[‘పొగ’ అనే అనువాద కథని అందిస్తున్నారు రంగనాథ రామచంద్రరావు. కన్నడ మూలం – డా. చిదానంద సాలి.]
1
ఈ రంగుల మద్దతు లేకుండా, నేను జీవించి ఉండేదాన్ని కాదు.
రంగో, రాతనో, శిల్పమో, సంగీతమో ఏదో ఒకదాని సహాయం లేకుండా మనిషి అశక్తుడు, బలహీనుడు, నిస్సహాయుడు అవుతాడు. ఈ సామెత రక్తం, మాంసం, స్పందించే హృదయం, నిమిషానికి డెబ్బయి రెండు సార్లు కొట్టుకునే నాడీలు ఉన్న మనుషులకే తప్ప; డబ్బు, అధికారం, మోజు-మస్తీలే నిజమైన జీవితం అనుకున్న, మృగాల్లా జీవించే జనానికి ఈ అన్వయించదు. హంసకు పాలు; పందికి అమేధ్యాలే ఆహారమైనట్టుగా ఇది కూడా.
మీ అందరినీ నేను ఎప్పుడో ఇంటికి పిలిచి ఉండాల్సింది. మానవ సంబంధాలన్నీ నిర్జీవమైన స్థితికి చేరుకున్నప్పుడు; భావోద్వేగ జగత్తును భ్రామక జగత్తని జనం మాట్లాడుకుంటున్నప్పుడు; నా ఆలోచనలు, ఇంటి పరిస్థితులు మీకు మాట్లాడుకోవటానికి పోక ముక్కలా దొరికే అవకాశాన్ని ఊహించే బెదిరి దూరంగా పెట్టాను. మనుషులకు మనుషులను దూరంగా పెట్టడానికి ఎక్కువగా గ్రావిటి లేని ఇలాంటి అల్పమైన సాకులూ చాలైపోయిన ఈ కాలపు పరిభాషను నాకు తెలియకుండానే నేను నేర్చుకుని ఉండొచ్చు. అలాగే ఇది మంచికన్నా చెడును, సత్త్వం కన్నా చెత్తను, మౌనం కన్నా మాటను నమ్ముకున్న ఒక విచిత్రమైన కాల ఘట్టం..
మాటలు నేర్చుకున్న మూగదానిలా సజని చెబుతూనే ఉంది.
2
ఆమె మాటలు ఈ లోకానివి కాదేమో అన్నట్టు ఆమె ఆఫీసు సిబ్బంది, మాజీ భర్త, తండ్రి – అందరూ తమతమ సొంత ప్రాపంచిక జంజాటాల తాంబూలాన్ని నములుతూ, ఈ అబద్ధపు సంభ్రమాలనే అత్యంతమూ, అతి రుచికరమూ అనే దశలో పరిభావించుకుని అనుభవించటంలో నిమగ్నమయ్యారు. అది సజని ఇన్‌స్టాలేషన్‌లలో ఒకదానికి ప్రతిష్ఠాత్మకమైన బహుమతి వచ్చిన కారణంగా నిర్వహించిన సంతోష సమావేశం. సంతోష సమావేశంలో కాకుండా ఇటీవల కాలంలో జనం ఎటువంటి సంకటపు సందర్భంలోనూ, సానుభూతి అవసరమైన సన్నివేశాల్లోనూ ఎక్కువ కాలం నిలబడరు. మనస్సును వికసింపజేసే, చింతనకు ప్రేరేపించే ఏ ఒక్కదానిని ముఖాముఖి ఎదుర్కోలేరు. సజని ఇన్‌స్టాలేషన్, ఈ ప్రతిష్ఠాత్మక ప్రదర్శన కమ్-పోటీలో గత ఒక వారం నుంచి ప్రదర్శింపబడుతూ ఆఖరికి మొదటి బహుమతిని అందుకుంది. ఈనాటి సంతోష సమావేశానికి వచ్చినవారిలో ఎవరూ దీన్నొకసారి కనీసం కుతూహలానికైనా వచ్చి చూడలేదు. బహుమతి వచ్చిన తర్వాతైనా, అనేక సందర్భాల్లో జరిగేలా, లోపల ఎంత మురికి నింపుకుని ఉన్నప్పటికీ మొహమాటానికైనా – అబద్ధపు మర్యాదపూర్వకమైన అభినందనలు చెప్పలేదు. ప్రజలు అనుభవపు సంతోషంకన్నా ఆచరణా స్థాయి సంతోషపు సమావేశాలనే ఎక్కువగా ఇష్టపడుతారు. అందువల్ల, ఇక్కడ భావావేశంలో ముగినవారు, బుద్ధిలో వెలిగినవారు, అనుభవపూర్వక ఆనందాల కోసం ఆరాటపడేవారే అత్యంత అల్ప సంఖ్యాకులు.
సజని ఇంటి గోడలను అలంకరించిన పెయింటింగ్‌లన్నీ ఆమె ఊహల్లో వికసించిన భావోద్వేగ బీజాలని; ఎవరూ కాదనలేరు; ఆమె బాధ, ఆనందం, నిస్సహాయత, అతి వేడుకలు ఇక్కడి రంగులలో దాగి, తొంగి, పెరిగి, ప్రకాశిస్తున్నాయని గుర్తించటానికి ఎవరికీ సమయం లేదు. సొఫిస్టికేటెడ్ అహంకారమే నేటి సమాజపు ఒక ప్రముఖ లక్షణం.
ఇప్పుడు అవార్డు గెలుచుకున్న ‘సాలెగూడు’ అనే ఇన్‌స్టాలేషన్, ఆమె జీవితంలోని ఎక్కువ భాగానికి పట్టివుంచిన ఒక నిలువుటద్దం. కేవలం ముళ్లతో నిండిన దీని చివరలో ఒక నిస్సహాయ పుష్పం. ఈ ముళ్లన్నీ ఆ పువ్వును దుష్టహస్తాల పాలుకాకుండా రక్షిస్తాయో లేదా న్యాయంగా దొరకవలసిన చేతులకు దొరకకుండా చుట్టూ కంచె వేసి ఉంవినాయో అని న్యాయమూర్తులు చాలా బుర్ర పాడుచేసుకున్నారట. మోనాలిసా నవ్వుకు అర్థమేమి? విషాదమా, సంతోషమా లేదా పెదవుల పరదా వెనుక బాధను మరుగుపరుచుకున్న సమస్త జగజ్జననీల సౌజన్యపు కపట నవ్వుకు పట్టిన అద్దమా? స్వయంగా డావించికైనా తెలుసా? చిత్రాన్ని గీసేవాడికి మాత్రమే అది అతని అర్థాన్ని ప్రతిబింబించే ఒక భావపు చిత్రం. చిత్రించిన తర్వాత వీక్షకుడి మనఃస్థితి, వయస్సు చూస్తున్న సందర్భం, విద్య నేపథ్యం, అనుభవపు లోతు.. మరొకదానిపై, ఇంకొకదానిపై ఆధారపడి ఎంత మంది చూస్తారో అన్ని అర్థాలు; చూసేవాడు ఒక్కడే అయినా ఎన్నిసార్లు చూస్తాడో అన్ని అర్థాలు.
మనిషెత్తులో ప్రతిష్ఠింపబడిన ఈ ఇన్‌స్టాలేషన్‌లో గాఢమైన నలుపు రంగు ముళ్లచెట్టు కాండాన్ని ఒక చిన్న సైజు బకెట్‌లో మట్టిలో పూడ్చడం జరిగింది. ఆ కాండం నుంచి లేచొచ్చిన తొమ్మిది కొమ్మలు చుట్టూ విస్తరించి ఉన్నాయి. ప్రతి కొమ్మ నిండా కేవలం ముండ్లే. వాలినటువంటి రేగు ముళ్ళు. చివరన ఒక చిన్న తుమ్మెద పరిమాణంలో పువ్వు ఉంది. దాని చుట్టూ అల్లబడిన సాలీడు వల. ఎవరో పువ్వును, ఇంకెవరో ముళ్లను, మరెవరో సాలీడు వలను, మరొకరు దాన్ని పూడ్చిన బకెట్టు మట్టిని.. ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని చూస్తారు. వాళ్ల వాళ్లకు వాళ్లవాళ్ల కారణాలు. చేతిలో పట్టుకున్న డ్రింకుతో నిండిన గ్లాసు, ఎక్కించుకున్న నిషా, ముడివేయబోతున్న కనుబొమ్మలను అదుపులోకి తెచ్చుకుంటూ, విచారపు భారాన్ని విదిలించుకోవడానికి, సుందరీమణుల దేహశల్పం వైపు తిరుగుతున్న పురుషుల మనస్సులు.
బకెట్ చూసిన విఘ్నేష్ ఇలా అనుకుంటాడు-
“ఆడది కావాలి, అంతే. ఆమె మనసు కాదు. సుఖం కావాలి, సాంగత్యం కాదు. అధికారం కావాలి, అనుభవం కాదు. తప్పుడు పనులు చేసైనా సరే సుఖాన్ని పొందాలి”
రూపా ఇలా అనుకుంటుంది –
“ఒక అందమైన పువ్వు ఏ మగవాడికీ సులభంగా దొరక కూడదు. దాని చుట్టూ చాలా ముళ్ళు ఉండి, కోరి కోరి ఎంత జాగ్రత్తగా దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినా, కొన్ని ముళ్ళు గీరుకుని గాయాలు ఏర్పడాలి. అప్పుడే అతనికి దాని అందం రెట్టింపై కనిపిస్తుంది. ఈ పువ్వులాంటి దేహమే స్త్రీకి పదునైన ఆయుధం”
మనోజ్ ఇలా అనుకుంటాడు –
“ఈ సృజనాత్మక ఇన్‌స్టాలేషన్‌ను అర్థం చేసుకోవడానికే ఇంత పెనుగులాట మనకు. దీన్ని, ఇక్కడ ఉన్న ఇన్ని పెయింటింగ్‌లను తయారు చేయడానికి ఖర్చుపెట్టిన తెలివితేటల్లో సగాన్ని ఆఫీసు రాజకీయ పైపోటీ కుట్రలలో ఉపయోగించివుంటే, మన సజని మేడమ్ కంపెనీ ఎం.డి. యే అయ్యిండేది”
ఆమె తండ్రి ఇలా ఆలోచిస్తాడు –
“స్త్రీ కన్నీళ్లకు ప్రపంచమే కరిగిపోతుంది. దొంగ ఏడుపైనా, పాపం ఈ పిల్ల నేర్చుకోలేదు. లేకపోతే ఇంత కఠినం కావడానికి ఆమె భర్త సోమేశ్‌కు అంత ధైర్యం ఎక్కడిది?”
3
సజిని కొనసాగించింది..
ఈ ఒకటవ కొమ్మ నా తండ్రికి చిహ్నం. స్తీ-పురుషులకు బేధమే లేదనీ; స్త్రీ నిజానికి పురుషుడికన్నా గట్టిదనీ చెబుతూ తమ్ముడికన్నా ఒక గురివింద గింజకన్నా తక్కువ కాకుండా నన్ను పెంచాడు నాన్న. అలాంటి నాన్న, నేను సోమేశ్‌ను ప్రేమించి, కులాంతర వివాహ ప్రస్తావన ఆయన ముందు పెట్టినపుడు, నా నమ్మకాలన్నీ తలకిందులయ్యేలా తిరస్కరించాడు. పురుషుల సమస్త ఔదార్యాలు, సంస్కరణల వెనుక, వారి అహానికి మరిన్ని కొమ్ములను చేర్చుకునే అభిప్రాయం ఉంటుంది. అంతేకానీ వాస్తవానికి వాళ్లు పైకి కనిపించేంత ప్రగతిశీలురు కారు. నేను నేర్చుకున్న కత్తిసాము, గుర్రపు స్వారీ, డ్రైవింగ్, కరాటే మొదలైనవి అతను నా మీద నిర్మించుకున్న కలలు. వివాహాన్ని నా ఇష్టానుసారం చేసుకోవడాన్ని అతను భరించలేకపోయాడు. అంటే వివాహం కూడా తన కనుసన్నల్లో చేసుకుని, తన అహానికి మరింత మద్దతు ఇచ్చే ‘బక్రా’ కావాలతనికి. స్వతంత్ర వ్యక్తిత్వం, స్వంత ఆలోచనలు కలిగిన కూతురు కాదు. అప్పుడే నేను నిర్మించుకున్న నా తండ్రి చిత్రం రంగులు వెలిసి పేలవంగా మాసిపోయింది. బుద్ధి వచ్చిన తర్వాత జీవితంలో నా దారికి అడ్డంగా వచ్చి నిలబడ్డ మొదటి ముల్లు అతనే. ఇప్పుడు ఈ ముళ్ల చెట్టు మొదటి కొమ్మ.
తలి-తండ్రి-తమ్ముడు అందరితో ఉన్న సంబంధాన్ని బలియిచ్చి సోమేష్‌ను వివాహం చేసుకున్నాను. అది నా జీవితంలో మొట్టమొదటి అత్యంత దుబారా ఖరీదైనది. మన భారతీయ సమాజంలో ఈ వివాహం ఒక పెద్ద జూదం. వైకుంఠపాళి ఆటలో ఎవరికో ఆకాశం, మరెవరికో అగాధం. మిగిలిన లక్షలాది మందికి ఎదుగుబొదుగు లేని ఒక లైసెన్స్‌డ్ వ్యభిచారం. అయినా తనదీ అనే అన్నింటినీ పణంగా పెట్టి ఈ ఆటలో ప్రతి ఒక్కరూ పాచికను దొర్లించాల్సిందే. సోమేష్‌కు, అతని కిరీటానికి గుచ్చడానికి నేనొక అందమైన ఈకను మాత్రమే. ఆడవాళ్ల పెద్ద గొంతు, ఎదురు ప్రశ్నలు, లోతైన ఆలోచనలు పురుషుల మూలానికి నిప్పు పెడతాయని మనం ప్రేమికులుగా ఉన్నంత వరకూ తెలియనే తెలియదు. భార్యగా పాత్ర మారిందో కథ ముగిసినట్టే.
“మన మాటలు, మన బట్టలు, ఆలోచనలు, ఆహారం-అన్నిటి మీద వాళ్ళకు సులభంగా పేటెంట్ దొరుకుతుంది. మనం కనే పిల్లల విషయంలోనూ వాళ్లదే అంతిమ నిర్ణయమంటే గానుగ ఎద్దుకన్నా, సాకిన పిల్లికన్నా స్త్రీ ఎలా భిన్నమైంది? రెండవ బిడ్డ కూడా ఆడపిల్లేనని తీయించుకో అన్నాడు. ప్రాణాన్ని పోషించుకోలేని వాడికి ప్రాణాన్ని తీసే హక్కు ఇచ్చిందెవరో?!” ‘పిండం లింగాన్ని నిర్ధారించే వైద్యుడిని చెప్పులతో కొట్టడానికి ముందు, ఆ పరీక్ష చేయించడానికి ముందుకొచ్చే భర్తను కొట్టాలి. అంతకన్నా ముందు, నేను అలాంటి భార్యను ఎంత మాత్రం కాలేను” అనటమే మేమే కట్టుకున్న మా ప్రేమ వివాహం విచ్ఛినం అవడానికి కారణమైంది. చివరికి మనిషి ఒంటరే అని ప్రీతిపాత్రులే చూపించినపుడు కలిగే బాధ, నేర్చుకునే జీవిత పాఠాలు జీవితాంతం తాజాగా ఉంటాయి. ఈ ముళ్ల చెట్టు రెండవ కొమ్మ అయిన సోమేశ్ పట్ల నాలో జాలి, మమకారం.
మా కంపెనీలో నా సబార్డినేట్‌గా చేరి, తర్వాత నా తలపై పచ్చడి రుబ్బడం ప్రారంభించిన విఘ్నేష్ ఈ చెట్టు మూడవ కొమ్మ. యోగ్యులు తమకు అర్హత ఉన్న దాని కోసం ప్రయత్నించనప్పుడు, అనర్హులు ఆ స్థానాలకు అడ్డుతగులుతారు. అనర్హులు ఉన్నత పదవులలో కూర్చోవడానికి ఇలాగే యోగ్యుల సహకారమే అపారమైనది. యోగ్యులు చేసేది ప్రయత్నం, అయోగ్యులు చేసేది లాబీయింగ్ అని తెలిపి; అలాగే నా యోగ్యతను, తన అయోగ్యతను నాకు చక్కగా అవగాహన కలిగించిన ఒక మూడవస్థాయి బకెట్ బాబు ఇతను. ఎక్కువగా శబ్దం చేసేది ఖాళీ పాత్రలు మాత్రమే. మన సమాజం ఇంకా పురుష అహంకారపు చిప్ప నుండి బయటపడలేదు; ఎంతగానో చదువుకున్న కార్పొరేట్ ప్రపంచంలో కూడా, మహిళల కింద పనిచేయడం ఒక అవమానకరమైన విషయంగానే మిగిలిపోయింది. నెమ్మదిగా లేచి నిలబడుతున్న మన ‘ఈ నాటి రోజులు’ మరలా రెక్కలు కట్టుకుని ఎగిరి వస్తున్న ‘రేపులను’ చూసి మగవాళ్ల పునాదులు అదురుతాయి. అందులోనూ లింగ తారతమ్య ధోరణి లాభం పొందిన పైకి ఎదిగిన అరాకొరా జ్ఞానపు మగవాళ్ల పునాదులు. వాళ్లకు అండగా నిలబడటం ద్వారా తమ సోదరీమణుల హక్కులను కుదవపెట్టి పతిఫలంగా మగవాళ్లు విసిరిన చిన్నచితకా భిక్షంతో అత్యానందాన్ని పొందుతున్న మతిహీన మహిళల తొడలు స్పష్టంగా సద్దు చేస్తున్నట్టు వణుకుతాయి. స్త్రీలే పై అధికారి అయితే తమ దేహాస్త్రాలు తుప్పు పట్టవచ్చన్న భయంలోనూ వేళ్లలో లెక్కపెట్టగలిగే సోదరీమణులు వణుకుతున్నారు. ఈ వివిధ రకాల బకెట్ సంతతులు సర్వనాశనమై, లింగాతీతమై ప్రతిభకు గౌరవం దొరికే కాలం వచ్చినపుడే విఘ్నేష్‌లాంటివారికి ‘అందంగా ఉన్నంత మాత్రాన చెప్పులను ముఖానికి తొడుక్కోవడం సాధ్యం కాదు’ అనే సత్యం అర్థమవుతుంది.
ఇతను మా ఆఫీసులో పనిచేసే ఒక గుమస్తా. పేరు పవన్. ఇతను ఈ చెట్టు నాల్గవ కొమ్మ. మనోజకూ నాకూ సంబంధం ఉందని విఘ్నేష్, రూపా నేర్పించినట్లుగా, తూచా తప్పకుండా ఆఫీసులో అందరికీ చెబుతూ వచ్చాడు. గాలి పరిమితి అది. తప్పుడు పుకార్లు, చెడు వార్తలను చేర్చేటంత తొందరగా మంచి వార్తలను అది మోసుకునిపోదు. భర్త తెచ్చిన బొండు పరిమళం కన్నా ఘాటుగా, అతని చెప్పులు అడుగుకు మెత్తుకున్న అసహ్యపు దుర్వాసన భార్యకూ; పక్కనే పడుకున్న భార్య ముడుచుకున్న బొండు మల్లెల పరిమళం కన్నా, ఎక్కడో అటకమీద చచ్చిన ఎలుక దుర్వాసన భర్తకూ చేరుకుంటుంది. చెడు వార్తలు లేకుండా గాసిప్‌లకు బలమెక్కడ? విషసర్పం కరిచి చనిపోయిన జనం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ జనం-సత్యపు తల మీద కొట్టినట్లున్న ఇలాంటి అబద్ధాల విషం తలకెక్కి చనిపోయివుండొచ్చు. విష సర్పాన్నేమో వెతికి చంపొచ్చు. ఇలాంటి గాలి విత్తనాల దాడుల మూలాన్ని ఎలా వెతికి తీయాలి, ఎవరిని నిందించాలి? అమాయకపు జనుల కళ్లల్లో పుల్ల గుచ్చటం ద్వారా విఘ్న సంతోషాన్ని పొందే జనం పవన్‌లాంటివారు. వారికి తిన్నది సరిగ్గా అరగాలంటే; కరిగింది సరిగ్గా బయటికి రావాలంటే రోజూ ఇంత చేయాల్సిందే.
ఈ చెట్టు ఐదవ కొమ్మ లక్ష్మీకాంత్. అతడికా అకారణంగా ద్వేషించే వ్యక్తులు పవన్‌కు అడ్వాన్స్‌డ్ వర్షన్‌లు. వీళ్లు సొంతంగా తమ ఆహారాన్ని కూడా తయారుచేసుకోలేని పరాన్నజీవి మొక్కల్లాంటివారు. ఈ సమాజంలో ఇలాంటివారే అత్యధిక సంఖ్యలో ఉంటారు. వర్షం వచ్చిన వెంటనే దిబ్బ మీద టపటపమని లేచి నిలిచే కుక్క గొడుగుల్లా ఒకనికి అధికారం వచ్చిందో, ఆ వర్షంలో ఇలాంటివారు అఖండ సప్తభజన సాకుతో లేచి నిలబడుతారు. గౌడ భార్య గర్భవతి అయితే, ఊరి ఆడవాళ్లకంతా కానుపు నొప్పులన్నట్టు బాసు నవ్వుటం చూసి నవ్వి, అతను కోపంలో ఉంటే తామూ మౌనంగా ఉండి అతనికి ఇష్టమనే ఒకే కారణానికి తమకు ఇష్టం లేకపోయినప్పటికీ, బాస్ ధరించిన రంగుబట్టలే ధరించే ఇలాంటివారి వల్లే ప్రపంచానికి అతి పెద్ద హాని. నాగభూషణ్ ముందు నన్ను పొగడి; పవన్ ముందు విఘ్నేష్‌ను పొగడి; విఘ్నేష్ ముందు రూపాను పొగడి; రూపా ముందు బాస్‌ను పొగడి; ఎవరి ముందు ఎవరిని ఎంత ప్రమాణంలో తెగిడితే ఏమి దొరుకుతుందో అనే లెక్కాచారంలో అంతంత తెగిడి బతుకు కట్టుకునే ఈ వర్గానికి మొత్తానికి లాభం కావాలి. ద్రోహ చింతనే వీరి జీవనశైలి. లాభం సంపాదించటమే వీరి ప్రధాన లక్ష్యం. లాభం దొరుకుతుందంటే తన గౌరవమేమి, భార్య గౌరవాన్నీ అమ్మకానికి పెట్టేవారు వీళ్లు.
నాగభూషణ్ ఈ రేగు చెట్టు ఇన్‌స్టాలేషన్‌లో ఆరవ కొమ్మ. గాసిప్‌ల ఈ కాలంలో తూకంగా మాట్లాడాలనే అవగాహన ఉన్న అరుదైన వ్యక్తి అతను. కానీ అలాంటి వ్యక్తులు ఈ కాలంలో చివరి అంచున ఉన్న అరుదైన జంతువు సమూహానికి చెందినవారు అనటానికి అభ్యంతరం లేదు. పదిమంది మంచి వ్యక్తుల సహవాసంలో, ఒక చెడ్డ వ్యక్తి మెరుగుపడినట్లుగా; పదిమంది చెడ్డవాళ్లతో స్నేహం చేసి ఒక మంచివాడూ చెడ్డవాడవుతాడు. అదే విధంగా, ఆఫీసంతటా నిండిన దుష్టపురుగులతో ఉండి కూడా, చెడిపోకుండా తమను తాము రక్షంచుకోగలవారు ఎక్కడో ఒకరుంటారు. పవన్ వ్యాపింపజేసిన అబద్ధపువార్తలనే ఆధారంగా పెట్టుకుని దానికి మరింత రంగులు పులిమి ఆఫీసు అంతటా ప్రచారం చేస్తున్న లక్ష్మీకాంత్ లాంటివారికి ఈ నాగభూషణ్ లాంటివారు అపథ్యం. అయినా వీళ్లున్నారని లక్ష్మీకాంత్ వంటి వ్యక్తులు కాస్త అణుచుకుని బతికివున్నారన్నది సూర్యుడంతా సత్యం.
నాగభూషణ్ గారూ.. ఎడమో-కుడియో మనం కేవలం సిద్ధాంతులం కాము. అంతకన్నా ముఖ్యంగా మనుష్యులు. మీ వామపక్షపు అతిలో మీకు ఎదుటివారి మంచితనం కనిపించకుండా పోయింది. మీ వారిలో ఉన్న కొందరి దొంగతనం కనిపించకుండా మీ కళ్లకు గుడ్డితనం ఆవరించింది. ఇది కుడిభాగానికీ అన్వయిస్తుంది. సిద్ధాంతం కన్నా సత్వం ముఖ్యం. ఆదర్శం కన్నా అనుపాలన ముఖ్యం. ఒక సిద్ధాంతపు మహాత్ముడు కావటం కన్నా అందరిలో మంచిని మెచ్చుకునే, చెడును ఖండించే మనిషి అయితే చాలు. చాలినంత అయింది.
ఇప్పుడు, ఈ చెట్టు ఏడవ కొమ్మ అయిన మనోజ్‌కు ఒక కథ చెప్పాలి. మీలాంటి వ్యక్తుల అర్థరహిత మాటలు, అసంబద్ధమైన మౌనాలు అనేక ఊహాగానాలకు అవకాశం కలిగిస్తాయని గమనించాలి. మాట గాయాన్ని కలిగించే కత్తి కూడా అవుతుంది. అలాగే దాన్ని బాగుచేసే ఔషధం కూడా అవుతుంది. రూప-విఘ్నేష్ కలిసి నన్ను అణచడానికి పన్నిన కుట్రలో భాగంగా మిమ్మల్ని
ఉపయోగించుకునే ముందు మీరు తెలివైనవారు కాలేదు. మీకు ప్రమోషన్ అనే ప్రలోభాన్ని చూపినపుడు మాత్రమే కావాలనే చాలా తెలివిమీరిపోయారు. అవకాశం, అధికారం, డబ్బు ముందు మనిషి నిజమైన రంగులు బయటపడతాయి. అవి లేనప్పుడు అందరూ మంచివారే. ఇక్కడ నోరు పెట్టుకుని కావలసినది సంపాదించుకున్న ఆర్భాటంగా మాట్లాడే జనం ఉన్నట్లే; మౌనంగా ఉంటూనే ఆ వైపుకూ తలూపి, ఈ వైపుకూ తలూపి రెండు వైపుల నుంచి లాభం గిట్టించుకున్న లోగుట్టు మనుషులూ ఉన్నారు. తమ మాటలను కావలసినవారు కావలసినట్లు వాడుకోవటానికి అవకాశం ఉండేలా, అరకొర వాక్యాలలో మాట్లాడి ప్రయోజనం పొందిన మీలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. పలెలల నుండి వచ్చినవారు, పేదరికం నుండి వచ్చినవారు, కష్టసుఖాలను చూడగలరు అనే నమ్మకాలనంతా తలకిందులు చేసిన మీ నుండి నేను చాలా నేర్చుకున్నాను.
మా కంపెనీ ఎం.డి. అయిన గౌరవనీయులు హరిగారు, ఈ చెట్టు ఎనిమిదవ కొమ్మ. హరి సర్.. పనిలో నిమగ్నమైనప్పుడు మనిషికి తన్మయత్వం ఉంటుంది. మీలా పనిలేకుండా ఖాళీగా కూర్చున్నప్పుడే, తల చెడు ఆలోచనలకు ఆశ్రయంగా మారుతుంది. సొంత చెవులు, కళ్లు, మెదడు కలిగిన యజమానులు లేదా ముఖ్య అధికారులు లేకపోతే, ఒక సంస్థ మూతపడడానికి చాలా రోజులు అవసరం లేదు. భయానికో, ఒత్తిడికో, తప్పనిసరి పరిస్థితికో లొంగి సబార్టినేట్ సిబ్బంది మీ చుట్టూ తిరుగుతుంటారే తప్ప, మీ వ్యక్తిత్వపు ఆకర్షణకు లోనై కాదనే సత్యం మీ అవగాహనకు రావాలంటే మీరు రిటైర్ కావాలి. అప్పుడు ఇదే విఘ్నేష్, రూపా, పవన్, లక్ష్మికాంత్‌లూ మీ దగ్గర కూడా తిరగరన్నది మీరు కళ్లారా చూసి అనుభవించాలి. ఎలా యవ్వనమన్నది కేవలం మజా చేయడానికి కాకుండా, ఏదో గొప్పదాన్ని సాధించడానికి దేవుడు ఇచ్చిన ఒక వరమో; అలాగే అధికారమన్నది కూడా అధీన సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపి, మనస్సు చూరగొని, గొప్పవైనవాటిని సాధించడానికి ఇచ్చిన ఒక బాధ్యత. దేహాన్ని ఇచ్చుకునేవారికి, బకెట్ పట్టుకునేవారికి గౌరవం ఇస్తే, ప్రతిభల గతి ఏమవ్వాలి? శ్రమజీవుల గతి ఏమవ్వాలి? వదలండి, ఇవన్నీ మీకు అర్థం కావు. ఒక్క చెమట చుక్కను కార్చకపోతే; ఒక్క మహాత్కృతిని సృష్టించక, ఇతరుల శ్రమను, సృజనశీలతను వాడుకుని బతుకును నిర్మించుకున్నవాళ్లు మీరు. మీ కంటిదోషం ఏమిటంటే, మీకు పైకి లేచి వికసించి నిలబడిన కమలం మాత్రమే కనిపిస్తుంది. అయితే దాని మూలాలకు ఆహారం-ఆధారం సమకూర్చిన బురద మాత్రం కాదు. కంటినైతే ఏ విధంగానూ మార్చుకోవటానికి సాధ్యం కాదు. కనీసం మీ కళ్లద్దాలనైనా మార్చుకోండి.
రూపా.. నువ్వు ఈ చెట్టులో మరొక ముళ్ల కొమ్మవి. నీలాంటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు, మాటలు కూడా మలినమయ్యే భయం ఉంది. మూన్నాళ్ల ఈ జీవితంలో కేవలం అధికారం కోసం ఎన్ని పైపోటీలు. నాకన్నా జూనియర్‌గా ఉద్యోగంలో చేరి తర్వాత నా కంటే ఉన్నత స్థానానికి ఎదిగి, ఇప్పుడు కంపెనీ అత్తున్నత స్థానం పై నీ చూపు. గొప్ప కాంక్ష ఉండటం మంచిదే. దాన్ని పెట్టుకున్న వ్యక్తి ప్రతిభావంతుడైతే లేదా కనీసం పనిమంతుడై ఉంటే మంచిదే. తప్పుడు దారిని పట్టుకుని పైకి వచ్చినవాడిని పడగొట్టడానికి ప్రజల అవసరం లేదు; వారి నాలుకలు, మెదళ్లే వారి నిజమైన శత్రువులు! సింహాసనంపై కూర్చున్నంత మాత్రాన కుక్క రాజు కాదు. వీధిలో ఉన్నంత మాత్రాన బుద్ధుడు బిచ్చగాడు కాదు. ఈ చెట్టు నిండా ఉన్న మిగిలిన ఎనిమిది కొమ్మలు మగవాళ్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇక్కడ నువ్వొక్కదానివే స్త్రీవి. ‘ఆడదానికి ఆడదే శత్రువు’ అనేది స్త్రీలను ఎదిరించలేని మగవాళ్లు సృష్టించిన ఒక అందమైన అబద్ధం. నిజం ఏమిటంటే స్త్రీలను ఎదిరించే శక్తి ఉన్నది మరొక స్త్రీకి మాత్రమే. చెట్టును నరకడానికి కేవలం గొడ్డలి-రంపం చాలవు. ముఖ్యంగా వాటికి చెక్కతో చేసిన పిడి అవసరం.
ఇప్పుడు నా వంతు.
ప్రపంచానికి పేరు పెట్టడం చాలా సులభం.
ప్రేమను మించిన మత్తు పదార్థం లేదు; వయస్సును మించిన పొగరు లేదు; అక్షరాల కన్నా పెద్ద అహంకారం మరొకటి లేదు. ఈ మూడు కలిసి నాకు మబ్బుపట్టించి నాన్న మాటలనే ధిక్కరించి కొత్త జీవితం కోసం ఆరాటపడ్డాను. “రెండవ సంతానం ఆడపిల్లయితే, వద్దు, తీయించెయ్” అని చెప్పిన సోమేష్ వ్యక్తిత్వపు లోతును ముందుగానే తెలుసుకోలేకపోయాను. అతని మాటను ధిక్కరించే శక్తిని వ్యక్తపరిచే ముందు, కనీసం దాని పరిణామాలను ముందుగానే ఊహించలేకపోయాను. కోరుకున్నది గోడలు లేని మైదానం లాంటి జీవితాన్ని; కానీ పొందింది గోడ లోపల దీపపు గూడులాంటి జీవితాన్ని.
పిల్లి పులికి అన్ని విద్యలు నేర్పి, చెట్టు ఎక్కడం మాత్రం నేర్పకుండా ఉండటం వల్లనే దాని ప్రాణాలు దక్కాయి అనే కథ నాకు రూపా, విఘ్నేష్‌లకు పని నేర్పిస్తున్నప్పుడు జ్ఞాపకం ఉండాల్సింది. నన్ను నేనే కొంచెం అనుమానంతో చూసుకోవాల్సిన కాలమిది.
ప్రపంచంలో అన్నపు ఆకలి కంటే పొగడ్తల ఆకలే ఎక్కువ. హరిగారికొక కపట వినయపు సలాము రోజూ కొడుతుంటే, వారి అహాన్ని శాంతింపజేసే కొన్నైనా అబద్ధపు పొగడ్తలను అప్పుడప్పుడు పొగిడివుంటే రూపా, విఘ్నేష్‌ల కుట్రలో అతను సహకరించేవాడు కాదు. తెలివైనవాడికి వేలాది మూర్ఖుల ఆరాధనకన్నా, మరొక తెలివైనవాడి మెప్పుదల ఇచ్చే సంతోషమే గొప్పది. వాళ్లు దాని కోసం తపించడం తెలిసీ, ‘నేను వారికి రూపాలా సేవలు అందించాల్సిన అవసరం లేదు’ అని తెలిసీ, కనీసం వారికి మర్యాదపూర్వకంగా సలామూ కొట్టని నా దార్ట్యమేమైనా చిన్నదా?
సోమేష్ దూరమైన తర్వాత చిన్నాచితకా పనులకు మనోజ్‌ను నమ్ముకోవటం, పదేపదే అతన్ని మళ్ళీ మళ్ళీ ఇంటికి తీసుకెళ్లడం నేను చేసిన పెద్ద తప్పు. ఇక్కడ మాట్లాడుకునేవారికంటే, మాట్లాడుకునేవారికి అవకాశం కలిగించినవారిదే తప్పు. ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాల్సింది వేటకు బలయ్యే ప్రాణి తప్ప వేటగాడు కాదు కదా? ఏమాత్రం మైమరిచినా ‘వేట’ చనిపోతే దానికి ఏ విధమైన అమరవీరుడి పట్టమూ దొరకదు!
4
ఈ మనోవ్యథలన్నింటినీ చెప్పుకున్న తర్వాత, తనకు డబ్బునూ, కీర్తినీ తెచ్చిపెట్టిన ముళ్లమొక్క ఇన్‌స్టాలేషన్ దగ్గరకు వెళ్లిన సజని సమావేశమైన పాత్రధారులందరి ఎదుట దానిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. అది ప్రపంచంలోని సమస్త స్త్రీల మనోవ్యథలా ధగధగమని మండసాగింది. ప్రతి కొమ్మ, ప్రతి ముళ్లు ఇప్పుడు ఒక్కొక్క జ్వాలా నాలుకగా మారి, చిట్ చిట్‌మని శబ్దం చేస్తూ, చుట్టూ నిప్పురవ్వలను ఎగురవేసి మండసాగింది. నేరం జరగకుండానే నేరస్థుడిని సృష్టించి చంపిన కార్పొరేట్ ప్రపంచపు క్రూరత్వానికి ప్రతిరూపంగా. సంభోగపు పరాకాష్ఠలో భాగస్వామి మెడ విరిచి చంపే ఆడ సాలీడుగా.
ప్రతిచోటా పొగ.
5
నా జీవిత కథను ఎవరో ఎందుకు చెప్పాలని అంతా నేనే చెప్పాను. వేట చరిత్రను వేటగాడు రాసినప్పుడు, హంతకుడే శూరుడైపోతాడు. అనాది కాలం నుండి కొనసాగుతూ వస్తున్న ఈ కథకు ముగింపే లేదు.
కొన్ని సత్యాలను తెలుసుకోవడానికి ఒక్కొక్కసారి మీ జీవితాన్నే పణంగా పెట్టవలసి వస్తుంది. ఈ సమాజం రెండు విపరీతాల మధ్య నలిగిపోతుంది, స్త్రీని అబల అని అణచి తొక్కివేసే, లేదా వారిని ఆదిశక్తి-పరాశక్తి అని పొగడి అటకెక్కించి పాడుచేసే ఇరు అతుల మధ్య ఈ సమాజం ఊగిసలాడుతోంది. ఆ రెండింటి మధ్య ఆమె కూడా మనలాంటి ఒక మనిషి. ఆమెకొక ప్రత్యేకమైన అస్తిత్వం ఉంది. స్పందించే మనస్సు ఉంది. ఆలోచించే బుద్ధి ఉంది అని చూసేవారు చాలా తక్కువ. ఈ దేశం-కాలం-మతం-లింగం అనే వాటి గొడవ ఏదీ నా కూతురికి అవసరం లేదు. ముఖ్యంగా ఆమెకు స్వాతంత్య్రం కావాలి.
ఒక అలవాటుగా మారిపోతే, నరకం కూడా నివాసయోగ్యంగా అనిపిస్తుంది.
అలా జరగడానికి ముందే ఆమెను ఈ పొగ ఉచ్చు నుండి బయటకు తీసుకురావాలి.
ఎంత మూల్యం చెల్లించినా పర్వాలేదు.
కన్నడ మూలం: డా. చిదానంద సాలి
అనువాదం: రంగనాథ రామచంద్రరావు
