[‘పొయెట్స్ టుగెదర్’ భిన్న కవుల విభిన్న కవిత్వం – అనే సీరిస్లో దేశదేశాల కవుల కవితల అనువాదాన్ని అందిస్తున్నారు హిమజ. క్రిస్టినా రోసెట్టీ రాసిన When I am dead, my dearest; Up-Hill; In an artist’s studio అనే మూడు కవితలకి స్వేచ్ఛానువాదం.]
~
1.ప్రియతమా.. నేను మరణించినపుడు..
ప్రియాతి ప్రియతమా.. నేను మరణించినప్పుడు నా కొరకు విషాద గీతాలు ఆలపించకు నా తలాపున గులాబీ మొక్కలనూ నాటకు నీడనిచ్చే సైప్రస్ వృక్షాలూ వద్దు
తడి తడి జల్లులు ప్రభాత మంచుబిందువులతో కూడిన ఆకుపచ్చని పచ్చికవై నాపై పరచుకో చాలు ఇది నీకు గుర్తుంటే సరే నువు మరచిపోయినా ఫరవాలేదులే
నేనప్పుడిక తారాడే ఏ నీడలను చూడలేను ఏ వర్షపుచినుకులను ఆస్వాదించలేను బాధతో గొంతెత్తి పాడుతున్న కోయిల గానాలనసలే వినలేను
నడిరేయికి తెలవారుఝాముకి నడుమనున్న వెన్నెల వెలుగు స్వప్నాలు బహుశ నాకు గుర్తుండనూ వచ్చు బహుశ నేను మరచిపోనూవచ్చు!!
***
2. కొండ పైకి
ఈ రహదారి అంతా ఆ కొండ పైకి తిరుగుతుందా..
అవును.. ఆ చివరి వరకు వెళ్తుంది
ఈ ప్రయాణమంతా కలిసి ఒక సుదీర్ఘపు రాత్రి పడుతుందా..
స్నేహితుడా.. ఉదయం నుంచి రాత్రి వరకు
అయితే ఈ రాత్రికి విశ్రమించేందుకు అనువైన స్థలమేదైనా దొరుకుతుందా నిశీధి ఘడియలు నెమ్మదిగా మొదలయ్యే వేళకు తల దాచుకునేందుకో నీడ దొరుకుతుందా చీకటి నా ముఖాన్ని కప్పేయదు కదా..
లేదులే నువ్వా సత్రాన్ని తప్పించుకోలేవు
నాకంటే ముందుగా అక్కడికి చేరుకున్న బాటసారులను ఈ రాత్రికి నేను కలవాల్సి ఉంటుందా అయితే వారి తలుపు తట్టనా.. లేక కనుచూపు మేర నుంచి పిలవనా..
ఎలా పిలిచినా ఇంటివాకిట వారు నిన్నేమీ నిలబెట్టరులే
నా ప్రయాణం సౌకర్యంగా సుఖంగా సాగుతుందా బలహీనంగా ఇబ్బంది పడుతూ జరుగుతుందా..
నీ శ్రమకు తగిన ఫలితం దొరుకుతుందిలే
నాకు అక్కడకు చేరుకున్న వారికి సరిపడ పడకలు ఉంటాయా అక్కడ..
అవును వచ్చిన వారందరికీ అక్కడ పడకలు సిద్ధంగా ఉంటాయి..!!
[నర్మగర్భంగా సాగిన పై కవితలో రెండు పాత్రలు. మొదటి పాత్ర సందేహంగా ప్రశ్నలు అడుగుతుంటే రెండో పాత్ర నమ్మకంగా ధీమాగా జవాబులిస్తుంది. కవితలోని విషయాన్ని బట్టి మరణానంతరం ఆత్మ అడిగే ప్రశ్నలకి స్వర్గం నుంచి జవాబులు వస్తున్నట్టు తోస్తుంది. లేదూ.. మనుషుల్లో నిరంతరం ఏదో ఒక భయం ఉంటూనే ఉంటుంది. లోపలినుంచి ఓ అంతస్స్వరం నిశ్శబ్దంగా ధైర్యాన్నిస్తూ ముందుకు తోస్తుంది. ఒకే దేహంలోంచి పలికిన రెండు స్వరాలుగా కూడా అర్థం చేసుకోవచ్చు.]
3.చిత్రకారుడి చిత్రనిర్మాణశాలలో..
అతని అన్ని కాన్వాస్ల నుండి ఒకే ముఖం తొంగిచూస్తుంది ఒకే వ్యక్తి కూర్చున్నట్టు ఒకే వ్యక్తి నడయాడినట్టు ఒకే వ్యక్తి వంగుండినట్టు కనబడని ఆమె, దాగున్న ఆమె ఆ తెరల వెనుక ఉన్నది ఆమేనని తెలిసిపోతుంటుంది
కాన్వాస్ అద్దంలా మారి ఆమె అందాన్ని ముగ్ధమనోహరత్వాన్ని ఆమెకు తిరిగిచ్చేస్తుంది
కెంపురంగు దుస్తులలో అరుదైన జాతిపచ్చలు ధరించిన ఒక మహారాణి, వేసవిలో చిగురు పచ్చదనం వంటి ఒక అనామిక, ఒక సాధువు, ఒక దేవకన్య, ప్రతి కాన్వాసులో అదే ముఖం పదే పదే.. అదే ముఖం అదే అర్థం.. అంతరార్థం ఎక్కువ కాదు.. తక్కువనీ కాదు
రాత్రింబవళ్ళు ఆమె ముఖబింబాన్ని చిత్రించడంలో నిమగ్నమైన అతడి వైపు నిజమైన దయ నిండిన కళ్ళతో చూస్తుంటుందామె..
చంద్రుని వలె అందంగా కాంతిలా ఆనందంగా వేచి వేచి అలసిపోలేదామె వేదనతో మసకబారనూ లేదు తానెలా ఉన్నా ఆమె అతని నమ్మకంలా వెలుగుతుంది తనవరకు తాను ఎలా ఉన్నా అతడు కనే స్వప్నాలను రంగులతో నింపుతుందామె!!
మూలం: క్రిస్టినా రోసెట్టీ
తెలుగు సేత: హిమజ
Christina Rossetti (1830-1894) ఇంగ్లీష్ కవయిత్రి, రచయిత్రి. రొమాంటిక్, ఆధ్యాత్మిక, పిల్లల రచనలు చేసారు. ‘Goblin Market’, ‘Remember’ క్రిస్టీనా రాసిన ‘words of two Christmas carols’ బ్రిటన్లో బాగా ప్రాచుర్యం పొందింది.
తన తల్లి ద్వారా ఇంట్లోనే ఉండి ఆధ్యాత్మిక,ఇతిహాస, fairy tales చదవడం నేర్చుకుంది. కీట్స్, Scott ఇటాలియన్ రచనలతో ప్రభావితం. బాల్యంలో ఆమె ఇల్లు కళాకారులకు, విప్లవ భావజాలం కలిగినవారికి, ఇటాలియన్ స్కాలర్స్ కి ఒక విడిదిలా ఉండేది. ఆమె సోదరుడు Donte Gabriel మంచి పేరెన్నిక గన్న చిత్రకారుడు, కవి. తన సోదరుని అనేక చిత్రాలకు క్రిస్టీనా మోడల్ గా పని చేసింది కూడా. ఇంకొక సోదరుడు William Michael, సోదరి Maria ఇరువురూ రచయితలే. అందరికన్నా చిన్నదైన క్రిస్టీనా తన మొట్టమొదటి కథను తన తల్లికి అంకితం చేసింది.
సుతిమెత్తగా కవిత్వం రాసే ‘హిమజ’ కవితా సంకలనం ‘ఆకాశమల్లె’కి కవయిత్రి మొదటి పుస్తకానికి ఇచ్చే సుశీలా నారాయణరెడ్డి పురస్కారం (2006), రెండవ పుస్తకం ‘సంచీలో దీపం’కు ‘రొట్టమాకు రేవు’ అవార్డు (2015) వచ్చాయి. ‘మనభూమి’ మాసపత్రికలో స్త్రీలకు సంబంధించిన సమకాలీన అంశాలతో ‘హిమశకలం’ పేరున సంవత్సర కాలం ఒక శీర్షిక నిర్వహించారు. ప్రపంచ ప్రఖ్యాత ఆఫ్రో అమెరికన్ కవయిత్రి ‘మాయా ఏంజిలో’ కవిత్వాన్ని అనువదించి 50 వారాలు ‘సంచిక’ పాఠకులకు అందించారు. ఇప్పుడు ‘పొయెట్స్ టుగెదర్’ శీర్షికన భిన్న కవుల విభిన్న కవిత్వపు అనువాదాలు అందిస్తున్నారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
2024 పతంజలి సాహిత్య పురస్కార ప్రదానం – ప్రకటన
జగన్నాథ పండితరాయలు-29
పారాడు
భక్తి పర్యటన (ఉమ్మడి) మహబూబ్నగర్ జిల్లా – 2: శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవస్ధానం, గంగాపురం
‘పోరాట పథం’ – డాక్టర్ హెచ్.నరసింహయ్య ఆత్మకథ -12
నాన్న లేని కొడుకు-1
నీవు..
జీవన రమణీయం-128
ఫలితం ఒక్కటేగా!
గట్టెపల్లి మురళికి నివాళి ‘ప్రజా పోరాట యోధుడు’ కవిత
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®