ఇది అల్లాఉద్దీన్కు దొరికిన
అద్భుత దీపం కథ కాదు.
‘సెసేమ్’ మంత్రంతో నడిచిన
ఆలీబాబా నలభై దొంగల కథ కాదు.
జలార్ణవాల్లోంచీ పుట్టుకొచ్చిన
ఒంటికన్ను రాకాసుల కథా కాదు.
రాజును మురిపించి
వెళ్ళిపోయిన మాయాకన్యల కథ కూడా కాదు.
వాళ్ళంతా నిన్ను ఊహాలోకాల్లో తిప్పి అలరించిన వారే
నీకేమీ అన్యాయం చెయ్యని వారే
ఇపుడు చెప్తా విను అసలైన కథ!
కనపడని మాయల తంత్రంతో
ఒంటరి యుద్ధం చేస్తున్న ఒక పోరాట యోధుడి కథ
ఏ అద్భుత దీపాలూ లేకుండా కథ నడిపే వారి కథ
ఏ ‘సెసేమ్’ మంత్రాలకూ తెరవలేని గుహల కథ
క్షణానికొకటిగా మొలిచే రాకాసులనెదిరించే కథ
ఏ వీరత్వాన్నీ చూసి ప్రేమించని మాయాలోకపు కథ
నిను ఉసిగొల్పి పరిగెత్తించి
నీ కాళ్ళ కింద నేలని లాక్కు పోయే దొంగల కథ
నీ కంటికి కలిక మేసి
కనురెప్పలు దోచుకునే మాంత్రిక మేధావుల కథ
నిన్ను చీకటి గదిలోనే ఉంచి
నీ చుట్టూ ఆడుతున్న కోతి కొమ్మచ్చి కథ
నీవే అల్లాఉద్దీనై ఆలీబాబావై సాహస యోధుడివై
మాయల తెరలు చీల్చి మర్మం కనుక్కొచ్చే కథ
నీకు తెలియకుండా జరిగే నీదే అయిన కథ
నీ భుజాన వీడకుండా వేలాడుతున్న బేతాళుడి కథ
ఓ కొత్త కథ ఉంది చెప్పనా?

విజయ్ కోగంటి పేరుతో తెలుగు, ఇంగ్లీషులలో కవిత, కధా రచన, అనువాదాలు చేసే డా. కోగంటి విజయబాబు ఆంగ్ల అధ్యాపకుడు. దక్షిణాఫ్రికా లోని వివక్ష రాజకీయాలను తన రచనలలో ఖండించిన అటోల్ ఫ్యుగాడ్ నాటకాలపై సిద్ధాంత గ్రంధానికి పి.హెచ్డీ పొందారు. ఆంగ్ల భాష, సాహిత్య విషయాలపై పలు పత్రాల సమర్పణ, వ్యాసరచన చేసారు. విద్యార్ధి కేంద్రిత ఆంగ్ల బోధనా పద్ధతులపై అనేక మంది అధ్యాపకులకు కార్యశాలల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. రెండు సార్లు అంతర్జాతీయ స్కాలర్షిప్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్నారు. ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) , ‘ఒక ఆదివారం సాయంత్రం ఇంకా ఇతర కవితలు’(2020)ఈయన కవిత్వ సంపుటులు. పాశ్చాత్య రచయితలను పరిచయం చేస్తూ ‘ పడమటి రాగం’ ఆనే వ్యాస సంపుటిని,
కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ దేవిప్రియ ప్రేమ కవితలను డా. పద్మజ తో కలిసి ఆంగ్లం లోనికి ‘స్లీపింగ్ విద్ ద రెయిన్ బొ’ గా అనువదించారు. ‘ ద స్పారో అండ్ ద కానన్’ అనే ఆంగ్ల కవితల సంపుటిని 2021 లో ప్రచురించిన డా. విజయ్ కోగంటి తన మొదటి కవిత్వసంపుటి ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) కి శ్రీ నాగభైరవ సాహితీ పురస్కారం అందుకున్నారు. ‘పైనాపిల్ జామ్’ (2023) ఈయన మొదటి కథా సంపుటి.
డా. కోగంటి విజయబాబు ప్రస్తుతం కామవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నారు.
drvijaykoganti2@gmail.com
8309596606