‘కరుణ కుమార’ అనే కలము పేరుతో కందుకూరి అనంతము గారు 1936-50 మధ్య కాలములో కథలు వ్రాశారు. ఈ కథలలో గ్రామజీవనమే కథా వస్తువు. మోతుబరి భూస్వాముల కబంద హాస్తాలలో చిక్కుకున్న పూటకు గతిలేని బడుగు జీవుల దయనీయ జీవిత గాథలను చిత్రీకరిస్తూ బలవంతుల, భూస్వాముల కఠిన కర్కశ మనస్తత్వాలను తూర్పారబట్టి ఎంతో రసభరితముగా పాఠకులకు బహిర్గతము చేసిన కరుణా రస హృదయులు శ్రీ కరుణ కుమార.
బడుగు బలహీన వర్గాల భాధలు నేటికీ అలాగే న్నాయి కాబట్టి ఈ కథలకు ఆకర్షణ తగ్గలేదు. ఆ కథలను చదివిన పాఠకులు సమాజములో బడుగు బలహీన ప్రజలపై ధనిక భూస్వామ్య వర్గాల అరాచకాలను అర్థము చేసుకోగలుగుతున్నారు. ఏప్రిల్ 1901లో పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టి తణుకులో హైస్కూల్ చదువు ముగించి విజయనగరంలో కాలేజీలో చేరినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మాని ఉద్యోగ ప్రయత్నాలలో నెల్లూరు జిల్లా వచ్చి కనిగిరిలో నెలకు 10 రూపాయల జీతముతో బస్ కండక్టర్‌గా చేరారు. ఆ తర్వాత కనిగిరి తాలూకా ఆఫీసులో రెవిన్యూ ఉద్యోగిగా ప్రభుత్వ ఉద్యోగములో చేరారు. రెవిన్యూ ఉద్యోగమూ చేస్తూనే నాటకాలు వేసేవారు. ఉద్యోగ రీత్యా గ్రామాలలో పర్యటిస్తూ గ్రామీణ ప్రజల ముఖ్యముగా బడుగు బలహీన వర్గాల ప్రజల కష్టాలను చూసి 1934, 35లలో మొదటిసారిగా గ్రామీణ ప్రజల ఇతివృత్తముతో కథలను వ్రాయనారంభించారు. ఎక్కువ భాగము నెల్లూరు జిల్లాలో వివిధ హోదాలలో పనిచేసి 1956లో, ఏప్రిల్ లో రిటైర్ అయినారు.
పల్లెలలో జరిగే జాతరలు పర్యవేక్షిస్తూ ఆ జాతరలు ప్రభావము వలననే అయన,”మొక్కుబడి” అనే కథ వ్రాశారు. వీరు హరిజనోద్ధరణ, అహింసా సిద్ధాంతము అంటే ఆసక్తి కనబరిచేవారు. గ్రామ ప్రజల సౌభాగ్యమే దేశ సౌభాగ్యానికి మూలము అని గట్టిగా నమ్మిన వ్యక్తి. వీరికి కరుణ కుమార అనే కలము పేరు పెట్టింది, వీరిని ప్రోత్సహించింది వీరి బావగారు అయిన మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు.
సాహిత్యము ద్వారా సమాజ సేవ కోసము దీక్ష వహించిన కరుణ కుమార గారు తెలుగువారి ప్రేమ్‌చంద్‌గా తెలుగు పాఠకులకు అభిమాన పాత్రుడు కాగలిగారు.
***
ప్రస్తుతము ‘కరుణ కుమార’ కథలలో ‘సన్నజీవాలు’ అనే శీర్షిక క్రింద ప్రచురితమైన “టార్చ్ లైట్” గురించి ముచ్చటించుకుందాము. ఈ కథలో ఒక బడుగుజీవి ఉపాధ్యాయుడిగా ఒక ఊరుకు వచ్చిస్కూల్ బాగు కోసము ఏదో చేద్దామని ప్రయత్నము చేసి ఆ ఊరిలోని అగ్రవర్ణాల కోపానికి గురి అయి ఉద్యోగాన్ని పోగొట్టుకోవటాన్ని రచయిత చాలా చక్కగా వివరించారు. ఇందులో పల్లెటూరి వాతావరణము, అక్కడి కుల వ్యవస్థల ఆధిపత్యాన్ని చక్కగా కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తారు.
కథలోకి వస్తే రెడ్డి పాలెము అనేది చాలా చిన్న పల్లెటూరు. మొదట్లో చాలా రోజులు ఒక వైదికి ఆయన (బ్రాహ్మణుడు) వీధి బడిని నిర్వహించేవాడు. గత ఏడాది బోర్డు ఎన్నికలలో గెలిచిన గరటయ్య అనే పక్క ఊరు మోతుబరి రైతు రెడ్డి పాలెము మీద ఉన్నఅభిమానంతో మంచి చేయాలనే తలంపుతో రెడ్డి పాలెనికి బోర్డు స్కూల్ మంజూరు చేయించి గవర్నమెంట్ సొమ్ము పదిహేను వందలతో (1935 నాటి మాట) స్కూలు బిల్డింగ్ కట్టించి వీధి బడికి వెళ్లే పిల్లలను బోర్డు స్కూలులో చేర్పించాడు. ఇద్దరు టీచర్లకు చాలినంత మంది పిల్లలు లేరని ప్రెసిడెంట్ గారు ఊరు అంతా తిరిగి పని పాట చేసుకొనే చాకలి, మంగలి, కుమ్మరి, గొల్ల, యానాది వగైరా పిల్లలను ఓ అరవై మందిని పోగు చేసి స్కూల్లో చేర్పించాడు.
కొత్తగా పెట్టిన స్కూల్ కాబట్టి పబ్లిసిటీ ఉండాలంటే పిల్లల చేత అట లాడించి వాళ్లకు బహుమతులు ఇవ్వాలని ప్రసిడెంట్ గారి నుంచి స్కూల్ హెడ్మాష్టర్ జకరయ్యకు తాఖీదు వచ్చింది. దీనికి అయ్యే ఖర్చు ఊళ్ళో పెద్దరైతుల వద్ద చందాలు వసూలు చేసుకోమని ప్రెసిడెంట్ గారు హెడ్మాస్టర్కు ఉచిత సలహా కూడా ఇచ్చాడు. ఈ పధకానికి ప్రెసిడెంట్ గారు “ఆరోగ్య వారము” అని కూడా పేరు పెట్టాడు.
ఆ హెడ్మాస్టర్ జకరయ్య క్రైస్తవుడు, బీదవాడు, భయస్తుడు. ప్రెసిడెంట్ గారి తాఖీదు తీసుకొని గ్రామములోని పెద్దలకు చూపించి చందాలు అడిగాడు. ఆరోగ్య వారము ఇవేవి అర్ధము కాకపోయినా పిల్లల చేత ఆటలాడిస్తాడు బహుమతులు వస్తాయి అన్న ఆలోచనతో చందాలు ఇచ్చారు. హెడ్మాస్టర్ జకరయ్య స్కూళ్ల ఇన్స్పెక్టర్ సమక్షంలో పిల్లలకు పట్నవాసపు బడులలో ఏరకమైన ఆటల పోటీలు ఉంటాయో అవన్నీ ఆడించాడు. ఆటల్లో గెలిచిన పిల్లలకు రకరకాల బహుమతులు స్కూళ్ల ఇన్స్పెక్టర్ చేత ఇప్పించాడు
అప్పుడు మొదలైంది అసలు సమస్య! ఏమిటి అంటే ఆ బహుమతులు వచ్చిన పిల్లలలో చాకలి, యానాది, గొల్ల, కమ్మరి, కుమ్మరి మొదలైన వాళ్ల పిల్లలే తప్ప డబ్బులు ఇచ్చిన రైతుల పిల్లలు ఒక్కడు కూడా లేడు. గ్రామస్తులంతా కుతకుత లాడిపోయినారు. “మేము డబ్బులిస్తే బహుమతులు అన్ని అలగా జనము పిల్లలకు ఇస్తావా?” అని జకరయ్యను నిలదీశారు. రైతుల పిల్లలు కూడా బహుమతులు రాకపోవటంతో ఇంట్లో ఏడుపులు, ఇంట్లో ఆ బహుమతులు మాకు ఇస్తావా చస్తావా అని వాళ్ళ నాన్నలను పీక్కుతినటం మొదలుపెట్టారు. ఇది పెద్ద అవమానంగా గ్రామస్తులు… అంటే డబ్బు ఇచ్చిన వారు భావించారు. ఇంకా ఆరోజు రాత్రి అంతా పెద్ద గ్రామస్తుల ఇళ్లలో ఎండగలు ఉపవాసాలే.
మరునాడు ఉదయము ఊళ్ళో పెద్దలు మీటింగ్ పెట్టి జకరయ్యను పిలిచి “మా దగ్గర డబ్బులు వసూలు చేసి బహుమతులు అన్ని మావద్ద పని చేసే నౌకర్లు చాకర్ల పిల్లలకు ఇస్తావా? నీకు ఇంత పొగరా?” అని నిలదీశారు పాపము జకరయ్య గడగడ లాడాడు.
పిల్ల దగ్గర నుంచి బహుమతులు వెనక్కు తీసుకొని ఇవ్వటం కుదరదు. తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది.
చివరికి జకరయ్య, “సామీ మీకు దణ్ణము పెడతా. ఇచ్చిన బహుమతులు వాపసు తీసుకోవటానికి రూల్స్ ఒప్పుకోవు. నా స్వంత డబ్బులతో ఆ వస్తువులు కొని మీ పిల్లలకు ఇస్తాను. అంత మాత్రము దయ పెట్టండి” అని బ్రతిమాలాడు.
కానీ ఊళ్ళో పెద్దలు “మా పిల్లల చేతిలో ఉండాల్సిన బహుమతులు అలగా జనము పిల్లల చేతుల్లో ఉండకూడదు నీవు పోయి వాటిని వాపసు తీసుకురా” అని నిష్కర్షగా చెప్పారు.
పాపము జకరయ్యకు దిక్కుతోచక నేరుగా జిల్లా బోర్డు ప్రెసిడెంట్ గరటయ్య దగ్గరకు వెళ్లి విషయమంతా ఆయనకు విన్నవించుకొని తనను రక్షించామని ప్రాధేయపడ్డాడు. ప్రెసిడెంట్ అసాధ్యుడు. రాజకీయవేత్త, దూరాలోచనపరుడు. రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యే పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నవాడు ఊళ్ళో వాళ్ళను దూరము చేసుకోలేడు. ఇవన్నీ ఆలోచిస్తూ జకరయ్యతో, “నీకు భయమేమీ లేదు రేపు మీ ఊరు
వచ్చి పెద్దలతో మాట్లాడి వ్యవహారము పరిష్కారము చేస్తా నీవు వెళ్ళు” అని హామీ ఇచ్చి పంపించాడు
జకరయ్య ప్రెసిడెంట్ దగ్గరకు వెళ్లిన సంగతి తెలిసిన గ్రామ పెద్దలు బహుమతులు తీసుకున్న పిల్లల తల్లిదండ్రులను రచ్చకు పిలిపించి బెదిరించి ఆ బహుమతులన్నింటిని గ్రామ పెద్ద స్వాధీనములో పెట్టామన్నారు. అందరు ఊళ్ళో పెద్దలకు భయపడి వస్తువులు తిరిగి ఇచ్చారు. కాని ఒక చాకలి వాళ్ళ పిల్లవాడు తనకు వచ్చిన ‘టార్చ్ లైట్’ బహుమతిని ససేమిరా తిరిగి ఇవ్వను అన్నాడు. ఆ కుర్రవాడి తండ్రి రంగము లాంటి పట్టణాలు తిరిగి వచ్చిన వాడు. ఏడు అడుగుల ఎత్తు ఉన్న ఆజానుబాహుడు. కాస్త డబ్బున్నవాడు వాడు కూడా. కొడుకు పక్షానే ఉండి ‘ఎందుకు ఇవ్వాలి?’ అని ఇచ్చిన వాళ్ళను చీవాట్లు పెట్టి పురెక్కించాడు.
మరునాడు ప్రెసిడెంట్ ఊర్లోకి వచ్చి గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళి మంతనాలు సాగించాడు. అంతా గోప్యముగా జరిగింది. ఆ తర్వాత ప్రెసిడెంట్ ఊరు వెళ్ళిపోయాడు.
రంగము చాకలివాడి హుషారు చూసుకోని మిగతా వాళ్ళు కూడా నడుములు బిగించారు. ఊరి పెద్ద వీధిలోకి రావటము మానేసి రహస్యముగా మాలవాళ్ళకు చెప్పి డబ్బులు ఇస్తానని, కల్లు పోయిస్తానని బేరాలు చేయటము మొదలుపెట్టాడు. వ్యవహారము ముదిరి కొట్టుకొనేదాకా వచ్చేటప్పటికి మునసబు, కరణాలు చల్లగా తప్పుకొని పోలీసులకు మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు.
ప్రెసిడెంట్ వెళ్లిన రెండు రోజుల తరువాత జకరయ్యకు పోస్ట్ లో ఒక కవర్ వచ్చింది. అది చింపి చూస్తే ఇలా ఉంది,
ఉత్తర్వు
“ఇటీవల మీ గ్రామములో జరిగిన ఆరోగ్య వారము సందర్భముగా మీరు అజాగ్రత్తగా వ్యవహరించటం వల్ల గ్రామములో అనవసరమైన కలతలు ఏర్పడి పాఠశాల పురోభివృద్ధికి, గ్రామ పురోభివృద్ధికి భంగము వాటిల్లటానికి మీరు కారణము కాబట్టి, మీరు స్కూలు టీచర్ గా ఉండటానికి అనర్హులుగా తీర్మానించి మీ సంజాయిషీతో నిమిత్తము లేకుండా మిమ్మల్ని ఈ తేదీ లగాయితు నౌకరి నుండి బర్తరఫ్ చేయడము అయినది.
(సం) గరటయ్య
జిల్లా బోర్డు ప్రెసిడెంట్
ఈ ఉత్తరము చూసిన జకరయ్య పరిస్థితిని మీరు ఉహించవచ్చు.
Your email address will not be published. Required fields are marked *
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
గూఢచారి లాంటి The Wedding Guest
జీవన రమణీయం-85
‘యాత్ర’ చూద్దామా ఎపిసోడ్-11
నీలమత పురాణం – 52
మానస సంచరరే-30: మనసే అందాల బృందావనం!
All rights reserved - Sanchika™