[శ్రీమతి దివాకర్ల రాజేశ్వరి రచించిన ‘న్యూ ఇయర్ కేలండర్’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]


ఆంగ్ల నూతన సంవత్సరం
అభిలాషను కలిగిస్తుంది.
వసుధైక కుటుంబం అనిపిస్తుంది
వివిధ దేశ ప్రాంతాల ఆచరణలను
సమీకరిస్తుంది
తారీఖు గడులలలో
తిథి, నక్షత్రాల సంయోగం చేస్తుంది.
ముక్కు పచ్చలారని ‘న్యూ ఇయర్ కేలండర్’ ను
భుజాన తగిలించుకుని
మంచి రోజులొచ్చే జాగ్రతలను
మురిపెంగా తెలుపాలని
లివింగ్ రూములో
నిలువెత్తు గోడ ఉవ్విళులూరుతుంది.
దగ్గరున్న బ్యాంకు వారు
పాత ఖాతాదారుల కిచ్చిన
పెద్ద అంకెల కేలండరులో
మొదటి పండుగ సంక్రాంతి,
ముగ్గుల అట్టహాసానికి ముందుగా,..!
సేవలను చేయాలనే మంచి తలపుల
సార్థక్యానికి శ్రమించే గుణంతో
నాయకునిగా రాణించాలని తెలిపిన
వివేకానంద వాణి
యువజన దినోత్సవానికి
దిక్సూచి నిస్తుంది.
జనవరి చలి తొలి ఝాములో
నులివెచ్చని మెలకువల
సుప్రభాత సమయానికి,
జనగణ మన రాజ్యాంగ రచనల
పౌర బాధ్యతల హెచ్చరిక
రిపబ్లిక్ డే పతాకను ఎగుర వేస్తుంది.
కదలి రమ్మని పిలుపునిస్తుంది.
ఇంట్లో పాప పుట్టిన రోజు
ఈ తారీఖున వచ్చిందని చేసుకున్న
కేకు కటింగ్ సంబరానికి
సంతసిస్తూనే
‘అండ్ కో’ వారు తెలుగులో ముద్రించిన కేలండరు
పట్టికను చూసి
అసలైన పుట్టిన రోజు తిథి
వైకుంఠ ఏకాదశికి మరునాడని
పాపకు తలంటి, హారతినిచ్చి, జరుపుకున్న
తీపి వంటకాల విందు వేడుక ముచ్చట గొలుపుతుంది.
ఆంగ్లం అయితేనేం?
అంతర్జాతీయం పొంది పొసగుతుంది.
సూర్య చంద్రుల పరి భ్రమణానికి
భూమి గుండ్రం చుడుతూనే ఉంది.
సాంకేతిక ప్రగతిని సంప్రదాయం
శాసిస్తునే ఉంది
న్యూ ఇయర్ కేలండర్ను
అందమైన రవివర్మ చిత్రాల సంపుటంతో
కొనుగోలు చేయాలన్న కోరిక
బజారుకు బయలు దేర మటుంది.
గ్రెగొరియన్ కేలండర్ ఆగమనానికి
శుభాకాంక్షల ఎమోజి మెసేజ్ చేస్తూనే ఉంది.
