ఆ రోజు అదివారం.
సిటీలో ఇంజినీరింగ్ కాలేజీలో బి.టెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న తన కొడుకు శేఖర్ ఫోన్ కాల్ కోసం అచ్యుతరామయ్య గారు ఎదురుచూస్తున్నారు.
సాయంత్రం అయింది.
ఆయన చేతివేళ్ళు సెల్ ఫోన్ స్రీన్ పై కొడుకు ఫోన్ నెంబరుపై ప్రెస్ చేయడానికి రెడీ అవుతున్నా… మళ్ళీ వెనక్కి వస్తున్నాయి.
రోజు అయితే శేఖర్ కాలేజీ నుండి హాస్టల్కు రాగానే ఫోన్ చేస్తాడు. కానీ ఈ ఆదివారం ఇంకా చెయ్యలేదు.
అచ్యుతరామయ్య గారిలో ఆందోళన.
శేఖర్ ఆరోగ్యం బాగోలేదా? ఛ…ఛ… అలాంటి ఆలోచనలే తనకు రాకూడదనుకున్నాడు.
ఆయనే ఆగలేక శేఖరానికి ఫోన్ చేశాడు. ఒకసారి కాదు… రెండుసార్లు… కాని శేఖరం రెండుసార్లూ కాల్ రిజెక్ట్ చేశాడు.
అచ్యుతరామయ్య గారు సెల్ కేసి చూస్తూనే ఉండిపోయాడు. మళ్ళీ శేఖరానికి ఫోన్ చేయలేదు. ‘ప్రైవేట్ క్లాస్’లో ఉన్నడేమో అని తన మనసును సమాథానపరచుకున్నాడు.
ఆప్పుడే అచ్యుతరామయ్య గారి సెల్ రింగయింది. శేఖర్ ‘కాల్’ చేస్తున్నాడు.
ఫోన్ లిఫ్ట్ చేశాడు.
“ ‘ఫాదర్స్ డే’ శుభాకాంక్షలు నాన్నా” శేఖర్ మొదటగా చెప్పిన మాటలు విన్న అయనలో కంగారు, ఆందోళన పటా పంచలైపోయింది.
“థాంక్స్ శేఖర్…”
“ఫోన్ కట్ చేసినందుకు కోపం వచ్చిందా నాన్నా?” శేఖర్ అడిగాడు.
“కారణం లేకుండా అలా చేయవని నాకు తెలుసు శేఖర్… డబ్బులేమైనా అవసరమా?” అచ్యుతరామయ్య గారడిగారు.
”వద్దు నాన్నా… నాపై నీ ప్రేమాభిమానాలను మాటల్లో చెప్పలేక మాటలు రాక ఈ మౌనం…”
“ఇఫ్పుడెందుకు శేఖర్?”
“నన్ను చెప్పనీ నాన్న”
“నా చిన్నప్పుడు బడికెళ్ళనని మారాం చేస్తే దగ్గరుండి తీసుకెళ్ళావ్… బడి అంటే నేను ఏడ్చే స్థాయి నుండి బడికి సెలవైతే ఏడ్చే స్థాయిలో నన్నుంచావు. నీ కష్టం కనిపించనీయకుండా, నన్ను ఏనాడు కష్టపెట్టకుండా పెంచావు. నీ తాహతుకు మించి నన్ను చదివిస్తున్నావు.”
అచ్యుతరామయ్య గారి మనసు శేఖర్ చెప్పే మాటలు వింటోంది.
”నాన్న! అమ్మ ప్రేమ చిన్నప్పుడే తెలుస్తుంది. కానీ నాన్న ప్రేమ పెంచేందుకు ఆయన పడిన శ్రమ అర్థం కావడానికి పిల్లలకు ఓ వయసు రావాలి.
చిన్నప్పుడు నాన్న అని పలకడమే గాని అర్థం తెలియదు. ఇప్పుడు తెలిసినా ‘నాన్న’ నిర్వచించేందుకు మాటలు సరిపోవు. నాన్నా! నేనంటే నీకెందుకంత ప్రేమ?”
కానీ అచ్యుతరామయ్య గారు వెంటనే సమాధానం ఇవ్వలేదు. కనుల నుండి రాలిన ఆనందభాష్పాలను తుడుచుకుంటూ ఆయన ఎదురుగా ఉన్న ఆయన తండ్రి ఫోటోకేసి తేరిపార చూసి “శేఖర్! మా నాన్నని అంటే… మీ తాతయ్యను చూడలేదని బాధపడుతూ నా దగ్గర అనేవాడవుగా… నువ్వేమిటి నేను కూడా చూడలేదురా. నాకు పదో నెల వయసులోనే ఆయన చనిపోయారు. అదృష్టం కొద్దీ ఫోటో వుంది. ఆ ఫోటోయే నాకన్నీ ద్రోణాచార్యుడు. మట్టిబొమ్మనే గురువుగా చేసుకొని ఏకలవ్యుడు విద్యనభ్యసించినట్లుగా నాన్న ఫోటోని చూస్తూనే ఆయన ప్రేమను పొందాను. అంతేకాదురా నీ చిన్నతనంలో… నీతో నేను ఉన్నప్పుడు నీలో నన్ను… నాలో నాన్నను చూసుకుని మురిసిపోయేవాడను.
ఇతిహాసంలోలాగా ద్రోణాచార్యుడు ఏకలవ్యుని బ్రొటనవేలు అడిగినట్లు నాన్న నన్ను అడగలేదురా. రోజు నాతో కబుర్లు చెప్పు చాలని కలలో కనిపించి చెప్పారు. అందుకే నాన్న ఫోటో చూసి నీతో మాట్లాడతానురా. ఎందుకో తెలుసా? మా నాన్న పేరే నీదీ ‘రాజశేఖరం!!’”
అంతే ఒక్కసారిగా ఫోన్ కట్ అయింది. అచ్యుతరామయ్య గారు ఆశ్చర్యపడేలోపు బయట గుమ్మంనుండి కాలింగ్ బెల్ మోగింది. ఎవరై ఉంటారా అనుకుంటూ ఆయన డోర్ ఓపెన్ చేశారు. ఎదురుగా శేఖర్.
”సర్ప్రైజ్గా విజిట్ చేద్దామని… ‘ఫాదర్స్ డే’ శుభాకాంక్షలు చెప్పాలని, నీ ఫోన్ కట్ చేసి బయలుదేరాను. కానీ ఉండలేక నీతో మాట్లాడుతూనే ప్రయాణం చేశానం’టూ కాళ్ళఫై పడ్డాడు. ఆయన శేఖరాన్ని లేపి ఆలింగనం చేసుకున్నాడు.
‘నాన్న – కొడుకు- నాన్న’’ వరుసకు ముగ్గురు. కానీ కనిపించేది ఇద్దరే. అదే నాన్న ప్రేమ.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™