[గీతాంజలి గారు రచించిన ‘పదాలెందుకు..?’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


కవి మనసేమి బాగోలేదు
పిచ్చి పిచ్చిగా కవిత్వం రాసేస్తున్నాడు.
అతని హృదయం పగిలినట్లు..
కవిత్వం నేల మీద భళ్ళున పడి
ముక్కలు ముక్కలవుతుంది..
చెల్లా చెదరవుతుంది..
కవి విచలితుడైపోతాడు.
ప్రతీ ముక్కలో ఒక పదం కనిపించి
దుఃఖం రెట్టింపవుతుంది.
కవిత్వం.. విడి విడి ముక్కలుగా మాట్లాడుతుంది.
అన్నింటినీ చేరదీస్తాడా..
కవిత్వం ముద్దగా గడ్డ కట్టిపోతుంది..
చదవనీయకుండా..
అక్షరాలు పదాలు కనపడనే కనపడవు.
పదాల వెతుకులాటలో.,
పెనుగులాడుతున్న కవి అనుకుంటాడు కదా..
అసలు కవిత్వానికి పదాలు ఉండాలా..
సువాసన ఉంటే సరిపోతుంది..
రంగు ఉంటే బాగుంటుంది..
తనదైన సంగీతపు ధ్వని ఉంటే.. మహాద్భుతం..
కంటి చూపులా.. దృష్టి ఉంటే..
ఇంకేం.. అర్థమైపోతుంది!
ఈ పదాలు గందరగోళ పరుస్తాయి..
కవిని శాసిస్తాయి.
మనసుని స్తంభింపచేస్తాయి.
పదాలెందుకు..
మౌనంతో కవిత్వం రాధ్ధాం అనుకుంటాడు.
కవి ఇక మౌనమై పోతాడు..

శ్రీమతి గీతాంజలి (డా. భారతి దేశ్పాండే) వృత్తిరీత్యా సైకోథెరపిస్ట్, మారిటల్ కౌన్సిలర్. కథా, నవలా రచయిత్రి. కవయిత్రి. అనువాదకురాలు. వ్యాస రచయిత్రి. ‘ఆమె అడవిని జయించింది’, ‘పాదముద్రలు’. లక్ష్మి (నవలిక). ‘బచ్చేదాని’ (కథా సంకలనం), ‘పహెచాన్’ (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), ‘పాలమూరు వలస బతుకు చిత్రాలు’ (కథలు), ‘హస్బెండ్ స్టిచ్’ (స్త్రీల విషాద లైంగిక గాథలు) ‘అరణ్య స్వప్నం’ అనే పుస్తకాలు వెలువరించారు. ‘ఈ మోహన్రావున్నాడు చూడండీ..! (కథా సంపుటి)’ త్వరలో రానున్నది. ఫోన్: 8897791964
1 Comments
నంద్యాల సుధామణి
నిజంగా మనసులో మెరిసే ఇంద్రధనుస్సు రంగుల్లో వుండే భావాల్ని మామూలు మాటల్లోకి అనువదించడం…భావానికున్న ఎఫెక్ట్ ను భాషలోకి మార్చడం ఎంతటి మహాకవికైనా గొంతు పెగలదు! ఎంత బాగా రాశాననుకున్నా…భావానికి తగిన భాష దొరకని కృతకృత్యాద్యవస్థ…ఎంత హృదయవిదారకం!! అప్పుడు మౌనమే శరణ్యమౌతుంది కవికి….మాటల కంటే మౌనమే నాణ్యమైనదనిపిస్తుంది! నిజమే కదా?