అనసూయగారొచ్చారు. ఆవిడ ఎక్కడుంటే అక్కడ హడావిడి. నాతో కబుర్లు చెప్తూ ‘లిప్‌స్టిక్’ అడిగారు. నా హేండ్బాగ్లో లేదు అనేసరికి, “అదేవిటీ? వయసులో వున్న కుర్రపిల్లలు… ఎంత బ్యూటీ కాన్షెస్గా వుండాలీ? నేను వయసులో వున్నప్పుడు నన్ను చూడాల్సింది నువ్వు… నా జుట్టు కూడా అభిమానులు కట్ చేసి ప్యాక్ చేసి ఇవ్వమని బతిమాలేవాళ్ళు!” అన్నారు. అప్పటికే ఆవిడకి డెబ్భై ఏళ్ళు పైబడి వున్నాయి. మొన్న మొన్ననే 2018లో అనుకుంట, పోయారు. నా ముందే ఆవిడ గంట గంటకీ మేకప్ అయ్యారు. నేను ఆవిడని చూసి మెచ్చుకోకుండా వుండలేకపోయాను. అదీ సౌందర్యం మీద శ్రద్ధ అంటే అనిపించింది.
వంగూరి గారు పెళ్ళివారికి చేసినట్లు ఏర్పాట్లు చేసారు. ఆయన తమ్ముడి కొడుకు చిన్న చిట్టెన్రాజు గారు వీడియోకి ఏర్పాట్లు చేసారు. ఇడ్లీ, వడా, సాంబార్, చెట్నీ, కాఫీ, టీలు బ్రేక్‌ఫాస్ట్‌కీ, మధ్యాహ్నం పులిహోరా, గారె, పాయసం, మామిడికాయ పప్పూ, వంకాయ కూరా, ఆవకాయా, గోంగూర పచ్చడీ, సాంబార్, పెరుగులతో భోజనాలూ… అన్నీ ఆర్భాటంగా ఏర్పాటు చేసారు హోటల్ వాళ్ళు!.
సభ చాలా రంజుగా సాగింది. గొల్లపూడి గారూ, పద్మనాభరావుగారని ఆయన స్నేహితులూ, రచయితా, రేడియోలో ఆయన సహ ఉద్యోగీ, ఆయన భార్య శోభగారూ, అత్తలూరి విజయలక్ష్మీ, సత్యం మందపాటి గారూ, సాహితీ భీష్మాచార్యుల వంటి పెమ్మరాజు వేణుగోపాలరావు గారూ, లక్ష్మిగారూ, వడ్డేపల్లి కృష్ణగారూ మొదలైన వాళ్ళతో, చిట్టెన్రాజు గారి ఛలోక్తులతో సభ చాలా ఉల్లాసంగా, సాహిత్యపూరితంగా సాగింది. ప్రారంభోపన్యాసం నేనే చేసాను. గొల్లపూడి గారి ‘అమ్మ కడుపు చల్లగా’ మరోసారి ఆవిష్కరింపబడి, విక్రయింపబడింది. హ్యూస్టన్‌లో కనబడిన సత్యభామా పప్పూ ఇక్కడికీ వచ్చింది. రవీ పొన్నుపల్లీ లాంటి వారూ కనిపించారు. చిమట శ్రీనివాస్ గారొచ్చి ‘నిషిగంధ’ మిమ్మల్ని అడిగినట్లు చెప్పమందని చెప్పారు. ఆ అమ్మాయి మంచి కవిత్వం రాస్తుంది. నాకు నచ్చే వచన కవిత్వం చాలా తక్కువ.
నా మనసుకి బాగా జ్ఞాపకం ఉండిపోయిన సంఘటన మాత్రం, నా కథ ‘నేను సైతం’ ఇచ్చి, సగంలో ఆపేసి, దానికి ముగింపు రాయమని పోటీ పెట్టినప్పుడు శోభ గారు, ఆ వయసులో మొదటిసారి పెన్ పట్టి దీక్షగా, పరీక్ష కొచ్చిన విద్యార్థిలా ముగింపు రాయడం. ఆ పోటీలో ఆవిడకి బహుమతి రాలేదు కానీ తర్వాత ఆయన ఇక్కడ నారాయణ అకాడెమీలో ‘IAS కోచింగ్ సెంటర్’ ప్రిన్సిపాల్‌గా వున్నప్పుడు వాళ్ళింటికి వెళ్తే, శోభగారు బోలెడు పుస్తకాలు తీసుకొచ్చి, ‘శ్రీ వెంకటేశ్వరా యూనివర్సిటీ’ వారు అచ్చేసారని చూపింది, “ఇదంతా ఆనాడు ఫ్రీమాంట్‌లో మీ కథకి ముగింపు రాయడానికి పెన్ పట్టిన ఫలితమే రమణీ గారూ!” అన్నప్పుడు చాలా ఆనందం కలిగింది!
కానీ ఆనాడు కథలకి మాత్రం మొదటి బహుమతి పద్మావతీ పరకాల గారికీ, రెండవ బహుమతి సత్యభామా పప్పూ కీ, మూడవ బహుమతి ఘండికోట విశ్వనాధం గారికీ వచ్చాయి. గుర్తున్నంత వరకూ రాస్తున్నాను, మిగతా వివరాలు క్రింద లింక్‌లో ఉన్న ‘సాహితీ సదస్సు’ అనే కౌముది పత్రిక లింక్‌లో, ‘కాలం దాటని కబుర్లు’ శీర్షికలో చూడండి!
రెండు రోజులూ సభలు దిగ్విజయంగా సాగాయి. రెండో రోజు జరిగిన సభనంతా పెమ్మరాజు వేణుగోపాలరావు గారు (ఇప్పుడు కీర్తిశేషులయ్యారు) మొత్తం క్రోడీకరించి అద్భుతంగా చెప్తుంటే, ఇదంతా చూసిందీ, పాల్గొందీ మేమేనా? అనిపించింది. రెండో రోజు సాయంత్రం, సభ అంతంలో చిట్టెన్రాజు గారూ, గిరిజ గారూ, గొల్లపూడి గారి అబ్బాయి సుబ్బారావు గార్లు, వంగూరి గారు అమెరికా వచ్చినప్పుడు తొలినాళ్ళలో ఆడిన నాటకం వీడియో ప్రదర్శించారు.
రెండవ రోజున ఒక విచిత్రం జరిగింది. ఎయిర్పోర్ట్ నుండి కిరణ్ప్రభగారికి ఫోన్ వచ్చింది. “ఒక ఎర్ర సూట్‌కేస్ పోర్ట్‌లాండ్‌లో రెండు రోజుల బట్టీ తిరుగుతోంది కన్వేయర్ బెల్ట్ మీద… మీదేనా?” అని. ఇది తెలిసి ఫోన్లో, “అది ఓపెన్ చేసి ఏం వున్నాయో చెప్పగలరా? నేను పర్మిషన్ ఇస్తున్నాను” అని చెప్పాను.
దానికి వాళ్ళు ఈ విధంగా సమాధానం ఇచ్చారు. “వెడ్డింగ్ డ్రెస్ ఇన్ వైట్… అండ్ బుక్స్ ఇన్ అన్నోన్ స్క్రిప్ట్…” అని. అంటే నా తెలుగు నవలలు అన్న మాట! “అది నాదే” అని అరిచాను
భోజనాల సమయంలో మల్లాది శ్యామల కార్లో నన్ను ఎయిర్‌పోర్ట్‌కి తీసుకెళ్ళింది. అక్కడ నా రెడ్ సూట్‌కేస్ నేను లేకుండా చాలా స్టేట్స్ తిరిగొచ్చి, నన్ను చూసి ఆనందంగా కన్నుకొట్టినట్టు వుంది! అందుకు ఎయిర్పోర్ట్ అథారిటీస్‌కి నేను చాలా కృతజ్ఞురాలిని. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ వాళ్ళు ‘నేను కాని, నా తరఫున ఎవరైనా కాని ఆ సంవత్సరం వాళ్ళ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణం చేస్తే 50% డిస్కౌంట్ ఇస్తాం’ అని లెటర్ ఇచ్చి జరిగిన అసౌకర్యానికి అపాలజీస్ చెప్పారు! మన శంషాబాద్‌లో అయితే చచ్చినా చెప్పరు!
ఇదంతా నేను వాళ్ళకి రోజూ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం వల్లనే అనీ, నా రచనా శక్తి పనికొచ్చిందనీ కిరణ్ ప్రభ గారన్నారు! మొత్తానికి లివర్మోర్ స్వామి మాట నిలబెట్టుకున్నారు, మళ్ళీ వెళ్ళి మూడు డాలర్లూ సమర్పించుకున్నాను.
మొత్తం ఈ సదస్సులో ఇప్పటికీ నేను బాధపడే విషయం ఒక్కటే! ఇంత వ్యయప్రయాసల కోర్చి చిట్టెన్రాజు గారు నన్ను ఇంత దూరం నుండి సదస్సుకి పిలిచారే… అది పూర్తవకుండానే, నేను కిరణ్ప్రభగారు వాళ్ళూ వెళ్ళిపోదాం అన్నారని ఆయన నాటకం పూర్తిగా చూడకుండా వచ్చేసా! కిరణ్‌ప్రభ గారు అలా చెయ్యడానికి కారణం గొల్లపూడి గారి టైమ్ టేబుల్ ప్రకారం ఆయన సాయంత్రం తీర్థం అలవాటు. పాపం, కిరణ్ప్రభగారు మొహమాటస్థులూ, మంచి హోస్టునూ!
(సశేషం)
PS:
సాహితీ సదస్సు గురించి మరిన్ని వివరాలు ఈ లింక్‌లో.
రొమాంటిక్ రచనలతో అనేక తెలుగు పాఠకుల హృదయాలలో స్థిరనివాసం ఏర్పరుచుకుని తీయతేనియలొలికే సంభాషణలతో అందరి హృదయాలను దోచుకుంటున్న ప్రఖ్యాత రచయిత్రి. ‘కాలమ్ దాటని కబుర్లు’ అనే పుస్తకం, ‘రేపల్లెలో రాధ’, ‘ఎవరే అతగాడు’, ‘అనూహ్య’, ‘ఖజూరహో’, ‘ఆ ఒక్కటి అడిగేసెయ్’ వంటి నవలలు వెలువరించారు.
Hammayya mothaniki red suitcase vachindi, all happy, kaani chivarakaastha ( aa theertham valla) un happy. EMI naabhagyam saahithee sadassu prathyaksha prasaram chusanu🙏 Thanks Ramani Garu.
Thanks Kalavatigaru..gyaapakaalu Madhuram..diary raayanu..mastishkamlo nikshiptham ayi unnayi
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™