి తెలిసింది తను పరిచయమయ్యాకే. తేనె మనసుని ఆశించిన నాకు నేతి మనసుని పరిచయం చేసిన అనుభవాన్ని మీ ముందు తన కోసం రాసిన మూగ లేఖ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నా! చదువుతారు కదూ!
~
ఓ నా ప్రియా!
నీకు నేను రాస్తున్న చివరి ప్రేమలేఖ ఇది అని తలుచు కుంటేనే నా కాళ్ళ క్రింది భూమి కంపిస్తున్నట్టుంది. ఇన్నాళ్లూ నీతో ఎప్పుడైనా ఏదైనా మాట్లాడగలనని ధైర్యం, నమ్మకం ఉండేవి. ఇంతకు ముందు ఎన్నో సార్లు నీకు మెసేజ్‌ల రూపంలో, డైరెక్ట్‌గా లేదా ఇండైరెక్ట్‌గా నీ పై నా ప్రేమను వ్యక్తపరిచాను. అది నిన్ను తాకిందని, నీలో కూడా నాకు లాంటి ప్రేమభావనలని రేకెత్తించిందనీ అనుకున్నాను.
నీ నుండీ దూరమవ్వాలని నాలో కలిగిన భావన నీ పట్ల నా కున్న ప్రేమను ఎంత మాత్రం తగ్గించలేదు. ఎందుకంటే నీపట్ల నాకు కలిగిన ప్రేమ ఒక రోజు, లేదా ఒక క్షణంలో పుట్టింది కాదు అలాగే అంతమయ్యేదీ కాదు. అలాగే నీనుండీ దూరమవ్వాలని నేను తీసుకున్న నిర్ణయం కూడా ఆవేశంలో తీసుకున్నది కాదు. ఒక్క క్షణంలో నిర్ణయించుకున్నదీ కాదు.
కానీ నీతో గడిపిన క్షణాలు, నీ గురించి నేను పెట్టుకున్న ఆశలు ఎన్ని సార్లు నెమరు వేసుకున్నా కలిగేది ఆనందమే తప్ప బాధ కాదు. అందుకే చివరిసారి ఆ మధుర క్షణాలని మళ్ళీ నెమరు వేసుకోవాలని అనిపిస్తోంది. నువ్వు నా ఈ భావాల్ని చదువుతావని నాకు నమ్మకముంది. అందుకే చివరిసారి ఆ క్షణాల్ని నీతో పంచుకోవాలనిపించి రాస్తున్నా..
నీకు గుర్తుందా.. నీ పుట్టిన రోజు నిన్ను కలిసి నీకు విషెస్ చెప్పాలని అనుకున్నా.. కానీ ఆ రోజు సెలవు దినం కావడంతో ముందు రోజే నీ చేతిలో చెయ్యి వేసి “మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ టుమారో” అని చెప్పాను.. మళ్ళీ నిన్ను కలిసే అవకాశం ఉంటుందో లేదో అని. నువ్వు “థాంక్ యు సో మచ్” అన్నప్పుడు ఎంత హాపీగా ఫీలయ్యానో నాకు మాత్రమే తెలుసు.
మరుసటి రోజు నీ కోసం నీ చిత్రంతో ఒక ప్రత్యేకమైన గ్రీటింగ్ తయారు చేసాను. దాన్ని నీకు వాట్సాప్ చెయ్యాలని అనుకున్నా. కానీ నీ నెంబర్ నా దగ్గర లేదు. అయినా నిన్ను నేరుగా అడగకుండా నీ నంబర్ సంపాదించాలని, నీకు ఆ గ్రీటింగ్ నీ పుట్టిన రోజు నాడు పంపాలని అనుకుని ఎంతో కష్టపడి నీ నెంబర్ సంపాదించా.. అది సేవ్ చేసుకున్న తర్వాత ఆ నెంబర్ పై వాట్సాప్ ఉందో లేదో అని ఆత్రంగా చూసాను. ప్రొఫైల్ పిక్‌గా నీ బొమ్మే ఉండడంతో ఎంతో సంతోషించా.. నీ పుట్టిన రోజు నాడు నీకు ఆ గ్రీటింగ్ పంపి సర్ప్రైజ్ ఇద్దామని ఎదురు చూసి చూసి చివరికి పంపాను. నీ నుండీ వచ్చే తొలి స్పందన ఎలా ఉంటుందో అని ఆత్రంగా ఎదురు చూసాను. ఆ రోజు సాయంత్రం దాకా నువ్వు నా గ్రీటింగ్ చూడనే లేదు. చివరికి సాయంత్రం “థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ గ్రీటింగ్” అని ఇచ్చిన రిప్లై చూసి ఎంత మురిసి పోయానో నాకు మాత్రమే తెలుసు. నీ రిప్లై లోని లవ్లీ అన్న పదం నీ నుండీ వచ్చిన తొలి ప్రేమ భావనగా ఫీలయ్యాను. మరుసటి రోజు నీ అందమైన చిత్రాన్ని గీసి పంపాను.. వాట్సాప్ ద్వారానే. “థాంక్ యు సో మచ్.. ఐ లవ్ ఇట్” అని నువ్వు పంపిన రిప్లై చూసి నన్నే ప్రేమిస్తున్నా అని చెప్పావనుకున్నా.. కానీ నేను గీసిన నీ బొమ్మ ని ప్రేమిస్తున్నావని అర్థం చేసుకోలేక పోయా..
మరుసటి రోజు నీకు గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టాను. చూసినా నువ్వు రిప్లై ఇవ్వలేదు. నువ్వు బిజీగా ఉన్నావనుకొని సరిపెట్టుకున్నా. గుడ్ నైట్ మెసేజ్ పెట్టా. మళ్ళీ రిప్లై లేదు. అలా రెండు రోజులు పంపాను. నీ నుండీ ఎలాంటి స్పందనా లేదు. నీకు నా పట్ల ఎలాంటి భావన వుందో అర్థం కాలేదు. రొటీన్ మెసేజ్‌లు నీకు ఇష్టం లేదేమోనని జోక్ పంపి చూసా.. స్పందన లేదు. కనీసం ఒక ఎమోజీ కూడా పంపలేదు నువ్వు. అలా ఇరవై నాలుగు రోజులు పంపాను. నీ నుండీ స్పందన రాకపోయే కొద్దీ నాలో తృణీకార భావన పెరిగి పోయింది. ఎదురుగా కనపడినా చిన్న చిరునవ్వు కూడా లేకపోయేటప్పటికి.. చివరికి ఒక రోజు నేనే కల్పించుకొని మాట్లాడాలని ప్రయత్నించాను. ముక్తసరిగా మాట్లాడి మొహం తిప్పుకొనేసరికి.. విసిగి వేసారి నీ నుండీ దూరమవ్వాలని నిర్ణయించుకొని నీకో మెసేజ్ పెట్టాను గుర్తుందా.. ‘నిన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టానని.. సారీ చెపుతూ మళ్ళీ ఎప్పుడూ నిన్ను ఇబ్బంది పెట్టన’నీ అన్నాను. నీ నుండీ ఎలాంటి రిప్లై లేదు. సరే చెప్పాల్సింది చెప్పేసానని సరిపెట్టుకున్నాను. ఆ రోజు చాలా సేపటి తర్వాత యథాలాపంగా వాట్సాప్ చూస్తున్న నాకు.. నీ నుండీ ఒక రిప్లై వచ్చింది. ఏముందో అని ఆత్రంగా చదివాను. మొదట్లో నా లవ్ మెసేజెస్ కొంత ఇబ్బంది కలిగించాయని చెపుతూ ఇప్పుడు కంఫర్టబుల్‌గా ఉన్నాననీ, ఇందులో సారీ చెప్పాల్సిందేమీ లేదని మనం మన స్నేహాన్ని కొనసాగిద్దామని నీ స్నేహాన్ని ఆఫర్ చేసినప్పుడు నేను గాలిలో తేలిపోయాను తెలుసా..?
ఇలా మొదలైన మన స్నేహం.. నవంబర్‌లో నీ నుండీ వచ్చిన తొలి గుడ్ మార్నింగ్ మెసేజ్‌తో మరింత బలపడింది. అలా మెసెజ్‌ల ద్వారానే మనం ఎన్నో రోజులు మాట్లాడుకున్నాం. నువ్వు మర్చిపోయినా నేను మాత్రం నీకు మెసేజ్ పెట్టడం మానలేదు. అసలేమీ లేదనుకున్న బంధం మెసేజ్‌ల స్థాయిని దాటి ఒకరికొకరు మన సుఖ దుఃఖాలను పంచుకొనే స్థాయికి ఎదగాలని ఆశించాను. నువ్వు బ్లాక్ కాఫీ మాత్రమే త్రాగుతావని తెలిసి ఒకరోజు నేను నీకు ప్రేమతో ఒక చిన్న కాఫీ పొడి ప్యాకెట్ ఇచ్చాను. థాంక్స్ చెప్పి తీసుకున్నావు. తిరిగి నేనేమీ ఆశించ లేదు నీనుండీ. కానీ మరుసటి రోజు నాకో నేతి ప్యాకెట్ ఇచ్చి సర్ప్రైజ్ చేసావు.. ఆ రోజు తొలిసారి నేనంటే నీకు ప్రేమ ఉందని అనిపించిన రోజు. నాకు మన ప్రేమ చిగురించింది అని నమ్మకం కుదిరిన రోజు. అలా మొదలైన మన ప్రేమ మెసేజ్‌ల స్థాయి నుండీ ఎన్నో కబుర్లు చెప్పుకునే స్థాయికి ఎదగాలని ఆశించాను.
ఒక రోజు నువ్వు అకస్మాత్తుగా కనిపించక పోయేటప్పటికి ఆందోళనగా మెసేజ్ పెట్టాను. ఏమయ్యిందని. మా బావగారికి సీరియస్‌గా ఉంది అని మెసేజ్ పెట్టావు. తర్వాత నేను ఆయన గురించి ఎంతో వాకబు చేసి నీతో మాట్లాడే ప్రయత్నం చేసాను. నేనాశించిన స్థాయిలో నీనుండీ జవాబు లేదు. మన మధ్య వేరొకరి ప్రస్తావన ఎందుకులే అని సరిపెట్టుకున్నాను.
నిన్ను మా ఇంటికి రమ్మని ఆహ్వానించాను. కానీ నీనుండీ ఎందుకో ఆసక్తి లేదు. ఇక లాభం లేదని నేనే మీ ఇంటికి వద్దామని నిశ్చయించుకున్నాను. ఒక రోజు ఫోన్ చేసి మీ ఇంటి లొకేషన్ పెట్టమని అడిగాను. ఇష్టంగానో అయిష్టంగానో పెట్టావు. మీ ఇంటికి వచ్చి నీతో కలిసి భోజనం కూడా చేశాను. అప్పుడు తెలిసింది నీ ఇష్టాయిష్టాలు. ఆ మరుసటి రోజు నువ్వు మళ్ళీ కనిపించక పోయేటప్పటికి ఆందోళనతో ఫోన్ చేశాను. ఒంట్లో కాస్త నలతగా ఉందనీ రేపు కలుస్తానని చెప్పావు. ఏదైనా సహాయం కావాలంటే మొహమాటం లేకుండా అడగమని చెప్పాను. సరేనన్నావు.
మరుసటి రోజు నువ్వు కనిపించేసరికి ఎంత సంతోషపడ్డానో తెలుసా.? అప్పట్నుంచీ మనం రోజూ గుడ్ మార్నింగ్ మరియూ గుడ్ నైట్ మెసేజ్ లతో టచ్ లోనే ఉన్నాం. కానీ ఎందుకో అంతకు మించి మన ప్రేమ.. స్నేహం స్థాయిని కూడా దాటి ముందుకు వెళ్లలేదనిపించింది. సండే నువ్వు బాగా పొద్దెక్కి లేస్తావని తెలిసి నీ నుండీ ఆ రోజు గుడ్ మార్నింగ్ మెసేజ్ ఆశించేదాన్ని కాదు. ఒక్కోసారి సండే ఉదయం లేచి చూసేటప్పటికి నీ మెసేజ్ ఐదున్నరకే వచ్చి ఉండేది. అప్పుడనిపించేది నేనే నిన్ను సరిగా అర్థం చేసుకోలేదేమోనని. ఇది అర్థం కాక ఎన్నో సార్లు నీకు గుడ్ నైట్ చెప్పకుండా మానేసేదాన్ని. మళ్ళీ తెల్లారి చూస్తే అర్ధరాత్రయినా నీ నుండీ గుడ్ నైట్ మెసేజ్ వచ్చి ఉండేది. నీకు ఓదార్పు మెసేజ్ పెట్టేదాన్ని. సారీ కూడా చెప్పాను చాలా సార్లు నిన్ను సరిగా అర్థం చేసుకోలేక పోయినందుకు.!
ఇంతలా మనం కమ్యూనికేట్ చేసుకుంటున్నా ఇంకా ఎదో వెలితి నా మనసులో. ఒక రోజు కాలేజీలో అంత్యాక్షరి జరుగుతుంటే రమ్మని పిలిచాను. రానన్నావు. ఇష్టం లేదా అని అడిగాను. బాగా ఇష్టమని, వస్తే మళ్ళీ నన్ను నేను మర్చిపోయి కూర్చుండి పోతానని చెప్పావు. అప్పుడు కానీ నువ్వు అర్థమవడం మొదలవలేదు నాకు. నీ ఇష్టాన్ని చంపుకుని నిన్ను నువ్వు ఒంటరిగా ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నావని మొదటిసారి అనిపించింది. ఇంత జరిగినా నువ్వు రోజూ నాకు మెసేజ్‌లు పంపడం మానలేదు. అలాగని సంతోషంగా మాట్లాడిన క్షణాలు ఎంత వెదికినా గుర్తుకు రావడం లేదు.
ఇలా రోజులు గడుస్తున్నాయి. నేనెప్పుడైనా నీకు కనిపించక పోయినా మరుసటి రోజు నన్ను అడుగుతావని నీకు నాపై ప్రేమని, కనీసం స్నేహాన్ని వ్యక్తపరుస్తావని ఆశించిన నాకు అడియాసే మిగిలింది. నేను నీపై ప్రేమ ని వ్యక్త పరచిన ప్రతి సారీ నీనుండీ కనీసం మెసేజ్ కూడా రావడం మానేసింది.
ఇలా ఉండగా ఒక రోజు నా పుట్టిన రోజు రానే వచ్చింది. ఎప్పుడూ పుట్టిన రోజు గొప్ప గా జరుపుకోని నేను ఆ రోజు కేకుల్ని పంచి అందరితో చెప్పాను. నీతో సహా. నీ నుండి తప్ప ఎందరో నాకు బర్త్ డే విషెస్ చెప్పారు. నువ్వు మాత్రం ఎంతో నిర్లిప్తంగా ఉండడం నాకు బాధ కంటే ఆశ్చర్యాన్ని కలిగించింది. బాధల్ని దిగమింగి దిగమింగి ఏడాది గడిపేశాను.
మళ్ళీ నీ బర్త్ డే రానే వచ్చింది. ఇప్పటికైనా నీ ప్రేమని పొందుదామని ఈసారి నా స్నేహితురాలి సాయంతో ఒక అందమైన గ్రీటింగ్ తయారు చేశాను నీ కోసం. పుట్టిన రోజు ఉదయాన్నే వాట్సాప్‌లో దాన్ని నీకు పంపాను. నువ్వు చూసినా ఏమీ రిప్లై పెట్టక పోయే సరికి , నేనే ఫోన్ చేసాను. గ్రీట్ కూడా చేసాను. చాలా అనాసక్తిగా మాట్లాడావు. ఏం చాలా డల్‌గా ఉన్నావు అని అడిగాను. అలా ఏమీ లేదన్నావు. మరోసారి గ్రీట్ చేసి ఫోన్ పెట్టేసాను. ఆ రోజు రాత్రి కాల్ లాగ్ చూస్తున్నాను. నీతో మాట్లాడిన సమయమెంతో తెలుసా? కేవలం 41 సెకండ్లు . నేను ఎంతో ప్రేమించే వ్యక్తి నాతో మాట్లాడే సమయం ఒక్క నిమిషం కంటే తక్కువగా ఉందంటే దానర్థం ఏమిటి?
ఈ విషయం జీర్ణించుకోలేని నేను నిన్ను డైరెక్ట్‌గా అడిగాను. దానికి నువ్విచ్చిన సమాధానం ఏంటో తెలుసా? “సారీ! నేను చాలా లేట్‌గా రిప్లై ఇచ్చివుండొచ్చు. అయినా నీవు నా పుట్టిన రోజు నాడు పంపిన డ్రాయింగ్ చాలా బావుంది” అని. ఇదే విషయం ఆ క్షణంలోనే చెప్పి ఉంటే నా అంత సంతోషించే వ్యక్తి ఎవరూ ఉండరు. నేను నీనుండీ సారీ చెప్పించుకోవాలని ఎప్పుడూ ఆశించననీ, ఓ చిన్న పలకరింపు అయినా సత్వర స్పందన మాత్రమే కోరుకుంటానని ఆ రోజే చెప్పాను. గుర్తుందా!
ఎందుకనో మన మధ్య ప్రేమ కాదు కదా, స్నేహం కూడా వికసించకుండా జాగ్రత్తపడుతున్నావని అనిపిస్తోంది. ఒక వేళ చిగురించినా దాన్ని మొగ్గ లోనే తుంచేస్తున్నావని అనిపిస్తోంది. నీ స్నేహాన్ని కానీ, ప్రేమని గాని ఆశించిన మాట నిజమే కానీ అది నీ ఇష్టానికి వ్యతిరేకంగా అయితే వద్దని ఆ రోజే అన్నాను. నువ్వే మనం మన బంధాన్ని కొనసాగిద్దామని చెప్పావు. అందుకు ఎంత చొరవ చూపినా నీ నుండీ ఎటువంటి స్పందనా లేదు. కనీసం అయిష్టాన్ని కూడా వ్యక్తపరచడం లేదు.
అందుకనే ఎంతో బాధతో అయినా ఈ బంధం నుండీ నిన్ను విముక్తుణ్ణి చేయాలనీ అలాగే నాకు నేను విముక్తురాల్ని అవ్వాలని నిర్ణయించుకున్నాను. నా వైపు నుండీ ఎటువంటి తప్పూ లేదని దృఢంగా నమ్ముతున్నాను. అందుకే ఈసారి సారీ చెప్పదలుచుకోవడం లేదు. ఇలాంటి ఒక కొత్త అనుభవాన్ని ఇచ్చినందుకు థాంక్స్. ఇదీ నా జీవితం నాకు నేర్పిన పాఠం గానే అనుకుంటాను.
ఇట్లు
నీ శ్రేయోభిలాషి.
~
..చదివారా! నా బ్రేకప్ లెటర్! తను స్వతహాగా తన ఫీలింగ్స్‌ని వ్యక్తపరచుకునే వ్యక్తి కాడని తెలుసు. ఇది ఒక పార్శ్వం. ఇక తన ఇష్టాల్ని చంపుకుని ఒంటరిగా ఉండిపోవడమనేది ఇంకో పార్శ్వం. ఇక మనిషికి ఇరు పార్శ్వాలు అంటూ ఉంటాం. మూడో పార్శ్వం కూడా ఉంటుందని నా అనుభవం.
ఒకసారి నెయ్యిని బాగా గమనించండి. అది తనంత తానుగా గడ్డ కట్టి, తనంత తానుగా ద్రవీకరించినప్పుడు అదే స్థితిలో ఉంటుంది. అదే గడ్డ కట్టిన నెయ్యిని పొయ్యి మీద కరిగించి చూడండి.. అప్పటికి కరిగినా మళ్ళీ గడ్డ కడితే అది స్వతహాగా మళ్ళీ కరగదు. పైగా ఇంకా గట్టిగా తయారవుతుంది. ప్రతిసారీ కరిగించుకోవలసిందే. తన మనసుని గమనిస్తే నాకు అచ్చంగా నెయ్యి లాగే అనిపిస్తుంది. తను వ్యక్తపరిస్తే అది ఏ భావమయినా సహజంగా ఉంటుంది. తనని ప్రేరేపించి ప్రేమని పొందాలనుకున్న ప్రతిసారీ తను మరింత జడంగా మారిపోవడం చూసాక తనది నేతి మనసు అని అర్థమవుతూ వచ్చింది. అందుకేనేమో నేనొక రోజు కాఫీ పొడి ప్యాకెట్ బహుమతిగా ఇచ్చినప్పుడు తను నెయ్యి ప్యాకెట్‌ను బహుమతిగా ఇచ్చాడు. నాకు ఆ రోజెందుకో అర్థమవలేదు. ఇప్పుడు తనది నేతి మనసని చెప్పకనే చెప్పాడేమో అనిపిస్తుంది. ఇది అప్రయత్నం గానే ఇచ్చి ఉండొచ్చు.. కానీ ఎంత చక్కగా చెప్పే ప్రయత్నం చేసాడో తను.
ఇదండీ! నాకు తారస పడిన నేతి మనసు. ‘నేతి మనసు’ అన్న నా కథకి పేరు సరిపోయిందా? మీరే చెప్పండి!

రచయిత ఆసూరి హనుమత్ సూరి స్వంత ఊరు అనంతపురం. వృత్తి రీత్యా భారతీయ జీవిత బీమా సంస్థలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ఈయన తన డిగ్రీని ఆంధ్ర ప్రదేశ్ గురుకుల కళాశాల, నాగార్జున సాగర్‌లో చేశారు. శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురంలో గణితంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ప్రస్తుతం హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. ఛందస్సులో పద్యాలు, కవితలు మరియు కథలు రాయడం ఈయన అభిరుచులు.
18 Comments
K.Ravi
హనుమత్ సూరి గారి కలం నుండి మరో సరదా కథ చదివి,ఈ ఆదివారం ఉల్లాసంగా అనిపించింది.వీరి ఆలోచనా మరియు రచన శైలి జంధ్యాల గారిని గుర్తుచేస్తుంది వీరి నుండి మరిన్ని చక్కటి కథలు ఆశిస్తూ…
కరణం రవి
ASURI HANUMATHSURI
ధన్యవాదాలు…రవి గారూ!
Roddam Hari
హనుమత్ సూరి గారు ,
మీ “నేతి మనసు” చాలా బావుంది.
ఆద్యంతం interesting
గా వుంది.
Congratulations.
రొద్దం హరి,
అనంతపురము.
ASURI HANUMATHSURI
TQ Hari గారూ
రామారావు
ఈ సారి నా నేతి మనసు కరగ లేదండి
ASURI HANUMATHSURI
పోనీ లెండి. మీది నేతి మనసు అని ఒప్పుకున్నారు. ధన్యవాదాలు.
Raghurami Reddy
Suri, Nice story. Appreciate you for this. Writing everyone like this not possible.Keep writing.
ASURI HANUMATHSURI
ధన్యవాదాలు…రఘు…
శోభన్ బాబు, లెక్చరర్
సూరి గారు,
చాలా బాగుంది.
అమ్మాయి మనసు కు నెయ్యి కి పోల్చడం కొత్త ప్రక్రియ.
Keep it up for new thoughts.
ASURI HANUMATHSURI
TQ shobhan…
నంద్యాల సుధామణి
నేతిమనసు కథ సరదాగా సాగింది. కానీ, ఎవరి మనసులోనైనా రెండు పార్శ్వాలూ వుంటాయనుకుంటా! ఒకటి నేతి విభాగం…మరోటి తేనెవిభాగం! సదరు వ్యక్తికి ఎదురైన మనిషిని బట్టి తేనో, నెయ్యో యేదో ఒక పార్శ్వం బయటికొస్తుందేమో! ఏమైనా ప్రేమ అనే టాపిక్ ఎవర్ గ్రీన్ కదా! అది నిరంతరంగా, నిరాఘాటంగా, దేశకాలమానాలతో ప్రమేయం లేకుండా సాగుతూనే వుంటుంది. రచయితలు తమ శక్తి కొద్దీ కథల పంట పండించుకుంటూ పోవచ్చు. కానీ గడ్డకట్టినా నెయ్యి రుచి నెయ్యిదే కదండీ…మరీ తీసిపడేయక్కర్లేదేమో!
ASURI HANUMATHSURI
చాలా బాగా విశ్లేషించారు…మీ కామెంట్ కి హ్యాట్సాఫ్…ధన్యవాదాలు…I loved it.
BTV
సూరీ ! కథ చాలా బాగుంది.సరదా గా , హాపీ గా సాగింది. మీ కలం నుండి ఇలాంటి మరిన్ని కథలు రావాలని ఆశిస్తూ..
మీ BTV
ASURI HANUMATHSURI
TQ BT…
T.Suri Kumar
చాలా చక్కని, ఆహ్లాదకరమైన కథ !!
ASURI HANUMATHSURI
TQ suri గారూ..!
M V S MURTHY
ప్రియమైన సూరి
చక్కటి కథ కథనంతో నూతన శీర్షికతో మనసును ఆకట్టుకున్న నేతి హృదయం చాలా అభినందనీయం.
జంధ్యాల గారి రచనలా వున్నదని ఒక ప్రశంస నిజం కావాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ
మీ మిత్రుడు
యం వి యస్ మూర్తి
ASURI HANUMATHSURI
ధన్య వాదాలు సార్..