31
రోజులు గిర్రున తిరిగాయ్ – శుక్రవారం రానే వచ్చింది. సాయంత్రం నాలుగు గంటలకల్లా సదానంద్, శ్రీకాంత్, శ్రీలక్ష్మి బిర్లామందిర్ గార్డెన్లో కలుసుకున్నారు.
వాళ్ళు ముగ్గురిలో ఒక తెలియని ఉత్కంఠ… ఏదో చెప్పాలనే ఉబలాటం..
“సార్! ఈ పుస్తకంలో సదానంద్ క్యారెక్టర్…. డిటో మీరే సార్… మహేంద్ర క్యారెక్టర్ నన్ను చూసే రాసినట్లుంది సార్” ఆశ్చర్యంగా అన్నాడు శ్రీకాంత్.
“అవునండి… లావణ్య క్యారెక్టర్ నా గురించే రాసినట్లుంది సార్” కళ్ళు పెద్దవి చేస్తూ చెప్పింది శ్రీలక్ష్మి.
“అవును… నమ్మశక్యంగా లేదు కదా! సదానంద్ క్యారెక్టర్ విషయంలో నాకేమీ ఆశ్చర్యం లేదు… కారణం.. ఈ పుస్తకం వ్రాసింది నేనే కాబట్టి.”
“అంటే… ఈ పుస్తకం మీరే వ్రాసారా సార్?” అంటూ నోరెళ్ళబెట్టారు శ్రీకాంత్, శ్రీలక్ష్మి.
“అవును… నేనే…” అంటూ నింపాదిగా చెప్పాడు సదానంద్.
“కాకపోతే నా పుస్తకంలో నా గురించి నేను వ్రాసుకున్నాను. అందులో నాకేమీ ఆశ్చర్యం లేదు. కాని మీరిద్దరి క్యారెక్టర్స్ కూడా అచ్చుగుద్దినట్లు నా పుస్తకంలోకి రావడాన్ని నేను కూడా విశ్వసించలేకపోతున్నాను. ఇది కాకతాళీయంగా జరిగిందని నేననుకోవడం లేదు. విధి నా చేత అలా రాయించింది. అలానే విధి మన మగ్గుర్ని కలిపింది. ఇది విధాత లిఖితం కనుక ఇక మనకు తిరుగు లేదు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన కార్యక్రమాన్ని మొదలెడదాం.”
“అలాగే సార్…. వెంటనే మొదలెడదాం….” ఉత్సాహంగా అన్నాడు శ్రీకాంత్.
“మీరేమంటారు శ్రీలక్ష్మీ” అడిగాడు సదానంద్.
“తప్పకుండా మొదలెడదాం సార్ కానీ, నాదొక చిన్న డౌట్.”
“ఏమిటది?”
“పుస్తకం పై రచయితగా మీ పేరు కాకుండా వేరే పేరుంది.”
“మీ సందేహం సబబైనదే… పుస్తకం పైన ఉన్న పేరు నా తల్లిదండ్రులు పెట్టిన పేరు. నేను సినీ పరిశ్రమలో అడుగు పెట్టినపుడు మా గురువుగారు డైరెక్టర్ విశ్వంగారు నా పేరును సదానంద్‌గా మార్చారు. ప్రస్తతం ఇండస్ట్రీలో నేను సదానంద్గానే అందరికి తెలుసు.”
కొంచెం సేపు కళ్లు మూసుకుని ఆలోచించిన సదానంద్…
“ఇప్పుడు మీరెన్నడూ ఊహించని మరో విషయం చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి… నేను ఈ పుస్తకంలోని కథతోనే నా మొదటి సినిమా తీయబోతున్నాను. అందులో సదానంద్ పాత్రను నేనే వేయబోతున్నాను. మహేంద్ర కారెక్టర్ శ్రీకాంత్, లావణ్య క్యారెక్టర్ శ్రీలక్ష్మి చేయబోతున్నారు” అంటూ తన నిర్ణయాన్ని బాహాటంగా వెలిబుచ్చాడు.
ఆ మాటలు విని అవాక్కయిన శ్రీకాంత్, శ్రీలక్ష్మి నోట మాట రాక మౌన ముద్రలోకి జారుకున్నారు. ఆ క్షణంలో జరుగుతున్నది కలా…. నిజమా…. అని తేల్చకోలేక సతమతమై పోయారు.
“హాలో…. మీరు విన్నది నిజమే… మన భవిష్యత్ కార్యక్రమం ఇక అదే” అంటూ వారిద్దర్ని వర్తమానంలోకి తెచ్చాడు సదానంద్.
“సార్!…. నేనేంటి… సినిమాలేంటి? నేను ఏనాడు వేదిక పైన కూడా మాట్లాడలేదు… చాలా బిడియం సార్… నాకు” అంటూ ఆశ్చర్యం వెలిబుచ్చాడు శ్రీకాంత్.
“సార్!… నేనైతే సినిమాలే చూడను. సినిమాకు నాకు అసలు సంబంధమే లేదు కదా సార్….” అంటూ తన అశక్తతను వ్యక్తీకరించింది శ్రీలక్ష్మి.
“డోంట్ వర్రీ!… అవన్నీ నేను చూసుకుంటాను. మీరైతే మానసింకంగా ఈ సినిమాలో నటించడానికి తయారవండి… ఓ.కే.నా” గద్దించి అడిగాడు సదానంద్.
“మీ ఇష్టం సార్!” అయిష్టంగానే చెప్పారు శ్రీకాంత్, శ్రీలక్ష్మీ.
“ఆ… శ్రీకాంత్… ఈ రోజు నుండి నీ పేరు మహేంద్ర… ఆ… శ్రీలక్ష్మీ… ఈ రోజు నుండి నీ పేరు లావణ్య… ఈ పేర్లతోనే మీరు సినిమా ఇండస్ట్రీలోకి వస్తున్నారు. ఆల్ ది బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ” శుభాకాంక్షలు చెప్పాడు సదానంద్.
“థాంక్యూ సార్” నీరసంగా చెప్పారు శ్రీకాంత్, శ్రీలక్ష్మీ.
“అరే… ఏంటిది! సంతోషంగా హూషారుగా వుండాలి మరి…” అంటూ వాళ్లని ఉత్తేజ పరిచాడు సదానంద్.
“నెక్ట్స్ స్టెప్… రేపు ఉదయం పదకొండు గంటలకు మీరిద్దరూ మా ఆఫీసుకు వస్తున్నారు. అక్కడ మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. మన టీం మెంబర్స్ అందర్నీ మీకు పరిచయం చేస్తాను” అంటూ తన విజిటింగ్ కార్డులను ఇద్దరికీ ఇచ్చాడు.
“అలాగే సార్” అంటూ తెచ్చి పెట్టుకున్న సంతోషంతో చెప్పారు శ్రీకాంత్, శ్రీలక్ష్మీ.
“అన్నట్లు ఈ విషయాన్ని మీరు రేపు సాయంత్రం వరకూ మీ ఇంట్లో చెప్పవద్దు. ఆ తరువాతనే చెప్పండి… ఓ.కే.నా”
“ఓ.కే సార్”
“గుడ్… ఇక మనం రేపు కలుద్దాం… పదండి వెళ్దాం.”
ముగ్గురూ సైలెంట్‌గా అక్కడి నుండి బయలుదేరారు.
32
ఇంటికి వెళ్లినప్పటి నుండి శ్రీకాంత్ ఆలోచనలు పరి పరి విధాలా పోతున్నాయ్. తిండి సహించలేదు. నిద్ర పట్టడం లేదు. ప్రక్క మీద అటూ ఇటూ దొర్లుతూ మధ్యమధ్యలో లేచి కూర్చుంటూ…. అటూ ఇటూ నడుస్తూ…
“ఏమిటీ విపరీతం… సదానంద్గారితో పరిచయం, ఆయన వ్రాసిన పుస్తకంలో నా వ్యక్తిగత జీవితం ప్రతిబింబించడం, అదే సినిమాగా రావడం, అందులో నేను నటించడం…. తలుచుకుంటేనే… ఇందంతా జరిగేదేనా అనిపిస్తుంది. కాని సదానంద్ గారిని చూస్తున్నా… ఆయన చెప్పే మాటలు వింటున్నా… అవన్నీ జరుగుతాయనే నమ్మకం కలుగుతుంది. మరి నేను సినిమా యాక్టర్‌గా రాణించగలనా?…. ఏమో చూడాలి మరి… సదానంద్ గారు చెప్పినట్లు ఇదంతా విధాత లిఖితమే అయ్యుంటుంది. నేను ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న మంచి రోజులు వచ్చినట్లే అనిపిస్తుంది. అదే జరిగితే నా అంత అదృష్టవంతుడు మరొకడుండడు. నాన్నకు, అమ్మకు, చెల్లికి ఏ కష్టం వారి దరిదాపుల్లోకి రాకుండా చూసుకుంటాను. వాళ్లు సుఖంగా జీవించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. అవును… భవిష్యత్తును ఊహించుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది. భగవంతుడా! అంతా నీ దయ!!” అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు శ్రీకాంత్.
అక్కడ శ్రీలక్ష్మి పరిస్థితి కూడా అలాగే వుంది. మనసునిండా ఏవేవో ఆలోచనలు. నిద్రరావడం లేదు. ఆ విషయం అమ్మ పసిగడితే… తనూ నిద్రపోదు. పైగా… ఏమైనా జరిగిందేమోనని…. ఆందోళన చెందుతుంది. అందుకనే కదలకుండా ఆలోచనలను కట్టడిచేయాలని ప్రయత్నంచేసింది. కాని ఫలితం శూన్యం.
“సదానంద్ గారితో పరిచయం… ఆయన వ్రాసిన పుస్తకంలో నా జీవితం గురించి వ్రాసివుండడం, అదే సినిమాగా రావడం, ఆ సినిమాలో నేను నటించడం… ఇదంతా జరిగేనా… ప్రస్తుతానికి సేల్స్ గర్ల్‌గా ఉద్యోగం చేస్తున్న నేను, అమ్మకు సాయంగా వుంటున్నాను. తమ్ముడు బాగా కష్టపడి చదువుకుంటున్నాడు. కొంతలో కొంత స్థిమితపడ్డాం. ఈ తరుణంలో కల్లో కూడా ఊహించని మార్పు జరగబోతుంది. అదే…. సినిమాలో నటించడం…. పైగా సినిమాల్లో నటించాలనుకునే మరియు నటించే మహిళలపై వస్తున్న రూమర్లు, గాసిప్స్… రోజూ వింటూనే వున్నాం. అలాంటి ఇండస్ట్రీలో నేను ఒక నటిగా ఇమడగలనా! ఏమో… మరి… చూడాలి. కాని సదానంద్ గారి మాటలు మాత్రం చాలా ఆశాజనకంగా వున్నాయ్. నేను ఎదురు చూస్తున్న మంచి రోజులు రాబోతున్నాయనే సూచనలు కనిపిస్తున్నాయ్…”
అదే జరిగితే అమ్మకి, తమ్ముడికి ఏ లోటూ రాకుండా సుఖంగా ఉండేట్లు చూసుకుంటాను. అయినా మన చేతుల్లో ఏముంటుంది. ఎలా వ్రాసి పెట్టివుంటే అలా జరుగుతుంది. అంతా దేవుడి దయ అనుకుంటూ తనకు తెలియకుండానే నిద్రా దేవి ఒడిలోకి చేరుకుంది.
33
విజిటింగ్ కార్డులోని అడ్రసు ప్రకారం ఉదయం పదకొండు గంటలకు సదానంద్ ఆఫీసుకు చేరుకున్నారు శ్రీకాంత్, శ్రీలక్ష్మీ, ఫిల్మ్ నగర్ మెయిన్ రోడ్డులో అదొక పెద్ద అందమైన అధునాతన మూడంతస్తుల భవనం. సప్తవర్ణాల హరివిల్లు డిజైన్ బ్యాగ్రౌండ్లో ఆఫీస్ నేమ్ బోర్డు చూపరులను ఆకర్షిస్తూ స్వాగతం చెప్తుంది.
రెయిన్బో క్రియోటివ్ ఎంటర్ప్రైజ్ మూవీమేకర్స్
ఫిల్మ్‌నగర్ – హైద్రాబాద్.
లోపలికి వెళ్లగానే సినిమా సెట్టింగ్‌లను తలపింపజేసే అల్ట్రామోడ్రన్ ఇంటీరియర్ డిజైన్స్‌తో బాగా రిచ్ లుక్ ఉండేలా ప్లాన్ చేసినట్లనిపించింది.
ఎదురుగా అందంగా నాజూగ్గా వున్న రిసెప్షనిస్టు ఇంటర్కమ్లో మాట్లాడుతూ శ్రీకాంత్, శ్రీలక్ష్మీని చూసి, “జస్ట్ ఎమినిట్” అని ఫోన్లో చెప్పి, “మీరు సదానంద్ గారి కోసం వచ్చారనుకుంటా… అలా లాబీలో కూర్చోండి. మరి కాసేపట్లో సార్ వస్తారు” అని చెప్పి ఫోన్ సంభాషణలో మునిగిపోయింది. లాబీలో కూర్చున్న రెండు నిముషాలకు అడక్కుండానే రెండు మంచి నీళ్ల గ్లాసులు, రెండు టీ కప్పులు పెట్టి వున్న ట్రేను తెచ్చి మాముందున్న టీపాయ్ మీద పెట్టి వెళ్లిపోయాడు ఉత్సాహంతో ఉట్టిపడుతున్న ఓ అటెండర్.
ప్రక్కనే వున్న స్టాండులో సర్దివున్న సినిమా పత్రికలను తిరగేస్తూ టీ త్రాగడం పూర్తి చేశారు శ్రీకాంత్, శ్రీలక్ష్మి.
ఇంతలో ఉత్తేజంతో ఉప్పొంగిపోతున్న సదానంద్ మరో ఇద్దరితో కలిసి లాబీ లోకి వచ్చారు.
“హాయ్… శ్రీకాంత్ అండ్ శ్రీలక్ష్మీ… ఓ… సారీ… మహేంద్ర అండ్ లావణ్యా… వెల్కం టు అవర్ ఆఫీస్” అంటూ ఇద్దరినీ సాదరంగా ఆహ్వానించాడు. వాళ్లిద్దరిని ప్రతి డిపార్టుమెంటుకు తీసుకెళ్లి అక్కడున్న వారందరికి పరిచయం చేశాడు. వాళ్లందరూ వీళ్లను ఆప్యాయంగా పలకరించారు.
ఏంటీ… ఇక్కడ అందరూ సదానంద్ గారి లానే ఉంటారా అనేలా ప్రతి ఒక్కరి ముఖంలో ఆనందోత్సాహాలు, కలుపుగోలుతనం, ఎనర్జీ లెవెల్స్ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయ్. ఆఫీసు మొత్తం పాజిటివ్ వైబ్రేషన్స్‌తో నిండివున్నట్లనిపించింది. ఇంత మంచి వాతావరణంలో, ఇలాంటి వ్యక్తుల మద్యకు వచ్చిన వారెవరైనా ఉల్లాసమనే ఊయలలో ఊగుతూ ఉంటారనిపించింది మహేంద్ర, లావణ్యలకు.
వాళ్లిద్దరూ… తమ తోటి నటీనటులతో, మిగతా వారందరితో అరమరికలు లేకుండా కలిసిపోవడానికి పెద్దగా టైం పట్టలేదు. అలా ఆఫీసు అంతా చూపిస్తున్న సదానంద్ “ఆ! ఇదే మన జిమ్… వీలైనప్పుడు వచ్చి గంటకు మించకుండా వర్క్ అవుట్స్ చేసుకోవచ్చు. ఇది మన మెడిటేషన్ రూమ్…. ప్రతిరోజూ ఇక్కడుకు వచ్చి అరగంటకు మించకుండా మెడిటేషన్ చేసుకోవచ్చు. ఇవి రెండు మనం ఆఫీసులో ఉన్నప్పుడు మాత్రమే… అని వేరుగా చెప్పనక్కర్లేదనుకుంటా…” అన్నాడు.
“ఆ! ఇవి మన మీటింగ్ హాల్స్. ఇక నా క్యాబిన్‌కి వెళ్దాం రండి” అంటూ వాళ్లిద్దర్నీ తన క్యాబిన్‌కి తోడ్కొని వెళ్లాడు.
క్యాబిన్ చక్కగా, కళాత్మకంగా అలంకరించబడి వుంది. సదానంద్ తన సీట్లో కూర్చున్నాడు. ఎదురుగా వున్న కుర్చీల్లో కూర్చున్నారు మహేంద్ర, లావణ్య.
“ఆ! మీరు సోమవారం నుండి ఆఫీసుకు రావాలి. ఘాటింగ్ మొదలయ్యే వరకు ప్రతి రోజు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మన ఆఫీస్ టైమింగ్స్. ఘాటింగ్ మొదలైతే ఇక టైం మన చేతిలో వుండదు. నిర్ణయించిన షెడ్యూల్స్ బట్టి నడుస్తుంటుంది. మన సినిమా ప్రారంభోత్సవానికి కరెక్టుగా ఒక నెల టైం వుంది. ఈ నెల రోజుల్లో మీరు చెయాల్సిన ముఖ్యమైన పనులు… మొదటిది… మీరు పాత్రల గురించి క్షుణ్ణంగా తెలుసుకుని, ఒక అవగాహన ఏర్పరచుకోవాలి. అది మీకు చాలా ఈజీ…. ఎందుకంటే ఆ పాత్రలు వ్యక్తిగతంగా మీరే కనుక… రెండోది… రెగ్యులర్‌గా జిమ్ చేస్తూ శారీరక ఫిట్‌నెస్‌ని పెంచుకోండి, మెడిటేషన్ చేస్తూ, మానసిక స్థితిని అధీనంలోకి తెచ్చుకోండి. మూడోది…. డాన్స్ మాస్టర్ దగ్గర డాన్స్‌లు, ఫైట్స్ మాస్టర్ దగ్గర ఫైట్స్ నేర్చుకోండి. ఇక నాలుగోది… మీ ఇద్దరి గొంతుకలు డబ్బింగ్‌కి సరిపడేలా ఓపెన్ అప్ అవాలి. ఇది చాలా ఇంపార్టెంట్… అందుకు మీరు చేయాల్సిందల్లా కనీసం ఒక నెల రోజుల పాటు కేవలం పెరుగన్నం మాత్రమే తినాలి. ఉప్పు వేసుకోకూడదు. ఊరగాయ పచ్చళ్లు కూడా నంచుకోకూడదు. కొంచెం ఇబ్బందైనా… తప్పదు మరి. ఇంత వరకు ఓ.కే.నా” అడిగాడు.
““ఓ.కే సార్” అంటూ తలలూపారు మహేంద్ర, లావణ్యా.
“మన ప్రాజెక్టులో పని చేసే వారందిరికి వారి వారి స్థాయిని బట్టి, శక్తి సామర్థ్యాలను బట్టి, నెల జీతాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు కూడా… ఈ సిస్టమ్ ఆఫ్ పేమెంట్ నేను వరుసగా తీయబోయే నా మూడు సినిమాల వరకే. ఈ మూడు సినిమాలు మూడు సంవత్సరాలలో పూర్తవుతాయ్. ఆ తరువాత ఏకా మొత్తంగా కంట్రాక్టు సిస్టమ్ ప్రవేశ పెడతాను. అప్పుడు ఎవరి ఇష్టం వారిది. నాతోనే కంటిన్యూ అవచ్చు. లేదా వేరే యూనిట్స్లోకి వెళ్లొచ్చు. మన టోటల్ ప్రాజెక్టు అంటే నా మొదటి మూడు సినిమాల వరకూ ఆర్థిక పరంగా పక్కగా ప్లాన్ చేయబడింది. అర్థమయిందా?” అడిగాడు సదానంద.
“అర్థమయిందండి.”
“ఇక పోతే మీ రెమ్యూలరేషన్ విషయాని కొస్తే… ప్రతి నెలా ఒకటవ తారీకున మీకు ఒక్కొక్కరికి ఒక లక్షరూపాల చెక్కు ఇవ్వబడుతుంది.”
“సార్! లక్షరూపాయలా! అది నాకు చాలా ఎక్కువ కదా సార్…” అన్నాడు మహేంద్ర.
“అవునండి… లక్ష రూపాయలంటే … చాలా పెద్ద అమోంట్ కదా సార్” చెప్పింది లావణ్య.
“పరవాలేదు అంత పెద్ద మొత్తం ఇవ్వడానికి కొన్ని కారణాలున్నాయ్. వాటిల్లో మొదటిది… మీరు, మీ కుటుంబ సభ్యుల ఆర్థిక అవసరాల కొరకు వేరే ఆలోచన చేయకూడదని… అప్పుడే మీరు నూటికి నూరు శాతం మన ప్రోజెక్టు పైనే మనసు పెడతారు. అప్పుడే మీలోని టేలెంట్ హండ్రడ్ పర్సెంట్ బయటకు వస్తుందని నా ప్రగాఢ విశ్వాసం.”
“రెండో కారణం… ఇది టెన్ టూ ఫైవ్ జాబ్ కాదు. రోజుకున్న 24 గంటలూ, మీరు ఈ ప్రాజెక్టులో ప్రత్యక్షంగానో పరోక్షంగానో కనెక్ట అయివుంటారు. మీ తెలివి తేటలు, క్రియేటివిటీ, శక్తి సామర్థ్యాలు, టేలెంట్, అన్నింటినీ ప్రాజెక్టు సక్సెస్ కోసమే వినియోగిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే మీకు మీరుగా ఈ ప్రాజెక్టుకు అకితమైపోతారు. ప్రతిఫలంగా మంచి రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే…”
“ఇక మూడో కారణం… ఇది చాలా ముఖ్యమైనది… ఆలోచించదగినది కూడ. నటనలో మీ పాత్రలోకి పరకాయప్రవేశం చేసి మీ సహజ స్థితి నుండి కృత్రిమ స్థితికి చేరుకుంటారు. ఆ కృత్రిమ స్థితిలోనే సహజస్థితికి దగ్గరగా వుండేట్లు నటిస్తారు. తరువాత కృత్రి మస్థితి నుండి సహజ స్థితికి చేరుకుంటారు. ఘాటింగ్ సమయాల్లో ఒక్క గంటలోనే, ఒక్క రోజులోనే అనేక సార్లు మీ స్థితులు పలుమార్లు మారుతుంటాయి. ఆ మార్పులు జరిగే సమయాల్లో మీ శరీరంపై మీ శరీర భాగలపై మోయలేని భారం పడుతుంది. మీ మనస్సు విపరీతమైన ఒత్తిడికి లోనవుతుంది. నవరసాలు పండించ వలసినపుడు ఒక నటుడుగాని, నటిగాని పడే శ్రమకు ప్రతిఫలంగా ఎంతచ్చినా తక్కువేనని నా వ్యక్తిగత అభిప్రాయం. కేవలం నటీనటులేకాదు… మిగతా డిపార్ట్మెంటల్ హెడ్స్, సాంకేతిక నిపుణలు…. అలా మన ప్రాజెక్టులో వున్న అందరి శ్రమ గురించి, కష్టాన్ని గురించి నేను సీరియస్‌గా ఆలోచిస్తాను. అలా మన అందరి సమిష్టి కృషితో, శ్రమతో ఒక సినిమా పూర్తి చేయగలుగుతాం. విజయపథంలో నడిపించేయగలుగుతాం. అందుకే మన ప్రాజెక్టులో వున్న వారందరికీ… ఇండస్ట్రీ లెవెల్ కంటే ఎక్కువ మొత్తాల్లోనే రెమ్యూనరేషన్ ఏర్పాటు చేశాను.
అన్నట్లు, ఈరోజు మీకు అడ్వాన్సుగా ఇచ్చేందుకు చెక్కులు తయారు చేయమని చెప్పాను” అంటూ ఇంటర్కమ్లో అకౌంట్స్ డిపార్టుమెంట్తో మాట్లాడాడు సదానంద్.
మరు నిముషంలో అకౌంట్స్ ఆఫీసర్ చెక్ బుక్‌తో అక్కడికి వచ్చాడు… అప్పటికే వ్రాసియున్న చెక్కుల పై సంతకాలు చేసిన సదానంద్, మహేంద్ర, లావణ్యలకు చెరో చెక్కు అందించాడు. చెక్కులందుకున్న వారిద్దరూ… తమాయించుకోలేని భావోద్రేకానికి లోనయి సదానంద్ కాళ్లకి నమస్కరించారు.
“అరెరే… ఏంటిది… లేవండి” అంటూ వాళ్లని కుర్చీలో కూర్చోబెట్టాడు సదానంద్.
“ఇంకో విషయం మహేంద్రా… నువ్ ఇంటికి వెళ్లగానే విషయం అంతా మీ అమ్మనాన్నలకు వివరంగా చెప్పి… ఈ చెక్‌ని వారి చేతుల్లో వుంచి వారి ఆశీర్వదాలు తీసుకో… అలాగే, లావణ్యా… నువ్ కూడా మీ అమ్మగారికి విషయంతా చెప్పి చెక్కు మీ అమ్మగారి చేతుల్లో వుంచి, వారి ఆశీర్వాదం తీసుకో….”
ఎందుకంటే… ఎవరైనా జీవితంలో ఎదగాలి… అంటే… ప్రప్రథమంగా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు చాలా చాలా అవసరం. నిజానికి మన ఎదుగుదలను చూసి తల్లిదండ్రుల కంటే ఎక్కువగా సంతోషించేవారు ఈ విశ్వంలో మరోకరు ఉండరు. అందుకే, తల్లిదండ్రుల ఆశీర్వాదాలు మనకు తప్పని సరిగా ఉండాలి… “ఓ.కేనా?”
“ఓ.కే సార్.”
“ఈ రోజు కొంచెం సేపు ఆఫీసులోనే వుండి అందరినీ కలవండి. ఆఫీసులోనే అందరితో పాటు మీకూ లంచ్ ఏర్పాటు చేస్తారు. లంచ్ తరువాత నిదానంగా మీ మీ ఇళ్లకు వెళ్లండి. ఆ! ఎల్లుండి సోమవారం నుండి రెగ్యులర్‌గా ఆఫీసుకు రండి. ఆరోజు నుండి మీరు ఆఫీసులో చేరినట్లు… ఓ.కేనా?”
“ఓ.కే సార్” అంటూ క్యాబిన్ బయటకు వచ్చారు.
సదానంద్ సలహా మేరకు లంచ్ పూర్తి చేసుకుని, యూనిట్ సభ్యులతో… మిగతా నటీనటులతో కొంచెం సేపు ముచ్చటించి సాయంత్రానికి ఎవరి ఇంటికి వారు చేరుకున్నారు మహేంద్ర, లావణ్య.
(ఇంకా ఉంది)

ఆంధ్రాబ్యాంకు లో ప్రాంతీయ అధికారి హోదా లో ఉద్యోగ విరమణ చేసిన తరువాత , తన కెంతో ఇష్టమైన రచనా వ్యాసంగాన్ని ఎంచుకొని , కథలు,నాటికలు,నవలలు వ్రాస్తూ ముందుకెళ్తున్నారు.
10 Comments
N Jagadeesh Babu
Interesting to read and waiting eagerly for next episode
Sambasiva Rao Thota
Jagadish Garu!
Thanks for reading…
You will receive the next episode on next Sunday….
కొల్లూరి సోమ శంకర్
*This is a comment from Mr. Ravi, Vijayawada.*
“Superb mamaiah. Waiting eagerly for next one.”
Mr.Ravi,Vijayawada
Sambasiva Rao Thota
Thank you Ravi !
You will receive the next one on next Sunday…..
డా.కె.ఎల్.వి.ప్రసాద్
కథ..చక్కని,వూహించని మలుపుకు తిరిగింది .పాఠకుడిని
ఎన్తగానో ఆశ్చర్యానికి గురి చేసింది.
రచయిత కు సినీరంగంపై మంచి అవగాహన వున్నట్లు అనిపిస్తున్నది..రాబోయే ఎపిసోడ్ కోసం ఆరాటం, ఉత్కంఠ
అధికం అవుతున్న ది.ఒక మంచి నవల చదువుతున్నా మన్న తృప్తి కలుగుతున్నది.
రచయిత కు అభినందనలు.
Sambasiva Rao Thota
Dr.KLV Prasad Garu!
Thank you very much for reading the episode so analytically and offering your comments so sincerely.
I also thank you for your observations and appreciation.
I am honoured, thank you ,Sir……
Indrani
Very very interesting story. Looking forward for the next episode.
Sambasiva Rao Thota
Thank you Indrani,for your observation and continuously reading the episodes.You will receive the next episode on next Sunday.
Keep reading and offering your comments and encouraging me.
Thank you…..
కొల్లూరి సోమ శంకర్
*ఇది ఎ.ఆర్.కె. రావు గారి వ్యాఖ్య*
“సాంబశివరావు గారూ, మీ నవలలో పాత్రలు చాలా ఆదర్శవంతులు. మీరు వారిని ఎట్లా నడిపిస్తారో అని ఆసక్తిగా చూస్తున్నాను. మీకు అభినందనలు.”
ఎ.ఆర్.కె. రావు
Sambasiva Rao Thota
Thanks Andi ARK Rao Garu!
Story chadivaaru!
Santhosham!!!
Paathralannee mee anchanaalaku anugunangaane vuntaayi.
Migathaa parts koodaa chadavandi!
Mee abhipraayam chepthune vundandi !!
Avi naakentho spoorhinisthaayi!!!
Thanks Andi!!!!!