[శ్రీమతి గంటి భానుమతి గారి ‘పొగమంచు’ అనే కథాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]


శ్రీమతి గంటి భానుమతి గారి 12వ కథాసంపుటి ‘పొగమంచు’. ఇందులో 13 కథలున్నాయి.
ఇవన్నీ సాంఘిక ప్రయోజనమున్న కథలు. సమాజంలో, కుటుంబంలో ఒక్కరే బాగుపడితే సరిపోదు, వీలైనంత ఎక్కువమంది బాగుపడాలన్న ఉద్దేశం కథల్లోని పాత్రలలో కనబడుతుంది. తోటివారి ఇబ్బందులని అర్థం చేసుకుని మనకి వీలైనంత సాయం చేయాలి, మనుషులై ఉన్నందుకు కొంచెమైనా మనిషితనం ప్రదర్శించాలని కొన్ని పాత్రలు సూచిస్తాయి.
హిమాచల్ ప్రదేశ్‌లో ట్రెకింగ్‌కి వచ్చిన ఒక టీమ్ లోని యువతి ఓ హేమంత్ అనే పురుషుడితో ప్రేమలో పడుతుంది. అతను తనకి పెళ్ళయి, భార్య గర్భవతిగా ఉందన్న విషయం దాస్తాడు. ఆమె బాగా ప్రేమలో కూరుకుపోయి, అతనికి ప్రొపోజ్ చేసి ఉంగరం తొడుగుతుంది. కొన్నాళ్ళకి, ఒక పెద్ద కొండ ఎక్కాక, అక్కడ చెప్తాడు – తన భార్య గర్భవతి అనీ, తాను ఇంటికి వెళ్ళిపోతున్నానీ. చెప్పేసి ఆమె ఇచ్చిన ఉంగరాన్ని ఆమె స్కార్ఫ్కి కట్టి, వెళ్ళబోతాడు. అప్పుడో ప్రమాదం జరుగుతుంది. హేమంత్ చనిపోతాడు, ఆమె మాత్రం తీవ్రమైన గాయాలు తగిలి, గతం మర్చిపోతుంది. ఆ ప్రాంతానికే ట్రెక్కింగ్‌కి వచ్చిన మరో బృందంలోని రాజీవ్ అనే అతను ఆమెకు అన్ని రకాలుగా సాయం చేసి, ఆమె మనోవేదన నుంచి బయటపడడానికి మార్గం చూపుతాడు. ‘పొగమంచు’ కథ ఆసక్తిగా చదివిస్తుంది.
‘ధీరసమీరే.. షిమ్లా నగరే’ కథ ఇద్దరు ప్రేమికుల కథ. సిమ్లా నగరపు అందాన్ని, ప్రకృతిని అద్భుతంగా దృశ్యమానం చేసిన కథ. ప్రధాన పాత్రలు మాల్ రోడ్లో తిరుగుతూ ఉంటే, తాము కూడా అక్కడే ఉండి వాళ్ళతో పాటే తిరుగుతున్నట్టు పాఠకులు అనుభూతి చెందుతారు. ప్రపోజ్ చేయాలంటే అతను సంశయిస్తాడు, ఆమె ఒప్పుకుంటుందో ఒప్పుకోదో అని! మధ్యలో సాహిర్ గీతాన్ని సందర్భోచితంగా ప్రయోగించారు రచయిత్రి. కథలో బ్రౌనింగ్, రూమీ, టాగోర్, వర్డ్స్‌వర్త్.. ఎందరో ప్రసిద్ధ రచయితల ప్రస్తావన వస్తుంది. గొప్ప భావుకత నిండిన కథ ఇది. రచయిత్రి భావుకురాలై ప్రకృతిని పాఠకుల కళ్ళ ముందు ఉంచుతారు. ఎనిమిది పేజీల చిన్న కథే అయినా, సిమ్లా నగరం, హిమాచల్ ప్రదేశ్ దాదాపు ఆరు పేజీల్లో పరిమళం వెదజల్లుతాయి.
ఈ రెండు కథలు రచయిత్రి హిమాచల ప్రదేశ్‌లో ఉండగా రాసినవి.
ఆత్మహత్య చేసుకుందామనుకున్న ఓ స్త్రీని, జర్నలిస్ట్ ద్యుతి మాటల్లో పెట్టి కాపాడుతుంది. ద్యుతి చూపిన చొరవ, తోటివారితో కో-ఆర్డినేట్ చెయ్యడం రచయిత్రి చక్కగా వివరించారు ‘జీవన్మరణాల మధ్య’ కథలో. చచ్చిపోవాలనుకున్నా ఆమె ప్రయత్నం విఫలమై, తాను ఫెయిలయ్యానని ద్యుతితో అంటుంది. నువ్వు ఫెయిలవలేదు, నీ పిల్లల మీద ప్రేమే నిన్ను బతికించింది అని ద్యుతి అనుకుంటుంది. చక్కని కథ. బిగుతైన స్క్రీన్ ప్లే ఉన్న వెబ్ సీరిసో, సినిమానో చూస్తే ఎంత ఉద్విగ్నతగా ఉంటుందో, ఈ కథ చదువుతున్నప్పుడూ అలానే అనిపిస్తుంది.
తన జీవితం మీద తనకి అధికారం లేదనీ, కారణం బాధ్యతలనీ, తాను వాటిని వదిలేయలేనని – తనను ప్రేమించి పెళ్ళి చేసుకుంటానన్న ప్రదీప్‌కి చెప్పాలనుకుంటుంది నిర్మల. అయితే ఆమె ఊహించని విధంగా ప్రదీప్ తల్లిదండ్రులు ఓ ప్రతిపాదన చేసి, ఆమెని పెళ్ళికి ఒప్పిస్తారు ‘పరిష్కారం దొరికింది’ కథలో. ప్రదీప్ తండ్రి చెప్పిన మాటలు – నేటి సమాజంలోని మగపిల్లల తండ్రులు ఆచరించ గలిగితే, ఆడపిల్లల పెళ్ళిళ్ళ విషయంలో ఎన్నో సమస్యలు తీరిపోతాయి. ప్రాక్టికల్ కథ.
కొందరు తాము చేసే ఉద్యోగాన్ని మరీ సీరియస్‌గా తీసుకుంటారు. ఉద్యోగ నిర్వహణ అనే బాధ్యతల ప్రవాహంలో కొట్టుకుపోతూ, కుటుంబాన్ని, స్నేహితులనీ నిర్లక్ష్యం చేస్తారు. కాలం గడిచే కొద్దీ స్నేహితులు పరిచయస్థులుగా మారిపొతారు. ఆత్మీయుల మధ్య అగాధాలేర్పడుతాయి. ఆఫీసు పనుల్లో కూరుకుపోయి, తన చుట్టూ జరుగుతున్న వాటిని పట్టించుకోకుండా, ఆత్మీయులకూ దూరమైపోతున్న కోషీ అనే యువతి తాను కోల్పోయినదేమిటో అర్థం చేసుకుంటుంది. “మన జీవితాలు మెరిసే మెరుపుల్లాంటివి. అనంతమైన కాన్వాస్ లాంటి ప్రపంచంలో ఓ చిన్న చుక్క లాంటిది. అందుకని, ఏ క్షణాన ఆ చిన్న చుక్క మాయమవుతుందో తెలియదు. అందుకే ఒంటిగా ఉండేకన్నా నలుగురితో ఉండడం మంచిది” అంటూ తల్లి చేసిన సూచనలోని అంతరార్థాన్ని గ్రహిస్తుంది. బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నట్టు జీవితాన్ని సర్దుబాటు చేసుకునే ప్రయత్నాలు మొదలుపెడ్తుంది. ‘నేటి ఉద్యోగిని’ కథ జీవితానికి దూరమవతున్న చాలామందికి ఓ హెచ్చరిక లాంటింది.
‘రెక్కలొచ్చిన ఊహలు’ గొప్ప స్ఫూర్తిదాయకమైన కథ. సెరెబ్రల్ పాల్సీ అనే వైకల్యంతో జన్మించిన అనంగ్ అనే పిల్లాడి కథ, అతని తల్లి కథ. అనుక్షణం కొడుక్కి అండగా ఉండి, తన జీవితం వృథా అన్న భావన అతనిలో కలగకుండా జాగ్రత్తపడుతూ, వీలైనంతగా ప్రోత్సహిస్తూ కొడుకుని బ్రతుకుబాటలో నడుపుతుందా తల్లి. ఓ థెరపిస్ట్ సాయంతో, తలకి ఊసతో రాయగలిగేలా నేర్పుతుంది. అనంగ్ 11 ఏళ్ళ వయసొచ్చే సరికి రాయడం నేర్చుకుంటాడు. కవితలు రాస్తాడు, కథలు రాస్తాడు. రెండు పుస్తకాలు ప్రచురిస్తాడు. విధివంచితుడని జనం భావించిన అనంగ్, విధిని ఎదిరించి, తన నుదుటిరాత తానే రాసుకుంటాడు. అయితే, ఈ కథలో చిన్న పొరపాటు దొర్లింది. అనంగ్ బదులు రెండుచోట్ల పీయూష్ అని ముద్రితమైంది. అది పొరపాటైనా కావచ్చు లేదా ఆ పాత్ర పూర్తి పేరు అనంగ్ పీయూష్ అయినా అయి ఉండచ్చు. అయితే దీని వల్ల కథాగమనానికి ఏమీ అడ్దంకి రాదు. ఆ పాత్ర పాఠకులపై కనబరిచే ప్రభావం ఏమీ తగ్గిపోదు.
ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ అయి రాణించాలని ఆశపడిన కథకుడి జీవితాన్ని ఓ ప్రమాదం దారుణంగా దెబ్బతీస్తుంది. అయితే విధి మరో అవకాశమిస్తుంది. మలిదశలో, వైకల్యంతో గొప్ప ఫోటోలు తీసి అత్యంత సంతృప్తిని పొందుతాడతను ‘అనూహ్యం’ కథలో. నెరేటర్ తన గురించి తాను చెప్పుకుంటున్నాడు కాబట్టి, కథలో అతని పేరు చెప్పాల్సిన అవసరం రాలేదు.
పై రెండు కథలూ జీవితం విసిరే సవాళ్ళను ఎదుర్కోడంలో గొప్ప స్ఫూర్తిని నింపుతాయి.
యశోద పొరుగింటిలో భార్యాభర్తలు రక్తాలు కారేలా కొట్టుకుంటారు. భర్తకి బాగా గాయాలవుతాయి. భర్తని హాస్పటల్‌కి తీసుకెళ్తారు. పోలీసులు, భార్య శ్యామలని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. వాళ్ళ చిన్నారి బాబుని మాత్రం ఎవరూ పట్టించుకోరు. ఆ బాబు విపరీతంగా ఏడుస్తుంటే, తన తల్లిదండ్రుల అభీష్టానికి వ్యతిరేకంగా, అతన్ని అక్కున జేర్చుకుని చిన్నయ్య అనే పేరుతో పెంచుతుంది యశోద. రెండేళ్ళ తర్వాత చిన్నయ్యని అనాథాశ్రమంలో అప్పగించాల్సి వస్తుంది. యశోదకి పెళ్ళవుతుంది. పిల్లలు పుడతారు. జీవితంలో ముప్ఫై ఏళ్ళు గడిచిపోతాయి. హఠాత్తుగా ఓ రోజు ఆమెకు చిన్నయ్య ఫోన్ చేసి మాట్లాడుతాడు. తరువాత వచ్చి కలుస్తాడు. చిన్నయ్య జీవితంలో కుదురుకుని గొప్పవాడవుతాడు, యశోద జీవితం చితికిపోతుంది. ఆమె ఆత్మాభిమానం గ్రహించిన చిన్నయ్య, ఆమె తీసుకోదని తెలిసినా, వెళ్ళిపోయేడప్పుడు పెద్ద నోట్ల కట్ట ఆమె చేతిలో పెట్టి వస్తాడు. ‘ముందుకొచ్చిన గతం’ కథ కృతజ్ఞత ఫలితమెలా ఉంటుందో చెబుతుంది.
క్రికెట్ ఆట నేపథ్యంగా సాగిన కథ ‘మైదానం’. పల్లెల్లోని నైపుణ్యం ఉన్న పిల్లలని గొప్ప క్రికెట్ ఆటగాళ్ళుగా తయారు చేయాలన్న ఆశయం ఉన్న కోచ్, రాజు అనే పేద పిల్లాడిని ఎంతగానో ప్రోత్సహిస్తాడు. అయితే అత్యంత కీలకమైన ఓ రోజున రాజు ప్రాక్టీస్‌కి వెళ్ళలేకపోతాడు. మూడు రోజులుగా కురుస్తున్న వాన ప్రాక్టీస్‌కి అడ్డంకులు కల్పిస్తుంది. తండ్రికి జ్వరం వస్తే, మందులు తేవడానికి బయటకి వస్తాడు రాజు. ఇంతలో వాళ్ళ ఎదురింటి గోడలు కూలిపోయి చాలామంది శిధిలాల కింద ఇరుక్కుపోతారు. రాజు తన తండ్రి మందుల సంగతి మర్చిపోయి, వాళ్ళకి సాయం చేయడంలో నిమగ్నమవుతాడు. సెలక్షన్స్, టీమ్‌లో ప్లేస్ పోయినా పరవాలేదనుకుంటాడు. ఇంతలో భారీ ప్రమాదం! అతని మీద శిధిలాలు పడి గాయడతాడు. తర్వాత ఏమవుతుందన్నది ఆసక్తికరం! కొంచెం మేలు చేసినవారిని కూడా మర్చిపోకూడదన్న సందేశం అందిస్తుందీ కథ.
డ్రగ్స్‌కి బానిసైన తన కొడుకుని రీహాబిలిటేషన్ సెంటర్లో చేర్చిన తరువాత ఆ తల్లి.. తమ జీవితాలనీ, పేరెంట్స్‌గా తను, తన భర్త చేసిన తప్పులని గుర్తు చేసుకుని.. పిల్లాడు ఎదిగే టైమ్‌లోనే తప్పుదారి పట్టినప్పుడు గమనించి ఉండాల్సిందనీ, తప్పులు చేస్తున్నాడనీ అర్థమవుతున్నా, కొడుకు మీద ప్రేమ కంటికి పొరలు కమ్మించేసిందని గ్రహిస్తుంది. కొడుకు భవిష్యత్తును తామే నాశనం చేశామని బాధపడ్తుంది. ఎదిగే పిల్లలని అనుక్షణం గమనిస్తూ ఉండి, తప్పుదారి పట్టే ప్రమాదం నుండి కాపాడుకోవాలని ‘డ్రగ్స్’ కథ చెబుతుంది.
దూరపుకొండలు, దుబాయి జీవితం కథలు – గల్ఫ్ దేశాలలో ఉపాధి కోసం వెళ్ళే డబ్బు సంపాదించే క్రమంలో యువకులు ఎన్ని ఇబ్బందులకు గురవుతారో, బాధ్యతల బరువులు మోస్తూ జీవితాలని భారం చేసుకుంటారో చెబుతాయి.
అది శ్రీలంక అయినా, మరో దేశమైనా స్త్రీలు ఎప్పుడూ బాధితులేనని చెబుతుంది ‘నతాషా’ కథ.
చివరి మూడు కథలు వేదన నిండిన జీవితాలలోకి తొంగి చూసే ప్రయత్నం చేయమని, నిస్సహాయులకు అండగా ఉండి, చేతనైనంత మేలు చేయమని సూచిస్తాయి.
~
ఈ కథల్లోని పాత్రలు వ్యక్తిగతంగా నైనా, సాంఘికంగా నైనా ఎదగడానికి ప్రయత్నిస్తాయి. తన జీవితాన్ని బాగు చేసుకుంటూ, తోటివారి జీవితాన్ని మెరుగుపర్చాలనుకుంటాయి. అందుకే ఇవి మేలు తలపుల కథలయ్యాయి.
ఈ కథలు హాయిగా చదివిస్తాయి. ఆలోచింపజేస్తాయి. పాఠకుల మనస్సులో తమదైన ముద్ర వేస్తాయి.
***


రచన: గంటి భానుమతి
ప్రచురణ: గంటి ప్రచురణలు, హైదరాబాద్
పేజీలు: 104
వెల: ₹ 150/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్: 9000413413
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
~
రచయిత్రి:
ఫోన్: 8897643009
ఆన్లైన్లో:
https://www.telugubooks.in/products/pogamanchu-katha-samputi
~
శ్రీమతి గంటి భానుమతి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ
https://sanchika.com/special-interview-with-mrs-ganti-bhanumathi/

కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.