డా. మలికార్జున పాటీలగారి కన్నడ నవలకు తెలుగు అనువాదం ‘ఓ రైతు కథ’. ఇందులో 1. రైతు కల్లప్ప 2. వ్యవసాయం 3.అప్పుల భారం 4. పశువుల సంత 5. వసంతకాలం 6. కూతురు పెళ్ళి 7. ఊరిజాతర 8. కల్లప్ప నిర్ణయం అనే అధ్యాయాలు ఉన్నాయి.
***
“ఇది డా. మల్లికార్జున పాటీలగారి నవల. కన్నడ భాషలో ఇప్పటికే ఐదు ముద్రణలు పొందిన నవల. ఎందరో విద్వాంసుల చేత ప్రశంసించబడింది. రచయిత పాటీలగారి ఈ నవల గ్రామీణ భారతానికి అద్దం పట్టింది. ఈ నవల ముఖ్యపాత్ర కల్లప్ప సమస్త రైతులకు ప్రతినిధి. ఈ నవలలో పల్లెల మార్పుకు చెందిన చిత్రణ ఉంది. ఇప్పుడున్నవి పల్లె ప్రతికృతులే తప్ప నిజమైన పల్లెలు కావు. పల్లెల వంటింటిని కార్పోరేట్లకు చెందిన బలమైన రాజ్యాలు ఆక్రమించాయి. పల్లెలలోని జానపదాలను టీవీలూ, రూపాయల స్థానాన్ని అమెరికా డాలరూ, స్థానిక భాషలను ఆంగ్లమూ ఆక్రమించాయి. మానవీయ సంబంధాలను ఆంటీ, అంకుల్ అనే విదేశీ సంబంధ వాచకాలు ఆక్రమించాయి. పల్లెలు పట్టణాల వైపు ముఖం తిప్పుడంతోపాటు అనేక విషాదాల మాలిక ఈ నవల. ఈ నవలను చదివితే గ్రామీణ భారత చరిత్రను చదివినట్టే. కన్నడ నవలను తెలుగుకు అనువదించినది మా ప్రియమైన రంగనాథ రామచంద్రరావు. ఈ బహుముఖ ప్రతిభావంతుడు కన్నడలోని అనేక గొప్ప రచనలను తెలుగుభాషలోకి అనువదించడం ద్వారా ఈ రెండు భాషల సువర్ణ సేతువు అయ్యారు. చదువరులకు ఇది ఆయన సొంత రచన అనిపిస్తే ఆశ్చర్యం లేదు” అని తమ ముందుమాట ‘కన్నడ భాష – సాహిత్య దర్పణంలో!’లో వ్యాఖ్యానించారు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత డా.కుం. వీరభద్రప్ప
“కన్నడ సాహితీ మిత్రులు, ప్రసిద్ధ కన్నడ రచయిత శ్రీ కుం. వీరభద్రప్పగారు ఒక రోజు ఉదయం ఫోన్ చేసి తమ మిత్రులు డా. మలికార్జున పాటీలగారి కన్నడ నవలను అనువదించాలని కోరారు. వారికి నాకు మధ్య ఉన్న స్నేహబంధం ముప్ఫయి ఏళ్ళది. నేను ఎలా కాదనగలను. వెంటనే సరేనన్నాను. ఆయన పుస్తకం పంపారు. చిన్న నవలే. అయినా ఆ నవలను చదివి నేను చలించిపోయాను.
రైతు జీవితానికి అద్దం పట్టిన నవల అది. రైతు – ఎక్కడైనా రైతే. ఎక్కడున్నా రైతే !
అయితే ఈ రోజు రైతు పరిసితి దేశంలోని ఏ మూలలో చూసినా ఒకటే. అది తెలుగు రాష్ట్రమైనా, కర్ణాటక రాష్ట్రమైనా. దేశంలోని ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా, ఏ ప్రాంతాన్ని తీసుకున్నా, రైతుల బాధలు, వ్యధలు చెప్పనలవి కావు. ప్రపంచానికే అన్నం పెట్టే రైతు ఈ రోజు ఆకలితో నకనక లాడుతున్నాడంటే, అప్పుల బాధలతో విలవిలలాడుతున్నాడంటే పొలాలు, ఇల్లు అమ్ముకుంటున్నాడంటే, చివరికి ప్రాణాలను సైతం తీసుకుంటున్నాడంటే అంతకన్నా దౌర్భాగ్యం ఏముంది?
ఈ నవలను కన్నడ నుంచి అనువదించడానికి అనుమతి ఇచ్చిన పాటీల గారికి కృతజ్ఞతలు” అని రంగనాథ రామచంద్రరావు తమ ‘నివేదన!’లో పేర్కొన్నారు.
ఓ రైతు కథ (నవల) కన్నడ మూలం: డా. మల్లికార్జున పాటీల అనువాదం: రంగనాథ రామచంద్రరావు ప్రచురణ: లక్ష్మీ ప్రచురణలు, బేగంపేట పేజీలు: 104 ధర: 80 రూపాయలు ప్రతులకు: (1) ఆర్. రామచంద్రరావు, 1-11-163/1, ఫ్లాట్ నంబర్ 402, నాల్గవ అంతస్తు, స్టీఫెన్స్ కాటేజ్, శ్యామ్లాల్ బిల్డింగ్, బేగంపేట, హైదరాబాద్–500016.
(2) నా పుస్తకం, శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల 26-4-982, త్యాగరాజ నగర్, హిందూపురం 515201.
(3) ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™