[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]


[సమీర్, సారికలు గోవా రావడం గురించి స్థానిక పత్రికలు రకరకాలుగా రాస్తాయి. డాఫోడిల్స్ థియేటర్ దగ్గరగా ఉన్న ఓ పెద్ద హోటల్లో వీళ్ళ యూనిట్‌కి బస ఏర్పాటవుతుంది. సారికకీ, సమీర్కి ఒకే గది ఇవ్వడంతో, మార్చమని రిసెప్షన్లో అడుగుతాడు. కాసేపు కూర్చోండి మారుస్తానంటాడు ఆ వ్యక్తి. ఈ లోపు బయట జనాలు సినిమా వాళ్ళని చూడడానికి ఎగబడతారు. రజనీశ్ లోపలికి వచ్చి రిసెప్షన్ హాల్లో కూర్చున్న సారిక, సమీర్‌లను చూసి రూమ్‌కి వెళ్ళిపోమంటాడు. రూమ్ మార్చమంటున్నాడని సారిక అతనితో అంటుంది. ఇంత భయపడితే ఎలా అని అంటాడు రజనీశ్. సమీర్ చెప్పింది కరెక్టే, రెండు గదులు ఇవ్వమని సారిక కూడా అంటుంది. డాఫోడిల్స్లో రజనీశ్కి గొప్ప సన్మానం జరుగుతుంది. అభిమానులు గోలగోల చేస్తారు. తన మాట్లాడడం ముగిస్తూ, కానరాని కోయిల అనే సినిమా హీరోదా? హీరోయిన్దా అని అడుగుతాడు రజీనీశ్. హాజరైనా వారంతా వేర్వేరు జవాబులు చెప్తారు. ఇంతలో ఎక్కడి నుండో జో వస్తాడు. తన చేతుల్లో – ఇది మన డాఫోడిల్ – నువ్వు నా హీరో! – అని రాసున్న ప్లకార్డ్ పట్టుకుంటాడు. కాసేపటికి స్టేజ్ మీద లైట్లు ఆరిపోయి ఆ సినిమాలోని పాట మొదలవుతుంది. – ఇక చదవండి.]
రాత్రి బాగా పొద్దుపోయాక, హోటల్ రూమ్ కాలింగ్ బెల్ మ్రోగింది. అంతకు ముందే రిసెప్షన్ వాళ్ళు ఫోన్లో, వచ్చిన వారి గురించి చెప్పి, అనుమతి పొంది పంపారు. వచ్చిన వాడు జో.
తలుపు తెరిచాను.
అలా నిలబడే ఉన్నాడు. నన్ను చూడటం లేదు. ఎటో చూస్తున్నాడు.
“జో..”, మెల్లగా అన్నాను.
ఇంకా ఎటో చూస్తున్నాడు. ఏమై ఉంటుంది?
“జో..”, మరోసారి అన్నాను.
అంతే. అంతలోనే గబుక్కున లోపలికి వచ్చి గట్టిగా వాటేసుకున్నాడు. శబ్దం లేదు. అతి కష్టం మీద శ్వాస నిశ్వాసం గాలి వినిపిస్తోంది.
డోర్ అదే మెల్లగా మూసుకుంటోంది.. మా ఇద్దరి మధ్యన ఎన్నడూ దూరం లేదు. మాకు అనుబంధాలంటే ఏంటో తెలియదు. స్నేహం అంటే ఏమిటో తెలియదు. ప్రేమ గురించి పట్టించుకోలేదు. జో ఏ రోజూ నేను ఏ విషయంలోనూ నొచ్చుకునేటట్లు ప్రవర్తించలేదు. నాకు బాగా గుర్తు, ఒక రోజు మా షెడ్లో ఒకే ఒక బన్ను ముక్క ఉంది. నేను జో కోసం ఉంచేసాను. నేను కాలక్షేపం చెయ్యగలను.. అతను అటూ ఇటూ తిరిగి సగం మూసిన షెడ్ లోకి వచ్చి కూర్చున్నాడు. నేను అప్పుడే నిద్ర లోకి జారిపోయాను. మెలకువ వచ్చి చూసాను. నా బెడ్ (బెంచ్) పక్కన ఓ స్టూల్ మీద ప్లేటులో ఆ బన్ను ముక్క ఉంది. మంచి నీళ్ళ బాటిల్ ఉంది. బయట చీకట్లో గిటార్ వాయించుకుంటున్నాడు.
లేచి బయటకు వెళ్ళాను. ఆపి కళ్ళెగరేసాడు.
“తినవా?” అడిగాను.
గిటార్ ప్రక్కన పెట్టాడు.
“ఏంటి?, నువ్వు తినలేదా?” అడిగాడు.
మా దగ్గరుండే కుక్క ఆ ప్రక్కగా కూర్చుని ఆపసోపాలు పడుతోంది.
జో లోపలికి వెళ్ళి బన్ను ముక్క తెచ్చి గట్టిగా నా చెయ్యి పట్టుకుని, అరచేతిలో పెట్టి, “కమాన్” అన్నాడు.
“సగం చెయ్యి”, అన్నాను.
“నో.. తినేయ్..”
నేను తల అడ్డంగా ఊపాను.
“నా కోసం”, అన్నాడు.
ఇతని పేరు జోవాక్విమ్ – అపారమైన భూతదయతో ఉంటాడు!
“జో..!”, మెల్లగా అన్నాను, “..నీ ఆకలి, నా ఆకలి, వేరేగా ఉండవు. నీకు పెట్టకుండా నేను తిని నిద్రపోలేను.”
లోపలికి వెళ్ళి మంచి నీళ్ళ బాటిల్ తెచ్చి గడగడా తాగాడు.
“నీకు చేతకానిదీ, నాకు చేతనైనదీ ఒకటి ఉంది”, అన్నాడు.
“ఏంటది?”
“నీళ్లు తాగితే కడుపు నిండుతుంది నిజమే. నాకు కిక్ కూడా వస్తుంది. కానీ నువ్వు అలా చెయ్యలేవు. అర్థమైందా?”
నిజమే. నా దగ్గర ఆ కళలు లేవు.
ఆ కుక్క నాలుక బయటపెట్టి అలా చూస్తు ఉంది.
“ఓ పని చేద్దాం!” అన్నాను.
గట్టిగా నవ్వాడు.
“కుక్కకు పెట్టేద్దామా?”
నేనూ నవ్వాను.
“కరెక్ట్! జీవితం, ప్రాణం, తిండి, గుడ్డ, డబ్బు, గోల.. ఈ సాఫిస్టికేషన్ యావత్తూ ఫిలాసఫీ లోకి దింపేసి, దాని ఆకలి తీర్చి హాయిగా పడుకుందాం.”
“అంత డైలాగ్ ఎందుకులే! దానికి పడేయ్! ఓ పని అయిపోతుంది.”
దానికి అర్థమైనట్లుంది. తోక ఆడించుకుంటూ వచ్చి మా దగ్గర నిలబడింది.
దాని మందర పడేసాను, అది దాని వైపు చూడను కూడా చూడలేదు. వెళ్ళిపోయి రిపెయిర్ కాని పాత బైక్ దగ్గరకెళ్ళి కూర్చుంది.
జో నా భుజం తట్టాడు.
“సీ.. అది నాతో వచ్చిన జీవి. దానికి తెలియనిది ఏదీ లేదు. నా మనసు పూర్తిగా దానికి తెలుసు!”
“పోనీ నువ్వెళ్లి దానికి పడెయ్!” అన్నాను.
ఆ ముక్కని చేతిలోకి తీసుకుని అక్కడి దాకా వెళ్లి దాని ముందర పడేసాడు.
అది లేచి నిలబడింది కానీ దానిని ముట్టుకోలేదు. మా ఇద్దరి వైపూ చూసింది. అది గాలి పీలుస్తుంటే దాని కడపు లోపలికి, బయటకీ దాదాపు ఉయ్యాలలా ఊగిపోతోంది. మెల్లగా రోడ్డు మీదకి వెళ్లిపోయి ఏదో వాసన చూసుకుంటూ ఎటో వెళ్లి పోయింది.
“ఎక్కడి నుంచో, ఎందుకో, ఎప్పుడీ ఈ భూమి మీదకి వస్తాం..!” జో అన్నాడు. “..ఈ భూమితో ఏంటి మనకు పని? ఇక్కడున్న వాటికీ, మనకూ ఏంటి అనుబంధం? ఏంటి ఋణం? ఆలోచించు.”
నిజమే! ఆలోచిస్తూనే ఉన్నాను. ఇంతలో ఆ కుక్క తిరిగి వచ్చింది. దాని వెనుక ఒక కుర్రాడు పంక్చరయిన బైక్‌ని అతి కష్టం మీద తోసుకుంటూ వస్తున్నాడు.
ఇద్దరం పరుగున వెళ్లి అతనికి సహాయంగా బైక్‌ని పట్టుకున్నాం. నిజానికి అతను మాకు సహాయంగా వచ్చాడు!
పాపం ఎక్కడి నుండి తోసుకొస్తున్నాడో, బల్ల మీద కూలబడిపోయాడు. బాటిల్ అందించాం. నీళ్ళు తాగాడు. నేను నీళ్ళ మూకుడు బైకు ముందు పెడుతుంటే ఆ కుర్రాడు ఆపాడు.
“కొత్త ట్యూబ్ లేదా?”, అడిగాడు.
“ఉన్నాయి.”
“మార్చేయండి. నా వల్ల కాదు. ఇప్పటికి ఎన్ని పంక్చర్లున్నాయో, ఎన్ని అతుకులేసారో..”
అంతే, అయిదు నిమిషాలలో ట్యూబ్ మార్చేసాం. గాలి నింపాం. అతను జేబు లోంచి ఓ పచ్చ నోటు తీసాదు.
“చిల్లర లేదు”, అన్నాను.
“ఉంచండి”, అని చెప్పి బండి స్టార్ట్ చేసి, “థాంక్స్ బ్రదర్”, అని రయ్‌మని వెళ్ళిపోయాడు.
ఈ లోపలె జో తన బండి స్టార్ట్ చేసాడు. అతని పెదాల మధ్య ఆ నోట్ పెట్టాను.
మా కుక్క మెల్లగా ఆ బన్ ముక్క దగ్గర కూర్చుని అప్పుడు వాసన చూడటం మొదలుపెట్టింది!
..చాలాసేపు అలాగే ఉండిపోయాం. ఏ మాటా లేదు. ఇద్దరికీ ఏం కావాలో తెలియదు. ప్రపంచాన్ని ధిక్కరించి రోడ్డున పడ్డవాడిని నేను. ప్రపంచం ధిక్కరించి రోడ్డు మీదకు గెంటేయబడ్డవాడు జో. మా ఇద్దరికీ తెలియని మరో ప్రపంచం ఎందుకో, ఎక్కడి నుండో తనంతట తానే దొరలుకుంటూ వచ్చి నిలబడింది. జో మనసులో ఏ ఆలోచనలు రగులుతున్నాయో తెలియదు. నా ఆలోచనలు అతనిలోని కళాకారుడిని, స్వేచ్ఛని, ఇచ్ఛాశక్తిని, ఎంతో స్వచ్ఛందంగా ఆస్వాదిస్తున్నాయి. ఇద్దరం ఇద్దరి వీపుల మీద అలవాటుగా చెరో మూడు దెబ్బలు బాదుకున్నాం. ఒక్కసారి వదిలించుకుని మరోసారి తగులుకున్నాం. ఈ లోకం లోకి వచ్చి కళ్ళు తుడుచుకుని సోఫా లోకి వాలిపోయాం.
“ఎలా ఉన్నావు జో?” అడిగాను.
“నీ డాఫోడిల్స్ని కాపాడుకుంటున్నాను.”
“నా డాఫోడిల్సా?”
“నీదే. నీ పేరున ఎప్పుడో మారిపోయింది.”
“నాకెందుకు జో? నువ్వు కదా?”
“నో.. కాలం ఒక చోట ఆగదు. తిరిగి తిరిగి ఒక చోటకే వస్తుంది.”
“అంటే?”
“నువ్వు అన్నీ వదిలి గోవా వచ్చేస్తే?”
పిచ్చి పిచ్చిగా నవ్వాను.
“కరెక్ట్. జో మారడు.”
“మారని వాళ్ళు మృగాలు కాదు. మారని వాళ్ళే మనుషులు!”
ఫ్రిడ్జ్ లోంచి ఓ షాంపెయిన్ బాటిల్ తీసి టీపాయ్ మీద పెట్టాను.
“నువ్వేం చేస్తావు?”, అడిగాను.
“నా షెడ్ అలాగే ఉంది..”, బాటిల్‌ని ముద్దుపెడుతూ అన్నాడు, “..కుక్క లేదు. టూ బాడ్!”
స్నాక్స్ సర్దాను.
“సుఖం అక్కడే ఉంది జో.”
విరగబడి నవ్వాడు.
“సినిమా భాష అలవాటయింది. వద్దు. ఇదంతా మనం అనుకునేదే కానీ నిజం కాదు. ఈ బాటిల్ బాగుందా లేదా? దీనిని పట్టుకుంటానని కలలో కూడా అనుకోలేదు.”
“నో జో! వెండితెర మీద చెప్పేవి నిండు నిజాలే! చెప్పే తీరులో వైవిధ్యం ఉంటుంది. ఒక మామిడి పండును పిండుకుని రసం తాగాలని అనుకోవటం వేరు, మామిడి తోటను పెంచి, అందరికీ దానికి అందించాలని అనుకోవటం వేరు. మనిద్దరం రెండో కోవకు చెందినవారం! మన తోటలు మన తోటే ఉంటాయి!”
జో మాట్లాడలేదంటే ఒప్పుకున్నట్లే!
“ఓ చిన్న ఏర్పాటు చేసాను. కాదనకూడదు.”
“ఏంటది?” అడిగాను.
“మన షెడ్ దగ్గర, దగ్గర కాదు, షెడ్ వెనకాల రేపు రాత్రి డిన్నర్ ఏర్పాటు చేసాను.”
“ఓ ఎవరుంటారు?”
“మన పాత మిత్రులు. షెడ్ దగ్గర కొచ్చేవారు గుర్తున్నారా?”
“పేరుపేరునా గుర్తున్నారు.”
“అందరూ వస్తారు. పేరుపేరునా అందరినీ పిలిచాను. ఇదిగో..” అంటూ ఓ కార్డ్ తీసి ఇచ్చాడు.
‘షెడ్ యువర్ ఫీలింగ్స్’ – అని వ్రాసి ఉంది.
“ఏ ఫీలింగ్స్‌ను వదిలేయమంటావు?”
“నాకనవసరం! మన షెడ్లో అన్నింటనీ వదిలేయవచ్చు. డన్?”
“డన్.”
“యూ ఆర్ గ్రేట్”, అన్నాడు జో, బాటిల్ ఎత్తేస్తూ!
“నో..!”, చెప్పాను, “..ఏ రోజైనా రాజువు నువ్వే.”
“నిజమా? ఎందుకని?”
“నీ సామ్రాజ్యం ఎవరికీ కనిపించనిది, ఎవరికీ అందనిది. అందుకోలేనిది! అందమైనది!”
“అవును. నా మీద ప్రేమతో దానికి ఎన్నడు దూరం కాకూడదనే భావనతో అవకాశం దొరికిన వెంటనే అక్కడికి మనసారా ఆహ్వనిస్తున్నాను!”
బాటిల్ పైకి లేపాడు.
“నా సామ్రాజ్యం.. లవ్లీ! కావచ్చు. కానీ అది నీ మాటలతో మూటలు కట్టుకున్న సామ్రాజ్యం.. మరోసారి వెల్కమ్! ఛీర్స్!”
(ఇంకా ఉంది)

వేదాంతం శ్రీపతిశర్మ కథా రచయిత. నవలా రచయిత. వ్యంగ్య హాస్య రచనలకు పెట్టింది పేరు. “ఆరోగ్య భాగ్యచక్రం” అనే పుస్తకాన్ని వెలువరించారు.