అద్దానికి అవతలి వేపున
“అద్దానికి ఆవల ‘తీరం’
అద్దానికి యీవల ‘మోహం’
అద్దంలో నీ ప్రతి బింబం
వెలుగుతున్న మిథ్యా రూపం”
“నేను చిరంజీవిని” అరిచాడు పాదచారి. గాలీ, ధూళీ, విననట్లు నిశ్శబ్దంగా ఊరుకున్నాయి.
“చెప్పేది మీకే! నేను చిరంజీవిని” మళ్ళీ కోపంగా గట్టిగా అరిచాడు పాదచారి.
మిట్టమధ్యాహ్నపు టెండలో మదించిన అడవి, నీడల పొడిని వృక్షాగ్రాల నుంచి కిందకి జల్లుతూ పాదచారి అరుపుకి ఉలిక్కిపడి లేచి ఊగుతూ గాలిని లేవగొట్టింది.
‘యస్! యస్’ అన్నట్లుగా బుస్ బుస్ మని ఓ పాము పడగెత్తి పాదచారిని ఓసారి పరికించి చూసి, పక్కకి ఒదిగి పక్కుంటూ వెళిపోయింది.
ఓ అడవి తీగ ముద్దాడుతున్నట్లుగా తను పెనవేసిన వృక్షాన్ని ఊగుతూ స్పృశించింది.
పాదచారి తలపైకెత్తి ఆకాశపు నీడల్ని చూసి మెల్లగా తలదించుకుంటూ గొణుక్కున్నాడు “అయినా నేను దుర్బలుణ్ణి”.
“ఏమిటి ఏమిటి?” అంది ఓ తీతువు పిట్ట.
“అదే, నేను చిరంజీవిని”, “అయినా శక్తిహీనుణ్ణి”
ఇంకోసారి ఇంకొంచెం మెల్లగా అన్నాడు పాదచారి.
చింత చిగురు కొరికి “క్రిక్! క్రిక్”మంటూ అరిచిందో గిజిగాడు.
“ఎలా! ఎలా” అన్నట్టుగా “కుహూ! కుహూ!”అంటూ కూసిందో ఆవలించే కోయిల.
తొలకరికి మొలకలెత్తిన పచ్చని పచ్చికమీద ఎఱ్ఱ ఎఱ్ఱగా అడుగులు వేస్తూ పాకింది ఓ ఆరుద్ర పురుగు.
మెల్లగా దాని ముఖమల్ వీపును నిమిరాడు పాదచారి.
“నన్ను నేను మరిచిపోవటానికి ప్రయత్నిస్తున్నాను. ఓ అందమైన ఆరుద్రజీవీ! – నా ప్రయత్నంలో గెలవటానికి కాసేపు నన్ను నీ వీపుని నిమరనీ!” పాదచారి పొందిగ్గా కింద కూర్చున్నాడు.
“నిన్ను నీవు మరిచిపోవడం! వహ్వ! శభాష్! పాదచారీ! నీలోనించి పారిపోవటానికి నీవే ప్రయత్నించే పలాయనవాదీ!” సత్యమూర్తి పకపకా నవ్వాడు.
గిరుక్కున వెనక్కి తిరిగాదు పాదచారి.
“నేనూ వచ్చాను!” అంటు బుసల్లాంటి పొగలు ముక్కుల్లోంచి జారుస్తూ నిలిచాడు విప్లవమూర్తి.
“నేను నీకు ఎప్పుడూ ఇచ్చేది సపోర్టే” అలవోకగా అందంగా వచ్చి లాలనగా భుజం మీద చెయ్యి వేసింది కవితాకుమారి.
“One at a time” అంటూ విశ్రాంతిగా కూర్చున్నాడు విజ్ఞానాచార్యులు.
“ఎందుకొచ్చారు మీరంతా? నా మానాన నన్ను వదిలెయ్యలేరా? ఫొండి! ఫొండి!” అరిచాడు పాదచారి.
“మాకు సమాధానం చెప్పేదాక వదలనే వదలం” భీష్మించారు అందరూ!
“ముందు నా వంతు!” కరుగ్గా అన్నాడు విప్లవమూర్తి.
“Ladies First” అంది కవితాకుమారి.
“పెద్దవాణ్ణి నేను…” దగ్గుతూ అన్నాడు విజ్ఞానాచార్యులు.
“Excuse me please” అంటు ముందుకొచ్చి నిలిచాడో పొడవైన వ్యక్తి.
“మీ మేనేజర్ని”
“దేనికి మేనేజర్‌వి? ఏం మేనేజ్ చేస్తుంటావు?”
“మీ ఊహల ఫ్యాక్టరీనీ, ఆశల కర్మాగారాల్నీ మేనేజ్ చేస్తూంటాను.
“ఇపుడెందు కొచ్చావు?”
“తాళాలు కావాలి సార్!”
“దేనివి?”
“జ్ఞాపకాల గ్రంథాలయానివి!”
“దానితో నీకేం పని?”
“సార్! నేను మీ సేవకుణ్ణి! అపుడపుడు లైబ్రేరియన్‌గా కూడా పనిచేస్తుంటాను. మీరు గుర్తించలేదేమో!”
“సరే సరే! ఇప్పుడేం పని బడింది?”
“జ్ఞాపకాల గ్రంథాలయం చాలా కాలంగా మూతబడి ఊరుకుంది. దాని అణువుల గ్రంథాల్ని దులిపి బాగు చేద్దామని!”
“ఓ నా సేవకుడైన మేనేజరూ… నీ దార్న నువు ఫో!”
“అలా వీల్లేదు… అతనికి తాళాలివ్వాల్సిందే” కరుగ్గా అన్నాడు విప్లవమూర్తి.
“మేమూ దాన్ని చూస్తాము” అన్నాడు సత్యారావు.
అందులో కవితలూ, కథలూ ఉన్నాయా?” కుతూహలంగా అడిగింది కవితాకుమారి.
కాసేపు ఆగి మళ్ళీ అంది “నేనూ దాన్ని చూసినట్లే, అందులో ఉన్నట్లే గుర్తు. చాలాకాలం అయింది. ఎంత మంది అతిథులో! ఎంత మంది అతిథులో! మర్చిపోయేను. మరే, మర్చిపోయే ఉంటాను!”
“నా ఎదుట నువు మాట్లాడకు. నీలో కొన్ని గుణాలే నాకిష్టం! మిగతాదంతా శూన్యం” కరుగ్గా అన్నాడు విప్లవమూర్తి.
“మీరిద్దరూ పిచ్చివాళ్ళే” డిక్లేర్ చేశాడు సత్యారావు.
“ఆగండాగండి! అందరూ సమానమే” గడ్డం నిమురుకుంటూ అన్నాడు విజ్ఞానాచార్యుడు.
“వీళ్ళందర్నీ ముందు వదుల్చుకోడం ఎలా?” ఆలోచించాడు పాదచారి.
“అయ్యా! తాళాలు” remind చేశాడు మేనేజర్.
“సరేగాని మేనేజరూ! నీ ఫ్యాక్టరీ దేన్ని ఉత్పత్తి చేస్తుంది?” ప్రశ్నించాడు పాదచారి.
“ఇ… హి… హీ! ఫ్యాక్టరీ తమదేనండీ! నేను just care taker ని!”
“అంటే నువ్వేం చేస్తావు?”
“జనరల్ మేనేజర్ గారి పర్మిషన్తో అన్నిట్నీ, అంతట్నీ రికార్డు చేసి సక్రమంగా షెల్ఫుల్లో దాయటమో, file చేయటమో చేస్తుంటానండీ”
“ఆ జనరల్ మేనేజర్ ఎవరు?”
“వారు తమ దర్శనం చేసుకుంటానన్నారండీ!”
“పిచ్చి మాటల కాలయాపనా?” గద్దించాడు విప్లవమూర్తి.
అందరూ లేచి చుట్టూ చేరారు.
“వీళ్ళను వదిలించుకుంటాను” గుండె జేబులోనుంచి తాళాలు గుప్పెటతో తీసి దూరంగా విసిరేశాడు పాదచారి.
“ఆహా – హా! ఊహూ – హూ” ఆనందంగా కేరింతలు కొడుతూ అందరూ పరిగెత్తారు.
నిట్టూరుస్తూ చుట్టూ చూశాడు పాదచారి.
ఆకాశం మబ్బుల్తో నిండిపోయి అద్భుతమైన ఆయిల్ పెయింట్ వేసుకుంది.
ఉరుములు మెరుపుల చిత్రాలు చిక్కగా అలుముకున్నాయి.
చెట్లన్నీ ఊగుతూ ఊగుతూ “రా! రా! రండి! రండి! వర్షకన్యా!” అంటూ వర్షరాణిని ఆహ్వానించాయి. మృగశిర మూడోకార్తె. ముచ్చటగా చినుకుల శిరోజాల్ని చిక్కగా విదిలించింది.
అడవిలత వృక్షపురుషుడిని తమకంగా కౌగిలించు ఊగుతూ ముద్దులిచ్చేస్తోంది!
“ఈ లోకం నాకు విడిది!” అనుకున్నాడు పాదచారి.
“ఈ వృక్షాలు, పశుపక్ష్యాదులు అన్నీ నేనే!”
కొండలు లోయలు
కోనలు పూవులు
అన్నీ అన్నీ నా నేస్తాలే!
అన్నీ అన్నీ నా దేహాలే!
“రా! రా! పాదచారీ! నా ప్రియమైన బాటసారీ! నా కాలపు నీడలో కూర్చో! చినుకుల వేటనించి తలదాచుకో!” పిలిచింది ఓ కొండవాలు.
కాలు మీద కలౌ వేసుకుని వాలుగా పడుకుని కొండవాలుని చేత్తో నిమిరి, “ఈ లోకం నాకు విడిది! ‘నా’ లోకానికి ఒకసారి సెలవల్లో వెళ్ళొస్తాను?” అనుకుంటూ మళ్ళీ గొణుక్కున్నాడు పాదచారి.
కుయ్… కుయ్ మంటూ పక్కనచేరి పాదాలు నాకింది కుక్కపిల్ల.
నేను అలసిపోలేదు!
నేను సొలసిపోలేదు!
నే ఓడిపోలేదు!
నే వాడిపోలేదు!
మరెందుకు నీకీ నిద్ర?
ఇంకెందుకు యీ మౌనపు ముద్ర?
దిగ్గున లేచి హుషారుగా యీల వేశాడు. కుక్కపిల్ల వీపు మీద చిలిపిగా చరిచి, “చల్ చల్” అంటూ ముందుకు నడిచాడు.
***
“నేను శిల్పిని కాదు!”
“కనీసం చిత్రకారుణ్ణి కాదు!”
“భావాల్ని భాషలో ఇమిడ్చే కవిని కాదు”
“కవి చెప్పలేని భావాల్ని ఉత్తినే రాగంలో వెలయించే గాయకుణ్ణి కాదు”
“వైణికుణ్ణి కాదు – కాలపు సైనికుణ్ణి కాదు!” గడ్డిపువ్వుతో అన్నాడు పాదచారి.
“నీ భావాలు మాకు తెలుసు! అయినా మళ్ళీ మళ్ళీ వింటాం!” కొంచెం దూరంలో ఉన్న మఱ్ఱి ఆకులు కలకలంగా అన్నాయి.
“సరే! చక్కగా కూర్చుని చెప్పు! ఇదిగో నీ కోసం పచ్చగడ్డి సింహాసనం!” గరిక వీరుడు ఒదిగి చోటు ఇచ్చాడు.
పాదచారి కాసేపు ఆలోచించాడు.
“మీరంతా నా నేస్తాలు. వినండి! వినండి!”
“ఆకాశంలో పక్షుల్లారా!
భూమిని సాగే జీవుల్లారా!
చెట్టుల్లారా! పుట్టల్లారా!
దిక్కుల్లారా! దృక్కుల్లారా!
రారండోయ్ ఓ కథ కోసం!
నే చెప్తానది మీ కోసం!” ఎలుగెత్తి పిలిచాడు పాదచారి. కోయిలా, గిజిగాడూ, చీమరాజులూ, పింఛపు నెమలీ, అందరూ చుట్టూ చేరారు!
“మా ఖర్మ ఇంతే! కదల్లేం! మెదల్లేం! సరే ఇక్కడినించే వింటాములే. చెప్పు!” అన్నాయి వృక్షాలు.
“అదుగో! అది ‘నా’ లోకం!
అదుగో! అదే సిసలైన ‘నా’ దేహం!
అక్కడే ఉంది నా దివాణం!
అక్కడికే ఇప్పుడు మన ప్రయాణం!”
ఓ తార కలువలా కళ్ళు చికిలిస్తూ విచ్చుకుంది.
పాదచారి పకపకా నవ్వుతూ పరుగులు పెట్టాడు!
***
“పాదచారీ!”
“ఊఁ”
“ఇలాగే ఉంటావా?”
“ఊఁ”
“మాట్లాడవేమి?”
“ఎక్కడో పాల సముద్రం మధ్యన ఓ పెద్ద తామరాకుపై శాంతంగా పడుకున్నాను”
“పిచ్చీ!”
తన గుండెల్లో దూర్చిన అతని తలను పైకెత్తి చిట్టి చిట్టి ముద్దులు పెట్టింది అమృత.
ఎంత చక్కని సువాసన ఆమెది?
తమకంగా కౌగిలించుకుని గుండెల్లోకి మళ్ళీ దూరిపోయాడు.
తల నిమురుతూ అంది “ఆకాశం చూడు! ఎంత స్వచ్ఛంగా ఉందో!”
“నేను చూడను”
“ఏం?” నవ్వింది.
“అన్నీ నాకు ఇక్కడే ఉన్నాయి. స్వచ్ఛమైన నీలాకాశం, నీలి నీలి సముద్రాలూ, పచ్చ పచ్చని పైరులూ, అడవులూ, మృదువైన మల్లెలూ, మనసూ అన్నీ నాకిక్కడే ఉన్నాయి.”
“అయితే అలాగే ఉండిపోతావా?”
“ఆ! ఎప్పటికీ!”
“నా పిచ్చివాడా!… నా పిచ్చివాడా!” తలపైకి ఎత్తి మళ్ళీ ముద్దులు పెట్టి అంది “ఈ లోకం నిన్ను చూసి నవ్వుతుంది” అంటూ నవ్వింది అమృత. ఆమె నున్నని మెడని నిమురూతూ అన్నాడు పాదచారి – “నాకేం?”
“మానం లేని వాడవంటుంది”
“అనుకోనీ”
“లోకంతో పనే లేదా!”
“లేదు.”
కొద్దిసేపు ఆగి తను అంది “నాకు లోకంతో పని ఉంది. నేను స్త్రీని. ఈ లోకపు రక్షణ కావాలి.”
దిగ్గున తల ఇవతలికి తీశాడు పాదచారి.
“లోకం రక్షణ ఇవ్వగలదా? స్త్రీ అయినంత మాత్రానా….”
తను నవ్వింది.
“నీది వేడి రక్తం చూడు! లోకం లోకమే!”
“అవును లోకం లోకమే. మనిషి తిండి లేక ఎండేటపుడు ఏమీ చెయ్యని లోకం మంచి చెడ్డల న్యాయాలకి నేను ఉన్నానని కూస్తుంది. లోకం లోకమే!”
“అయినా తప్పదు పాదచారీ!”
“సరే!… నువు లోకంతో రాజీపడు. నాకు లోకం అంటే లెక్క లేదు. అది గౌరవించినా, గౌరవించకపోయినా నా దార్న నేను తల ఎత్తుకునే నడుస్తాను.”
కాసేపు అతని ముఖంపై ముద్దులు పెట్టి అంది – “అయితే నేను మారాలి కొంత.”
“ఎలా?”
“కష్టమే! అయినా నిన్ను దూరంగా ఉంచాలి”
“చూడూ!” మాట పెగల్లేదు పాదచారికి. కాసేపయ్యాక తమాయించుకుని అన్నాడు – “నీ కోసం ఏం చెయ్యను? లోకానికి తల ఒగ్గనా? సరే! ఈ లోకానికి బానిసనవనా? సరే! ఈ లోకపు పిచ్చి రీతుల్ని పాటించనా? సరే! ఇంకేం చెయ్యను? చెప్పు.”
ఎంత బలహీనుడవయ్యావు?… ఓ స్త్రీ కోసం?”
“ఇది బలహీనతా! ఏమో! ఇక స్త్రీ సంగతా! మరి కొన్ని మాంసపు ముద్దలు. అందమన్ అమర్పు. అయినా అందులో అద్భుతం లేదు. చూడు!… నీ చేతులు నా తల నిమురుతున్నాయి. అందులో అద్భుతం నేనేమని చెప్పను? వేళ్ళంటావా? అవి తయారైంది ఎముకలూ, రక్తం, మాంసంతో! ఊహూఁ! దాని వెనకాల కనపడకుండా ప్రవహించే అనురాగమో, ప్రేమో, ఆనందమో దాన్ని ఎట్లా చెప్పడం? నేను చూసేది దాన్ని.”
“ఆ భావన అందరిలోనూ ఉంది!”
“ఉండవచ్చు అమృతా! ఆ భావన అందరిలోనూ ఉంటుంది కానీ, ఓ మాట విను. ఏ స్త్రీని చూసినా నీలోని ఓ అణువు అక్కడున్నట్లనిపిస్తుంది. కనీసం శరీరం ఆకృతిలో ఓ అణువు. ఆ అణువు కోసం ప్రపంచం సర్వాన్నీ ప్రేమిస్తున్నాను. ప్రతి స్త్రీలోనూ విహ్వలంగా నేను వెతుక్కునేది ఆ అణువులే. అపుడే ప్రపంచమే నీవయ్యావు. నీకు ‘ఆది’ ఎక్కడా! అంతమెక్కడా! ఇపుడు చెప్పు దీనిని బలహీనత అంటారా? ఓహోయ్! ఇది బలహీనత అయితే ఇంక బలం అన్న మాట లేనే లేదు.”
“నీ వన్నీ పిచ్చి ఊహలూ, పిచ్చి లోకమూ!” చిరునవ్వుతో దయగా ముద్దు పెట్టింది అమృత.
“కావచ్చు! కానీ అమృతా నేను ‘నా’లాగానే సుఖిస్తున్నాను. నేను ‘నా’లాగానే వెదుక్కుంటున్నాను. నన్ను నేనే పోగొట్టుకుంటున్నాను. ఆ పోగొట్టుకోటం ఏమిటో తెలిసిందీ తెలుసుకున్నదీ నీ దగ్గరే.”
పాదాలపై తలవాల్చి విశ్రమించాడు పాదచారి.
‘ఓ క్షణం’ ఆశ్చర్యంగా అలానే ఆగిపోయింది.
“ఇంకేమీ యీ లోకంలో నీకు వద్దా?”
“కావల్సింది యేముందీ? ఎందుకసలు కావాలనుకోవడం? నేను వచ్చాను. నేను వెడతాను. ఈ రావడం, పోవడం అన్నది నా చేతిలో లేదు. మరి దెనికి పోగు చెయ్యడం?”
“ఫలానా అని నీ గుర్తు యీ ప్రపంచం మీద నిలపడానికి!”
పకపకా నవ్వాడు పాదచారి.
“చూడూ ప్రపంచాన్ని జయించిన మహావీరులేమయ్యారు? మార్పులూ చేర్పులూ చేసిన మహామహులేమయ్యారు? ముక్కు మూసుకున్న వేదాంతులేమయ్యారు? లోకానికి దూరంగా ఆకూ-అలమూ తిని బతికిన ఋషీశ్వరులేమయ్యారు? శ్మశానవాటికలో అణువులుగా మిగిలిపోయారుగా! ఏవీ వారి గుర్తులు? మాటలు రాని, భాష లేని ఆదిమానవులు తమ ‘గుర్తు’ అని తెలియకుండానే ఎన్ని సృష్టించారో? ఎలా సృష్టిలో కలిసిపోయారో? వికృతీ లేదూ, ప్రకృతీ లేదు. ఉన్నదమ్తా అలానే ఉంది. దేశభక్తులు పోయినా దేశం ఉన్నచోటే ఉంది. జయించిన వాడూ లేడు. జయించిందీ లేదు. ఏదో కాసేపు ‘ఇది నా గుర్తు’ అనుకోవడమే. ఎందుకో యీ వృథా ప్రయాస?”
“ప్రజలంతా మూర్ఖులనీ, నీదొక్కటే నిజమనా నీ అభిప్రాయం?” చిరుకోపంగా అడిగింది.
“ప్రజలు ప్రజలే! ఎవరిక్కావలసిన రీతిలో వారు బ్రతుకుతారు. ఎవరిక్కావలసిన ‘గుర్తు’ వారేర్పరుచుకుంటారు. అంతెందుకు, నాలా నిర్లక్ష్యంగా ఉండమని నేనేం ప్రబోధించడం లేదుగా! ఇది నా ఉద్దేశం. నా మటుకు నేను అలాగే ఉంటాను.”
“ఓ రోజు ఇందుకే ఏడుస్తావు”
“పోనీలే! ఏడ్చినా నేనేగా! ఏ మనిషీ ఎప్పుడూ నవ్వాలనుకోవడమూ అత్యాశే! ఏడ్చే క్షణమే ఉంటే అదీ అద్భుతమే. అందులోనూ ఉన్నది సౌందర్యమే.”
“నువ్వు పిచ్చివాడివోయీ!” గట్టిగా పాదచారి తలను గుండెల్లో దాచుకుని అంది.
ఆనందంగా నవ్వాడు పాదచారి.
తల్లిని బిడ్డలా కౌగిలించుకున్నాడు.
ఓ తీతువు పిట్ట అరిచింది.
గభాల్న కళ్ళు తెరిచాడు. అంతా కలే!
అంతా నిజమే! చుట్టూ చూస్తే అపుడే వస్తున్న సూర్యుడు. కళ్ళు నులుముకుని లేచాడు.
“నా జీవితమూ, నా కలా రెండూ ఒకటే! ఒక దాన్లో ఇంకోటి ఎప్పుడూ కలిసే ఉన్నాయి” అనుకుంటూ ముందుకు నడిచాడు. కుక్కపిల్ల బద్దకంగా వళ్ళు విరుచుకుని అతని వెనకాల అడుగులు వేస్తూ నడిచింది.
(సశేషం)

భువన చంద్ర సుప్రసిద్ధ సినీ గేయ రచయిత. కథకులు. పలు హిట్ పాటలు రచించారు. “భువనచంద్ర కథలు”, “వాళ్ళు” అనే పుస్తకాలు వెలువరించారు.
9 Comments
కస్తూరి మురళీ కృష్ణ
ఇది కంపల్లె Ravichandran గారి స్పందన
నమస్తే!!
నవల ఐదు భాగాలూ సాంతం చదివాను.. ఏదో అవ్యక్తమయిన భావన నన్ను పందిరి చిక్కుడు తీగలా అల్లుకుపోయింది. వర్షించని మేఘాల్లాగా.. మనసు నిండుగా భావాలు పేరుకుని పోయాయి.. ఈ ధారావాహిక చదవగానే. మాట పెగలలేదు, మనసు కదలలేదు. ఊపిరాడలేదు. ఊహ మెదలలేదు. నాకొకటి అనిపించింది … ఇది చదివిన మరుక్షణం- ఏదో ఒక అవ్యక్తం అన్ని వేపులా అధికారం చెలాయిస్తూ ఉంటుంది. ఏదో చెప్పాలని కొండల వెనకనించే ఉదయం కొండంత ఆశతో వస్తుంది. కొమ్మ చివరి పువ్వు కోటి సంగతులు చెబుతుంది. మాటలకందని మాధుర్యాన్ని మనసుకందిస్తుంది. చెప్పలేని తీరాన్ని దాటడానికి చేయి చేయి కలుపుతాం. కానరాని లోతుల్ని వెతుకుతూ కళ్లలో కళ్లు కలుపుతాం. అంతు పట్టని దానికోసం అన్వేషిస్తూ ఉంటాం. కారణాల దిగంతాలు దాటి జీవితం కవ్విస్తూనే ఉంటుంది. రావడం అంతుబట్టదు. పోవడం అంతుబట్టదు. అజ్ఞాతంగా వచ్చిన, అజ్ఞాతంగా నిష్క్రమించే ప్రేమను పట్టుకోలేం. పట్టివ్వలేం. అవ్యక్తమైనాప్రేమ అపూర్వమయింది. అందరికీ సంబంధించినదైనా ఎవరికీ కనిపించనిది. ఆవిష్కరించలేని దానిలో ఆకర్షణ ఉంది. రహస్యంగా మొదలై రహస్యం కేసి సాగుతున్న ఈ మానవ జీవిత రహస్యాన్ని రసరమ్య భాషలో అందిస్తున్న మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పను… మధురకవి గుర్రం జాషువా అన్నట్లు -“ అప్పు వడ్డది సుమీ ఆంధ్రజాతి”.. అలా మీకు ఋణపడ్డది తెలుగు పాఠకలోకం.. తలత్ మహమ్మద్ పాటలా తెలీని లోకానికి తీసుకెళ్తారు మీరు..
BHUVANACHANDRA
ధన్యవాదాలు రవిచంద్రన్ గారూ … ఎంతోకృతజ్ఞుడిని …మీ స్పందన ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చింది tq సో మచ్
కస్తూరి మురళీ కృష్ణ
This is the response of tatineni vanaja
ఈ రోజు ఉదయం సన్నగా చినుకులు పడుతున్నాయి. పూజకు పూలు కోసుకోవడానికి వెళ్లాను. ప్రక్కనే వున్న ఖాళీ స్థలంలో యేవేవో పిచ్చి మొక్కలు గడ్డిజాతి పూలు. ఆకుపచ్చని తివాచీ పరిచినట్టు వుంది కొంతమేర. మరికొంత మేర ఆవపూలు. ఆ ఆవపూలపై గడ్డిపూలపై క్షణం కూడా తీరిక లేకుండా తిరిగే పసుపు పచ్చ సీతాకోకచిలుకలు. వాటిని చూస్తూ కాసేపు నిలబడిపోయాను. చినుకులలో తడుస్తూ అ ఆహ్లాదకరమైన ప్రకృతి వొడిలో కొన్ని నిమిషాలు నేనేమిటో మర్చిపోయాను. ఆనందం అంటే ఎక్కడో వుండదు. మనం కేవలం మనం మాత్రమే మనకు ఇచ్చుకోగలం. నా వయస్సు 52 నిండింది. నేను బయట ప్రపంచంతో పెద్దగా సంబంధాలు పెట్టికొను . (ఇక్కడ యిలా తప్ప ) చదవడం వినడం నిశ్శబ్దంగా చూస్తూ వుండటం .. వీటి తర్వాత వ్రాసుకోవడం .. మిత్రుడితో (భగవంతుడితో) మాట్లడుకోవడం .. ఇక ఇంటిపని ..ఆఖరిగా ఫోన్ వస్తే మాట్లాడటం అంతే ..నా జీవన శైలి. దాదాపు రోజూ యింతే ! బాహ్య ప్రపంచంతో సంబంధం విభేదాల వల్ల కాదు. ఆలోచనల్లో తేడా, బిహేవియర్ లో తేడా .. జనులకి ఇతరుల విషయాలపై అంతులేని ఆసక్తి. మన లోపాలు మనకే వుంటాయి. అయినా ఇతరులకు ఉచితంగా ఉపదేశాలు ఇవ్వడం. నల్లకోటు వేసుకుని జడ్జిమెంట్ యివ్వడం. అనకూడదు కానీ అభిప్రాయం వెలిబుచ్చడం వేరు, ఏదో తెలియని అధారిటీతో యిది ఇంతే అని చెప్పడం వేరు. దురదృష్టవశాత్తు ..చాలా మంది ఇలాగే ఉన్నారు. ఆఖరికి జనబాహుళ్యంలో తిరిగి మూలాలు తెలుసుకుని రచనలు చేయాలనుకున్న నేను … ఇంటికి పరిమితమైపోయాను. ఈ పాపము లేదా ఈ పుణ్యం ఏదైనా వుంటే … కచ్చితంగా .. నా చుట్టూ వున్న సోషియల్ మీడియాలో వాళ్ళే ! ప్రతి మనిషికి ముసుగు వుంది. అవసరం లేకపోయినా ముసుగు వేసుకుంటారు. బహుశా నేను అందుకు అతీతం కాదనుకోండి.. అదిగో ఇలాంటి సమయంలో .. ఈ “పాదచారి ” నాకు దొరికింది. ఇది చదివి యింకా మౌనంలోకి వెళ్ళిపోతున్నాను. ఈ పఠనానుభవం నాకు చాలా నచ్చింది. “నీలోకి నువ్వు తొంగి చూసుకో..నీకు నువ్వు అర్ధమైతే…
లోకం అర్ధమవుతుంది నువ్వు కూడా వొక నమూనా బొమ్మవే కదా ” అని వొకసారి వ్రాసుకున్నాను .. ఆ మాటతో ఏకీభవిస్తూనే … ఇది అంతరంగ ప్రయాణం .. అందుకే పాదచారి చదవమని సూచిస్తున్నాను. .
:
BHUVANACHANDRA
.ధన్యవాదాలు తాతినేని వనజగారూ …మీ స్పందన బాకు ఏంటో ఆనందాన్నీ స్పూర్తినీ ఇచ్చింది …చాలా చాలా థాంక్స్
యామినీ దేవి కోడే
ఐదో భాగం మొదలే ఆకట్టేసుకుంది
అద్దానికి ఆవల వేపున తీరం
ఈవల వేపున మోహం
అద్దంలో మీ ప్రతి బింబం వెలుగుతున్న మిథ్యారూపం..
ఎంత గొప్ప సత్యమిది.
సింపుల్ గా జీవితపు సారాన్ని ఈ రెండు మాటల్లో ఇమిడ్చి చెప్పేసారు.
నేను చిరంజీవినని పాదచారి పాత్ర తో అనిపించడం..
మనిషి లో మరికొన్ని గుణాల యొక్క లక్షణాలు మరికొన్ని పాత్రల ద్వారా పరిచయం చేయడం బావుంది.
చిరంజీవినని ఎలుగెత్తి అరచిన ఆ స్వరం లోనే స్వర స్థాయి తగ్గి నేను దుర్బలుడ్ని అంటాడు.. కాసేపటికే శక్తి హీనుడ్నని చెప్తాడు.
ఎలా ఎలా అని లేవనెత్తిన ప్రశ్నలకు ఆరుద్ర జీవితో.. నన్ను నేను మరచిపోవడానికి ప్రయత్నిస్తున్నానని అంటాడు.
ఆ అనడంలో నాకెందుకో తాత్వికత
అనిపించిది.
ఇంతలోనే సత్యమూర్తి పలాయనవాదం అనడం నన్ను ఆలోచనలో పడేసింది..
కవితాకుమారి రాకతో ఓహ్.. అనుకున్నాను.
విజ్ఞానాచార్యుల రాక నాకు మరింత ఆశక్తిని పెంచింది.
అప్పటికి ఉన్న పలాయన వాదం మీద వీరు.. వీరి గుణం ఏం చెప్తుందో అనిపించి.. మరింత ఆశక్తి గా అక్షర ప్రయాణం చేస్తూ పాదచారి వెంట నడుస్తూ ఉన్నాను.
ఇప్పుడెందుకు వచ్చారు పొండి పొండని అంటూ ఉండగా.. మేనేజర్ పాత్ర చాలా సరదాగా ఎంట్రీ ఇస్తే.. ఆ ప్రశ్నల పరంపర నుంచి జ్ఞాపకాల గ్రంథాలయం అనడంతోటి.. నాకు నేను కూడా ఆలోచనల్లో పడిపోయాను.
మిగతా గుణాలు తర్జనభర్జన పడుతుంటే.. వీళ్లని వదిలించుకోవడమెలాగ అంటూ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు..
గుండె జేబులోంచీ తాళాలు తీసి విసిరేయడం బలే బావుంది.
అప్పుడే నాకూ ఈ గుండె జేబులో తాళాలు చేతికి వస్తాయా అని అనుకున్నా.. వస్తే బావుండుననీ అనుకున్నా..
అలా వస్తే అంతకంటే ఏం కావాలి అనిపించిది.
తర్వాత తనలో తాను లీనమవడం.. మమ్మల్ని పాదచారి ఆ ప్రకృతి లో నడిపించడం ఈ భాగంలో మరింత ఆకట్టుకుంది.
ఆ ప్రయాణంలో ప్రకృతిలో మమేకమవుతూనే.. తన లోపలి స్వభావాలతో ఒక్కొక్కరితో జరిపే సంభాషణలు ఆశ్వాదిస్తూ చదవాల్సిందే తప్ప తక్కువ మాటల్తో చెప్పడం సాధ్యం కాదనిపించింది.
చివరన



గురుపౌర్ణమి కి సరైన అర్థం ఇటువంటి సద్గురువు మాకు ఇలా లభించడం.. ఇలా మాకు






మీ బిడ్డల్లాంటి మాకు మీ ఆశీస్సులు ఉండాలని సదా మీ జ్ఞాన వెలుగు మాకు పంచాలని కోరుతూ.. మీ పాదాలకు మనఃపూర్వకంగా







నా జీవితమూ.. నా కలా రెండూ ఒకటే!
ఒకదాన్లో మరొకటి కలిసే ఉన్నాయని కనిపించని సత్యాన్ని కంటి ముందు పెట్టి పాదచారి వెంట నడిపిస్తున్నారు గురువర్యులు..
చక్కటి జీవిత సత్యాలను ఆద్యాత్మిక బోధనను మాకు అందిస్తున్న
గురుపాదాలకు నిత్యవందనాలు
మంచి మార్గాన్ని చూపి మాకు జ్ఞాన జ్యోతి పంచడం. ధన్యురాలిని గురువర్యా
గురు పాదాలకు ఈ సందర్భంగా మరోమారు నమస్సులు తెలుపుకుంటూ
కస్తూరి మురళీ కృష్ణ
This comment is by kampella Ravichandran
కొత్తగా రాయాలన్న కవులు పదచిత్రాల చేపల్ని ఒడుపుగా పట్టడం నేర్చుకోవచ్చు. మరొక విషయం మీలో నేను గమనించినదేమిటంటే చాలా మంది ఆద్యాత్మికత కుదురుగా చేసుకుని రచనలు చేసేవారిలో అత్యంత సహజ లక్షణంగా కనిపించే చాదస్తం మీలో లేదు. మీరు వయసుకు నిన్నటి తరం వారయినామనసుకు ఆధునికులే.. ఇంకా చెప్పాలంటే అత్యాధునికులు. అలవిమీరిన ఉద్వేగాలకు ఇష్టపడరు మీరు. పదచిత్రాల్లోకి ప్రపంచాన్ని ఒంపారు. అక్షరాల పూలని అందరిపై చల్లారు. ప్రయోజనాల్ని గాక నూత్న సంకేతాలని చూసి పరవశించడం మీలో చూసి నేనెంత సంబరపడుతున్నానో మీకు convey చేయడం నాకు చేతకావడం లేదు. మీలాగా నేను రచయితను కాదు కనుక. సౌందర్యంతో సాహచర్యం చేసిన సున్నితత్వం మీలో నాకు కనిపించింది. ఇంకా చెప్పాలంటే మీరు ఒక ఇటాలియన్ ఒపేరా గాయకుడి లాంటి రచయిత. మీలో కలిగిన పరవశ ఆనందంలో వివిధ భావాల్ని వెదజల్లుతూ అక్షరాల అనురాగ గీతికను ఆలపిస్తున్నారు. ప్రకృతి పరివర్తనానికి భావోద్వేగాల్ని అల్లి ప్రదర్శిస్తున్నారు. ఏతా వాత చెప్పడమేమంటే
ఒక ఆశ్చర్యాన్ని, ఒక దిగ్భ్రమని, ఒక వింత అనుభూతిని కలిగించే రచనాశిల్పం మీది. ఒక పూల కుండీలో రెండు నక్షత్ర కిరణాల్ని, రెండు నవ్వుల్ని , రెండు మల్లెపూలని, రెండు కన్నీటి మణుల్ని పెట్టినట్లుంది.. మీ “ పాదచారి “ ధారావాహిక !!
మహాశయా! నమస్తే! మీరు పంపిన ధారావాహిక మళ్లీ మళ్లీ చదివాను.. నా ఈ వేసరిక జీవితంలో అది ఎంత ఓదార్పో చెప్పలేను.. మీరు ఇదేమిట్రా వేరే వాళ్లను ప్రస్తావిస్తున్నాడు అనుకోకపోతే ఒక్క మాట .. ముఫ్పై ఏళ్లకు ముందు కళాప్రపూర్ణ లత ను చదివినంత అనుభూతి కలుగుతోంది మీ “ పాదచారి” ధారావాహిక నవల చదువుతుంటే.
మరొక విశిష్టత ఇందులో నాకు కనిపించినదేమిటంటే poetic prose.. ఇది చాలామందికి సాధ్యం కాని విద్య.. ఏ శీలావీర్రాజు గారిలోనో, ఆచంట జానకీరామ్ లోనో చూసాను. మరల ఇన్నేళ్లకు మీ దగ్గర చూసాను. ఇక వస్తువు విషయానికి, కథన రీతి విషయానికి వస్తే- నిర్మల నిశ్శబ్దంలో ఉంటూ కూడా ఎదురు చూపులు చూస్తాడు కవి. తనకోసం ఎవరో ఎక్కడో ఎదురుచూస్తున్నారని తపిస్తాడు. భావుకుడి తత్వం అలాంటిది. తపించడంలోనే తన్మయముంది. శరీరం, ఆత్మ, ప్రపంచం , ప్రకృతీ అన్నీ సమాంతరంగా ఎప్పటికీ కలవలేని స్థితిలో వుంటాయి. ఒకదాన్నొకటి ఆకర్షిస్తూనే ఉంటాయి. వీటన్నిటి సమాహారమైన కవి మీలో అనునిత్యం స్పందిస్తూనే ఉన్నాడు కనుకే ఈ” పాదచారి” నవల బయటకు రాగలిగింది మహాశయా!
ఎవరో మనకోసం పచ్చిక బయళ్లలో ఎదురు చూస్తున్నారన్న భ్రమ, ఎక్కడ ప్రకృతి సౌఖ్యం అంతమవుతుందో అక్కడ జీవితం పుష్పించడం మానేస్తుంది. స్వార్థం మనల్ని ఆవహించినపుడు మనకు చలిజ్వరమొస్తుంది.అన్న కఠోర వాస్తవం ధారావాహిక అంతటాఅంతర్లీనంగా పాకింది. ప్రకృతికీ, జీవితానికి మధ్య ఉన్నసంబంధంతెలిసిన రచయిత మీరు. ప్రకృతిని కాదంటే మనఉనికి ప్రశ్నార్థకమవుతుంది.పరివేదనే ఫలితమవుతుంది. జీవితం వాడిపోతుంది. ప్రకృతితో సన్నిహితంగా ఉన్న మనిషి ఎప్పటికీ స్వార్థపరుడుగా ఉండలేడు. అహంకారిగా ఉండలేడు కనుక దేవుడు ఇచ్చిన ప్రకృతి లో మనిషి మమేకం కావాలనే తపన మీ రచనలో కన్పిస్తుంది. ప్రాణమంతా పచ్చదనాన్ని పరచుకున్న రచయిత మీరు.
ఇక మీ శైలి- లత గాత్రమున్నంత స్వీట్ గా ఉంది. వాక్యచమత్కారమే మీ కళ . కలల అలలతో మీరల్లిన అక్షరాల వలల్ని నల్దిశలా వెదజల్లుతున్నారు.ఈ నవల చదివితే
K Murali Krishna
పాదచారి 5వ భాగానికి Dr. గాలి రాజేశ్వరి గారి …. అద్దం అబద్ధం చెప్పదు..నిజాన్ని చెప్పడంలో దానికదే సాటి…ఐదో భాగం అద్దంతో మొదలు…అంతా మిథ్య అని ఎంతో సొగసుగా చెబుతోంది…ఆమిథ్యను దాటితేనే, అధిగమిస్తేనే, అసలైన ఆవలితీరం…అదే జీవునిగమ్యం….
అద్దమూ అతఃకరణకు ప్రతీక
చర్యకు చర్చఅనవసరం…ఇందులో చర్యలుతప్పచర్చలులేవు.అక్కరలేదు…కళ్ళు తెరిపించడానికి కానుగ పువ్వే చాలు…ఎక్కడ పుట్టాం,ఎందుకు పుట్టాం అనేది పక్కన పెడితే,ఏక్షణంలో ఎవరు ఎక్కుడఎలారాలిపోతారోతెలీదు..రాలితీరాల్సిందే.అడవిలో పువ్వైనా,నేలమీది గడ్డిపువైనా మిన్నంటి ఎగిరే పక్షైనా ఇలకువాలాల్సిందే..మృత్యుపరిష్వంగంలోఓలలాడాల్సిందే..ఇదే జీవులకు వరం,గమ్యం..ఆకాశానికి నిచ్చెన ఆనదు,కోరికల గుఱ్ఱాలు తీరాన్ని చేరవు……. ఎంతకాలం ఎంత దూరం ఒంటరిగా నడిచావో,వగచావో, చివరాఖరుకు అమృత పరిష్వంగంతో అమృతుడవయ్యావు.ఆమె ఒక వెన్నెల సంతకం..నీవొక ఆత్మీయ నేస్తానివి….అందుకునేనొకసాక్ష్యన్ని………….
Bhuvanachandra
Dr G. రాజేశ్వరి గారికీ
శ్రీమతి కోడే యామినీ దేవి గారికీ
నా హృదయపూర్వక ధన్యవాదాలు
Lakshmi Raghava
కథలు కానీ నవలలు కానీ కాలక్షేపానికో, కొంత కొత్తదనం కోసమో చదువుతాము. నిన్ను నీవు తెలుసుకోవాలంటే ఏ ఆధ్యాత్మిక గ్రంధాలు వెదుకుతాము. కానీ పాదచారి అనబడే నవలలో చెప్పకనే చెబుతూ అద్దంలో కనిపించేలా ప్రతి ఫీలింగ్ కూ ఒక పేరుపెట్టి జ్ఞాపకాల గ్రంథాలయానికి తాళం చేతికి ఇఛ్చినట్టు అనిపిస్తుంది. తెలియకుండానే పాదచారి తో నడుడుస్తూ పదాలవెంట పరుగులు తీస్తాము. వచన కవితలా ప్రవహిస్తూ ముందేముందో చూస్తూ ఉండిపోతాము. లోపలి ప్రయాణం హాయిగా, కొత్తగా సాగుతూనే వుంది. మీ రచనా శక్తికి జోహార్లు
