ఒక్క క్షణం
“నిన్నునీవు మరచి నా దగ్గరకు రా… అప్పుడు నాలో సంపూర్ణంగా ఐక్యం కాగలవు” అంటాడు దేముడు.
“నిన్ను నీవు మరచి నా ముందు నీ అస్థిత్వాన్నే ఒదిలివేయ్యి.. అప్పుడు సర్వంలోనూ నేన్నీక్కనపడతాను” అంటూంది ప్రేమ.
“బిడ్డా… ఇటురా… ఓక్షణం నిన్ను నువ్వు మర్చిపో… నీ ఆలోచనల్నీ అహంభావాన్నీ అంతట్నీ విడిచి రా… అప్పుడు అసలు సిసలైన ‘నీ’ స్వరూపాన్ని ‘నాలో’ చూడగలుగుతావు” అంటూ ఎలుగెత్తి పిలుస్తుంది ప్రకృతి.
అయితే
“నా దగ్గరకు రా…! నేస్తమా, నిన్ను నువ్వు మర్చిపోయేలా చెయ్యగలను!!” అంటూ స్నేహాపు కౌగిలిలో బిగిస్తుంది సాహిత్యం.
అందుకే పాఠకమహాశయా, నిన్ను నువ్వు మరచిపోయి మరో లోకంలో విహరించదల్చుకున్నప్పుడే పుస్తకాన్నిపట్టుకో..
ఆ తరవాత, ఆ పంక్తులు నిన్ను జాగ్రత్తగా తమలో నడిపించుకుంటూ తీసుకెళ్తాయి..
మరో లోకంలోకి! నీకు తెల్సిన లోకమైనా నీవు గుర్తించని నీలోని నీ లోకంలోకి..
మొదటి భాగం
1
“అడవిలోని పూలవోలె
ఆకసాన పక్షివోలె
విరిసి, ఎగసి, ఏనాడో
అలసి, నేల, రాలిపోదు”
***
“నీ పేరేమిటీ?”
“పాదచారి”
“అదేం పేరు?”
“అదంతే!”
“ఎక్కడెక్కడ తిరిగావు? ఏమేం చేశావూ? ఏమేం చూశావు? ఏమంటావేమంటావూ?”
“నీకూ ఉందన్నమాట పిచ్చి!”
“ఏం పిచ్చి?”
“అధునిక కవిత్వం పిచ్చి”
“పిచ్చి అధునికం కాదోయ్! సనాతనం!”
“ఏదో ఓ తనం. నువ్వు నీలా మాట్లాడు ”
“నేను నేనులా మాట్లాడుతానా?”
“అంత రస హీనుడివా?”
“రసమో, ఏమో!”
“ఏమో ఏమిటీ! అరసం, విరసం, సరసం, రసం some”
“ఇక్కడదేమీ లేదు. ఉన్నది నేనే?”
“నేనూ ఉన్నానుగా?”
“ఉన్నావేమో!”
“ఏమో ఏమిటి కంటి కెదురుగా లేనూ!”
“నా కళ్ళు చూడ్డం మానేశాయి!”
“సరే సరే చెవులు వించునే ఉన్నాయిగా!”
“ఒక్కోసారి”
“తిక్క వ్యవహారంలా ఉందే!”
“ఏమో!”
“మళ్ళీ..”
“అదేనయ్యా! ఏది తిక్కో ఏది మంచో ఎలా చెప్పడం!”
“సరే ఎందుకొచ్చిన గొడవ? నువ్వు చెప్పేది నువ్వు చెప్పు. నేను వినేది నేను వింటాను”
“ఎందుకు అసలు చెప్పడం?”
“వినడానికి!”
“ఎందుకు వినడం?”
“ఏదో ఒకటి చెయ్యాలి గనక. ఎందుకు అని అడగబోకు!”
“ఎందుకడగ్గూడదూ?”
“నా తలకాయ!”
“ఉందా?”
“మహోప్రభో.. నిన్ను పలకరించడం నాది బుద్ధి తక్కువ”
దారేపోయో దానయ్య తన దారి తాను చూసుకున్నాడు.
పాదచారి నడుస్తున్నాడు. ఇళ్లూ గిళ్లూ వెనక్కి పోతున్నాయి. కాళ్లూ కదులుతూనే ఉన్నాయి.
ఆ పక్కనే ఓ బుల్లి ఆకు మెల్లిగా సూర్యుడి కేసి భయం భయంగా తొంగి చూసి “బాగానే ఉన్నాడే” అనుకుని మరింతగా రెక్కలు విప్పి వెచ్చబెట్టుకున్నది. వలువ వెనుక వంపుల్లాగా ఆకుల మధ్యగా, ఆకుల గుండా సూర్యకాంతి చెట్ల క్రింద నీడ కాని పచ్చదనం నింపింది.
పాదచారి కూల బడ్డాడు.
ఓ పచ్చని గరిక “ఏమిటి ఏవిఁటి?” అన్నట్లు ఊగింది.
“ఓయి బుల్లిగరికా! నువ్వంటే నాకెంతో ఇష్టం! నీ మీదే కూర్చున్నా, నువ్వేమీ అనవుగా! నేను లేచి వెళ్లగానే ‘అమ్మయ్య’ అని నిట్టూరుస్తూ మళ్ళీ నిటారుగా నిలబడతావు. ఓ గరికా! నీ కన్న బలవంతులెవరు?”
ఆ పక్కన ఓ గడ్డిపూవు తళుక్కుమంది.
“గడ్డిపూవా! గడ్డిపూవా! ఎందుకు తళుక్కుమన్నావు?”
గడ్డి పువ్వు మాట్లాడలేదు గానీ
“నా సంగతి నీ కెందుకూ?” అన్నట్లు అవతలి పక్కకు వగింది.
పాదచారి నవ్వుకున్నాడు.
“ఓ సూర్య చంద్రులారా! ప్రకృతిలోని సమస్త జీవరాసులారా! Unite! రండి చేయి చేయి కలిపి ముందుకు సాగుదాం! రండి! అనంతకాల ప్రవాహాపు ఒరవడిలో ఓలలాడుదాం!”
సూర్యుడు చెట్ల ఆకుల మధ్య నించి తొంగి చూసి కిసుక్కుమన్నాడు! గడ్డి పువ్వు వెనక్కు ముందుకూ ఊగుతూ పకపక నవ్వింది. గరిక వీరుడు ఎండిన పుల్లల్లాంటి చేతుల్తో చిటుక్కున గిల్లాడు.
పాదచారికి కోపం వచ్చింది.
“ఎందుకోయ్ నవ్వుతారు? నేను మానవుణ్ని! మిమ్మల్ని క్షణంలో నాశనం చేసేస్తాను. చెయ్యగల శక్తి నాకుంది. ఓయీ సూర్యగ్రహమా! నీ వేడి వాడీ మనిషి ముందు కాదు. మా జాతి ఎంత శక్తివంతమైనదో నీకేం తెలుసూ! నీదంతా జడ ప్రకాశం! నీ చూపుల్నించి తప్పుకోవాలంటే క్షణం పట్టదు. A.C లున్నాయి. Under grounds ఉన్నాయి. అవన్నీ ఎందుకూ? పూరిగుడిసే చాలదా ?
ఏయ్ గరిక వెధవా! నిన్ను క్షణంలో ఆవుల్తో మేపించేస్తా! ఆవెందుకని అంటావేమో! విటమిన్లు ఎక్కువని మేమే నిన్ను మింగేస్తాం!
ఓహో గడ్డి పూవుగారూ! ఏ మలా హేళణగా విఱ్ఱవీగుతారు? నిన్ను వేయించి వడకట్టి వంటికి పులుముకుంటా! ఓహోహోయ్! నేను మానవుణ్ని! దేవుణ్ని సృష్టించిన మహాశయుణ్ని! అల్పుడినంటారెందుకు? చల్లని చందమామలూ తళుక్కు తారలూ మా తెలివి ఎదుట హుళక్కి!
వినండి! వినండి!
రండి! రండి!
Unite!
కలిసి ముందుకు సాగుదాం!
కాలప్రవాహపు ఒడిలో ఓలలాడుదాం! ”
పాదచారి పకపకా నవ్వాడు.
చెట్టు మీద పక్షి “అవునూ! అవునూ” అన్నట్లుగా అరిచింది.
“నిన్ను చూసి కాదోయ్ బాబూ నేను నవ్వింది!” అన్నట్లుగా సూర్యుడు మబ్బు చాటు దాగాడు.
“యూ ఆర్ రైట్!” అంది గడ్డిపువ్వు.
“జాగ్తే రహో!” అన్నాడు గరిక వీరుడు.
“చలో చలో చలో చోలో”
“ఆగే చల్ పీఛే చల్”
“ఆగే పీఛే చల్తే చల్”
పాదచారి మళ్ళీ ముందుకు సాగాడు.
నదులూ-కొండలు
కోనలు.. తారలు
లోయలు.. లోతులు
పువ్వులు.. పక్షులు
సాగిందండోయ్ చూపుల రథమూ
కదిలిందండోయ్ కలాల బలగం!
***
2
టపటపా రెక్కలు కొట్టుకొని అన్నీ ఒక్కసారిగా పైకెగిరాయి కొంగలు!
ఏరు గలగల్లాడిది!
చేపలన్నీ ‘ఓహో’ అనుకుని గబాల్న మునిగి యీదుకుంటూ వెళ్లిపోయాయి. కప్పలు గంతులేస్తూ ‘పద పద’ ‘పదపద’ మని హడావిడి చేస్తూ నీళ్లల్లోదుమికాయి.
పాదచారి నివ్వేరపోయాడు.
ఓ కొంగ పై నుంచి ‘క్రీ’ మని అరిచింది.
“ఓయీ మనిషీ! నీవు దుష్టుడివి! నికృష్టుడివి!”
మా ఆహారం కోసం మేం జపం చేస్తాం! నీకేముందీ! దానికి కొంగ జపం అని పేరుపెట్టి నవ్వుకుంటున్నావు! మూర్ఖుడా! చేపల కోసం మేం గాలాలు వెయ్యం, డబ్బులు కోసం నువ్వేసినట్లు! మేం వేటాడతాం! కడుపు నిండగానే చేపలతో ఆటలాడతాం!
నువ్వులాగదే మరి!
రైఫిల్ తెస్తావు!
తూటా బిగిస్తావు!
‘ఠప్పు’మని కాల్చి మమ్మల్ని కూలగొడతావు! దమ్ముంటే మాతో ఎగిరి పట్టుకో చూద్దాం!” అంటూ క్రీకారం చేస్తూ కొంగలు ఎగిరిపోయాయి.
“ఒహోయ్ మానవుడా! నిన్నుచీల్చి చెండాడాలని అనిపిస్తోందోయ్! మమ్మల్ని పట్టుకొని ప్రయోగశాలల్లో మా శరీరాలు కోసి, తిత్తులు తీసి, స్కోపుల కింద చూసి, మదమెక్కి మహా వీరుణ్ణనుకుంటున్నావేమో! చూడు మమ్మల్ని!”
‘బెక బెక’ మంటూ వర్షాన్ని పిల్చేది మేమేగా! ఆ వర్షం లేని నాడు నువ్వెక్కడ? నీ బతుకెక్కడ?” అంటూ ‘పదపద’మని బుల్లి కప్పల్ని అదిలిస్తూ తల్లి కప్ప యీదుతూ సాగింది.
పాదచారి జాలిగా అరిచాడు.
“ఓ తెల్ల తెల్లని మబ్బురంగుల కొంగల్లారా! రంగు రంగుల చిన్నా పెద్దా చేపల్లారా! నేనే మీ కీడు చెయ్యను. ముట్టుకోనే ముట్టుకోను. మీ రంగులు నాకు చూపించరూ! మీరంతా నాతో స్నేహం చెయ్యరూ!” అంటూ ప్రాధేయపడ్డాడు.
“నీకూ మాకూ వైరం” అన్నాయి కొంగలు.
“నీకూ మాకూ పొసగదు” అన్నాయి చేపలు.
“మీదంతా దోపిడీ!” అన్నాయి కప్పలు.
పాదచారి నీరసంగా కదిలాడు.
పచ్చని పొలాలు పక్కుమన్నాయి! చల్లని గాలి రివ్వున నవ్వింది!
“పచ్చని గడ్డని మేసేస్తాం
చిక్కని పాలను ఇచ్చేస్తాం
మేం పశువులం!
ప్రకృతి ఒడిలో శిశువులం”
పాదచారి సంభ్రమాంగా విన్నాడు.
కపిలధేనువు కళ్లు సగం మూసి పాదచారిని చూసి నవ్వింది.
ధేనువు గంగడోలు నిమరుతూ పాదచారి బుజ్జగించి అడిగాడు – “ఆవుగారూ! ఆవుగారూ! ఆవు-పులీ కథ నిజమేనా” అని
“అవును బాబూ! నిజం నిజం! నిజమే నిజమే! పులి కరుణిచింది. మనిషి కరుణించడు!”
“అదేమిటి ఆవుగారూ! అట్లా అంటారూ! చిట్టూ-తవుడూ గడ్డీ-గాదం అన్నీ తెచ్చి మేపుతూనే ఉంటాముగా!”
“తిట్లూ-కొట్లూ, పలుపు-గిలుపూ అవి కూడా ఉంటాయిగా! నీకు పాలుగావాలి! అందుకు మేపుతావు. నీకు పేడ కావాలి. అందుకు కట్టేస్తావు! ఏదీ! నాకు కళ్ల వెంట నీళ్లొస్తే ఎందకని కనుక్కున్నావా! పాలివ్వడం మానేస్తే ‘పోనీ’ లెమ్మని పోషిస్తావా! ఓయీ మనిషి వాడా! నీ ధర్మం అర్థం లేనిది! నా ధర్మం నాలుగు పాదాలది! భాష లేని భావం నాది! భాష ఉన్న మౌఢ్యం నీది!”
పాదచారి మళ్లీ మౌనం ఆశ్రయించాడు
తడబడుతూ సాగిపోయాడు.
ఆలోచిస్తూ నడుస్తున్నాడు!
నడూస్తూ ఆలోచిస్తున్నాడు!
ఏదీ మనిషి పాడు చెయ్యంది?
ఏదీ మనిషి ప్రయోగించంది?
చెట్టు నవ్వుంది!
పుట్ట మూల్గింది!
కాకి అరిచింది!
కడలి ఏడ్చింది!
నువ్వే! నువ్వే!
నువ్వే! నువ్వే!
నువ్వే మా కష్టాలకి మూలకారణం!
నువ్వే మా నష్టాలకి మూలాధారం!
పాదచారి ఫుట్పాత్ మీద నడుస్తునాడు!!!!
“రా..! రా.. నా రాజా!
ఇదే ముద్దు.. ఇంకే మీ వద్దు!”
పుస్తకాలు వేలాడదీసి ఉన్నాయి.
ఫక్కున నవ్వుకున్నాడు పాదచారి!
ఇంకొంచెం ముందరగా!
బిడ్డ నెత్తకున్న తల్లి!
చిత్రంగా కళ్లచికిలించి చిర్నవ్వు నవ్వింది.
ఆ అర్థమూ.. అనర్థమూ రెండూ తెలిసి నవ్వేసి ముందుకు సాగాడు.
ఎవరో పాంటు వేసుకున్న కాలేజీ పిల్ల!
ఎత్తు పల్లాలూ, కుడి ఎడమలూ
మనస్సులో ఆమెని నగ్నం చేశాడు.
నవ్వుకున్నాడు!
బయటకే నవ్వాడు!
“ఏముందే ముందోయ్ ఇందులో!
ఏదుందేదుదోయ్ ఆ సందులో”
కావాలంటే అన్నీ!
లేదనుకేంటే లేనే లేదు!
నడుస్తూనే ఉన్నాడు!
నవ్వుతూనే ఉన్నాడు!
“ఐయామ్ ఫైటింగ్ యువర్ వార్
వైడిడ్ యూ కీప్ క్వయిట్!” అంది మనసు
“No sir, There is no war at all” నవ్వాడు పాదచారి.
(సశేషం)

భువన చంద్ర సుప్రసిద్ధ సినీ గేయ రచయిత. కథకులు. పలు హిట్ పాటలు రచించారు. “భువనచంద్ర కథలు”, “వాళ్ళు” అనే పుస్తకాలు వెలువరించారు.
3 Comments
యామినీ దేవి కోడే
ప్రేమ ఎక్కడ ఉంటుందో ఆచూకీ చెప్పిన ప్రేమ స్వరం చాలా మధురంగా విన్నాను.

గురు పాదాలకు నమస్సుమాంజలి
ఇంతకంటే ఏం చెప్పనూ.. మీ తర్వాతేనేమో ప్రకృతిని పోల్చడం.. 

అందుకే కాసేపు
అస్థిత్వాన్ని ఒదిలి
నన్ను నేను మరచి
ఈ ప్రకృతి పిలుపులో తన్మయమై ఇమిడి పోయాను.
అహాన్ని విడిచి
ఆలోచనల్ని దాటి
ప్రకృతిని చూడటం కంటే మనసుకింకేం కావాలి.
ఈ సాహిత్యం ఉంది చూసారూ.. నిజంగా నిజమే మనసుని మాయ చేసి
నన్ను నేను మర్చిపోయి
లీనమయ్యేంతగా
మనసుని ఆవహించేసి
బిగించి పట్టుకుని మధురాలనే మనసుపై ముద్రిస్తుంది.
అందుకే ఇప్పుడు నన్ను నేను మరచి ఈ పుటల్ని జరుపుతూంటే నా లోకంలోకి ఈ అక్షరాలే నడిపించుకువెళ్ళాయి.
మొదలు పెట్టడమే ఆశ్వాదన.. అడవి పూలూ.. ఆకాశపు పక్షీ.. చాలదూ..!
మనసు నిండుగా ఒక అనుభూతి ఆవహించేసింది.
చదవాలని మొదలు పెట్టానా.. ఆహా.. రెండు మాటలేవయినా రాద్దాం అనుకున్నానా.. ఆహా.. రాయడం దగ్గర ఆగిపోయి..
నేనూ పాదచారి వెంట నడవడం మొదలెట్టేసా తెలీకుండానే.. దారిలో దానయ్యనీ.. గడ్డి పూల తళుకుల్నీ.. సూరీడు నవ్వుల్నీ.. గిల్లుతున్న గరిక పరకల్నీ.. సమస్త ప్రకృతినీ ఆశ్వాదిస్తున్నా.. ఈ పాదచారి ప్రయాణంలో..
శ్రీదేవిరమేష్ లేళ్ళపల్లి
గురువు గారు మీరు రాసింది చదువుతున్న ప్రకృతి వాస్తవిక విషయాలను చదువుతుంటే కళ్ళముందు మీరు రాసిన, కొంగ,కప్ప, కాకి,చేప,ఆవు,పచ్చటి గరిక,గడ్డిపూలు,చంద్రుడు,సూర్యుడు,కొండలు,
కోనలు, మబ్బులు ,వర్షం ఇలా అన్నీ కళ్ళు మూసుకుని సంతోషంతో నా మనోనేత్రంతో చూసాను.మానసికొల్లాసంపొందాను. ప్రశాంతంగా ఆత్మానందం పొందే సమయంలో హఠాత్తుగా ఒక శబ్దం నన్ను ఆటంక పరిచి నా ఆత్మానందాన్ని దూరం చేసినట్టు అనిపించింది. ఆ శబ్దం పక్షులపై రైఫిల్ తో దాడి చేస్తున్న మన మానవ జాతిలోని ఒక మనసు లేని మనిషి చేస్తున్న భయంకర శబ్దం, వెంటనే వలలతో చేపలు పట్టే వారి మాటలు,ప్రయోగశాలలో కప్పులను కోసి ప్రయోగం చేస్తూ మాట్లాడుతున్న శాస్త్రవేత్తల మాటలు.
ఒక్క క్షణం దుఃఖం తో మనసు గాయపడింది. ప్రకృతి అందులోని పశుపక్షాదుల తెలిసి,తెలియక కూడా మనుషులకు కానీ ప్రకృతికే కానీ ఏమాత్రం హాని చేయవు. మరి మన మనుషులు ఎందుకు తెలిసికూడా హానిచేస్తున్నారు అని?
మరి మన మానవ జాతి ఎటు వెళ్తుందో కూడా తెలియనంత ,పురోగమనం అనుకుంటున్న దిశకు వెళ్ళడం పక్కన పెడితే ఉచితంగా దేవుడు మనకు ప్రసాదించిన అమూల్యమైన ప్రకృతి సంపదను అందులోని.సూర్యచంద్రులను,భూమి,ఆకాశం,
పశుపక్షాదులను,పూలు,పండ్లను,నదులను,పచ్చని పొలాలను వేటిని మనం మన గొప్ప మేధస్సు అనుకునే పనితో విషపూరితం చేస్తున్నాము. ప్రకృతికి రుణం తీర్చుకోవాల్సిన మనం ప్రకృతిని దానిలోని జీవరాసులను, అడవులను,నదులను అన్నింటినీ ధ్వంసం చేస్తున్నాము. ఇది అజ్ఞానం తో కాదు మితిమీరిన విజ్ఞానంతో.
సర్ మీ ప్రకృతి రచనలు నాకు మానసిక ఆనందం తోపాటు ప్రకృతి పట్ల ప్రేమ ఉన్న నాకు బాధ్యతను కూడా పెంచాయి. నాకే కాదు మీ “పాదాచారి” ఎందరో మనసులలో మార్పు తీసుకుని రాగలదు.స్వతహాగా ఆలోచించి ప్రకృతికి మంచి చేయడానికి పూనుకోవచ్చు. మీకు హృదయపూర్వక అభినందనలతో నమస్సులు సర్.
లేళ్ళపల్లి శ్రీదేవిరమేష్,చెన్నై
డా. లక్ష్మి రాఘవ
అనుకోకుండా పాదచారితో ప్రయాణం ఈ రోజు … మొదట్లోనే నా కెంతో ఇష్టమైన ప్రకృతి పరిచయం !
ప్రతి వాక్యం లోనూ భుజం చరుస్తున్నట్టు భావన!
ప్రతిదీ తూటా లాగా మనసులోకి దూసుకుపోతూనే వుంది. సూటిగా ప్రశ్నిస్తూనే వుంది. మార్పు ఎంత అవసరమో చెబుతూవుంటే ఎంత అత్యవసరమో తెలుస్తూ వుంది పలకరించే ప్రతి ప్రాణి గడ్డిపరక చేప కొంగా ఒక ఎత్తుయితే ఒక జంతుశాస్త్ర ఉపాద్యాయురాలిగా నేను ప్రయోగశాలలో కోసిన వేలాది కప్పలు కొలువుదీరి నాముందు కూర్చున్నాయి అదేదో సినిమాలో వెంటబడ్డ బిచ్చగాళ్ళ లాగా ….నేను సమాధానం చెప్పగలనా ?…విజ్ఞానం కొరకు బలి…అన్న సమాధానం ఎంతవరకు సరి ? మరోవైపు నన్ను చుట్టుకుంటున్న వందపాములు “నీ రిసర్చ్ కి మేమే కావాల్సి వచ్చామా ???” అని అడుగుతూ వుంటే నా ప్రొమోషన్ కొరకు అవసరమన్న స్వార్థాన్ని ఈ రోజు పాదచారి కి సమాదానం
చెప్పగలనా???
అడుగడుగునా ప్రతి ప్రాణికీ జరుగుతున్నవి స్పష్టంగా చెబుతూ వుంటే కాళ్ళకింద గడ్డిపోచకూడా గుచ్చుకుంటూ వుంది…
సాహిత్యం లో కొంత స్వాంతన వుంది. ప్రకృతితో నా పరిచయాన్ని ప్రతి చెట్టు మాటలూ వింటూ వాటి సంభాషణ కథగా మలచినప్పుడు నన్నే కాక ఎందరినో అలరించింది. దీనితో కొంచెం ధైర్యంగా చెప్పగలను “పాదచారీ పద నీతోపాటూ నా ప్రయాణం ఖాయం అని”
ప్రతి మనిషినీ ఆలోచిపచేసే ప్రయత్నం ఇది ! ఈ ప్రయాణం లో చాలామంది గడచిన జీవితాన్ని తడుముకుంటారు. మంచి కోసం కలిసి నడుద్దాం అనికూడా అంటారు
ఇంతటి ఆలోచనను కలిగించిన రచయిత “భువన చంద్ర “గారికి నమస్సులు. ప్రచురిస్తున్న సంచిక కు శుభాశిస్సులు.